ప్రేమంటే...- గుమ్మడి రవీంద్రనాథ్

    యునైటెడ్ కింగ్‌డమ్...

    కేంబ్రిడ్జి యూనివర్శిటీ...

    మెడికల్ సైన్సుకి సంబంధించిన రీసెర్చ్ విభాగంలో, ఇరవై తొమ్మిదేళ్ళ యువతి అర్థరాత్రి దాటినా తన పరిశోధనలో పూర్తిగా లీనమై ఉంది. ఆమె చుట్టూ వివిధ దేశాల మెడికల్ జర్నల్స్. ఆమెలో ఓ దీక్ష...ఓ పట్టుదల...ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపన. 

    కంటి ఆపరేషన్లలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రొఫెసర్ విల్సన్ అటుగా వస్తూ ఆమెని చూసి,

    "ఏమిటీ... ఇంకా ఇక్కడే ఉన్నావ్? అర్థరాత్రి దాటింది. ఇంటికెళ్ళవా?" అనడిగాడు.

    "వెళ్తాను సర్. ఈ జర్నల్‌లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది చూస్తున్నాను."

    "స్టెమ్‌సెల్సుకి సంబంధించిదేగా?"

    "అవును"

    "మూడేళ్ళుగా దీనిమీద పరిశోధన చేస్తున్నావు. విజన్ రెస్టోరేషన్ మీద నీకు ఎందుకంత ప్రత్యేక ఆసక్తి?"

    ఆ ప్రశ్నకి ఆమె వెంటనే జవాబు చెప్పలేక పోయింది. కొద్ది కషణాల తర్వాత పెదవి విప్పింది.

    "ప్రేమంటే 'ఇవ్వడం' అట. 'తీసుకోవడం' కాదట. ఆ 'ఇవ్వడం'లోని ఆనందాన్ని పొందడం కోసం నేనిది చేస్తున్నాను సర్..."

* * * 

    సీనియర్ ఇంటర్ బైపీసీ క్లాస్ అది. మధ్యాహ్నం పన్నెండున్నరకి లంచ్‌బ్రేక్ బెల్ మోగగానే విద్యార్థినీవిద్యార్థులంతా డైనింగ్‌హాల్‌కి వచ్చారు. దృశ్య సెల్‌ఫోన్‌లో బీప్ శబ్దం వచ్చింది. స్క్రీన్ మీద 'ఒన్ మెసెజ్ రిసీవ్డ్' అని ఉంది. అదేంటో చూసింది. 'ఇ లవ్ యు దృశ్యా -శశాంక్' అని ఉంది. శశాంక్ ఆమె క్లాస్‌మేట్. బాగుంటాడు. తెలివైనవాడు. బాగా చదువుతాడు. క్లాస్‌లో టాప్ ఫైవ్‌లో ఉంటాడెప్పుడూ. ఆ మెసెజ్ చదివి నవ్వుకుంది దృశ్య. లంచ్ చేసి తిరిగి క్లాశ్‌రూం వైపు వస్తుంటే, ఆమె వెనుకగా వచ్చాడు శశాంక్. "దృశ్యా! ఎస్సెమ్మెస్ చూళ్ళేదా?" అడిగాడు ఆతృతతో. చూశాననో,చూళ్ళేదనో స్పష్టంగా చెప్పకుండా, నవ్వి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆ నవ్వుని బట్టి, ఆమె దాన్ని చూసిందని అర్థమైంది అతనికి. లెక్చరర్ వచ్చేలోపు మొబైల్ తీసి ఇంకో మెసేజ్ పంపాడు శశాంక్, 'మరి నువ్వు?'అని.

* * * 

    శశాంక్‌కంటే ముందు నితిన్ కూడా దృశ్యకు ఐ లవ్ యు చెప్పాడు. నితిన్, శశాంకలను పోల్చి చూసుకుంది దృశ్య. నితిన్ కూడా బావుంటాడు. కానీ శశాంక్ కంటే కాదు. ఇద్దరికీ మంచి మార్కులు వస్తాయి. ఇద్దరికీ పల్సర్ బైక్స్ ఉన్నాయి. మిగతా అన్ని విషయాల్లోనూ ఇంచుమించు ఇద్దరూ సమాన స్థాయిలో ఉన్నా, రూపం విషయంలో శశాంకే ప్రథమస్థానంలో ఉంటాడు. ఛాయిస్ ఉన్నప్పుడు, లభ్యమైన వాటిలో ఉత్తమమైనదే ఎన్నుకోవడం దృశ్య స్వభావం. దృశ్యే కాదు, చాలామంది అలాగే ఉంటారేమో. సహ్జంగానే ఆమె మనసు శశాంక్ వైపు మొగ్గుచూపింది. నితిన్‌కి ఏ జవాబూ చెప్పకుండా దాటవేసింది. కానీ శశాంక్‌కి మాత్రం 'నేను కూడా' అని బదులిచ్చింది మొబైల్‌లోనే.

    ఆ జవాబు చూసినప్పటినుండీ శశాంక్‌కి ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత ఆమెను కలిసినప్పుడు చెప్పాడు - "నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా ప్రేమకు నువ్వు 'ఎస్' అంటావో 'నో' అంటావోనని? ఒకవేళ నాకంటే ముందే నువ్వెవర్నైనా ఇష్టపడ్తున్నావేమోనన్న భయం ఓ పక్క. ఆ నితిన్‌కి కూడా నువ్వంటే ఇంట్రెస్ట్ ఉందేమోననిపించింది" అని అతనంటున్నప్పుడు, ఆ చివిరి మాట విని ఉలిక్కిపడింది దృశ్య.

* * * 

    బోటనీ పాఠం దీక్షగా చదువుతున్నాడు శశాంక్. చదివేటప్పుడూ దృశ్య రూపం కళ్ళముందుకొస్తున్నా పాఠాల్ని నిర్లక్ష్యం పాఠాల్ని నిర్లక్ష్యం చేయరాదన్న పట్టుదల ఉందతన్లో. ఏకాగ్రతతో చదువుతుండగా ఉన్నట్టుండి అక్షరాలన్నీ అలుముకుపోయినట్లు కనిపిచాయి. భయం వేసింది. కళ్ళు గట్టిగా నులుముకుని చూశాడు. అంతా మసకమసకగా...

    "మమ్మీ!" గట్టిగా కేక పెట్టాడు. అతని తల్లి అదిరిపడి ఒక్క ఉదుటన పరిగెత్తుకొచ్చింది.

    "ఏమైంది శశాంక్? అళా అరిచావేంటి?"

    "నా..నాకు సరిగ్గా కనిపించడం లేదు మమ్మీ" కళ్ళు నులుముకుంటూ చెప్పాడు శశాంక్.

* * * 

    "మధ్యాహ్నం క్లాసులేం లేవు. సినిమాకి వెళ్దామా" అడిగింది దృశ్య.

    అతను మౌనంగా ఉండిపోయాడు.

    "ఏంటలా ఉంటున్నావు? నన్ను... అవాయిడ్ చేస్తున్నావా?"

    "ఛ...ఛ... అదేం కాదు దృశ్యా."

    "మరి?"

    "వారం రోజులక్రితం బుక్ చదువుతుంటే కాస్త బ్లర్‌డ్‌గా  అనిపినిచి డాక్టరు దగ్గరకు వెళ్ళాం, మమీ నేనూ. గ్లకోమా లాంటిదట. రేర్ డిసీజ్ అని చెప్పాడు డాక్టర్."

    చాలా పెద్ద షాక్ తగిలినట్టు నిర్ఘాంతపోయింది.

    "నా విజన్ పోతోంది దృశ్యా. టీవీలో పిక్చర్ కూడా సరిగా కనిపించడం లేదు."

    "గ్లాసెస్‌తో సరికాదటనా? ఆపరేషన్ చేయవచ్చుగా?"

    "ఇది రిఫ్రాక్షన్ ఎర్రర్ కాదట. గ్లకోమా కూడా కాదు సర్జరీ చేయడానికి. నేను క్రమేపీ గుడ్డివాడినైపోతానేమో కూడా..." అతని కంఠంలో బాధ.

    "శశాంక్!?" నమ్మలేకపోతున్నట్టుగా అంది.

    "నిజం దృశ్యా నాకు నీ డ్రెస్‌మీది డిజైన్ కూడా స్పష్టంగా కనపడట్లేదు" అతని గొంతులో జీర గుండెల్ని పిండేసేలా ఉంది.

* * *

    పుస్తకం ముందు వేసుకుని చదువుతున్న దృశ్య మనసులోకి పాఠం ఎక్కడంలేదు. లోపలంతా గజిబిజి ఆలోచనలు. శశాంక్ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. 'గ్లకోమా కాదు సర్జరీ చేయడఆనికి. నెను క్రమేపీ గుడ్డివాడినైపోతానేమో కూడా...' మనసులో ఓ బాధ మెలితిప్పుతోంది. అతను నిజంగానే గుడ్డివాడైపోతే? అప్పుడెలా? అతనికి ఐ లవ్ యూ చెప్పి పొరపాటు చేసిందా? అతనితో ప్రేమ కొనసాగించగలదా? కొనసాగించకుండా అర్థాంతరంగా తుంచేస్తే అతను బాధపడడూ?  కానీ, అతను బాధపడతాడని తన సంతోషాల్నీ, సరదాల్నీ త్యాగం చేయగలదా? ఏం చేయాలిప్పుడు? ఆమెకు నితిన్ గుర్తొచ్చాడు. ఒక గుడ్డివాడిముందు ఎవరైనా బెటర్ ఛాయిసే అవుతారు. పుస్తకం మూసేసింది దృశ్య.

    ముగ్గురు కంటివైద్యుల బృందం శశాంక్ కళ్ళని పరీక్షించి అతని తల్లిదండ్రులతో చెప్పారు - "వియ్ ఆర్ సారీ". ఆ టీంలోని సీనియర్ డాక్టర్ చెప్పాడు "హీ హేజ్ బికం కం...ప్లీ...ట్లీ బ్లైండ్."

    శశాంక్ తండ్రి విశ్వనాథ్‌లో ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న ఆశ పూర్తిగా పోతోంది.

    శశాంక్‌కి కూడా ఆ మాటలు వినపడుతూనే ఉన్నాయి. "పోనీ విదేశాలకు తీసుకువెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా డాక్టర్?" విశ్వనాథ్ అడిగాడు.

    "మేం అక్కడి ఎక్సుపర్ట్‌తో కూడా మాట్లాడాం. దీనికింకా మెడిసిన్ కనుక్కోలేదెవ్వరూ. లెన్స్ బాగానే ఉంది. ఆప్టిక్ నర్వుకి సమంధించిన సమస్య. ఇప్పుడిప్పుడే దీని గురించి రీసెర్చి జరుగుతోంది. వి ఆర్ టెరిబ్లీ సారీ" ఆఖరిమాటగా చెప్పేశాడు డాక్టర్. శశాంక తల్లి కంటివెంట నీటిధార.

    శశాంక్‌కి దృశ్య గుర్తొస్తోంది. మనోనేత్రానికి అంధత్వం రాలేదు. ఆమె ఆ మనోనేత్రంలో కదలాడుతోంది.

* * *  

    "థాంక్స్" చెప్పాడు నితిన్.

    అర్థమైనా 'ఎందుకు' అన్నట్టు అతనివైపు చూసింది దృశ్య.

    "నువ్వు నాతో స్నేహం చేయడానికి ఒప్పుకున్నందుకు ఇన్నాళ్ళకైనా" అంటూ ఆమెతో కరచాలనం చేయాలని చేయి ముందుకు చాచాడు. ఆమె అతని చేతిలో చేయి వేయలేదు. అతని కళ్ళలో నిరాశ తొంగి చూసింది.

    "నువ్వింత ఆర్థోడాక్స్ అనుకోలేదు" నిష్ఠూరంగా అన్నాడు.

    "టచ్ అవసరం లేని స్నేహం వీలుకాదా?"

    "ఇందులో స్పర్శనే ఎందుకు చూస్తావ్? స్నేహాన్ని చూడొచ్చుగా!"

    "ముందు ఇలాగే షుగర్ కోటెడ్‌గా మాట్లాడతారు మీ బోయ్స్ నాకు తెలుసు."

    "పోనీ క్యాంటీన్‌లో కప్పు కాఫీ?"

    "సరే, పద."

* * *

    "శశాంక్ గురించి మాట్లాడాలని మిమ్మల్ని రమ్మన్నాను" కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పారు, ఛాంబర్‌లో ఆయనకెదురుగా కూర్చుని ఉన్న శశాంక్ తండ్రి విశ్వనాథ్‌తో. తండ్రి పక్కనే శశాంక్ కూడా ఉన్నాడు.

    "చెప్పండి సర్" అన్నాడు విశ్వనాథ్.

    "ఈ బ్లైండ్‌నెస్‌తో శశాంక్ చదువు కొనసాగించగలడా అని నాకు సందేహంగా ఉంది."

    "ఎక్జామ్సుకి ఎవర్నైనా 'స్కైబ్'ని పెట్టుకుని రాస్తాడు. ఎవరైనా గట్టిగా చదివితే రికార్డ్ చేసుకుని రిపీటెడ్‌గా విని గుర్తుపెట్టుకుంటాడు. వాడు చేయగలడు. చదవగలడు ప్రిన్సిపాల్ గారూ" చాలా స్థిరంగా చెప్పాడు విశ్వనాథ్.

    ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారు, బైపిసీ కంటే ఆర్ట్స్ గ్రూప్‌కి మారడం మంచిదని చెప్పి శశాంక్‌ని ఒప్పించారు. తనకిష్టమైన బైపీసీ నుండి ఆర్ట్సుకి మారడం బాధగా అనిపించినా ఒప్పుకున్నాడు శశాంక్.   

* * * 

    "నీతో ఒక విషయం మాట్లాడాలని నిన్నిక్కడకు రమ్మన్నాను దృశ్యా" చెప్పాడు శశాంక్. కాలేజీ లైబ్రరీకి వెనుకవైపుండే మెట్లమీద కూర్చున్నారిద్దరూ.

    "మనం పెళ్ళి చేసుకున్న తర్వాత నా కళ్ళు పోయి వుంటే నన్ను నువ్వు వదిలేయవుగా, అలాగే ఇప్పుడూ అనుకో అంటాననుకుంటున్నావా?" అతడి మాటలు ఆమెను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏమీ మాట్లాడలేదామె. "నువ్వు నన్నింకా ప్రేమిస్తూ ఉండాలని ఆశపడటం దుర్మార్గమవుతుందని నాకనిపిస్తోంది దృశ్యా. కాలేజీ రోజుల్లో యవ్వనంలో ప్రతి ఒక్కరి ఆలోచనలూ ఎలా ఉంటాయో నాకు తెలుసు. సరదాగా తిరుగుతూ, ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం. అది చాలా సహజం కూడా. ఒక గుడ్డివాడ్ని నువ్వు గురికావడం నాకిష్టం లేదు."

    "నీ జీవితం అందమైన కావ్యంలా సాగాలి దృశ్యా. ఏదైనా సరే... 'ఇవ్వడమే' ప్రమట! కోరుకోవడం కాదట. లవ్ నెవర్ క్లెయింస్, ఇట్ ఆల్వేస్ గివ్స్! చూపులేని నేను నీలాంటి అందమైన అమ్మాయి స్నేహాన్నీ, ప్రేమనీ కోరుకోవడంలో స్వార్థం ఉంటుందనిపిస్తోంది. అందుకే ప్లెయిన్‌గా చెప్పేస్తున్నాను. నేను నీకు రైట్‌ఛాయిస్‌ని కాను. కానీ ఎప్పుడైనా ఓసారి నన్ను పలకరించు. ఇబ్బంది లేదనుకుంటే నాలుగు మాటలు మాట్లాడు. ఎంబరాస్‌మెంట్ కాదనుకుంటే ఓ కప్పు కాఫీ కల్సి తాగు. అది చాలు నాకు."

* * * 

    చూపు పోయాక, రెట్టింపు ఏకాగ్రతా... రెట్టింపు సునిశిత దృష్టీ అతని మనోనేత్రానికి అలవడ్డాయి. అతని తండ్రి విశ్వనాథ్ ఎంతో ఓపికతో బిగ్గరగా పాఠాలు చదివి వినిపిస్తుంటే అతను ఆకళింపు చేసుకునేవాడు. తండ్రి చదివిన దానిని రికార్డ్ చేసుకుని మళ్ళీమళ్ళీ వినేవాడు.

    పరీక్షలప్పుడు అతని తరఫున పరీక్షలు రాయడానికి శ్రీలత అనే ఓ అమ్మాయి ముందుకొచ్చింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమకాలు పోయింది నాలుగేళ్ళకిందట. అప్పటినుండీ వికలాంగులకి సాయం చేయాలన్న దృక్పథం ఆమెలో బలంగా నాటుకుంది. శశాంఖ్ ఎక్జాంస్ అన్నీ ఆమే రాసింది.

    క్రమంగా...అతనికో సత్యం బోధపడసాగింది. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగురాదనీ వెలుగుని వెదికేందుకు ప్రయత్నం చేస్తే వెలుతురు కిరణాల్ని ఒడిసిపట్టవచ్చన్న సత్యం అది.

    బీకాం ఫస్టుక్లాస్‌లో పాసయ్యాడు.

    తర్వాత కొద్దిరోజులకే, తండ్రి గుండెపోటుతో మరణించడం ఎంతగానో కుంగదీసింది అతన్ని. ఇంకా చదువుకోవాలనే ఆశని మాత్రం అదేం చేయలేకపోయింది. ఎంబీఏ ప్రైవేటుగా చదవాలని నిశ్చయించుకొన్నాడు. శ్రీలత సహకారంతో ఎంబీఏ కూడా పూర్తిచేశాడు. తర్వాత, విద్యాశాఖలో చిన్న ఉద్యోగం సంపాదించాడు. కానీ ఎందుకో అక్కడ ఇమడలేకపోయాడు. కొన్నాళ్ళు పనిచేసి మానేశాడు. ఒకరిచ్చే జీతం తీసుకుంటూ పనిచేయడం కాకుండా, తనే నలుగురికి ఉపాధి కల్పించే స్థితికోసం 'ఏం చాయాలి' అని తపన... ఆలోచన. చిన్నప్పట్నుంచీ ఇష్టంగా చదివే మిల్టన్ సాహిత్యం గుర్తొచ్చింది. తర్వాత కార్యాచరణ అర్థమైంది.

    అప్పట్నుంచీ యువతకు వ్యక్తిత్వవికాస శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. దాంతో బాటే స్పోకెన్ ఇంగ్లీషులో శిక్షణ కూడా. అలా 'ఎంపవర్' అనే ఒక శిక్షణాసంస్థ మొదలైంది. క్రమంగా అది నగరంలోని ఒక ప్రముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌గా ఎదిగింది. 'టాకింగ్ సాఫ్టువేర్' సాయంతో ఎక్కడ మంచి పుస్తకం దొరికినా వదిలేవాడు కాదు శశాంక్. ఇంగ్లిషులో పుస్తకాన్ని స్కాన్‌చేస్తే, అందులో విషయాన్ని అది బయటకు చ్దువుతుంది. అలా తను అంచెలంచెలుగా ఎదుగుతూనే, అంధులు చదవడానికి వీలుగా భగవద్గీతని బ్రెయిలీలో రాశాడు.  

     ఓరోజు తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఒకావిడ శశాంక్ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చింది.

    "చెప్పండి" అన్నాడు శశాంక్.

    ఆమె తలవంచుకుని చెప్పడం ప్రారంభించింది.

    "చిన్నప్పుడు మా అమ్మ మామిడిపళ్ళు కొని, నాకొకటీ మా తమ్ముడికొకటీ ఇస్తే, ఆ రెండింట్లో ఏది పెద్దదో చూసి నేనది లాక్కుపోయేదాన్ని. అదే మనస్తత్వం పెద్దయ్యాకా పోలేదు. చివరికి ప్రేమించడంలోనూ అదే సూత్రం అవలంబించి, 'మెరుగై'న వాడనుకొని ఒకరితో స్నేహం చేశాను. అతడ్ని పూర్తిగా నమ్మాను. ఇంతకన్నా బెటర్ పర్సన్ అక్కర్లేదనుకునేంతగా ఇష్టపడ్డాను. ఎంబీబీయస్ ఫైనలియర్‌లో ఉండగా తెలిసింది అతని నిజస్వరూపం. నాది 'రాంగ్‌ఛాయిస్' అని గ్రహించాను. తమ్ముడికి పెద్ద మామిడికాయ ఇచ్చి నేనే చిన్నది తీసుకోవడంలోనూ ఓ సంతోషం ఉంటుందనీ క్యూలో నిల్చున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి మన వెనుక ఉన్నవాళ్ళని ముందు పంపించడంలో కూడా ఒక తృప్తి ఉంటుందనీ తెలిసినప్పుడు, ఏదో తప్పు చేశానన్న గిల్టీఫీలింగ్. ఇంటర్‌లో నన్ను నిజాయితీగా ప్రేమించిన వ్యక్తిని ఎందుకు వదులుకున్నానా అని ఓ బాధ నన్నిప్పుడు వేధిస్తోంది..."

    'మీ...పేరేంటి?' అని శశాంక్ అడగలేదు. అతనికి తెలుస్తూనే ఉంది ఆమె దృశ్య అని. ఆమె ఎంతగా గొంతు మార్చినా, ఎన్ని యుగాల తర్వాత విన్నా దాన్నతడు మరువలేడు.

    "తొలిసారిగా నన్ను ప్రేమించినతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నను. మీరేం సలహా చెప్తారు?" ఆమె అడిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను మెల్లగా గొంతు విప్పాడు.

    "ఆ అంధుడ్ని వివాహమాడి మీరేం సుఖపడాలనుకుంటున్నారు జీవితంలో?" సముద్ర కెరటం ఒకటి వేగంగా వచ్చి శరీరాన్ని ఛెళ్ళున కొట్టినట్టు తుళ్ళిపడింది దృశ్య.

    "నేనేం సుఖపడగలనో నాకు తెలుసు శశాంక్. ప్రేమంటే 'ఇవ్వడం' అని చెప్పి ఆరోజు నా నుంచి దూరంగా జరిగిపోయావ్. ఎలాంటి సుఖంకోసమో...ఎలాంటి ఆశలకోసమో కాక నన్ను నేను నీకు 'ఇచ్చుకోవడం' కోసం వచ్చాను. మనం పెళ్ళి చేసుకుందాం ప్లీజ్" అంది దృశ్య, ఓ భావోద్వేగంతో కదిలిపోతూ.

    ఆమె మాటల్లోని భావాల లోతెంతో గమనించడానికా అన్నట్టు క్షణమాగాడు శశాంక్. ఒక సంభ్రమం...ఒక ఆశ్చర్యం...జీవితం ఓ ఊహించని మలుపు తిరుగుతోందన్న ఉద్వేగం. అక్కడెంత మౌనం అంటే, అతని గుండె చప్పుడు ఆమెకి వినిపిస్తోంది. అతని బదులుకోసం ఆమె ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తోంది. తన మాటల్లోని నిజాయితీని అతను గుర్తించాడో లేదోనన్న భయం. ఇంకెలా చెప్తే అతను తన ఫీలింగ్సుని అర్థం చేసుకోగలడో అన్న ఆరాటం. ఆమె ఊపిరి బిగబట్టింది. అతని పెదవులు ఏదో చెప్పడానికి విడివడ్డాయి.

    "దృశ్యా, పెళ్ళికి నా భార్య ఒప్పుకుంటుందో లేదో..."

    ఆ మాట ఒక శరాఘాతంలా ఆమె గుండెని చీల్చింది. "శ్రీలత అని...తనూ వికలాంగురాలే. ఒక కాలు లేదు. నా ఎగ్జామ్సులో స్కైబ్‌గా వచ్చి ఎంతో చక్కగా రాసేది..."

    ఆమె, తన మాటలు పూర్తిగా వినకుండానే, కన్నీళ్ళని అదిమిపెట్టుకుంటూ అక్కడినుండి దిగ్గున లేచి పెళ్ళిపోయిందని శశాంక్‌కి తెలుసు.

    అతని 'రెప్పల్లో వానని' నళ్ళ కళ్ళజోడు అడ్డుకుంటోంది. మరి మనసులో వానని??

* * *

    కేంబ్రిడ్జి యూనివర్శిటీలో, తన గతాన్ని ప్రొఫెసర్ విల్సన్‌కి వివరించడం ముగిస్తూ చెప్పింది దృశ్య -

    "స్టెమ్‌సెల్స్ ద్వారా మాత్రమే శశాంక్‌కి చూపు వస్తుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఈ రీసెర్చ్ ద్వారా శశాంక్‌కి చూపు తిరిగి ఇవ్వగలిగితే, నాకింక ఏమీ అక్కర్లేదు సర్. వచ్చే నెల ఇండియా వెళ్తున్నాను. నా మూడేళ్ళ శ్రమకు ఫలితం దక్కుతుందనే ఆశ నాకుంది."

    అంతా విన్న ఆ ప్రొఫెసర్ సంభ్రమాశ్చర్యాలతో దృశ్యని చూశాడు. "ఇవ్వడం అంటే ఇదా దృశ్యా!? అతనికి చూపునివ్వడమా?? గ్రేట్!! నీ శ్రమ వృథ పోదు. సర్జరీ సమయంలో నా హెల్ప్ అవసరమనుకుంటే చెప్పు...నేనూ ఇండియా వస్తాను". 

    "థాంక్యూ సర్" సంతోషంగా చెప్పింది దృశ్య. 

    నెలరోజులు గడిచాయి. దృశ్య, ప్రొఫెసర్ విల్సన్ ఇండియా వచ్చారు. సర్జరీకి అంతా సిద్ధమయింది. 

    దేవుడి పటం ముందు రెండు నిమిషాలసేపు నిల్చుని ఏకాగ్రతతో ప్రార్థించింది దృశ్య. తర్వాత గ్లోవ్స్ తొడుక్కుని ఆపరేషన్ థియేటర్లో అడుగుపెట్టింది.

 * * *

    మూడు గంటలపాటు జరిగింది ఆ ఆపరేషన్. చాలా సంక్లిష్టమైన ఆపరేషన్. ప్రపంచ ఆప్తాల్మాలజీ చరిత్రలోనే తొలి ప్రయోగం. స్టెమ్‌సెల్సుతో ఓ కొత్త ప్రక్రియకు శ్రీకారం!!

* * *

    ఆపరేషన్ ముగిసిన కొన్ని గంటల తర్వాత -

    శశాంక్ కళ్ళకు కట్టిన బ్యాండేజ్‌ని తొలగిస్తోంది డాక్టర్ దృశ్య. శ్రీలత, ప్రొఫెసర్ విల్సన్, మరికొంత మంది సర్జన్లూ అక్కడ ఉన్నారు. అందరిలోనూ ఉత్కంఠ. ఎంతో అరుదైఅన ఆ చికిత్స ఫలిస్తే వైద్యరంగంలో అదొక సంచలనమవుతుంది. ఎంతో మంది అంధులకు ఊహించని వరమవుతుంది. వారి జీవితాల్లోని చీకట్లను పారదోలే తీయటి వెలుగవుతుంది.

    బ్యాండేజి పూర్తిగా తొలిగించాక "మెల్లగా కళ్ళు తెరిచి చూడండి శశాంక్..." చెప్పింది దృశ్య. ఆమె ఊపిరి బిగబట్టింది. ఆమె పడ్డ శ్రమా ఆమె చేసిన తపస్సూ ఫలించబోయే క్షణాలవి.

    అతను మెల్లగా కనురెప్పల్ని ఎత్తాడు. ఒకరి ఊపిరి శబ్దం మరొకరికి వినపడేంత నిశ్శబ్దం.

    అతన్లో ఓ అనిర్వచనీయమైన ఉద్వేగం.

    గడ్డకట్టుకుపోయిన ఇనుపశిల లాంటి చీకటి తెర కరిగిపోతున్నట్లు...వె..లు..గు..!! ఎన్నేళ్ళకిందటో పోగొట్టుకున్న ఒక అపురూపమైన వస్తువేదో తిరిగిపొందుతున్న ఆనందాన్ని అనుభవిస్తున్న పసిపాపలా అయిపోయింది శశాంక్ మనసు. 

    అతనికి దృశ్య ముఖం అనే ఓ అపూర్వమైన దృశ్యం కనిపించింది మొట్టమొదట. అది కలో లేక భ్రమో అన్నంత సందిగ్ధం.

    "కనిపిస్తుందా శశాంక్?" ఆ గొంతు విన్నాక అది కల కాదని తేలిపోయింది.

    "ప్రేమంటే 'ఇవ్వడం' అని మీరన్న మాటను నమ్మింది తను. మీకు చూపు 'ఇవ్వడం' కోసం మూడేళ్ళపాటు నిద్రాహారాలు లెక్కచేయకుండా పరిశోధనలు జరిపింది డాక్టర్ దృశ్య. ఆపరేషన్ సక్సెస్ మిస్టర్ శశాంక్..." ప్రొఫెసర్ విల్సన్ చెప్పింది అతనికి వినిపించింది.

    కొన్ని క్షణాలు అతని మనసులో ఏవేవో భావాలు...ఆలోచనలు.

    "బై శశాంక్. టేక్ రెస్ట్..." తను సంకల్పించిన పని ముగిసిందన్నట్టుగా చెప్పి అడుగు ముందుకు వేసి వెళ్ళిపోతున్న దృశ్య చేతిని పట్టుకున్నాడు శశాంక్. ఆమె ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి అతడివైపు చూసింది. అతని స్వరం మెల్లగా మృదువుగా వినిపించింది "మనం పెళ్ళి చేసుకుందామా దృశ్యా?"

    అతనన్నది ఒక్క క్షణం అర్థం కాలేదు ఆమెకు.

    "శ్రీలతతో నా పెళ్ళి జరిగిందని నేను చెప్పినట్టుగా నువ్వూ మరో అబద్ధం చెప్పవుగా...?" కనిపించీ కనిపించని సన్నని నవ్వుతో అడిగాడు శశాంక్.

ఉపసంహారం...
   
     'మానస నేత్రాలయం'

    ఒక అత్యాధునిక కంటి ఆసుపత్రి. అంధులైన నిరుపేద వృద్ధులకూ, వితంతువులకూ, కుష్ఠురోగులకూ అంగవైకల్యం లేకపోయినా పేదరికంలో మగ్గేవారికీ ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తారక్కడ. మొత్తం వంద పడకలున్నా, వాటిలో మూడోవంతు దారిద్ర్యరేఖకు దిగువనున్నవారికే కేటాయించి ఉచితంగా సేవలందిస్తారు. ఆ హాస్పిటల్‌కి అనుబంధంగా ఓ ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఆ పాఠశాలలో వికలాంగులకీ, అంధ విద్యార్థులకీ పదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది. అంధులూ, వికలాంగులూ కూడా అందరిలానే జీవించగలరన్న ఆత్మ స్థైర్యాన్ని నింపుతారక్కడ.

    'వసుంధర' అనే పత్రికలో, 'ఆ ఇద్దరూ...అంధులకు రెండు కళ్ళు' అంటూ రాసిన వ్యాసాన్ని చదువుతున్నారు ఆ దంపతులిద్దరూ. చదివాక, "శశాంక్..." అంటూ భర్తను పిలిచింది దృశ్య. 'చెప్పు' అన్నట్టుగా చూశాడు అతను."ప్రేమించడాన్నీ...ప్రేమంటే 'ఇవ్వడం' అన్న భావననీ కేవలం 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం, వారికెంతో కొంత సాయం అందించడంగా మార్చుదాం అన్న నీ ఆలోచనకు కార్యరూపమే ఈ హాస్పిటలూ, ఆశ్రమ పాఠశాలా. ఇది నాకు..." ఆమె మాట పూర్తికాకుండానే, వాళ్ళకూతురు, ఏడేళ్ళ మానస పరుగున వచ్చింది. స్కూల్‌బ్యాగ్‌లోంచి ఓ షీల్డ్ తీసి వాళ్ళకి చూపిస్తూ సంతోషంగా చెప్పింది. 

    "డాడీ, మమ్మీ! నా కిడ్డీబ్యాంక్‌లో డబ్బులన్నీ హెల్పేజ్ ఇండియాకి డొనేట్ చేశానుగా, వాళ్ళు నాకీ గిఫ్ట్ ఇచ్చారు. ఎంత బావుందో కదా!"

    "చాలా బావుంది తల్లీ" అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు శశాంక్. "ఇవ్వడంలోని ఆనందాన్ని పొందడమెలాగో దీనికీ వయసునుండే నేర్పుతున్నావ్. నీకు థాంక్స్ ఎలా చెప్పను దృశ్యా" అన్నాడు భార్యనూ దగ్గరకు తీసుకుంటూ.

(ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధం 11 ఫిబ్రవరి 2007లో ప్రచురితం)  


      
Comments