ప్రియమైన శత్రువు - కోలపల్లి ఈశ్వర్,

నా ప్రియమైన శత్రువుకు,


    ఇలా ఎందుకంటున్నానంటే నామానాన నేను, మా నాయనమ్మ ఒళ్ళో తల పెట్టుకుని మా పెరట్లోని బాదంచెట్టు క్రింద కట్టిన అరుగుమీద- వేయించి ఉప్పూ, కారం చల్లిన జీడిపప్పో, వేరుశనగ పప్పో, నువ్వుల వుండలో, ఉడకబెట్టిన శనక్కాయలో, సున్నుండలో- ఇవేవీ కాకపోతే బుచ్చిరెడ్డిపాలెం నుండి మా మేనత్త సవరాల సుందరమ్మగారు ఫ్రెష్‌గా చేసి పంపిన మురుకులో, చక్రాలో, కజ్జికాయలో, పాలకాయలో తింటూ, కావలి నుండీ వచ్చిన మా అమ్మమ్మ సూరిశెట్టి లక్ష్మీదేవమ్మ గారు మా నాయనమ్మతో మాట్లాడుతూనే నాకు రామాయణమో, పోతన భాగవతమో చెపుతుంటే వింటూ హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను.

    నువ్వెందుకు కనిపించావ్?

    అయినా నీ తప్పు కాదనుకో - నేనే చూశాన్నిన్ను.

    నా మనసుది తప్పు. నా వయసుది తప్పు. నాలో చపలచిత్తంది తప్పు. నాలోని బలహీనతది తప్పు.

    నా మనసు తప్పుదారి పట్టింది. నీతో పాటు వెళ్ళిపోయింది.

    శూన్యమైన మనసుతో నేను పిచ్చిపట్టినట్టు తిరుగుతున్నాను. అన్నం తినటం మానేశాను. నాయనమ్మ ఊసులు లేవు. అమ్మమ్మ క్లాసులు లేవు. పెరటిలోని బాదం చెట్టు లేదు... నాకు ఊహతెలిసినప్పట్నుంచి గంతులేసిన అరుగులేదు... ఏమీ లేదు.

    ఒకచోట వుండలేక, గాలికి తిరుగుతున్నాను. మా వాళ్ళకి అయోమయంగా వుంది. కంగారు పడుతున్నారు. నాకేమయిందో తెలియక బిత్తర పోతున్నారు.

    నేను ఇందాకే చెప్పాగా- నీతప్పుకాదు, నాదే. అందుకే నాకు ఈ పనిష్మెంట్ పడింది. నా తప్పుకి నాకే కదా శిక్ష.

    నిన్ను ప్రేమించటానికే నా మనసు నీతో వెళ్ళిపోయింది.

    ఏం- ఎంచక్కా ప్రేమించొచ్చు కదా! పెళ్ళి చేసుకోవచ్చు కదా... హాయిగా కాపురం చేసుకోవచ్చు కదా... పిల్లా పాపలతో లక్షణంగా ఉండొచ్చు కదా- అని కదా నువ్వంటావ్!

    నీకో విషయం చెప్పాలిప్పుడు.

    నా జీవిత ధ్యేయం వేరే వుంది. ప్రస్తుతం నా వయస్సు, మనస్సు కొంచెం చపలత్వం చూపించాయనుకో... అంత మాత్రం చేత నా జీవిత పరమార్థం మారదు. మారనే మారదు.

    ఆ పరమావధి ఏమిటో నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన శత్రువ్వి కాబట్టి.

    అనాథ శరణాలయం పెట్టాలి. ఉత్తమ భావిభారతపౌరులను తీర్చిదిద్దాలి. వంద ఎకరాల్లో చెట్లు నాటాలి. సహజరీతిలో అడవిని పెంచాలి. అనేకానేక పక్షులకు ఆశ్రయం కలగాలి. అందులో వృద్ధాశ్రమం పెట్టాలి. అందులోనే వారికి వైద్యం అందాలి. తమని తాము ఆనందంగా ఉంచుకుంటూ, తోటివారికి సంతోషాన్ని పంచి పెట్టగల ఆత్మస్థయిర్యాన్ని వారికి కలిగించాలి. ఉచిత కళ్యాణ మంటపం కట్టించాలి. బీదాబిక్కీ లక్షణంగా, నయాపైసా ఖర్చులేకుండా పెళ్ళిళ్ళు చేసుకునే ఏర్పాటు చెయ్యాలి. ఇంకా చాలా చెయ్యాలి... ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నాతోటివారి సహకారంతో చెయ్యాలి.

    వీటికి పెళ్ళి అడ్డంకి... ప్రతిబంధకం... ఉచ్చు... అది నా దృఢమైన నమ్మకం. వాస్తవం కూడా. అందుకే నేను ఆజన్మ బ్రహ్మచారిగానే వుండిపోవాలని భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఆ ప్రతిజ్ఞని అనుసరిస్తాను. ఆచరిస్తాను.

    పైవన్నీ నెరవేర్చాలనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా నువ్ కనిపించావ్... నన్ను కదిలించావ్... మెలిపెట్టావ్.

    అయినా సరే... నేను నిన్ను ప్రేమించను. పెళ్ళి మాట అస్సలు తలపెట్టను. నా కర్తవ్యం, నా బాధ్యత నాకు ముఖ్యం.

    నా జీవితాశయం కోసం నేను అహరహం కృషిచేస్తాను. సాధిస్తాను. కౄషి వుంటే మనుషులు ఋషులవుతారు - అన్న ఆర్యోక్తిని నిజం చేస్తాను. నిరూపిస్తాను.

    నీకు ఒక్క మాట- నీ దగ్గరకు చేరిన నా మనస్సుని తిప్పి పంపినా సరే- నీ దగ్గరే వుంచుకున్నా సరే- నాకెలాంటి అభ్యంతరమూ లేదు.

    పంపావనుకో- మరింత మంచి మనసుతో- మరిన్ని మంచి పనులు చేస్తాను... నిన్ను ప్రియమైన మనిషిగా, మిత్రురాలిగా భావిస్తాను. పంపలేదనుకో- ప్రియమైన శత్రువుగా పరిగణిస్తాను. అంతమాత్రాన వీగిపోతాననుకోకు... నా జీవిత ధ్యేయం, నా లక్ష్య సాధన మాత్రం నిర్విఘ్నంగా నెరవేరుస్తాను. నా ఆత్మబలం నన్ను ముందుకు... ఇంకా ముందుకు నడిపిస్తుంది... పరిగెత్తిస్తుంది.

    నాకా ఆత్మస్థయిర్యం పుష్కలంగా వుంది. ఉంటాను.

                                                                                భగీరథ్
Comments