పుడమి-పోడిమి - శ్రీవిరించి (ఎన్.సి.రామానుజాచారి)

    
లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు రకరకాల మనుషులతో ముఖపరిచయం ఏర్పడటం సహజమే. అలా పరిచయం అయినవాళ్ళందరితోను పలుకరింపులు ప్రారంభించి పెంచుకోవడం మటుకు సాధారణంగా జరిగే పని కాదు. కాత్యాయనికి ఇటువంటి సందర్భం ఇప్పుడు జరగడం కేవలం యాదృచ్చికం.
 
    దాదాపు ఆరు నెలల నుంచి చూస్తోంది అతన్ని. ఎప్పుడూ మతం, తత్వశాశ్త్రాలు ఉన్న విభాగంలో ఎక్కువగా తచ్చాడుతూ ఉంటాడు. రెండు మూడు పుస్తకాలు ముందేసుకుని లైబ్రరీ కట్టివేసే సమయం వరకు అక్కడే గడిపేస్తాడు. కాని ఈ  రోజు అతను రావడమే నేరుగా కథాసాహిత్యం వైపు వెళ్ళడం కాత్యాయనికి కాస్త విడ్డూరంగా అనిపించింది. లైబ్రరీకి వచ్చేవాళ్ళు ఎప్పుడూ ఒకే భాగానికి అంటిపెట్టుకుని ఉండాలని నియమం లేదు. లేకపోతే ఇటువంటి చదువరులు ఉండడం దాదాపు అసాధ్యం, ఆమె అనుభవంలో.
 
    నవల, కథలు లాంటి కల్పన సాహిత్యం సాధారణ పాఠకులను ఆకర్షిస్తే చరిత్ర, మతం, తత్వశాస్త్రం లాంటివి ఎక్కువగా 'సీరియస్ రీడర్స్'ను మట్టుకే దగ్గరకు చేర్చుకుంటాయి. పుస్తకాలు చదవడం ఆషామాషీగా తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. వాళ్ళు తరచు కథాసాహిత్యం వేపే నడుస్తారు.
 
    అతను లైబ్రరీలోనికి రావటంతోటే కళ్ళతో నాలుగు మూలలా వెదుకుతాడు. ఎందుకోసమో కాత్యాయనికి తెలియదు, ఊహకు అందదు. ఆ వెదుకులాట తన కోసరమే అని తెలుసుకోవటానికి ఆరు నెలలు పట్టింది. ఇద్దరి కళ్ళు కలుసుకోవడం ఇప్పటికి చాలాసార్లు జరిగింది అనటానికి వీలులేదు. కాత్యాయని కూడా ఈ రోజే ప్రత్యేకంగా అతన్ని గురించి ఆలోచించటానికి కారణం - అతను కథాసాహిత్యం వైపు అడుగులు వేయడమే.

    ఆమె తన ఉత్సుకతను ఆపుకోలేకపోయింది. అతను పుస్తకాలు వెదుకుతూన్న బీరువాల వైపు నడిచింది. ఎదురు వరుసలో బీరువాల పైగా అతని తల కనిపిస్తోంది. కాత్యాయని చేసిన చప్పుళ్ళకు అతను ఆమెను గమనించక తప్పలేదు. పెదవులు విశాలం చేసి నవ్వుతున్నట్లుగా ఆమె వంక చూశాడు. ఆమె చిరునవ్వు చిందించి స్పందించింది.

    అతను పుస్తకాలు తీసుకుని ఒక టేబుల్ దగ్గర స్థిరపడ్డాడు. కాత్యాయని ఏదో పని ఉన్నట్టు అటువైపు వెళ్ళింది.
 
    'నమస్కారం. నా పేరు కమలనాథం' అన్నాడు అతను.
 
    తెలుసు - అన్నట్టుగ తల ఆడించింది ఆమె.
 
    లైబ్రరీ గుమ్మం దగ్గరే ఉన్న పుస్తకంలో వచ్చే వాళ్ళంతా ముందుగా పేర్లు నమోదు చేసుకుని మరీ ముందుకు రావాలి. అయినా ఆ పుస్తకంలో పేర్లన్నీ కాత్యాయని పరిశీలిస్తుందని అతను ఆశించలేదు. ఊహించలేదు.
 
    'మీ పేరు కాత్యాయని కదూ?' అన్నాడు అతను తరువాత.
    
    తన పేరు అతనికి తెలియవలసిన అవసరం లేదు. అందుకనే ముందు కాస్త ఆశ్చర్యపోయినట్లు ముఖం పెట్టింది కాత్యాయని, తనకు తెలియకుండానే.

    'మీ లైబ్రేరియన్ మిమ్మల్ని పిలవడం నాలుగయిదు మార్లు విన్నాను. అంతకంటే మిమ్మల్ని గురించి నాకు మరేమీ తెలియదు' అన్నాడు కమలనాథం దొరికిపోయిన దొంగలాగ.

    కాత్యాయని నవ్వి ఊరుకుంది.
 
    ఆర్నెల్లనుంచి తనంటే ప్రత్యేక గమనం ఇవ్వని ఈమె, ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చిందో తెలుసుకుతీరక తప్పదనిపించింది అతనికి. అడిగాడు. సమాధానం విన్నాక సంతోషించాడు కూడా.
 
    'కాల్పనిక సాహిత్యం అంటే చాలా మందికి ఉపేక్ష... నిజమే' అన్నాడు.
 
    'అయినా తత్వశాస్త్రం తాలూకు పుస్తకాలు చదివే వాళ్ళు అకస్మాత్తుగా కథల పుస్తకాల వైపు కదిలి వస్తే భూమి బద్దలయిపోతుంది. ఆకాశం ఉరుములతో ఉర్రూతలూగుతూ భూమిని, దేశాన్ని గజగజలాడిస్తుంది. అందుకూ నేను భయపడుతున్నది!' అన్నది కాత్యాయని కొద్దిగ నవ్వే ప్రయత్నం చేస్తూ.
 
    'తత్వవేత్తలు డిటెక్టివ్ పుస్తకాలు చదువుతారు, మీరు ఎరుగుదురో లేదో గాని' అన్నాడు అతను.
 
    'ఊహూ.ఎరగను'
 
    'చూడండి. చదవడంలో సీరియస్‌నెస్, కాజువల్ నేచర్ అనే విభాగం తప్పనిసరిగా ఉంటుంది. కాని మీరు గమనించవలసింది ఏమంటే, కాల్పనిక సాహిత్యాన్ని కూడా అంతే సీరియస్‌గా చదవటానికి అవకాశం ఉన్నదని! ఇప్పుడు చదివి రెండో క్షణంలో మరచిపోవలసింది కాదు. సృజనాత్మక సాహిత్యం అది...' అన్నాడు.
 
    అతని ఉపన్యాస ధోరణి ఆమెకు కాస్త తమాషాగానే అనిపించింది. ఆమెను ఎక్కువ భయపెట్టటం ఇష్టం లేనట్టుగా అతను అక్కడితో ఆపేశాడు ఆ ప్రసక్తి.
   
     'రోజూ లైబ్రరీకి వస్తారు. దాదాపు సమయమంతా ఇక్కడే గడిపేస్తారు. మీకు ఇంకేం వ్యాపకం లేదా? వేరే ఉద్యోగం లేదా?' అనడిగింది కాత్యాయని. 
 
    అతని ముఖంలో అంతవరకూ ఉన్న నవ్వు మాయమయింది. గాంభీర్యం అలుముకుంది. కథలలోంచి మళ్ళీ తత్వశాస్త్రం లోకి వెళ్ళిపోయాడు ఇతను - అనుకుంది ఆమె.
 
    'ఆరు నెలలు అయింది ఉద్యోగం పోయి. కొత్త ఉద్యోగం ఇంకా దొరకలేదు. అందాకా ఊరికే ఎందుకని లైబ్రరీకి వచ్చి నా మనసుకు నచ్చిన పుస్తకాలు తిరగేస్తున్నాను' అన్నాడు అతను.
 
    అతనికి ఉద్యోగం పోయిందని తెలిసి చింతించింది కాత్యాయని. ఈ కొత్త సమాచారం ఆమెకు ఖేద కారణం అయింది. 'అయాం సారీ' అంది క్లుప్తంగా. 
 
    'మరేం ఫరవాలేదులెండి. పస్తులు పడుకోనక్కర్లేదు.'
 
    కాత్యాయని ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేకుండానే అతను చెప్పాడు. అతనికి పెళ్ళి అయిందట. భార్యకు ఉద్యోగం ఉంది. ఆమె పగలంతా ఎలాగూ ఇంట్లో ఉండదు గనౌక, అతను లైబ్రరీకి వచ్చి చదువుకోగలుగుతున్నాడు. లైబ్రరీ మూశాక అతను ఇంటికి చేరిన అరగంటకు గాని ఆమె రాదట!
 
    'మిమ్మల్ని ఆరు నెలల నుంచి చూస్తూనే ఉన్నాను. నేను లైబ్రరీకి రావటానికి ఓ ప్రత్యేక ఆకర్షణ మీరు కూడాను... మీరేం అపార్థం చేసుకోకండి' అన్నాడు కమలనాథం. 
 
    కాత్యాయని ముఖంలో అతను అనుకున్నంత ఆహ్లాదం కానీ, ఆశ్చర్యంగానీ కనిపించలేదు. 'మీరు చాలాకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారనుకుంటాను' అన్నాడు.
 
    చాలా కాలం అంటే? - వంద సంవత్సరాలా, వేయి సంవత్సరాలా? తన వయస్సంతా కలిపితే పాతిక సంవత్సరాలు లేదే - అని కాత్యాయని ముందు మనసులో గుంజాటన పడినా పైకి మాత్రం 'నేను ఇక్కడ చేరి తొమ్మిది నెలలు అయింది - అంతే' అంది.
 
    'అంతేనా?' అన్నాడు కమలనాథం చాలా నిరాశపడిపోయినట్లు.
 
* * *
 
    'చాల సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడినై గడిపాను. ఇంద్రియ నిగ్రహం పాటించాను. ఒంటి పూట భోజనం' - అన్నాడు అతను, మూర్తి ఇంకో అరగంటలో ప్రయాణం చేయవలసి ఉండగా వచ్చి.
 
    వచ్చిన మనిషిని కాదనటం ఇష్టం లేక మూర్తి అతన్ని కలుసుకు మాట్లాడడానికి అంగీకరించాడు. మూర్తి ముఖకళవళికలలో ఎలాంటి మార్పు వస్తుందో చూడడానికి అన్నట్లుగా ఆగిపోయాడు, ఆ వచ్చిన మనిషి. రెండు నిముషాల మౌనం తరువాత తానే ప్రారంభించాడు మళ్ళీ. 'అంతకు ముందు సంఘసేవ చేస్తూ ఉండేవాడిని. ప్రజలను ఉద్ధరించటం! కాని - ఏం లాభం? ఒక సమస్య ఇట్లా తీరిపోయింది అనుకుంటే ఆ పునాదిలోనే మరో పది సమస్యలు పుట్టుకు వచ్చేవి. విసుగు పుట్టి మానివేశాను. తప్పు చేశానంటారా!' అనడిగాడు.
 
    మూర్తి ఇప్పటికీ ఏమీ మాట్లాడలేదు.
 
    'చెప్పండి' అని మళ్లీ అడిగాడు అతను.
 
    'మీకేం అనిపిస్తోంది?' అని ఎదురు ప్రశ్న వేశాడు మూర్తి.
 
    'తప్పు చేశానని అనిపించడం లేదు' అన్నాడు అతను అతి గంభీరంగా.
 
    'అయితే ఇంత సందేహం ఎందుకు? కానివ్వండి'
 
    అతని ముఖంలో వికాసం. 'నేనూ అలాగే అనుకున్నాను సుమండీ! అయినా పెద్దవాలు, మీ అభిప్రాయం తెలుసుకోవడం అవసరం అనిపించింది. మీరు నాతో ఏకీభవించారు. చాలా సంతోషం' - అన్నాడు ఎంతో సంతృప్తిగా.
 
    నేను ఏకీభవించడమో, కాదనడమో కాదు ముఖ్యం. నేను ఏం అనుకుంటే మేకేం? ఇతరులను మెప్పించడం కోసం, ఇతరుల ఆమోదం కోసం ఎందుకు అర్రులు చాస్తారు? స్వంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలలో మీకెందుకు విశ్వాసం ఉండదు!' - ఈ మారు కాస్త తీక్షణంగానే ఉంది మూర్తి గొంతు.
 
    అవతలి మనిషి కాస్త జంకాడు. ఈ సమావేశం బెడిసి కొట్టదు గదా - అని భయపడ్డాడు.
 
    'ధ్యానం అంటే మనిషి ఆలోచనలో పూర్తిగా మార్పు రావడం. కార్యక్రమశీలత మారిపోవడం - అని మీరు లోగడ ఎప్పుడో చెప్పారు. నాకు ఆ మాటలు ఎంతో నచ్చాయి. అప్పటి నుంచి అలాగే మార్చుకుంటూ వస్తున్నాను నా జీవిత సరళి' అన్నాడు ధైర్యం చేసి.
 
    సమయం అవుతోంది; మనం ఇంక బయలుదేరవలసి ఉంటుంది - అని ఎవరో వెనుకనుంచి హెచ్చరిక చేశారు మూర్తిని. 
 
    బయట నుంచి ఆకుల చప్పుడు దడదడ వినిపించింది.  పావురాల కిలకిల ధ్వనులు వినిపిస్తున్నాయి. అవి
అటు ఇటు ఎంతో పని ఉన్నట్లుగా పరుగులు తీస్తున్నాయి.
 
    చిన్న రైలు పెట్టెలో ప్రయాణం.
 
    ఇది ప్రతి చిన్న చితక స్టేషన్లోనూ ఆగుతుంది.
 
    కాఫీ, టీ, జంతికలు, బిస్కట్టులు అమ్మేవాళ్ళ కేకలు, హడావిడి ఎక్కువ. విశ్రాంతి తక్కువ. నిద్రకు అసలే ఆస్కారం లేదు. 
 
    రైలు ఆగిన మీదట ప్రయాణీకులు అందరూ కిందకు దిగిపోయారు. 
 
    సముద్రంలో ఓ పడవ.
 
    దానిలో ఎక్కితే తిన్నగా ఒక ద్వీపం దగ్గరకు తీసుకుపోతోంది.
 
    మళ్లీ నగరానికి మరో చిన్న రైలుబండి. వాతావరణం అతి ప్రశాంతంగా ఉంది. సముద్రం దాటి నేల మీద వెడుతున్న కొద్దీ దట్టమైన వృక్ష సంపద. మరో కొత్త ప్రపంచంలోకి కదలి వెళుతున్నట్లు ఉంది. దారి పొడుగునా ఉన్న గాంభీర్యం మళ్ళీ నగరంలో అడుగు పెట్టినప్పుడు అనిపించడం లేదు. ఇదీ అన్ని నగరాల వంటిదే. 
తొక్కిసలాట - ఉరుకులు - పరుగులుల్. బీదరికం - మురికి - ధనాపేక్ష. ఇవన్నీ ఈ నగరవీధులలో ప్రస్ఫుప్టం అవుతూనే ఉన్నాయి. వాళ్ళు చేరుకున్న ఇల్లు నగరానికి కొద్ది దూరంలోనే ఉంది. మిట్ట మీద బంగళా. విశాలమైన ఆవరణ. ఉద్యాన వనం మెట్ల వరుస ఎక్కి పైకి వెళ్ళగానే ఎవరో ముందుకు వచ్చి 'పూలగుత్తి' అందించారు. అదేమిటో తెలియకుండానే అందుకున్నాడు మూర్తి. ఆ మనిషి కాళ్ళ మీద పడి నమస్కారం చేయబోయాడు. 'వద్దు. వద్దు' అని మూర్తి అతన్ని వారించాడు.
 
     'తమరు పెద్దలు. తమ పాదాలు తాకితే, ఆ ధూళి నా శిరస్సు మీద ఒక్క కణం అయినా రాలితే నా పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి. నా పూర్వులు ఏడుతరాల వాళ్ళు తరిస్తారు' అన్నాడు ఆ మనిషి, అమిత ఉద్వేగంగా. 
 
    'ఎవరు చెప్పారు అలాగని?' అడిగాడు మూర్తి అమాయకంగా.
 
    'శాస్త్రాలు ఘోషిస్తున్నాయి!'
 
    'ఒద్దు. అది అమానుషం. నేనూ మీలాంటి మనిషినే. ఒక మనిషి మరో మనిషి పాదాల మీద సాగిలపడటం గౌరవప్రదం అయిన పని కాదు. అలా చేయకండి' అని వారించాడు మూర్తి.
 
    'పెద్దలు కనిపించినప్పుడు సాష్టాంగ దండప్రణామం చేయకపోతే మా పాపాలు ఎలా పోతాయి?' బిక్క మొగంతో అడిగాడు ఆ ఆసామి.
 
    'మీరు పాపాలు చేస్తున్నారా? మీకు తెలుసా? తెలిస్తే ఎందుకు చేస్తున్నారు?'
 
    అతను ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. అసంతృప్తి మాత్రం అతని ముఖం నిండా పులుముకుపోయింది. 
 
    'ఆలోచించండి. మీకే తెలుస్తుంది. మీ పనుల ఫలితాలు ఇతరులకు బదిలీ చేయాలని చూడకండి' అని మూర్తి చరచర గదిలోనికి వెళ్ళిపోయాడు.
 
    స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక ఆమె వచ్చింది. చిక్కి శల్యమై పోయింది. ముఖంలో ఎక్కడా జీవకళ లేదు. ఊదారంగు కలనేత చీర. నలభై ఏళ్ళ మనిషి. బాగా చదువుకున్నట్టే ఉంది.
 
    'ఎందుకు జరగాలి ఇట్లా? వాడి బతుకు ఎందుకు తెల్లవారి పోయింది? నాకెందుకు ఈ పుత్రశోకం?' అంటూ మొదలు పెట్టింది ఆమె.
 
    మూర్తి ఆమె వంక నిదానంగా చూచాడు. ముఖంలో ఎలాంటి ఉత్సాహము, ఆదుర్దా కనిపింపచేయడం లేదు అతను. ఆమె చెప్పుకుపోతోంది.   
 

     'ఒక్కడే కొడుకు. బాగా చదివించాం. వాడి చదువు కోసం ఎంత ఖర్చు చేశామో లెక్కలేదు. ఇట్లా ఎందుకు అయిందంటారు? మేం ఏమయిపోవాలని భగవంతుడి ఉద్దేశ్యం. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు. ఈ కష్టం మాకే రావాలా? అందులో నేనే దొరికానా భగవంతుడికి? ఆట పట్టించటానికి!' అని చెప్పుకుపోతూంది.
 
    మూర్తి చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతోంది.
 
    'నాకు దుఃఖం ఉబికి ఉబికి వస్తోంది. ఎంతకూ ఆగదు. ఎంత ఊరడించుకుందామనుకున్నా అవదు. దీనికి పరిష్కారం ఏమిటో చెప్పండి.'

    'దేనికి పరిష్కారం' మూర్తి తాపీగా అడిగాడు ప్రశ్న వేస్తున్నట్లు కాకుండా, అనుస్పందిస్తున్నట్లు.

    'నా పుత్రశోకానికి' అని ఆమె బదులు చెప్పింది ఇంకా వెక్కుతూనే.
 
    'పిల్లల్ని ఎందుకు చదివిస్తాం? యంత్రాల్లా తయారు చేసి జనాన్ని చంపమని యుద్ధానికి పంపటానికా? ఎంత మంది చనిపోతున్నారు యుద్ధంలో. వాళ్ళందరి దుఃఖం మీకు వినిపించటం లేదా? యుద్ధాలకు, వ్యాధులకు గురిచేయటానికా పిల్లల్ని కంటున్నదీ, పెంచుతున్నదీని? కాస్త ఆలోచించండి' అన్నాడు మూర్తి.
 
    'అదే! అదే! నేను అడుగుతున్నదీ అదే!' అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది.
 
    మూర్తి ఏమీ బదులు చెప్పలేదు. ఆమెనే చెప్పనిచ్చాడు.
 
    'ఎంత గారాబంగా పెంచుకున్నాం. కొండ మీది కోతి కావాలంటే తెచ్చి ఇచ్చాం. మా ప్రీతి, మా అనురాగం అంతా సముద్రం పాలయింది. ఆయన ఉద్యోగం మానేసి సన్యాసం తీసుకుంటానంటున్నారు. నా బతుకు... నేను... ఏమయిపోవాలి!' భవిష్యత్తు గురించిన భయాలన్నీ ఏకరువు పెడుతూ ఏడుస్తోంది ఆమె.
 
    ఆమె ఎందుకు విచారిస్తుందో మూర్తి ఒక్క క్షణం తనలో తనే తర్కించుకున్నాడు. తనకోసమా? పోయిన కొడుకు కోసమా? సన్యాసి అవబోతున్న భర్త కోసమా?... లేక అందరి కోసమూనా? జీవితం తను గీసిన గీతల్లో ఇమిడిపోవాలనీ, అలా ఇమడడమే విధాయకం అనీ ఆమెకు అంత విశ్వాసం ఎలా ఏర్పడింది!
 
    'యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు? హింసను, దౌర్జన్యాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈ దుఃఖం వస్తుందని తెలియదా? ఎన్ని లక్షల మంది! ఇదంతా ఇప్పుడే కొత్తగా తెలిసి వస్తోందా? ఎవరు అడ్డగిస్తున్నారు మిమ్మల్ని?... హాయిగా ప్రశాంతంగా ఉండనీయకుండా...' మూర్తి కంఠం గంభీరంగా ధ్వనిస్తోంది.
 
    ఆమె నివ్వెరపోయింది.
   
     'నాకేం తెలుసు? నాకేం తెలుసునని?' - ఏదో చెప్పాలని ఆవేదన. ఆమె ఏం చెప్పాలో, ఏం చెప్పాలనుకుంటుందో ఆమెకీ స్పష్టంగా తెలియదు.
 
    యుద్ధం దేశాల మధ్య జరుగుతోంది. లక్షలాది మంది జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుటుంబాలు... ఆస్తులు... నాశనం  అయిపోతున్నాయి. అయినా దీనికంతా బాధ్యత నాదేనా? నేనేం చేయగలదు... ఆమె మనసు మౌనంగా మూలుగుతోంది.
 
    'ఈ ప్రపంచంలో గందరగోళం... అశాంతి... అసమాధానం... ఇవన్నీ సృష్టిస్తుంది ఎవరు? మనం కదూ? ఫలితం ఇలా ఉంటుందని తెలిసి కూడా మానలేక పోతున్నామె! ఈ విధ్వంశం ప్రశ్నలు మనవే. జవాబులూ మనవే' అర్థ స్వగతంలా అన్నాడు మూర్తి.
 
    గొంతు తడి ఆర్చుకుపోయింది. మింగలేని దుఃఖం మింగుడు పడిపోయింది.
 
    ఆమె మనోనేత్రం ముందు మహాసాగరం ప్రవహిస్తోంది.భూమి అంతా నీళ్ళతో నిండిపోయింది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ఆ వేగం, ఆ శబ్దం, ఆ తాకికిడి, ఆ చీకటి... నేల నుండీ ఆకాశం దాకా ఎగబాకుతోందనిపిస్తోంది.
 
    ఇప్పుడు దుఃఖించడానికి ఓపిక లేదు.
 
    దుఃఖంలో అర్థం కనిపించటంలేదు.
 
    ఒక మూలకు ఒదిగిపోయి కూర్చుంది ఆమె. అలా ఒంటరిగా కూర్చుండి పోయింది.
 
* * *
 
    ఆమె వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందనీ, తల్లీ తండ్రీ లేరనీ, ఉన్న ఒక్క అక్కగారూ ఈ ఊళ్ళోనే మరోచోట మొగుడితో హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నదనీ, వాళ్ళకో పిల్లవాడు కూడా ఉన్నాడనీ తెలుసుకున్నాడు కమలనాథం.
 
    'మీరు ఒక్కరూ హాస్టల్లో ఉండడం ఎందుకు? అక్కగారితోనే ఉండవచ్చును గదా!' అన్నాడు ఆమె స్వవిషయంలో జోక్యం కలిగించుకుంటున్నానని స్పష్టంగా తెలిసి కూడా.
 
    'పానకంలో పుడకలాగ ఉండడం నాకు ఇష్టం లేదు. అదీగాక నా 'ప్రెయివసీ' నాకు ఉండాలి' అంది ఆమె ధైర్యంగా.
 
    కాత్యాయని మనసులో మెదిలింది - బావగారు మూడు రోజులకు ఒక మారయినా టెలిఫోన్లో చెప్పే మాటల సారం. 'నీకు ఎవరూ లేరనుకోకు. ఒంటరితనం ఫీలవకు. మీ అక్క నేను ఎప్పుడూ నిన్ను గురించే ఆలోచిస్తూ ఉంటాం.'
 
    ఆ మాటలు విన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కాని వాటిలో విశ్వాసం కుదరడం కష్టం అయిపోతుంది కాత్యాయనికి.
 
    ఈ రోజుల్లో ఎవరికి ఎవరు? ఎవరి తాపత్రయాలు వాళ్ళవి. ఎవరి ఆర్థిక వ్యవహారాలు వాళ్ళవి. ఆత్మీయతలు, మమకారాలు... పుస్తకాలలో మాటలు అయిపోయినాయి తప్ప జీవితంలో వాటికి ఎక్కువ అవకాశం లేదు, అవసరమూ లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అందరూ. ఎవరిని చూచినా అంటీముట్టనట్ట్లుగా ఉండడమే తప్ప మనసు విప్పి మాట్లాడడం... బాధ్యతతో కలిసి పోవడం కుదరదు.
 
    'ఏమిటో ఆలోచనల్లో పడిపోయారు. పోనీలెండి ఆరునెలలకయినా మీకు నాతో మాట్లాడదామనిపించింది. చాలా థాంక్స్' అన్నాడు కమలనాథం.
 
    కాత్యాయని అతనికి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. మనుషులతో ఏం పని లేకపోయినా మాట్లాడడం ఆమె ఇంతవరకు చేయలేదు. మనుషులను ఏదో వస్తువులలాగా చూడడం తప్పు అని తెలుసు. అంతమాత్రం చేత అందరితో ఆప్యాయంగా ఉండలేం కదా! కొత్త అనర్థాలు కొనితెచ్చుకోవడం ఎందుకు?
 
    ఈ లైబ్రరీలో పనికి అంకితం అయిపోతున్నట్లు పనిచేస్తున్న కాత్యాయని, కమలనాథం పలకరింపులు ఎంతో ఆప్యాయత కనిపించినా దాన్ని ఎందుకనో పొడిగించలేకపోయింది. కమలనాథం పెద్దవాడు. నిరుద్యోగి. ఉద్యోగిని అయిన భార్య ఉన్న వాడు. బావగారు తన కోసం వరుళ్ళను వెదుకుతూ ఉండడం... ఎప్పటికప్పుడు ఏదో సమాధానం ఫోన్ ద్వారా చెవిని వేస్తుండడం గుర్తుకు వచ్చి నవ్వుకుంది.
 
* * *
 
    మూర్తి తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చున్న చోటనే ఉండీపోయాడు. ఆమె ఎప్పుడూ వెళ్ళిపోయిందో తెలియదు. ఏమిటో జీవిత గమనం! మనుషులు వస్తారు. తమ మనసులు ఇక్కడ గుమ్మరించి పోతారు. ఇదంతా తనతో చెప్పుకుంటే వాళ్ళ దుగ్ధలు తీరిపోతాయి. వాటిని పరిష్కారాలు తాను చూసి పెడతానని వాళ్ళ నమ్మకం.
 
    సమస్యలోనే పరిష్కారం ఉన్నదనీ, అసలు సమస్యలే లేవనీ, అవన్నీ మనసు ఆదరణ, విక్షేపాల వల్ల తయారు అవుతున్నాయని వీళ్ళకు ఎన్నిమార్లు చెప్పినా ఒక్కటే తీరు!

    ఓ యువకుడు లోపలకు వచ్చాడు. తాపీగా మూర్తి ఎదురుగా కూర్చున్నాడు. ముఖంలో ఎంతో ధైర్యం, పట్టుదల! అనుకున్నది ఏమయినా చేయగల దృఢ సంకల్పం. పులుముకున్న నవ్వు లేకపోయినా యే క్షణంలోనయినా హాయిగా నవ్వే ఆటంకం ఉన్నవాడిగా కనిపించటంలేదు.

    'నాకు చిన్నతనంలోనే వివాహం అయింది' అంటూ ప్రారంభించాడు. 'ఇంకా కాలేజీ చదువు ముగియనే లేదు. మంచి సంబంధం అయినప్పుడల్లా రాదని మా వళ్ళు తొందరపడిపోయారు. నేనూ ఒప్పుకున్నాననుకోండి. అయిదేళ్ళు కాపురం చేశాం అరుణా నేనూ. తరువాత తెలిసింది మా ఇద్దరివీ ఉత్తర దక్షిణ ధ్రువాలని! అయిదేళ్ళ తరువాత బయట పడింది నా అసలు రంగు అంటుంది అరుణ. కాని రహస్యం చెప్పమంటారా? బయట పడింది నా రంగు కాదు, అరుణ లోలత్వమే. అయినా దాన్ని గురించి రచ్చ చేసి, యాగీ చేసి కిష్కింధ తయారు చేసుకుని జీవితాన్ని ఇంకా భ్రష్టు పట్టించుకోవాలని అనుకోలేదు నేను. చదువుకున్నవాడిని గదూ ఆ మాత్రం సంస్కారం అంటుకుంది నాకు. అక్కడికీ ఎంతో ప్రయత్నించి చూశాను' - అని ఒక్క క్షణం ఆగాడు. మూర్తి తన వంకే చూస్తున్నాడా లేదా, వింటున్నాడా లేదా అని నిర్ధారణ చేసుకోవాలని అతని ప్రయత్నం. తన కథనం కొనసాగించాడు. 'శారీరకంగా మానసికంగా ఇద్దరమూ అలసిపోయాం. మాకసలు పొంతన లేదు. అయిదు సంవత్సరాల పాటు మేం ఎలా కలిసి ఉన్నామో ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ప్రేమించుకున్నాం ఒకప్పుడు! ఇప్పుడు పగ, ద్వేషం తప్ప ఇంకేం లేదు మా హృదయాలలో. విడిపోయి ఎవరి బతుకులు వాళ్ళం బతుకుతాం. లాయర్లు వ్యవహారం అంతా పరిష్కారం చేస్తారు. మళ్ళీ మీరు వచ్చేనాటికి నా కొత్త భార్యను తీసుకు వచ్చి మీ దర్శనం చేసుకుంటాను!' అన్నాడు అతను. పెదవుల చివర నుంచి నవ్వులు ఒలుకుతున్నాయి.

    'నా దర్శనం ఎందుకు? హాయిగా ఉండాలనుకుంటే అలాగే ఉండండి. అందుకు సాక్ష్యాలూ, నా ముద్రా కావాలా?' అన్నాడు మూర్తి.

    'అమ్మమ్మ! ఒక్కనాటికీ అలా అనకండి. మిమ్మల్ని అద్దంలా చూసుకుని ఆలోచనలు చేసుకుంటున్నాను. మీ ఆశీర్వాదం లేకపోతే నా బతుకు బండబారిపోతుంది' అన్నాడు అతను ధృఢచిత్తంతో.

    'నన్నెందుకు పెద్ద చేస్తారు? నేనెవరిని? మీ అందరి మోస్తరుగా నేనూ ఒక మానవ మాత్రుడనే' అన్నాడు మూర్తి అనునయంగా, బతిమాలుతున్నట్లుగా.

    ఇంతవరకూ పెళ్ళిచేసుకోలేదు గనుక ఇక ఇలాగే ఆజన్మం బ్రహ్మచారిగానే ఉండి పోతాననుకుంటున్నారు. నాకు ముప్పయిరెండేళ్ళేనన్న సంగతి వీళ్ళెవరూ గమనించరేం? ఏ శతవృద్ధుడికో ఇవ్వవలసిన గౌరవం, ఆదరమెందుకు ఇస్తున్నారు? వీళ్ళ ధోరణి నాకు సుతారమూ అర్థం లేకుండా ఉంది. అదే మాటంటే మీరు వయోవృద్ధులు కాకపోయినా జ్ఞానవృద్ధులు అంటారు!... అంటూ మూర్తి స్వగతంలో పడిపోయాడు. తనను గురించి తనకు విమర్శ ప్రారంభం అయితే ఒకంతట ఆ స్థితి నుంచీ బయట పడడం కుదరదు.

    విషయాలను వివరంగా ఉన్నవి ఉన్నట్లుగా చూడగలగడం, సమగ్రంగా విమర్శించుకోగలగడం... ఇదే తనకు చేతనయిన పని. దీనినే అదేదో దైవదత్తమయిన 'వరం'లాగా భావిస్తున్నారు ఈ భజనపరులందరూ. కాలు నేల మీద మోపనివ్వరు. మామూలుగా బతకనివ్వరు నన్ను... అని మనసులోనే నిట్టూర్పులు విడిచాడు.

    ఇప్పటికి రెండు నెలల నుంచి రాజగొపాలం అనే స్నేహితుడు తనను వేధిస్తున్న విషయం వీళ్ళెవరికీ తెలియదు.

    'మూర్తీ నీ జీవితంలో ఎంత వేదాంతం అయినా ఇమిడిపోనివ్వు. కాని... భార్య, పిల్లలు, సంసారం... ఆ అనుభవాలు ప్రతి మనిషికీ ప్రాథమికంగా అవసరం. లేకపోతే నీ జీవితంలో వెలితి అలాగే ఉండిపోతుంది...' అంటాడు రాజగోపాలం. అతనే పోయిన వారం అన్నాడు గూడా 'నీకు తగిన అమ్మాయి నాకు తెలుసు. నాకు ఆ పిల్ల మరదలు అవుతుందని కాదు గాని కాత్యాయని నీకు అన్ని విధాలా నచ్చుతుందని నేను ఎరుగుదును. నువ్వు చూచి ఇష్టం అయితేనే పెళ్ళి చేసుకుందువు గాని.'
 
    మూర్తి ఆలోచనలకు, అడ్డు వస్తూ ఆ వచ్చిన మనిషి పెద్దగా మాట్లాడడం మొదలు పెట్టాడు మళ్ళీ.
 
    'మీ వినయం, మీ మంచితనం అలా అనిపిస్తాయి కాని మేమెక్కేడ, మీరెక్కడ నక్క - నాకలోకం; కొవ్వొత్తి - సూర్య మండలం. ఎందుకు నా చేత వంద మార్లు చెప్పించాలని చూస్తారు?  ముఖస్తుతి అనుకుంటారు వినేవాళ్ళు' అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు అతను.
 
    ఇంతలో ఇద్దరు ముగ్గురు అతి హడావుడిగా లోపలకు వచ్చారు. 'గురువుగారు వస్తున్నారు. మీకు వారం రోజుల క్రితమే కబురు చేశారు గదా! మీరు రమ్మన్నారు' అన్నారు వాళ్ళు మూర్తితో.
 
    'రమ్మనండి' అన్నాడు మూర్తి వాళ్ళతో.
 
    'గురువుగారు సంసారుల ఇళ్ళకు రారు. బయటి ఆవరణలోనే ఉండిపోతారు. మీరు దయచేసి అవతలకు రావాలి. లాన్‌లోనే తివాచీలు పరిచాం. గురువుగారు వచ్చేస్తున్నారు' అన్నారు వాళ్ళు ఏక కంఠంతో.
 
    మూర్తి లేచాడు. వాళ్ళ వెనుకనే నడిచి ఆవరణలోనికి వెళ్ళాడు. 
 
    చక్కటి చిక్కటి పచ్చిక, నేత్రానందంగా ఉంది. దాని మీద పడుకుని పొర్లాలని అనిపిస్తోంది. కాని జనం ఒప్పుకోరు! తనకు కావలసిన రీతిలో ఆనందాన్ని పొందనివ్వరు. మన ఆత్మానందానికి కూడా ఇతరుల ఆమోద ప్రమోదాలు కావాలి!
 
    నేత్రానందంగా ఉంది ఆ ఆవరణ. ఓ చిన్న షామియానా కూడ వేశారు.
 
    గుబురు గుబుర్లుగా గులాబీలు. దూరం నుంచి సంపంగి పొదల వాసన ముక్కుపుటాలను తాకుతోంది.
 
    గురువుగారు వచ్చారు. ముందుకు వచ్చిన శిష్యులు, అక్కడ పోగయిన పది పన్నెండు మంది ఆయనకు పాదాభివందనం చేశారు. మూర్తికి కూడా చేయాలని చూశారు కాని అతడు పడనివ్వలేదు.
 
    గురువుగారు తాపీగా ఒక కుర్చీలో కూర్చున్నారు.
 
    ఎంతో స్ఫూర్తితో, ఉత్సాహంతో తొణికిసలాడుతున్న ముఖం. వినయం, విషయ గౌరవం మిళితమై ఉన్నాయి ఆ ముఖంలో.
 
    'మీరు 'గురువు'ను కాదంటారు. కాని "గురోర్గురుః" మీరు. అంటే గురువులకే గురువులన్నమాట. మీ చిన్నతనం నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను' అంటూ ప్రారంభించారు గురువుగారు.
గురువుగారికి దాదాపు రెట్టింపు వయసు, మూర్తితో పోలిస్తే. అయినా మీరు, మీరు అని మన్నిస్తారు మూర్తిని.
 
    "మీరు చెబుతూ ఉన్నదే నిజం. అదే సత్యం. అందులో ఏమీ సందేహం లేదు. కాని ఆ సత్యం సామాన్యులకు అర్థం కాదు; వాళ్ళకు అర్థం కావాలంటే మా బోటి వాళ్ళం ఓపికగా వివరించి విడమరచి మరీ చెప్పాలి. అందుచేత బహుజన ప్రయోజనం కోసం మేం ఉండవలసిందే, తప్పదు. లేకపోతే వాళ్ళంతా దిక్కులేని పక్షులవుతారు. మేం కనిపెట్టి ఉంటాం వాళ్ళను.  అన్నీ సాధికారంగా చెపుతాం వాళ్ళకు. సంప్రదాయాన్ని నిలబెడతాం' - గురువుగారి వాక్ప్రవాహానికి గంగానదే పోలిక.
 
    కొంతసేపు అయిన తరువాత, మూర్తి 'సరే మీ ఆరోగ్యం ఎలా ఉంది? జాగ్రత్తగా మందు మాకు తీసుకుంటున్నారా? యోగాభ్యాసం చేస్తున్నారు కదా!' అని అడిగాడు.
 
    'అంతా భగవదిచ్చ ప్రకారమే నడుస్తోంది. ఇప్పట్లో ఏమీ ఢోకా లేదు. ధర్మాన్ని రక్షిస్తున్నాం. దర్మం మమ్మల్ని రక్షిస్తుంది అని విశ్వసిస్తున్నాం. మిమ్మల్ని మళ్ళీ చూడగలగడం... మీ సన్నిధిలో కొంతసేపు కూర్చోవడం, మాట్లాడడం ఇదంతా భగవత్ కృపే' అన్నారు గురువుగారు.
 
    మూర్తి ఏమీ మాట్లాడలేదు.
 
    పక్షుల కిలకిల మనడం ఎక్కువ అయింది.
 
    గాలి చల్లగా వీస్తోంది.
 
    గురువుగారి శిష్యులు ఇంకా వస్తున్నారు. రాగానే వారికి పాద ప్రణామం చేస్తున్నారు. తీరుబడిగా జనంతో కలిసి కూర్చుంటున్నారు. తెలియని వాళ్ళను పరిచయం చేసుకుంటున్నారు. ఎవరి లోకం వాళ్ళది.
 
    'సత్యం అనుభవం లోనికి రావలసిందే. దాన్ని వర్ణించటానికి, వివరించటానికి మనస్సుకు ఏం చేతనవుతుంది? మీ దగ్గర కూర్చున్న కాసేపూ ఆ పెన్నిధి అందినట్లే ఉంటుంది. తరువాత మళ్ళీ వెదుకులాటే!' అన్నారు గురువుగారు.

    'ఎందుకు వెదకడం! వెదికే పనేం ఉంది. అది ఉంది. దాని మీద పైపూతలు, ముసుగులు వేయకుండా గమనించండి - చాలదూ' అన్నాడు మూర్తి.

    ఒక గంట గడిచిన తర్వాత - గురువు గారు చెప్పదల్చుకున్నదంతా అయిపోయినాక - ఆయన శిష్య బృందం మళ్ళీ హడావిడిగా లేచి వెళ్ళిపోయారు. 'మా జీవితాలలో బ్యాటరీ తిరిగి "ఛార్జ్" చేసుకున్నాం. సంవత్సరం వరకు... మీరు తిరిగి వచ్చేంత వరకు, ఇంక మాకేం ఢోకా లేదు' అన్నారు గురువుగారు అంతిమ సందేశం లాగ.
 
    మూర్తి ఉలకలేదు, పలకలేదు. పెద్ద ద్వారం వరకు వాళ్ళను పంపించి తిరిగి వచ్చాడు గదిలోకి. 
 
    మళ్ళీ తను వచ్చినప్పుడు, ఈ జనం అంతా ఇలాగే వస్తారా? తనను కలుసుకుంటారా? తనతో కష్ట సుఖాలు చెప్పుకుంటారా? 'ఏమో, గొప్పవాడు అనుకున్నాం. మా నమ్మకాలన్నీ వమ్ము చేసి పెళ్ళి చేసుకున్నాడు. విషయ వాంచల్లో పడిపోయాడు. మరో విశ్వామిత్రుడు అయిపోయాడు. ఇప్పుడు ఇతనితో ఏం పని?' అని దూరంగా పెట్టేస్తారు - మూర్తి అంచనా అది.
 
    అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒంటరివాడు మూర్తి. గడియారం చూసుకున్నాడు. అప్పుడే అయిదు గంటలు అయింది ఇక్కడకు, దేశాన్ని దాటి సముద్రం గడచి నగరానికి దూరంగా కొండ మీద చిన్న బంగళాకు వచ్చి. వాళ్ళు ఏదో అనుకుంటే తన రూప స్వభావాలు 'చెడి'పోతాయని భయం లేదు మూర్తికి. అసలు తనకి అలాంటివి అంటేనే ఇష్టం లేదు. వాళ్ళను నిరాశ పరచకుండ, గృహస్థాశ్రమం స్వీకరించడమే ఉత్తమం అని ఇటీవలనే నిర్ణయం చేసుకున్నాడు. సన్యాసం పుచ్చుకుంటానని ఎవరికీ ప్రకటనలు చేయలేదు. మనసులోనూ అనుకోలేదు ఇన్నాళ్ళూ. తనను గురించి జనం ఎవేవో ఊహలు చేసుకుంటే ఆ బాధ్యత తనది కాదు. ఆ ఊహలు నిజం చేయవలసిన అవసరం తనకు లేదు... మూర్తి తనకు తాను బోధ చేసుకుంటున్నాడు; తెలియచెప్పుకుంటున్నాడు, ఎందుకయినా మంచిదని.
 
* * *
 
    మరుసటి రోజు లైబ్రరీకి రావటం తోటే కమలనాథం సరాసరి కాత్యాయని టేబుల్ దగ్గరకు నడిచాడు. 'నమస్కారం' అన్నాడు. కాత్యాయని ముందు తడబడిన మాట వాస్తవమే.
   
     'మీరు నాతో మాట్లాడిన వేళావిశేషం! చాల మంచిదయింది. నాకు ఉద్యోగం వచ్చింది. థాంక్స్ చెప్పి వెడదామని వచ్చాను. ఇవేళ మధ్యాహ్నమే కొత్త ఉద్యోగంలో చేరిపోతాను' అంటూ అతను ఏకబిగిన చెప్పివేయడంతో కాత్యాయని ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.
 
    'అలాగా. థాంక్స్... హార్టీ కంగ్రాట్స్' అంది.
 
    కమలనాథం ఇంకా ఏదో చెప్పాలని ఉవ్విళ్ళూరిపోతున్నాడు. 'మా ఆవిడ కూడా మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంది. రేపు ఆదివారం మీరు మా ఇంటి భోజనానికి రావాలి. అక్కగారి ఇంటికి వెళ్ళాలని వాయిదా వేయకండి. శనివారం సాయంత్రం మేమిద్దరు మీ హాస్టలుకు వచ్చి మరీ పిలుస్తాం. మీరు పలకరించిన వేళా విశేషం!...'
 
    కాత్యాయనికి నవ్వు ఆగలేదు.
 
    'ఆరు నెలల నుంచి ఉద్యోగం లేదని నిన్ననే బాధపడ్డారు. నేనెనం తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగకరణాలు లేక్కలేసుకుని మీతో మాటలు కలపలేదు నిన్న. నన్నెందుకు అంత పెద్ద చేస్తారు?'
 
    'ఏమో, నాకు తెలియదు. నిన్న మీరు నన్ను పలకరించక పోయినట్లయితే నాకు ఇంటికి వెళ్ళేసరికి కొత్త ఉద్యోగపు "ఆఫర్" కంబడేది కాదు. మీరు నన్ను మూర్ఖుడు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నాకు ఉద్యోగం రావడం ముమ్మాటికీ మీ నోటి మాట చలువే!'
 
    'పోనీలెండి. ఎవరి నమ్మకాలు వారివి. ఇంతకూ కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తరువాత ఈ లైబ్రరీని,తత్త్వశాస్త్ర గ్రంథాలను మరచి పోతారనుకుంటాను' అంది కాత్యాయని కొంటెగా చూస్తూ.
 
    'అమ్మమ్మ అంత మాట అనకండి. తత్త్వశాస్త్రాన్ని మరచిపోతే నాకు ఇంక జీవితమే లేదు. అదేగా నిన్న మీరు నాకు నేర్చిన పాఠం' అన్నాడు.
 
    'నేనా? పాఠం నేర్పానా? అదేమిటి?' అంది కాత్యాయని, మూడు ప్రశ్నలూ ఒకదాన్ని ఒక మింగేస్తూ.
 
    'అవును. తత్త్వశాస్త్రాన్ని కాల్పనిక సాహిత్యంలో జోడించకపోవడమే నేను మొన్నటి వరకు చేసిన పొరపాటు. ఈ విషయం నిన్ననే గదా నేను మొదటి మారుగా గమనించగలిగిందీ!' అన్నాడు కమలనాథం వివరిస్తున్నట్లుగా.
 
    కాత్యాయనికి ఈ వివరణ ఏమీ అర్థం కాలేదు. ఆమెకు తెలిసిందల్లా - కథా సాహిత్య విభాగం వైపు అతను వేసిన అడుగులు తనకు నిన్న 'విడ్డూరంగా' కనిపించటమే.
 
    'ఇంతకూ మా ఇంటికి 'లంచ్'కి రావటం తప్పదు. మాట మార్చటానికి వీల్లేదు సుమండీ!' అని కమలనాథం అన్నప్పుడు, 'ఈ మాట మీరు శనివారం సాయంత్రం దాకా గుర్తుంచుకున్నప్పుడు చూద్దాం లెంది' అంది కాత్యాయని.
 
    'చూస్తారుగా మీరే. మరి వెళ్ళివస్తాను. మళ్ళీ థాంక్స్' అని కమలనాథం గబగబ లైబ్రరీ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు.
 
* * *
 
    అందరికీ సమస్యలు. అందరూ సమాధానాలు తయారు చేసుకుంటారు. ఒక్క విషయం మటుకు చిక్కుముడిగానే ఉండిపోతోంది మూర్తికి ఎంతగా ఆలోచించినా!

    అందరు ఎందుకు ప్రశ్నలు వేస్తారు? జవాబుల కోసం ఇతరుల ముఖాలలోకి ఎందుకు చూస్తారు?

    ఈ ప్రశ్నలు తమకే ఎందుకు వేసుకోరు? అడిగే వాడికి చెప్పేవాడు లోకువ అంటే ఇదేనా? అన్నిటికీ వెంటవెంటనే, తడుముకోకుండా జవాబులు కావాలి అందరికీ.

    తమ జీవితాలు సుజావుగా తీర్చిదిద్దినట్లుగా గడిచిపోవాలి. తాము మాత్రం యేపాటి అలసటా పడకూడదు.

    మూర్తికి ఇదే ఆలోచన. తెగని ఆలోచన.

    ఎక్కడినుంచో ఘూంకరింత వినిపించింది.

    గుడ్లగూబకు పగలు కళ్ళు కనిపించవు. చీకట్లో భేషుగ్గా చూడగలుగుతుంది. మనిషి పగలు చూస్తాడు. చీకట్లో బాగా చూడలేదు. అందుకు శాస్త్ర విజ్ఞానం అంతా పోగుచేసి, వినియోగించి కొత్తకాంతులు తయారు చేసుకున్నాడు.

    అట్లాగే గుడ్లగూబలకూ పగలు కళ్ళు కనిపించేట్లుగా ఏదైనా సాధనం తయారు చేయగూడదా?

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెనెటికి ఇంజనీరింగ్ బహుళ ప్రచారంలోనికి వస్తున్న ఈ రోజుల్లో ఇదేమీ అసాధ్యం అయిన విషయం కానే కాదు. చేస్తాడు - ముందు ముందు.

    అప్పుడు చీకటి, వెలుతురు - రెండు వేరు వేరు కాదు. కలిసిపోతాయి. చీకటికి కళ్ళన్నీ తెరుచుకుని పరుచుకుంటాయి.

    దూరంగా గరుడపక్షి ఎగురుతోంది. ఆ రెక్కల చప్పుడు ప్రపంచాన్ని, ప్రపంచగమనాన్ని గుర్తు చేస్తోంది.

    'నాకు భవిష్యత్తు తెలియదు. వర్తమానంలో మటుకు అరమరికలు లేకుండా బతకడం నేర్చుకున్నాను' అనుకున్నాడు మూర్తి.

    ఈ క్షణం చక్కగా బతుకు, వివేక యుతంగా వ్యవహరించు; భవిష్యత్తును అదే తీర్చిదిద్దుతుంది. నివేం ఆలోచనలతో సతమతం అయిపోవలసిన అవసరం లేదు... అని గుర్తు తెచ్చుకున్నాడు.

    వివేకయుతంగా జీవించడం - అంటే?

    అది కేవలం ఒక మాట కాదు, సమాసం కాదు.

    సృష్టి సారం అంతటినీ తన పిడికిలిలో బిగించుకు కూర్చుంది గదూ వివేకం?

* * *

    కాత్యాయనికి టెలిఫోన్ కాల్ వచ్చింది. 'ఏం చేశావు, నేను చెప్పిన విషయం' అంటూంది అక్క. ఆమె ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకోవటానికి చాలాకాలం పట్టింది. అక్కకు కోపం వచ్చింది కూడా, తన మాటలు పెడచెవిన పెట్టినందుకు.

    'అట్లా పరధ్యానంలో పడిపోయావంటే, నీకు పెళ్ళి చేసుకోవలసిన సమయం ఆసన్నమయిందన్నమాటే' అంది అక్క. అప్పుడు స్ఫురించింది, రాత్రి అక్క చెప్పిన సంగతి.

    'అతనికి మంచి ఉద్యోగం ఉంది. దేశంలో పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకున్నాడి. మంచివాడు లాగానే కనిపిస్తున్నాడు. మీ బావగారు "రికమెండ్" చేశారంటే ఇందులో మనం కొత్తగా కూపీలు తీయవలసింది ఏమీ ఉండదు' - అని.

    అక్క మళ్ళీ ఫోన్‌లోనే దబాయిస్తున్నట్లుగా అంది.
 
    'మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి ముందు. మాటుకోవడం అవసరం. రేపు ఆదివారం 'లంచ్'కి తీసుకురమ్మంటాను అతన్ని - మీ బావగారితో చెప్పి. నీతో ముందు చెప్పి 'ఓకే' తీసుకోకపోతే నీకు కోపం వస్తుంది గదా. అందుకని ఇప్పుడు చెపుతున్నాను.'
 
    'రేపు ఆదివారమేనా? లంచ్‌కా?' అంది కాత్యాయని, నిర్ధారణగా అక్క చెప్పిన మాటలు చెవిలో మోగుతూనే ఉన్నా. కమలనాథాన్ని - అతను మరచిపోకుండా ఉంటే - నిరాశపరచటం ఇష్టం లేకపోయింది. అతను మరచిపోడు. అతని భార్య మరచిపోనివ్వదు. మొగుడు అంత గొప్పగా చెబుతున్న అమ్మాయి తనకంటే అందమయినదా - తెలివైనదా తెలుసుకోకుండా ఆమెకు నిద్ర ఎలా పడుతుంది?
 
    'అక్కా లంచ్‌కి కుదరదు. నాకు లైబ్రరీలో ప్రత్యేకమైన పని ఉంది. ఇంతకు ముందే ఒప్పుకున్నాను. ఇప్పుడు కుదరదంటే బాగుండదు. పోనీ బావగారితో చెప్పు 'డిన్నర్'కు తీసుకురమ్మని' అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది కాత్యాయని.
 
    ఆ తరువాత నాలుగు గంటలకు సాయంత్రం బావగారు కూడా ఫోన్ చేశారు. మామూలు పాటే.
'నువ్వు ఒంటరితనం ఫీలవ్వద్దు. నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరనుకోకు. మీ అక్కా, నేనూ ఎప్పుడూ నిన్ను గురించే ఆలోచిస్తూ ఉంటాం' 
 
    ఈ మాటలు వింటున్న టెలిఫోన్ రిసీవర్‌కు, తనకు ఏమీ వ్యత్యాసం ఉన్నదనిపించలేదు కాత్యాయనికి. ఇద్దరికీ ఈ మాటలు ఏమీ కావు, ఎందుకనో!
 
    ఆదివారం సాయంత్రం డిన్నర్‌కు వస్తానని చెప్పినా, ఎంత గట్టిగా నమ్మబలికినా బావగారికి ఎందుకు విశ్వాసం ఏర్పడదో కాత్యాయనికి అర్థం కాదు.
 
    మామూలు మాటలకు తోడు ఇప్పుడో చరణం కూడా జత అయింది బావగారికి. 'కాత్యాయనీ నీకు కొత్తగా చెప్పడం లేదు నేను. నువ్వో ఇంటిదానివి అయితే తప్ప నాకూ, మీ అక్కకూ మనస్థిమితం ఏర్పడదు. మనుషుల్లో నమ్మకం ఏర్పరచుకోవాలి మనం. అతని - అదే, నా స్నేహితుడు మూర్తి అని చెప్పానే - అతన్ని ఆదివారం డిన్నర్‌కు తీసుకు వస్తున్నాను, ఇంటికి. నీవు తప్పకుండా రావాలి కాత్యాయనీ... నిన్ను బలవంతం చేసి ఈ పెళ్ళి చట్రంలో ఇరికిస్తున్నానని ఒక్కనాటికీ అనుకోకు. నీకు సంపూర్తిగా ఇష్టం అయితేనే, మూర్తీ, నువ్వూ ఒకళ్ళనొకళ్ళు ఆమోదిస్తేనే, నేను ఈ ప్రస్తావన కొనసాగిస్తాను. మీ ఇద్దర్లో ఎవరు కాదన్నా నేను కారణాలు అడగను. కళ్ళు మూసుకుని ఈ సంగతే మరచి పోతాను. ఆదివారం సాయంత్రం తప్పకుండా వస్తావు కదూ! చీకట్లో చూడడం కంటే పగలు మంచిదనుకున్నాను. కాని లంచ్‌కి కుదరదని చెప్పావుట కదా!' అంటూ ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు ఆ మానవుడు.
 
    చీకటి! విద్యుత్ కాంతుల వెలుగులో చీకటి ఇంకెక్కడ ఉంటుంది?
 
    చీకటి వంతెనలో బహుదూరం ప్రయాణం చేసిన తర్వాత, ఆ వంతెన చివరన దేదీప్యమానమైన వెలుతురులో ఓ మూర్తి భాసిస్తూ ఉంటాడు, ఇంతవరకూ ఒంటరిగా ప్రయాణం చేసిన మనిషిని దగ్గరకు తీసుకుని ఆదరించటానికి. ఆ మనిషి అసంఖ్యాకమైన తలలు, కళ్ళూ...ఉన్నాయని మనిషి ఎప్పుడో ఊహ చేసుకున్నాడు. ఇంకా - చీకటి - చీకటి - ఏమీ కనిపించదు అనుకోవడం ఎందుకు?
 
    మనిషి అంటే వస్తువు కాదనీ, పదార్థం కాదనీ - చేతన ఉన్న మనస్సు జాగరణకు అవడం తన ఒక్కదానికే పరిమితం కాదనీ కాత్యాయనికి అప్పుడే - ఆ క్షణంలోనే స్ఫురించింది. 
 
(రచన ఇంటింటి పత్రిక జూన్ 2008 సంచికలో ప్రచురితం)    
Comments