పునరావృతం - బి.గీతిక

    రాబోతున్న వసంతానికి స్వాగతం పలుకుతూ బంగారు రేకులు జిమ్ముతున్నట్లుగా రాలుతున్నాయి పండుటాకులు. ఎడారిని తలపించే మా పల్లె కూడా ఇప్పుడు మాత్రమే పూసే పూలతోనూ, మామిడి పిందెతోనూ, దోర సపోటా కాయల్తోను వింత వాసనలు విరజిమ్ముతోంది. కానీ... వాటన్నిటితో పాటూ సాయంత్రమైతే మరికొన్ని ఘాటైన వాసనలు మా పల్లెని కమ్మేస్తున్నాయి. అదీ ఈ మధ్య కొన్నాళ్ళ నుంచే...!

      రోజూ సాయంత్రం అవకముందే ప్రతీ వీధిలో ప్రత్యక్షమైపోతున్నాయి నాలుగు చక్రాల బళ్ళు. వాటి మీద నూడుల్సనీ, కబాబ్సనీ, ఫ్రైడ్రైసనీ, ఇతరదేశాల ఆహారాలన్నీ. మా పల్లోళ్ళకు మాంసాహారం ఎప్పుడూ తినేదే ఐనా అరుదుగా తినే ఇలాంటి నూనెలో దేవిన తిండికి ఇప్పుడు మరీ అలవాటు పడిపోతున్నారు. ఏదేమైనా ఆ వంటల బళ్ళ నుండి వచ్చే వాసనలు సాయంత్రాల్లోని ఆహ్లాదాన్ని నాశనం చేశాయన్నది మాత్రం నిజం.

      సూర్యుడు గట్టుదాటిపోతూ చీకటి పొడుచుకొస్తుంటే ఎంత సందడుండేదప్పట్లో. పనులు ముగించుకుని చల్లని సాయంత్రాల్లో ఆరుబయట చేరి కష్టం సుఖం పంచుకుంటూ ఒకరికొకరం తోడన్న భరోసానిచ్చుకునేవాళ్ళం.

      ఇన్నాళ్ళూ మా తరం, ఈ తరం అన్న ఆలోచన అస్సలు లేదు నాకు. కానీ కొంచెం అటూఇటుగా.. ఒకే రకమైన సంఘటనలు అప్పుడు నేను ఎదుర్కొన్నవే ఇప్పుడు నా మనవడు నాగిగాడి జీవితంలోనూ...!

* * *

      ఆ రోజు నాకింకా గుర్తే. ఎందుకు గుర్తుండదు.. అది నా జీవితంలోనే అతి మధురమైన రోజు. అప్పుడు నాకు పద్దెనిమిదేళ్ళుంటాయి. భారీగా వానకురిసి వెలిసిన సాయంత్రం అది. లక్ష్మితో మాట్లాడ్డం అదే మొదటిసారి.

      ఆ రోజు 'ఐలు'కు సిద్ధపడిన మా గుంపు పోరగాళ్ళం దట్టంగా ఉన్న నల్లమబ్బు సూచనల్ని చూసి సముద్రం మీదకు వెళ్ళకుండా ఆగిపోయాం. ఐలంటే సముద్రంలోని చేపల్ని పెద్ద వలల్తో ఒడ్డుకు లాక్కురావడం. ఐలు లేదని ఆ రోజు మా పిన్నింటికి వెళ్ళి తిరిగి వస్తున్నాను. చీకటి పడుతోంది, త్వరగా ఇంటికి చేరాలని పెద్దంగలేస్తున్న నేను మొగలి పొదల్లో ఏదో కదిలినట్లనిపించి ఒక్క క్షణం ఆగాను. మనసెందుకో కీడు శంకించింది. నా ప్రమేయం లేకుండానే రెండడుగులు వెనక్కుపడ్డాయి. పొదలు మళ్ళీ కదిలాయి. కళ్ళు చికిలించి చూశాను. ఓ ఆకారం బయటకు వచ్చింది. ఆడ మనిషి..! పొదల్లో చిక్కగా పరుచుకున్న చీకటిలో ఆనవాలు చిక్కలేదు.

      "కేశవా... నేను లక్ష్మిని..." అందా ఆకారం కంగారుగా.

      అప్పుడు పోల్చుకున్నాను లక్ష్మిని. మా ఊళ్ళో రెండు పడవలున్న ఆసామి కూతురు లక్ష్మి. చాలా అందంగా ఉంటుంది. మేం సముద్రంలోంచి వచ్చేసరికి వాళ్ళ నాన్నకోసం అన్నం క్యారేజీతో తీరం దగ్గరుండేది. అనుకోకుండా మా ఇద్దరి చూపులు కలిస్తే తన కళ్ళలో ఏదో తెలియని పలకరింపుండేది. నా మనసులో హుషారు సుళ్ళు తిరుగుతోంది. మనసు గెంతులేస్తోంది. "ఈ వేళప్పుడు ఇక్కడున్నావేంటి లక్ష్మి..?" అనడిగాను.

      "మొగలి పూలకోసం వచ్చాను. పూలు కోస్తుంటే వాన పెద్దదైపోయింది. ఇప్పుడు తగ్గింది కదా అని బయల్దేరుతుంటే ఎవరో వస్తున్నట్టు కనిపించింది. నువ్వనుకోలేదు" నిదానంగా అంది లక్ష్మి నా పక్కనే నడుస్తూ.

      "ఇంత మబ్బుగా ఉంటే మొగలి పూలకోసం మీ నాన్నని పంపక నువ్వెందుకు రావడం...?" అడిగాను.

      "చాలా రోజుల్నుంచీ నాన్నకి చెప్తున్నా తేవట్లేదని, రాక రాక నేను వస్తే ఇలా ఐంది." నవ్విందామె.

      లక్ష్మి నవ్వితే ఇంకా అందంగా ఉంది. వాన నీటికి ఇసుక గట్టిపడితే, లక్ష్మి నవ్వుకి నా మనసు మెత్తబడుతోంది. తడి ఇసుకమీద అలసట తెలీని నడక, వానలకి మరింత చిక్కపడ్డ మొగలి పొదల్లోంచి వస్తున్న మత్తైన వాసన, మాట్లాడుతున్న లక్ష్మి పిలుపులో 'నువ్వు' అనే చనువైన సంబోధన, కారణమేదైనా... నాకు తెలీకుండానే రగిలే కోరికేదో నన్ను కాల్చేస్తోంది. ఇద్దరికీ మాటల్లో సమయమూ, నడకలో అలుపూ తెలీలేదు.

      సరదా కబుర్లలో పడి మేం ఊళ్ళోకొచ్చేసరికి లక్ష్మి వాళ్ళ బంధువులు నలుగురు లాంతర్లతో కనిపించారు. వాళ్ళు లక్ష్మి కోసం చూస్తున్నారని వాళ్ళ మాటల వల్ల అర్థమైంది. మమ్మల్ని చూసి 'ఎక్కడికి వెళ్లార'ని అడిగారు వాళ్ళు. ఇద్దరమూ జరిగింది చెప్పాము. కానీ జరిగినదాన్ని, మేము చెప్పినదాన్ని వాళ్ళు నమ్మలేదు.

      లక్ష్మినీ, నన్నూ పెద్దమనుషుల ముందు నిలబెట్టారు. చివరికి 'లక్ష్మితో కలిసి కబుర్లాడుతూ రావడమే నేను చేసిన తప్పు. దానికి మీరేం శిక్ష వేసినా భరిస్తా'నన్నాను. 'లక్ష్మిని పెళ్ళాడు' అన్నారు ఊరి పెద్దలు.

      'ఇంత పంచాయితీ జరిగాక ఇంకేం చెయ్యగలను. అలాగే కానివ్వండి' అన్నాడు లక్ష్మివాళ్ళ నాన్న.

      మర్నాడే మా పెళ్ళి. పిడుగునైనా ముందే ఊహించగలం. కానీ నా జీవితంలో పెళ్ళి అంతకంటే హఠాత్తుగా జరిగింది. పెళ్ళి అలా అయినా లక్ష్మి అడుగుపెట్టడం వల్లే నేనీరోజిలా ఉన్నానన్నది ఎవరూ కాదనలేని సత్యం.

* * *

      నాలాగే నా మనవడు నాగి గాడూ అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. నాది అదృష్టమైతే, వాడిది చేతులారా చేసుకున్న పాపం. పెదకాశిం గారమ్మాయికి మాయ మాటలు చెప్పి కడుపు చేసి ఆనక మనువాడను అన్నాడట. ఊరంతా తెలిసి పంచాయితీ పెట్టే వరకూ ఆ సంగతి నాకు తెలీదు.

      అంతా విన్నాక, ఆ అమ్మాయి సూర్యకళ, వాళ్ళ నాన్న.. ఇద్దరూ_ పెళ్ళికంటే జరిమానాగా డబ్బు ఇవ్వమనే అడిగినా, ఆడ కూతురు జీవితం అందర్లో అలుసయిపోకూడదని... నేనే అందర్నీ పెళ్ళికి ఒప్పించాను. అలా నాగిగాడి పెళ్ళీ ఆఘమేఘాల మీద అనుకోకుండా అయిపోయింది.

      తప్పు చెయ్యకపోయినా పెద్దల మాటకి కట్టుబడి ఒక్కటయ్యాం మేం. కానీ నాగి, సూర్యకళలు...?! అది మనుష్యుల్లో లోపమా? మనుష్యుల మనసుల్లోని భావాల దోషమా? తరానికీ తరానికీ మధ్య ఏమౌతోంది..? ఒకే లాంటి సమస్య. కానీ ఆ రోజుల్లో మా పరిష్కారానికీ, ఈ రోజుల్లో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకీ ఎంత తేడా..! పెళ్ళంటే ఎలాగో జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన విషాదం... అచ్చంగ నా బతుకులో ఎదురయినదే.

* * *

      ఆ రోజూ... నాకు గుర్తే. లక్ష్మితో పెళ్ళైన అయిదు నెలలకి.. ఓ నాడు మా జట్టు వాళ్ళం రెండు పడవల్లో ఐలుకు వెళ్ళాం. నాలుగైదు మైళ్ళు లోపలికెళ్ళాక మా పడవలోని వలని, రెండో పడవలోని వలతో కలిపి అల్లుతున్నాం. రెండిటికీ కలిపి అలవోకగా ముళ్ళు వేస్తున్నవాణ్నల్లా పట్టుతప్పి సముద్రంలో పడిపోయాను.

      పందేలేసి సముద్రంలో ఈదడంలోనూ, గజ ఈతగాడిగా సాహసించి కొన్ని ప్రాణాలు కాపాడ్డంలోనూ, నేను చూపించే తెగువ నాలోకి పొంగుకొచ్చింది. ఈదుతూనే మా వాళ్ళు విసిరిన తాడుని కష్టం మీద అందుకున్నాను.

      ఉన్నట్టుండి నీటిలో ఏదో ఊపు. పడవ కూడా అల్లల్లాడడం మొదలైంది. అటూ ఇటూ కంగారుగా చూస్తున్న మా జట్టు వాళ్ళు ఉన్నట్టుండి ఘొల్లుమని కేకలు పెట్టారు. 'ఏంటా' అని తలతిప్పి చూశాను. ఈ లోపే దభీమని గుద్దుకుందేదో. ఒక్కసారిగా చుర్రుమన్న నా భుజంలో విపరీతమైన మంట. కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. అప్పటికర్థమైంది నాకు. నన్ను గుద్దింది టేకుచేపని. సందేహం లేదు. దాని తోకలోని విషపు ముల్లు నా భుజం మీద గుచ్చుకుంది. అంటే ఇక నా ప్రాణం పోబోతుందా..! మరి నా లక్ష్మి జీవితం..?

      అంతే. ఆ తర్వాత నాకింకేం తెలీలేదు.

      నాకు తెలివి వచ్చేసరికి ఎన్ని రోజులైందో..! పెద్దఓడలో ఉన్నాన్నేను. అందులో ఉన్నవాళ్ళు ఏదేదో భాష మాట్లాడుతున్నారు. మా ఊరు పేరు చెప్పి, నన్ను పంపించమని అడిగాను. అప్పటికే నాలుగు నెలలుగా నేను స్పృహలో లేనని, మా ఊరుకి వెయ్యికిలోమీటర్ల కంటే దూరానికి వచ్చేశానని వాళ్ళు సైగల్తో చెప్పారు. వాళ్ళ కాళ్ల మీద పడి బావురుమన్నాను. నా బాధ చూసి, మరో వారంరోజులకి వాళ్ళు నన్నోరేవులో దించి, నాచేతిలో కొంత డబ్బు పెట్టారు. వాళ్ళిచ్చిన డబ్బుతో మా ఊరు చేరేసరికి మరో పది రోజులు పట్టింది.

      లక్ష్మి పదేపదే గుర్తొస్తోంది. వెంటనే తనని చూడాలి. ఇదే నా ఒక్కగానొక్క ఆశ. ఆ రోజు_ ఊళ్ళోకి అడుగు పెడుతుంటే స్వర్గంలోకి అడుగుపెడుతున్నంత హాయిగా అనిపించింది. ఇందుకేనేమో కన్నతల్లి, కన్న ఊరూ ఒకటేరా అని మా తాతంటుండేవాడు. ఇంటి వైపు వస్తుంటే ఒకరిద్దరు వింతగా చూశారు.

      ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. చప్పుడు చేయకుండా మెల్లగా లోపలకు వెళ్ళాను. ఇంట్లో మొదటి గదిలో అమ్మ పడుకునుంది. లక్ష్మి కోసం నా కళ్ళు చుట్టూ చూశాయి. వంటగదిలోకి వెళ్ళాను. అక్కడ ఓ మూలన నేల మీద పడుకునుంది లక్ష్మి. లక్ష్మిని చూసిన నా కళ్ళు మిలమిలలాడాయి. అదీ ఓ సెకనే. బొద్దుగా ముద్ద బంతిలా ఎంత అందంగా ఉండేది లక్ష్మి..! సరివి కట్టెలా అయిపోయింది. నన్ను చేసుకున్నందుకేగా ఇలాంటి జీవితం నా లక్ష్మికి..!గుండె బరువయ్యింది నాకు. దగ్గరకెళ్ళి మొహంలో మొహం పెట్టి "లక్ష్మీ..." అని పిలిచాను.

      పక్కకు ఒత్తిగిల్లే 'ఊ' అంది. అంతలోనే.. తన భుజాలు ఉండుండీ ఎగసిపడుతున్నాయి. 'కేశవా' అని పలవరింత. చిన్నగా వెక్కుతున్న శబ్దం. నా లక్ష్మి ఏడుస్తోందా..! మళ్ళీ "లక్ష్మీ..!" అని గట్టిగా పిలిచాను.

      ఉలిక్కిపడి లేచింది లక్ష్మి. కళ్ళు పెద్దవి చేసి నన్ను చూస్తూ "కేశవా..! నువ్వేనా.. వచ్చావా. నిజంగా వచ్చావా.. నువ్వు రాలేదు కదూ..." పిచ్చి పిచ్చిగా గడగడా మాట్లాడేస్తోంది లక్ష్మి. తన భుజాల్ని చేతుల్తో బలంగా పట్టుకుని, "లక్ష్మీ..! నీ కేశవనే. వచ్చేశాను. నీ కోసం వచ్చేశాను లక్ష్మీ.." మెల్లగానే అయినా స్థిరంగా చెప్పాను.

      చిన్నపిల్లలా నన్ను చుట్టి ఏడ్చేసింది. తననలా చూసి నేనూ దు:ఖాన్ని ఆపుకోలేకపోయాను. తన వీపు మీద, తల మీద రెండు చేతులేసి గుండెకి హత్తుకున్నాను. తన దు:ఖం కాస్త తగ్గాక, నాన్న ఏడని అడిగితే తను జరిగిన అన్ని విషయాలూ చెప్పింది. 'ఉన్నొక్క కొడుకుని లేననుకుని నా మీద బెంగతో నాన్నపోయాడని, అమ్మ మంచం పట్టిందని, లక్ష్మి తల్లిదండ్రులు 'కేశవే లేనప్పుడు చాకిరీచేస్తూ నువ్వెందుకక్కడ. వచ్చెయ్యి. వేరే మనువు చేస్తామ'న్నా కాదని; నా జ్ఞాపకాల్తో, ఒంటరయిన అత్తని చూసుకుంటూ, లక్ష్మి చేపలమ్మి బతుకు ఈడుస్తోందని..'

      అప్పుడే_ లక్ష్మిమీద నా ఇష్టం సముద్రమంతయింది. తన ఎదురుచూపులకే నేను బతికొచ్చానేమో. లక్ష్మి నా జీవితానికి చుక్కాని. తనని రాణిలా చూసుకోవాలి, ఏ కష్టం పడనీకూడదని నిర్ణయించేసుకున్నాను.

      అప్పుడు.. నన్ను తనలోకి లాక్కున్న సముద్రుడు, ఇప్పుడు నా మనవడి మీద మోజుపడ్డాడు. 'పున్నమి సందేళ సముద్రస్నానం వద్దురా' అని ఎన్నిమార్లు చెప్పినా వినేవాడుకాదు. 'నిండు చంద్రుడు నవ్వుతూ ఉంటే వెన్నెల్లో ఒళ్ళు తడుపుకోవడం, నీళ్ళలో ఈదులాడ్డం ఎంత బావుంటాయో తెలుసా తాతా...' అని ఊరించేవాడు.

      పున్నమినాటి పగలు నిశ్శబ్దంగా లోపలెక్కడో ఉండే అలలు రాత్రయితే ఒడ్డును దాటి నావలున్న చోటకి ఎగదన్నుకొస్తాయి. వాడు కుర్రాడు, సముద్రపులోతు తెలీనోడని నా భయం. ఆ భయమే యధార్థమైందిప్పుడు.

      పండు వెన్నెల్లో స్నానానికని వెళ్ళిన నాగి ఇంకా రాలేదు..! పున్నమి గడిచి మళ్ళీ పున్నమొచ్చింది. వాడి కట్టె కూడా కొట్టుకురాలేదింకా. అందుకే ఇంకా ఆశ.. వాడు తిరిగొస్తాడని. లక్ష్మి... దేవుడికి కట్టని ముడుపు లేదు. వాడి కోసం... వాడు వచ్చేవరకూ ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తానని మొక్కుగట్టింది.

      నేను టేకు చేప విషపు ముల్లు దెబ్బ తినింది వసంతపు తొలిరోజుల్లో. నాగి గాడు గల్లంతయ్యిందీ ఇప్పుడే. నేను తిరిగొచ్చింది బాద్రపదంలో. అంటే ఆర్నెల్లకి. నాగి తప్పిపోయి నెలైంది. మరెప్పుడొస్తాడు...? అసలు వస్తాడా...?

      ఇది కాదు అసలు సమస్య. రేపు నాగిగాడి పెళ్ళాం.. సూర్యకళకి ఇంకో పెళ్ళి చేస్తున్నాడు వాళ్ళనాన్న.  దానికి సూర్యకళ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం లక్ష్మికే కాదు నాకూ విపరీతంలా అనిపించింది.

      నేను తిరిగొచ్చేసరికి లక్ష్మి కూడా సూర్యకళలా వేరెవర్నో పెళ్ళి చేసుకుని ఉంటే...!?

      ఆ తరానికీ, ఈ తరానికీ బంధాల్లోని గాఢత పలచనయ్యిందని ముమ్మాటికీ అర్థమవుతోంది. అర్థంకానిదల్లా ఒక్కటే.. తరతరానికీ బంధం బంధనమైపోతుందా..? మాకు బంధం అందమైన అనుబంధం. మరి సూర్యకళ, నాగిలకి..? ఒకప్పుడు బంధంలో ఆప్యాయత ఉండేది. కట్టుబడుండడం, ఒకరికొకరం మాత్రమే శాశ్వతం అన్న భావనుండేది. కానీ ఇప్పటి బంధాల్లో ఆప్యాయతేది..? భార్యాభర్తల్లో చివరికి మిగిలేది 'నీకు నేను, నాకు నువ్వు మాత్రమే' అన్న ఆలోచన లేదసలు. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసెయ్యడం, ఎలా తోస్తే అలా మాట్లాడ్డం, చేసే ప్రతి పనిలోనూ 'నేను', 'నాకు' అనే స్వార్థం...! నాగి గాడితో పెళ్ళి కంటే జరిమానాగా వచ్చే డబ్బునే ఆశించడంలో, ఇప్పుడు నాగి తప్పి(చని)పోయి కనీసం సంవత్సరం కూడా గడవకుండా.. నెలరోజులకే మరో పెళ్ళి చేసుకోవడంలో అర్థమేంటి..? విదేశీ తిళ్ళు దిగుమతి అయినట్టే అక్కడి జీవనమూ దిగుమతి అవుతోందా...!

* * *

      ఆరుబయట చింత చెట్టుకింద నడుం వాల్చి, పున్నమి చంద్రుడ్ని చూస్తున్న నా ముఖం వైపు ఏదో అడగాలన్నట్టు చూస్తున్న లక్ష్మి మనసులోని ప్రశ్న నాకు తెలుసు.

      'తర్వాతెప్పుడో... నాగి వస్తే...???'

(ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సెప్టెంబరు 2011 సంచికలో ప్రచురితం)
Comments