పువ్వురాలు కాలం - అమ్మంగి వేణుగోపాల్

    కొత్తగా వచ్చిన టీచర్ అటెండెన్స్ తీసుకుంటూ..."రోల్ నెంబర్ నైన్ సుమ" అని పిలిచేసరికి, రెట్టింపు ఉత్సాహంతో "ఎస్ టీచర్" అన్న జవాబు వినిపించింది. పద్మ వెంటనే లేచి "సుమ కాదు టీచర్, ఎస్.ఉమ" అంటూ సవరించింది. "ఓఐసీ" అని పెన్నుతో ఎస్‌కు పేరుకు మధ్య స్పష్టంగా చుక్క పెట్టి ముందుకు సాగింది. ఉమ పద్మను మోచేత్తో డొక్కలో పొడిచి కొరకొర చూసింది. పద్మకు అదీ సంబరమే!

    కలువకుంట హైస్కూలులో పదో తరగతి చదువుతున్న ఉమకు పూలంటే పిచ్చి ప్రేమ. తమ ఇంటి చుట్టూ విశాలమైన ఖాళీ జాగాలో రకరకాల పూల మొక్కలు, పూలతీగలు పెంచుకుంటూ పూలలో పూవై పోయింది. అయితే తన పేరుకు పువ్వనే అర్థం లేనందుకు ఎన్నిసార్లు దుఃఖించిందో. గత పదిహేను రోజులుగా తన పేరు 'సుమ'గా మార్చమని కాల్స్‌టీచర్‌కు మొర పెట్టుకుంటూ వస్తోంది. క్లాసులో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు ఉమను టీచర్లంతా అభిమానిస్తారు కాని, పేరు దగ్గరకు వచ్చేసరికి కుదరదంటారు. కూతురు పోరు భరించలేక ఆ మరుసటిరోజు లక్ష్మమ్మ కూడా హైస్కూలుకు వచ్చి హెడ్‌మాస్టర్‌ను ప్రాధేయపడింది.

    "కుదరదమ్మా. రేపు పబ్లిక్ పరీక్షలు రాసే అమ్మాయి. ఇప్పుడు పేరు మార్చలేం" అని హెడ్‌మాస్టరు తేల్చి చెప్పేశాడు. ఉమ ఏడ్చింది. స్నేహితురాళ్ళ్కు మొహం చూపించలేక మిగతా క్లాసులు - అందులో తనకు ఇష్టమైన చారి సారు తెలుగు క్లాసును కూడా - వదిలేసి తల్లితో ఇంటికి వచ్చేసింది. పూలను ప్రాణాధికంగా ప్రేమించే అమాయకామైన అమ్మాయికి తన పేరుకు పువ్వు అనే అర్హ్తం లేకపోవడం ముల్లై బాధ పెడుతోంది. 

    బతికున్న తల్లినీ, చనిపోయిన తండ్రినీ తిట్టుకుంటూ తల్లి తొడమీద తల పెట్టి పడుకుంది. తోటలోని పూల పరిమళాలు సోకినప్పుడల్లా రకరకాల పూలు వచ్చి తన ముఖాన్ని నిమురుతున్నట్టుంది ఉమకు. కాని, ఆమె లోలోన ముళ్ళు తొలుస్తున్నప్పుడు పూలేం చేస్తాయి?

    'నిద్ర పట్టింది బిడ్డకు మనసు నెమ్మదిస్తుంది' అనుకుని కాలు తిమ్మిరెక్కినా కదలకుండా కూర్చుంది. కాసేపటికి ఉమ శరీరంలో చిన్న వణుకు ప్రారంభమైంది. నీటి గుంటలో రాయి వేస్తే అన్ని వైపులకూ అలలు వ్యాపించినట్టుగా ఆ వణుకు శరీరమంతా వ్యాపించింది. 'అమ్మ...ఎద్దు...బాయి' అంటూ పండ్లు కొరుక్కుంటూ, రెండు పిడికిళ్ళు బిగించింది. ఆ మాటలు లోతైన బావిలోనుంచి వస్తున్నట్టుగా వున్నాయి.

    'పోయింది అనుకున్న జబ్బు చాలా యేండ్లకు కనిపించింది' అనుకుని దగ్గరలోని దిండుపైకి బిడ్డ తలను చేర్చి, బ్లాంకెట్ కప్పింది. ప్రేమగా చెయ్యేసి పడుకుంది. భర్త గుర్తుకొచ్చి ఏడ్చింది. బాధ్యతలు ఎక్కువసేపు ఏడవనీయవు. లేచి పాలు వేడిచేసింది. ఉమకు మెలకువ రాగానే వేడి వేడి పాలు తాగించింది. పొద్దున అరవిచ్చిన బంతులు ఇప్పుడెంతగా విచ్చుకున్నాయో చూడాలనిపించినా, సోమరిగా పడుకుంది.

* * *

    సంతోషం కలిగించే విషయాలకన్నా విచారం కలిగించే విషయాలకే నేపథ్యం ఎక్కువగా వుంటుంది. ఏడేళ్ళ క్రితం ఒక రోజు ఉదయం ఇంటి ముందు నుండి పశువులు వెళ్తుంటే -

    "ఉమా, వీటి వెంట పోయి పేడ పట్టుకునిరా బిడ్డా. రేపు చానిపికి లేదు" అంటూ తట్ట ఇచ్చి తరిమింది తల్లి. ఉమ వాటి వెంట ఫర్లాంగు దూరం వెళ్ళింది. హఠాత్తుగా ఎద్దు, ఆవు కుమ్ములాడుకుంటూ దుమ్ము రేపాయి. భయపడ్డ ఉమ కుడివైపుకి పరిగెత్తి పెద్ద గొయ్యిలోకి జారిపోయింది. అదృష్టం బాగుండి ఆమె చేతికో తీగ దొరికింది. దాన్ని పట్టుకుని వేలాడుతూ "అమ్మా... ఎద్దు... బాయి" అంటూ ఏడుస్తూ ఉండిపోయింది. అది గమనించిన పశువుల కాపరి తీగతో పాటు ఉమని పైకిలాగాడు. అంతే, ఎద్దే తనను తరుముతున్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని వాటేసుకుని ఏడవసాగింది. గీరుకుపోయిన చేతులకు, కాళ్ళకు తల్లి ఆయింట్‌మెంట్ పూసింది. ధైర్యం చెప్పి అన్నం తినిపించి పడుకోబెట్టింది. ఉమ నిద్రలోకి జారుకుంటూండగానే వణుకు వచ్చి ఏదో గొణిగింది. లక్ష్మమ్మ బ్లాంకెట్ కప్పింది. కొద్దిసేపటి తర్వాత బిడ్డ కదలడంతో వేడి పాలు తాగించింది. నెమ్మదించిన తర్వాత డాక్టరుకు చూపించింది. 

    "బాగ భయపడ్డట్టుంది. జ్వరం కూడా వుంది. మనస్సు బాధపడకుండా చూడండి" అంటూ మందులు రాసిచ్చాడు. ఉమ తన తోటి పిల్లలతో ఆటల్లో పడ్డ తర్వాత, లక్ష్మమ్మ పొరిగింటామెను తోడుగా తీసుకుని కూతురు పడిపోయిన గొయ్యిని చూసింది. అది ఒకప్పుడు బావే. నీళ్ళు లేకపోవడంతో ఊరువాళ్ళు కసువు, పనికిమాలిన సామాను వేస్తూ రావడంతో ముప్పాతిక భాగం నిండిపోయింది. 

    "మల్లెతీగ బలంగా వున్నందుకు బిడ్డను బావిలో పడకుండా కాపాడిందే లక్ష్మమ్మా! ఈ తీగను మీ పెరట్లో నాటుకో" అని సలహా ఇచ్చింది పొరిగింటామె. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బలంగా వున్న కొమ్మను విరిచి తెచ్చి తన పెరట్లో నాటుకుంది. బిడ్డతో పాటు తీగ పెరుగుతూ పందిరి అల్లుకుంటూ వుంటే లక్ష్మమ్మ సంతోషించింది. తన ప్రాణదాత పూలను కూడా పూస్తున్నందుకు ఉమ ఆనందానికి ఎల్లలు లేవు. మరో ఇరవై దాకా పూలమొక్కలు ఉమ వేసుకోగా, దొండ, టమాటా, పొట్ల వంటివి లక్ష్మమ్మ వేసుకుంది. నీళ్ళకు కొరత లేదు. వాళ్ళ బావి ఎండాకాలంలో కూడా ఎండిపోదు.

    ఉమ పసిగుడ్డుగా వున్నప్పుడే తండ్రి గుండెపోటుతో పోయాడు. అప్పట్నించి లక్ష్మమ్మలో పిరికితనం ప్రవేశించింది. భర్త పెన్షన్ డబ్బుతో గుట్టుగా సంసారం గడుపుకొస్తున్న లక్ష్మమ్మ అంటే పొరుగింటామెకు సానుభూతి. ఉమ అంటే ప్రేమ. 

    "ఆ మహారాజే వుంటే నాకీ కష్టాలుండేవా" అని కన్నీరు పెట్టిన లక్ష్మమ్మకు ధైర్యం చెప్పింది. మండల్‌లో వుండే మంచి డాక్టరుకు చూపించింది పొరుగింటామె. ఆయన చెప్పినన్ని రోజులు ఆ మందులే ఉమకు వేసింది లక్ష్మమ్మ.

* * * 

    ఇంగ్లీషు ప్రశ్నలకు జవాబుల్ని ఉమతో కలిసి పల్లె వేయటానికి పద్మ వచ్చింది. ఉమ క్లాసులో వదిలేసి వచ్చిన బ్యాగు కూడా పట్టుకొచ్చింది. ఉమ పక్కనే అదే దిండు మీద తల వాల్చి స్నేహితురాల్ని ముఖాన్ని తన వైపు తిప్పుకుని -

    "ఈరోజు చారీ సారు ఏమన్నాడనుకున్నావ్?" అనడింది. 

    "ఏమన్నాడే?" అంది ఉమ. 

    "పేరు మారలేదని ఉమ బాధపడుతోంది కదా. అమ్మాయిలూ మీరంతా ఈ రోజు నుండి ఉమను 'సుమ'అని పిలవండి" అన్నాడే.

    ఉమలో ఉత్సాహం రాజుకుంది. "నిజంగా" అని లేచి కూచుంది. పద్మ నృత్య భంగిమలో నిలబడి "కాదు సుమా, కల కాదు సుమా" అంటూ గంతులు వేసింది. ఉమ ముఖం గులాబీలా వికసించింది.

    ఆ మరునాటి నుండి అమ్మాయిలంతా 'సుమసూయలు' ప్రదర్శించకుండా 'సుమా'అని పిలుస్తూ వచ్చారు. ఈ పిలుపు ఉమకు సంతృప్తినిచ్చింది. 

    తెలుగు పండితుడు చారి గత సంవత్సరమే బదిలీ మీద ఆ స్కూలుకు వచ్చాడు. డొక్క శుద్ధి వున్నవాడు. పద్యాలు రాగయుక్తంగా పాడి, బాగా వివరించేవాడు. రోజూ ఏదో ఒక పూల డిజైన్ వున్న రంగు రంగుల వస్త్ర ధారణతో ఉమ క్లాసుకు రావడం ఆయన్ని ఆకట్టుకుంది. అప్పుడప్పుడు నవ్వుతూ వ్యాఖ్యలు చేసేవాడు. వాటిలో సహృదయతే వుండేది. అవి ఉమను గిలిగింతలు పెట్టేవి. ఒకరోజు ఉమ కనకాంబరం పూల లంగా, జాకెట్టు వేసుకుని ఎర్రంచు తెల్ల వోణితో వచ్చింది. 

    "మీ స్నేహితురాలు ఈరోజు ఎలా వుందో చెప్పమంటారా?" అనడిగాడు చారీ సారు. "చెప్పండి సార్" అన్నాయి గడుగ్గాయి గొంతులు. దీంతో ఉమ చుట్టూ ఒక అత్తరు వలయం కమ్ముకుంది. 

    "అగ్ని పరీక్షా సమయంలో సీతమ్మ కనకాంబరాల కుప్ప మీది మల్లె చెండులా వుందని కవి వర్ణన. మీ ఫ్రెండు ఈ రోజు అలా వుంది" అని తను నవ్వి నవ్వించాడు.

    ఒకరోజు సాయంత్రం "మీ ఇంటికి ఏదైనా పువ్వు పేరుపెట్టుకుంటే..."అంటూ ఆగింది పద్మ. "భలే ఐడియా. మరి పేరు?" అడిగింది ఉమ. వాళ్ళ వాదనలో అది తేలకపోవడంతో మరునాడు ప్రేయర్ కాగానే చారీ సారును అడిగారు.

    "మరో పేరెందుకు. 'సుమాంజలి' అని పెట్టుకోండి" అని స్టాఫ్ రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ పేరు వినీ వినడంతో అన్ని పువ్వుల పరాగం పౌడరుగా మారి తనను ఉక్కిరిబిక్కిరి చేసినట్లనిపించింది ఉమకు. తెలిసిన పెయింటర్‌తో గేటు మీద ఆ నాలుగక్షరాలు వ్రాయించి ఆ అక్షరాల చుట్టూ పూల బార్డర్ వేయించింది. 

    ఉమ ఇంటర్‌కు వచ్చేసరికి తోట బాగా పెరిగింది. తోటతో పాటు ఉమ పూల పిచ్చి కూడా. ఇప్పుడు రకరకాల గులాబీఅలు, మల్లెలు, మందారాలు, కనకాంబరాలు,గన్నేరులు ఉన్నాయి. బంతులు చేమంతుల వంటివి సరేసరి. గేటుకు రెండువైపులా సమానమైనా ఎత్తులో పెరిగేటట్లు జాగ్రత్తలు తీసుకున్న ఆకాశమల్లె చెట్లు ఇప్పుడు చేతికందనంత ఎత్తుకు ఎదిగాయి. ఒక రోజు ఉదయం పళ్ళు తోముకుంటూ పైకి చూసేసరికి ఎడమవైపు ఒకచోట గుత్తులుగా మొగ్గలు కనిపించాయి. ఉమ సంతోషానికి ఇక ఆకాశమే హద్దు. ఉమ కోపపు చూపులు భరించలేక రెండో చెట్టూ నెలలోపే పూలు పూసింది. పద్మ ఆ చెట్లకు జయవిజయులని పేరు పెట్టింది. 

    ఒక ఆదివారం రాగానే -

    "పద్మా తెల్లవారు జామున నాకో కల వచ్చిందే" అంది.

    "ఆ కలలో మళ్ళా చారీసారు వచ్చాడా ఏం?" అడిగింది పద్మ.

    "ఛీ! ఎప్పుడూ వస్తాడా. అది కాదే. మన పేర్లను భూమ్మీద రాసి, ఆ అక్షరాలలో నువ్వు బంతినారు నేను చేమంతి నారు నాటుకున్నామట!" అంది.

    "అరే, భలే కల. కలను నిజం చేద్దాం పద" అంటూ స్థలం ఎంపిక చేసి, "తెలుగా? ఇంగ్లీషా?" అనడిగింది పద్మ.

    "పాడు తెలుగైతే బోడి రెండక్షరాలే కదా. ఇంగ్లీషైతే నాకు నాలుగు, నీకు ఐదు - లక్కీ" అంది ఉమ. వాతావరణం సృజనాత్మకంగా ఉన్నప్పుడు అది కలల్లోకి కూడా పూలతీగలా పాకుతుందనడానికి ఇంకేం రుజువు కావాలి?

    టౌనులో వుండే దొడ్డమ్మ ఉమ వాళ్ళింటికి వచ్చింది. పొట్లకాయల కొసలకు చిన్న రాళ్ళు కడుతున్న లక్ష్మమ్మను పలుకరించింది. దొడ్డం పెండ్లిళ్ళ పేరమ్మ కూడా. "లక్ష్మమ్మా ఏదే నీ బిడ్డ. దాని పేరే మరిచిపోయా" అంటూ గడపలో అడుగుపెట్టింది. కుర్చీని దొడ్డమ్మ దగ్గరగా జరిపి -

    "అదిగో మల్లెపందిరి కింద వుంది చూడు ఏదో రాసుకుంటూ. పేరు ఉమ" అంటూ "ఉమా దొడ్డమ్మ వచ్చింది ఇటురా. కాళ్ళకు మొక్కి ఆశీస్సులు తీసుకో" అంది. ఉమ అయిష్టంగానే ఆ పని అయిందనిపించింది. నఖశిఖపర్యంతం ఉమను పరిశీలనగా చూసింది దొడ్డమ్మ.

    "మొగవాళ్ళు కూడా ఇట్లా చూడరు" అనుకుంది. డ్రాయింగు బుక్కులో వేస్తున్న పూల బొమ్మలకు ఫుల్‌స్టాప్ పెట్టి పద్మ వాళ్ళింటికి వెళ్ళిపోయింది. 

    "మీ ఉమకు మంచి సంబంధం తెచ్చానే లక్ష్మమ్మా. పిల్లవాడు బిజినెస్‌లో పది పదిహేను వేలు సంపాదిస్తున్నాడు. ఒక్కడే కొడుకు. నువ్వు ఊ అంటే నాలుగు రోజుల్లో వచ్చి చూస్తారు" అంది దొడ్డమ్మ. ఆ మాటలు వినగానే దొడ్డమ్మను మించిన ఆత్మీయులెవరూ ప్రపంచంలో లేరనిపించింది. కలువకుంట వూళ్ళో తమ కులం ఇళ్ళూ రెండే. బంధుత్వాలు ఎక్కడెక్కడున్నాయో లక్ష్మమ్మకు తెలియదు. మగదిక్కులేని ఆమెకు దొడ్డమ్మే గతి అయింది. 

    విషయం పసిగట్టి తాను డిగ్రీ చదువుతానని, పెండ్లి చేసుకోనని ఉమ మొండికేసింది. తల్లి తన నిస్సహాయ పరిస్థితిని వివరించి, పెళ్ళయిన తరువాత కూడా చదుకోవచ్చని నచ్చజెప్పింది. 

    అత్తవారింట్లో అడుగుపెట్టగానే ప్లాస్టిక్ మామిడాకుల తోరణాలు ఉమకు స్వాగతం చెప్పాయి. లోని గదుల ద్వారబంధాలకు ప్లాస్టిక్ పూల దండలు మెరుస్తున్నాయి. పూలు తన అత్తకు పనికిరావు. సరే, వచ్చిన ముత్తయిదువుల కోసం కూడా పూలు తెప్పించలేదు. రాత్రి శోభనం గదిలో అడుగుపెట్టగానే ముందుగా పందిరి మంచాన్ని చూసింది. ఒక్క పువ్వుంటే ఒట్టు!

    ఉదయం లేచి తలస్నానం చేసి కిటికీలోంచి చూడగానే దూరంగా పూల కుప్పలాంటిది కనిపించింది. విప్పారిన ముఖంతో తలుపు ఓరగా తెరిచి చూస్తే అది కంకర రాళ్ళకుప్పగా తేలటంతో నిరాశ కలిగింది. శ్రీశైలం బిజినెస్ చేస్తాడంటే ఏం బిజినెస్సో అనుకుంది. కాని ఆయన చేస్తున్నది కంకర, గ్రనైట్ రాళ్ళు, ఇసుక వ్యాపారమని తెలిసి కొయ్యబారిపోయింది.

    ఈ ఐదారు నెలల్లో అత్త ఎప్పుడూ ప్రేమగా మాట్లాడింది లేదు. శ్రీశైలం రాళ్ళమ్మితే వచ్చిన లాభాలను గూర్చి చెప్పేవాడు. ఆ లాభాలు నష్టాలేననిపించేది ఉమకు. ఉమ తనను డిగ్రీలో చేర్పించమని అడిగింది. వీలు కాదన్నాడు. పోనీ ఏదైనా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తానంది. 

    "అమ్మనడుగు" అంటూ రాళ్ళు, కంకర నింపించుకున్న లారీ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. అత్తనడిగితే -

    "ఆ రంగు రంగుల చీరలు కట్టి మన సింగారం పదిమందికి తిప్పుతూ చూపించుకోవడానికే కదా" అంది. ఉమ కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. సున్నితమైన మనసున్న వారికి కత్తిపోటు కన్నా కర్కశ వాక్కే ఎక్కువ గాయపరుస్తుంది. 

    ఒకసారి పద్మ ఫోన్లో మాట్లాడుతుండగా, అత్త ఫోన్ లాక్కుని "అమ్మాయ్, నీకు పనీపాటా లేదా పెట్టేయ్" అని గద్దించింది. అత్త మాటలు పూలను రాళ్ళతో కొట్టినట్టుండేవి. అత్త మాట్లాడే ఒక్కో కటువైన మాట ప్రభావంతో అక్కడ తన తోటలోని ఒక్కో పూల మొక్క వాడిపోతున్నదేమోనన్న చిత్రమైన ఆలోచన వచ్చి భయపడేది.

    ఒకరోజు సాయంత్రం ఏదో అరుపు వినిపిస్తే ఉమ గేటు దగ్గరకు వెళ్ళింది. మల్లె మొగ్గలు! కళ్ళ కరువు తీరింది. ఐదు రూపాయల బిళ్ళ ఇచ్చి మొగ్గలు కొనుక్కుంది. డబ్బిచ్చి పూలు కొనుక్కోవడం అదే మొదటి సారి. అది చూసిన అత్త -

    "పూలు పెట్టుకుంటే కడుపు నిండుతుందా? కాలు నిండుతుందా? డబ్బులు దుబారా చెయ్యొద్దు" అంది గట్టిగా. ఉమ ఉండబట్టలేకనో, చేతిలోని మల్లె మొగ్గలిచ్చిన బలం వల్లనో ధైర్యం తెచ్చుకుని - " ఇది మా అమ్మ ఇచ్చిన డబ్బే" అంది. 

    "ఆ ఇచ్చింది మహా! ఆ దరిద్రపు గొట్టుదిచ్చిన కట్నంతో నేను అంతస్థులు కట్టుకున్నా" అని ఎత్తి పొడిచింది. గదిలోకి వెళ్ళి ఏడ్చింది ఉమ. గుప్పిట్లోని మల్లెమొగ్గలు చీము నిండిన పుండ్లలా కనిపించాయి. వణుకు వచ్చేసింది. ఏదో గొణుక్కుంటూ మంచం మీద పడిపోయింది. అత్త గమనించిందే కాని, మొదట్లో పట్టించుకోలేదు. కాని ఏదో అనుమానం వచ్చి వెంటనే టీ చేసుకుని వచ్చి కప్పు నోటికందించింది. అది తాగి అట్లే సోమరిగా పడుకుంది. శ్రీశైలం రాగానే -  

    "నీ పెళ్ళాం నెల తప్పిందో ఏమోరా. డాక్టరుకి చూపించు" అంది. శ్రీశైలం టూ వీలర్ మీద ఉమను ఎక్కించుకుని హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళాడు. తల్లి ఆశించిందేమీ లేదని తేలిన తర్వాత ఏమనిపించిందో ఏమో అట్నుంచి సినిమాకి తీసుకెళ్ళాడు. పెళ్ళి తర్వాత వాళ్ళు చూస్తున్న సినిమా అది. ఉమలో కొంచెం ఉత్సాహం పెరిగింది. సినిమాలో హీరో హిరోయిన్లు తోటలో డ్యూయెట్ పాడుతున్న సీనులో శ్రీశైలం హీరోయిన్ అందాల ఆరబోతను చూస్తుంటే, ఉమ మాత్రం "మనకూ చిన్న తోట వుంటే బాగుండేది" అంది. "పట్నంలో ఎలా కుదురుతుందే పిచ్చి మొహమా" అన్నాడు. సినిమా నుండి రాగానే కొడుకుతో - 

    "దీన్ని తీసుకుని అట్లా వెళ్ళావో లేదో నాలుగైదు ఫోన్లు వచ్చినై. దర్గా నుంచి మునీర్‌సాబంట. మున్సిపాలిటీ సాంబయ్యంట. మరో ఇద్దరెవర్తు లేదు. ఆ ఆర్డర్లన్నీ పోయినట్టేనా?" అంది. కొడుకును సినిమాకి లాక్కుపోయింది కోడలేననుకుని కొరకొర చూసింది. ల్యాండ్‌ఫోన్ లాభం లేదనుకుని శ్రీశైలం సెల్‌ఫోను కొనుక్కున్నాడు.

    కోడలికి విశేషమేమీ లేదని తెలిసిన తర్వాత అత్తకు అనుమానాలు కలుగసాగాయి. బెడ్డు మీద వణుకుతూ పడిపోవడానికి కారణం ఆమెకు అంతు బట్టలేదు. ఇంటి చుట్టూ చిమెంటు గచ్చు వుంది. ఒక్క అంగుళం కూడా ఖాళీ జాగా లేదు. ముంగిట్లో తాను వేసే ముగ్గులోనే ఉమ పూలాను చూసుకుని మురిసేది. రాతి చుక్కల ఆకాశం తోటలాగా కనిపించేది. 

    "నాలుగైదు తొట్లు తెచ్చిస్తే పూల మొక్కలు పెంచుకుంటా" అంది భర్తతో. ఇది రెండోసారి అడగటం. "నీళ్ళ షార్టేజీ వుందే. వానలు పడనీ. చూద్దాం" అంటూ ఇసుక లోడ్ చేయించుకుని లారీతో వెళ్ళిపోయాడు. 

    మరో నాలుగు నెలలు గడిచి వుంటాయి. దుర్భరంగా నడిచే కాలం గడియారం ముళ్ళ మీదుగా కాక రంపం పళ్ళ మీదుగా నడుస్తోంది. ఇట్లాగే మరికొంత కాలం గడిస్తే తాను రాతి బొమ్మగా మారటం ఖాయం అనిపించింది ఉమకు.

    ఒకరోజు తల్లి వచ్చింది. తల్లిని చూడగానే ఉమకు ప్రాణం లేచి వచ్చింది. తల్లి తనను దగ్గరకు తీసుకోగానే తోటగాలి గుప్పుమంది. తల్లి తెచ్చిన  పూల బుట్టను చూడగానె కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. అత్తవారింట్లో తన బిడ్డ సుఖంగా లేదనిపించింది. పలకరింతలైన తర్వాత -

    "పండుగకు అల్లుణ్ణి, కూతుర్ని తీసుకుపోదామని వచ్చా"నంది వియ్యపురాలితో.

    "నీ కూతురు నీ ఇష్టం. అబ్బాయికి వీలు కాదు. కొత్త ఇండ్లు కడుతుంటారు గదా. మెటీరియల్ సప్లై వుంటుంది. నాలుగు రాళ్ళు వెనకేసుకునే సీజన్" అంది. 

    "ఒక్కపూట వీలు చేసుకుని వచ్చినా బాగుండేది వదినా" అంది లక్ష్మమ్మ.

    "అది సరే నీ కూతురుకి మూర్ఛ రోగముందా?" అంది.

    లక్ష్మమ్మ గుండె గుభిల్లుమంది. కొత్తకాపురం ముచ్చట్లు మురిపాలతో తన బిడ్డ సంతోషంగా వుందనే భావనలో అసలామె ఆ సంగతే మరిచిపోయింది. 

    "మూర్ఛరోగమా? లేదే, ఎప్పుడూ లేదు" అంది.

    ఉమకు అంతా గందరగోళంగా వుంది. 'తనకు మూర్ఛ రోగమేమిటి?' అనుకుంది ఉమ. అల్లుడు లేకుండా బిడ్డను తీసుకుపోవటం బాగుండదని లక్ష్మమ్మ నిర్ణయించుకుంది. కూతురితో ముక్తసారిగా మాట్లాడింది. భర్త లేకుండా ఊరికి రావద్దంటూ, ఎవరో తరుముతున్నట్టు బయటపడి బస్టాండు చేరింది. 'దాని కడుపున ఒక కాయ కాస్తే అంతా అదే సర్దుకుంటుంద'ని తనకు తానే నచ్చజెప్పుకుంది. 

    "దొంగకు తేలు కుట్టినట్టు ఎట్లా పోయిందో చూడు మీ అమ్మ" అన్న అత్త మాటలు ఉమ చెవుల్లో గింగురుమనసాగాయి. 

    కాలం గడుస్తూనే వుంది. ఒక రోజు పొద్దున్నే గతమంతా గుర్తు చేసుకుంటుంటే ఉమకు ఏడుపు తన్నుకొచ్చింది. 

    "ఏమే, ఎందుకా దొంగ ఏడ్పు. మేమేం రాచి రంపాన పెడుతున్నామా? కోడలివనుకుంటే కొరివిదయ్యానివయ్యావు" అంది.

    ఎట్లాగో తమాయించుకుని చీపురు తీసుకుని బయటకు నడిచింది. ఊడుస్తుంటే తన గాజుల చప్పుడే సంకెళ్ళ చప్పుడు లాగా వింపించసాగింది. హఠాత్తుగా ఒకచోట ఆగిపోయింది.  గోడ రాళ్ళ మధ్యలో నుంచి మొలుచుకు వచ్చిందో గడ్డి మొక్క. దానికి పూసిన చిన్నారి నీలం రంగుపూలను చూస్తూ అక్కడే కూర్చుండి పోయింది.

    "ఏమే అట్లా కూర్చున్నావ్ రాయిలాగా" అన్న అత్త మాటలు పిడుగుల్లా  పడటంతో పడడంతో శరీరం వణకసాగింది. ఏదో గొణుక్కుంటూ వెనక్కు ఒరిగిపోయింది. తల్లీ కొడుకులు మెల్లగా నడిపించుకుపోయి మంచం మీద పడుకోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఉమ లేచి కూర్చుంది. 

    "దీనికి మూర్ఛరోగం వుందిరా" కొడుకుతో నిర్ధారణగా అంది. అంతే కాదు, "దీనికి విడాకులిచ్చి రెండో పెళ్ళి చేసుకో" అని కటువుగా సలహా ఇచ్చింది.

    'విడాకులు', 'రెండో పెళ్ళి' అన్న శరాఘాతాలతో ఉమ మళ్ళీ పడిపోయింది. రెండురోజుల తర్వాత ఉదయమే లక్ష్మమ్మ దొడ్డమ్మతో కలిసి వచ్చింది. ఉమ అత్త ఇద్దరినీ ఉతికి ఆరేసింది. లక్ష్మమ్మ ఏదో మాట్లాడబోతుంటే నోరు మూయించింది. మళ్ళీ తన గడప తొక్కవద్దని ఉమను ప్రత్యేకించి హెచ్చరించింది. ఏడుస్తున్న ఉమను ఓదార్చడానికి శ్రీశైలం ప్రయత్నించలేదు. కంకర లోడ్ వేయించుకుని ఎటో వెళ్ళిపోయాడు. 

    బస్సెక్కే ముందు ఉమ భర్త సెల్‌కు ఫోన్ చేసింది.

    "నేను వెళ్ళిపోతున్నా" అంది.

    "సరే" అన్నాడు.

    "మీరు రండి" అంది.

    "ఇప్పట్లో వీలు కాదు" అన్నాడు.

    "ఒక్క పూట కోసం"

    "సరే" అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తుందేమోనని సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇంటికి వచ్చి తిని ఒక కునుకు తీసి, గ్రనైట్ రాళ్ళు లోడ్ చేయించుకుని దర్గా చేరుకున్నాడు. కాళ్ళు కడుక్కుని 'దర్గాబాబా' వుంటున్న గదిలోకి నడిచాడు. రోజూ దర్గాబాబా కోరిన భక్తులకు చిన్న రాయి మంత్రించి ఇస్తారు. దాన్ని ఆ రాత్రి దిండుకింద పెట్టుకుని నిద్రపోతే కోరిన కోరిక తీరుతుందని నమ్మకం. తల్లి రెండో పెళ్ళి అన్నప్పటి నుంచి శ్రీశైలంలో చిన్న ఆశ పొటమరించింది. దర్గాబాబా మంత్రించి ఇచ్చిన రాయిన షర్టు జేబులో వేసుకొని బయటకు వచ్చాడు. 

    పదకొండు దాటిన తరువాత వాళ్ళు ముగ్గురూ ఆటోలో ఇల్లు చేరుకున్నారు.

    ఆకురాలు కాలం. సగం చెట్లకు పూలున్నాయి. ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి నదిని చూసినట్లుగా ఉమ తోటను చూడసాగింది. మెల్లగా ప్రాణదాత మల్లెతీగ కిందికి వెళ్ళి దాని మొదలును కావలించుకుంది. 

    "దొడ్డమ్మా నా బిడ్డ గతి ఎట్లా?" అడిగింది లక్ష్మమ్మ కంట నీరు కుక్కుకుంటూ.

    "దాని రోగం సగతెందుకు దాచావు?" అడిగింది దొడ్డమ్మ.

    "రోగమా? దాన్ని రోగమంటారా? ఏదో..." అనబోయింది. 

    "ఆ ఏదోలోనే ఉందంతా. నీ వియ్యపురాలు సామాన్యురాలు కాదు. తన కొడుక్కి విడాకులిప్పించి, రెండో పెళ్ళి చేసి తీరుతుంది" అంటూ వచ్చిన ఆటోలోనే వెళ్ళిపోయింది. 

    'విడాకులు','రెండో పెళ్ళి' అన్న మాటలు మళ్ళీ వినిపించడంతో ఉమ మొదలు నరికిన చెట్టయింది. మల్లెతీగను పట్టుకుని నిలబడ్డదల్లా 'అమ్మా' అంటూ పెద్దగా కేక వేసి నిలువునా వెనక్కి విరుచుకు పడి పోయింది. తల వెనకభాగం బండరాయికి బలంగా కొట్టుకోవటంతో రక్తం కారసాగింది. లక్ష్మమ్మ పరిగెత్తుకొచ్చింది. రక్తం చూసి బెంబేలెత్తిపోయి పొరుగింటామెను కేకేసింది. స్నేహితురాలు వచ్చిందని చూసిపోవటానికి వచ్చిన పద్మ పరిస్థితిని గమనించి డాక్టరుదగ్గరకు పరుగెత్తింది. పొరుగింటామె రక్తం తుడిచి ఉమకు కట్టు కట్టి, లక్ష్మమ్మను ఓదార్చసాగింది. 

    తలకు గాయం చేసిన బండరాయి ఎర్రమందారంలా మెరుస్తున్నది.

    అరగంటలో చావు వార్త అత్తవారింటికి చేరింది. ఉమ అత్త శ్రీశైలం సెల్ నెంబరుకు ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. లాభం లేదనుకుని ఒక మనిషిని పంపింది. ఆ మనిషి అక్కడా ఇక్కడా వెతుక్కుంటూ వెళ్ళి శ్రీశైలంను పట్టుకొనే సరికి మధ్యాహ్నం రెండు దాటింది. అనుకోని వార్తతో కొద్దిగా చలించాడు. 

    "ఈ రోజే సాయంత్రం చేస్తారట" అన్నాడు వచ్చిన మనిషి.

    తల్లితో మాట్లాడితే వెంటనే వెళ్ళమని చెప్పింది. బస్సయితే లాభం లేదనుకుని మునీర్‌భాయి 'యమహా' తీసుకొని బయలుదేరాడు.

    తెగదెంపులు చేసుకున్న వాళ్ళు ఏమొస్తారని లక్ష్మమ్మ అనగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పద్మ, ఇతర స్నేహితురాళ్ళు ఒక వైపు ఏడుస్తూనే ఉమకు స్నానం చేయించారు. పెళ్ళికూతురుగా అలంకరించిన చేతులతో ఇప్పుడూ అలంకరించారు. కలువకుంట ఊరంతా అక్కడే వుంది. ఐదు దాటిన తర్వాత ఊరేగింపుగా స్మశానానికి తీసుకుపోయారు. 

    శ్రీశైలం ముందుగా అత్తవారింటికి వెళ్ళాడు. బండికి స్టాండు వేసి తెరిచి వున్న గేటులోకి తొంగి చూశాడు. దున్నపోతొకటి మల్లెపందిరిని నేలమట్టం చేసి ఇతర పూల మొక్కల మీద ప్రతాపం చూపిస్తున్నది. దాన్ని కొట్టడానికి రాయేదీ కనిపించలేదు. ఒక కర్రముక్క కనిపించింది. బహుశా అది పాడెకట్టగా మిగిలిన కర్రముక్క. దాని అందుకోవడానికి కిందికి వంగాడు. జేబులోంచి ఏదో టప్పుమని కిందపడింది. అది బాబా మంత్రించి ఇచ్చిన రాయి. దాన్ని మరి ముట్టుకోలేదు. 

    స్మశానం ఎటో ఆయనకు తెలియదు. అటూ ఇటూ చూశాడు.ఎడమవైపు పూలు కురిసిన బాట ఒకటి కనిపించింది. బండి మీద బయలుదేరాడు. చక్రాల కింద నలిగిపోయిన పూలన్నీ పసర్లు కక్కుతున్నాయి. 

    చితికి నిప్పెవరుపెట్టాలన్న మీమాంసలో వాళ్ళున్నారు. 

    "అదుగో ఉమ మొగుడొచ్చాడు" అన్నారెవరో.

    "సమస్య తీరిపోయిందంటూ" పంతులు చివరి పనులు ప్రారంభించాడు. 

    శ్రీశైలం బండి దిగి మెల్లగా నడుస్తూ వెళ్ళాడు.

    పూలను పక్కకు జరిపి పద్మ అతనికి ఉమ ముఖం చూపించింది. 

    పసుపు పులిమిన ముఖం పొద్దు తిరుగుడు పువ్వులాగా వుంది. 

    అతని దుఃఖాన్ని లక్ష్మమ్మ రోదన అణచేసింది. 

    పద్మ తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుంది. 

    ఒకాయన శ్రీశైలం భుజం మీద నీళ్ళ కుండ పెట్టాడు.

    మరొకాయన బారెడు కట్టె అతని చేతికి అందించాడు.

    ఆ కట్టె చివర చిరుమంట. మోదుగ పువ్వులాగుంది.

(నవ్య దీపావళి ప్రత్యేక సంచిక 2012లో ప్రచురితం)                            
Comments