మనిద్దరమే కలిసి ఉందాం అమ్మ - రమాసుందరి

    
దాహం, దాహం…. మనసుకా? శరీరానికా? నోరు ఎండి పోతుంది. దాహం తీర్చుకోవాలి.

    ఎక్కడా నీరు లేదేంటి?

    తపన, అలసట తట్టుకోలేక పోతున్నా. 

    ఎందుకు అంతా నన్నే చూస్తున్నారు. ఏమైంది?
 
    ఇదేంటి నేను నగ్నంగా ఉన్నాను? అందరి చూపులు నన్ను అసహ్యంగా తడుముతున్నాయి? 

    పారిపోవాలి. వీళ్ళని  తప్పించుకొని. 

    ఎవరైన నాకు కప్పుకోవటానికి చిన్న ముక్కైన ఇవ్వకూడదా? ఎవరైన కాపాడకూడదా?”

     ఉలిక్కిపడి లేచాను. ఎ.సి మెత్తని చప్పుడు.  పక్క బెడ్ మీద పడుకొని  నా మీద కాలేసిన దీపూ కొద్దిగా కదిలాడు. కలలో కలిగిన జుగుప్స, అవమానం ఒంటిని చిన్నగా వణికిస్తున్నాయి. ఇలాంటి కల ఈ మధ్య తరచుగా వస్తుంది.  దుప్పటి మీదకు లాక్కొని  పక్కకు వత్తిగిల్లాను.  
కనుకొనకల్లోంచి నీరు. ఆ  రాత్రి  ఎవరికీ జవాబు చెప్పనవసరం లేని ఒంటరి కన్నీరు. వెలుతురికి ఘనీభవించి చీకటి మాటున కరిగిన కన్నీరు. ఏ సానుభూతి ఆశించని కన్నీరు. మనుషుల్ని లొంగదీసే ఆయుధంగా మారటానికి నిరాకరించిన కన్నీళ్ళు.  ఆత్మ గౌరవం కలిగిన నిఖార్సైన నా కన్నీరు. ఆ అర్ధరాత్రి కేవలం నా కోసం, నా ఉపశమనం కోసం మాత్రమే స్రవించాయి. ఉగ్గబట్టుకొన్నదుఃఖం, రోషం ; గొంతును, గుండెను జంటగా మండిస్తున్నాయి. పొద్దుటి నుండి... కాదు కాదు చాలా ఏళ్ళనుండి జరుగుతున్న సంఘటనలు… స్పష్టతకు రాని, తప్పొప్పులు నిర్ధారణ  ఇవ్వని గజిబిజి ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  

    ఎప్పటిలా ఈ రోజు పొద్దున కాలేజి‌కి వెళ్ళాక బాగ్ పడేసి చూస్తే టేబుల్ మీద ఉత్తరం. ఫోన్లు వచ్చాక ఈ ఉత్తరాల మాట మరిచిపోయి చాలా రోజులయ్యింది అనుకొంటూ తెరిచి చూస్తే అది ఒక ఆకాశరామన్న గారి నుండి . “మీ ప్రవర్తన బాగాలేదు. ఫలానా అతనితో ఎక్కువగా కనిపిస్తున్నారు. మీరు మంచి వాళ్ళే. మీ మంచితనాన్ని  ఆ ఫలానా వ్యక్తి వాడుకొంటున్నాడు.” వగైరా,వగైరా...  ఈ ఆకాశ రామన్న నా అభిమాని లాగున్నాడు.  సంస్కారవంతమైన మోరల్ పోలీసింగ్!  
 
    ప్రిన్సిపాల్ తో  ఏదో పని ఉండి ఆయన రూముకి వెళ్ళినపుడు, యధాలాపంగా ఈ విషయం ప్రస్తావించాను. కళ్ళద్దాలోనుండి ఆయన ఒక లౌక్యపు చూపు చూసి అటెండర్ ని టీ తెమ్మని  పంపించాడు. “మేడమ్, నిన్ను ఒక స్టూడెంట్ యూనియన్  వాళ్ళు మన కాలేజీకి  వచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావించి మాట్లాడారు. స్టూడెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారని అన్నారు. మేమంతా కలిసి వాళ్ళతో చాలా వాదించాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు చదువుకొన్నవాళ్ళూ,  వాళ్ళ గురించి వాళ్ళకు తెలుసు అని చెప్పాము” అన్నాడు. ఆయన ముఖంలో నిజాయితీ కనిపించింది. ‘మేమంతా’ అంటే హెడ్స్ అందరూ ఉన్నారన్నమాట.  
తల కొట్టేసినట్లు అనిపించింది. చర చర రూమ్ కి వచ్చేశాను. నిజంగా నా నడత అంత అసంబద్దంగా ఉందా?  

    అటెండర్ శ్రీను అలవాటుగా  మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఇతని కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని, అబ్బాయి తరఫు వాళ్ళు మొన్న కాలేజీకి వచ్చి రచ్చ చేసి వెళ్ళారు. అప్పుడు అతని మొహంలో  కనబడిన కుంగుబాటు ఇప్పుడు నా  మొహంలో  కనబడుతుందా?  “శ్రీను!” నా గొంతులో వణుకు నాకే వినబడింది. 

    “నేనూ  వున్నాను మేడంగారు నిన్న వాళ్ళు వచ్చినపుడు. వాళ్ళకు ఏదో ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందట. మీ గురించి కాలేజీ లో తెలియని వాళ్ళు ఎవరు చెప్పండి? అవేమీ పట్టించుకోకండి.” ఎంత దయతో చూస్తున్నాడు నా వైపు!

    క్లాసుకు వెళ్ళాలి. తప్పదు. అటెండెన్స్ తీసుకొని  ధైర్యం చేసి తల ఎత్తాను. ఫైనల్ ఇయర్ పిల్లలు. మూడేళ్ళ నుండి వీళ్ళ క్లాసుకు వస్తున్నాను. “మీరే సబ్జెక్ట్ తీసుకొన్నాన్యాయం చేస్తారు మేడమ్.” అంటారు.  చివరి బెంచ్ లో పొడవుగా కూర్చొని నేనేమైన చెబితే నోట్ చేసుకొందామని ఎదురుచూస్తున్న ఫణి  దీర్ఘంగా నన్ను చూస్తున్నాడు. పగలు క్లాసులకు వచ్చి, రాత్రుళ్ళు  పెళ్ళిళ్ళకు బాండ్ మేళం వాయించి కుటుంబానికి సాయం చేస్తాడు.  నా లాబ్ దగ్గర తచ్చాడి ఎవరూ లేరనుకొంటే నా దగ్గరకు వస్తాడు. అతని కష్టాలను వినడం తప్ప తను ఏమి సాయం చేయగలిగింది? నిన్నటి సంఘటన ఫణికి తెలుసా? తెలిసే ఉంటుంది. తెలిసాక  నా ముఖంలో  హ్యుమిలియేషన్ ని అర్ధం చేసుకోగలిగిన  పద్దెనిమిది ఏళ్ళ  వయసే కదా. తన కన్సన్ ఎలా చూపాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నట్లున్నాడు. ఈ పిల్లల జాలి చూపుల నుండి పారిపోవాలి. ఎవరో తరిమినట్లు క్లాస్ నుండి వచ్చేశాను. 

    లంచ్ లో కొలీగ్స్ కలిశారు. ఏదో తేడా. ఆ తేడాకి కారణం ఈ ఘటనా?  లేక ఫలానా వ్యక్తితో నా ప్రవర్తనా? లేక పోతే ఆ ఫలానా వ్యక్తికి వచ్చిన అవకాశం తమకు రాలేదనా? సూటిగా ఎవరితో చర్చించదలుచుకోలేదు. నా ఎదురుగా కూర్చొని ఏదో జోక్ వేసి నవ్వుతున్న శేఖర్ గారితో ఇంతకుముందు కాలేజ్ టైమ్ అంతా కూర్చొని ఎగ్జామ్స్ డ్యూటీ చేశాను. పక్కన కూర్చొని పెరుగు నాకుతున్న విష్ణు తన హిస్టీరిక్  భార్యగురించి  చెప్పినపుడు శ్రద్దగా విని సలహాలు చెప్పాను.ఇదిగో ఇక్కడ కూర్చొని  నా మొహం లోని ఫీలింగ్స్ దొంగచాటుగా  గమనిస్తున్న వెంకట్రావుకి అవసరం అంటే నా డి.ఎ. అరియర్స్ ఇంట్లో తెలియకుండా ఇచ్చాను. అప్పుడు ఎవరూ నన్ను ఆక్షేపించలేదే? ఒక్క రోజులో, ఒక్క ఉత్తరంతో నా బయట బతుకులో ఇంత మార్పా? ఆ ఫలాన మనిషి తో నేను చేసిన పుస్తకాల స్నేహానికి  ఇంత మూల్యమా? నా వ్యక్తిత్వాన్ని తూట్లు పొడిచి, నా ఉద్యోగ జీవితాన్ని భ్రష్టు పట్టించగల సత్తా అతనితో  కాలక్షేపానికి ఉందా? ఎందుకో నమ్మ బుద్ది కావటం లేదు.  రోజుకి ఒకటి రెండు మాటలు కంటే ఎక్కువ మాట్లాడని శ్రీనుకి  నా పట్ల ఉన్న అంచనా గంటలు కొద్దీ హస్కువేసే వీళ్ళకు లేదా?

    అన్యమనస్కంగా ఫోన్ ఎత్తాను. అవతలి వైపు రాజు. జరిగింది చెప్పాను… తామరాకు మీద నీటి బొట్టులా, ఎవరి విషయమో చెబుతున్నట్లు.  “నాకూ వచ్చింది లెటర్. “ మెల్లిగా చెప్పాడు.  ఇంకొక షాకు. కారును వేగంగా ఇంటి వైపు పరిగెత్తిస్తుంటే ఒక శంక మెల్లిగా నా బుర్రలో  తొలుస్తోంది. 

    ఆరు సంవత్సరాల క్రితం మా యూనియన్ ఎలెక్షన్స్ లో పోటీ చేయాలని ప్రపోజల్ వచ్చింది. రాజు కూడ ఎంకరేజ్ చేశాడు. తను చేసే బాంక్ ఉద్యోగం లీవ్ పెట్టి; కాంపెయినింగ్ కి , కౌంటింగ్ కి బయలుదేరితే వద్దన్నాను. చివరికి కమిటీ సమావేశాలకు కూడా నాతో వస్తానన్నాడు. తను ససేమిరా ఒప్పుకోలేదు. అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది కదా నాకు. నా మీద ఎక్స్ పెక్టేషన్స్  పెరిగాయి. ఎప్పుడూ బయట వ్యక్తులకు స్వయంగా ఫోన్ చేయటానికి ఇష్టపడని  నేను, గంటల కొద్ది ఫోన్ లో మాట్లాడాల్సి వచ్చింది.  ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ చుట్టూ పక్కలే తచ్చాడేవాడు. 

    “ఎందుకంత అసహనం నీకు ?” నిలదీసాను  ఒక రోజు.

    “గంటల కొద్దీ ఏముంటాయి మాటలు?”

    “మొన్న మీ బాంక్ యూనియన్ లో ఏదో  గొడవ అయితే రోజంతా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నావు. నాకు మాత్రం మా యూనియన్ పాలిటిక్స్ షేర్ చేసుకోవాలని ఉండదా?” అడిగాను.

    ఈ తగాదాలు చిలికి చిలికి కామన్ ఫ్రెండ్స్ వరకూ వెళ్ళాయి. 

    “ఫోన్ అయితే గంటలు గంటలు మాట్లాడుతుంది. నా సమక్షంలో మౌనంగా ఉంటుంది.”

    “హేమ మీద నాకు అనుమానం లేదు.” 

    ఈ రెండు వాక్యాలు విని విని విసుగు పుట్టింది. 

    నా పనుల్లో  తన చొరబాటు కావాలని కోరుకొంటున్నాడని అర్ధం అయ్యింది. నేను ఒప్పుకోలేదు.

    రాజుకి నలుగురిలో తన స్వభావం ఎక్స్ ఫోజ్  అవటం ఇష్టం ఉండదు. “హేమ గురించి లేకిగా మాట్లాడుతారేమోనని భయం”. అని చెప్పేవాడు అందరికి.
తరువాత కొద్ది రోజులకు యూనియన్ లీడర్స్ కి తన గురించి  ఉత్తరాలు వెళ్ళాయి.

    నేనంటే గౌరవం, అభిమానం గలిగిన యూనియన్  ప్రెసిడెంట్ ఈ విషయం చెప్పలేక చెప్పాడు. 

    “ఏమి రాశారు సర్ లెటర్ లో” భయం, భయంగా అడిగాను.

    “వద్దు లెండి మేడమ్. ఆ విషయం మీరిక మర్చిపోండి.”

    మర్చిపోలేక పోయాను. అప్పుడు రాజే ఈ ఉత్తరాలు రాశాడని ఎందుకు అనుకొన్నాను? 

    సాక్ష్యాలు నేను చూపించలేక పోయాను. కానీ నా అంతరాత్మకు తెలుసు. రాజు ఆ ఉత్తరాలు  రాశాడని  మాత్రమే కాదు; ఎందుకు రాశాడో కూడా తెలుసు. 

    కార్ పార్క్ చేసి ఇంట్లోకి  వస్తుంటే సందీప్ ఎదురొచ్చాడు. నేను తొందరగా వస్తే  వాడి మొహంలో ఎంతో ఆనందం! నేను జ్వరం వచ్చి పడుకొని ఉన్నా మాట మాటకు వచ్చి నన్ను చూసుకొని ముద్దులు పెట్టి వెళతాడు. ఇంట్లో ఉన్నంత సేపు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. వాడి లోకం నాతోనే. నా చిన్నప్పటి నా చేతిరాతను చూసుకొన్నట్లు అనిపిస్తుంది వాడిని చూస్తే .ఆ వయసులో అందరి పిల్లల్లా టీవి, కంప్యూటర్ ల జోలికి పోడు. పుస్తకాల పిచ్చి. 
 నేనూ అంతే కదా,  టైమ్ దొరికితే కధల పుస్తకం పట్టుకొని బస్తాల గదిలో దూరి అంతర్ధానమయ్యే దాన్ని. వాడిలో నా అంశ చూసుకొన్నపుడు గుండె ఉప్పొంగుతుంది. 

    “త్వరగా వచ్చేశావే” అమ్మ పరామర్శ పట్టించుకోకుండా నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. 

    ఏదో సర్ధుతున్న రాజు నన్ను ఆ టైమ్ లో చూసి కొద్దిగా ఖంగు తిన్నట్లు అనిపించింది. 

    “ఏది నీకొచ్చిన ఉత్తరం?” సూటిగా అడిగాను.

     “చించేశాను”. అంతే షార్ప్ రెస్పాన్స్. 

    “నాకు చాలా రోజుల నుండి ఫోన్లు కూడా వస్తున్నాయి తెలుసా. నీకు చెప్పలేదు ”

    “అబద్ధం” మనసు ఘోషించింది.

    “వేణుగారికి ఫోన్ చేసి చెప్పాను. ఈ విషయం చూస్తామని చెప్పారు” యధాలాపంగా చెప్పినట్లు చెప్పాను. 

    వేణుగారు మా చుట్టం. పోలీస్ కేడర్ లో క్రూషియల్  పోస్ట్ లో ఉన్నాడు. 

    “నీకొచ్చిన ఫోన్ నంబరు కూడా ఇస్తే చూస్తారు”. నా చురుకు చూపు.

    “సరే” దాచాలనుకొని దాగని తొట్రుబాటు అతని ముఖంలో. 

    నాకిష్టమైన చెక్క కుర్చీ లో కూర్చొని కాళ్ళు పైన పెట్టుకొన్నాను.  మానసిక ఉపశమనానికి అదో మార్గం నాకు. 

    రాజు లోపల అమ్మతో ఏదో హస్క్ వేస్తున్నాడు. 

    “ఏమి జరిగింది “ కాఫీ కప్పుతో బాటు అమ్మ ప్రశ్న.

    “అప్పుడు జరిగిందే జరిగింది. కాలేజ్ కి ఉత్తరాలు వచ్చాయి, నా కేరక్టర్ మంచిది కాదని.” ముక్తసరిగా చెప్పాను. నా గొంతులో కసి కత్తి విసిరినట్లు ఉంది.

    అమ్మ నిట్టూర్పు వినబడింది. 

    “రాజు ఏడి” ఉన్నట్లుండి గుర్తుకి వచ్చి అడిగాను.

    “బయటకి వెళ్ళినట్లు ఉన్నాడు.”  

    “ఎవరు రాసి ఉంటారు? " ముప్పై ఐదేళ్ళ కూతురు శీలానికి వచ్చిన క్వశ్చన్ మార్కు తాలూకూ ఆందోళన అమ్మ భృకుటి లో కనబడింది.

    “రాజు " స్థిరంగా చెప్పాను. 

    అమ్మ మాట్లాడలేదు.

    అమ్మతో ఆరేళ్ళ క్రితం సంభాషణే రీవైండ్ అవుతున్నట్లు ఉంది నాకు. కానీ అప్పడు అమ్మ ఇంకేదో  అంది.

    “మగాడిని దగ్గరకు రానివ్వక పోతే ఇలాంటివే చేస్తాడు.”  

    అమ్మ ఒక్కటేనా?  నాన్న, అక్క, బావా, పెద్దమ్మ, వామపక్షాల డాక్టరు మావయ్య...నా ప్రపంచంలో అందరి నోట అదే మాట, అదే భావం. ఎందరి ముందు దోషిలా తలదించుకొంది?ఎన్ని పడక పంచాయితీలకు హాజరు అయ్యి సిగ్గుతో చితికిపోతూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది? నా  బాడీ కెమిష్ట్రీ నాకే అర్ధం కానీ వయసు అది. రాత్రుళ్లు రాజు ప్రశ్నలతో మనసు డెటెక్షన్ చేసేవాడు. 

    “ఎందుకు ఇష్టం లేదూ? “

    “అసలు అలాంటి కోరికలు లేవా? నేనంటే ఇష్టం లేదా?”

    అర్ధం కానీ, సమాధానం చెప్పలేని ప్రశ్నలు. 

    “యువరానర్ నా భార్య నా దగ్గర పడుకోవటం లేదు! “

    ఈ వాక్యం సర్వాంతరవ్యామియై ఎల్లడెలా వ్యాపించి, దుశ్సాసన రూపం దాల్చి, తనను కౌరవసభలో ద్రౌపతిని చేయలేదూ?
అప్పుడు దిక్కులు పిక్కటిల్లేటట్లు కురు, పితృ సభలు చెప్పిన తీర్పులు!

    “ పడుకో అతని దగ్గర!”

    “ కుటుంబ మర్యాద, పెళ్ళి చేసినవారి మర్యాద, వివాహ మర్యాదా, పెళ్ళికి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిన వారి మర్యాదా కాపాడు”

    “ప్రిజిడిటీ? వెన్ యు కీప్ ఆన్ సెయింగ్  నో టు సెక్స్, ఇట్ బికమ్స్ ఎ హాబీట్” మగ హృదయం గల స్త్రీ డాక్టర్ ఉవాచ.

    భార్య  పడుకోకుండా చేసిన తప్పు, భర్త గారు రాసిన తప్పుడు ఉత్తరాలకు తూకం వేసి , మొగ్గు అతనికే తూసి బలవంతంగా  ఒకే బెడ్ రూమ్ లో పడుకొనేదాక కలగ చేసుకొని, నిట్టూర్పు విడిచారు పెద్దలు . అప్పుడు నలగురిలో ప్రదర్శించబడిన నా నగ్నత్వం గుర్తుకొచ్చి కుర్చీలో మరింత ముడుచుకొని కూర్చున్నాను. 

    రాత్రుళ్ళు మా మధ్య జరిగిన తగాదాలు, పగలు రాజు దీన మొహం వేసుకొని చేసిన ప్రచారాలు. ఎక్కడికెళ్లినా అవే పరామర్శలు. “ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుందా?”

    “అతనికి నీ వెనుక పడాల్సిన అవసరం ఏముంది? కావాలంటే వేరే పెళ్ళి చేసుకోలేడా? నీ మీద ప్రేమ తోనే కదా ఇదంతా?” వాళ్ళ అమ్మ కాదు. మా అమ్మ అప్పుడు అన్న మాటలు.

    వాళ్ళ అమ్మ …  ఎనభై ఏళ్ళ వృద్ధురాలు ఏమంది?

    కన్నీళ్ళతో తన చేతులు పట్టుకొని “నువ్వే వాడికి తల్లివి. వాడిని క్షమించమ్మా “ అనలేదూ? 

    ఆమెదో, నాదో కన్న పేగు మెత్త పడింది అప్పుడు. ఏడేళ్ళ  దీపూ భవిష్యత్తు మేరు పర్వతంలా కనబడింది ఆ  రోజు .
ఆ రోజు నుండి నేను ఊపిరి పీల్చుకొన్నది కాలేజ్ లోనే. క్షణం తీరిక లేని పనులు కల్పించుకొని మనసుని మళ్ళించుకొన్నాను. ఇంటి కంటే కాలేజ్ ని పదిలం చేసుకొన్నాను. 

    అందరికి పనిచేసే చోట  అగచాట్లు అంటారు. కానీ నేను కాలేజీ నుండి వచ్చేటపుడు విచ్చుకొన్న ఆహ్లాదాన్నిచేసంచిలో కుక్కేసి, ఉరకలెత్తే ఉల్లాసాన్ని నీళ్ళు చల్లి ఆర్పి, నింపాదిగా, నిరూపంగా, నిర్వాణంగా ఇంట్లోకి వస్తాను. నవ్వూ, దిగులు...  నా ప్రతి ఎమోషన్ అతనికి జవాబుదారీనే. దీపూ ఒక్కడే కదా నా  ఏకాకితనాన్ని అర్ధం చేసుకోగలిగాడు. నేను పుస్తకం చదువుకొంటుంటే నిశ్శబ్ధంగా చూసి వెళ్ళి పోతాడు. నేను  దిగులుగా ఉంటే ఏమి మాట్లాడకుండా ఒళ్ళో పడుకొని నా గుండే ఘోష వినటానికి ప్రయత్నిస్తాడు.

    దీపు గుర్తుకు రాగానే నా కళ్ళ నిండా వెలుగు వచ్చిందేమో లోపలికి వస్తున్న  రాజు ముఖం మటమటలాడింది. 

    "ఎక్కడకి వెళ్ళావు?" అడిగాను.

    "బయటకి వెళ్ళి వచ్చాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. మేము పొరపాటు పడ్డాము క్షమించమని అడుగుతున్నారు. ఇక ఈ విషయం వదిలేద్దాము. “

    "అలా ఎలా వదిలేస్తాము? పోయిన సారే కంప్లైన్ చేయాల్సింది. ఈ సారి వదలొద్దు” కఠినంగా చెప్పాను. 

    “నాకు నీ మీద అనుమానం లేదు కదా . ఎవరు ఏమనుకొంటే ఏమవుద్ది?”

    అంతా వింటున్న అమ్మ కలగ చేసుకొంది. “అదేంటి  అబ్బాయ్! ఇందాకేగా ‘హేమ ప్రవర్తన మార్చుకోవాలి. కాలేజ్ అంతా గగ్గోలెత్తింది. ఆ కార్ తాళాలు తీసేసుకోని  ఇంట్లో కూర్చోబెడితే పోతుందని’ నాతో అన్నావు. నీకనుమానం లేదు సరే, మరి మాకనుమానం కలగాలనా?” 

    అమ్మ లోకజ్ఞానము మేలుకొంటుందీ మధ్య.  

    ఇతగాడు తను ఆడే లక్ష అబద్దాలకు అమాయకత్వపు మేకప్ వేస్తుంటాడు. 

    “నేనెప్పుడన్నాను? మీరు సరిగ్గా వినలేదు “ అలవాటుగా గొంతు హెచ్చించాడు. “మీ అమ్మాయి నాతో ఎలా ఉన్నా భరిస్తున్నాననా అంత చులకన అయిపోయాను?”

    “ఏమి భరించావు నువ్వు? కొద్దిగా కూడా ఓర్పు పట్టకుండా ఊరంతా ప్రచారం చేశావు. హేమ మనసు విరిచేసావు. ఎప్పుడు హేమ అంటే ఎంతో భయంగా ఉండే మీ మహేశ్ కూడా మొన్న దానితో అతి చనువుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రచార మహత్యం  మరి. ప్రతి వాడు దాన్ని  ట్రై చేసుకోవాలనుకొంటున్నాడు.” అమ్మ అక్కసుతో మాట్లాడుతుంది. 

    బాగానే గమనిస్తుంది అమ్మ. ఈ ఆరేళ్ళల్లో ఆమె కూడా మారింది. మా తగాదాల వలన దీపు ఏమై పోతాడో అని ఆమె ఈ మధ్య నా దగ్గరే ఎక్కువ ఉంటుంది, నాన్నను ఊళ్ళో వదిలేసి.  ఆమెకు తెలియని విషయాలు  చాలా ఉన్నాయి. ఆ మధ్య డాక్టర్ మామాయ్య కూడా ఏదో వంక పెట్టి మీద చేతులు వేస్తున్నాడని ఆయన దగ్గరకు వెళ్ళడం మానేసాను నేను. రాజు అతి క్లోజ్ గా ఉండే తన కొలీగ్ విష్ణు ద్వందార్ధం మాటలు కూడా ఈ మధ్య నన్ను బాధిస్తున్నాయి.  

    తల పగిలిపోతుంది. ఎదురుగా నిలబడి వింత వింత హావభావాలతో అరుస్తున్న రాజు ఆరడుగుల  విగ్రహాన్ని కళ్ళప్పగించి చూశాను.

    కట్నం ఇవ్వకూడదనీ, పీటల పెళ్ళి వద్దనే నా ఉడుకు రక్తం ఆశయాలకు ఆనాడు దొరికిన పెళ్ళికొడుకు. సాహిత్యపురుగైన నాకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాల నిష్ణాతుడ్ని భర్తగా తెచ్చారు. సంబంధం చూసిన వాళ్ళకు పుస్తకాలు అనే కామన్ వస్తువు దొరికి ఉంటుంది. సన్నటి వైరాగ్యపు నవ్వు  వచ్చింది. 

    “నీకు కృష్ణశాస్త్రి భర్త గా రావాలి” నేను చదువుతున్న పుస్తకాలు చూసి రోజా అన్న మాట గుర్తుకు వచ్చింది.  ఇంజనీరింగ్ లో మాష్టర్ డిగ్రీ చేసినా ఇల్లు, ఇద్దరు ఫ్రెండ్స్ కు పరిమితం అయిన నాలాంటి ఇంట్రావర్ట్ కి ఇదే గొప్ప సంబంధం అనుకొన్నాను అప్పుడు. 

    ఈ మనిషికి నా మీద ప్రేమా? 

    అవును. రోజుకి ఆరు సార్లు కాలేజీకి ఫోన్ చేసేటంతటి ప్రేమ. నేను కట్టుకొన్న చీర, పెట్టుకొన్న బొట్టు కూడా  ‘పట్టించుకొనే’టంతటి ప్రేమ. అరక్షణం కూడా నాకు మిగలకుండా కాపలా కాసే ప్రేమ. నేను చదువుతున్న పుస్తకంలో అక్షరం కూడా అతని దృష్టిని దాటి  పోగూడదనే ప్రేమ. నా నిక్కచ్చి మాటల వెనుక ఏదో పుస్తకం కుట్ర ను వెదుక్కోనే ప్రేమ. ఊపిరాడనివ్వని ప్రేమ.

    ఆమధ్య చాలా రోజుల తరువాత అమెరికా నుండి వచ్చిన ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళాను.  అతను అర్ధరాత్రి నా ఫోన్ కి కాకుండా, తన ఫోన్ కి కాల్ చేసి నా గురించి చేసిన పరామర్శను చూసి విసుక్కొంది ఆమె. అది పరామర్శ కాదు, నేను నీ దగ్గర ఉన్నానా లేదా అనే శంక అని నేను చెప్పలేదు.

    పక్కన పామును పడుకోబెట్టుకొన్నట్టే ఈ ఆరేళ్ళు ... అర్ధరాత్రి అటాక్ ల నుండి రక్షించుకోవటానికి నిద్రలో కూడా మెదడు అలర్ట్ గా ఉంచాల్సి వచ్చింది.
మళ్ళీ వేడుకోళ్ళు, పంచాయితీలు, చచ్చిపోతానని బెదిరింపులు.

    అర్ధరాత్రి అతని అరుపులకు దీపు లేచి బిక్క మొఖం వేస్తే, పక్క గదిలో అమ్మ, నాన్న లోపలికి రాలేక గది బయట తారట్లాడుతుంటే, 

    “వెళ్ళి పో!” అని అప్పుడు నేను పెట్టిన కేక నా అంతరంతరాల వత్తిడి నుండి నా ప్రమేయం లేకుండా  పైకి వచ్చింది.

    బహుశ ఆ  కేక, అతనిపై అమ్మ నాన్నల  సానుభూతి లెవెల్ ని పెంచి ఉంటుంది. అర్ధరాత్రి అలిగి వెళ్ళిపోతానని బయలుదేరితే నాన్న వెంటబడి బతిమిలాడి చేయి పట్టుకొని తెచ్చారు కదా మరి.  

    ఎన్ని సార్లు చెప్పలేదు నేను?
 
    "మళ్ళీ పెళ్ళి చేసుకో రాజు. నేను విడాకులు ఇస్తాను.ఈ గిల్టీ ఫీలింగ్ లో నన్ను ఉంచి నువ్వు ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేవు."
అంత కంటే ఏమి చెప్పాలి ఈ మనిషికి? 

    పెళ్ళైన కొత్తల్లో నువ్వు ఒక్క క్షణం నా మీద వాలి లేచి పోయి “లే! బట్టలేసుకో”´అని అరచినపుడు నా మనసు పొందిన పరాభవం గురించి చెప్పాలా?
దేహానికి కూడా హృదయం ఉంటుందనీ, దాన్ని నువ్వు సృజించి నాకు అందిచాల్సిన అనుభూతి  ఒకటి ఉంటుందని నీకు చెప్పినా అర్ధం అవుతుందా? 
నువ్వు మొదలు పెట్టినపుడు సంసిద్దం చేసుకొన్న నా మనసు, శరీరం, నువ్వు అర్ధాంతరంగా వదిలేశాక పడిన హింస నీకు ఎప్పటికైనా  అర్ధం అవుతుందని నేను అనుకోను.

    చెప్పను. నేను చెప్పను. సెక్స్ ని తలదన్నే మానసిక సాహచర్యం ఒకటి ఉంటుందని, ఆ స్నేహానికి  కూడా నువ్వు అనర్హుడవని నేను చెప్పను. నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు. నన్ను గెలవలేనితనం నుండి వచ్చిన అహమన్న విషయం నాకు అర్ధం అయ్యిందని నీకు నేనెప్పటికి చెప్పను. 
ఇద్దరం ఉమ్మడిగా పెంచుకొనే బాంక్ బాలెన్స్ కోసం, నువ్వు నేనూ జంటగా కొనుక్కోబోయే  అపార్ట్ మెంట్ కోసం నేను నిన్ను ప్రేమించలేను. నువ్వు రోజూ తెచ్చిచ్చే పాల పాకెట్స్ , న్యూస్ పేపర్స్ , కూరగాయల సదుపాయం కోసం నేను నిన్ను ప్రేమించలేను. 

    ఇంట్లో నాకుండే ఉక్కపోత నా బయట ప్రపంచానికి కూడా  పాకిస్తున్నావని తెలుసు. నీ కబ్జాని కాలేజ్ కి కూడా విస్తరించాలనేదే నీ ప్రయత్నం. కాలేజ్ లో ఎవరూ నాతో మాట పంచుకోకుండా మాష్టర్ ప్లాన్ వేశావు.

    నా మీద పడిన దీపు కాళ్ళు పక్కకు జరిపాను. కళ్ళు తుడుచుకొని వాడి  మీద చెయ్యి వేశాను. అమాయక ముఖం. ఎవర్నీ, చివరకి తనని కూడా  ప్రేమించని  తండ్రి, తనని అడ్డం పెట్టుకొని అమ్మను ఎమోషనల్ బ్లాక్ మైల్ చేసే తండ్రి. 

    “నాన్న ఎప్పుడూ నీ గురించి అడుగుతాడేమిటమ్మ? పద్మజా ఆంటీ తో ఫోన్ లో అమ్మ ఏమి మాట్లాడింది?అని అడుగుతాడు. నువ్వు లేనప్పుడు నీ ఫోన్  కూడా చెక్ చేస్తున్నాడమ్మ. “ ఆ పసి హృదయం కూడా గుర్తిచింది.  ఈ మధ్య వాళ్ళ నాన్నతో  ఒంటరిగా గడపటానికి భయపడుతున్నాడు.  నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ మౌనం, మ్లానమైన అమ్మ ముఖం వాడిని డిస్టర్బ్  చేస్తున్నాయి. నాన్న ఇంటిని నింపే అశాంతి వాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

     “మనిద్దరమే కలిసి ఉందాం అమ్మా!” దీపు మాట గుర్తుకు వచ్చి మరింత హద్దుకొన్నాను వాడ్ని. 

(ఆదివారం ఆంధ్రజ్యోతి 01-09-2013 సంచికలో ప్రచురితం) 
Comments