రహస్యం - ఆర్.దమయంతి

    ఇప్పుడక్కడంతా నిశ్శబ్దం... కటిక నిశ్శబ్దం ఆవరించుకునుంది.
 
    కాలం కళ్ళు విప్పుకుని చూస్తోంది. గాలి సైతం ఆగిఅగి వీస్తోంది. ఆకాశం ఉగ్గబట్టుకుని వీక్షిస్తోంది. కదిలే వృక్షాలు చలనం లేని స్తంభాల్లా నిలబడి పోయాయి. మరికొన్ని క్షణాలలో అక్కడ జరగబొయే వింత ప్రదర్శన గురించి - అక్కడందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

    ఊళ్ళొంచి పరెగెత్తుకుంటూ వచ్చి, అప్పుడే గుంపుతో కలిసిన ఓ యువకుడు రొప్పుతూ -"ఏమిటి సంగతి?" అంటూ రహస్యంగా అడిగాడు పక్కవాణ్ని.

    "ఎవరో రవివర్మట! ఏదో అద్భుతం చూపిస్తాడట."

    "ఎట్టెట్ట! ఏంటటది?" 

    "ఏమో! ఎవ్వరికీ తెల్వదు. ..ఊళ్ళో వాళ్ళంతా వొచ్చారు. సిత్రమేంటో తెల్సా?... ఎప్పుడూ లేంది... సర్పంచ్ తన కూడా కూతుర్నీ తీసుకొచ్చాడు... అదిగో! ముందు వరసకుర్సీలో కూకుంది సూడు..." అంటూ అటు వైపు చూపించాడు   

    అక్కడ - ముందు వరస కుర్చీలో సర్పంచ్ అసహనంగా కదులుతున్నాడు. 

    ఆ వూరి రచ్చబండను వేదికగా చేసుకుని రవివర్మ ఇవ్వబోయే అరుదైన ఆ ప్రదర్శన ఏమిటో ఆయనొక్కడికే తెలుసు. ఎందుకంటే... రవివర్మ ఆ విషయాన్ని- ముందుగా తన చెవినే వేసాడు కాబట్టి! వినంగానే అతన్ని కొట్టిపారేస్తూ  నవ్వాడు. "నీ మొహం! ఇదేం ప్రదర్శన" అన్నాడు కూడా! 
 
    కాని, రవివర్మ ఒక్క అవకాశమివ్వమంటూ మరీ మరీ ప్రాధేయపడేసరికి మెత్తపడ్డాడు. అందుకు ప్రధానకారణం -  తన కూతురు!   

    వెంఠనే మెరుపులా తట్టింది. తన  కూతురి కళ్ళు తెరిపించడానికి ఇంతకంటే మంచి మార్గం మరోటి లేదని... అంతే కాదు. ఇంతకు మించిన అవకాశమూ రాదని కూడా తోచింది. స్వామికార్యం... స్వకార్యం అన్నట్టు రెండూ తీరుతాయని - "సరే" అన్నాడు.

    ఐతే, రవివర్మ ఒక షరతు పెట్టాడు. ప్రదర్శన  ఏమిటి అని కానీ, ఎలా వుంటుంది అని కానీ ఎవరికీ చెప్పకూడదనీ, అంతా... రహస్యంగా వుంచాలని కోరాడు.

    జనంలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసమే అని తెలుసుకున్న సర్పంచ్, అతగాడి తెలివితేటలను లోలోనే మెచ్చుకున్నాడు.

    ప్రదర్శనకు కేవలం ఒక గంట ముందుగా మాత్రమే చాటింపు వేయించాడు.

    ఊళ్ళోకి రెండు కార్లొస్తేనే వింతగా చూసే జనం - ఈ చాటింపు విని ముందు నివ్వెరపోయింది. ఆ తర్వాత ఆ వార్త ఆ నోటా ఆ నోటా క్షణాల్లో  నాల్గుదిక్కులా పాకిపోయింది. ఇంకేం?... అరగంటలో రచ్చబండ ముందు- వూరువూరూ కదిలొచ్చేసింది. సడిలేని సంద్రంలా నించునుంది.

    సర్పంచ్ - కూతురివైపు చూస్తున్నాడు.. ఏ భావం లేకుండా.

    ఇంతలో - చెట్టు మీంచి ఒక చిన్న హరిత పత్రం గాల్లో పల్టీలు కొట్టుకుంటూ - ఆమె వొళ్ళోకొచ్చి పడింది.

    కూతురిమీద ఈగ వాలితేనే సహించని ఆ తండ్రి - పిచ్చిఆకు రాలితే వూరుకుంటాడా? 
   
    వొళ్ళోంచి  దులిపేయ బోయాడు. కాని ఆమె, తండ్రి వైపోసారి అభావంగా చూసి, రాలిన పత్రాన్ని సున్నితంగా తాకి, 'థాంక్స్ ఫర్ యువర్ టచ్' అన్నట్టు ఆ పత్రాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకుని,  చెంపకాంచుకుంది.    

    ఆయనకి చిర్రెత్తిపోయింది. మంట మండిపోయింది. ఆయన ఒళ్ళెంత - మండిపోయిందంటే - కోపం నషాళాణికి అంటేంత!  
 
    ఆకులూ, అలమలూ, అలలూ, నదులూ, సముద్రాలూ...
    గువ్వలూ, గోరొంకలు, పావురాలూ, పసి పిల్లలూ...
    పొలం చేను, కాల్వగట్ల మీద రెల్లుపూలూ...
    పాలేళ్ళు, పనివాళ్ళు, పాకలో కట్టెసిన లేగదూడలు...
    హు... ఒకటేమిటి అన్నీ అపురూపాలే... అన్నిటిపట్లా ఆరాధనా భావాలే...
    ఒట్టి పిచ్చిది. లోకజ్ఞానం లేనిది. ఈ వెర్రిబాగులదానికి పెళ్ళిచేసి పంపితే పని అయిఫొతుంది కదా అనుకుని,                      ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వొచ్చాడు. కాని అదంత సులువైన విషయం కాదని అతనికి మెల్లగా తెల్సొచ్చింది.  

    ఎంత గొప్పసంబంధం తెచ్చినా,ససేమిరా వొద్దంటోంది. నూరున్నొక్క జిల్లాల అందగాణ్ని సైతం -  చీపురుపుల్లలా తీసిపారేస్తోంది. 'వాడికేం తక్కువమ్మా?' అంటే - తనెప్పుడూ వినే జవాబే చెబుతుంది.  మార్పు లేకుండా. 

    అదేమిటంటే -

    "అతనికి హృదయ సౌందర్యం లేదు నాన్నా.."  అంటూ..

    వింటం వింటమే ఆయనకి పూనకం వచ్చేస్తుంది. ఆపళాన లేచి... చేతిలో ఏదుంటే అది విసిరేయాలన్నంత ఆవేశమొచ్చేస్తుంది. 

    అదే కొడుకైతే, నాలుగు తన్ని, కాళ్ళూ చేతులు కట్టి మరీ పెళ్ళి చేసేవాడు. కాని, ఇది ఆడపిల్లై పోయింది. పైపెచ్చు కూతురి మీద తనకెంత ప్రేమంటే?, తను ప్రాణంగా భావించే పదవి కంటేనూ -  ఎక్కువ ప్రేమ! పోనీ, ఏమైనా అందామంటే కూడా - ఆ ముఖంలో కనిపించే ప్రసన్నత... పవిత్రమైన అమాయకతా... ఆయన నోటికి తాళం వేస్తున్నాయి. 

    హృదయసౌందర్యం అంటుందేమిటీ? అదెక్కడేడ్సింది... దీని ముఖం కాకపోతే!?... ఇంటా వంటాలేని మాటలూ... ఇదీనూ...

    అయినా... పచ్చిమాంసం కాల్చుకు తినే తన వంశంలోకి ఇంత పిచ్చిపక్షి ఎలా వొచ్చిపడ్డట్టో?... ఎంతాలోచించినా బుర్రకి తట్టడంలేదు.
 
    ఇది పెళ్ళి చేసుకోడానికి - 'హృదయం గల' ఛ కాదు... 'హృదయ సౌందర్యంగల' పెళ్ళికొడుకు సచ్చినోడ్ని తనేడనుంచి తగలేసుకు రాగలడు?!

    నిజమే! ఇది ఆయన  తాహతు కి మించి న  విషయం. ఎందుకంటే - ఏ కల్లు వ్యాపారినో,  బ్రాంది బిజినెస్సోడ్నో... గోతులు తవ్వే రాజకీయ కుర్రాణ్నో... పోనీ సరదాగా ఏ అక్రమ గనులు తవ్వుకునే వాణ్నో అడిగుంటే... ఈ సమస్య ఆయంకింత  క్లిష్టంగా వుండేది కాదేమో! హు! దీని దుంపతెగ! హృదయం వున్నోణ్ణి తీసుకురా అంటూ తనకు తలనొప్పిగా తయారైందీ పిల్ల. 

    పాపం! సర్పంచ్ ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాడంటే - 'ఎన్నికల్లో తనకు ప్రత్యర్ధి లేకుండా, పట్టపగలే హత్య చేయించి... గద్దె ఎక్కిన ఈ కఠినాత్ముడికా?! - ఇన్ని కష్టాలు?...పాపం' అని జనం కథలు కథలుగా చెప్పుకుని, నవ్వుకునేంతగా తయారైంది ఆయన బ్రతుకు!
 
    రానురాను కూతురి వ్యవహారం మింగుడుపడక... కిందామీదై పోతున్నాడు. సరిగ్గా అలాంటి విషమ పరిస్థితిలో రవివర్మ వచ్చాడు. తనా  రహస్య ప్రదర్శన గురించి చెప్పాడు.
 
    అతని ప్రదర్శన - తనకిప్పుడు మరో విధంగా వుపయోగపడబోతోంది.

    ఇదంతా సవ్యంగాసాగి, రవివర్మే తనకు నచ్చాడు అని గనక కూతురంటే - తన పంట పండినట్టే! ఇహ క్షణమైనా ఆలస్యం కాకుండా... వెంఠనే - కూతురికి అతన్నిచ్చి పెళ్ళి కానిచ్చేద్దామనే నిర్ణయానికి కూడా వొచ్చేసాడు. ఎంతైనా రా(చ)జకీయ బుర్ర కదా! అలాగే ఆలోచిస్తుంది. 

    ఇది ఇలా వుంటే -

    మరో పక్కన - గుంపులోంచి చాటుగా ఒకజత (మగ) కళ్ళు- సర్పంచ్ కూతుర్ని ఆరాధనగా తాకుతున్నాయి... ఆమెకి అవి గురుతే! అప్పుడప్పుడు తుమ్మెదలు నిశ్శబ్దంగా పూలపై వాలడం ఆమెకిష్టమైన దృశ్యాలలో ఒకటి.

    ఇంతలో జనం 'అడుగొ..అడుగో..: అంటూ  గుప్పుమన్నారు.  

    వేదిక మీదకు రవివర్మ హుందాగా నడుచుకుంటూ వొచ్చాడు.

    ఆరడుగుల అందగాడు. స్ఫురద్రూపి. చురుకైన కళ్ళు. గిరజాల జుట్టు. పట్టువస్త్ర ధారణతో చాలా అందంగా కనిపిస్తున్నాడు.

    జనం అంతా ఆ రూపవంతుణ్ని - అబ్బురంగా చూస్తున్నారు.

    సర్పంచ్ - కూతురి వైపు చూసాడు. రవివర్మ అందం ఆమెనేమైనా ఆకర్షించిందా, లేదా అని! అమె  అతన్ని చూస్తోంది కాని, ఆ కళ్ళల్లో ఏ భావంలేదు. అతని ఆకర్షణీయమైన రూపం ఆమెని కదిలించలేదని అర్థమైపోయింది ఆయనకి. 

    మొదటి అంకం ఫలితం తెలిసిపోయింది. ఓట్ల లెక్కింపులో మొదటి విడత ఫలితాలలో తక్కువ మెజారిటిని చూసి నిట్టూర్చినట్టు... నిరాశపడ్డాడు. 

    ఇక రెండో అంకం మిగిలింది. ఆయన ఆశలన్నీ దానిమీదే! అదే - రవివర్మ ప్రదర్శించబోయే అంశం... మొదలౌబోతున్నట్టుంది.
 
    వర్మ తన ప్రసంగాన్ని ఆరంభించడంతో - అటు తిరిగాడు సర్పంచ్.

    "ప్రియ ప్రేక్షకులారా! ముందుగా - మీ అందరికీ అభివందనం! ఈరోజు నా ప్రదర్శనని చూడ్డం కోసం ఈ వూరు వూరంతా కదిలి ఈ ముంగిట్లో వాలిందంటె ఆ గొప్పతనం నాది కాదు. మీది. మీ కొత్త కళలను మీపల్లెకు తోరణం కావాలనుకునే కళాపిపాసకి ప్రత్యక్షసాక్షులు మీరు! తెలుగు కళామతల్లి హృదయానికి నిలువెత్తు అద్దం - మీ వూరు. మీ ఉత్తమ కళాభిరుచికి ఇదే నా అభినందనం..." అంటూ అభివాదం చేసాడు.

    జనం పట్టలేని హర్షంతో  చప్పట్లు కొట్టారు.

    సర్పంచ్ ఆలకిస్తూ... 'వీడు తెలివైనవాడే. జనాన్ని బాగనే బుట్టలో వేస్తున్నాడు' అని అనుకున్నాడు  మనసులోనే.

    రవివర్మ కొనసాగిస్తున్నాడు.

    "ఇప్పుడు నే నివ్వబోయే ప్రదర్శనని -  మీరెప్పుడూ కనీ వినీ వుండరు.  ' ఈ ప్రపంచంలో - ఏ కళాకారుడు ప్రదర్శించ లేని  ఈ కళ ..నాకు మాత్రమే సాధ్యం. నాకు మాత్రమే సొంతం...'  అని మీకు నేను సగర్వంగా తెలియ చేసుకుంటున్నాను. అంతే కాదు, ఈ మూడు లోకాలలో నాకెవరూ సాటిలేరనీ, పోటీ వుండరని కూడా... మీకు నేను  సవాల్ చేసి చెబుతున్నాను...."   అని ధీమాగా చెబుతున్నప్పుడు  అతని విశాలమైన   ఛాతీ  మరింత విశాలమైంది.  

    "ఇంతకీ ఏమిటా ప్రదర్శన  అని మీరు ఆత్రపడిపోతున్నారు  కదూ?  ఇక మిమ్మల్ని ఏ మాత్రం సస్పెన్స్‌లో వుంచను. నా ప్రదర్శన పేరు చెబుతాను వినండి!" 
 
    అందరూ అతని వైపే చూస్తున్నారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని...

    "దాని పేరు - హృ ద య సౌందర్య ప్రద ర్శ న..."  నవ్వుతూ ప్రకటించాడు.

    వినంగానే ప్రజలకేమి అర్ధం కాలేదు. ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. గొణ గొణలాడుతున్నారు. 
సర్పం చ్  మాత్రం కూతురి వైపు చూసాడు. ఆమె వర్మ వైపు కొంచెం ఉ త్సాహంగా చూస్తోంది. 'హమ్మయ్యా ' అనుకున్నాడాయన.

    జనంలో ఆ జత మగ  కళ్ళు మాత్రం నీరసపడుతున్నై...
 
    వున్నట్టుండి  జనంలో ఒకతను లేచి  అడిగాడు... "హృదయ సౌందర్యం అంటే  ఏమిటి?" 

    "అందరకీ కొరవైనది. ఎవరికీ దొరకనిది.   కొందరికి మాత్రమే  దక్కేది. అరుదైన సంపదది. ఇది మనిషికి- నిత్య యవ్వన ఔషి ధి  వంటిది. వెల కట్టలేని  నిధి వంటిది. కేవలం... మీ కోసం... మీరు చూడాలనే తపనతో మీ ముందుకు తీసుకొచ్చా..." వూరిస్తున్నాడు.

    "ఎక్కడ? ఎక్కడా అది?" ఒక్కసారిగా తహతహలాడారు  జనం. 
 
    సరిగ్గా -  ఇదే ప్రశ్న "ఎక్కడా..ఎక్కడా" అని   తనెన్ని సార్లు కూతుర్ని అడిగిందీ  గుర్తొచ్చి..సర్పం చ్  లోలోనే గొల్లున నవ్వుకున్నాడు. 

    'ఇదిగో..ఇక్కడే' అంటూ గుండెల  మీద కప్పుకున్న జరీ కండువా తొలగించాడు వర్మ.  బలమైన వక్షం మిసిమి చాయతో మిలమిలమంటూ ఆతడో ఇంద్రుడిలా  మెరిసిపోతున్నాడు. 

    కొంతమంది ఇల్లాళ్ళకు. మన్మధుడిలా  ద్యోతకమౌ తుంటే, మరెంతమందో  కన్నెపిల్లలకు -  తాము ఏ సినిమాల్లోనూ చూడని కథానాయకుడిలా అగుపించడంతో అందంగా సిగ్గుపడుతున్నారు. 
 
    'ఎంత సొగసుగాడనీ! '  మొత్తానికి అంతా  పొంగిపోతున్నారు. -  ఒక్క  సర్పంచ్  కూతురు తప్ప!

    "నాకు తెలుసు. మీరీ సౌందర్యం వైపు మొగ్గు చూపుతున్నారని. కాని, ఈ లోపల మరో సౌందర్యం వుంది. అది చూసి మీరు మరింత తబ్బిబ్బవతారు". 

    అంటూ క్షణాల్లో -" ఇదిగో చూడండి" అంటూ... వక్షాన్ని  రెండుగా వేరు చేసాడు.. 

    ఆశ్చర్యం! అతని  హృదయం  పువ్వులా విచ్చుకుని   కనిపిస్తోంది. 

    జనం చూడ్డంచూడ్డం తోనే ' వహ్ వా వహ్వా' అన్నారు.  

    "మచ్చలేని చంద్రబింబంలా వుంది కదూ" 

    "కాదు. పసిడి ముద్దలా..."

    "కాదు కాదు... బంగారు గని లా..."

    "కాదు కాదు   సూర్యకాంతిలా వెలిగిపోతోంది..."

    "కాదంటె కాదు. సురలోకపు పారిజాత పుష్పంలా ధగధగ మంటోంది."

    "ఊహు. అది ఖచ్చితంగా విలువైన మణి" 

    ఇలా తలా ఒకరు తలా ఒక  ప్రసంశా కురిపిస్తున్నారు... అతని మీద.కొంతమంది కళ్ళు తిప్పుకోలేక పోతున్నారు. అందరూ  అలాగే దీర్ఘంగా చూ స్తూండిపోయారు...

    సర్పంచ్  సైతం, తెరుచుకున్న నోరు - మూసుకుంటూ  -  కూతురి వైపు సంబరంగా చూసాడు. ఆమె తలవొంచుకునుంది.  అలా చాలా సేపట్నుంచే.. అన్నట్టుంది ఆ వాలకం. సర్పంచ్ గుండె గుభేల్మంది. ఐతే, ఇతగాని' హృదయ సౌందర్యం' కూడా ఈమెని ఆకర్షించలేదా? -  "ఖర్మ" తలపట్టుకున్నాడాయన.
 
    జనం తనని చూసి అలా చిత్తరువులై  పోవడంతో... రవివర్మ ఉప్పొంగిపోయాడు. "ఇప్పుడు చెప్పండి. ఇలాంటి సౌందర్యం  మీరెక్కడైనా   చూ శారా?"

    నోట మాట రాని జనం -  అడ్డంగా తలలూపారు. 

    "పోని, -  ఇంత హృదయ సౌందర్యం   ఎవరిలోనైనా వుంటుందంటారా?

    జనం 'ఊహు' అనే లోపే  "వుంటుంది. కచ్చితంగా వుంటుంది" అంటూ... ఓ  కంఠం కంచులా మోగింది.

    వర్మ ఉలిక్కిపడ్డాడు. వెంటనే హృదయాన్ని  మూసి,  లోపల దాచేసాడు.  

    ఆపైన,  అతనికొళ్ళు మండిపోయింది. తనకే పోటీ వచ్చే మొనగాడున్నడా 'ఏడీ? ఎక్కడ?' చుట్టూ పరికించి చూస్తూ...

    "ఎవరది? ఇలా వచ్చి మీ హృదయాన్నికూడా  ఇక్కడ పరచి, దమ్ముంటే ఫోటీలో పాల్గొనండి." అంటూ సవాల్ విసిరాడు.

    "ఇదిగో... వస్తున్నా..." అంటూ  ఆ  మనిషి జనాన్ని తోసుకుంటూ ముందుకొ స్తున్నాడు. 

    ఆమె నిఠారై కూర్చుంది. 
 
    ఆ  'జత కళ్ళు' కూడా ఆ మనిషి కోసమే చూస్తున్నాయి.

    ఇంతలో-   జనం  గొల్లుమని నవ్వారు ఒక్క పెట్టుగా!   

    వర్మ అయితే, పొట్ట పట్టుకుని...  పడీపడీ...  పగలబడి  మరీ నవ్వుతున్నాడు ఆ వచ్చిన మనిషిరూపాన్నిచూసి!  

    బక్కగా, కొంచెం పొట్టిగా ముసలావతారంతో వున్నాడా మనిషి.  నెరిసిన జుట్టేసుకుని, ముడతలు పడ్డ వక్షంతో... భుజంపైన ఎర్ర కండువా కప్పుకున్న ఆ వృద్ధాకారాన్ని. "దా... దా..." అంటూ వేదికమీదకి ఆనందంగా, హేళన నిండిన స్వరంతో  ఆహ్వానించాడు.  

    ఆ మనిషి  వేదికెక్కాడు.

    ఆయన ఆత్మ విశ్వాసం చూస్తోంటే -  ఆశ్చర్యమేస్తోంది రవి వర్మకి. 

    ఈ కురూపికి -  తనను  మించిన  హృదయం సౌందర్యమా? 

    లేదు. అలా  జరిగే  అవకాశమే లేదు. ఈయనకే కాదు.  అసలెవ్వరికీ కూడ తన  హృదయమంత సౌందర్యం వుండే వీలే లేదు! ఎందుకంటె,  తను -  తన హృదయాన్ని చెదరకుండా, చెదరనీకుండా అంత అద్భుతంగా    కాపాడుకుంటూ వస్తున్నాడు. 

    'ఒక వేళ ముసలోడు కూడా  తనలాగానేనా..?' ఎక్కడో  అనుమానం పొడసూపింది. ఆలోచనల్లోంచి  తేరుకొకముందే, ఆ ముసలాయన  తన ప్రదర్శనని కానిచ్చేస్తున్నాడు. ఉపోద్ఘాతాల ఆర్భాటాలేమీ  లేకుండానే!... తన హృదయాన్ని ప్రదర్శించాడు.

    వర్మ ఉలిక్కిపడి  చూసాడు. 

    క్షణం తర్వాత ఫెళ్ళున నవ్వాడు. . 

    తెరలు తెరలుగా... జనం కూడ కలసి నవ్వటంతో  ఆ ప్రదేశమంతా  నవ్వులతో నిండి పోయింది. 

    ఆ అపహాస్యపు నవ్వులకి మరొకరికైతే - పరిస్థితి ఎలా వుండేదో కాని, ముసలాయన మాత్రం - పిసరంతైనా  బెదరలేదు. చెక్కు చెదరని విశ్వాసం తో అలాగే స్థిరంగా నిలబడ్డాడు..

    జనాన్ని ఉద్దేశిస్తూ  అన్నాడు వర్మ... "హు ష్! నిశ్శబ్దం... నిశ్శబ్దం! మీరూ చూసారుగా ఈ ముసలోడి హృదయ సౌందర్యం? హు!  నల్ల పెంకులా,  మచ్చలతో, మసిబారి, దుమ్మూధూళి చేరి, గతుకులు పోయి, గుంతలు పడి,   గొగ్గులు తేరి, గాయాలతో, పుండ్లతో రసి కారుతూ... చి, చీ... ఇంత అనాకారితనాన్ని ఈ కళా వేదిక మీదనా ప్రదర్శించడం!  ఎంత అవమానం? ఎంత కళంకం? ప్రియమైన కళాభిమానుల్లారా! నా అపురూప ప్రేక్షకాభిమానుల్లారా!! ఈ అవమానం నాకు కాదు. మీకు. మీ కళాభిమానానిది. మీ ఉత్త మా భిరుచిది. ఈ ప్రజా కళా వేదికది... అవునా కాదా?" 

    "అవును... అవును."

    "మరి ఇలాంటి పిచ్చి వాడికి బుధ్ధి చెప్పాలా వొద్దా?" 

    "చెప్పాలి... చెప్పాలి"

    "ఎలా  చెబుతారు?

    'ఇలా' అంటూ కొందరు రాళ్ళు తీసుకున్నారు. మరి కొందరు కర్రలు  తీసుకున్నారు - చేతుల్లోకి.

    సర్పంచ్ కంగారుగా లేచి నిలబడ్డాడు. ఈ అనుకోని సంఘటన ఎలాటి పరిణామాలకు దారి తీస్తుందా అని!
గ్రామ శాంతి భద్రతల దృష్ట్యా  తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకముందే ఇక్కడ ఓ ప్రళయంజరగబోతోందన్న సంగతి ఆయన గ్రహించి, భయపడిపో తున్నాడు.

    మరు క్షణంలో ఏం జరిగేదో ఏమో , "ఆగండి."  అని ఆ ముసలాయన గావుకేకగా అరవకపోతే! .

    "ఆగండి. నేను చెప్పేది కూడా మీరు   వినండి." అన్నాడు. ఆ గొంతులో ధ్వనించిన ఆదేశానికి - జనావేశం వెనక్కి జంకింది.

    ఆయన చెప్ప సాగాడు.

    "నిజమే. నా హృదయం - అందమైనది కాదు. వర్మ హృదయ సౌందర్యం తో పోలిస్తే ఇది ఏపాటిదీ కాదు. ఆ సంగతి నాకు తెలుసు.  కాని నా ఈ హృ దయం ఇలా ఎలా అయ్యిందో మీకు తెలియాల్సిన అవసరం వుంది. అది చెప్పడం కోసమే  నేనిక్కడికొచ్చాను.  .
 
    చిన్నప్పట్నుంచీ - నేను నా  హృదయాన్ని పెంచుతూ, అందరికీ పంచుతూ వచ్చాను. కొంతమంది నా  హృదయాన్ని తీసుకుని ఇచ్చేవారు కాదు. ఆ బాధతో  వివిల్లాడేవాణ్ని. అందుకే ఇదిలా  - నల్ల కప్పేసుకుపోయింది. మరి కొందరికి నా హృదయం -  అర్ధమయ్యేది కాదు... అందుకు  ఇలా మలినమై పోయింది... కొందరు - నా హృదయాన్ని  గిచ్చి పొయారు. మచ్చలు మిగిలాయి.  నమ్మిన వారు చేసిన ద్రోహాలకు గుర్తులు ఈ కత్తి గాట్లు.   నా  హృదయం -  ఎన్నో సార్లు దోపిడీకి గురైంది. ఎంతమందో తవ్వుకు పొయారు.  అది  నేను పూడ్చుకోలెనంతగా... లోతై పోయింది.  ఈ గోతులు అవే! నా అనుకున్న వాళ్ళే ఈ హృదయం మీద గునపాలు  గుచ్చారు... ఈ బీట్లు వాటి గుర్తులే! స్వచ్చమైన హృదయం చూసి గేలి చేసారు. మసి పూసి పోయారు.   ఇవే ఆ  స్ఫోటక మచ్చలు !  పళ్ళున్న చెట్టుకే దెబ్బలు.  హృదయమున్న వారికే ఎదురు దెబ్బలు. ఐతే ఏం!?
 
    ఇప్పటికీ... ఈ  హృదయం - ఏ  ప్రతిఫలాపేక్ష లేకుండా... ఇంకా ఎందరికో... ఇంకెందరికో... ఇంకా ఇంకా  ఏదో ఏదేదో... ఇవ్వాలని   తపన పడుతుంది... ఎందుకో తెలుసా?

    హృదయం -  ఇచ్చేందుకే వుంటుంది. భద్రంగా దాచుకోడానికి కాదు. 
 
    నేనిదంతా,  మీతో ఎందుకు చెబుతున్నానంటే  -  మీ అందరి చేత హృదయం ఇప్పించాలనే ఆశతో. ఏకైక ఆశయంతో... "

    ఆయన చెప్పడం ఆపాడు.
 
    అంతమందిలో ఎవరికీ  అర్ధం కాని ఆయన ప్రసంగం... మొట్టమొదటగా అర్ధమైంది ఎవరికంటే - రవివర్మకి! 
 
    సిగ్గుతో -  తలొంచుకున్నాడు. ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని అతని హృదయం - అతన్ని చూసి వెక్కిరించినట్టైందతనికి. 

    జనం స్థంభించి పోయారు. 

    అంత  నిశ్శబ్దంలోను -  ఒక కరతాళ  శబ్దం వినిపించింది. సర్పంచ్ కూతురు సంతోషంగా  లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. 

    ఆమెని చూసి ఒకరు... మరొకరు... అలా అలా... క్షణాలలొ ఆ ప్రదేశ మంతా చప్పట్లతో మారుమోగిపోయింది 

    అప్పటి దాక మౌన శ్రోతలా  నిలబడిన  రావి వృక్షం  హాయిగా గాలి పీల్చుకుంది. ఆకులన్నీ  గలగలమన్నాయి - హర్షంతో కావొచ్చు!

    ఆకాశం మొహం   విప్పార్చుకుంది. మేఘం- కదిలి నవ్వింది. 

    గూట్లో ఒక పక్షి  గొంతు విప్పింది.

    "ఎంత గొప్ప సత్యం చెప్పాడాయన?!  ఆయనకి మనం  సన్మానం చేయాలి" అని అంటున్నారెవరొ...

    కాని ముసలాయన అప్పటికే అక్కణ్నుంచి  కదలి, చకచకా వెళ్ళిపోతున్నాడు. 

    అది చూసి -  "ఆగండాగండి"  అంటూ ఆమె  కంగారుగా ఆయన వెనకాల  పరుగు తీస్తొంది.  

    "దీని పిచ్చి ఇది పాడుగాను... కొంపతీసి  ఆ ముసలోడి హృదయం కాని దీనికి  నచ్చలేదు కదా?  అమ్మో! నా కొంపంటుకుంది బాబోయ్..." గుండెలు బాదుకుంటూ..."పాపా! ఆగు... అక్కడే ఆగు" అంటూ  కూతురి వెనక పరుగు పెట్టాడు సర్పంచ్. 

    "ఒరేయ్... రండ్రా" అంటూ. ఆయన వెనకే జనమూ అంగలేయసాగారు.

    ముసలాయన నడక వేగాన్ని అందుకోవడం కష్టం గా వుంది అందరికీ.

    ఇంతలో... హఠాత్తుగా ఆయన దారికి ఓ యువకుడు  అడ్డు రావడంతో  - ఆగిపోయాడు. 

        అక్కడ జరుగుతున్న ఆ దృశ్యాన్ని అందరూ ఆసక్తిగా వీక్షిస్తున్నారు. .

    ఆయన కెదురెళ్ళి -  ఆగమంటూ అభ్యర్థి స్తున్నాడు  యువకుడు. 

    ఆగిన ఆ ముసలాయనకి -  తన  రెండు చేతులూ జోడించి, అంజలి ఘటించాడు. ఆ తర్వాత ఒక చేతిలోకి తన హృదయాన్ని తీసుకుని, అందులో  ఒక భాగాన్ని కోసి, ఆ పెద్ద మనిషి హృదయానికి అతికించాడు. 

    ఇప్పుడక్కడ ఎలాటి రసికారుతున్న ఆనవాళ్ళూ లేవు. 
  
    పట్టలేని ఆనందంతో -  ఆ యువకున్ని హృదయానికి హత్తుకున్నాడు ఆ ముసలాయన. 

    ఇదంతా చూస్తున్న  ఆమె కళ్ళు అమితానందంతో - మెరిసిపోయాయి. .
 
    కూతురు ముఖం ఇంతగా వెలిగిపోడానికి  కారణం తెలీడంలేదు సర్పంచ్ కి. 

    రక్తంతో తడిసిన ఆ యువకుని హృదయాన్ని తండ్రికి చూపిస్తూ చెప్పింది - "నాన్నా! ఇదీ! ఇదీ...హృదయ సౌందర్యమంటే" అంటూ కళ్ళెంట నీళ్ళొచ్చేలా  నవ్వింది.
 
    సర్పం చ్ మాత్రం నవ్వలేదు. 


Comments