రైల్లో సుందరి - వాసా ప్రభావతి

    
ఢిల్లో స్టేషన్ నుంచి ఎ.పి.ఎక్సుప్రెస్స్ బయలుదేరి వేగం పుంజుకుంది. ఎదురు వచ్చే రైళ్ళు 'బొంయ్'మంటు మరింత వేగంగా దూసుకుపోతున్నాయి. ఇరువైపులా ఉన్న కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు రేఖామాత్రంగా కనిపిస్తూ కనుమరుగైపోతున్నాయి. కొన్ని రైళ్ళు ఇంకా వేగంగా నడుస్తాయిట. "మనుష్యుల సృష్టి కూడా ఎంత చిత్రమైంది?" అని అనిపించక మానదు!

    బండి ఆగిన చోట రైలు స్టేషన్ ప్లాటుఫారాల మీద సందడి ఇంతా అంతా కాదు. రైలు పెట్టెలో కూడా అంత సందడీ ఉంది. "కాఫీ!కాఫీ! చాయ్! చాయ్! కూల్‌డ్రింక్స్, కూల్‌డ్రింక్స్, వేడి వేడి మసాలా గార్లూ!" అంటూ ఒకటే అరుపులు. ఇంక మంచినీళ్ల సీసాలు అమ్మేవారే ప్రతి అయిదు నిమిషాలకు వస్తూనే ఉన్నారు. ఇది రెండవతరగతి పెట్టె కదా! అందరినీ ఆహ్వానిస్తుంది. వాటిని చూసేటప్పటికి కొందరు అవసరం లేకపోయినా కొనుక్కొని తింటూనే ఉన్నారు. వారిలో నేనూ ఉన్నా! వారిలో నేనూ ఒకతినే! ఎప్పుడూ ఇంటిదగ్గర తాగని దాన్ని టీ, కాఫీలు కొనుక్కుని తాగుతూనే ఉన్నా! మానవ స్వభావం అటువంటిది. మధ్యాహ్న భోజనం చెయ్యాలిగా! ముందు టమేటా సూప్ తెప్పించుకున్నాం.  నేను, నాతో ఉన్న నా స్నేహితురాలు సూప్ అందించగానే ప్లాస్టిక్ గ్లాసు అందుకుని గబగబా తాగేశాం! అందులో పదార్థం ఎలా ఉందో మేం చూసుకోలేదు. నా ఎదురుగా ఉన్న అమ్మాయి గ్లాసులో ఉన్న సూప్‌ని పరిశీలనగా చూసింది. అందులో చచ్చిన పురుగులు ఒకటి, రెండు కాదు చాలానే కనపడ్డాయి. అవి బియ్యానికి పట్టే పురుగులు. సూపులోకి ఆ పురుగులు ఎలా వచ్చాయో అర్థం కాలెదు. "బహుశా! అన్నం వార్చిన గంజి పోసి ఉంటాడు!" అంది ఆ అమ్మాయే. బి.ఎ.పాసై ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోందిట. పైసలు పుచ్చుకోవడానికి వచ్చిన అతనికి  పైసలు ఇవ్వనని గ్లాసులో ఉన్న పురుగుల సూప్‌ని చూపించింది. ఆ అమ్మాయికి మద్దతుగా అతన్ని అందరు తలోమాట అన్నాము. అతను ఏమీ మాట్లాడలేదు. మా దగ్గర పైసలు వసూలు చేసుకుని, ఆ గ్లాసుకి పైసలు పుచ్చుకోకుండా ముందుకు అడుగువేసాడు. "నేను హైదరాబాదులో దిగగానే కంప్లైంటు ఇస్తాను!" అంది. ఆమాటలు కాస్త గట్టిగానే వినిపించాయి. అతను ఒకసారు వెనక్కి చూసి 'అదేం లెక్కమాకు! ఇవన్నీ అలవాటే. మమ్మల్ని ఏమీ చెయ్యలేవు' అన్నట్టు ముందుకు వెళ్లిపోయాడు. ఇంక చేసేదేమీ లేక ఆ విషయమే రకరకాలుగా చర్చించుకుంటూ కూర్చున్నాం కాని కడుపులో దేవుతూనే ఉంది.

    అంతలో ఒక పిల్ల "ఈ రేయి తీయనిది! ఈ చిరుగాలి మనసైనది!" అంటూ పాడుతూ మా పెట్టెలోకి వచ్చింది. ఆ పాటలో ఏముందో అర్థం చేసుకునే వయసు కాదు. కాని ఆ కంఠంలోని మాధుర్యం  ముందు ఆ కోకిల పాట కూడా చిన్నపుచ్చుకుంటుంది. ఆ అమ్మాయి చేయి చాచగానే అందరూ పైసలు ఆమె చేతిలో పెట్టారు. ఆమె పాట ఆలపించింది.

    "ఇంకో పాట పాడు" అన్నాను నేను.

    "మళ్ళీ పైసలు ఇస్తావా? మళ్ళీ పైసలు ఇస్తేనే పాడతా?" అంటూ ఆ పిల్లతెలివికి నేను తెల్లబోయి చూశాను. ఆమె తెలివి ముందు నేను ఓడినట్టే కదా.

    అంతలో బలార్షా స్టేషన్ దాటింది రైలు. "ఇంక వచ్చే స్టేషన్ నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రారంభమవుతుంది" అంది ఎదురుగా కూర్చున్న బెంగాలీ ఆవిడ.

    "అవునండీ" అన్నాను నవ్వుతూ. 'ఆంధ్రప్రదేశ్' అనగానే మనసులో ఏదో ఉత్సాహం, చెప్పలేని ఆనందం కలిగింది. అంతలో జామపళ్ళు అమ్మకానికొచ్చాయి. పెట్టెలో సన్నని జామపళ్ళ సువాసన వ్యాపించింది. 

    "చూశారా! జామపళ్ళ సువాసన! ఆంధ్రప్రదేశ్ అంటే ఆ పరిమళం లాగే ఎంతో ఇష్టమండీ" అంది ఆ బెంగాలీ ఆవిడే తిరిగి.

    "అలాగా? అంత ఇష్టమాండీ?" అన్నాను.

    "అవునండి. కలకటా, డిల్లీ కంటె ఎపి చాలా బాగుంటుంది. ఇక్కడి రోడ్లు బాగున్నాయి. పిల్లల చదువు బాగుంది. మా అబ్బాయి, అమ్మాయి హైదరబాదులోనే ఇంజనీరింగ్ చేస్తున్నారు" అంది సంతోషం వ్యక్తం చేస్తూ.

    "మీరెందుకు ఇక్కడ ఉన్నారు?" ఎప్పుడో అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడిగాను.

    "మా వారు ఇక్కడ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఆయనకి ట్రాన్స్‌ఫరయినా మేము ఇక్కడే ఉంటాము. ఇక్కడ ఓ ఇల్లు కట్టుకుని స్థిరపడతాం" అంది సంతోషంగా.

    "అంత ఇష్టమా? అయినా హైదరాబాదు అందరికి నచ్చుతుందిలెండి?" అన్నాను. "నచ్చనిది ఎవరికి? అందరూ వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. అందుకే మేము నగరంలో ఊపిరి పీల్చుకునే గాలి లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం" అనుకున్నాను మనస్సులో. ఎవరి స్వార్థం ఎవరి సౌకర్యం వారిది కదా.

    "ఇక్కడ ఇడ్లీ, వడ, పెసరట్టు, దోసె, సాంబారు ఎంత రుచిగా ఉంటాయండీ. భోజనం మానేసి అవే తినాలనిపిస్తుంది" అంది నోరు చప్పరించుకుంటూ ఆవిడే తిరిగి.

    "నిజమే! నాలుగు రోజులు బయట ఉంటే ఎంత లోటు అనుకుని నేను కూడా ఇడ్లీ, వడ, దోసె గుర్తుకొచ్చి నోరు చప్పరించుకున్నాను. అంతలో సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బండి ఆగింది. ఎపిలో అడుగుపెట్టినందుకు మనసులో తెలియని ఉత్సాహం ఆవరించింది.   

    "జననీ జన్మ భూమిశ్చ
    స్వర్గాదపి గరీయసి" అన్న రామాయణంలోని రాముని మాటలు గుర్తుకొచ్చాయి. కిటికీలోంచి అటు ఇటు చూశాను. స్టేషన్ జనంతో కళకళలాడుతోంది. అంతలో ఒకామె రైలు పెట్టెలోకి వచ్చింది. బయటకు చూడ్డం మానేసి ఆమె వైపు చూశాను. రెండు చేతులతో కర్రతో చేసిన గాజుల స్టాండులు, గరిటెలు, కవ్వాలు, అగరుబత్తుల స్టాండులు పట్టుకుంది. అందరూ తలొకటి బేరం చేస్తున్నారు. ఆ కర్ర అగరుబత్తుల స్టాండులు నన్ను ఆకర్షించాయి. అవి ఆరు అంగుళాల పొడవే ఉన్నాయి. "ఇంకొంచెం పెద్దవి లేవా?" అడిగాను. "లేవమ్మా" అంది. అవి కూడా ఎవరైనా కొనేస్తారని ఆమెను పిలిచాను. రెండు కొందామంటే ఎవరో కొనేశారు. మిగిలిన ఒకటి రూ.15/- ఇచ్చి బేరం చెయ్యకుండానే తీసుకున్నా. ఆమె ముందుకు కదిలింది.

    అంతలో మరొక యువతి అక్కడ ప్రత్యక్షమయింది. ఆమె చేతిలో కూడా అదే కర్ర సామాను ఉంది. గాజుల స్టాండుకు ఎరుపు, పసుపు రంగులున్నాయి. రెండు చేతులు చాచిన చిన్నారి ముద్దుగా ఉంది. పరిశీలనగా చూశా. అగరుబత్తుల స్టాండులు అడుగు పొడవులో ఉన్నాయి. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎవరైనా కొనేస్తారేమోనని "ఇటురా! ఇటురా!" అంటూ గబగబ పిలిచాను. ఆమె అందరి చేతుల్లో అప్పటికే కొన్న సామాను చూసినట్టుంది. కళకళలాడుతున్న ఆమె ముఖం ముడుచుకుంది. తనకంటె ముందు వచ్చిన ఆమెను గుర్రుగా చూసింది. ముందుకు వెళ్లిపోతున్న ఆమె వెనుతిరిగి చూడలేదు. చేతిలో సామాను అమ్ముకుంటూ కదులుతోంది.

    ఆమె నా పిలుపు విన్నట్టులేదు. నా దగ్గరకు రాలేదు. మళ్లీ పిలిచాను. ఈసారి నావైపు చూసింది. "ఇటురా" అన్నాను. చేతులనిండా సామానుతో నా దగ్గరకు వచ్చి నిలబడింది. ఆమె ముఖం వైపు చూశాను. నల్లటి నలుపు. కాని చారడేసి కళ్ళతో, కోలగా ఉన్న చిన్న ముక్కుతో అందంగా ఉంది. నలుపులో కూడా ఏమి అందం! పార్వతి నలుపు, ద్రౌపది నలుపు అంటారు. ఈమె కూడా వారిలా అలంకరించుకుంటే చాలా అందగత్తెల కోవకు చెందుతుంది. అలా ఆమె ముఖాన్ని ఊహించుకుని నాలో నేనే నవ్వుకున్నాను.

    "మీరైనా కొనండమ్మా" అంది.

    "నీకు తెలుగువచ్చా?" అడిగాను.

    "మేము తెలుగోళ్ళమే. మీరైనా కొనండమ్మ. అది నన్ను తోసుకుని ముందు వచ్చి అన్నీ అమ్మేసుకుందమ్మా. ఇప్పుడు నా సామాను ఎవరు కొంటారు" అలా అంటూంటే ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర కదిలింది. 

    "నిజమే! భోజనానికి ముందుండాలంటారు! వ్యాపారానికి కూడా ముందే ఉండాలి" లోపల అనాలనుకున్న మాటలు పైకే అన్నాను.

    "ఏంటమ్మా అంటున్నారు" ఆమె అమాయకంగా అడిగింది.

    "ఏం లేదులే. ఆ అగరుబత్తుల స్టాండులు చూపించు."

    నా మాట పూర్తికాకుండానే ఆమె అవి నాముందు పెట్టి, "తీసుకోండమ్మా"అంది.

    "ఎంతకిస్తావు?" కాస్త బేరం చెయ్యాలని అడిగాను.

    "ఇరవై రూపాయలమ్మా" అంది నవ్వుతూ.

    చిన్న చిన్న పళ్ళతో మరింత అందంగా ఉంది. ఆ నవ్వుతో ఆమె ముఖం తళుక్కుమంది.

    నల్లటి ముఖం. నల్లటి జుట్టు. తెల్లటి పళ్ళు? తెల్లటి కనుగుడ్లతో నల్లటి కనుపాపలు? ఏమిటో ఈ సృష్టి రహస్యం అనుకున్నాను. తరువాత నా దృష్టి తిరిగి అగరు బత్తుల స్టాండు వైపు మరల్చా.  వాటిని అటు ఇటు తిప్పి చూడా. అడుగు ఎత్తులో నా కంటికి ఆకర్షణీయంగా కనపడ్డాయి. ఎలాగైన వాటిని కొనాలని నిశ్చయించుకున్నాను.

    "నీ దగ్గర ఎన్నున్నాయి?" అని అడిగా.

    "నాలుగున్నాయి అమ్మగారు" అంది.

    "జత రూ.30/- ఇయ్యి. నాలుగు నేనే కొంటా."

    "సరేనమ్మా!" ఆమె నాలుగు ఇచ్చి రూ.60/- తీసుకుంది.

    "ఇవి కూడా తీసుకోండమ్మా. ఈ పొద్దు బేరమే లేదమ్మా" అంతలో బండి కదిలింది.

    "నువ్వు దిగిపో" అన్నాను కంగారుగా.

    "లేదమ్మా. ఇంకో టేషన్‌లో దిగుతా. ఈ సామాను కూడా కొనమ్మా" అంది దీనంగా.

    "ఏం? అమ్మకపోతే నీ మగడు కొడతాడా?" అని అడిగా.

    "ఆడు కొట్టడు. తిట్టడు. శానా మంచోడమ్మా" అంది. అలా అంటుంటే ఆమె ముఖంలో సంతోష రేఖ కదిలింది.

    "మీ అత్త తిడుతుందా?" ఆతురతగా అడిగాను. సాధారణంగా అందరికి ఉండే సమస్య అది కదా అని.

    "మా అత్త ఏరుగా ఉంటది. నా జోలికి రాదమ్మా" అంది.

    "మరి ఏమిటి సమస్య?"

    "నా ఇంటోడు ఈ సామాను అమ్ముతూనే రైలు దిగుతూ చక్రాల కింద పడ్డాడమ్మా. వేళ్ళు నలిగిపోయాయి. రెండు కాళ్ళు మోకాళ్ళ వరకు లేవు. సామాను తయారు చేస్తాడు. నా చంటి బిడ్డను చూస్తాడు. నేను ఇలా వచ్చి అమ్ముకుపోతా. ఈ సామాను అమ్ముడు కాకపోతే నా బుడ్డోడికి పాలుండవమ్మా" ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. చేతుల్లో సామానులు. కళ్ళు తుడుచుకోనేలేదు. నాకే జాలేసింది. నా గుండె కలుక్కుమంది.

    "ఈ సామానంతా ఎంత ఖరీదవుతుంది?" అడిగాను.

    "గాజుల స్టాండులు రెండు 40 రూపాయలకిస్తా. పప్పు గరిటెలు రెండు 20 రూపాయలు. కవ్వాలు రెండు 20 రూపాయలు. అప్పడాల కర్రలు 20 రూపాయలు. మొత్తం వంద రూపాయలమ్మ" ఆమె మాటల్లో తిరిగి ఏదొ కొత్త ఆశ. నేను కొంటానని కాబోలు అనుకున్నాను. 

    నేను ఆలోచించా. ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాము. పైగా రైల్లో ఎన్ని కొనుక్కు తిన్నాము. మొత్తం నూట యాభై రూపాయలయింది. పీగా ఢిల్లీలో ఏమీ కొనలేదు. ఈ సామానులు కావలసిన ముఖ్యులకి ఇస్తే ఎంతో సంతోషిస్తారు. నా మనస్సుకి నచ్చింది నా మాట.   

    "నేను తీసుకుంటా" అంటూనే పర్సు తీసి వంద నోటు ఆమె చేతిలో పెట్టాను. ఆమె ముఖం తిరిగి కళకళలాడింది.

    "నా బుడ్డోడికి రెండురోజుల వరకు పాల బాధ లేదమ్మా" అంది సంతోషంగా. ఆమె వయస్సు ఇరవై సంవత్సరాలు మించి ఉండదు. ఆమె సంతోషంలో నేను పాలు పంచుకున్నాను.

    ఆమె రెండు చేతుల్లో మిగిలిన సామాను అక్కడ పెట్టి నా రెండు పాదాలు పట్టుకుంది.

    "అదేమిటి? చేతులు తీసేసెయ్యి" అంటూ ఆమె రెండు చేతులూ తోసేశాను. 

    "సల్లగా ఉండమ్మా" అంది నవ్వుతూ. 

    "నువ్వు నీ కొడుకు, నీ మగనితో చల్లగా ఉండాలి" అన్నాను నేనూ నవ్వుతూ.

    అంతలో పక్క  స్టేషను రానే వచ్చింది.

    "ఎల్తానమ్మా" అంది చిరునవ్వు చిందిస్తూ.

    "నీ పేరేమిటి?" అప్పుడు అడిగాను.

    "సుందరి" కిలకిలా నవ్వుతూ రైలు దిగడానికి పరుగెత్తింది.

    "సుందరి నీకు తగిన పేరు" అనుకున్నాను. తగిన ఖర్చు అంటే ఇదే కాబోలు. దానం ఎప్పుడూ తగిన పాత్రకు చెయ్యాలంటారు. ఖర్చు కూడా అంతే! సామాను వైపు మరోసారి చూసుకున్నాను. సంతృప్తిగా అనిపించింది. బాగ్‌లో సర్దుకున్నాను.

    "ఆమె మాయలో పడి అతంత సామాను కొనేశారేమిటి?" అంటూ అడిగింది నా స్నేహితురాలు. 

    "అందరికీ ప్రజెంటు చేద్దామని కొన్నా. బాగున్నాయా?" అని అడిగాను. 

    "చాలా బాగున్నాయి" అంది ఆమె.

    ఆమె వైపు చిరునవ్వుతో చూశా.

    "సూప్ కొన్నా. పది రూపాయలు దండగయ్యింది. పైగా తాగిన సూపులో పురుగులున్నాయేమో, కడుపులో దేవుతూనే ఉంది. పైకి అంటే బాగుండదని నోరు మెదపలేదు. పాట పాడిన పిల్ల అంత మాట అని పోయింది. కాని ఇప్పుడు ఎంతో సంతృప్తి కలిగింది."

    "నిజంగా ఆమె రైల్లో సుందరే!" మనస్సులో సంతృప్తి. ఆమెను తలుచుకుంటూనే రైలు దిగాను. ఇప్పటికి రైల్లో సుందరిని తలుచుకుంటే హాయిగా ఉంటుంది.

(పత్రిక దీపావళి ప్రత్యేక సంచిక అక్టోబరు 2006 సంచికలో ప్రచురితం)  
Comments