రాజీనామా - పొన్నాడ కుమార్

    
ఆదర్శ కళా సమితి సెక్రెటరీ ధర్మరాజు తన పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖను స్వయంగా అధ్యక్షుల వారి కందజేసెసరికి ఆనాటి సర్వసభ్య సమావేశమంతా అతలాకుతలమైపోయింది.  ద్రోణాచార్యుల్లాటి అధ్యక్షులవారు సైతం ఆశ్చర్యపోయారు. సభ్యులు చాలామంది ఆడా-మగా, పిన్నా-పెద్దా ఆందోళన చెందసాగారు. ధర్మరాజు హఠాత్తుగా ఇలాంటి బాంబ్ షెల్ల్ విసురుతాడని ఎవరూ కలనైనా ఊహించలేదు. 

    తన రాజీనామాకు కారణం తన వ్యక్తిగత విషయమేననీ, తాను సమితిలో ఉండగా ఆ వ్యక్తిగత విషయం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్య సమితి పరువు ప్రతిష్టలకే భంగం కలిగించ వచ్చనీ, అందుకై సమితి నుండి ముందుగానే తప్పుకుంటే ఉభయకుశలోపరి కాగలదనీ ధర్మరాజు తన లేఖలో పేర్కొన్నాడు. వ్యక్తిగత విషయం సమితితో అంతగా ముడిపడి ఉన్నప్పుడు అది ఎంత ఆంతరంగికమైనా, ఎంత రహస్యమైనా పైకి వెల్లడి చేయందే రాజీనామాను అంగీకరించలేమన్నారు కొంతమంది సభ్యులు.

    సభ్యుల్లో వివాహితులున్నారు. అవివాహితులున్నారు. ఉద్యోగులున్నారు. నిరుద్యోగులున్నారు. ధర్మరాజంటే అందరికీ ఇష్టం. నఖాంగుళీయ న్యాయంగా ధర్మరాజు కూడా వారితో వీడని అనుబంధాన్ని పెంచుకున్నాడు.

    ఆరేళ్ళ కిందట ఆరుగురు సభ్యులతో వెలసిన ఆ సమితి ఈనాడు వందమంది సభ్యులతో మూడు పువ్వులూ, ఆరు కాయలుగా వర్ధిల్లుతోందంటే అది ధర్మరాజు కార్యదర్శిగా చేసిన కృషి ఫలితమేనని ప్రతి ఒక్కరికీ తెలుసు.

    కలం పట్టి ఓ పంక్తి రాయగలిగిన వారినీ, గజ్జెకట్టి రెండడుగులు వేయగలిగిన వారినీ, కుంచె పట్టి మూడు గీతలు గీసే వారినీ, గళం విప్పి నాలుగు చరణాలు పాడే వారినీ గుడిసెలో ఉన్నా, మేడలో ఉన్నా కాగడాతో వెతికి పట్టుకుని సమితిలో సభ్యులుగా చేర్పించిన ఘనత అతనికే దక్కింది.

    పండుగలకూ, జాతీయ పర్వదినాలకూ ప్రత్యేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పరచి, ఊళ్ళోని వారిని కూడా పిలిచి చూడమనీ, వినమనీ, అభిప్రాయాలు చెప్పమనీ కోరుతూ వారిలో కూడా కళాభిరుచి కలిగించిన ఖ్యాతి కూడా అతనికే దక్కింది.

    సమితి వార్షికోత్సవాలలో లబ్ధ ప్రతిష్టులైన కవులనూ, పండితులనూ, కళాకారులనూ పైనుంచి రప్పించి వారి విద్వన్మకరందాన్ని ప్రజకు పంచి ఇచ్చిన గౌరవం కూడా అతనిదే.  

    అతడి క్రియాశీలతను గమనించిన పుర పెద్దలు యువకుడు పనికొస్తాడనుకుంటూ 'చిరంజీవ సుఖీభవ!' అని ఆశీర్వదించారు. సమితి బిల్డింగ్ కోసం కళాబంధువైన ఓ భూకామందు స్థలం ఇస్తే దాని నిర్మాణానికై ఉదారులైన వర్తక శ్రేష్ఠులు భూరి విరాళాలిచ్చారు.

    ప్రతివారం లాగే ఆ శనివారం కూడా సభ్యుల సాహితీ ప్రక్రియలతో కళకళలాడవలసిన సమావేశం ధర్మరాజు రాజీనామాతో పుట్టుకొచ్చిన కలక్లంతో కళావిహీనమైపోయింది.

    భక్తినీ, రక్తినీ ఒంటబట్టించుకోవడాణికి నిష్కల్మషంగా అరిగిపోయే మంచి గంధపు చెక్కలా కళాభక్తినీ, కళానురక్తినీ నరనరాల్లో ఎక్కించడానికి నిస్వార్థంగా శ్రమించే ధర్మరాజు సమితి నుండి నిష్క్రమిస్తే ఆ ఖాళీని భర్తీ చేయడం కష్టమే అని అధ్యక్షుల వారు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయంతో చాలామంది ఏకీభవించారు.

    అప్పటివరకూ స్తబ్దుగా కూచున్న సభ్యురాలు కుమారి కళ్యాణి ఆఖరున ఏదో మాట్లాడబోయి ఊరుకుంది. మొదటి నుంచి అందరి రియాక్షన్సునూ గమనిస్తున్న అధ్యక్షులవారు ఆమె ఏం చెబుతుందోనని ఆశగా చూశారు. ఆమె బెట్టు ఎబ్బెట్టుగా ఉంది. చుట్టూ ఉన్న పదిమంది సభ్యురాళ్ళు ఆమె వాలకాన్ని ఏవగించుకున్నారు.

    అధ్యక్షులవారు సమావేశాన్ని ముగించే ముందు ఇలా అన్నారు "మార్చి ఒకటో తారీఖున సమితి వార్షికోత్సవం కాబట్టి ధర్మరాజు ఈ నెలరోజులూ కార్యదర్శిగా తన పదవిలో కొనసాగాలని ప్రతిపాదిస్తున్నాను. ఆ తర్వాత తగిన కారణం చూపితే రాజీనామాను ఆమోదిస్తాం."

    ప్రతిపాదనను అంతా బలపరుస్తుంటే కళ్యాణి బుస్సు మంటూ లేచింది. "ఆగండి! కారణం వ్యక్తిగతమని ధర్మరాజుగారు గోలపెడుతుంటే ఇంకా ఏం తగిన కారణం ఆయన చూపాలి?" అని అడిగింది బింకంగా రాజీనామాను సమర్థిస్తున్న ధోరణిలో.

    "నీ ఉద్దేశం బోధపడింది కళ్యాణీ! వార్షికోత్సవం తర్వాత మూజువాణి ఓటింగుతో అందరి అభిప్రాయాలూ తెలుసుకుని అతని రాజీనామా విషయాన్ని సమితి పరిశీలిస్తుంది. అంతవరకు ధర్మరాజు ఉంటాడు" అంటూ అధ్యక్షులవారు సెలవిచ్చారు.

    ధర్మరాజు మౌనం. కళ్యాణి కూడా మరేం మాట్లాడలేదు. 

    సమావేశం ముగిసింది.

    సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన ధర్మరాజు ఒక్కడే తనగదిలో కూర్చుని తీవ్రంగా ఆలోచించాడు. రాజీనామా విషయంలో తాను తొందరపడ్డాడేమో అని మథనపడ్డాడు. ఒక్క కళ్యాణి తప్ప మిగతా సభ్యులంతా ఇంచుమించు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారంతా సమితిలో తనను ఉండమన్నా, సమితి నొదిలి తాను పోతానన్నా ఈ రెండూ పరస్పర విరుద్ధమైన కోర్కెలే అయినా వారిదీ, తనదీ లక్ష్యమొక్కటే! అది సమితి అస్తిత్వం కోసమే కేంద్రీకృతమైంది. అందుకే అందరూ ఈ నెల్లాళ్ళ లోపున తిరిగి కారణం చూపమన్నారు. అసలు కారణం చూపందే తనను వారెలాగూ వదిలేటట్లు లేరు. ఆ కారణమేదో చెప్పడం తన విధి. సమితి మనుగడ కోసం రాజీనామా ద్వారా తను చేయవలసిన త్యాగం నిర్హేతుకం కాదని వారు ఒప్పుకోవచ్చు. అయితే ముఖ్య కారణం చూపాలంటే ఏ వ్యక్తి ద్వారా ఈ సమస్య పుట్టుకొచ్చిందో ఆ వ్యక్తి పేరు సమితికి చెప్పాలి. అలా ఆ వ్యక్తిని రచ్చకీడ్చిన ఫలితంగా సదరు వ్యక్తికి గౌరవ హాని జరిగితే తాను భరించగలడా? అది తనకు కూడా మాన హాని కాదా? తాను రాజీనామా చేయకుండా ఉంటే? ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో తనకేమీ తోచటంలేదు. సడలిపోతున్న ఆత్మధృతిని కూడదీసుకుని కాస్త ముందుకు చూస్తే తన భవిష్యత్తు కన్నా సమితి భవిష్యత్తే ముఖ్యమైనదిగా కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి పేరు చెప్పకుండా తాను రాజీనామా కోరడం ఉచితమో, అనుచితమో సమితే నిర్ణయించగలదని ధైర్యపడ్డాడు. 

    గది తలుపు చప్పుడైంది. ఆలోచనల నుంచి తేరుకుని ధర్మరాజు తలుపుతీశాడు.

    ఇంగ్లీషొచ్చిన తెలుగు మాస్టారు ఎదురుగా ప్రత్యక్షం.

    "రండి! రండి" అంటూ ధర్మరాజు సవినయంగా నమస్కరించి ఆసనం చూపించాడు.

    "నువ్వీ సమయంలో ఉంటావో ఉండవో అనుకున్నాను. ఈ వేళ, సమితి సమావేశం ముందుగానే ముగిసిందని కళ్యాణి చెప్పింది. ధైర్యపడ్డాను. అదీగాక ఈ రోజు బ్యాంకు కూడా లేదు. ఉన్నా నాలుగ్గంటలకే వచ్చేస్తావులే. అదృష్టవంతుడివి. నాలుగ్గంటల పనికి నాలుగువేలు జీతం. పెద్ద బ్యాంకు ఆఫీసరువి. నా సంగతా? బతకలేక ఏదో... ఇరవై నాలుగ్గంటలూ వెట్టిచాకిరీయే. తీరికే దొరకదు. ఇంటిదగ్గర ఏమవుతుందో కూడా తెలీదు. మీ సమితి సంగతి సరే సరి" అంటూ మాస్టారు ఈజీ చైర్లో కూలబడ్డారు.

    "అదేంటి మాస్టారూ అలాగంటారు? మీకేం? నేటి బాలలను రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వృత్తిమీది. ఏ వెలకైనా కొనలేనంత ఖరీదు గల సరస్వతీ పుత్రులు మీరు. మీ శిష్యులు కొంతమంది విదేశాల్లో విశేష ప్రతిబా సంపన్నులై ఉన్నారు. తెలుగు భాషను అధ్యయనం చేస్తూ మాతృభాషను మరిచిపోలేదంటూ అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తుంటారు" అంటూ ధర్మరాజు ఎదురుగా కూచున్నాడు.

    మాస్టారు భుజాలెగరేశారు. రామారావు దగ్గరనుంచి రాజీవ్ గాంధీ వరకూ రాజీనామాలు చేయడంలో గల రాజకీయ కారణాల నేపథ్యాన్ని పురస్కరించుకుని ఓ అరగంట యమయమగా ఉంపన్యసించారు. నాయకులిద్దరి పేర్లలో మొదట 'రా' వుంది. అందుకే ప్రజలు 'పో'అన్నారన్నారు.కేంద్రంలో కిచిడీ ప్రభుత్వం ఎడారిలో బాటసారుల సదస్సు అని అభివర్ణించి అసలు విషయాన్ని అందుకున్నారు మాస్టారు -

    "చూడు రాజూ! ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న మీ సమితికి  నీ అంతట నువ్వే రాజీనామా ఇవ్వదలుచుకున్నందుకు నాకో పక్క విచారంగా ఉన్నా మరోపక్క సంతోషంగా ఉంది. అదే నువ్వు నాకు త్వరలో అల్లుడివి కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. మా కళ్యాణి, ఈనాడు మీ సమావేశంలో జరిగిందంతా చెప్పింది ఏ టు జడ్. స్త్రీకోసం చక్రవర్తులు సైతం చేసిన త్యాగనిరతి నీలో ఉందని ఆమె ఉప్పొంగిపొయింది. నీ పెళ్ళి విషయంలో నువ్వు సర్వ స్వతంత్రుడవని తెలిసి నీతో ముందుగా సంప్రదించడానికని వచ్చను. మీ నాన్నగారితోనూ, అమ్మగారితోనూ - వారు తిర్థయాత్రలు ముగించుకుని ఇంటికి రాగానే వెంటనే వచ్చి మాట్లాడుతాను. అది నా ధర్మం. మన సంప్రదాయం."

    విషయం అంతవరకూ వస్తుందని ధర్మరాజు అనుకోలేదు. అయినా మాస్టారి మాటలకు అతడు అదిరిపడలేదు. చెదిరిపోలేదు. సౌమ్యంగా అన్నాడు - "మాస్టారూ! మొన్న పార్కులో కళ్యాణితో ఎన్నో విషయాలు మాట్లాడాను. అయినా నా రాజీనామా తన గురించే అనుకుంటే నా రాజీనామా సంకల్పంలోని అంతరార్థం ఆమె గ్రహించలేదన్నమాట. ఆమె నన్ను పెళ్ళి చేసుకోనున్నట్లు మొన్న ఆమె చెప్పేవరకూ నాకు తెలీదు. అంతవరకూ నాకు రాజీనామా తలంపే లేదు. మీరిపుడు ఎంతో ఆశతో వచ్చారు. క్షమించాలి. నేను ఆమెను పెళ్ళి చేసుకోలేను."   

    "ఏం? ఎందుకు చేసుకోలేవు? నువ్వు కూడా తనను ప్రేమిస్తూన్నట్లు ఆమె చెప్పిందే!" ఆపేక్షగా మాస్టారన్నారు.

    "అవును. ప్రేమించాను. సమితిలో ఉన్న ప్రతి సభ్యుడినీ,సభ్యురాలినీ అలా ప్రేమించాను. నేను ప్రేమించింది కళ్యాణిని కాదు; కళ్యాణిలో ఉన్న కళాహృదయాన్ని మాత్రమే. మా పరస్పర ప్రేమానురాగాలు పెళ్ళికే అనుకుంటే ఆ పెళ్ళితో మా వ్యక్తిత్వాలను మేం చంపుకున్నట్లే. మా సమితిని మేము సమాధి చేసినట్లే"

    "ఏమిటీ అపశకునపు మాటలు? పెళ్ళంటే చావు అంటావేంటి? ఇన్నాళ్ళూ మీ ఇద్దరు కలిసి మెలిసి ఆడిందీ పాడించీ ఇందుకేనా?"

"మెయిలు కన్య మెరిసింది!
ముత్యాల వాన కురిసింది!
నెమలి కన్య ఆడింది!
వెన్నల సోన పాడింది...
    
    ఇలా ఆమె రాసింది నువ్వు పాడుతూంటే ముత్యాల చుక్కల అద్దకం గల నెమలి కంఠం చీర కట్టుకుని మా కళ్యాణి నీ ముందు మయూరి నృత్యం చేసింది ఎందుకు?"   

"నల్లని జడలో తెల్లని మల్లెలు
చల్లని మనసునె చెబుతాయి!
ఇంద్రధనస్సులో వొంపుసొంపులు
రమణి సొగసునె చెబుతాయి!!...

    ఈ విధంగా నువ్వురాసి నువ్వే పాడుతుంటే ఆమె మల్లె పూలు పెట్టుకుని, తెల్ల చీర కట్టుకుని నీముందు రెయిన్‌బోలా వంగి ఒక నాట్య భంగిమను చూపించింది ఎందుకు? కళాసేవతో పాటు నీ సేవకు కూడా అంకితమై బతకాలని కాదా? కిందటేడు మీ సమితి వార్షికోత్సవానికి ముఖ్య వక్తగా వచ్చిన నాకు ఆ పాటలూ ఆటలూ ఇప్పుడు కొత్త అర్థాలను చెబుతున్నాయి. కళ్యాణి నర్తకి. సాహిత్యంలో నీ దగ్గర ఓనమాలు నేర్చుకుంటూంది. నువ్వొక సాహితీ మూర్తివి, గాయకుడివి. మానవాళి మీద సాహిత్యానికి గల ప్రభావం అమోఘం. ప్రేమను పాలిస్తుంది. పోషిస్తుంది. దయ, క్షమ, శౌచ్యం, నమత, మమత సాహిత్యానికి కల్పతరువులు. కళ్యాణి చెప్పింది నిజమే అయితే మీ ఇద్దరి  పెళ్ళీ ఒక ఆదర్శం. నీ రాజీనామాతో నువ్వొక స్వేచ్ఛా జీవివి. మీ పెళ్ళికి అడ్డేముంటుంది?" 

    "మాస్టారూ! మీరంతా అక్కడే పొరబడుతున్నారు. నేను రాజీనామా చేయనెంచింది మా పెళ్ళి గురించికాదు. సమితి సుస్థిర భవిష్యత్తుకోసం. నేను సమితిలో కనబడుతుంటే మా ఇద్దరి మధ్యా ఎన్ని అనర్థాలు జరుగుతాయో చెప్పలేం. ఏమైనా అయితే అది మొత్తం సమితికే కళంకం. నేను లేకపోతే కళ్యాణి ఆశలు పెంచుకోలేదు. నన్ను మరిచిపోగలదు" ధర్మరాజు తన రాజీనామా రహస్యాల్లోని ఓ రహస్యాన్ని వెల్లడించేడు. 
     
    "నువ్వు మీ సమితినే ఉద్ధరించదల్చుకుంటే దాన్ని పట్టుకుని నువ్వే వేళ్ళాడు. కళ్యాణినే సమితి నుంచి పొమ్మను. ఆ తర్వాత నీకు తగిన వారసుడు మీ సమితికి లభించగానే నువ్వు రాజీనామా చేసి ఆమెను పెళ్ళాడు. ఆలస్యమైనా పర్వాలేదు. ఆమె నీ మీదే ఆశలు పెంచుకుంది. ఏభై రెండు వారాలు, మూడువందల అరవై ఐదు రోజులు నువ్వెవరో, నువ్వేమిటో తెలుసుకున్న ఆమె నిన్ను ఎలా మరచిపోగలదు? నిన్నటినుంచీ పిచ్చిపిచ్చిగా నా చుట్టూ తిరుగుతూంది" మాస్టారి ఆలోచనలన్నీ ఇలా కూతురి చుట్టూ, కూతురి పెళ్ళిపందిరి చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన చతురుడు. చతుర్విధోపాయాలు తెలిసిన వాడు. ఎవర్నైనా అవలీలగా బుట్టలో వేసుకోగలడు. అలాటి ప్రమాదం కలగకుండా ఉండాలంటే సమితి స్వరూప స్వభావాలేమిటో ఆయనకు విపులంగా చెప్పడం అవసరమనుకున్నాడు ధర్మరాజు. 

    "మాస్టారూ, మీరు మా సమితి సభ్యులు కారు. మా సమితి డిసిప్లిన్ ఏమిటో స్పష్టంగా మీకు తెలిసి ఉండదు. సభ్యురాలైన కళ్యాణి కూడా చెప్పినట్లు లేదు. తన పెళ్ళి విషయమే మీతో చెప్పి ఉంటుంది.అసలు సంగతి నేను చెబుతున్నా. సాహితీ సమితులన్నా సంగీత నృత్య పాఠశాలలన్నా, నాటక సమాజాలన్నాఇంకా ఇలాటి లలిత కళా నికేతనలన్నా ప్రజల్లో కొంతమందికి ఓ దురభిప్రాయం వుంది.  సభ్యుల అసభ్య కార్యక్రమాలకూ, స్వేచ్ఛా ప్రణయాలకూ ఈ నిలయాలు అనుకూలమైన కేంద్రాలనే అపప్రద ఉంది. కళాసేవను పెళ్ళి పిచ్చికి దిగజార్చి కామలీలతోనో, ప్రేమ గోలతోనో, కొందరు నగ్నంగా వీధిని పడడం, అలా ఆ క్లబ్బులూ, అసోసియేషలూ అపఖ్యాతి పాలైపోవడం మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. అందుకు భిన్నంగా ఉండాలన్నదే మా సమితి ఆకాంక్ష. తలపండిన మా అధ్యక్షులవారు మేధావులు. పవిత్రంగా, పటిష్టంగా బతుక్కొస్తున్న సంఘాల్లో మంచివాళ్ళు ఎలా నడుచుకున్నారో ఉదాహరణలిచ్చారు. మేము ఎలా నడుచుకోవాలో చెప్పి క్రమశిక్షణ ఇచ్చారు. ప్రేమించడం అంటే పెళ్ళికాదనీ, విశ్వనీనమైన మాతృప్రేమా, భ్రాతృ ప్రేమా అన్నటికన్నా మహోదాత్తమైనవనీ, ఈ కళాసమితులూ, సమాజాలూ పెళ్ళిళ్ళ బ్యూరోలు కారాదనీ హెచ్చరించారు. అమూల్యమైన సలహాలిచ్చేరు. ఆ మేరకు సభ్యులైన వారు ఒకర్నొకరు పెళ్ళి చేసుకోరాదనే నియమం పెట్టుకున్నాం. ఆ నియమాన్ని పద్ధతిగా పాటించడమే ఈ ధర్మరాజు ధ్యేయం." 

    అంతా విని మాస్టారు భళ్ళున నవ్వారు. "ఇంత చిన్న విషయానికి ఎంత పెద్ద లెక్చరిచ్చావయ్యా! మీ నియమం వింటూంటే, ఆ పద్ధతి మా ఇంటిపక్క మిలట్రీ నాయుడు చెప్పే మార్షల్ 'లా' కఠినంగా కఠోరంగా ఉన్నట్లు తోస్తూంది. ఇది నీ ఒక్కడి నియమం అయితే పర్వాలేదు. మిగతా సభ్యులు నీ అంత నిష్ఠగా నీతిగా ఉండొద్దూ?" 

    "ఈ ధర్మరాజు లాటివారే మా సమితి సభ్యులంతా. మేం ఏకోదరులం కాకపోయినా అన్నాచెల్లెళ్ళం. అక్కాతమ్ముళ్ళం. మా అందరిదీ ఒకే మాట. ఒకే బాట. అదే మాకూ, మా సమితికీ రక్ష!" ధర్మరాజు గర్వంగా చెప్పుకున్నాడు. 
    
    

    "ఉన్నట్టుండి ప్రేమికులిద్దరూ సమితికి గుడ్‌బై కొట్టి, బయటి కెళ్ళి పెళ్ళి చేసుకుంటే మీ సమితి ఏం చేస్తుంది? 

నువ్వు ఏం చేస్తావు? చట్టబద్ధమైన నిబంధనల్నే ఉల్లంఘిస్తూంటే కేవలం నోటి మాటైన నియమాన్ని ఎవరు 

ఖాతరు చేస్తారు?"    "అలాటి దుర్గతే దాపురిస్తే ఈ సమితీ ఉండదు, ఈ ధర్మరాజూ ఉండడు. నీతి నియమాలు 

వదులుకున్నవాళ్ళు మానసికరోగులు, అవకాశవాదులు. వాళ్ళు ఎలాటి దారుణానికైనా ఒడిగడతారు. చెడుగా 

ప్రవర్తించడానికి మా నరాల్లో శక్తి లేదు. మంచిని పేంచే శక్తి మాలో ఎక్కువ. సమితి పరంగా మా అనుభవాల్లో 

ఇప్పటివరకూ ఎలాటి మచ్చలూ లేవు. కాని...నూరు కోకిలలలో ఒక కాకి ఏకాకిగా కనిపిస్తూంది, నాకిప్పు 

డిప్పుడే."    "అయితే నాకూతుర్ని కాకితో పోలుస్తావా? నీదంతా ఆత్మస్తుతి పరనింద" మాస్టారు తీక్షణంగా చూస్తూ అన్నారు.    "మన్నించండి. మా అందరిదీ ఓదారి, మీ అమ్మాయిది మరో దారి అయినందుకు బాధపడుతూ అలా 

అన్నానే గాని, ఆమెను చులకన చేస్తే దురభిప్రాయం నాకు లేదు. ఆమె అంటే సానుభూతి ఉంది. వాత్సల్యం 

ఉంది. నా రాజీనామాకు పరోక్షంగా ఆమే కారణభూతమైనా ఎక్కడా ఆమె పేరు ఉదహరించలేదు. కారణం 

వ్యక్తిగతం అంటూనాకు నేనే నైతిక బాధ్యత వహించాను" ధర్మరాజు సంజాయిషీ ఇచ్చుకుంటూన్నట్లు మొహం 

పెట్టి  అన్నాడు.

 

    మస్టారు కరచాలనం చేస్తూ అన్నారు "నాకు తెలుసు నీలో ఔదార్యముంది. మంచితనముంది. కార్యదీక్ష 

ఉంది. నీకు మంచి ఉద్యోగముంది. బోలెడు భవిష్యత్తు ఉంది. ఇద్దర్లో అందముంది. సమతుల్యమైన 

ప్రేమాభిమానాలు ఉన్నాయి. వయసు ప్రభావం మీ ఇద్దరి మీదా ఒకటే! ఇద్దరూ కలిస్తే ఈడూ జోడూ 

చూడముచ్చటగా ఉంటుంది. మీ దాంపత్యశోభ వసంతశోభ. పసిడికి తావి!..."


    "ఏం చెయ్యమంటారు మాస్టారూ? పెళ్ళి కోసం నేను ప్రేమించలేదనీ, సభ్యుల పరస్పర ప్రేమాభిమానాలు, 

ఒకరి కళా ప్రతిభను మరొకరు అభినందించుకునేవరకే పరిమితం అనీ ముందే చెప్పాను. సభ్యులతో సభ్యుల 

వివాహాలను సమితి ప్రోత్సహించదు. అంగీకరించదు. కళ్యాణి శ్రీమతి కాదల్చుకున్నప్పుడూ సమితినే పణం 

పెట్టక్కర్లేదు. కాస్త ప్రయత్నిస్తే ఎన్నడూ సభ్యుడు కాని వరుడు లభించకపోడు" ధర్మరాజు ఈ మాటలన్నీ 

దిటవుగా పలికాడు.     ఎంత చెప్పినా పాఠం సరిగ్గా చేసుకోలేని మొద్దు విద్యార్థిని కసురుకుంటున్నట్లుగా కొంచెం కటువుగా 

మాస్టారు ఇలా అన్నారు "మీ సమితిలో సభ్యులవడం మహాపాపమన్నమాట. నేరమన్నమాట! ఒకమారు 

సభ్యులైతే ఇంటగాని, బయటగాని ప్రేమించుకునే హక్కులేదు. పెళ్ళి చేసుకునే అర్హత లేదు. నువ్వు 

సమితినుంచి విడిపోతూ కూడా సమితో సమితో అంటూ సీరియల్‌గా నామస్మరణ చేస్తున్నవ్. ఇది ఒళ్ళు 

పాడుచేసుకునే మూఢభక్తో లేక రక్తికి పనికిరాని నీ జడ ప్రవృత్తో నాకు అర్థం కావడం లేదు. మీలాటి 

భావకులదంతా ఒక రకమైన దృక్పథం. ఇతరులకు చెప్పేందుకే మీ నీతులు. మీ రాతల్లోంచి చేతలకు ఎప్పుడైనా 

దిగేరా? ఆచరణలో అభ్యుదయమేదీ? అంధుల మీదా, కామాంధులమీదా - వికలాంగులమీదా, 

కోమలాంగులమీదా ఎన్నో రాతలు రాశారు. కట్నాలు నిషేదించాలనీ, ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనీ మీ 

సదస్సుల్లో గొంతు చించుకుంటున్నారు. మా అమ్మాయి నిన్ను ప్రేమించింది. పెళ్ళి చేసుకుంటానంది.  

నువ్వంటే  పగలూ రాత్రీ పడి చస్తూంది. నువ్వు కాదంటే ఇప్పుడు నూతిలో పడి చస్తుంది" మాస్టారి గొంతులో 

గురక  అడ్డుపడింది.
  


    మౌనంగా వింటూన్న ధర్మరాజు చలించాడు. ఫ్రిజ్‌లోంచి సాఫ్ట్ డ్రింక్ తీసి ఇచ్చాడు. మాస్టారు పూర్తిగా తాగి 

తేన్చాడు.

   
     "నీ సమితి బతుక్కన్నా నీ బతుకు ముఖ్యం. ఆడైనా మగైనా బతుక్కి ఓ తోడూనీడా అవసరం. ఒకే గూటి 

పక్షులు ఒకేచోట చేరి బతకాలి. కళామూర్తిగా కళామూర్తినే పెళ్ళాడు."


    ఈ మాటలు మాస్టారంటున్నట్లుగా ధర్మరాజుకి వినపడ్డంలేదు. మొన్నపార్కులో కళ్యాణి తనముందు 

ఆఖరిసారిగా పెట్టుకున్న మొరే తన తండ్రిక్కూడా వినిపించి ఉంటే, మాస్టారు దాని తాత్పర్యాన్ని తన వాణిలో 

మధించి నట్లున్నాడు.      ధర్మరాజులో అంతర్మథనం మొదలైంది. ఆఖరికి సమస్యాపరిష్కారానికి మార్గం మాస్టారి మాటల్లోనే నాణేనికి 

రెండోవైపులా గోచరించింది. 'పోరు నష్టం పొందు లాభం. తను పెళ్ళి చేసుకునే వరకూ కళ్యాణి తనను  

వదలదు.  మాస్టారూ వదలడు. ఈ పెళ్ళి పోరు తప్పదు. కాబట్టి తాను పెళ్ళి చేసుకుని బతికిపోవాలి. వీలైతే 

సమితిని  కూడా బతికించాలి'అనుకునే ఓ నిశ్చయానికొచ్చాడు ధర్మరాజు. ఆ నిశ్చయానికి కార్యరూపమేమిటో 

ప్రకటించడానికి కొంత వ్యవధి అవసరమనుకుంటూ ధర్మరాజు పై కేమి అనలేదు.     అతని నిర్లిప్తతను చూసి మాస్టారు తగ్గు స్వరంలో అన్నాడు "రాజూ! చెప్పు ఆఖరిసారిగా అడుగుతున్నాను. 

నీ నిర్ణయమమేమిటో చెప్పు"    ధర్మరాజు ఆలోచిస్తున్నాడు; సమితి పరపతి విషయమే చింత చింతన.    మాస్టారు చికాకు పడ్డాడు. ఒక్క ఝళిపింపుతో తన జరీ కండువాను కుడి నుంచి ఎడమ భుజానికి 

మార్చుకున్నారు. బంగారు రంగులో మెరూస్తున్న బరంపురం పట్టు షర్టు బిరబిరలాడింది.      ధర్మరాజుకి తెలుసు, మాస్టారికి పిత్రార్జితం కాస్త మిగిలుందనీ, ఒకతే కూతరనీ.    "రాజూ మరో విషయం. సర్స్వతీపుత్రులంతా దరిద్రులు కారు. నువ్వు కావాలంటే కట్నం కూడా  

ఇవ్వగలను"  మాస్టారు పట్టు విడని విక్రమార్కుడిలా పోజు పెట్టి అన్నాడు.    "మాస్టారూ! మీలాంటి విజ్ఞులే ఇలా అంటే ఇక అజ్ఞానుల మాటేమిటి? కుహనా సంస్కారులూ, స్వార్థ 

ప్రయోజకులూ ఉండబట్టే సాంఘిక దురాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మా ఆదర్శాలూ, 

అభ్యుదయాలూ వట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఏమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మాయ్ని పెళ్ళి 

చేసుకోలేను" బాధపడుతూనే ధర్మరాజు ధైర్యంగా అనేశాడు.    "అయితే బ్రహ్మచారిగానే ఉండిపోతావా" అదో రకంగా చూస్తూ మాస్టారు ప్రశ్నించాడు.     అదేదో ముని శాపంలా కూతుర్ని చేసుకోకపోతే శాశ్వత బ్రహ్మచారిలా మిగిలిపోవాలా? అనుకుంటూ 

ధర్మరాజు స్థిరచిత్తంతో జవాబిచ్చేడు."నేను మీ అమ్మాయిని మాత్రమే చేసుకోనని చెప్పాను కాని, బ్రహ్మచారిగా 

ఉండిపోతానని చెప్పలేదు. నేనెప్పుడైనా పెళ్ళి చేసుకుంటే మా సమితి సభ్యురాలు కాని పైపిల్లనే చేసుకుంటాను. 

ఇదే నా నిశ్చయం."    "అయితే నే నో సంబంధం చూపిస్తాను. చేసుకుంటావా?"    "తప్పకుండా. అయితే ఆమెకు ఏవైనా లలితకళల్లో ప్రవేశముండాలి."    "ఆమెకెన్నో ఉన్నాయి. ఆ పిల్ల నా స్నేహితుని కూతురు. ఒకప్పుడు బాగా బతికినవాళ్ళు. చితికిపోయారు. 

కట్న కానుకలు ఇప్పుడేమీ ఇవ్వలేదు. పై ఊళ్ళో ఉన్నారు. దగ్గరే. రేపు ఆదివారం వెళ్ళి చూసొద్దామా?"    "మీ ఇష్టం" అంటూ ధర్మరాజు లేచాడు.    "నే నోడినా నిన్ను వీడను' అన్నట్లుగా కనిపిస్తూన్న మాస్టార్ని పూర్తిగా అర్థం చేసుకోడానికి అర్థ శతాబ్ది 

దాటిన అతని వయసుముందు ముప్పై యేళ్లైనా నిండని నా వయసేపాటి?" అనుకున్నాడు ధర్మరాజు ఆ 

క్షణంలో.

 

* * *    మార్చ్ ఫస్ట్ సాయంత్రం. సమితి వార్షికోత్సవం. హాలంతా ప్రేక్షకులతో నిండిపోయింది.

 

    తెర ఎత్తగానే కుమారి కళ్యాణి స్టేజి మీదకొచ్చి, మైకులో స్వాగతం పలుకుతూ ప్రోగ్రాం చెప్పింది. ధర్మరాజు 

వార్షిక నివేదిక చదివాడు. ఆ తర్వాత కుమారి లక్ష్మి నృత్యప్రదర్శనతో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు 

ఆరంభమయాయి. డ్యాన్సు అయింతర్వాత కళ్యాణి మళ్ళీ అనౌన్సు చేసింది.

    

    "ఇప్పుడు శ్రీమతి మాలతీ ధర్మరాజు పాడతారు. గీత రచన శ్రీ ధర్మరాజు. సంగీత రచన మాలతీ ధర్మరాజు."

    

    తెర వెనుక పాట ఆరంభమైంది.

'శిశిరం నుండి వసంతానికి

అమాస నుండి పున్నమికి

దూరం లేదు; ఎంతో దూరం లేదు!'


'కనులున్న మనసుకు

మనసున్న కనులకు

దూరం లేదు; ఎంతో దూరం లేదు!!

ఈ అనుబంధం ప్రకృతి బంధం!

ఇది జన్మజన్మల వీడని బంధం!!'

    
    
    ఇలా సాగిన పాట కళ్యాణి (రాగం)లో ఆఖరున తారాస్థాయి చేరుకుంది.

    
    శ్రోతలు గుమ్మెత్తిపోయారు. హాల్లో ఈలలు, చప్పట్లు ఒకటే కేకలు.

   
     "మాలతీ ధర్మరాజుగారు స్టేజీ మీదకి రావాలి. స్టేజీ మీదకొచ్చి పాడాలి!! మళ్ళీ ఆ పాటే పాడాలి. రావాలి 

ప్లీజ్. రావాలి" అంటూ ప్రేక్షక శ్రోతలు అరిచారు.

    

    ధర్మరాజు మాలతి చెయ్యి పట్టుకుని స్టేజిమీదకు మెల్లగా నడిపించి తీసుకొచ్చేడు. శ్రీమతి మాలతి మళ్ళీ ఆ 

పాటే పాడింది.    హాల్లో మొదట వరసలో కూర్చొన్న కళాపోషకుడైన ఓ ప్రేక్షక మహాశయుడు పక్కనే కూర్చున్న తెలుగు 

మాస్టార్ని అడిగాడు "మంచి కంఠం. శ్రావ్యమైన పాట. మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తూంది. ఐతే...మనిషిని  

చూడ్లేం.  పైగా రాత్రికూడా నల్ల కళ్ళజోడు ఫ్యాషనా?" అని.     "ఫ్యాషనేమిటి; నా బొంద. ఆమాత్రం తెలీదా? ఆమె గుడ్డింది" మాస్టారన్నాడు.    "అంటే?"


    "స్వచ్ఛమైన తెలుగులో చెప్పాను. అర్థం కాలేదా? అయితే ఇంగ్లీషులో చెపాతా. షి ఈజ్ బ్లైండ్. టోటల్లీ  

 బ్లైండ్.  రెండు కళ్ళూ లేవు. పుట్టు గుడ్డి"    "అయ్యో పాపం. ఈ సమితి మెంబరా?"


    "ఇప్పటివరకూ కాదు. అందుకే ముందుగా తెర వెనుక పాడించారు. ఘోస్ట్ సింగర్. రెస్టు సింగర్."


    "బెస్ట్ సింగర్ కదండీ! మరి...ఆమెను శ్రీమతి మాలతీ ధర్మరాజు అంటున్నారు. మన ధర్మరాజు 

ఆమెను..."    "పెళ్ళి చేసుకున్నాడయ్యా. పెళ్ళి! ఈ ఉదయమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. నిరాడంబరంగా...పైసా 

కట్నం లేకుండా."    "అహో. ఎంత ఆదర్శం! ఎంత అభ్యుదయం! అందగాడికి కురూపి. ఎంత ఔదార్యం, ఎంత సంస్కారం!"    "మీ పొగడ్తలూ, తెగడ్తలూ అయ్యాయా అండీ! ముందు ప్రోగ్రాం చూడండి" అంటూ అసహనంగా ఆ 

ప్రేక్షకుడిని మోచేత్తో పొడిచారు మాస్టారు.


    అప్పటికే స్టేజీ మీద ధర్మరాజు స్వీయ కవితాగానం చేస్తున్నాడు. పక్కనే నిలబడి మాలతి తాళం వేస్తూంది.


    తెలుగు మాస్టారు గుబుక్కున లేచి చరచరా బయటికెళ్ళిపోయాడు. 


* * *   

   మర్నాడు - 

    రాజీనామాను గురించిన చర్చకు సభ్యులంతా సమావేశమయ్యారు. ఇంటిదగ్గరే ముందుగా అందుకున్న మరో కొత్త రాజీనామా పత్రాన్ని అధ్యక్షులవారు సమావేశంలో చదివి వినిపించారు.

    సభ్యులంతా ఆశ్చర్యపోయారు.

    ధర్మరాజూ, కళ్యాణీ పక్క పక్కనే కూర్చున్నారు.

    ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

    తర్జన భర్జనల అనంతరం అందరి అంగీకారంతో రాజీనామా ఆమోదం పొందింది.

    కుమారి కళ్యాణి సమావేశం హాలు నుంచి వెంటనే నిష్క్రమించింది. ధర్మరాజు కళావిహీనంగా చూశాడు; గొప్ప ఆర్టిస్టుని వదులుకున్నామనే బాధతో.

    ఇంతకూ ఆమోదించిన ఆ రాజీనామా ధర్మరాజుది కాదు, కుమారి కళ్యాణిది.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 31-10-1990 సంచికలో ప్రచురితం)
 
Comments