రాజితం - బి.పి.కరుణాకర్

   
    రిసెప్షన్
గది గోడ గడియారం వంక మరొకసారి చూశాను. ఎనిమిది ఇరవై అయింది. నా చేతి గడియారం వంక చూసుకున్నాను. ఎనిమిదిన్నర అయింది. కావాలనే వాచిని పది నిమిషాలు ముందుకు పెట్టుకుంటాను ఎక్కడికీ ఆలస్యంగా వెళ్లకూడదని. వేళ ఎంచేతో ప్రతిచోటా ఆలస్యమవుతోంది. విజిటింగ్ అవర్స్ ఎనిమిదింటికే అయిపోయాయి. నేను ఏడింటికే వచ్చాను. 

    విజిటింగ్ అవర్స్ ముగింపుకు ముందే వచ్చిన జనం పలచబడసాగారు. ఊరుకు బాగా దూరంగా ఉన్న ఆస్పత్రి ఇది. ఎ.సి.వలన గది చల్లగా ఉంది. గది చుట్టూ అద్దపు గోడలు. ఏ దేశం నుండి తెప్పించారో గాని గోడ గడియారం వినూత్నంగా ఉంది. 

    ఈ ఎదురుచూపులు నాకు విసుగనిపిస్తున్నాయి. అరగంటకొకసారయినా నర్సు వచ్చి 'మీరు దయచేసి ఇంకొద్దిసేపు ఆగండి. మేం మీ పనిలోనే ఉన్నాం' అని ఎంతో మర్యాదగా అంటోంటే చల్లబడిపోతున్నాను. మూడుసార్లేమో కాఫీ పంపించారు. నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఎవరయినా ప్లీజింగ్‌గా మాట్లాడితే కాదనలేను. హోటలు గదికి వెళ్లి ఇంకా నా వస్తువులు సర్దుకోవాలి. పన్నెండూ నలభైకి ఎయిర్‌పోర్టులో ఉండాలి. ఉదయం మూడున్నరకు లండన్ ఫ్లయిట్ ఉంది. రేపు నేను అక్కడకు చేరుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే చాలా నష్టపోతాను. ఇప్పటికే నాకు తెలిసో, తెలియకో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకొని చాలా కోల్పోయాను. ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డాను. అద్దంలోంచి బయటకు చూశాను. నేను వచ్చిన టాక్సీ పార్కింగ్ లాట్‌లో ఉంది. ఎయిర్‌పోర్టులో నన్ను వదిలిపెట్టేంతవరకు ఉంటుంది. వెళ్లే ముందు నేను చేయవలసింది ఒక్కటే మిగిలింది. ఆయన కోసం పెద్ద పూలగుత్తి కొన్నాను. 'మీరు త్వరగా బాగవ్వాలి' అని కార్డుమీద రాయించి పూలగుత్తికి అతికించాను. 

    "సార్!'' 

    వెనక్కి తిరిగాను. రిసెప్షన్ గది తలుపు సగం తెరిచి పట్టుకొని పలుచటి నీలం రంగు డ్రస్‌లో ఉన్న సిస్టరు నిలబడివుంది. ఆమెకు ముప్పయి సంవత్సరాలు ఉండొచ్చు. కాని అలా అనిపించడం లేదు. 

    "రావుగారి కోసం వచ్చింది మీరే కదూ?'' అడిగింది. 
ఎవరయినా ఆడవాళ్లు నన్ను హఠాత్తుగా ఏదయినా అడిగినప్పుడు వెంటనే జవాబు చెప్పలేను. గొంతులోంచి మాట గబుక్కున రాదు. చిన్నప్పటి నుండి అంతే. అయితే ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అది కాదు. 

    తలూపాను. 

    "క్షమించండి. చాలా ఆలస్యం అయింది. రండి నా కూడా. ఆయన ఉన్న గదికి తీసుకువెళ్తాను'' అంది. 

    సోఫాలో ఉన్న పూలగుత్తిని అందుకుని ఆమె దగ్గరకు వెళ్లాను. నాకు ఒక అడుగు ముందు నడుస్తూ "మా కంప్యూటర్లు డౌన్ అయ్యాయి. మెయిన్టెనెన్స్ కంపెనీ వాళ్లు వచ్చి రెండు గంటలుగా తంటాలు పడుతున్నారు. ఇంతవరకు బాగయితేనా? కంప్యూటర్ మంచిగా ఉంటే ఒక్క నిమిషంలో మీకు కావలసిన రావుగారు ఏ గదిలో లేక ఏ వార్డులో ఉన్నారో తెలిసిపోయేది. నాలుగయిదు రిజిష్టర్లు తిరగేస్తే గాని ఆయన ఉన్న గది నెంబరు దొరకలేదు. మీరాయన అబ్బాయనుకుంటాను. మీ పేరు?'' ఎంత వేగంగా నడుస్తోందో అంత వేగంగా మాట్లాడుతోంది. నాకు ఆమెతో నడవడం పరుగెత్తడంలా ఉంది. నా పేరు చెప్పి, "ఆయనకు ఎలా ఉంది?'' అడిగాను. 

    "అలానే ఉంది'' అంది. 

    లిఫ్ట్‌లో ఎనిమిదో ఫ్లోరు నొక్కింది. అదే చివరిది. 

    "మీకు శ్రమ కలిగిస్తున్నాను'' అన్నాను. 

    "చాలాసేపు వెయిట్ చేయించి మీకే ఇబ్బంది కలిగించాం ...'' 

    లిఫ్ట్ కదులుతోంది. 

    లిఫ్ట్ నెంబర్ల వంక చూస్తూ, "రావుగారి వ్యాధి గురించి మీకు తెలిసి ఉండాలి. పోయినసారి మీ అక్కయ్యవాళ్లు వచ్చినప్పుడో, మీరొచ్చినప్పుడో ... అహా మీరు కాదనుకుంటా ... సిస్టర్ స్టెల్లా చెప్పానంది. మీ దగ్గర దాచడం ఎం దుకు? ఆయనకు ఎయిడ్స్. సరయిన ఆహారం ఉండుంటే ఆరోగ్యంగా ఉండేవాడు... ఆయన జబ్బు తెలిసిన తరువాత మీ వాళ్లు ఆయనను చూడడానికి రావ డం మానేశారు... మీరెక్కడుంటున్నారు?'' అడిగింది. 

     "ఇంగ్లాండులో'' "మీకు తెలిసి ఉండాలి'' 

    "తెలియదు. నిజంగా తెలియదు''. 

    "మీ అక్కా వాళ్లతో మీకు మాటలు లేవా?'' 

    జవాబు చెప్పేలోపల లిఫ్ట్ ఎనిమిదో ఫ్లోరులో ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి. బయటకు వచ్చాం. పొడుగాటి నడవ చచ్చిపోయిన వెలుగంత చల్లగా నిశ్శబ్దంగా ఉంది. 

    ముందుకు నడుస్తూ, "ఆయనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం మంచిదయింది. ఇంకో ప్లస్ పాయింటేమిటంటే మీ నాన్నగారూ మా ఛైర్మనూ ఇంటరు వరకు కలిసి చదువుకున్నారు'' అంది. 

    చాలా గదులు ఖాళీగా ఉన్నట్టున్నాయి. గది బయట తాళాలు వేసి ఉన్నాయి. క్వారెంటయిన్ వార్డులా ఉన్నట్టుంది. నడవ చివరిగది దగ్గర ఆగి తలుపు నెమ్మదిగా తెరిచి ముందామె లోనికి నడిచింది. ఆమె వెనకే నేను లోపలకి వెళ్లాక నా వెనుక తలుపు చప్పుడు కాకుండా మూసుకుపోయింది. గది బయట కన్నా లోపల వెచ్చగా ఉన్నట్టుంది. గది పెద్దదేం కాదు. కిటికీ తలుపులు తెరిచి ఉన్నా గదిలో మందుల ఘాటు కొడుతోంది. 
సిస్టరు గోడ దగ్గరున్న ప్లాస్టిక్ కుర్చీ మంచానికి దగ్గరగా లాగి నా వంక చూస్తూ "కూర్చోండి. మీరాయనతో మాట్లాడవచ్చు. తాకవచ్చు. భయపడనవసరం లేదు. మీరు వెళ్లిపోదలచినపుడు ఈ రెడ్ బటన్ నొక్కండి. నేను రేపు ఉదయం ఆరింటి వరకు డ్యూటీలోనే ఉంటాను'' అని వెళ్లిపోబోతుంటే, "మీ పేరు?'' అడిగాను. 

    "మెర్సీ'' అంది. అని గదిలోంచి బయటకు వెళ్లబోతూ ఆగి, వెనక్కి తిరిగివచ్చి మంచం మీద పడుకున్న ఆయన్ని తట్టి, "సార్... రావుగారూ ... ఒకసారి కళ్లు తెరిచి ఎవరొచ్చారో చూడండి ...'' అంది. 

    ఆయన కళ్లు తెరిచి ముందు మెర్సీ వంక చూశాడు. 

    "అటు ... అటు'' నా వైపు చూపించింది. 

    నా వంక చూశాడు. మీట నొక్కగానే గది వెలుగుతో నిండిపోయినట్లు ఆయన ముఖం ప్రకాశవంతమయింది. 

    తన బలహీనమైన చేత్తో నా చేయి పట్టుకుని, ఆమె వంక చూస్తూ, "మావాడు, మా అబ్బాయి ...'' ఎంతో గర్వంగా అన్నాడు. 

    "మీ అబ్బాయిని మీ దగ్గరకు తీసుకువచ్చినందుకు రేపు మాకు స్వీట్లు పంచిపెట్టాలి'' అంది మెర్సీ వెళ్లిపోవడానికి తలుపు వైపు కదులుతూ. "థాంక్యూ. థాంక్యూ. తప్పకుండా మీకు స్వీట్లిస్తాను'' ఆయన అంటుండగానే ఆమె బయటకు వెళ్లిపోయింది. 

    గది నిశ్శబ్దమయింది. గాలికి కిటికీ తెరలు అలల్లా కదులుతున్నాయి. ఆయన మంచానికి దగ్గరగా కుర్చీలో కూర్చున్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. ఆయనకు అరవై సంవత్సరాలుండొచ్చు గాని ఎనభై సంవత్సరాల వ్యక్తిలా కనిపిస్తున్నాడు. తలమీద జుట్టు అట్టే లేదు. ముఖం పీక్కుపోయి ఉంది. మాటలు నీరసంగా ఉన్నాయి. ఒకసారి పొడిగా దగ్గి, "నువ్వు నన్ను చూడడానికి వస్తావని అనుకోలేదు ... నా మీద కోపం పోయిందా? '' అంటుంటే ఆయన గొంతులో దుఃఖం జీరగా కదిలింది. 

    కొద్ది కొద్దిగా రిలాక్స్ కాసాగాను. నా చేత్తో ఆయన కుడి అరచేతిని తడుముతూ "అదేం లేదు. నేనిక్కడ ఉండడం లేదు ...'' అంటుంటే నా మాటలకు అడ్డు తగిలి "ఈ విషయం మెర్సీ సిస్టర్ నాతో అంది ... మునుపు లేదు. నాకీ మధ్య మతిమరుపు వస్తోంది. మర్చిపోతానో ఏమో ఈ తాళం చెవి ... నీ దగ్గరుంచు ... జాగ్రత్త ...'' అని దిండు కింద నుండి తాళం చెవి తీసి నా చేతిలో పెట్టాడు. అది ఇంటి తాళం చెవో, బ్యాంకు లాకరుచెవో అడగాలనిపించలేదు. ఆ తాళం చెవి ఆయన చేయంత చల్లగా ఉంది. 

    "నువ్వు తప్ప నాకు ఎవరున్నారు?'' అన్నాడు. కొద్దిసేపాగి, "కావాలని నేనందరినీ దూరం చేసుకున్నానా?'' అడిగాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తుడిచి "అయిపోయిన వాటి గురించి తలుచుకుని ఇప్పుడెందుకు బాధపడడం?'' అన్నాను. మీరు ఎవరినీ దూరం చేసుకోలేదు అని అనాలో వద్దో తెలియలేదు. 

     నా ముఖంలోకి చూస్తూ, "నాకు కుడికన్ను పూర్తిగా కనిపించదు. రెటీనాపతి అని చెప్పి ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో మూడుసార్లు లేజరు ట్రీట్‌మెంటు ఇచ్చి త్వరలో నయమయి స్పష్టంగా చూడగలుగుతావని చెప్పారు. కాని కొద్దో గొప్పో ఉన్న చూపు కూడా మందగించింది. శుక్లం ఏర్పడింది. అది తీసి లెన్సు పెడితే చూపు సరి అవుతుందన్నారు. శుక్లం ముదిరాక ఆపరేషన్ చేశారు. ఎక్కడ పొరపాటయిందో ఏమో చూపు పూర్తిగా పోయింది. రెటీనాపతి అయితే రెండో కంటి చూపు ఆ సరికి మందగించి ఉండాలి కదా అని అడిగితే సరయిన జవాబు రాలేదు. పిల్లిమీద ఎలుక, ఎలుక మీద పిల్లిలా ఒక డాక్టరు మీద మరో డాక్టరు నెపాలు వేసుకోవడం తప్ప ఏమీ చేయలేదు. అశ్రద్ధ వలన పొరపాట్లు చేసి చాలామంది డాక్టర్లు తప్పించుకుంటున్నారు. కోర్టులు డాక్టర్ల మీద ఈగ వాలనివ్వడం లేదు. ఇప్పుడు రెండో కంటికి శుక్లం వచ్చింది. అది ముదరాలి. ముదిరితేగాని ఆపరేషన్ చెయ్యరు. 

    నేనిక్కడకు వచ్చి ఇది రెండో నెల. ఈ దశలో నేను బాగవుతానని అనుకోవడం లేదు. ఇన్సూరెన్స్ వాళ్లకూ వీళ్లకూ ఏవో ఒప్పందాలు ఉంటాయి. లేక గినీపిగ్ లాగా మందులతో నా మీద రకరకాల ప్రయోగాలు ఏమయినా చేస్తున్నారేమో నాకు తెలియదు. మందుల కంపెనీలకు వీళ్లకు లాలూచీలుంటాయి. అన్నట్టు ఒక సంగతి చెప్పడం మరిచిపోయాను. ఈ ఆస్పత్రికి మెడికల్ కాలేజి ఉంది. దానికి శవాలు కావాలి. చూస్తుంటే బతికుండగానే నన్ను శవాల గదిలోకి తీసుకెళ్లేట్టున్నారు'' అని నవ్వి, "మరణానంతరం మీ శవాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసే ఉద్దేశం ఉందా? అని అడిగారు. ఇవ్వాలనే అనిపించింది. మళ్లీ చాలాసేపు ఆలోచించాక వద్దని అనిపించింది. ఏవేవో కాయితాలు తీసుకువచ్చి నాకిచ్చి పూర్తి చేయమన్నారు. చేయలేకపోయాను. పట్టుమని నాలుగు కాలంలు నింపలేకపోయాను. బొత్తిగా శక్తిలేదు. రెండు కాలంలు పూర్తి చేసేసరికి చేతివేళ్లు నెప్పి పుట్టాయి. మీరు వేలిముద్ర వేసివ్వండి. ఫారాలు మేం పూర్తి చేసుకుంటాం అన్నారు. నేను వేలిముద్ర వేయకపోయినా చనిపోయాకయినా తీసుకుంటారు. మా అబ్బాయి ఈ వేళో రేపో వస్తాడు. వాడికోమాట చెప్పి ఏ సంగతీ నిర్ణయించుకుంటాను అనేసరికి నన్ను తొందర పెట్టడం మానేశారు. కాని మార్చురీ ఇన్‌చార్జ్ మటుకు రోజూ వచ్చి నన్ను పలకరించి వెళ్తున్నాడు .. నువ్వు వచ్చాక నాకెంత ధైర్యం వచ్చిందో తెలుసా? 

    నువ్వు నమ్ముతావో, నమ్మవోగాని నేను తిరుగుబోతును కాను. ఈ వ్యాధి ఎలా వచ్చిందంటే ఒక పనిమీద నల్గొండ వెళ్లినప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది. చనిపోవలసిన వాడిని. రక్తం చాలకపోతే అక్కడే నాలుగయిదు సీసాల రక్తం ఎక్కించారు. ఆ సమయంలోనే పొరపాటు జరిగింది. జబ్బు ముదిరాకగాని గ్రహించుకోలేకపోయాను. అన్నీ చేతులారా నేనే చేసుకున్నట్లయింది. నేను చనిపోయినా అక్క చూడడానికి వస్తుందని నేను అనుకోవడం లేదు. మీ అమ్మ చాలా మంచిదిరా. నా అశ్రద్ధ వల్లనే ఆమెను పోగొట్టుకున్నాను. ఇంత సంపాదించి చివరికి ఏం తీసుకు వెళ్లబోతున్నాను?'' అంటుంటే ఆయన దుఃఖం కట్టలు తెంచుకుంది. 

    నేను ఆయన్ని ఆపలేదు. గూడు కట్టుకున్న బాధ బయటకు వస్తే మనసు తేలిక అవుతుంది. ఆయన చేతులు మార్చి మార్చి నిమురుతూ ఉండిపోయాను. కాసేపయ్యాక కళ్లు మూసుకొని ఉన్నవాడల్లా చటుక్కున తెరిచి నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. "ఏమైంది?'' అడిగాను. 

    "నిద్ర వస్తోంది. నిద్రపోతే నువ్వు వెళ్లిపోతావేమోనని భయంగా ఉంది'' "నేను వెళ్లను. నా మాట నమ్మండి'' అన్నాను. 

    "అలసటగా ఉంది'' 

    "నిద్రపోండి'' 

     నా చేతిని తన గుండె మీద పెట్టుకుని ముప్పావుగంటసేపు నిద్రపోయాడు. సమయం చూడడానికి నా చేతిని తీసుకునేప్పుడు గమనించాను. ఆయన చేతులు గట్టిపడుతున్నాయి. మెడకింద వేళ్లు పెట్టి చూశాను. నిద్రలోనే పోయాడు. 

    నేను తెచ్చిన పూలగుత్తి ఆయన గుండెల మీద పెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకొని రెడ్ బటన్ నొక్కాను. రెండు నిమిషాలు కాకముందే మెర్సీ గదిలోకి వచ్చింది. ఆమెను చూడగానే నాకు దుఃఖం ఆగలేదు. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. ఆమె నన్ను ఆపలేదు. నా వంకే చూస్తూ ఉండిపోయింది. మనసు కుదుటపడ్డాక "మీరు పొరపడ్డారు. ఈయన మా నాన్న కాదు'' అన్నాను


    "నాకు తెలుసు. మీకు శ్రమ ఇచ్చినందుకు దయచేసి నన్ను క్షమించండి. రావుగారు చనిపోతారని తెలుసు. బహుశా ఆయనకూ తెలుసనుకుంటాను. చివరి క్షణాల్లో ఆయనకు తన కొడుకు కావాలి. కొడుకుతో తన మనసు పంచుకోవాలి. ఆయనకు మీరు శాంతి నిచ్చారనే అనుకుంటున్నాను. అసలు విషయం చెప్పమంటారా?'' 

    "చెప్పండి'' 

    "ఆయన కొడుకు ప్రమాదంలో చనిపోయి, ఇరవై సంవత్సరాలయింది ...'' చెబుతోంది. చేతులు జోడించి మెర్సీకి నమస్కారం చేస్తోంటే కళ్లల్లో నీళ్లు ఆగటం లేదు. ఆమె నా ఆత్మ స్పృశించి ఉండకపోతే ఎవరూ లేని నాకు తండ్రి ప్రేమ తెలిసి ఉండేది కాదు.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 22-05-2011 సంచికలో ప్రచురితం) 

 

Comments