రాలిన మందారం - తంగిరాల చక్రవర్తి

        
'హలో! రండి బావగారు...' అంటూ ఎంతో వినయం ప్రదర్శిస్తూ సోఫాలో కూర్చుండబెట్టాడు కారు దిగి లోనికొచ్చిన మాధవరావును చూచిన కోటయ్య.

        "మా కోడలు పిల్ల ఏది?" అన్నాడు మాధవరావు ఇంట్లోని గదుల వైపు తొంగి చూస్తూ. "లేదండి... మద్రాస్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఇంకా ఏవో ఫార్మాలిటీస్ - ఎటేస్టేషన్స్ పన్లు ఉన్నాయి అని వెళ్ళింది మీ కాబోయే కోడలుపిల్ల మాధవి."

        "అన్నయ్యగారూ ఇదేనా రావడం... మా వదిన గారు ఎలా ఉన్నారు?" అంటూ పార్వతమ్మ ఫ్రిజ్‌లోంచి లెమెన్ జ్యూస్ రెండుగ్లాసులు ట్రేలో పెట్టుకుని తెచ్చి సోఫాలో కూర్చున్న కోటయ్య, మాధవరావులకు అందించింది.

        "మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అని వచ్చాను. మీ అక్క కొడుకు రాజు మీతో ఏదో పెద్ద గొడవ పడ్డాడు... బాగా అరుచుకున్నారు... పెద్ద గొడవైంది అని విన్నాను. ఏమిటి?" అన్నాడు మాధవరావు కోటయ్య, పార్వతమ్మల మొఖాల్లో ప్రశ్నార్థకంగా, తీక్షణంగా చూస్తూ.

        "ఆ...ఏం లేదండీ! ఆ రాజు మా అక్కయ్య కొడుకు. మా బావగారు పోయాక... వాళ్ళ పొలం, మా పొలం మా తమ్ముడి పొలం కౌలుకు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. మా పెద్ద అమ్మాయి... అదే మీ కాబోయే కోడల్ని తనకు ఇవ్వమని, తాను ప్రేమించానని గోల... ఆ టెంత్ ఫెయిల్ అయిన వెధవకు బి.టెక్ చేసిన నా బంగారు తల్లిని ఎలా ఇస్తాను? మీకేం వర్రీ లేదు."
        "మా పిల్ల కూడా ఖచ్చితంగా చెప్పింది తనకు ఇష్టం లేదని" అంది ముక్తాయింపుగా పార్వతమ్మ.

        "రోజులు బాగాలేవు... జాగ్రత్త. తొందరగా ముహూర్తాలు పెట్టించి అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించండి! కట్నం డబ్బు యాక్సెస్ బ్యాంక్‌లో అబ్బాయి అకౌంట్ నెంబర్‌కు జమ చేయండి. నాకు ఓల్డ్ సిటీలో పన్లు వున్నాయి... చూసి వెళ్దాం అని వచ్చాను" అంటూ బయటికి కోపంగా వెళ్ళిపోయాడు మాధవరావు.

        అతని ప్రవర్తన చూసి ఆశ్చర్య పోయారు. 'తండ్రే ఇలా వుంటే ఈయనగారి కొడుకు కాలిఫోర్నియాలో ఎలా తన కూతురితో కాపురం చేస్తాడో?' అనే హృదయ ఘోష ఇద్దర్లో సునామీలా వెల్లువెత్తింది. పైకి గంభీరంగా వుంటూ... కొడుకుతో సంభాషణ మొదలు పెట్టారు ఇద్దరూ.

        "ప్రసాద్... ప్రసాద్... నీ నిర్ణయం మార్చుకోరా! ఆస్ట్రేలియా వెళ్ళవద్దురా... అక్కడ గొడవలు... రోజూ టి.వి.లో చూస్తున్నాం కదరా..." అంది పార్వతమ్మ.
        "మమ్మీ... అమ్మాయిల్ని అమెరికాలో కటం వేధింపులు, అత్యాచారాలు,అరాచకాలున్నాయి అని అక్కకి అమెరికా సంబంధం వద్దు అంటే మీరు ఆగుతారా? పొలం, బ్యాంక్ డబ్బు అన్నీ పూడ్చి పెట్టి లక్షలు పోసి బి.టెక్ చదివించి, చివరకు వంటింటి పనికి, పడక గదికి అక్క విద్యను ధారాదత్తం చేస్తున్నారు..." అన్నాడు ప్రసాద్.
        "ప్రపంచమే కుగ్రామంగా మారి పోయింది. ఈ గ్లోబల్ విలేజీలో అంతా విశ్వపౌరులే. ఆస్ట్రేలియాలో మన భారతీయులు లక్ష మంది చదువుతున్నారు. ఎడ్యుకేషన్ గురించి మేకేం తెలియదు. అమెరికా, బ్రిటన్ దేశాల తర్వాత ఉన్నత చదువులకు అంతా ఆస్ట్రేలియానే ఆశ్రయిస్తున్నారు డాడీ...! అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో మెడిసిన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎలెక్త్రానిక్స్, మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్స్ లాంటి ఉన్నత చదువులకు 15 నుండి 20 లక్షలైతే అదే ఆస్ట్రేలియాలో ఆ డబ్బుకు సగం ఖర్చు చేస్తే ఉన్నత విద్యనభ్యసించ వచ్చు. ఫిలిప్పైన్స్ లో మెడిసిన్‌కు సంవత్సరానికి 50వేలు చాలు తెలుసా? చెల్లాయిని చైనా పంపుదాం అంటే అమ్మో వద్దు అని ఆ డెంటల్ కోర్సు కోసం కడప కాలేజీల చుట్టూ తిరుగుతూ... ఇప్పుడు అమెరికా సంబంధం అంటూ వెంపర్లాడు తున్నారు. ఛ...ఛ..." అన్నాడు ప్రసాద్. ఇంతలో ఫోన్ మ్రోగడంతో అంతా డ్రాయింగ్ రూము వైపు దారితీసారు.

* * *

        పెద్ద కుమార్తెను ఆడంబరాలకు పోయి అమెరికా సంబంధం చేసాడు కోటయ్య. కోట్లాది రూపాయలు విలువ చేసే మాగాణి - మెట్ట పొలాలు తెగనమ్మివేసాడు. కొడుకు కోరినట్లు కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ కోసం ఆస్ట్రేలియా పంపాడు. మెడిసిన్ చదవాల్సిన రెండో కుమార్తె చదువుకై రూపాయి ఖర్చు పెట్టలేని స్థితికి పార్వతమ్మ - కోటయ్యలు చేరారు. తప్పని పరిస్థితుల్లో అందంగా, ఎర్రగా, బొద్దుగా ఉండే రమ యాడ్ ఫిలింస్‌లో మోడలింగ్ వృత్తిలో ఉంటూ ఇంటి భారాన్ని తండ్రి చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఇంటి బరువు నెత్తికెత్తుకుంది తన ప్రమేయం లేకుండానే. రోజులు భారంగా గడుస్తున్నాయ్...

        'అమ్మాయి దగ్గర నుండి ఏదో లెటర్ వచ్చింది చూడండి' అంటూ పార్వతమ్మ ఆంగ్లంలో ఉన్న లెటర్ కోటయ్యకు ఇచ్చింది. సారాంశం చదువుతూ వర్షంలా తండ్రి హృదయం దుఃఖపడసాగింది. టి.వి.పెట్టాడు... స్క్రోలింగ్‌లో హైదరాబాదీ విద్యార్థిపై దాడి... మృత్యువార్త... మరో వైపు ప్రాంతీయ వార్తల్లో ఆస్ట్రేలియాలో మృతి చెందిన ప్రసాద్ కుటుంబానికి 5 లక్షలు ఎక్స్-గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. పది లక్షలు ఇవ్వాలి అని ప్రతిపక్షాలు అసెంబ్లీలో రగడ... ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోతే... తమకు దిక్కెవరు అంటూ... తల్లడిల్లే పార్వతమ్మ కోటయ్యలను ఎవరు ఓదార్చగలరు?

        "నాన్నా! ఆయన నన్ను వదిలేసారు...ఆర్థిక మాంధ్యంలో ఆయన ఉద్యోగం పోయింది. నెలకు 7లక్షలు వచ్చే ఉద్యోగం చేసె ఆయన 10,12 వేల జీతంతో జీవించలేక పోతున్నారు. వున్న ఆస్తులు, కారు, అపార్టుమెంట్ అన్నీ అమ్మేశాం... ఆయనకు మతి స్థిమితం లేదు.గర్భవతిని అని చూడకుండా హింసించాడు. తప్పించుకుని ఎలాగోలా పారిపోయి వచ్చాను..." అంటూ నట్టింట్లో కూలబడి రోదించే పెద్ద కూతురు మాధవి హీన దయనీ స్థితిని చూసి పార్వతమ్మ కోటయ్యలు బాధ పడసాగారు.

        "తమ్ముణ్ణి ఆస్ట్రేలియాలో చంపేసారు. శవాన్ని తేవడానికే 10రోజులు పడుతుంది అంటున్నారు అధికార్లు... ఈ బాధలో మేం ఉంటే మీ చెల్లాయ్ రమపై ఎవడో పోకిరి లవ్ చేయి అంటూ వెంటపడి యాసిడ్ పోసాడు... హాస్పిటల్లో చావు బతుకుల్లో అది వుందే" అంటూ పార్వతమ్మ గొల్లున ఏడ్వసాగింది.

        ఈ లోకంతో సంబంధం లేదన్నట్లుగా రోదించే పార్వతమ్మ - కోటయ్యల్ని మీడియా ఫోటోలు... వార్తలు తీసుకుంటూ ఇల్లంతా ఒక షూటింగ్ స్పాట్‌లా ఎలక్ట్రానిక్ మీడియా కమ్మేసింది... పార్వతమ్మ - కోటయ్యల గృహం విషాద నిలయంగా మారింది. సాయంత్రానికల్ల నాయకులు, మీడియా వారు మెల్లగా జారుకున్నారు. పవర్ కట్ ఉండడంతో ఇల్లంతా చీకటితో చెలిమి చేసింది. "అమ్మా! నా బిడ్డ! ఓ... కొడుకా...."అంటూ రోదించే పార్వతమ్మ అరుపులే వీధి చివరిదాకా వినిపిస్తున్నాయ్. 

        "కోటయ్య మామ... కోటయ్య మామ..."
        "ఎవరు?"         "నేను... రాజును... పొద్దున టి.వి.లో వార్తలు చూసి బాధపడి వచ్చాను. నీవే బాధపడితే అత్తమ్మను ఎవరు ఓదారుస్తారు" అంటూ క్యాండిల్ వెలిగించాడు... ఇల్లంతా ఎర్రటి వెలుగులు ప్రసరించాయి.

        "బావా! నిన్ను కాదన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది..."అంటూ నిండు గర్భంతో రోదించే మాధవిని దగ్గరకు తీసుకుని రాజు ఓదార్చాడు.         రాజు ముందు దోషిలా మౌనంగా నిలబడ్డాడు కోటయ్య.

        "బాధపడకు మామ... నేనున్నాను... ప్రసాద్ బాడీని త్వరగా తెచ్చే ఏర్పాట్లు మా ఎం.పి.గారితో చెప్పి చేయిస్తున్నాను. రమను మంచి హాస్పిటల్‌లో చేర్పించి వస్తున్నాను. సర్జరీ చేస్తాం అంటున్నారు. భర్త వదిలేసినా మాధవికి నా హృదయంలో ఎప్పటికీ చోటు ఉంటుంది. గతం గతః. నేటి మాధవిని నేను స్వీకరిస్తాను. డబ్బు కోసం నాకు అమ్మిన పొలం తిరిగి మీకే ఇచ్చేస్తా... మనది వ్యవసాయ సాగు భూమి. రైతువై ఉండి నీవు నీ బిడ్డలు భూమి తల్లికి దూరమైతే పంటలు ఎవరు పండిస్తారు. నూరు రూపాయలు కందిపప్పు... నలభై రూపాయలు బియ్యం... ముప్పై రూపాయలు పాలు... రేట్లు మండిపోతాయ్... రైతు దేశంలో రైతు బిడ్డకు భూములు లేకుంటే వచ్చేది విపత్తే. వాస్తవాలు చూడు. తెలుసుకో మామ. వ్యవసాయాన్ని నమ్ముకో! భూమిని అమ్ముకోకు" అంటున్న రాజు మోములో కనిపించే కొత్త చైతన్యం కోటయ్యను కదిలించింది.

        "హోటల్ నుండి క్యారియర్ తెచ్చా... లేవండి. భోజనాలు చేద్దాం!" అంటూ అందరికీ ఆహారం వడ్డించే రాజులో ఆ యింటి ఆడపడుచు రాజు తల్లి అన్నపూర్ణ అగుపించింది.         "మా అమ్మ ఎప్పుడూ పొలంపని-పాటల్నే ప్రేమించింది. ఎకరం భూమిలో 60బస్తాల ధాన్యం పండించింది. అందరికీ అన్నం పెట్టే రైతే రాజు అంటారు. మా కుటుంబానికి నీవే రాజువు" అన్నాడు కోటయ్య అన్నం కళ్ళకద్దుకుని భుజిస్తూ...
Comments