రాళ్లలో పూసిన పువ్వు -జాన్‌హైడ్ కనుమూరి

పేపర్లో ఫోటోవచ్చింది.
సత్తెమ్మకు అవార్డు వచ్చిందట. సత్తెక్కకు అవార్డు వచ్చిందట. ఆ వీధిలో ఎవరినోట్లో చూసినా ఇదేమాట. చౌరస్తాలోని హోటల్లోనూ అదే చర్చ. 
'ఎవర్రా ఈ సత్తెక్క, సత్తాంటి?' ఒకరి ప్రశ్న.
'గదేరా భాయ్! గల్లీ చివర్లో బర్రెలుంటయ్ గదరా! గామెరా' ఇంకోడి సమాధానం.
'బర్రెల్ను పెంచనీకి బ్యాంకు రుణం యిస్తదని తెలుసు. గిదేందిరా భాయ్! అవార్డులిచ్చుడు?' అడిగిండు ఇంకోడు.
హోటలు ముందు టాటాసుమో వచ్చి ఆగింది. అందులోంచి ఓ కుర్రాడు తొంగిచూసి 'ఇక్కడ సత్తెమ్మగారి ఇల్లు ఎక్కడండీ' అని అడిగాడు.
'గల్లీలో చివరికి వెళ్లండి బర్రెలు కనిపిస్తాయి. అదే ఇల్లు' అన్నాడు.
వాళ్లకబుర్లలో వాళ్లుపడ్డారు.
మెల్లగా టాటాసుమో కదిలివెళ్లిపోయింది.
ఆ రోజంతా ఆ వీధిలో ఎన్నడూలేనంత హడావిడి. పత్రికలవాళ్ళు, టీవీల వాళ్ళు ఇంటర్‌వ్యూలు. అందరికీ ఆశ్చర్యంగా వుంది. ఎన్నడూ బయటకు వచ్చినట్టు కనబడదు. పెద్దకాంపౌండు, బర్రెలు, పెండవాసన. ఎప్పుడూ బర్రెల్ని కడుగుతూనో, పెండతీస్తూనో, పాలుపితుకుతూనో, పాలుపోస్తూనో కనిపిస్తుంది. ఈమెకు అవార్డు ఎలావచ్చిందోనని ఒకటే ఆశ్చర్యం అందరికీ.
* * *
కావ్య చురుకైన అమ్మాయి. చక్కని స్వరం, ప్రశ్నలు అడగటంలోని మెలకువలు బాగా తెలుసు. అందుకే ఈ ఇంటర్వ్యూ ఆమెకు అప్పగించారు. కాని ఆమెలో ఆ వుత్సాహం లేదు. 

'ఇంతవరకూ ఇలాంటివాళ్లను ఇంటర్వ్యూ చెయ్యలేదు. బోర్ అనిపొస్తోంది' అంటూ బయలుదేరింది. 'రండి ఏదో నాల్గు ప్రశ్నలువేసి ముగించుకొనివద్దాం'   అంటూ బయలుదేరింది కావ్య తన బృందంతో.

పేడవాసనేందిరా బాబూ అనుకుంటూ గేటులో ప్రవేశించిన కావ్య బృందం ఇంటిలో అడుగుపెట్టేసరికి ఆశ్చర్యానికి లోనయ్యింది. పెద్ద హాలు. ఇంటిని సదిరేవారెవరో గాని మంచి అభిరుచి కలవాళ్లు అనిపిస్తుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఒక్కరొక్కరుగా లోనికి అడుగు పెట్టారు.

'రండి! రండి!' అంటూ సాదరంగా ఆహ్వానించింది.

కావ్య అంచనా వేయటం మొదలు పెట్టింది. సుమారు నలభై, నలభై అయిదు మధ్య వయస్సు వుండొచ్చు. సాధారణ చీరలోనేవుంది. టీవీ బృందం వాళ్ల పరికరాల్ని అమర్చటంలో నిమగ్నమయ్యాయి. వాళ్లు రడీ అని చెప్పగానే కావ్య ప్రశ్నించడం మొదలుపెట్టింది.

'మీ పేరు?'

'పాల సత్తెమ్మ' అని పిలుస్తారు.

'పిలుస్తారు అంటే అది అసలు పేరు కాదా?'

'హూ!' అంటూ నిట్టూర్చింది.

'ఒక్కసారిగా అలా అన్నారేం?'

'అసలు పేరు మరచిపోయి చాలా సంవత్సరాలయ్యింది. అలా మర్చిపోతున్నానన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు' 

'ఇంతకీ మీ పేరు చెప్పలేదు?'

'అంత అవసరమంటారా?'

'మీకు ఇబ్బంది అనిపిస్తే వద్దులెండి.'

'సత్యవతీదేవి అందరూ దేవీ అని పిలిచేవారప్పుడు.'

'సత్యవతీదేవి నుంచి పాల సత్తెమ్మా మారిన వైనాన్ని మాకోసం కొంచెం చెబుతారా' కావ్య అంది.

'అనుకోని సంఘటనలు జీవితంలో జరగటంవల్ల ఒక్కొక్కసారి జీవితాలు మలుపు తిరుగుతాయి. అటువంటి సంఘటనే నా జీవితంలోనూ జరిగింది. అది నన్ను మార్చివేసింది. ఒక్కసారిగా సుమారు ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లవలసి వస్తుంది' అంటూ చెప్పడం మొదలు పెట్టింది.

* * * 

వెంకటేషుతో పెళ్ళయ్యి మూడేళ్ళయ్యింది. సొంతంగావున్న రెండెకరాలకు తోడుగా కొంత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. చదువుకోలేదు అనేకంటే వాళ్ళ వూర్లో చదువుకున్నవాళ్లే తక్కువ. ఏదో పనిమీద మావూరు వచ్చిన వెంకటేషు నన్ను చూశాడట. ఎలాగైనా ఆమెనే చేసుకుంటాను అని వాళ్లయింట్లో వొప్పించి నన్ను చేసుకున్నాడు. పెద్దగా ఆస్తిలేకపోయినా నెమ్మదస్తుడని, పైగా కట్నమేమీ అడగకపోవటం వల్ల ఈ సంబంధం వొప్పుకున్నారు మావాళ్ళు.

నేను తొమ్మిదవ తరగతి పాసై, అమ్మకు ఆరోగ్యం సరిగాలేకపోవడం, ఆ యేడు సరిగా పంటలు లేకపోవడంతో అక్కడితో ఆపేయ్యాల్సి వచ్చింది. ఆ తరువాత చదవాలన్న కోరిక అలా తీరకుండానే పోయింది.

గోదారి వడ్డున గంటల తరబడి గడపటమంటే సరదా. బాల్యపు గుర్తులు కేరింతలు, తొలియవ్వనపు పలకరింపులు, ఆనందాలు ఆ గోదారొడ్డునే. అందుకే ఊరన్నా గోదారన్నా మక్కువ. తొలివేకువ కిరణాలు సోకి గోదారి పులకింతల నాట్యమాడుతున్నట్టు అలలు. కిరణాల అంచులను తాకాలనే ఉవ్విళ్ళూరుతూ ఎగిరే చేపపిల్లలు. గాలి ఈలపాటలతో సాగుతుంటే ఎగిరే పక్షులరెక్కల చప్పుళ్లు. మనుషుల మనసులెలాగూ శుభ్రం చేయలేని చాకలి వాళ్లు బట్టలమురికిని గుట్టు చప్పుడు లేకుండా తొలివేకువలో గోదారి అర్పణం చేయాలని నిద్రకన్నులను నలుపుకుంటూ పరిగెడుతున్న తీరూ, ఎన్నిసార్లు చూసినా తనివితీరని దృశ్యమాలికే అది.
Comments