రామా కనవేమిరా...!! - అరిపిరాల సత్యప్రసాద్

    
    "రేయ్..! వెంకటేసు.. ఆ పక్కన పందిరి ఒక్కరవ్వ వొరిగింది చూడరా.. ఏం తేడాలు రాకూడదు.. ఏంటి ఇంటున్నావా.? అది సరి చెయ్యి." చెప్పాను నేను. వెంకటేసు కూలివాళ్ళకి పని పురమాయించి కూర్చున్నాడు.     "ఏరా వయసైపోయిందా అప్పుడే వగరుస్తున్నావు?" అడిగాను నేను హాస్యానికి.     "అయిపోక ఇంకా వుంటదా అయ్యగోరూ.. వూహ దెలిసినకాడనించి ఇక్కడ రామనవమికి పందిరేస్తున్నా.. వయసులో వున్నప్పుడు అన్ని పందిర్లూ నేనే ఏసేవాణ్ణి మీకు తెల్వదూ..? కుంటెద్దు రెడ్డిగారింటిముందు, చిలకలవీధిలో, కరణం రామసుబ్బయ్యగారింటిముందు, మాలపల్లేకెళ్ళె వంపుదగ్గర"     "అవున్లేరా అప్పటి రోజులవి. ఆ భోగం.. ఆ దర్పం ఇప్పుడేవి? మనకీలేవు, ఆ రామయ్యకీ లేవు" అన్నాను.     "పోనిలేండి బాబు శాత్తరం పోనీకుండా మీరన్నా జరిపిస్తున్నారు.." అన్నడు వాడు దణ్ణం పెడుతూ     నేను ముందుకు నడిచాను. అదే పందిట్లో జరిగిన శ్రీరామ నవమి వుత్సవాలు, రేడియో ఆర్టిస్టుల కచేరీలు ఒక కమ్మటి జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది. కళ్యాణవేదిక దగ్గర శ్రీరామ పట్టాభిషేకం పటం పడి వుంది. 'ఏమిటో.. ఇప్పటికీ అక్కడక్కడ చేస్తున్నా అందులో మునుపటి భక్తి, వుత్సాహం కనపడట్లేదు. ఎదో మొక్కుబడిగా చెయ్యాలంటే చెయ్యాలంట్లుంది.' అనుకుంటూ రాముడి పటం తీసి నిలబెట్టి అప్రయత్నంగా చేతులు జోడించాను.     "రామయ్య తండ్రీ.. ఏమిటయ్యా ఇది. నీకు పూజలు చెయ్యటానికి ఎందుకు అల్లాడుతున్నారు? వీరికి ఇలాంటి బుద్ది ఎందుకు పుట్టించావయ్యా?" అనుకున్నాను మనసులో.     "స్వామీ.." వెనక నించి వినపడింది. నేను అటు తిరగగానే -     "నమస్కారం స్వామీ.." అంటూ ముందుకు వంగి నమస్కరించాడతను. వయసు అరవై దాటినట్లు అనిపిస్తున్నాడు కాని యాభల్లో వుండచ్చు. ఎంత దాచినా మాసిపోయిన అతని ముతక బట్టల్లో వున్న చిరుగులు నా కంట పడుతూనే ఉన్నాయి.     "ఏమిటి?" అన్నాను నేను చిరాకుగా..!     "అయ్యా.." కొద్ది ఆగాడతను. క్షణకాం తటపటాయించి మళ్ళీ అందుకున్నాడు -     "అయ్యా.. శ్రీరామనవమికి పందిట్లో ఏదైనా హరికథ చెప్దామని వచ్చాను.." అన్నాడతను. నేనతన్ని పైనించి కిందకి తెరిపార చూసాను. నా చూపుల్లోని అర్థం కనిపెట్టినట్టున్నాడు. మళ్ళీ అన్నాడు -     "నేనిదివరకే అనేక చోట్ల హరికథలు చెప్పివున్నాను స్వామీ.. హరికథా విద్వాన్ విశ్వనాధ శాస్త్రిగారి సంతానాన్ని.. మీ పందిట్లో ఒక్క పూట కథ చెప్పే అవకాశం ఇప్పించడి స్వామీ.. బీద బ్రాహ్మణ్ణి" అన్నాడతను. చివరి మాట అంటున్నప్పుడు అతని నేల చూపులు చూసాడు.     "లేదండీ మేమిక్కడ హరికథలేమీ చెప్పించబోవటంలేదు... మీకు తెలియనిదేముంది ఇప్పుడు హరికథలు అవీ ఎవరువింటారు?"     "ఎందుకు వినరు స్వామీ. చక్కటి కథతో, శ్రావంగా పాడితే.. మీకు తెలియదా శిశుర్వేత్తి పశుర్వేత్తి అనీ.."     "లేదండీ.. అలాంటి ఆలోచనే లేదంటున్నాగా.. పోనీ మీకేదైనా ధన సహాయం.." అంటీ చొక్కా జేబులో చెయ్యిపెట్టబోయాను.     "అయ్యో వద్దు స్వామీ..! అలాంటివి తీసుకునేవాడినే అయితే ఆకలితో ఉన్న నా పిల్లల కోసం ఉపాదానానికే వెళ్ళేవాడిని. ఏదో శ్రీరాముడి మీద భారం వేసి కళనే నమ్ముకున్నాను.." అన్నాడతను.     అతను కళ్ళలో ఆశ.. మనసులో వైరాగ్యం. ఏమని చెప్పాలో అర్థంకాలేదు. నా చేతుల్లో ఏముందని..?     "అయ్యా.. మీ దగ్గర దాచిపెట్టి ప్రయోజనం లేదు. ఈ వ్యవహారమంతా నా కొడుకు చూసుకుంటున్నాడు. నా హయాము అయిపోయింది. ఇప్పుడు నేను ఉత్త ఉత్సవిగ్రహాన్నే. రేపు మీరు మా ఇంటికి వస్తే వాడితో మాట్లాడవచ్చు" అన్నాను నేను.     "సరేనండి..రేపు సాయంత్రం వస్తాను. ఈ లోగా మీ అబ్బాయికి ఒక మాట చెప్పివుంచండి... మీ మేలు ఈ జన్మలో మరువలేను.." అంటూ నమస్కరించాడు. నాకు తెలిసు అది వృధా ప్రయత్నమని అయినా పైకి మాత్రం -     "అలాగేనండీ..." అంటూ "ఇంతకీ ఏ వూరండి మీది?" అడిగాను.     "రేపల్లె దగర చిన్న గ్రామం స్వామీ.. నా భార్య బిడ్డలు అక్కడే వున్నారు. నేను మాత్రం ఈ పందిరంత ఆశతో ఇలా పందిళ్ళు వెతుక్కుంటూ వచ్చాను.. ఇతంకు ముందు మా వూర్లోనే తొమ్మిది పందిళ్ళలో తొమ్మిది రోజులు గడిచేవి. ఇప్పుడు ఒక్క కథ చెప్పించుకునే వాళ్ళ కోసం ఇంత దూరం రావాల్సివస్తోంది" అన్నాడతను విషాదంగా నవ్వుతూ.     నేనూ బలవంతంగా చిన్న నవ్వు మాత్రం నవ్వగలిగాను.
* * *
    "లేదండీ హరికథలు అవీ ఏమీ పెట్టించట్లేదు..పందిరుండేది మూడురోజులే.. మూడు రోజులు మూడు సినిమాలుంటాయి.. అంతే" అన్నాడు నా కొడుకు.     "పోనీ ఒక్కరోజు నాకు కేటాయించండి స్వామీ.. మీకు సినిమాకయ్యే ఖర్చులో సగమిప్పించండి.. తీసుకుంటాను... కాదనకండి" అంటూ పాధేయపడ్డాడతను.     "చూడండీ.. రామనవమికి పందిరెయ్యడం మా కుటుంబంలో ఆనవాయతి. మా నాన్న మాట కాదనలేక ఒప్పుకున్నాను. మీకు చెప్పకూడదు కానీ నాకు మటుకు ఇదొక వ్యర్థ ప్రయాస. ఏదైనా రాజకీయ ప్రయోజనమన్నా వస్తుందేమో అని ఆశ. అంతే కాని ఈ పందిరి వెయ్యటం రామ భక్తీ కాదు.. కళా పోషణా కాదు.. అర్థమైందా" అన్నాడు వాడు.     పేరు రఘురాముడైనా రామభక్తి లేని వాడి మీద జాలిపడాలో, కొడుకు ముందు నోరెత్తలేని నా పెద్దరికానికి జాలిపడాలో నాకు అర్థం కాలేదు.     "అయ్యా పండగ నిర్వహించడంలో మీ ప్రయోజనాలు మీకుంటాయి. నేను అడిగేదల్లా ఒక్క గంట అవకాశం, దూరం నించి వచ్చాను.. వట్టి చేతుల్తో ఇంటికెలా వెళ్ళాగలను? ఇంట్లో పసి పిల్లలు పస్తులున్నారు నాయనా" అంటూ రఘురాముడి పాదాల దగ్గర మోకరిల్లాడు.     ఒక కళాకారుడు, పెద్దవాడు అందునా బ్రాహ్మడు వాడి కాళ్ళు పట్టుకోని ప్రాధేయపడుతుంటే నాకు నోరు తెరిచి నా కొడుకుని తిట్టిపోయాలని వుంది. కానీ నా మీద కోపంతో వచ్చినతన్ని తన్ని తరిమేస్తాడేమోనని భయం వేసి ఆగిపోయాను. "ఏమయ్యా చచ్చేందుకు సిద్ధంగా వున్నావు.. ఇంకా నువ్వు హరికథలు చెప్పగలననే అనుకుంటున్నావా? గొంతుపెగల్చుకొని పాటలు పద్యాలూ పాడగలవా?" అన్నాడు వాడు నిలబడుతూ.     అతను చివ్వున తలెత్తాడు. వాడి గొంతులో వినిపించిన వ్యంగ్యం అతనిలో పౌరుషాన్ని నిద్రలేపినట్లుందతని చూపు. గొంతు సర్దుకున్నాడు. అతనింకా రఘురాముడి పాదాల దగ్గరే వున్నాడు.     "పాడతాను స్వామీ.. వినండి" అంటూ అందుకున్నాడు.     "శ్రీ రాఘవం.. ధశరధాత్మజ మప్రమేయం.."     నిజంగానే ఎంతో శ్రావ్యంగా వుందా గొంతు.. విస్మయంగా అతని వైపు చూసాను. తన కళని, ప్రజ్ఞని అవమానించారన్న కసి అతని కళ్ళలో ప్రతిఫలిస్తోంది.     "సీతా పతిం రఘు కులాన్మయ రత్న దీపం"     ఆజాను బాహుం అరవింద దళాయతక్షం     రామం.. నిశాచర వినాశకరం.. నవామీ"     అందరం రెప్పార్పకుండా అతని వైపే చూస్తున్నాము. హరికథలు వద్దంటే వద్దంటున్న రోజుల్లో అతనికి పాడటానికి వచ్చిన అవకాశమది. ఆ రోజు చెప్పే కథే తన భార్యాపిల్లలకి అన్నం పెడుతుందన్న ఆశ అతని గొంతులోంచి పాటై పొంగుకొచ్చింది. కథ మొదలైంది.     కాళ్ళు గజ్జెలు లేవు, అయినా మోగుతున్నాయి.. చేతిలో చిటికెలు లేవు కాని పలుకుతున్నాయి. అతను రాముడై నడిచాడు.. లక్ష్మణుడై నిలిచాడు.. దశకంఠుడి పది తలలు, ఇరవై చేతులు అతని గొంతులోంచే పుట్టుకొచ్చాయి.. అంతలో సీతయై సిగ్గుపడ్డాడు, శివధనస్సై వంగాడు, రాముడై విరిచాడు, పూలమాలై వొదిగాడు.. అంతలో జనకుడై దీవించాడు, విశ్వామిత్రుడై ఆశీర్వదించాడు.. పరశురాముడై వుగ్రరూపం దాల్చాడు.. ఆ క్షణం మా ఇంటి ముగిట్లో సీతాకల్యాణం వైభవంగా జరిగింది. తలంబ్రాలు జల జలా రాలాయి..     మేమంతా నిశ్చేష్టులమై చూస్తుండి పోయాము.. ఎవరితను? గత జన్మలో వాల్మీకా? శబరికి మరో రూపమా? లేక లవకుశులు ఏకమై ఇలా వచ్చారా? రామాయణ ఘట్టాలు కళ్ళ ముందు కదులుతుంటే నా కళ్ళనుంచి జారిన కన్నీరు చెంపలపైనుండి కారుతోంది.     సీతమ్మను అత్తవారింటికి పంపుతున్న జనకుడై పాడుతూ, పాడుతూ కదిలిపోయాడు. తన కూతురిని ఇలా అత్తారింటికి పంపే రోజు రావటంలేదని గుర్తుకొచ్చిందేమో.. భోరున విలపించాడు.. వెక్కి వెక్కి ఏడ్చాడు. అక్కడే కూలబడ్డాడు. మా వాడు కొంచెం కదిలి వెనక్కి రెండడుగులేసి ఆయన భుజం మీద చెయ్యి వేశాడు.     ఆయన లేచాడు.. పెదాలు ఇంకా అస్పష్టంగా పలుకుతున్నాయి.. కన్నీళ్ళు వర్షిస్తున్నాయి.. ఏదో పరధ్యానంలో వున్నట్టు అక్కడినించి కదిలాడు.     "మాస్టారు.. పోనీ దశమినాడు వస్తారా? ఇదుగో మిమ్మల్నే.." అంటున్నాడు వాడు.     అతను వెనక్కి తిరిగలేదు.. అతని గొంతులో పాట మాత్రం వినిపిస్తూనే వుంది -     "రామా కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా.."     రాముడు విన్నాడా.. కన్నాడా? తన దగ్గరికే పిలిపించుకున్నాడా?
    ఏమో తెలియదు. ఆ తరువాత మళ్ళీ అతను కనిపించలేదు.
Comments