రమ్యమైన భోజనం - తమ్మెర రాధిక

    జనని మంచం మీదనుండి లేవకముందే ఫోన్ మోగింది. ఇంత ఉదయాన్నే ఎవరా అని తీసి "హలో" అంది.

    "అమ్మా! నేను రచనను. నాకు పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడింది. కుమార్ ఈ రోజు ఇంట్లోనే వుంటాడట. నన్నే వంట చేయమంటున్నాడు. ఎలానో ఏంటో?" అంది పెద్ద కూతురు రచన.

    కూతురి మాటలకు జనని గుండెలు జారిపోయాయి. తమాయించుకుని "అమ్మడూ! ఏం చెయ్యమన్నా కంగారు పడకుండా ఆలోచించి చెయ్యి. భోజనానికి కూర్చునే ముందు రుచి చూడు. ఉప్పూ కారాల్లో ఏది తక్కువైతే అది చిటికెడు కలుపుకుని తినెయ్యండి. అల్లుడిముందు ఊరికే గాభరా పడకు. సరేనా?" అంది జనని.

    ఇంజనీరింగ్ అయిపోయిన ఆర్నెల్లలోపే మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేశారు. పెళ్లి చూపుల్లోనే అబ్బాయి రచనని ఉద్యోగం చేసే ఆలోచన ఉందా అని అడిగాడు. మళ్లీ తనే ఉద్యోగం అనేది తన వరకూ మరీ ముఖ్యమైన విషయం అనుకోవట్లేదని చెప్పాడు. రచన మాత్రం తనొక మంచి హోదాలో ఉండడం కోసమే కష్టపడి చదివాననీ, తప్పని సరిగా ఉద్యోగం చెయ్యాలను కుంటున్నాననీ చెప్పింది. ఎప్పుడూ పుస్తకాల్లో తలదూర్చి చదువుతూనే ఉండేది.

    రచన కంటే చిన్నది సాహితి. అదెప్పుడూ తల్లినీ, అక్కనీ విమర్శిస్తూ ఉండేది. చదువొక్కటే లోకం కాదు, అన్ని రంగాల్లోనూ తెలివితేటలు చూపించాలనేది.

    అక్కతో వాళ్లత్తగారింటికి వెళ్లిన సాహితి వాళ్ల భోజన రుచులు చూసి తబ్బిబ్బయిపోయింది. అక్క అత్తగారూ, ఆడబడుచులూ, తోడికోడళ్లూ... అందరూ వంట చేయడంలో నలభీములేనని విని అక్కని చూసి జాలిపడింది. ఆ మాటే తల్లితో కూడా చెప్పింది.

    "అమ్మా! పెళ్లంటే మా ఫ్రెండ్స్ ఏమంటారంటే ఎంగేజ్‌మెంట్ రింగ్, వెడ్డింగ్ రింగ్, సఫరింగ్ అని జోక్ చేస్తారు. అక్కకు మొదటి రెండూ అయ్యాయి. ఇప్పుడు మూడోది మొదలౌతోంది" అంది సాహితి తల్లితో.

    అప్పుడు ఆమె మాటలు ఇంట్లో అందరూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. జనని ఆలోచిస్తోంది ఈ రోజెలాగో ఏమోనని. భర్తా పిల్లలూ లేచినట్లున్నారు. ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. పేపర్ తీసుకుని లోపలికొచ్చింది.

    "ఇందాక రచన ఫోన్ చేసింది. అల్లుడు ఇవాళ దాన్ని వంట చెయ్యమన్నాడట" అంది జనని. తండ్రి భుజాలమీద చేతులేసి "నే చెప్పలేదూ! ఏదో ఒకరోజు ఇలాంటి స్థితి వస్తుందని" అంది సాహితి.

    రామారావు పేపర్లో తల దూర్చి మిన్నకుండిపోయాడు.

    "నిజమే" అనుకుంది జనని. పిల్లలు చదువులంటూ హాస్టళ్లలో ఉండడమూ, ఇంటికొచ్చినప్పుడు కూడా అలసటంటూ ఏ పనీ చెయ్యకపోవడమూ ప్రతి ఇంట్లోనూ మామూలైపోయింది. రచన సెలవలకు ఇంటికొచ్చినా ఏ పనీ చెయ్యదు. వస్తూ వస్తూ బండెడు పుస్తకాలు వెంట తెచ్చుకుని వాటిముందే ఇరవైనాలుగ్గంటలూ కూర్చునేది.

    అలా ఆలోచిస్తూ రచనకు ఫోన్ చేసింది.

    "అమ్మడూ! అల్లుడిగారిముందు ఊరికే కంగారు పడకు. ముందు రెండు గ్లాసుల బియ్యం కడిగి కుక్కర్‌లో పెట్టు. రెండు విజిల్స్ వచ్చాక దింపి పక్కన పెట్టు" అంది.

    "అసలు బావగారు అక్కని ఏం వండమన్నారో కనుక్కోమ్మా!" అంది సాహితి.

    "ఆలూ ఫ్రై, టమాటా పచ్చడి, రసం వండమన్నారట" అంది తల్లి.

    తల్లి దగ్గరి ఫోన్ లాక్కుని "అక్కా! కూర సంగతి నేను చెబుతాను" అంటూ అక్కకి బంగాళదుంప కూర ఎలా చెయ్యాలో చెప్పింది సాహితి.

    ఇదంతా విన్న రచన ఏం చేసిందో ఏమో గానీ సాయంకాలానికి కుమార్ ఫోన్ చేసి "మీ అమ్మాయికి టెన్షన్ ఎక్కువ. వంటల్లో మెలకువలు చాలా నేర్చుకోవాలి. మనం సంపాదించుకునేది ఎందుకు? కమ్మగా వండుకుని తినడానికేగా. మీ అమ్మాయి మాత్రం ఎంతసేపూ 'హోటల్ నుండి పార్సిల్ తెచ్చుకుందాం' అంటుంది" అన్నాడు.

    "అక్క వంటపై శ్రద్ధపెడితే బ్రహ్మాండంగా చేస్తుంది. దాని పాకనైపుణ్యం మాకు తెలుసు కదా. నాలుగు రోజులు ఓపిక పట్టండి బావగారూ" అంది సాహితి.

    కుమార్ నవ్వి ఫోన్ పెట్టేశాడు. అప్పటికా గండం తప్పిందనుకున్నారంతా. మర్నాడు జనని చింతకాయ, గోంగూర, టమాటా లాంటి పచ్చళ్లు రోట్లోనూరి కవర్లలో ప్యాక్ చేసి కూతురికి కొరియర్‌లో పంపింది.

    అత్తగారు పంపిన పచ్చళ్లు బాగున్నాయనీ, వాటిని ఎలా తయారు చేయాలో చెప్పమని అడిగాడు కుమార్. ఆవిడ చెబుతుంటే రాసుకున్నాడు కూడా.

    రెండ్రోజుల తర్వాత రచన ఫోన్ చేసింది.

    "అమ్మా! కొన్నాళ్లు నాకోసం ఏలాగైనా కష్టపడవే. ఈయనగారి రుచులతో చచ్చిపోతున్నాననుకో. నువ్వు పంపిన పచ్చళ్లు చూసి తన ఫ్రెండ్స్‌ని భోజనానికి పిలిచాడు. వాళ్లేమో అవి తిని చాలా బాగున్నాయని తెగ మెచ్చేసుకున్నారు. ఇప్పుడు కుమార్ నన్నూ అలా చెయ్యమంటున్నాడు. ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా. నా వల్ల కాదు. అసలే ఇప్పుడు ప్రమోషన్ లిస్టులో ఉన్నాను. వర్క్ క్వాలిటీ ఉండాలి కదా. పొద్దున్నే వెళ్తే రాత్రవుతుంది వచ్చేసరికి. ఓపిక ఉండడం లేదు. ఒకటే నీరసం. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్‌ఫాం చేసుకోవాలి" అంది నీరసంగా.

    "శుభవార్తేనా రచనా?" అడిగింది సంతోషంతో జనని.

    "అవునమ్మా! అయినా ఇప్పుడే ఏం తొందర అనిపిస్తోంది నాకు"

    "పిచ్చిదాన్లా ఆలోచించకు. ఇప్పుడే కావాలి సంతానం. ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు. అబార్షన్ చేయించుకోవాలన్న అలోచనే రానీయకు" కూతురితో చెప్పింది ఆదుర్దాగా.

    "పోమ్మా. నా బాధ నీకేం తెలుసు?"

    "ఒసేయ్... నీకేమయినా పిచ్చి పట్టిందా? రెండ్రోజుల్లో బయల్దేరుతున్నాను. ఈలోపు తలతిక్క నిర్ణయాలు తీసుకోకు" కూతురిమీద కోప్పడింది జనని.

    ఇంట్లో అంతా ఆలోచించి జననిని రచన దగ్గరికి పంపారు.

    వెళ్తూ వెళ్తూ ఐదారు రకాల పొడులూ, పచ్చళ్లూ చేసుకుపోయిందామె.

    కుమార్ స్టేషన్‌కి వచ్చి తీసుకెళ్లాడు. ఆ ఇంటిని చూస్తేనే తెలుస్తుంది రచన ఏ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో. రెండు రోజుల్లోనే ఆ ఇంటి పరిస్థితి పూర్తిగా ఆకళింపు చేసుకుంది.

    "పెళ్లి కాకముందు ఉద్యోగం చేశావు. సరే. ఇప్పుడో ఏడాది రెస్ట్ తీసుకో. హౌస్వైఫ్‌గా సంతోషంగా ఉండు. నాకు కమ్మగా వండిపెట్టు. ఈ ఉద్యోగం స్ట్రెస్‌లో పడి తిండి విషయంలో అమ్మను చాలా మిస్సయ్యాను" అని కుమార్ చెప్పినా...

    "షిట్!" అంటూ ఆమెలో అహం చర్రున లేచింది. తను ఎంతో చదువుకుంది. వ్యక్తిత్వం ఉంది. అలాంటిది భర్త భోజనం కోసం ఇప్పుడు తను ఉద్యోగం చెయ్యకుండా వంటింట్లో పడుండాలా? నెవ్వర్! అంటూ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తోంది.

    "కాస్తయినా రుచిగా వండడం నేర్చుకుంటే మీ ఇద్దరి మధ్యా ఈ కలహాలు వచ్చేవి కావు" అన్న తల్లి మాటలకు విసుగ్గా చూసింది రచన. పెళ్లయ్యాక భర్తకు బాంబేలో ఉద్యోగమని తనూ అక్కడే ఉద్యోగం చూసుకుంది. వచ్చిన రెండు నెలలలోపే ఆమెకు వంట రాదని తెలిసి హతాశుడయ్యాడు.

    అత్తగారు వచ్చిన సందర్భంగా ఆఫీసుకు లేటుగా వెళ్తానన్నాడు కుమార్. భోం చేసి వెళ్తానని చెప్పేసరికి గబగబా కుక్కర్‌లో అన్నం పప్పూ పెట్టి, ఫ్రిజ్ తెరిచి చూసింది. అందులో కూరగాయల్లాంటివేమీ లేవు.

    "మామిడికాయ పప్పు నాకిష్టం అత్తయ్యా! కానీ దాన్లో అవేమీ ఉండవు" అతని మాటలకి కూతురుకేసి ఇదేం పనన్నట్లు చిరాగ్గా చూసింది.

    "ఇవ్వాళ్టికి బీన్స్ కూర చెయ్యమ్మా. తరిగిపెట్టాను" అంది అంది కూతురు.

    "ఛీ... ఛీ... రోగిష్టి వాళ్లలా నేనది తినను" అన్నాడు అల్లుడు.

    "ఒక్క నిమిషం ఆగండి అల్లుడు గారు" అంటూ తను తెచ్చిన మాగాయ పచ్చడి తీసి తాలింపు వేసింది. సాంబారు కాచింది.
వేడివేడిగా అన్నంలో పప్పూ, మాగాయ, సాంబారు, బండ పచ్చడి, పెరుగుతో తృప్తిగా తినేసి ఆఫీసుకు వెళ్లాడు.

    అతనెళ్లాక రచన ఆఫీసుకు తయారవుతుంటే "ఈ రోజు సెలవు పెట్టవే. భోంచేసి కాసేపు హాయిగా మాట్లాడుకుందాం" అంటూ టేబుల్ మీద కంచాలు పెట్టింది.

    "పోయిన నెల ఫుడ్ ఫెస్టివల్ అంటూ వారం రోజులు సెలవు పెట్టించి అంధేరీ లాక్కుపోయాడు. ఇప్పుడు సెలవంటే కష్టం. నువ్వుండగానే ప్రెగెన్సీ తీయించుకుంటే రెండ్రోజులు వుండి చూసుకుంటావు కదమ్మా" అంది రచన.

    "రచనా! అసలు నువ్వు నీ కడుపులో పిండానికి తల్లివేనా? దాన్ని చంపుతానంటున్నావే... ఆ మాత్రం దానికి నేను రెండ్రోజులుండి నీకు సేవలు చెయ్యాలా?" అంది కోపంగా.

    "ఏంటమ్మా! కోప్పడుతున్నావు?"

    "ఛ... నోర్మురు! మనమేం అమెరికాలోనో, లండన్లోనో పుట్టలేదు. ఎలా పడితే అలా వుండడానికి. అల్లుడుగారు వాళ్లింటికి పెద్ద కొడుకు. మీరు కనబోయే సంతానం గురించి అతని తల్లిదండ్రులకు ఎన్నో ఆశలుంటాయి. మీ నాన్నగారైతే నీకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుండే అవి కొనాలి, ఇవి కొనాలంటూ సాహితితో చెప్పి ఎంత మురిసిపోతున్నారో తెలుసా? బిడ్డను కని నువ్వు చంటి కూనను ఎత్తుకుని ముద్దాడుతూ పన్లు చేసుకుంటుంటే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెల్సా? ఉద్యోగానిదేం ఉంది. బిడ్డని మా దగ్గరో, మీ అత్తగారి దగ్గరో ఉంచు. ఆ తర్వాత నీ కెరీర్‌ని డెవలప్ చేసుకో. అంతేగానీ, భ్రూణ హత్య చేసి నీ కెరీర్‌ని నిలుపుకుందామనుకుంటే మాత్రం బాగుండదు" అంది విసుగ్గా.

    "నెలకు డెబ్బయి వేలు ఎలా వదులుకోమంటావ్ చెప్పు?"

    "నిజమే. ప్రెగెన్సీ తీసేయించుకుని ఉద్యోగంలో స్థిరపడతావు. తర్వాత పిల్లలు పుట్టలేదనుకో. అప్పుడు నీ పరిస్థితి ఏంటి?"

    "ఎందుకు పుట్టరు? ఒకవేళ అలాగే జరిగితే సరోగెట్ మదర్ సిస్టం ఉందికదా?" ఎంతో ధీమాగా అంది.

    "ఛీ... ఛీ... పిచ్చి వాగుడు వాగి నాకు కోపం తెప్పించకు"

    కూతురి సమక్షంలో నిలబడాలంటేనే చిరాకనిపించి అక్కడ్నుండి వేరే గదిలోకి వెళ్లింది.

    తల్లికి కోపం వచ్చిందని గ్రహించి ఆఫీసుకు సెలవు పెట్టింది.

    "సర్లేమ్మా! ఆకలవుతోంది" అంది దీనంగా తల్లి కోపం పోగొట్టాలన్న ఉద్దేశంతో.

    కడుపుతో ఉన్న పిల్ల ఆకలంటుందన్న ఆదుర్దాతో వచ్చి తనే అన్నం కలిపి నెయ్యి వేసి పెట్టింది.

    నిజంగానే నోటికి కమ్మగా ఉన్నాయి వంటకాలు.

    "కాస్త ఒళ్లొంచి వండుకుంటే ఏదయినా బాగుంటుంది కదమ్మా" అంది రచన నవ్వుతూ.

    అత్తగారి వంటలు కుమార్‌కి బాగా నచ్చాయి. రచన లేనప్పుడు అత్తగారితో "ఇంకో నాలుగురోజులుండండత్తయ్యా. వంట విషయంలో మీ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వండి. చప్పటి వంటలతో నాలుక చవి చచ్చిపోయింది" అన్నాడు.

    అల్లుడు రచన గర్భం గురించి మాట్లాడక పోవడం గమనించింది. కూతురు అతని దగ్గర ఈ విషయం దాచిందని గ్రహించింది. మర్నాడు కూతురు ఇంట్లోనే ఉండడం చూసి కావాలనే "రచన మామిడి కాయలు ఇష్టంగా తింటోంది" అంది కూమార్‌తో.
అర్థం కానట్లు భార్యకేసి చూశాడు.

    "అమ్మా!" అంది ఆ విషయం అతని సమక్షంలో మాట్లాడ్డం ఇష్టం లేనట్లు.

    ఇక ఉండబట్టలేక "మీరు తండ్రి కాబోతున్నారు" అంది అల్లుడితో. ఆ మాటలకు అతను తెల్లబోయాడు. కాసేపు మౌనంగా కూర్చొని అక్కడ్నుండి వెళ్లిపోయాడు.

    "అయిందా! అతని మనసేంటో తెలుసుకోకుండా చెప్పేశావు. ఇప్పుడు చూడు నన్ను జాబ్ మానేయమంటాడు. లేదా వాళ్లమ్మని ఇక్కడ తెచ్చి పెడతాడు. నా ఇష్టంగా, సంతోషంగా ఏదీ జరగడం లేదు" రచన గొంతులో అయిష్టత, దుఃఖం ధ్వనించింది.

    ఆ రాత్రే అతనితో తన అయిష్టతను చెప్పినట్లుంది. మర్నాడు పొద్దున్నే కాఫీ తాగుతూ "నాకు పిల్లలు కావాలి. కమ్మగా వండి పెట్టే భార్య కావాలి. మీ అమ్మాయి తెచ్చిపెట్టే జీతం నేనాశించడం లేదు. కనే ఒకరిద్దర్నీ ఓపికున్నప్పుడే కనాలి. పెద్దవాళ్ల సంరక్షణలో మా బాధ్యతలు తీరాలి. అంతేగానీ ఉద్యోగం ఉంది కదాని, ప్రమోషన్లు పోతాయని కడుపు తీయించుకుంటే తర్వాత ఏమైనా ఇబ్బందులొస్తే! అలాంటి కేసులు ఎన్ని లేవు మన కళ్లముందు! ఉద్యోగం కావాలంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. పిల్లలు అలా కాదుగా. రచనకు గట్టిగా చెప్పండత్తయ్యా! తన మాటే నెగ్గాలంటే మీ వెంట తీసుకెళ్లొచ్చు" అన్నాడు నిర్మొహమాటంగా.

    జననికి ఏం మాట్లాడాలో తోచలేదు. రచనతో కూడా చెప్పకుండా అతను ఆఫీసుకు వెళ్లాడు. అల్లుడితో చెప్పి రెండు టిక్కెట్లు తెప్పించింది జనని. కుమార్ మాట్లాడలేదన్న ఉక్రోషంతో తల్లితో బయల్దేరింది రచన.

* * *

    పొట్ట ఎత్తుగా, మొహం కాంతివంతంగా మెరిసిపోతోంది రచన. ఇప్పుడు తనకి ఏడోనెల వచ్చింది. ఇంత వరకు కుమార్ ఒక్కసారి కూడా రాలేదు. వారానికోసారి మాత్రం ఫోన్ చేసి అందరితో మాట్లాడుతున్నాడు. పుట్టింటికొచ్చాక ఆమె రకరకాల వంటలు నేర్చుకుంది. రుచిగా వండుతోంది కూడా. తను చేసిన వంటలు ఇంట్లో అందరూ మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది.

    "ఇదేం బ్రహ్మవిద్యా ఏంటి రచనా? మా చిన్నప్పుడు గ్యాసుపొయ్యిలూ, మిక్సీలు, గ్రైండర్లూ ఎక్కడివి? అన్నీ కట్టెలపొయ్యిమీదే వండేవాళ్లం. రుబ్బురోట్లో రుబ్బితే ఇడ్లీలు, వడలు ఎంత రుచిగా ఉండేవో. ఇలా రుచికరంగా వండి పెడితే ఏ మగాడు పెళ్లాం కొంగు వదులుతాడు చెప్పు" బామ్మ ఇలా చెప్తోంటే రచనకి కుమార్ గుర్తొచ్చాడు.

    "రుచిగా వండి పెట్టడం వల్లేనేమో తాతయ్య బామ్మ కొంగు పట్టుకుని ఇంట్లోనే వుండేవాడు. ఏం చెప్పినా డూడూ బసవన్నలా తలూపేవాడు. అవునా బామ్మా!" సాహితి నవ్వుతూ బామ్మతో హాస్యమాడింది. ఆ మాటలతో అందరూ హాయిగా నవ్వుకున్నారు.

    ఈ మాటలు విన్నాక కుమార్‌కి తన వంటలు రుచి చూపించాలనే ఆరాటం రచనలో ఎక్కువైంది. కానీ ఏం లాభం. ఇంకా రెండు నెలలు ఆగాలి. డెలివరీ అయిన తర్వాతే వస్తానన్నాడు.

* * *

    "వాళ్లమ్మ పెట్టిన టమాటా పచ్చడంత ఎర్రగా, బాగుంది పాప" లీలగా వినిపిస్తున్న మాటలకు నీరసంగా కళ్లు తెరిచింది రచన. మంచం పక్కనే ఉయ్యాలలోని పాపను వంగి చూస్తున్న కుమార్ కనిపించాడు.

    "కుమార్!" సంభ్రమం, ఆనందం కలగలిపిన గొంతుతో పిల్చింది.

    "నిజంగా టమాటా పచ్చడి తిన్నావా? నేనే చేశాను. బావుందా?" అందామె.

    ఆమె అడిగిన తీరుకు అందరూ నవ్వారు.

    కుమార్ మాత్రం "నిజ్జంగా రచనా! నువ్వు చేసిన టమాటా పచ్చడి మన బేబీ అంత బాగుంది. చాలా బాగా చేశావు"
భర్త మాటలు వెనకటి లాగ తిండితిమ్మన్న మాటల్లా వినపడట్లేదు. అపురూపంగా వింటూ కళ్లు మూసుకుంది.

(ప్రజాశక్తి ఆదివారం అనుబంధం 28 ఆగష్టు 2011 సంచికలో ప్రచురితం)
Comments