రాంగు సుబ్బారావు - రమ్య

    రాంగుండు సుబ్బారావును అతని స్నేహితులు రాంగు సుబ్బారావు అని పిలుస్తారు. కారణం అతను విలక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు ఉదాహరణగా ఈ మధ్య జరిగిన సంఘటన చెబుతాను.     బస్సు బయలుదేరి చాలాసేపయింది. ఎక్కువమంది ఎక్కుతున్నారు. తక్కువమంది దిగుతున్నారు. వెరసి బస్సులోపల నుంచోవడానికి కూడా చోటు సరిగా లేదు. ఉదయం పూట కాబట్టి ఉద్యోగస్తులు ఎక్కుతూ ఉంటారు. అంటే అప్ అండ్ డౌన్‌గాళ్ళు.

    వాళ్ళల్లో సుబ్బారావు ఒకడు! కర్నూలు నుండి ఎమ్మిగనూరు పోతూ ఉంటాడు. కిలోమీటర్లు తక్కువైనా ప్రయాణం నిడివి ఎక్కువ! రహదార్లు బాగుండవని బస్సువారంటారు. బస్సులు - బస్సులు నడిపేవారు బాగాలేరని రహదారుల వారంటారు. చెయ్యెత్తితే బస్సు ఆపాలన్న ఫిలాసఫీ వలన కూడా ఏ బస్సు ఎక్సుప్రెస్సో - ఏది సూపర్ లగ్జరీనో ఏది ఆర్డినరీనో ఎవరికీ అర్థం కాదు - ఒక్క టికెట్టుకు డబ్బులిచ్చేటపుడు తప్ప.

    బస్సును చూసి - డ్రైవర్ ఆకారపుష్టిని చూసి మోస పోకూడదని సుబ్బారావుకు అర్థమయింది. అతడికి అర్థం కానిదల్లా లక్షలతో వ్యాపారం చేసే కారుబాబులు, ఆటోవాలాలు సైతం తమ వాహనాల్లో సంగీతం లేకుండా గీత దాటరే అటువంటిది కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు - కోట్లాది ప్రజల విలువైన కాలాన్ని లెక్కచేయకుండా కొల్లగొట్టేవారు అయిన సదరు బస్సు యాజమాన్యం ప్రయాణీకుల వినోదం కోసం సంగీతాన్ని ఎందుకు వినిపించదని!
    కొండొకచో సూపర్ లగ్జరీ బస్సులు కొన్నిటిలో డివిడీలని - టీవీలని అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటాయి. కాని అత్యధిక బస్సులలో టీవీలు కాదు కదా సిడి కాని, డివిడి కాని ఉండవు. ఉన్నా పని చెయ్యవు. 

    రోజూ ప్రయాణంతో సుబ్బారావుకు విసొగొచ్చింది. ఈ ప్రయాణాలన్నీ ఆహ్లాదకరంగా మార్చుకోలేమా అని ఆలోచించాడు. రవాణా శాఖవారికి సలహాల రూపంలో ఉత్తరాలు వెలువరించాడు. అతనికైతే ఇది కొత్త కాని - చెత్తబుట్టలకు కాదు కదా! ఆ సలహాలను ఎవరూ చెవిన వేసుకోలేదు. 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా' అని శ్రీశ్రీ చెప్పగా విన్నాడు కాబట్టి ఆ మంచి పనికి తనే శ్రీకారం చుట్టాడు.

    టెక్నాలజీ పుణ్యమాని చైనా సెల్లులు బజారులో దొరుకుతూ జేబులకు డాబుగా చిల్లులు పెడుతున్నాయి. వెల్లువలా దూసుకొస్తున్నాయి మార్కెట్‌లో.
    వెంటనే సుబ్బారావు తన పాత సెల్ మూల పడేసి అత్యాధునికమైన చైనా సెల్లు కారుచౌకలో కొనేశాడు. దాంట్లో అన్ని హంగులూ ఉన్నాయి.

    అంతటితో ఊరుకోకుండా దానిలో పాటలు రికార్డు చేయించాడు. ఇంకేం మరునాడు బస్సులో కూర్చుని పాటలు వినిపించాడు. అసలే ఆరు స్పీకర్లు ఆ సెల్లుకు. దానికి తోడు అన్నీ అల్ట్రామోడ్రన్ సాంగ్సు! వాయిద్యాల హోరు తప్పించి సింగర్ల గొంతులు సరిగ్గా వినపడ్డంలేదు. పొరబాట్న వినిపించినా అదేం సాహిత్యమో అర్థం కావడంలేదు. అంగవిన్యాసాలకు తక్కువ లేదు.
    కానీ కుర్రకారు రెచ్చిపోతున్నారు. "సార్ సౌండ్ పెంచండి సార్!" అంటూ అరిచారు. దాంతో సుబ్బారావుకు హుషారొచ్చి సౌండు ఇంకొంచం పెంచాడు.     "మసక మసక చీకటిలో..." రీమిక్సింగ్ సాంగ్ కుర్రకారును రెచ్చగొడుతున్నది. కాలేజీ స్టూడెంట్లు దరువు వేస్తున్నారు.
    "స్టాపిట్!" ఇంతలో ఒక పెద్ద మనిషి గట్టిగా అరిచాడు.

    ఉలిక్కి పడ్డాడు సుబ్బారావు.
    "ఏంటయ్యా ఆ సౌండు! ఆ సెల్లేమిటి? ఆ హోరేమిటి? నువ్వు పాటలు వినదల్చుకుంటే చెవిలో పెట్టుకుని విను. మాకెందుకు న్యూసెన్సు కలిగిస్తావు!" అరిచాడు.     "న్యూసెన్సు కాదండి - మోడ్రన్ మ్యూజిక్. ఎంటర్‌టయిన్‌మెంట్! మీ అందరికీ బోర్ కొట్టకుండా ఉండాలని వినిపిస్తున్నా!" చెప్పాడు సుబ్బారావు.

    "ఛీ!ఛీ! అవేం పాటలు! ఒక సాహిత్యం లేదు - ఒక సంగీతం లేదు. అరుపులు కేకలు - బూతులు! ఆడాళ్ళున్నారన్న సంగతి మర్చిపోతున్నావా ఆపెయ్! ఆ పాటలు ఆపెయ్! మంచి క్లాసికల్ ఉంటే చిన్నగా పెట్టు" అరిచాడు ఆ పెద్దమనిషి.
    "కాదు సార్! నా దగ్గర అన్నీ ఇలాంటి హుషారైన పాటలే ఉన్నాయి" సుబ్బారావు చెప్పాడు నొచ్చుకుంటూ.     "అయితే ఆఫ్ చేసెయ్యి - సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది."     సుబ్బారావు ఆఫ్ చెయ్యగానే కుర్రకారు గోల పెట్టారు. కావాలని. దాంతో సుబ్బారావు ఆన్ చెయ్యక తప్పింది కాదు. పెద్దమనిషికి స్టూడెంట్లకు మాటల యుద్ధం జరిగింది. ఏకాకి కాబట్టి ఆ పెద్దమనిషి ఓడిపోయాడు. స్టూడెంట్లు విజయంతో వెర్రెత్తిపోయారు.
    సుబ్బారావు విజృంభించి కొత్త పాటలు బాగా వినిపించాడు. పెద్దమనిషి మూతి ముడుచుకుని కూర్చున్నాడు.

    ఓ స్టేజిలో దిగిపోతూ కండక్టర్‌కు కంప్లెయింట్ ఇచ్చిపోయాడు. పొగత్రాగరాదు అన్న స్లోగన్‌లాగా బస్సులో సెల్లులో పాటలు వినరాదు. వినిపించరాదు అన్న బోర్డు ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు.
    సుబ్బారావుకు చర్మం మందం కాబట్టి అటువంటి చిన్న చిన్న సలహాలు పట్టించుకోడు. ఏనుగు పోతుంటే శునకాలు మొరుగుతూనే ఉంటాయి గదా!
    మంచి పాట మధ్యలో సుబ్బారావుకు ఫోనొచ్చింది. పాట కట్ అయింది. కుర్రకారు ఆ ఆలస్యాన్ని భరించ లేకపోయారు! 'ఓయ్ మళ్ళీ మాట్లాడచ్చు - ముందు పాటలు పెట్టండి బాబు' అని గోల చేశారు.

    సుబ్బారావు సెల్ సంభాషణ క్లుప్తంగా ముగించుకుని చచ్చినట్లు మళ్ళీ ఆ పాటలు పెట్టాల్సి వచ్చింది, మనస్సులో తిట్టుకుంటూ.
    ఆ తర్వాత సుబ్బారావు పెద్దలను గౌరవించ దలచి పాత సినిమా పాటలను కూడా రికార్డు చేయించాడు. మరునాడు వాటిని వినిపిస్తూ ఉంటే -

    "చిటపట చినుకులు పడుతూ ఉంటే -" అంటూ ఒక పాట వచ్చింది. బస్సులో ముందు సీట్లో కూర్చొన్న ఓ ముత్తయిదువ గయ్‌మని లేచింది. "పోకిరి వెధవ! ఏంటా పాటలు! ఆపెయ్! మా ఆయన వింటే ఏమనుకుంటాడు" వెనక్కి తిరిగి సుబ్బారావు మీద అరిచే సరికి బిత్తర పోయాడు.  

    "ఇది చాలా హిట్ సాంగుట కదండి - అప్పట్లో ఈ పాట వచ్చినప్పుడు లైట్లు ఆఫ్ చేసి వినేవాళ్ళని మా ఆవిడ చెప్పింది వాళ్ళమ్మ చెప్పిందని."     "ముందు ఆపు చెయ్యి - లేకపోతే ర్యాగింగు చేస్తున్నావని పోలీసులకు పట్టిస్తాను" భద్రకాళిలా అరిచింది ఆమె.

    వెంటన సుబ్బారావు ఆ సెల్లు నోరు నొక్కేసాడు. కాని అతనికో అనుమానం వచ్చి అడిగాడు.     "ఏమండి! మీరు ర్యాగింగ్ అంటున్నారు. ఇది బస్సు, కాలేజీ కాదు అనుకున్నా నాకు పెళ్ళయింది - మీకూ పెళ్ళయింది - మనం ఉద్యోగాలు చేస్తున్నాం - ర్యాగింగ్ అంటారేమిటి?" ధర్మసందేహం.     "ఎంత నంగనాచిలా అడుగుతున్నావు? కొందరికి వయస్సు మీదకొస్తుంది కాని బుద్ధి రాదు. నీ గురించి ఏమనుకుంటున్నావు? కాలేజీ కుర్రాడివనో - దసరాబుల్లోడివనో అనుకుంటున్నావా? ఎప్పుడన్న అద్దంలో ఈ మొహం చూసుకున్నావా? కోతికి ఎక్కువ - చింపాంజీకి తక్కువ! దులిపేసింది.     ప్రయాణీకులు ఈ గలాటాని ఆసక్తిగా గమనిస్తున్నారు, చిరునవ్వులతో.

    సుబ్బారావుకు చిర్రెత్తుకొచ్చింది.
    "భారతప్రభుత్వం నాకు స్వాతంత్ర్యం ఇచ్చింది. నాకు తోచినట్లు నేను నడుచుకోవచ్చు - మిమ్మల్ని అలా నడుచుకో - యిలా నడుచుకో అని నేనేమీ చెప్పలేదు - మైండ్ యువర్ బిజినెస్!" కఠినంగా చెప్పాడు సుబ్బారావు.

    "దొంగ వెధవ - స్వాతంత్ర్యం ఉంది కదాని ఎవరు కనిపిస్తే వాళ్ళను చెట్టపట్టాలేసుకుని చెట్టు చాటుకు తీసుకుపోతావా? చావగొడతారు. నీ పెళ్ళాన్ని ఎవరన్నా అలా చేస్తే ఎలా ఉంటుంది!" ఆమె ఉగ్రంగా అడిగింది.     "అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతున్నదా? మధ్యలో నా పెళ్ళాం ఎందుకొచ్చింది ఇక్కడికి? ఎంతో కష్టపడి మంచి మంచి పాటలు రికార్డు చేయించి - ఫ్రీగా వినిపిస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి నానా మాటలంటారా? వింటేవినండి లేకపోతే చెవులు మూసుకోండి!" వెర్రికోపంతో అరిచాడు.     "అదికాదు - ఆ పాటలు వినాలనే గదా అంత పెద్ద సౌండుతో పెట్టింది. వినకుండా ఎలా ఉంటాం! దేవుడు చెవులు యిచ్చాడు. ఇది పబ్లిక్ ప్లేసు. నువ్వే జాగ్రత్తలో ఉండాలి! బస్సులో పాటలు పెట్టే హక్కు నీకు లేదు. ఆపని డ్రైవర్ చెయ్యాలి! గాడిద పని గాడిద - కుక్క పని కుక్క చెయ్యాలని వినలేదా?" మందలిస్తూ చెప్పింది.

    ఆమె ఖరాఖండీగా చెప్పేసరికి అవాక్కయ్యాడు. తను ఇంతకూ కుక్కా? గాడిదా? కండక్టర్ వచ్చి ఆమెకు సర్ది చెప్పాడు.     స్టేజీ రాగానే బ్రతుకు జీవుడా అంటూ దిగిపోయాడు సుబ్బారావు.     ఇదికాదు పద్ధతని దేవుడి స్తోత్రాలు - భక్తి గీతాలు రికార్డు చేయించాడు. దీనికి అప్పీలు లేదనుకున్నాడు.     ఓ రోజు ఘంటసాల భగవదీత పెట్టాడు. ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారని ఆనందపడిపోతున్నాడు.     ఇంతలో -     "అరే భాయి! ఎవరు పోయినారు భాయి! ఆప్‌కీ -" ఓ ముస్లిం గడ్డం నిమురుకుంటూ అడిగాడు, జాలిగా చూస్తూ అతని వంక.

    "ఎవరు పోవడమేంటి? ఏం మాట్లాడుతున్నావు?" అర్థం కాలేదు.
    "అరే! భగవద్గీతను టీవీల్లో - సిన్మాల్లో ఎవరన్నా పోతే వినిపిస్తారు కదు భాయి! అంతెందుకు శవయాత్రలో పెడతారు గదు భాయి! మీ యింట్లో ఎవరన్నా పోయారా!"     సుబ్బారావు ఖంగుతిని ఠక్కున ఆపేశాడు. అతని గుండె లబలబ కొట్టుకుంది! ప్రక్కన క్రిస్టియన్ బాబు ఉంటే అతనివంక ప్రశ్నార్థకంగా చూశాడు అతనన్నా సర్ది చెబుతాడేమోనని.
    "ఫీల్ కావద్దు సార్! ఎవరైనా ఎప్పుడైనా పోవలసిందేగా - అందరం డూమ్స్‌డే నాడు కల్సుకుందాం! అప్పటిదాకా ఓర్చుకోండి!" ఓదార్పుగా అన్నాడు ఆ క్రిస్టియన్.

    సుబ్బారావుకు మెంటల్ లేచి గట్టిగా అరిచాడు. "అరే! ఎవ్వరూ పోలేదు! ఎంజాయ్ చెయ్యండి. మీ సంతోషం కోసం పెట్టాను."
    "పవిత్రమైన గీతను యితర మతస్థుల దగ్గర ఎందుకు పెడతావు. ఆపెయ్యవయ్యా!" అంటు ఓ ముసలాయన ముక్తాయింపు యిచ్చాడు. దాంతో సుబ్బారావు సెల్లు పీక పిసికేశాడు.

    ఆ రోజు శుక్రవారం! అతను లక్ష్మీ అమ్మవారి భక్తుడు. కానీ సుబ్బారావుకు ఇంట్లో పూజ చెయ్యడానికి కుదరలేదు. అందుకని విని తరిద్దామని లలిత సహస్రనామాల్ని చైనా సెల్‌లో వినసాగాడు. కూసింత పుణ్యం మూట గట్టుకుందామని ఆశపడ్డాడు.
    కాసేపటికి ఓ బామ్మగారు అతని ముందు ప్రత్యక్షమయింది.     "మా నాయనే! మా నాయనే! ఎంత భక్తి - కాస్త నీ పక్కన కూర్చోనీ నాయనా" అంటూ ఖాళీగా ఉంటే అతని పక్కన తిష్ట వేసింది.     ఆమెగారు భక్తిపారవశ్యంలో స్నానం చేసేటప్పుడు సబ్బుతో ఒళ్ళుతోముకోవడం-బట్టలు సబ్బుతో ఉతుక్కోవడం - పళ్ళు పేస్టుతో తోముకోవడం లాంటి చిన్న విషయాలు పట్టించుకున్నట్లు లేదు. సుబ్బారావుకు ఆమె దగ్గరనుండి వచ్చే కంపుకు వాంతి అయ్యేటంత పని అవుతున్నది. దుర్గంధం భరించ లేకపోతున్నాడు.     అందుకని బస్సు ఆగగానే సీటు మారిపోయాడు. బామ్మగారు కొంచెం నొచ్చుకుంది. పిదప కాలం పిదప బుద్ధులు అనుకుంది.     విష్ణు సహస్ర నామాలు పెట్టుకుని వినసాగాడు.

    పసుపుబట్టలు కట్టుకున్న పూజారి సుబ్బారావు దగ్గరకొచ్చాడు. "ఆపెయ్! ఆపెయ్!" అని గట్టిగా అరిచాడు అతన్ని చూసూ.
    "హోల్డాన్! హోల్డాన్!" అని సుబ్బారావు అరుస్తూ బస్సు రేకును గట్టిగా కొట్టాడు ఠపీమని.     డ్రైవర్ ఠక్కున బస్సు ఆపేశాడు "క్యాహోగయా" అంటూ.     "ఈయన దిగుతాడు!" అని అరిచాడు సుబ్బారావు పూజారి వంక చూసి.     పూజారి విచిత్రంగా చూశాడు. "ఓరి నీ దుంపతెగ. నేను ఆపమంది నీ సెల్లును - రికార్డును - బస్సును కాదు - పోనీయండి" అని అరిచాడు డ్రైవర్ వంక చూసి. బస్సు బయలుదేరింది ఊసురోమంటూ.
    "నేనెందుకు ఆపాలి!" ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. 

    "ఏమయ్యా! నీకు బుద్ధి ఉందా?"
    "అంత తప్పు నేనేం చేశానండి?" బిత్తరపోయి అడిగాడు.     "తప్పా! తప్పున్నరా! పరమ పవిత్రమైన విష్ణు సహస్రనామాల్లాంటి దేవుడి స్తోత్రాలను బస్సులో పెడతావు! అవ్వ!" బుగ్గలు నొక్కుకున్నాడు.     "తప్పా! ఎందుకు పెట్టకూడదు?!" అర్థం కాలేదు సుబ్బారావుకు.     "అవి వినాలంటే మనసు ఎంతో పవిత్రంగా ఉండాలి. శుచి, శుభ్రత, మడి, దడి ఉండాలి! అంటూ, సొంటూ కలిసింది అనుకో - పుణ్యం కాదు - పాపం మూట కట్టుకుంటావు. ఈ బస్సులో ఇంతమంది స్త్రీలున్నారు - వారు స్నానం చేశారో లేదో - ఏ పరిస్థితిలో ఉన్నారో! మన దేవుళ్ళపైన నమ్మకం లేని ఇతర మతస్థులున్నారు - వాళ్ళు చులకనగా చూడరూ! అదీగాక వినడానికి నీ బస్సే దొరికిందా? బుద్ధిలేదు"

    "అదేమో గాని - సౌండు పొల్యూషన్ చేస్తున్నాడని యితని మీద కేసు పెడదామనుకుంటున్నా!" ఓ చెట్టు క్రింద లాయరు వచ్చి చెప్పాడు.
    సుబ్బారావుకు మెంటల్ లేచి సెల్లును కాలువలో విసిరేశాడు కిటికీలోంచి.     "అయ్యో! అయ్యో! బంగారం లాంటి సెల్లును ఏటిపాలు చేశావు నీకేమన్నా తిక్కా? శుభ్రంగా నాకిచ్చినా వాడుకునేవాడిని" పూజారి బాధగా చెప్పాడు. అతనికి మంచి సెల్లు నొక్కేయాలన్న కోరిక ఉంది.     "అవును - నా సెల్లేది స్వామీ?" సుబ్బారావు అడిగాడు.     "ఇంకెక్కడిది - కాలువలోకి యిసిరి కొట్టావుగా - బస్సు ఆపి తెచ్చుకున్నా ఉపయోగం ఉండదు. అదసలే చైనా సెల్లు. చైనా బజార్ అంతా మాయాబజార్! ఈ పాటికి అది ముక్కలై మునిగిపోయి ఉంటుంది. అంతా మాయ" పూజారి దిగులుగా చెప్పాడు.     "నిజం! అంతా మాయ! సెల్లు మాయ! సొల్లు కబుర్లు మాయ! సిన్మా పాటలు మాయ! నేను మటుకు కాయ" అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రాంగు సుబ్బారావు.     అందరిని ఆనందింప చేద్దామనుకునే వాడు పిచ్చివాడు గాని, అవివేకి గాని అయ్యుండాలని రాంగు సుబ్బారావుకు యింకా అర్థం కాలేదు.

(ఆంధ్రభూమి దినపత్రిక 29-8-2009 సంచికలో ప్రచురితం)
    
    
 

    
         


    
    
Comments