రంగు వెలిసిన బంధం - పెరుగు రామకృష్ణ

  
    "రాఘవా..! ఎట్లయినా వీలు చేసుకొని ఎల్లుండి  హైదరాబాద్‌లో జరిగే హితేష్ పెళ్ళికి వెళ్ళి రారా" 
ఇప్పటికి ఈమాట ఎన్నోసారి అంటున్నాడో వసంత్.

    ఈ నలభై ఏళ్లలో వాడిలో ఎప్పుడూ ఇంత దుఖఃమూ బాధా చూడలేదు నేను.

    వసంత్,నేను పదవ తరగతి చదువుకునేప్పుడు నుండి స్నేహితులం. వాడి కుటుంబం,నా కుటుంబం,
ఒకే చెట్టులా పెనవేసుకున్న జంట చెట్లం.   

    హితేష్ వాడికి మేనల్లుడు. స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకులో సీనియర్ హెచ్.ఆర్.మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే బెంగాలి ఆమ్మాయితో హైదరాబాద్ తాజ్‌బంజారాలో పెళ్లి.

    నిజానికి ఈ పెళ్ళికి వారంరోజుల ముందే మాఇద్దరి కుటుంబాలు కలసి వెళ్ళి, పెళ్లిపెద్దలుగా వుండి, హడావిడి 
చేస్తూ, ఆనందిస్తూ వుండాల్సింది.

    ఇటీవల కుటుంబాల్లో, మనుషుల్లో, మనసుల్లో వచ్చిన స్పష్టమైన తేడాల వల్ల పెళ్ళికి రాకూడదనే నిర్ణయం 
తీసుకున్నాడు. కానీ మనుషుల్ని విపరీతంగా ప్రేమించే గుణం ఆస్తిగా కలిగిన వాడికి ఇదో పెద్దకష్టం గానే వుంది.

    స్వంత మేనల్లుడి పెళ్లి. అందులోను వాడికిష్టమైన సౌజన్యక్క కొడుకుది.సౌజన్యక్కయ్య అంటే వాడికి ప్రాణం తో సమానం.

    తనకన్నా ఏడాదిన్నర పెద్దదైన ఆమెతో బాల్యం ఎంతో చిక్కటి అనుబంధంగా ముడిపడి వుంది.ఆమెతో ఆటల మొదలు ఆల్లరి వరకు అనేక జ్ఞాపకాలు అలవోకగా చెబ్తుంటాడు.

    ఆమె మిలటరీ ఇంజనీర్‌తో పెళ్లి అయ్యాక వెంటనే నేపాల్ సరిహద్దుకి వెళ్ళినప్పుడు ఎంతగా కుమిలి పోయాడో..?

    చిన్నప్పుడే తండ్రి మరణిస్తే ఆదుకుని,దగ్గర తీసి వాళ్లకి చదువు చెప్పించి అక్కయ్య పెళ్లి చేసిన పిన్నమ్మ,చిన్నాన్న పైన అంత దూరం సంబంధం చేసినందుకు క్షణంసేపు బాధ పడేవాడు.ఆ కోపమంతా సౌజన్యక్కని చూడకుండా వుండ లేకనే అని నాకు తెలుస్తుండేది.

    వాడిలోని ఆ సున్నితమైన మనసు, తీవ్రంగా స్పందించే గుణమే బాల్యం నుండి స్నేహితుడిగా వాడిని నాకు మరింత దగ్గర చేసింది.

    ఆ స్పందనలతో వాడు సంఘర్షిస్తూ రాసే కవిత్వం నాకు బాగా ఇష్టం. నాకే కాదు మా అమ్మకి కూడా వాడంటే ఎక్కువ ఇష్టం.

    చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని పరాయిపంచకు చేరడమే పెద్ద కష్టం. వాడికి జీవితంలో ఇంకే కష్టాలు వుండకూడదు 
అంటుండేది అమ్మ.

    అమ్మ అలా ఆశీర్వదించేదే కానీ జీవితంలో ప్రతి మలుపులో వాడు పెద్ద కష్టం ఎదుర్కుంటూనే ఎదిగాడు.స్వయంకృషితో మంచి అధికారి కాగలిగాడు. కష్టంలోనూ, సుఖంలోనూ తనకి తోడుగా నిలచే కవిత్వాన్నీ, నీడలావుండే స్నేహితుల్ని విడవకుండా మంచి కవిగా, గొప్ప స్నేహితుడిగా నిలబడ్డాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటూ తను దాటి వచ్చిన నిన్నటి రోజును సమీక్షించు కుంటూనే, రేపటిలోకి అడుగు పెట్టడం ఆనవాయితీగా పెట్టుకోబట్టే వాడికి అబ్బిన సహజ లక్షణాలు కోల్పోలేదనే మేమంతా అంటుంటాం.

    ఆలాంటి వసంత్ లేకుండా ఈ పెళ్ళికి హాజారు కావాలంటే ఘర్షణకు గురవుతోంది  మనసు. కానీ వాడిది పెద్ద మనసు కాబట్టే నన్ను, నర్తకిని తప్పక వెళ్ళి రమ్మని చెబుతున్నాడు. సౌజన్యక్క మా ఇద్దర్నీ ఒకేలా చూసేది. ఆ చనువుతోనే మమ్మల్ని వెళ్ళిరమ్మని కోరడం.

    సౌజన్యక్క పెళ్లి అయి మెట్టినింట అడుగుపెట్టాక ఎన్నో కష్టాలు పడింది. ఆమె ప్రతి కష్టంలో పిలిచిన వెంటనే పక్షిలా వాలిపోయి, ఓదార్చి ఆమెలో ఆత్మస్థైర్యం నింపేవాడు. కష్టాలు కల కాలం ఉండవని ధైర్యం చెప్పేవాడు.

    సునంద వాడికి అక్షరాల తగిన భార్య కాబట్టి ఆమెలోని సహజమైన సహృదయత ,పిల్లల్ని,మొక్కల్ని,జంతువుల్ని అమితంగా ప్రేమించే గుణం, ఆత్తను ఆమ్మలా చూసే అత్యున్నత సంస్కారం ఇవన్నీ వసంత్ ఇద్దరు మేనల్లుళ్లను, మేనకోడల్ని తన ఇంట్లో వుండి చదివించేందుకు అనుమతిచ్చాయి.

    ఆ ఇంట్లో పెరిగిన పిల్లలు అందరూ సునందను అమ్మలానే అనుకునే వారు. గృహిణిగా,ఉపాధ్యాయనిగా,ఆదర్శ భావాలు కలిగిన ఆమె అంటే అందరికీ ఇష్టం.

    కాలం పరుగుల్లో సౌజన్యక్క కష్టాలు తీరాయి. పిల్లలు ఇద్దరూ బాగా చదువుకుని స్థిరపడ్డారు. విదేశాలకు వెళ్ళి ఆర్ధికంగా పుంజుకున్నారు.

    అమ్మ ,నాన్నలకు హైదరాబాద్‌లో మంచి ఇల్లు ప్రెజెంట్ చేసారు. ఇల్లు అయితే తీసిచ్చ్చారు కానీ అందులో అమ్మానాన్న కలిసి వుండడం చూడలేక పోయారు. నాన్న విడిగా వృద్ధాశ్రమంలో ఆయన ముసలితల్లిని పెట్టుకుని వుండడం అందర్నీ బాదిస్తుంది.

    సరిగ్గా ఈ అంశమే వసంత్ ,సౌజన్యక్క మధ్య దూరం పెంచేలా చేసింది.వెళ్ళిన బావను తీసుకు రాలేదని రక్త సంబంధాంగా వాడు, సునంద ఎన్ని సార్లు వెళ్ళి పిలిచినా రాని ఆయనపై మిగతా బంధువులతో కలసి దాడి చేయలేదని, వాడో పనికి రాని మేనమామగా చిత్రించడం మొదలెట్టింది.

    ఆవేశంలో అప్పటి వరకు తనకు తన శక్తికి మించి వసంత్ చేసిందంతా మరచి ఆవేశంగా "మీరు నాకు వున్నా  లేనట్లే..నీళ్ళు వదిలేసాను.." అంటూ సున్నిత మనస్కుడు అయిన వాడి హృదయం గాయం చేసింది. వారి నించి స్వచ్చమైన ప్రేమతప్ప ఎప్పుడూ ఏమీ ఆశించని వాడి మనసు ముక్కలు చేసింది.

    ఈసారి పెళ్ళికి అందుబాటులో చిరునామాలున్న వారికి శుభలేఖలు పోస్ట్్‌లో పంపేసి ,ఫోన్‌ఛెశి కొందరికి రమ్మని చెప్పి ఆహ్వానించింది. పుట్టిన నాటినుండి అక్క పిల్లల్ని భుజాల పై మోసి, వారి ప్రతి విజయం తన విజయంగా భావించి గర్వంగా ఫీల్ అయిన ఒకే ఒక్క మేనమామని పిలిచే విషయంలో కూడా ఇదే పద్ధతి పాటించింది.

    గత కొద్ది కాలంగా ఆమె ప్రవర్తనలో వస్తున్న మార్పుని, ఆమె ప్రభావంతో పిల్లల్లో వచ్చిన మార్పుని నిశితంగా గమనించాడు వసంత్. అందుకు పరాకాష్ట ఈ రకమైన పిలుపు అనుకున్నాడు. కష్టాలు అనుభవించిన వారు మరెవ్వరికీ తమ వల్ల చిన్న కష్టం కలిగించ కూడదనే గుణపాఠం నేర్చుకుని మెలగడమే అసలైన జీవితం అనేది వాడి అభిప్రాయం.

    ప్రపంచీకరణ, ఆర్ధిక సంబందాల మధ్య అడుగంటుతున్న మానవ సంబందాలు తీరుపై ప్రసంగిస్తూ ఎప్పుడూ బాధ పదే వాడు. వాడి రచనల నిండా అవే ప్రస్తావించేవాడు. తను చేయని తప్పుకు ఎవరైనా ఏమన్నా అంటే రోజుల తరబడి మౌనవేదన ఒక్కడే భరించేవాడు. సునంద వాడి మనసు పసిగట్టి ఓదారుస్తుంటుంది..

    పెళ్ళికి వాడు రాకపోయినా నన్ను, నర్తకిని తప్పక వెళ్ళి చూసి, ఆశీర్వదించి రమ్మని చెప్పేందుకే వసంత్ ఉదయాన్నే వచ్చాడు.

    ఇద్దరికీ టిఫిన్, కాఫీ అందించాక "తప్పకుండా వెళ్లొస్తామన్నయ్యా. రిజర్వేషన్ కూడా చేసారు లెండి  మీ ఫ్రెండ్ ..." అంటూ అసలు రహస్యం బయట పెట్టింది నర్తకి.

    "వెరీ గుడ్ అమ్మా. వీడింకా నేను రాకుండా వెళ్ళాలా వద్దా అనే సంఘర్షణలో ఉంటాడని అనుకున్నా" అంటుంటే వాడి ముఖం వెలిగింది.

    "రైల్వే మీదే కదా మీకేం రిజర్వేషన్ బాధ వుండదులే.." అన్నాడు తాపీగా 

    నేను రైల్వీలో అధికారిగా వుండడం గురించి వాడంటుంటే

    "ఏం పట్టుకెళ్ల మంటావ్ మీ మేనల్లుడికి..?" అడిగాను.

    "వెండితో చేసిన పూజ సామాగ్రి పట్టుకెళ్లరా. నేను వెళ్ళినా అదే ఇచ్చే వాణ్ని" అన్నాడు వసంత్.

    "సరే నర్తకి! సాయంత్రం అవి తెచ్చేసి ప్రయాణానికి సిద్దంకా" అని నేను చెప్పాక ఊపిరి పీల్చుకుని బయలుదేరాడు.

    గుండె లోతుల్లో చెప్పలేనంతగా నొచ్చుకోబట్టే వాడిలా రాలేక పోతున్నాడు కానీ వాడికుండే బంధుప్రీతి ముందు ఇలా ఉంటాడా?

    నిజమైన అనుబంధాలు, ఆత్మీయతలకు అఱ్ఱులు చాచే వారికి ఇవి రోజులు కావు. అంతా అంతస్తులు బేరీజు వేసేవారే గానీ అంతరంగాల్లోని ప్రేమలు చూసే వారేరీ..?


* * *                                          

    హైదరాబాద్‌లో దిగిన వెంటనే సౌజన్యక్క వాళ్ళ ఇంటికే వెళ్ళా నర్తకితో కలసి. అప్పటికే అమెరికా నుండి కొడుకు, కోడలు మనవడు ఇంకా ఇతర బంధువులు వచ్చిన హడావిడిలో ఇల్లంతా సందడిగా వుంది.

    "రా రాఘవా. ఇప్పుడా వచ్చేది" అని పలకరించి నర్తకిని లోనికి తీసుకెళ్ళింది అక్క.

    సాయంత్రం తాజ్ బంజారాలో పెళ్లి. దేవుడి పూజ, పెళ్ళికొడుకుని తయారు చేయడం చకచకా జరిగాయి.
కార్లు పంపిన వాళ్ళు, కార్లలో వచ్చిన వాళ్ళు ఎవరికీ తగినట్టు వారికి పలకరింపులు,గుర్తింపులు...
పాతికేళ్లనుండి ఆ కుటుంబంలో ప్రేమలు, ఆప్యాయతలు చూసిన నేను ఈ రోజు వీటితో బేరీజు వేస్తుంటే ఎక్కడా జతకలవడం లేదు. ఏదో అర్ధంకాని వెలితి కన్పిస్తుంది.

    అంత హడావిడిలోనూ "ఏం రాఘవా... మీ ఫ్రెండ్ వసంత్‌ను తీసుకురాకుండా వచ్చావే..?" అంటుందేమో అక్క ఏం చెప్పాలి అనుకున్న నాకు, అక్కడెవరూ ఆ ఊసే ఎత్తక పోవడం చాలా బాధ కలిగించింది. అంతా ప్లాస్టిక్ పువ్వుల్ని, కృత్రిమ నవ్వుల్నీ అలంకరించుకుని కరచాలనాలు, కౌగిలింతలతో కరిగి పోతున్నారు. మనసు పులకింప చేసే పలకరింపుల కరువుగానే అన్నీ ఆధునికతల మధ్య పెళ్లి జరుగుతోంది.

    పెళ్లి దంపతులకు అక్షింతలు జల్లి వెండి పూజ సామాగ్రి గిఫ్ట్ అందించాము."థాంక్ యూ.. మామ.." అంటూ 
భార్యకి పరిచయం చేసాడు హితేష్.

    పెళ్లి అయ్యాక ఇంటికొచ్చాం. మాకు కేటాయించిన గది చేరాక వెంటనే వసంత్‌కి ఫోన్ చేసి సంగతులు చెప్పాను.

    అన్నీ విన్నాక "పోన్లేరా... మీరెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తే మేం చేసినట్లే... వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడూ చల్లగా వుండాలి. అది చాలు" అన్నాడు వసంత్.

    "ఏమైనా రక్త సంబంధాలు సైతం రంగు వెలిశాయిరా... ప్రేమకి డాలర్ జోడీ అయ్యాక" అని చెప్పాలనుకున్న మాటలునా గుండె గొంతుకలో సుడులు తిరుగు తున్నాయ్..

    "అన్నయ్య వాళ్ళు రానిదే మేలయింది లెండి" నా మనసు చదివినట్లుగా అంటుంది నర్తకి..

    వాడి అంచనాలు ఎప్పుడు తప్పు కాదని మరోసారి రుజువైంది.ఒక నిట్టూర్పుతో  నడుం వాల్చా!
Comments