రాత్రౌ తరతి నర్మదా! - సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి

                        బొకారో ఎక్స్‌ప్రెస్స్ బయలు దేరడానికి సిద్ధంగా వుంది. మమ్మల్ని సాగనంపడనికొచ్చిన అన్నయ్యా వదినా పిల్లలూ దిగులు పడుతున్నారు."ఎన్నో ఏళ్ళకి మా రౌర్కెలా వచ్చారు మీరు. మీతో వున్న పది రోజులూ ఇట్టే గడిచిపోయాయి. మళ్ళీ ఎప్పుడొస్తారు?" అని అడిగింది వదిన లక్ష్మి.
                      
                         "ఈసారి తొందరగానే మళ్ళీ మీ వూరొస్తాంలే. ఇన్నాళ్ళూ ఈయనకి సెలవు దొరక్క - దొరికినప్పుడు వేరే చోట్లకు వెళ్ళీ - మీ ఇంటికి రావడం ఆలస్యమైంది గాని - ఇక్కడ దొరికే ప్రశాంతతని, మీ ఆప్యాయతని వదిలి వెళ్ళడం మాకూ బాధగానే వుంది. కానీ అవతల బతుకు తెరువు పిలుస్తోంది కదా హైదరాబాదులో. ఇహ ఆ రష్ లో పడాలి వెళ్ళి. దుమ్మూ - ధూళీ, వాతావరణ కాలుష్యమూ - రొదా- తప్పవు. ఇక్కడికి మల్లే పచ్చ పచ్చని చెట్ల మధ్య ఇళ్ళు కట్టుకొని వుండటం అసాధ్యంలే వదినా ఆ మహానగరంలో." అన్నాను నిరుత్సాహంగా.

                         మావారితో మాట్లాడుతున్న అన్నయ్య నా వేపు తిరిగి " ఇహ మాకూ యాంత్రిక జీవితమే కదా సరళా! మొక్కుబడిగా ఉక్కు ఫాక్టరీకెళ్ళి రావటం- పక్క వాళ్ళతో, కనబడ్డ వాళ్ళతో ఒరియా మాట్లాడటం - ఇళ్ళు దూర దూరమాయె - రాను రాను తెలుగు వాళ్ళు బాగా తగ్గి పోతున్నారు - కొత్త వాళ్ళని రానివ్వటం లేదు - పైగా రిటైరైన వాళ్ళు ఆంధ్ర దేశం వెళ్ళి పోయారు. ముప్ఫయి రెండేళ్ళ కిందట్నించీ ఇక్కడున్న తెలుగు వాళ్ళు చాలా మంది జీవితాన్నే చాలించుకున్నారు - ఈ మిగిలిన తెలుగు కుటుంబాలని కలుసుకోవాలన్నా చాలా దూరం వెళ్ళాలి. వయసు పైబడుతోంది కదా - ముఖ్యంగా నా బాధ ఏమిటంటే మా పిల్లలకి తెలుగు రాక పోవటం - మాట్లాడటం వచ్చు గాని రాయటం, చదవటం రాదు - మొదట్లో పట్టించుకోలేదు - ఇహ ఇప్పుడు తెలుగు నేర్చుకోలేరు...." అన్నాడు.

                          రైలు కూత వేసింది - ప్రకాశం అన్నయ్య, లక్ష్మి వదిన, పిల్లలు పద్మ, ప్రభుల దగ్గిర సెలవు తీసుకున్నాము.

                         ఇంతలో ఆదరాబాదరాగా ఎవరో జంట రైలెక్కారు. వాళ్ళ సాహసం చూసి ఆశ్చర్యం వేసింది. రైలు స్పీడందుకుంది.

                          కదులుతున్న రైలు ఎక్కినవాళ్ళు తెలుగు వాళ్ళే. ఆవిడకి ముప్ఫై - ముప్ఫై అయిదు మధ్య వుంటుంది వయస్సు. తెల్లగానే వుంది కానీ బాగ మెల్ల వుంది. వాళ్ళకి రిజర్వేషన్ లేదుట ఇంతా చేసి.  మా పక్కన ఇరుక్కుని కాసేపు కూచున్నారు. కూచోవటమంటే దాదాపు ఒకరి ఒళ్ళో ఒకరున్నట్లే - స్థలాభావం వల్ల అనుకునేరు - కాదు వాళ్ళ అనురాగం వల్ల. ఆవిడ చేతుల్ని ఆయన నలుపుతూ స్పర్శ సుఖాన్ని తనివి తీరా గ్రోలుతున్నాడు. ఆవిడ చెయ్యి అంతని మొకాలు పైభాగంలో మెలికలు తిరుగుతోంది. సన్నన్నొక్కులు నొక్కుతోంది. ఆమె జడలో వేలాడుతున్న పూలమాలని అతని ముక్కు మాటిమాటికీ రాచుకుని స్పర్శానందం, సుగంధానందం కలిపి పొందు తోంది. అతని కళ్ళు ఆమె చూపుల్ని స్పృశించి నేత్రానందం పొందు తున్నాయి.

                          "ఆహా ఎంత చక్కని జంట" అని మొదట సంబర పడి పోయిన దాన్నే వెకిలి చేష్టలు శ్రుతి మించటంతో మతి పోయి చీకాకు పడసాగాను. మా పిల్లలు ఇది చూస్తే బావుండదు కదా. మిగతా ప్రయాణీకులకీ బావుండదు. కానీ వాళ్ళ ఖర్మ వాళ్ళది. ఉచిత సినిమా ప్రదర్శన అని చాలా మంది లొట్టలేస్తూ చూస్తున్నారేమో కూడా. మా పిల్లలు లావణ్య, శరణ్య, సౌరభ్ మటుకు ఇదేం గమనించకుండా ముగ్గురూ విండో సీట్ల దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. చీకటి పడ్డాక ఇటు తిరుగుతారు కదా. ఈ దిక్కు మాలిన శృంగారం చూసి యౌవన ప్రాంగణంలో వున్న పిల్లలు ఎలా ఫీలవుతారో. చీ. నా తల వంగి పోయింది. "వీళ్ళకి పడక గది లేదో పాపం ఇంటి దగ్గిర. లేక లోకమంతా వీళ్ళకి పడక గదేనా?" అనుకున్నా.

                           "అమ్మాయ్! మీకు రిజర్వేషన్ లేదన్నావ్ మరి - ఎలా? టీ. సీ. పట్టుకుంటే?" అని అడిగా వాళ్ళ ధ్యాస మళ్ళించటానికి. నా మాటకి సమాధానంగా ఆమె బుగ్గ అతని బుగ్గకి దగ్గిరగా జరిగి ఒరుసుకుంది.

                            "ఆ ఈయన ఎలాగో మానేజ్ చేస్తాడులేండి. కాస్త డబ్బు మనది కాదనుకుంటే ఒక్క బెర్తు సంపాదించలేమూ? అయినా మా కెంత చోటు కావాలి గనక?" అనేసిందావిడ.

                           "ఒక్క బెర్తు ఇద్దరికెలా సరిపోతుంది?" అని అడగ బోయిన నా నోరు ఠక్కున మూత పడింది.

                           "అమ్మా! ఆకలేస్తోంది" అన్నాడు సౌరభ్. "అత్తయ్య పులిహోరా, రవ్వకేసరీ, పెరుగన్నం, పూరీలు ఇచ్చింది కదా. బయటికి తీయనా?" అని అడిగింది శరణ్య. లావణ్య తినుబండారాలున్న బాగ్ విప్పదీసింది. ఇంతసేపట్నించీ ఏం మాట్లాడకుండా కూచున్న మావారు మంచి నీళ్ళు తీశారు. ప్లేట్లు సర్దారు.

                             "కొంచెం అటువేపు దొంగ చూపులు చూడ్డం మానేసి అన్నం తిను" మెల్లిగా అంటూ ప్లేటు నా చేతికిచ్చారు.

                             అందరం తిని మంచి నీళ్ళు తాగేసి బెర్తులు ఎరేంజ్ చేస్తుంటే అప్పుడు వచ్చాడు టీ.సీ.

                            ఒకే పేపర్ ప్లేట్లో పూరీలు తింటున్న ఆ జంట తప్పదన్నట్లు తమ లోకం నించీ ఇవతలికొచ్చారు. ఇతను టీసీతో ఒరియాలో మాట్లాడి ఒకటో రెండో పచ్చకాయితాలు ఆయన జేబులోకి మార్పిడి చేశాక కాస్త బెట్టు చేసి పై బెర్త్ ఇచ్చాడు. మా అయిదుగురం కాక పై బెర్త్ వాళ్ళకొచ్చింది. పోన్లే పాపం ఏదో తంటాలు పడతారు. ఒకళ్ళు ముడుచుకు పడుకుంటే ఒకళ్ళు ఎలాగో ఇరుక్కుని కూచోవచ్చు అనుకున్నా.

                           మావారూ నేనూ ఎయిర్ పిల్లోస్ ఊదుతున్నాం. వాళ్ళిద్దరూ కూడా మంచి నీళ్ళు తాగి పై బెర్త్ మీదికెక్కారు. ఏంచెప్పను! వాళ్ళ లీలా విలాసాలు. ఈవిడ బజారు మనిషా; అన్న అనుమానం బల పడింది నాలో.
 
                            "చూసింది చాల్లేవోయ్.ముందు దిండు సంగతి చూడు. పిల్లలు నిద్రొస్తున్నదంటున్నారు" నాకు మాత్రమే వినిపించేటట్టు కోప్పడ్డారు ఆయన.

                          "బావుంది. నేనేం కావాలని చూస్తున్నానా? ఎదుటి బెర్త్ వేపు చూపు పడదా అప్పుడప్పుడూ. అయినా అదేమిటండీ సెమీ బ్లూ ఫిలిం లాగా...." అని నేనూ గొణిగా ఆయన చెవిలో.

                           "ఏదో స్టేషనొస్తోంది నాన్నా!" అన్నది లావణ్య. " ఏ స్టేషనైనా మనకి అర్థం కాదు.ముందు ఒరియా అక్షరాలు. అథవా తర్వాత ఇంగ్లీష్ అక్షరాలున్నా పేరు సరిగ్గా అర్థం కాదు. బండముణ్దా, ఝర్సుగుడా ఇలా ఏమిటొ నే మనకి కొత్తగదా" అన్నది శరణ్య.

                           "లైట్లార్పెయ్ అమ్మా" అన్నాడు సౌరభ్. నేను చివరి సారిగా వారి స్పర్శానందాన్ని నేత్రనందంగా చూడబోయి సిగ్గు పడి లైటార్పేసి నిద్రకు ఉపక్రమించా.

                            ఈ స్పర్శ ఎంత బలవత్తరమైంది! పూర్వం సినిమాల్లో కూడా ఇంత బరి తెగించడం లేదు. దూరదూరంగా కూచుని హీరో హీరోయిన్లు ప్రేమించుకునే వారు. పది కాలాల పాటు నిలిచే చక్కటి పాటలు స్ఫుటంగా వినపడేటట్లు - ఎక్కువగా ప్రకృతి మీది పాటలే గాని ఇప్పట్లా రెండు మూడర్థాలు వచ్చేట్లు మీది మీదికి ఎగబడి గుద్దుకుంటూ తన్నుకుంటూ ముద్దులాడుకుంటూ బూతు పాట పాడుకుంటున్నారు వినిపించి చావకుండా ఆర్కెస్ట్రా గోల మధ్య - కొండకచో అరవ యాస వెల్లి విరిసేటట్లు.
అంతెందుకు ఇరవై ముప్పై యేళ్ళ కింద కాలేజిలో చదువుకునే పిల్లలు ఒబ్బిడిగా వుండేవాళ్ళు. కనీసం ప్రయత్నించేవాళ్ళు. ఆడపిల్లలు ఒక వేపు, మగపిల్లలు ఒక వేపు కూచునే వాళ్ళు. అత్యవసరమైతే తప్ప మాట్లాడుకునే వాళ్ళు కారు. అన్నా చెల్లెళ్ళూ, తండ్రీ కూతుళ్ళూ కూడా దూరంగానే వుండేవాళ్ళు.

                           ఛ! ఇప్పటి పరిస్థితేమిటి. కళ్ళ ముందుగానే ఇలా మారి పోయింది. ఇప్పుడు ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూచోవడమే. ఒకళ్ళ చేతులొకళ్ళూ, ఒకళ్ళ బుగ్గలొకళ్ళూ మెలిపెట్టుకోవటం. పసి పిల్లలు కన్ను కొట్టటం ప్రేమిచటం ఎంతో హృద్యంగా చూపించి బాల ప్రేమకి యథావిధిగా ప్రోత్సాహం చేస్తున్నారు సినిమా వారూ సీరియల్సూనూ.

                            హైస్కూలూ, కాలేజీ, కంప్యూటర్ క్లాస్ రూమూ కాదేదీ కౌగిళ్ళ కనర్హం.

                             తాగుడునీ, సిగరెట్లనీ, అక్రమ సెక్స్ నీ గ్లోరిఫై చేసి అవతలివాళ్ళు డబ్బు దండుకుంటుంటే మనం వెర్రి వాళ్ళల్లా ఆనందిస్తున్నాం. నీతి ఇంతలా వర్ధిల్లుతుంటే ఇహ మన జాతికి సంస్కృతీ సభ్యతల మాట ఎత్తే అధికారం లేదు గాక లేదు.

                           విశ్వనాథ సత్యనారాయణగారు తన 'తెఱచి రాజు' నవలలో స్పర్శ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు... అసలూ..


                           నా ఆలోచనలు పరిపరివిధాలు పోతూ నాకు నిద్ర పట్టనివ్వలేదు. పైగా పై బెర్త్ నుండీ ఎడతెగని గుసగుసలు.

                          కంపార్టుమెంటులో అందరూ గాఢ నిద్రలో వున్నారు.

                         ఏదో స్టేషన్లో రైలు ఆగింది. సౌరభ్ దిండు సర్దుదామని లేచాను.

                           పై బెర్త్ వైపు చూద్దామనుకుని బావుండదని మానేశాను.

                          ఇంతలో అతను దిగిపోయి నా ముందునించే వెళ్ళిపోయాడు.

                          నేను ఆలోచనల్లోంచీ నిద్రలోకి జారుకున్నా.

                            తిరిగి కాస్త కోలాహలం వినిపిస్తే మెలకువ వచ్చింది. హడావిడిగా కొందరు దిగి పొయినారు.

                            ఇంకా మాటలు వినిపిస్తుంటే అసంకల్పితంగా తలెత్తి పై బెర్తు వేపు చూశా.

                          ఇంకెవరో మీసాలాయన వంగి కూచున్నాడు. వయసు ఎక్కువ వున్నట్ట్లు లేదు గానీ శరీరమే సహకరించటట్లేదు.పాపం భారీ మనిషేమో. ఇరుకాయె పై బెర్తు మీద. ఈమె ఒళ్ళో పడుకుని గారాలు పోతోంది. నాకు కళ్ళు తిరిగినయ్యి. కలో నిజమో తెలీలేదు. బలవంతాన నిద్ర పట్టించుకున్నాను.

                              మళ్ళీ స్టేషన్లో గోల వినిపించి లేచాను. తెలుగు మళ్ళీ చెవులకి వినిపించటం మొదలు పెట్టింది అమృతం లాగా కాస్త కాస్త. రాయగడ కాబోలు వచ్చింది. నేను మొహం కడుక్కోవటానికి వెళ్తుండగా ఆ భారీ మనిషి పాట్‌ఫారం మీద నించీ టిఫిన్ ప్లేట్లు తీసుకొస్తూ కనబడ్డాడు. కడుక్కొచ్చే సరికి ఆమె టిఫిన్ తింటూన్నది. రాయగడలోనే అతడు దిగిపోయాడు ఒకసారి ఆమె చేయి నొక్కి. అప్పటికే పిల్లలూ ఆయనా లేచి బెర్తులు యథాప్రకారంగా అమర్చేయటంతో ఆమె కింద బెర్తు మీదకొచ్చేసింది.

                             ఆమె ఒక్కతీ కనపడింది. "ఏ వూరమ్మ మీది?" అని అడిగాను. "రౌర్కెలా" అన్నది. "మీవారేం చేస్తారు?" అని అడిగాను. స్టీలు ప్లాంటులోనే ఏదో పని అని చెప్పింది. లోపల్లోపల జంకు నాకు మధ్యలో దిగి పోయినాయనా లేక రాయగడలో దిగిపోయినాయనా ఆమె భర్త? అని.


                               పెద్దమనిషి తరహాగా అడిగాను "పిల్లలెంత మందమ్మా?" అని.

                             "ఇద్దరు పిల్లలండీ. ఇద్దరూ అమ్మాయిలే."

                             తర్వాత ఇంటి పేరూ, పేరూ అడిగి ఆశ్చర్య పోయినాను. పేరు మహాలక్ష్మిట. ఇంటి పేరు కూడా చాలా గొప్ప వంశానికి సంబంధించిదే. నా ఆశ్చర్యం పూర్తయ్యే లోపలే తర్వాతి రైల్వే స్టేషనొచ్చింది. ఆ స్టేషన్లో రాత్రి ఆమెతో రైలెక్కిన అతను మళ్ళీ వచ్చి ఆమె పక్కన కూచున్నాడు.

                           నా అయోమయం చూసి మావారు సన్నగా నవ్వుకుంటుంటే ఒళ్ళు మండింది.

                          "ఇప్పుడు ఎక్కడికెళుతున్నావమ్మా?" అని ప్రశ్నించాను.

                          "వైజాగ్ కండీ. అక్కడ ఎల్లుండి మా పిన్ని గారమ్మయి పెళ్ళి" అన్నది.

                            ఇంతకీ మీ ఆయనెవరు వీళ్ళిద్దరిలో అని ఎలా అడగటం. నాకు కుతూహలం పెరిగిపోతోంది. అంతకంటే ఇట్లా ఇద్దరు మగవాళ్ళని వేరువేరు విధాలుగా వేరువేరు స్టేషన్లలో ఎలా రిసీవ్ చేసుకుందో నా బుర్రకి అర్థం కావటంలేదు.

                             వైజాగ్ రాకముందే ఇతనూ దిగిపోయాడు. అతను దిగిపోతుంటే ఆమె బుంగ మూతి పెట్టింది. అలిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆ వయ్యారాలు చూసి నాకు మతి పోయింది. 'దివా కాకరుతా భీతా రాత్రౌ తరతి నర్మదా' అన్నమాట గుర్తుకొచ్చింది.

                          మళ్ళీ ఒంటరిగా దొరికిందిగదా అని ప్రశ్నలు మొదలు పెట్టాను.


                               "పిల్లల్ని తీసుకు రాకుండా వస్తున్నావే పెళ్ళికి" అన్నాను.

                            "ఔను. పిల్లల్ని తీసుకుని రేపు మావారు వస్తారు. ఆయనకివ్వాళ సెలవు దొరకలేదు. పిల్లకివాల్టివరకూ పరీక్షలున్నాయి. ముగ్గురూ కలిసి పెళ్ళి వేళకి వచ్చేస్తారు లెండి" చాలా మామూలుగా చక్కటి గృహిణిలా మాట్లాడుతున్నదామె.

                            "అమ్మా! వైజాగ్ వచ్చేస్తోంది." అన్నారు మాపిల్లలు ఉత్సాహంగా. అక్కడదిగి మా అక్కయ్యగారింటికెళ్ళి రెండు రోజులుండి తర్వాత హైదరాబాదు వెళ్తాం. నాకయితే మతి పోయింది. ఈ ఇద్దరు మగ స్నేహితుల వల్లా ఆమె కేవలం స్పర్శానందం పొందటానికే ఇంత ప్లాను వేసి ముందు బయల్దేరి వచ్చేసిందా? అసలు మొదటతన్నీ రెండో అతన్నీ కలవనీయకుండా ఎట్లా మానేజ్ చేసింది? ఈ నెట్‌వర్క్అంతా పకడ్బందీగా సిద్ధం చేసి ఆమె పొందే ప్రతిఫలం ఏమిటి? ఇన్ని తెలివితేటల్నీ వేరే మంచి పనికన్నా ఉపయోగిస్తే ఎంత బావుండేది. కన్న ఇద్దరు ఆడపిల్లనీ బుద్ధిమంతులుగా పెంచినా చాలు సంఘసేవ చేసినట్లే గదా - అనిపించింది. పాపం వాళ్ళు తల్లిగారి అడుగుజాడల్లో నడిచి తమకి అయిడ్స్ అంటించుకుని అందరికీ అంటించక పోతే చాలు. అదెంత ఘనం.

                           "ఇందాకటి వాళ్ళెవరు?" అని అడిగాను.

                            "వాళ్ళు స్నేహితులు. మా ఆయన స్నేహితులు" అన్నది నిమ్మకి నీరెత్తినట్లుగా.

                            ఆషాక్‌కి పడిపోతానేమోనని కాబోలు మావారు నా భుజం పట్టుకున్నారు ముందు జాగ్రత్త చర్యగా. నాకు భోజ రాజు అడిగితే కాళిదాసు పూర్తి చేసిన సమస్య మళ్ళీ గుర్తొచ్చింది.

                       "దివా కాకరుతా భీతా రాత్రౌ తరతి నర్మదా."
Comments