రవళించిన రాగగీతి - ఎం.ఆర్.వి.సత్యనారాయణమూర్తి

    
"సంక్రాంతి సంబరాలు, తర్వాత శివరాత్రి, ఆ తర్వాత శ్రీరామ నవమి ఉత్సవాలు. 
మధ్యలో రోటరీ, లయన్స్ సంస్థల కార్యక్రమాలు. ఇలా అయితే నా చదువు ఎలా సాగుతుంది. కొంచెమైనా ఆలోచించరేమిటి మమ్మీ" సుధారాణి తల్లితో తీవ్రస్థాయిలో దెబ్బలాడింది.

    "నువ్వే చెబుతున్నావుగా తల్లీ! పండుగల వలన ఏ ఆర్టిస్టూ ఖాళీ లేరు. పైగా కచేరీకి వెయ్యి రూపాయలు, దారి ఖర్చులిమ్మంటున్నారు. మన కార్యక్రమాని కిచ్చేదే రెండువేలు. అదీ మన ముగ్గురం స్వంతమనుఘలం కాబట్టి ఖర్చులు పోను కొద్దిగా మిగులుతోంది. ఇప్పుడు వయొలినిస్ట్‌కి వెయ్యి, మనఖర్చులూ పోతే మిగిలేది రెండువందల రూపాయలు మాత్రమే. నువ్వే ఆలోచించు" అంది తల్లి కూతురికి నచ్చచెబుతున్నట్టు.

    "ఆలోచించాను కాబట్టే చెబుతున్నా. నాన్నగార్ని కచేరీలు మానెయ్యమను. స్కూల్‌ టీచర్‌గా తన ఉద్యోగం తను చేసుకుంటూ, హాయిగా ఇంటిపట్టున కూర్చుని నలుగురికి సంగీత పాఠాలు చెప్పుకుంటే బాగుంటుంది. నీకూ, నాకూ విశ్రాంతి లభిస్తుంది. ఏమంటావు?" అంది సుధారాణి కొంచెం చిరాగ్గా మొహం పెట్టి.

    కూతురి లాజిక్‌కి నవ్వుకుంది కాత్యాయని.

    "అదిగో! ఆ నవ్వుతోనే నన్ను మాట్లాడనివ్వవు. నువ్వు నాన్నకు గట్టిగా చెప్పాలి. ఈ కచేరీలు అవీ మనకు సరి పడవు. మనకు డబ్బు సంపాదించే లౌక్యం లేదని చెప్పు"

    "నేనెందుకు చెప్పడం? డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నావు, ఈ మాటలేవో సరాసరి నువ్వే మీ నాన్నకు చెప్పొచ్చుగా!" అంది నవ్వుతూ కాత్యాయని.

    "నేను చెబితే ఆయన నొచ్చుకుంటారేమోనని సందేహిస్తున్నాను, అంతే కానీ, ధైర్యం లేక కాదు" అంది సుధారాణి.

    "సరే! ఈసారి ఊరుకో. సమ్మర్‌లో ఇద్దరం జాయింట్‌గా, గట్టిగా చెబుదాం మీ నాన్నకు. డబ్బులురాని కచేరీలు వద్దని" అంది.

    కూతురు వెళ్లగానే పిచ్చిపిల్ల దానికేం తెలుసు. ఆయనకు తాను చెప్ప లేదనుకుంటోందే గానీ ఎన్ని సార్లు ఆయనకు తాను చెప్పలేదు. తన మాటను ఆయన ఎన్ని సార్లు తోసిపుచ్చలేదూ.

    ఆయన చాదస్తం ఆయనదే. ''వంద కచేరీలు చేయాలి. ఆ వందా హైదారాబాదులోని రవీంద్రభారతిలోనే చేయాలి. మంత్రి చేతుల మీదుగా సన్మానం అందుకోవాలి. అదే నా ఆశయం" అంటారు. "నా చేతుల్లో ఏంవుంది? ఈ సమస్యను కాలమే పరిష్కరించాలి" అనుకుంది కాత్యాయని నిట్టూరుస్తూ భగవంతుడి మీద భారం వేసింది కాత్యాయని.

* * *

    జనవరి నుండి ఏప్రెల్‌ నాటికే 12 కచేరీల వరకూ చేశారు నాగరాజు మాష్టారు.

    కాత్యాయని, సుధారాణి కచేరీల ప్రయాణాల్లో చాలా అలసి పోయారు. కొన్నిచోట్ల వసతికి ఇబ్బంది కూడా పడ్డారు.
ఏమైతేనేం నాగరాజు మాష్టారి డైరీలో 70 కచేరీలు నమోదయ్యాయి ఇప్పటి వరకూ. మిగిలిన ముప్ఫై కూడా ఎలాగైనా పూర్తి చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు.

    ఏప్రెల్‌తో సుధారాణి డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు కూడా పూర్తయ్యాయి.

    ఒకరోజుదయం కాత్యాయని పొద్దున్నే తన పనులు చేసుకొని కుమార్తె గదిలొకొచ్చి చూస్తే సుధారాణి మంచంపై కనిపించలేదు.
బాత్‌రూంకి వెళ్ళిందేమో అనుకుంది. పావుగంట గడిచినా జాడ లేక పోవడంతో బాత్‌రూం, పెరడు అంతా తిరిగింది. ఎక్కడా కనిపించడలేదు.

    భర్తని లేపి కూతురు కనిపించడం లేదని చెప్పింది. నాగరాజు కూడా ఇల్లాంతా చూశాడు. ఎక్కడా కూతురి జాడ కనిపించలేదు.

    "రాత్రి నీతో ఏ మాట్లాడింది?" భార్యని అడిగాడు.

    "ఏం మాట్లాడలేదు. పరీక్షలయ్యాయిగా, చాలాసేపు టి.వి చూసింది. తర్వాత పడుకుంది."

    ఇద్దరూ ఆందోళనగా మళ్లీ ఇల్లంతా వెతికారు. అంతలో టీపాయ్‌ కిందున్న వైలెన్‌బాక్స్‌ కింద కాగితం కాత్యాయని కంట పడింది. గబగబా చేతిలోకి తీసుకొని చదివి దు:ఖంతో కూలబడిపోయింది.

    భార్య చేతిలో ఉత్తరం లాక్కొని చదవసాగాడు నాగరాజు.

    గౌరవనీయులైన నాన్న గార్కి,

    సుధ నమస్కరించి వ్రాయునది. నేను పెళ్ళి చేసుకొని అత్తవారంటికి వెళ్ళాకా రాయవలసిన ఉత్తరం ఈ రోజు రాయవలసి వచ్చినందుకు సిగ్గు పడుతున్నాను.

    మీ సంగీత కచేరీల బాధ నుండి నన్ను నేను రక్షించుకోవడం కోసం ఇల్లు వదిలి వెళ్ళవలసి వచ్చింది. అనవసర ప్రచారాల కోసం, తాత్కాలికమైన ఆనందం కోసం వెంపర్లాడుతూ మీరు తీస్తున్న పరుగుపందాలు నన్నూ, అమ్మనూ చాలా బాధిస్తున్నాయన్న సంగతి మీరు గ్రహించక పోవడం మా దురదృష్టం.

    చక్కగా లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం పాడుకునే అమ్మను ప్రోత్సహించవలసిన మీరు, మీ కచేరీలకు అడ్డు రాకుండా వుండేందుకు బలవంతంగా మృదంగం నేర్పించి నీ స్థానం అదేనని కట్టడి చేసారు. గాత్రంలో మిమ్మల్ని మించి పేరు, ప్రఖ్యాతులు ఎక్కడ వస్తాయోనన్న ఈర్ష్యతో, పురుషాహంకారంతో అమ్మని పంజరంలో కోకిలని చేసారు.

    నలభై సంవత్సరాల వయసున్న అమ్మ బాధ పడుతోంది. పైగా సున్నితమైన ఆమె చేతివేళ్ళు మృదంగం వాయించడంతో మొద్దుబారిపోయాయి. కచేరీ జరిగిన మరుసటి రోజున అమ్మ, కాళ్ళు పోటులు వచ్చి ఎంతో నరకయాతన అనుభవిస్తోంది. ఇవేమీ మీ కవసరం లేదు. పేపర్లో కచేరీ వార్తలు ఎలా వచ్చాయి? కార్యక్రమ నిర్వాహకులు ఫోటోలు ఎప్పుడు పంపుతారు? అని ఆలోచించారే తప్ప కుటుంబ సభ్యుల బాగోగులు గురించి పట్టించుకోవడం లేదు.

    ఇకనా విషయానికి వస్తే, నేను చిన్నతనంలో కుతూహలం కొద్దీ వయొలిన్‌ నేర్చుకుంటాననడం తప్పిదమై, నా భావి జీవితాన్ని కష్టాలమయం చేస్తుందని ఊహించలేదు.

    నాకు వయొలిన్‌ నేర్పించి మీ కచేరీలకు ఉపయోగించుకుంటున్నారేగానీ ఎప్పుడైనా నాచేత ప్రత్యేక వయొలిన్‌ కచేరీ చేయించారా! లేదు! ఎందుకంటే మీకు అమితమైన భయం. మిమ్మల్ని మించి ఎవరూ ఈ సంగీత రంగంలో ఎదగకూడదని మీ ఆలోచన.

    ఎవరైనా పక్కవారిని చూసి అసూయపడతారు. ఎదుటి వారిని చూసి ఈర్ష్య చెందుతారు. కానీ మీరు అలాకాదు. స్వంత భార్యా, కూతురు కూడా ఎదగకూడదు. వారు ఎదిగితే మీరు మైనస్‌ అయిపోతారని భయం.

    సరే! ఆ విషయాన్ని పక్కన వుంచండి. ఒక ఎదిగిన కూతురు సంగీత కచేరీలలో వుంటే పోకిరి యువకులు ఎలా వుంటారో మీరు గమనించారా? నేను ఫిడేలు వాయిస్తుంటే నా వాయిద్యాన్ని గమనిస్తున్నట్టు నటిస్తూ, నా అంగాంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాన్న విషయాన్ని గమనించి ఎన్నో రాత్రులు అవమానంతో నిద్రలేకుండా గడిపాను. కచేరీ అయ్యాకా అభినందించడం అనే వంకతో ఎంతో మంది షేక్‌హేండ్‌లకు ప్రయత్నించడం, నేను సున్నితంగా తిరస్కరించడం జరుగుతోంది. వయసు మళ్ళిన వారి చేష్టలు మరీ వికృతంగా వుంటున్నాయి. మొన్న విశాఖలో కచేరీ అయ్యాకా గుప్తాగారు ఆశీర్వదిస్తున్నట్లుగా నటిస్తూ నెత్తిమీద వుంచిన చేతిని, భుజాల మీద నుండి వీపు నిమురడం వరకూ సాగింది. ఇటువంటి వికృత చేష్టలను కన్న తల్లిదండ్రులకు ఎలా చెప్పుకుంటాం? చెప్పినా  మీరు స్పందిస్తారా? అబ్బే డెబ్బైఏళ్ళ మనిషి. ఆయనది అంతా వాత్సల్యమేనని సర్దిచెబుతారు. ఎందుకంటే, అటువంటి వారితో విభేదిస్తే మీకు కచేరీలు రావని భయం.

    నాన్నా! ఎందుకు మీరు విలువల్ని కోల్పోతున్నారు? ఆదర్శ ఉపాధ్యాయుడిగా వేలమందికి అక్షరదానం చేయవలసిన మీరు ఇలా ప్రచారాల కోసం, రికార్డుల కోసం, సన్మానాల కోసం ఎగబడటం నాకు అసహ్యం వేస్తోంది. ఒక్కోసారి జాలి కూడా కలుగుతోంది. ఎందుకంటే మీరు ఎంత శ్రమపడినా, మేం కష్టపడుతున్నా ఈ కచేరీల ద్వారా మీరు సంపాదించినదేం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

    పరీక్షలలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుందామంటే మీ కచేరీల వలన వీలుకావడం లేదు. ఎన్నోసార్లు అమ్మకి చెప్పాను మీకు గట్టిగా చెప్పమని. అయినా నా వెర్రిగాని, ఎవరు చెప్పినా మీరు మారరని తెలుసుకోలేకపోయాను.

    అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. డిగ్రీ పూర్తవుతుంది కాబట్టి స్నేహితుల సాయంతో ఏదో ఒక జాబ్‌ వెదుర్కుంటాను. నా కాళ్ళ మీద నేను బతుకుతాను. నన్ను ఇంతకాలం పెంచి పోషించినందుకు మీకు ఆజన్మాంతం రుణపడి వుంటాను.

    ఇంకొక విషయం, మీ కచేరీలకు నేను ఎలాగూ వుండను. అనారోగ్యం పాలవుతున్న అమ్మను మానవతా దృష్టితోనైనా కచేరీలకు తీసుకువెళ్ళడం మానేయండి. లేకపోతే చివరి రోజుల్లో మిమ్మల్ని కనిపెట్టుకుని వుంటే మనిషిని కోల్పోతారు.

    కళ సమాజాన్ని చైతన్యపరుస్తుంది. కళాకారుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే, ఆ కళే అతని కుటుంబాన్ని నాగుపాముల్లా కాటువేయకుండా చూసుకోవాలి.

    పెద్ద మాటలు వాడితే నన్ను క్షమించండి. అమ్మను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి. నాకోసం వెదకవద్దు. నేను ఉద్యోగం వచ్చి బాగా స్థిరపడ్డాకా మీకోసం వస్తాను.
                                                                            
                                                                                                                              మీ,
                
                                                                                                                             సుధ.

    ఉత్తరం చదవడం పూర్తిచేసిన నాగరాజు హృదయం బాధగా మూలిగింది. తన కచేరీలు వీళ్ళని ఇంత యిబ్బందులకు గురిచేస్తున్నాయా..? అప్పుడప్పుడు కాత్యాయని మనకీ కచేరీలు వద్దండి అని చెబితే కొట్టిపారేశాడు. తన ప్రవర్తన వలన సుధ ఇంతటి మానసిక సంఘర్షణకు గురయ్యిందా? కాత్యాయని అనారోగ్యం గురించి తనకింత వరకూ తెలియకపోవడం ఎంత సిగ్గుచేటు..?

    స్తంభానికి చేరబడి దు:ఖిస్తున్న కాత్యాయనని పొదివి పట్టుకున్నాడు. కుడిచేత్తో ఆమె కాలు పట్టుకొని కన్నీళ్ళు కార్చాడు.

    "అయ్యో! ఇదేమిటండి. మీరు నా కాలు పట్టుకుంటున్నారు!"

    "లేదు కాత్యాయనీ! అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నన్ను సుధ ఈ లోకంలోకి తీసుకువచ్చింది. పెళ్ళి చూపుల్లో నీగానం వినే నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను. సుధ నన్ను కరెక్టుగా ఊహించింది. నువ్వు నన్ను ఎక్కడ మించిన గాయనివవుతావోనన్న భయంతోనే నీకు మృందగం నేర్పించాను. నా పక్కన వుంచేశాను. నేను నీపట్ల చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు కాత్యాయనీ."

    "మనలో మనకు క్షమాపణలేమిటండి. ఊరుకోండి."

    "కాత్యాయనీ! మన సుధ వయొలిన్‌ ఎంత బాగా వాయిస్తుందో తెలుసా! దాని వయొలిన్‌ వింటే చిన్నప్పుడు మా అమ్మ ఒళ్ళో నిద్రించిన అనుభూతి గుర్తుకు వస్తుంది. దానికెక్కడ పేరు వచ్చి ఎదిగిపోతుందోనని, దాన్నీ అడ్డుకున్నాను. నేను మీ ఇద్దరిపట్లా చాలా కౄరంగా ప్రవర్తించాను కదూ! హు! ఎందుకొచ్చిన కచేరీలు. ఎందుకీ అనవసర పరుగులు. కాలాన్ని వృధా చేయకుండా ఇంటివద్దే వుండి నలుగురు చిన్నారులకి సంగీతజ్ఞానం ప్రసాదించడమే నాకు లభించే నిజమైన అవార్డు."

    ఇంతలో ఫోన్‌ మ్రోగడంతో సంభాషణ ఆపి ఫోన్‌ తీశాడు నాగారజు.

    "మాష్టారూ, నేను వరలక్ష్మీ టీచర్‌ని. మీ అమ్మాయి సుధ ప్రొద్దుటే ఇక్కడికి వచ్చింది. హైదరాబాద్‌ వెళ్ళడానికి టికెట్‌ బుక్‌ చేయమంది. ప్రస్తుతం బాత్‌రూమ్‌లో ఉంది. అందుకే నేను మీకు ఫోన్‌ చేస్తున్నాను."

    "కాత్యాయనీ! వరలక్ష్మీగారు ఫోన్‌ చేశారు. అమ్మాయి వాళ్లింటి దగ్గర వుందిట. అర్జెంట్‌గా రమ్మన్నారు. వెళదాం పద"

    ఇంటికి తాళాలు వేసి  బయటకు వచ్చి భర్త స్కూటీపై కూర్చుంది కాత్యాయని. మబ్బులు తొలగిన చందమామ ముఖంలా ప్రశాంతంగా వున్నాడు నాగరాజు. గడిచినవి కొన్ని గంటలే అయినా చాలా సంవత్సరాల తర్వాత కూతుర్ని కలుసుకోబోయే తల్లిలా టెన్షన్‌ పడుతోంది కాత్యాయని. స్కూటీ తాడేపల్లిగూడెం వైపు పయనిస్తోంది.

(ఆంధ్రప్రభ దినపత్రిక 18 డిసెంబరు 2010 సంచికలో ప్రచురితం)

Comments