రాయలమ్మ - ఎస్.మునిసుందరం

    "తల్లీ! రాయలమ్మ తల్లీ! పేదరాలిని. నా అన్న కూతురి పెళ్లికి పోతుండాను. నగలివ్వు తల్లీ! తిరుగు ప్రయాణంలో నీ నగలు నీకు అప్ప చెప్తానమ్మా! దయగల తల్లీ! దయ జూపించు."

    ఆమె ప్రార్థన మన్నించి రాయలమ్మ తాను వెలసివున్న వేప చెట్టు మొదట్లో నగల మూట పెట్టింది.

    ఆ ముత్తయిదువ నగల మూట తీసుకుని ఎంతో సంతోషంగా పయనం సాగించింది.
 
    "నానమ్మా! నువ్వు చెప్పే కథ నమ్మేట్టు లేదే. అడిగిన ప్రతి ముత్తయిదువకు ఆమె నగలిస్తుందా? అదే నిజమైతే ఆమె దగ్గర ఎన్ని నగల మూటలుండాలి" అడిగాను.
 
    "ఎర్రోడా! రాయలమ్మ ఎవరనుకున్నావ్. రాయలవారి గారాల కూతురు. ఆమె దగ్గర బోలెడు నగలుంటాయిరా!" అనింది మా నానమ్మ.
 
    "అయితే ఆమెను నువ్వు చూశావా?" మళ్లీ అడిగాను.
 
    "ఆమె కనబడదు సినబ్బా! ఆమె దేవతగా అక్కడ కొలువయి వుంది. ఆమె రూపును వేప సెట్టుకు ఎవరో మగానుభావుడు సెక్కినాడ్రా. ఆ రూపుకు దండం బెట్టి అడిగితే సెట్టు మొదట్లో పసుపు గుడ్డలో చుట్టిన నగల మూట పెడుతుంది. మళ్లీ తిరిగొచ్చేటప్పుడు నగలన్నీ తీసి అదే పసుపు గుడ్డలో మూటగట్టి ఆ చెట్టు మొదట్లో పెట్టాల్రా. మనం సూస్తావుండంగానే అవి ఏడికి బోతాయో తెల్దు. ఇది ఆ తల్లి మహత్తెం బిడ్డా!" నానమ్మ భక్తి భావంతో దండం పెట్టుకుంది.
   
    "మరి ఇప్పుడా మహత్తెం ఏమయింది. నగలు ఇవ్వడం లేదెందుకని. మహత్తెం ఎప్పుడూ వుండాలిగదా. ఇప్పుడెక్కడికి పోయింది." సందేహంగా అడిగాను.
 
    "బలే అడిగావురా సిన్నోడా! కొత్తిండ్లు వుండ్లా. ఆ ఇండ్లలో ఆదెక్క అనే ఒక ముదనష్టపు యిల్లాలు వుండేదంట. ఆయమ్మ సెంద్రగిరికి పెళ్ళికి బోతా అందరూ అడిగినట్టే నగలడిగిందంట. రాయలమ్మకు ఏ ముత్తయిదువ అడిగినా వొకటే గదా. నగలిచ్చిందంట. పెళ్ళి జూస్కోని తిరిగొచ్చేటప్పుడు దేవతకు నగలిచ్చేయాలి గదా?"
 
    "అవును కదా!" అన్నాను.
 
    "ఆశరా. ఆశ. ఆ ముండ మనసును ఏ పురుగు తొలిసిందో తెల్దు. ఆ దేవత నగల మూటకు కావిలి వుంటిందా నా నగలిచ్చిపో అని అడిగేదాని. ఏమీ తెలవనట్టు తలొంచుకుని ఆ సెట్టును దాటేస్తే ఆ నగలన్నీ నావే అయిపోతాయిగదా అన్న దుర్భుద్ధితో గబగబా ఆ సెట్టును దాటుకుని నాలుగడులు వేసిందంట అబ్బోడా!"
 
    "ఏమయింది నానమ్మా!"ఆశ్చర్యంగా అడిగాను.
    
    "ఎనకనుండి రాయలమ్మ 'ఒసేయ్!ఆదెక్కా! నా నగలు ఇవ్వకనే పోతుండావే.ఆగవే'అన్నదంట.
    
    ఆదెక్క తిరిగి సూచి "ఇంకా బతికేవుండావా నువ్వు. నీ ఆబలు అణిగిపోలేదా? నీ నోరు పడిపోనూ" అనిందంట. అంతే ఆనాటి నుండి రాయలమ్మ పలుకే వినబడలేదంట ఎవరికీ. ఆ రోజు నుంచి రాయలమ్మ నగలు యివ్వడంలేందంట. ఆ తల్లి యాడబొయ్యిందో ఎవరికీ తెల్దు. ఆదెక్క వంశం నిరువంశమై పోయిందంట. దానికి అడక్కతినే గతిబంట్టిందంట. అంతేగద సినబ్బా దేవుడి సొత్తు తింటే జరిగేది."నిట్టూర్చింది నానమ్మ.
 
    "నిజమే నానమ్మా! ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాల్సిందే. అయితే నానమ్మా! యీ రాయలమ్మ అక్కడెందుకు వెలిసిందో చెప్పవా?" అడిగాడు.
 
    "ఇదంతా మా ముత్తవ్వ మా అవ్వకు సెప్పిందంట. మా అవ్వ నాకు సెప్పింది. ఇదెప్పుడు జరిగిందో ఎవురికి తెలుసు బిడ్డా. రాయలోరి కాలంలో జరిగిందంట. ఐదో తరగతి పుస్తకంలో బొమ్మ సూపించి రాయలోరు నానమ్మా అన్నావు గదా. ఆయన కాలంలో జరిగిందంట."
 
    "రాయలవారి కూతురైతే ఇక్కడ బాదూరు చెరువు గట్టున దేవతగా ఎందుకుండాల్సి వచ్చింది. చంద్రగిరిలో తావులేకనా? విజయనగరంలో చోటు లేకనా? ఇంతదూరం వచ్చింది."
 
    "ఎర్రి నాగన్నా! అది బాదూరు సెరువు గాదు. రాయలోరి సెరువు. దాన్ని తొవ్విచ్చింది రాయలోరు. మా అవ్వ సెప్పేది. అది పెద్ద కతరా." ఆవళిస్తూ..."పోయి పడుకోబో. రేపు సెప్తా మిగతా కత. నాకు నిద్ర ముంచుకొస్తా వుండాది." గట్టిగా ఆవుళించి అట్నే పడకేసింది మా ముసలి తల్లి.
 
    కథంతా చెప్పనందుకు నాకు కోపంగా వుంది. నేనూ మా అవ్వ పక్కన ముడుక్కున్నా. కాని మనసు నిండా ప్రశ్నలే. అన్నీ రాయలమ్మ చుట్టూ తిరుగుతున్నాయి.
 
    ఎప్పుడో నిద్ర పట్టేసింది.
 
    నాకు రెక్కలు మొలిచాయి. పక్షిలా ఎగిరిపోతున్నాను. ఆకాశంలో దూసుకుపోతున్నాను. ముందుకు కాదు. రాయల కాలంలోకి ఆయన రాజ్యం చేసిన కాలంలోకి...!
* * *
 
    ప్రసన్న వెంకటేశ్వరపురం సందడి సందడిగా వుంది. కోలాహలంగా వుంది. అమ్మవారి జాతర వేడుకలో ఊరంతా తలమునకలై వుంది. జాతర వేడుకైనా ఎవరి ముఖంలోనూ ఆనందం లేదు. పలచని చీకటి ప్రతి ఒక్కరి ముఖంలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది. ఏడేళ్లుగా వర్షాలు లేవు. బావులు ఎండిపోయాయి. ముక్కారు పంటలు కలలైనాయి. ఈ ఏడేళ్లుగా క్రమం తప్పకుండా అమ్మవారి జాతర చేస్తూనే వున్నారు. గంగమ్మ తల్లి సంతోషించి వానలు కురిపిస్తుందని ఆశతో బ్రతికున్నారు జనం. సన్నటి ఆశ. చావని ఆశ. ఒక నమ్మకం. అప్పో సప్పో చేసి జాతర జరిపిస్తూనే వున్నారు. గంగమ్మ ఏదో ఒకనాడు దయతలచక పోతుందా అన్న ఆశాలేశం అమాస చంద్రునిలా వారి దిగులు కళ్ళల్లో.
 
    సంవత్సరంలో రెండు లేదా మూడుసార్లు పదునో లేక రెండు పదున్లో వాన కురుస్తుంది. ఆ వానలకు పండే సజ్జలు, జొన్నలు, అనపకాయలు, అలసందకాయలు ఇవే జీవనాధారాలు. ఇవీ పండనప్పుడు అడివే జీవనాధారం. నేలతల్లి గుండెలు చల్లబడేలా, బావుల్లో పుష్కలంగా నీళ్ళు వుండేలా వర్షాలు పడి ఏడు సంవత్సరాలు అవుతుంది.
 
    వ్యవసాయానికి బావినీళ్లే తప్ప మరో ఆధారం లేని రైతులు "గంగమ్మ తల్లీ! ప్రతి ఏడూ నిన్ను కొలుస్తూనేవున్నాము. దయజూపు తల్లీ! మా బిడ్డల పాపలను కాపాడు తల్లీ!" పొర్లుదండాలతో వేడుకొంటున్నారు. పంబల ధ్వనులతో వాతావరణం అంతా తెలియని ఏదో భక్త్యావేశంతో నిండిపోయి వుంది. ఆసాదులు అమ్మవారిని రకరకాలుగా ఆటపాటలతో అలరిస్తున్నారు. అమ్మవారికోసం నిర్మించిన వేపాకు మండపం జముకుల ధ్వని తరంగాలలో ఓలలాడుతూంది. వర్షం కురుస్తుందన్న ఆశాదీపాలు జనం గుండెల్లో మండుతూ... ఆరిపోతూ...
 
* * *
 
    మారువేషంలో వున్న రాయలవారు "రామక్రిష్ణయ్యా! కరువు రక్కసి కోరలలో చిక్కిన యీ జనుల ఆర్తనాదాలు మమ్మల్ని కలచివేస్తున్నాయి. ఇది పేరుకు జాతరే కానీ ప్రజల ఆకలి, ఆక్రోశాన్ని తెలియజేస్తున్నది. పంటలు పండించడానికి బావులు తప్ప మరో ఆధారంలేని యీ ప్రజలకు మనం మరో ఆధారం కలిగించాలి. ఏమంటారు?" కళ్లతో చూస్తున్న నిజాన్ని నిబ్బరించుకోలేని రాయలవారి మాటలు. 
 
    "సత్యం ప్రభూ! ప్రజల క్షేమమే రాజుకూ, రాజ్యానికీ క్షేమం"అన్నాడు రామక్రిష్ణయ్య. "రామప్ప నాయకా!" ప్రక్కనే నిలబడి వున్నాడు దండనాయకుడు రామప్ప నాయకుడు.
 
    "మహాప్రభూ! ఆజ్ఞ"
 
    "చంద్రప్ప నాయకుడు ఎక్కడ?"
 
    "మన్నించండి మహాప్రభూ! ప్రజల కరువు కేకలు వినలేక చెట్టు క్రింద నిలబడి కన్నీరు కారుస్తున్నాడు ప్రభూ! దయ తలచండి" వినమ్రంగా విన్నవించాడు రామప్పనాయకుడు.
 
    "రామప్పా! మేము ప్రభువులమే కాదు. దండి గుండెలున్న మనుషులం. ఈ ప్రాంతం ప్రజలకు ఊరట లభించేలా కాలువలు తవ్విస్తాము. ఒక పెద్ద చెరువును ఎన్నటికీ తరగని నీళ్లు వుండేలా... తవ్విస్తాం. 

    రామక్రిష్ణాయ్యా! కాలువలు ఎక్కడ ఏర్పాటు చేయాలో చెరువు నిర్మాణానికి తగిన స్థలమేదో నిర్ణయించి మూడు రోజులలోగా మాకు ప్రణాలికలివ్వండి. చంద్రప్పా!" రాయలవారి గళంలో ధృడసంకల్పం.

    చంద్రప్పనాయకుడు కళ్లు తుడుచుకుణ్టూ పరుగుతో వచ్చి వినమ్రంగా వందనం చేశాడు.

    "రామక్రిష్ణయ్యా! దండనాయకుల సాయం తీసుకోండి. మీ మువ్వురి భుజస్కంధాలపై యీ భారం మోపుతున్నాము. ఈ ప్రాంత ప్రజలకు నీటి కరువు లేకుండా జీవించడానికి తగు ఏర్పాట్లు చేయండి. సర్వ హక్కులూ మీకు ఇస్తున్నాము. ఒక ఏడాదిలో కార్యక్రమం పూర్తికావాలి. ఇది మా ఆజ్ఞ" కృతనిశ్చయంతో అన్న రాయలవారి పలుకులు కలకండ పలుకుల్లా తోచాయి దండనాయకులకు.

    దూరంగా విడిచి వచ్చిన గుర్రాలవైపు వడివడిగా నడిచారు రాయలవారు. వారిని అనుసరిస్తూ దండనాయకులు, రామక్రిష్ణయ్య అడుగులు వేశారు.

    "ఏడాది తర్వాత మేం శ్రీవారి దర్శనం కోసం వస్తాము. అప్పటికి చెరువు తవ్వడం, కాలువలు ఏర్పాటు చేయడం పూర్తికావాలి. ఎట్లా చేస్తారోమాకు తెలియదు. బాధ్యత మీదే" గుర్రాలపై చంద్రగిరి వేపు వెడుతూ దారిలో రాయలవారు మరొకసారి ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నారు ఆ ముగ్గురితో.

* * * 
 
    కాలువలు ఎక్కడెక్కడ తవ్వాలో, చెరువు నిర్మాణానికి అనువైన ప్రదేశం ఏదో దండనాయకులతో రామక్రిష్ణయ్య చర్చించి నిర్ణయించారు. రామక్రిష్ణయ్య చంద్రగిరిలో ఆస్థాన జల వ్యవస్థాధికారి.
 
    పడమర, ఉత్తర, దక్షిణాలలో కొండలు. ఉత్తరం నుండి దక్షిణంగా వున్న కొండను కలుపుతూ ఆనకట్ట కట్టితే నిర్మాణం సులభతరమౌతుందనుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం తక్కువ. అదీగాక యీ కొండలమధ్య మూడు గ్రామాలే వున్నాయి. ఈ మూడు గ్రామాల వారికి దిగువ ప్రాంతంలో భూమి కేటాయించటం కష్టం కాదు. వర్షం వస్తే యీ మూడు కొండల నుండి క్రిందికి దిగే నీటి ధారలు ఈ ప్రదేశంలోనే కలుస్తాయి. సుమారు అరయోజనం దూరం వరకూ నీళ్లు నిలిచే అవకాశం వుంది.
 
    చెరువు నుండి నీళ్లు బయటకు రావడానికి ఏడు తూములు వుండాలని అవి ఎక్కడ వుండాలో నిర్దేశించారు. తూముల్ని మిద్దెలన్నారు ఆ రోజుల్లో. ఆనకట్టను పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించాలనీ, రాయి రాయికీ మధ్య బిగువైన గార నింపాలనీ ఆలోచించారు.
 
    గార ఆడడానికి గానుగలు ఏర్పాటు చేశారు. సున్నపురాళ్లూ ఇసుకతో బాటు తుమ్మ జిగురు, వేప జిగురు, జీలగ జిగురు, అత్తిపాలు, మర్రిపాలు, కోడిగుడ్లు ఏ పాళ్లలో కలపాలో రామక్రిష్ణయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
 
    పెద్ద పెద్ద బండరాళ్లను రైతులు, కూలీలు, దళితులు అన్ని వర్గాలు, అన్ని వర్ణాల యువకులు కొందరు నెత్తిన పెట్టుకుని తెస్తూంటే, కొందరు మోకులకు కట్టి లాక్కొస్తున్నారు. ఆనకట్ట నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. బావులు తప్పడంలో నిపుణులయిన వడ్డెర్లు చెరువు తవ్వుతున్నారు. నున్నగా గానుగాడించిన గారతో బండరాళ్లను కలుపుతున్నారు. బండరాళ్ల కిరుపక్కలా తవ్విన మట్టిని వడ్డెర్లు పోస్తున్నారు.

    అదొక మహా జల యజ్ఞం. ప్రజల భాగస్వామ్యంలోతో జరుగుతున్న ప్రజా ప్రయోజన కార్యక్రమం. రామక్రిష్ణయ్య, రామప్ప, చంద్రప్ప నాయకులు ప్రజలతో మమేకమై సూచనలు యిస్తూ నిర్మాణ కార్యక్రమాన్ని చరచరా ముందుకు నడిపిస్తున్నారు.

    నలభై అడుగుల ఎత్తు, నలభై అడుగుల వెడల్పుతో రెండు వందల బారల దూరం రెండు కొండల్ని కలుపుతూ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమయింది. అడుగు భాగం నుండి పది అడుగుల ఎత్తులో వుండేట్టు ఏడు మిద్దెలు (తూములు) ఏర్పాటు చేశారు. మూప్పయ్ అడుగుల ఎత్తులో ఉత్తర, దక్షిణ దిక్కులలో మొరవలు ఏర్పాటు చేశారు. ఉత్తర దిక్కులో ఉన్న మొరవ పేరు హనుమంతు మొరవ, దక్షిణ దిక్కున వున్న మొరవకు అక్కగార్ల మొరవ అని పేరు పెట్టారు. ముప్పయ్ అడుగులకు పైన నీళ్లు చేరితే మొరవల ద్వారా బయటకు పోతాయి. దక్షిణ దిక్కు మొరవ నీళ్లను పది గ్రామాల చెరువులకు అనుసంధానం చేశారు. ఉత్తరాన వున్న హనుమంతు మొరవ నీళ్లు ముండ్లపూడి దగ్గర స్వర్ణముఖి నదిలో కలిసేలా ఏర్పాటు చేశారు.

    మిద్దెలు (తూములు) తెరిస్తే ఒక్కో తూము నుండి రెండు అంగుళాల నీళ్ళు వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. ఏడు తూముల నుండి 14 అంగుళాల నీళ్లు బయటకు వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. తక్కువ నీళ్లు రావడం వల్లా తూము తెరవడం, మూయడం సులభమౌతుంది. ఉప్పెన లాంటి వర్షం వచ్చినా కట్టకు ఎలాంటి ప్రమాదం వుండదు. ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చెరువు నిర్మాణం జరిగింది.

* * *
 
    రాయలవారు చెప్పిన గడువు పూర్తి అయింది. రాయలవారు అన్నమాట ప్రకారం చంద్రగిరి చేరుకొన్నారు. ఆ రాత్రి విపరీతంగా కొండాకోనా ఏకమయ్యేలా వర్షం కురిసింది. దండనాయకుల ఆనందానికి మేరలేదు. రాయలవారు విజయం చేసి ప్రారంభోత్సవం చేయడమే ఇక మిగిలింది. చినుకులు పడుతున్నా లెక్క చేయక రామప్ప, చంద్రప్ప దండనాయకులు వేకువ ఝామునే చెరువు దగ్గరకు చేరుకున్నారు.  ఆశ్చర్యం. చెరువులో నీళ్లు లేవు. గుండెలు దడదడలాడుతూంటే ఇద్దరూ చెరువు కట్టపై నడుస్తూవచ్చారు. అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టులయ్యారు. దక్షిణ భాగంలో పది అడుగుల మేర కట్ట తెగిపోయి వుంది. కట్టకింద వున్న గ్రామాలు, భూములు నీళ్ల మధ్య వున్నాయి.
 
    నిరాశ నిస్పృహల హిమ వర్షం వాళ్లను భయకంపితులను చేసింది. ప్రజా సంక్షేమమే తన సౌభాగ్యమని భావించే రాయలవారికి చెరువు ప్రారంభోత్సవానికి విజయం చేసిన రాయల వారికి... ఏం చెప్పాలి? ఇప్పుడేది దారి?

    వారి గుర్రాలు చంద్రగిరి వైపు దౌడు తీశాయి. రామక్రిష్ణయ్య ఇంటికి చేరుకొన్నారు. ఆయన ప్రభు దర్శనానికి బయలుదేరబోతున్నారు. విషయం చెప్పారు. తమ శ్రమ నిష్ఫలమైనందులకు భోరున ఏడ్చారు దండనాయకులు.

    రామక్రిష్ణయ్యకు చర్నాకోలతో ఎవరో కొట్టినట్టనిపించింది. ప్రభువులకీవార్త చెప్పడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు. ధైర్యం తెచ్చుకున్నారు. ప్రభువులు బయలుదేరడానికి ముందే జరిగింది విన్నవించుకోవాలని దండనాయకులతో కలిసి రాయలవారి మందిరం చేరుకున్నారు.

    మ్లాన వదనాలతో నిలబడిన ఆ ముగ్గుర్నీ చూసి ఏదో జరిగివుంటుందని రాయలవారు పసిగట్టారు. "చెప్పండి. సంకోచం దేనికి? ఏ విపత్తూ రాలేదు గదా?" నగుమోముతో అడిగారు రాయలవారు.   

    రామక్రిష్ణయ్య రాయలవారికి జరిగినదంతా విన్నవించారు సవినయంగా.
 
    "ఇది ప్రకృతి వైపరీత్యం. మీరు భయపడడం ఎందుకు? ఈ తెగిన భాగాన్ని త్వరితంగా పూర్తి చేయండి. రామక్రిష్ణయ్యా! ఇంకా రెండుమాసాలు మేమిక్కడే ఉంటాం. ఆలోగా..."
 
    "అంత గడువెందుకు ప్రభూ! పది దినాలలో పూర్తి చేస్తాం" అన్నాడు రామక్రిష్ణయ్య.

    పదో రోజుకు తెగిన కట్ట భాగాన్ని అన్ని జాగ్రత్తలూ తీసుకుని నిర్మించారు.

    ఆ రోజు రాత్రి మళ్లీ వర్షం విరుచుకుపడింది. ముందు తెగిన చోటే కట్ట తెగింది. నీళ్లు వూళ్లపాలయ్యాయి.

    మళ్లీ నిర్మాణం జరిగింది. కానీ మళ్లీ అదే తంతు.

    రాయలవారిని, రామక్రిష్ణయ్యను, దండనాయకులను విభ్రాంతులను చేసింది ఈ దుర్ఘటన. ఏంచేయాలో తెలియని పరిస్థితి.

    రాయలవారు ఆలోచనలో పడ్డారు. పూర్తయిన రాత్రే వర్షం కురవడమేమిటి? తెగినచోటే కట్ట తెగడమేమిటి? దీనికేదో బలీయమైన కారణం వుండివుండాలి. లేకుంటే ఇట్లా జరిగే అవకాశం లేదు.

    ఆస్థాన జ్యోతిష్కులను, పండితులను పిలిపించారు. నిపుణులను పిలిపించి తనిఖీలు చేయమన్నారు. అంతా బాగానే వుంది. మరి ఈ వుపద్రవమేమిటి? ఎందుకిట్లా జరుగుతోంది. భారంగా నిట్టూర్చారు ప్రభువులు. శ్రీవారి శిఖరాన్ని తిలకిస్తూ "శ్రీనివాసా! తిరుమలేశా! నాకిది  పరీక్షా? ఆపదమొక్కులవాడా! ఆర్తజన రక్షకా! నాకు దారి చూపించు తండ్రీ!" అంటూ రెండు చేతులెత్తి నమస్కారం చేశారు రాయలవారు.

    ఇంతలో బయట కలకలం. ఒక ఎరుకలసాని "ఎరుక జెబుతాను. అన్ను ప్రభువుల దగ్గరకు తీసుకెళ్లండి. వారి దర్శనం చేసుకుంటాను. వారికోమాటా చెప్పి పోతాను" అంటూంది. అంతఃపుర రక్షకులు ఆమెను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. రాయలవారి చెవులకు ఆమె మాటలు అమృతపు గుళికల్లా వినిపించాయి.కాపలా వారితో ఆమెను లోపలికి పంపమని ఆజ్ఞాపించారు.
    
    ఎరుకసాని వచ్చింది. ఆమె వదనంలో ఏదో వింత కాంతి.
 
    ఆమె వస్తూనే "ఓ రాజా! నేను చెప్పెడిది మరొకరు వినరాదు. మనమిద్దరమే వుండాల. వివరంగా అన్ని విసయాలు చెబుతాను" అన్నది.
 
    ఆమెను తీసుకుని తన ఆలోచనా మందిరం వేపు నడచారు రాయలవారు.
 
    "ఓ రాజా! మీరట్లా కూర్చోండి" అంటూ ఆమె పసుపుకుంకుమలతో నిండిన ఒక పట్టీని రాయలవారి ముందు పెట్టింది. రెండు కాళ్లూ మడత బెట్టి కూర్చుని, తన ఏకతంత్రిని మీటుతూ "మారాజా! ఆ ఏడుకొండలసామిని తలుసుకుని ఈ పట్టీని తాకండి" అన్నది.
 
    మంత్రముగ్ధునిలా రాయలవారు ఆమె చెప్పినట్టు చేశారు.
 
    ధ్యాన ముగ్ధయై ఆమె కొన్ని నిమిషాలు మౌనంగా వున్నది. ఏకతంత్రి నాదం గదినిండా నిండిపోయింది.

    "ఓ దేవరా!" అన్నది మౌనాన్ని భంగపరుస్తూ.

    "నా మాటలు తమకు సంతోషం కలిగించవు మారాజా! పెద్ద పేరంటాలు సెబుతున్నది... నాను కాదు. నన్ను మన్నించండి మారాజా! కట్ట వేసేముందు టెంకాయలు, కర్పూరంతో సరిపెట్టినారు. అమ్మవారు బలికోరినారు. కాని తమరు బలి సంగతి మరచిపోయినారు. ఇప్పుడమ్మవారు బలి కోరుతున్నారు. ఆమె కోరిక చెల్లిస్తే కట్ట నిలుస్తుంది మహాప్రెబో!" రాగం తీస్తూ చెప్పింది ఎరుకసాని.

    రాయలవారు కొంతసేపు మౌనం వహించారు. "ఏమే ఎరుకసానీ! అమ్మవారు బలికోరుతున్నారంటావ్ చెప్పు. మేము ఎలాంటి బలి యివ్వాలి. వివరించు" అన్నారు రాయలవారు.
 
    "ఎవురూ లేరు కదా" అటూయిటూ చూసి ఎరుకసాని "మారాజా! గుండె నిబ్బరం చేసుకుని వినండి. గంగమ్మ తల్లి పద్దెనిమిది సంవత్సరాల కన్నెపిల్లను బలి కోరుతున్నది దేవరా!" అన్నది ఎరుకసాని.
 
    శిల అయ్యారు రాయలవారు.
 
    "ఆలోసించుకోండి మారాజా! తమ కానుకలు కూడా నేను తీసుకోను! సెలవిప్పించండి" ఎరుకసాని చరచరా బయటకు వెళ్లిపోయింది. ఆమె ఎటు వెళ్లిందో ఎవరూ చూడలేదు. ఎట్లావచ్చిందో ఎట్లా వెళ్లిందో ఆ భగవంతుడికే ఎరుక.
 
    "పద్దెనిమిదేళ్ల కన్నెపిల్లను బలియివ్వాలా? సర్వసృష్టిని కాపాడే తల్లివి. ఇదేమి విపరీతం తల్లీ! ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో చేసిన జలయజ్ఞానికి యీ ముగింపు ఏమిటి మాతా!" ఆలోచనలు... తేనెటీగల్లా వెంటాడుతున్న ఆలోచనలు.
 
    "ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు తమ కళ్లెదుటే తమ బిడ్డ జలసమాధి కావడం. గుండె చెరువులు తెగిపోవా? శ్రీనివాసా! ఎంత సంకటం తెచ్చిపెట్టావు తండ్రీ!"
 
    రాయల వారు భోజనం చేయలేదు. ఆలోచనా మందిరంలోనే వుండిపోయారు. దగ్గరకెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోయారు. నిద్రపోయినట్లు కూడా లేదు.

    తూరుపున పటమెగిరింది. ఉష దోసిళ్లతో సింధూర స్వాగతం పలుకుతూంది ప్రత్యక్షసాక్షికి. రాయలవారు ఆలోచనామందిరం నుండి వరండాలోకి వచ్చారు. బాల భానునికి భక్తితో వందనం సమర్పించారు. వాడిన కమలంలా ఆయన వదనం దిగులుగా వుంది.

    అప్పుడు వచ్చింది కాలి అందియలు ఘల్లు ఘల్లుమంటూంటే మెల్లగా అడుగులు వేస్తూ, వికసిత కమలంలా, నగుమోముతో తండ్రిముందుకు రాయలవారి గారాల బిడ్డ నాగలాదేవి.
 
    "తండ్రీ! మీరెందుకు చింతాక్రాంతులై వున్నారో నాకు తెలుసు. ప్రజాసంక్షేమం కోసం మీ తపన ఏపాటిదో కూడా నాకు తెలుసు. ఎందుకట్లా మీలోనే మీరు కుంగిపోతారు." క్షణం ఆగి..."మీ బిడ్డను నేను లేనా?"
 
    గుండెపై దెబ్బ కొట్టినట్టయింది రాయలవారికి. "వద్దు బిడ్డా! వద్దు. ఆ ఊహే భరించరానిది. నేను ఏమైపోతానో..."
 
    "అహరహమూ ప్రజాహితంకోరే మీరే భరించగలరు. సహించగలరు. సామాన్యులకిది అసాధ్యం తండ్రీ!" అన్నది నాగలాదేవి.
 
    "ఆవేశపడకు బిడ్డా! నేను వేరే మార్గం ఆలోచిస్తానమ్మా"
 
    "మరో మార్గం లేదు తండ్రీ! నేను ఎక్కడికి పోతాను. మీలో... లక్షల ప్రజల హృదయాలలో...శాశ్వతంగా నిలిచిపోతాను. బిడ్డగా నా రుణం ఇట్లా తీర్చుకోనివ్వండి."
 
    "బిడ్డా!బిడ్డా!" భోరున విలపించారు రాయలవారు.
 
    తండ్రి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, తన శిరసు వంచి "తండ్రీ! ఇది నా విన్నపం. మన్నించండి. నేను ఆనందంగా జలసమాధి అవుతాను. చింతాకంత చింత కూడా నాకు లేదు. నా తండ్రి త్యాగ చరిత్రను చెరువులోని చిరుతరంగాలు గీతాలుగా ఆలపించాలి. ఆకలితో అలమటించే లక్షల జనహృదయాలలో మీ త్యాగం మీ కీర్తి అన్నపూర్ణలై వెలగాలి. మీ గారాల తల్లి కోరే యీ చిన్ని కోర్కెను మన్నించలేరా తండ్రీ!"
 
    నగవుల తేజోమయ కాంతులతో ఆమె వదనం వెలిపోతున్నది యీ మాటలంటూ వుంటే.
 
    మాటలు రాక రాయలవారు ఎండిన మోడులా నిలబడినారు.
 
    "ఎల్లుండి శుక్రవారం. ఆ రోజు బాలభాస్కరుని లేత కిరణాలు భూమిని తాకే వేళ నా జలసమాధికి మంచి ముహూర్తం. ఏర్పాట్లు చేయండి తండ్రీ!" అన్నది నాగలాదేవి ధృఢ సంకల్పంతో.
 
* * *
 
    దుఃఖపు పొగమంచు చంద్రగిరి దుర్గాన్ని కప్పి వేసింది. 
 
    ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు.
  
  

    రాయలవారు నిశ్శబ్ద శూన్య తిమిరంలోకి జారిపోయారు.
 
    ఎవరు ఏమి పనిచేసినా యాంత్రికంగా ఇదేదో తప్పదన్నట్ట్లు చేస్తున్నారు. తోలుబొమ్మల్లా తిరుగుతున్నారు.
 
    ఒక్క నాగలాదేవి మాత్రం ఆనందంగా వుంది.
 
    గురువారం రాత్రి నాలుగో ఝామున చంద్రగిరి నుండి జనసముద్రం ఘోషిస్తూ బయలుదేరింది ప్రసన్నవేంకటేశ్వరపురం వైపు. మంగళవాయిద్యాలు, డప్పులు తప్పెట్లు, తాళాలు, కొమ్ములు, శంఖాలు, జయజయ నాదాలు మిన్నూ మన్నునూ ఏకం చేస్తున్నట్టున్నాయి. చెక్క భజనలు, పండరి భజనలు, కోలాటాలు, పంబలు, జముకులు నాలుగు దిక్కుల్నీ హోరెత్తిస్తున్నట్లున్నాయి. జనసముద్రం కదులుతున్నట్టుంది.

    సర్వాలంకార భూషితై, ఫాలభాగాన రూపాయంత కుంకుమ బొట్టుతో కాంచీపురం పట్టుచీర ధరించి, ఆరబోసిన కురులలో కనకాంబరాల సరాలు నింపుకుని కాలి అందియలు ఘల్లు, ఘల్లు మంటూంటే రాజ ప్రాసాదం నుండి నాగలాదేవి వచ్చి రాశీభూత క్షీరంలా పల్లకీలో కూర్చున్నది. 
  

    గోవింద నామస్మరణతో దిక్కులు పెఠిల్లుమన్నాయి. నాలుగు పక్కలా నలుగురు దండనాయకులు, వెనుకా ముందు సాయుధులైన సేనానాయకులు నడువగా పల్లకీతో బాటు రాయలవారు ఖిన్నవదనులై అశ్వారూఢులైనారు. రాయల వారి  దుఃఖాన్ని తాను మోస్తున్నట్టు అశ్వం అడుగులు వడివడిగా పడటం లేదు. అంత కోలాహలంలోనూ అంతుపట్టని అనంత నీరవత. గుండె గుండెలోనూ సడి చెయ్యని శోక తరంగాలు. 

    "తన జీవితం చరితార్థం కాబోతున్నది. ప్రజల చిరకాల వాంఛితం నెరవేరబోతున్నది... స్వచ్ఛమైన ప్రజాపాలకుడుగా, ప్రజల సంక్షేమం కోసం తన గుండెను కూడా యివ్వగల త్యాగశీలుడుగా తన తండ్రి చరిత్రలో నిలిచిపోతాడు. అంతకన్నా సంతోషం మరొకటున్నదా యీ నేలపై" నాగలాదేవి ఆలోచనలు యిట్లా సాగుతున్నాయి.

* * *

    కార్తీక మాసం శుద్ధ పంచమి శుక్రవారం.

    ఉషస్సును పక్కకు నెట్టేసి లేత కళ్లతో బాలభానుడు చెరువుకట్ట వేపే చూస్తున్నాడు. తన కళ్లతో చూసిన నాగలాదేవి బలిదానాన్ని, జలసమాధిని దిశదిశల్లోని చరాచర జీవకోటికి చెప్పాలన్న వుత్కంఠ ఆ దినకరునిలో.

    గోవింద నామస్మరణ దిక్కుల్ని గడగడా వణికిస్తూంటే నాగలాదేవి చిరునవ్వులు చిందిస్తూ తండ్రి పాదాలకు నమస్కరించింది. రాయలవారు శోకసముద్రమే అయ్యారు. "బిడ్డా!బిడ్డా!" అంటూ నాగలాదేవిని అక్కున చేర్చుకున్నారు. ఆయన కన్నులు కన్నీటి జలపాతాలు.

    తండ్రి కన్నీటిని తుడిచి "తండ్రీ!నిండు గుండెలతో నన్ను ఆశీర్వదించండి. మీ బిడ్డ ఎన్ని లక్షల హృదయాలలో...చిరంజీవిగా వుంటుంది. ఈ నేల పచ్చని పట్టుబట్ట కట్టిన ముత్తయిదువులా సదా పరిమళిస్తుంది" అని శెలవు కోరింది.

    రాయలవారు స్థంభించిన నిశ్శబ్దమయ్యారు.

    నాగలాదేవి సన్నని నవ్వుల విరజాజులు చల్లుతూ తెగిన కట్ట మధ్య నిలబడింది.

    జయజయధ్వానాలు మిన్నుముట్టాయి. కలియుగ దైవమయిన తిరుమలేశుని స్మరణతో వాతావరణం పవిత్రమైపోయింది. 

    అంతకు మునుపే అన్ని ఏర్పాట్లూ చేసి వుంచిన రామక్రిష్ణయ్య తలవంచుకునే "దండనాయకులారా! ముహూర్తపు పేళయింది" అన్నారు చిట్లిన స్వరంతో.

    గుండెల్ని చిక్కబట్టుకుని దండనాయకులు నాలుగువైపులా నిలువెత్తు బండరాళ్లు నిలబెట్టినారు. ఇక మిగిలింది పై బండ మూయడమే.

    ఒక్కసారి దండనాయకులు ఉత్తరంవైపు చూసి శ్రీవేంకటేశ్వరునికి దండం పెట్టుకున్నారు. "స్వామీ! వేంకటేశ్వరా! మాతప్పు కాయి. నీ బిడ్డల్ని దయతో చూడు తండ్రీ!" అంటూ పై బండను మూసివేశారు.

    శోక సముద్రం పోటెత్తింది.

    అంతటా వేంకటేశ్వర నామస్మరణ. జయ జయ ధ్వానాలు.

    నేలపై పొర్లి పొర్లి ఏడుస్తున్న పేరంటాండ్రు. గుండెలు బాదుకుంటున్న కన్నె పిల్లలు. నెత్తి గొట్టుకుంటున్న ఇల్లాండ్రు. చెట్టూ, పుట్టా, గుట్టా అంతటా కన్నీళ్లే.

    రామప్పనాయకుడు రాయలవారి వేపు చూశాడు. ఆయన అక్కడ లేరు. ఆయన అశ్వం చంద్రగిరి వేపుకు దూసుకుపోతూంది.

    "చంద్రప్పా! బయలుదేరు...రాయలవారు..." గుర్రాన్ని అదిలిస్తూ అన్నాడు రామప్ప.

    రామక్రిష్ణయ్య నిర్వీణ్ణులై కట్టమీదే కూలబడ్డారు.

* * *

    నేను ఏడుస్తున్నాను.

    "ఒరేయ్ సినబ్బా! నిద్రలో ఏడుపేందిరా... లే లే. తెల్లారిపోయింది." 

    కళ్లు తెరిచాను. ఎదురుగా నానమ్మ.

    "నానమ్మా! నేను కలగనింది నువ్వు చెప్తానన్న కథనేనా?"

    "కలలో రాయలోరి కాలంలోకి ఎల్లొచ్చావా? ఎర్రి నాగన్నా!

    అట్టాటోళ్లు ఇప్పుడెవ్వరుండారబ్బోడా. పది మంది కోసం ప్యాణాలు పోగొట్టుకునే ఎర్రి జనం యిప్పుడు లేరు బిడ్డా! అదంటే కల్లాకపడం తెలియని కాలం. అప్పుడు గూడా ఆదెక్కమాదిర్తో కొందరుణ్ణారుగద తండ్రీ. గుడిసేటి ముండ" అంటూ మెటికలు విరిచింది నానమ్మ.

    "ఆదెక్క ఆ మాటలనకుండా వుంటే ఎంత బావుణ్ణోగద నానమ్మా. ఎంచక్కా మీ ఆడోళ్లు రాయలమ్మ నగలేసుకుని..."

    "సాల్లే సంబడం. లేచి మొకం కడుక్కో. మీ నాయనకు కాపీ తీసుకుపోవాల. గుట్ట కింద మడికాడికి పొయ్‌నాడు. ఎల్లి శానా సేపయింది. ఆలీసమయితే వోడికి వొళ్లు మండతాది" పడక తీసుకుని ఇంట్లోకి పోతా అనింది నానమ్మ.

    "పోతావుండానే ముసలీ! నాకు నీ పోరు ఎక్కువయిందే. రాయలకాలం సంతోషమంతా తుస్సుమని పోయెనే..."

    తువ్వాలు తీసుకుని పెరట్లోకి బయలదేరాను ముకం కడుక్కోవడానికి.

    ఇంతలో "ఓసేయ్! వుండండే వత్తావుండా" అంటూ నానమ్మ మజ్జిగ కడవ తెచ్చి వరండాలో పెట్టింది.

    "ఓసేయ్ సినక్కా! అందర్నీ వరసగా రమ్మను. వట్టి సెంబుతో ఎవురూ పోవొద్దు. కావాల్సినంత సల్ల(మజ్జిగ) పోస్తా. బయపడమాకండి" అంటూంది నానమ్మ.

    వేడుక చూద్దామని ఆగాను.

    తెల్లార్తే యీ వూరి జనానికి నానమ్మ 'సల్ల' పందేరమేమిటి? అర్థంగాక అడిగా "ఇదేందే ముసిలీ! 'సల్ల' దానం. పుణ్ణెం కొట్టేద్దామనే..." అన్నాను.

    "నువ్వు పోరా ఎదవా! గిన్నెడు మజ్జిగ పోత్తే పుణ్ణెం వత్తాదా? అది నీ బెమరా. సేత్తే రాయలమ్మలా తేగం సెయ్యాల. యిదేంది అరకాసు. దీనికే పుణ్ణెం ముల్లె వత్తాదా? ముందు సెప్పిన పని సెయ్ పో..." అన్నది.

    ఇక తప్పేదేముంది. తిరిగి చూస్తూ...తిరిగి చూస్తూ 'రాయలమ్మ త్యాగం' నానమ్మలో కదలిక తెచ్చినట్టుంది.

    "అందరి నానమ్మలూ యిలాగే ఐతే..." పెరట్లో అడుగు పెట్టాను.

(సాహితీ స్రవంతి - సాహిత్య పత్రిక అక్టోబర్-డిసెంబర్ 2010 సంచికలో ప్రచురితం) 

Comments