రెండడుగుల నేల - పూడూరి రాజిరెడ్డి

  

     2013.

    యుగాంతం అబద్ధమని తేలిపోయాక-

    ఒక శుక్రవారం నాడు...

 

    ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు ఆనందరావు.


    మామూలు చికాగ్గా లేడతను.


    దించివున్న లుంగీని ఎత్తికట్టాడు. మళ్లీ ఎత్తికట్టిన లుంగీని కిందికి దించాడు. అసహనంగా హాల్లోంచి కిచెన్లోకీ, అంతకంటే అసహనంగా అక్కడినుంచి బెడ్రూమ్ లోకీ వచ్చాడు.


    రెండు నిమిషాలు కళ్లు మూసుకుని, సర్వం మరచిపోయి నిద్ర పోదామనుకున్నాడుగానీ సాధ్యం కాలేదు.

 


    ఆ యోగామాస్టర్ చెప్పిన వాటర్ థెరపీని కనీసం ఇవ్వాళైనా పాటించకుండా ఉండాల్సింది! నిద్రలేవగానే, ముఖమైనా కడగకుండా గడగడా తాగిన రెండు గ్లాసుల నీళ్లు వాటిపని అవి చేస్తున్నాయి. ఎక్కడినుంచో ఒత్తిడి.


    దాన్ని మరిచిపోవడానికి మంచంలోంచి లేచి, అద్దం దగ్గరికి వెళ్లాడు.


    ముఖం మామూలుకంటే ఉబ్బివున్నట్టుగా అనిపించింది... ఏదో ఒక పెద్ద భారాన్ని మోస్తున్నట్టుగా, దానికి ఎప్పటికీ పరిష్కారం లేనట్టుగా.

ఏ లోయల్లోంచో జీవుడి అరుపులు వినిపిస్తున్నాయి.

 

    కళ్లు మూసుకుని, కాళ్లు దగ్గరగా పెట్టుకుని, తన ధ్యానశక్తినంతా కూడదీసుకుని, కడుపులో పేలుతున్న అగ్నిపర్వతాన్ని కేసేపు నిద్రపుచ్చగలిగాడు.

కాని ఎంతసేపని అలా?


    పక్క కాలనీలో ఉన్న రమణకు ఫోన్ చేద్దామనుకున్నాడు. కాంటాక్ట్స్ లిస్ట్ లోంచి రమ...లో వెతుకుతుంటే, తను చేస్తున్నది తనకే సిల్లీగా అనిపించింది.

ఫోన్ చేసి ఏమనడగుతాడు?


    రమణ తన ఫ్రెండే కావొచ్చు, ఇద్దరికీ పెళ్లి కాకముందు, "8.16."తో సహా ఏ విషయమైనా వాళ్లు పంచుకుని ఉండొచ్చు, అంతమాత్రాన...

 

    మరేం చేయాలి?


    అటూ ఇటూ అదీ ఇదీ... కాస్త ఊగిసలాడాడు.


    అంత "సులభం" కాదు. పైగా ప్రైవేటు విషయాలను పబ్లిక్-గా డిస్కస్ చేసినట్టుగా ఉంటుంది.


    మరెలా?


    ఠక్కున ఆలోచన తట్టింది.

 

    ఇక లాభం లేదు. వాష్ బేసిన్లో ముఖం మీద కాసిన్ని నీళ్లు చల్లుకున్నాడు. నీళ్లు పుక్కిలించి ఉంచాడు. చకచకా ప్యాంటూ, చొక్కా తొడుక్కున్నాడు. సెల్ ఫోన్, డబ్బులు, కర్చీఫ్ అన్నీ ఉన్నాయని చెక్ చేసుకుంటూనే ఇంటికి తాళం వేసి, బండి తీసుకొని, బయటకు వచ్చాడు. ఆఫీసుకు చేరుకోవడానికి ఎంత లేదన్నా ఇరవై ఏడు నిమిషాలు.


    మామూలుగా నలభై మీద కూడా వెళ్లని ఆనందరావు అరవై మీద పోనిచ్చాడు.

 

    వెళ్తూనే తర్వాత గేటు దగ్గర జరగబోయేదానికి రిహార్సల్స్ వేసుకున్నాడు.

 

    "క్యా సాబ్, ఇంత తొందరగా వచ్చినారేంది?" తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న సెక్యూరిటీ ఆఫీసర్ పాండే అడుగుతాడు.


    "అవునవును... కాస్త అర్జెంట్ పనుండీ" ఎడమచేత్తో ఐడెంటిటీ కార్డు మెడలో వేసుకుంటూనే లోపలికి వెళ్తాడు.


    "సార్... ఆప్ కే లియే ఏక్ లెటర్ హై" అని పాండే అంటుంటాడు.


    తను ఆగకుండా, "తర్వాత చూస్తాన్లే" అంటూ బండిని ముందుకుపోనిచ్చి ఒక పక్కగా పార్కు చేయబోతాడు.


    "సాబ్... ఇప్పుడు ఛైర్మన్ గారు వస్తారని మెసేజ్ వచ్చింది, కింద పెట్టండి బండి" వెనకనుంచి పాండే బిగ్గరగా అంటుంటాడు.


    "మళ్లీ వచ్చి పెడతాన్లే" విసుక్కుంటండగానే, ఒక గార్డు పరుగెత్తుకొచ్చి, మర్యాదగా కిందికి పొమ్మంటాడు.


    ఆఫీసర్ ఇచ్చిన గౌరవం కూడా గార్డులు ఇవ్వరు. సన్నాసులు.


    ముద్దపప్పుల్లా నిలబడటం తప్ప గార్డులకేం తెలుసు?


    పాండేకు తెలుసు, తనకోసం రోజూ ఎంతమంది ఆఫీసుకు వస్తుంటారో.

 

    బైక్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కు చేసి, సెవన్త్ ఫ్లోర్-కు వెళ్లడానికి లిఫ్టు దగ్గర నిలబడతాడు.


    నిజానికి ఫోర్త్ కెళ్లినా సరిపోతుంది. కాని అదేమిటో అలవాటైనచోటే సుఖంగా ఉంటుంది.


    ఖాళీగా ఉన్నప్పుడు మెదడు తొందరపెడుతుంది. అందుకో మళ్లోసారి ధ్యానశక్తినంతా కూడదీసుకుంటాడు.


    యుగాల్లాంటి సెకన్లు జరిగి... కాంతిసంవత్సరాల్లాంటి అంతస్తులు దాటి...


    లిఫ్టు రావడం, చకచకా అందులో దూరడం, అటుపైన అందులోంచి బయటకు వచ్చి, తనకు కావాల్సిందాన్లో దూరడం...


    అబ్బా!


    దూరడం...


    ఎంత హాయిగా ఉంది!

 

    బైక్ నడుపుతున్న ఆనందరావు రిలాక్స్ ఫీలయ్యాడు. నిజంగానే అది జరిగిపోయిన అనుభూతి కలిగింది. అసందర్భమే అయినా కృష్ణప్రేమ గుర్తొచ్చింది.


    ఆ ఊహ తన సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన మరింత సహనాన్ని, మరి కాస్త సమయాన్ని ఇవ్వడానికి కారణమైంది.


    అసలు మొన్నే ఓనర్కు చెప్పాడుగానీ ఇంకాస్త గట్టిగా చెప్పాల్సిందనిపించింది.


    "వాటర్ అంత ఫ్రీగా వెళ్లట్లదేండీ" అన్నాడుగానీ, తనుకూడా ఇంత సీరియస్ అనుకోలేదు.


    అయినా, తను సీరియస్-గా చెప్పినా, ఇంకెలా చెప్పినా ఇంటియజమానిగా దాన్ని పరిష్కరించడం ఆయన బాధ్యత కాదా?


    "ఫోన్ చేశానండీ, ఎప్పుడూ వచ్చేవాళ్లే... రాలేదు" అన్నాడు.


    సమస్యకు స్పందించానని రుజువు చేసుకుంటూ చాలు. పనికాకపోయినా పట్టింపు లేదు.


    మీకేం పోయిందీ! మీరు పైన ఉంటారు, కిందుండే నాకొచ్చింది చావు.


    అందుకే ఆనందరావు భార్య ఎప్పుడూ వాళ్లను శాపనార్థాలను పెడుతూ ఉంటుంది. ఏదీ పట్టించుకోరనీ, కనీసం నవ్వుతూ పలకరించరనీ, తాము ఓనర్స్ అన్న ఫీలింగు బాగా చూపిస్తారనీ, ఇంకా ఏదేదో...

 

    అక్కడ్నుంచి ఇల్లు మారదామనుకుంటాడుగానీ... ఆలోచిస్తే కాలనీ ఎంతోకొంత నీటుగా ఉంటుంది. అద్దె కూడా ఫర్వాలేదు. తనకు తెలిసిన చాలామందికి ఈ మాత్రం స్పేసియస్-గా కూడా లేదు.


    కాని ఎంత స్పేసియస్గా ఉంటే మాత్రం ఏం? ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అయితే చూపించలేదు.


    ఎందుకైనా మంచిది... దసరాకు పుట్టింటికి వెళ్లిన భార్యనూ, కూతురినీ ఇప్పట్లో రావొద్దని చెప్పాలి. ఇవ్వాళో రేపో వస్తానంటోంది. వీలైతే అమ్మవాళ్ల దగ్గరికి వెళ్లి ఓ వారం రోజులుండమనాలి.


    కచ్చితంగా "ఎందుకూ?" "ఎందుకూ?" అని గుచ్చి గుచ్చి అడుగుతుంది.


    ఏదో చెప్పాడు, కచ్చితంగా ఏదో విషయం ఉండేవుంటుందీ అని అనుకుంటే పోతుందిగా... వినదు... అన్నీ కావాలి.


    ఎప్పటికి మారుతుందీమె!


    నిజంగానే విసుక్కున్నాడు.


    స్వయిన్ ఫ్లూ లాంటిదేదో కొత్తది వస్తోందట, అని అబద్ధం చెప్పాలి. తన కోసం కాకపోయినా "తన్మయి" కోసమైనా తను భయపడుతుంది.


    ఎంత ప్రేమ! పిచ్చిది. కాకపోతే కొంత పల్లెటూరి అమాయకత్వం.


    భార్య మీద ప్రేమ ఉప్పొంగింది ఆనందరావుకు.


    తనైతే ఇరవై కిలోమీటర్లయినా సరే ఏ ఊరిబయటకో వెళ్లగలడు. లేదంటే ఆఫీసైనా ఉంది. తన భార్య పరిస్థితి?


    ఆ ఊహే అతడికి ఛండాలంగా, బాధగా, విరక్తిగా అనిపించింది.


    ఈ ఆడవాళ్లకైనా ఇలాంటి బాధలు పెట్టకపోతేనేం దేవుడు, అనుకున్నాడు.


    ఛా... దేవుడి సృష్టిలో ఈ ఒక్కలోపం లేకుండా ఉండాల్సింది!


    చాలామందితో ఇంతకుముందు ఈ విషయం గురించి వాదించాడు.


    మనిషి అనేవాడు ఒక ఇంజిన్... ఒక వ్యవస్థంటూ నడుస్తున్నాక దానికి శక్తి కావాలి... దానికి అవసరమయ్యే ఎనర్జీ అట, ఇన్ టేక్ అట, అవుట్ గోయింగ్ అట... ఏదేదో చెబుతారు. అరే, మాట వరసకు మనం ఇంజిన్ అనుకోవడమేగానీ నిజంగా మనిషి ఇంజిన్ కాదు. దేవుడు ఎలాగైనా చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు ఇలా చేసివుండాల్సింది కాదు. వేస్ట్ అట వేస్ట్... ఈ సున్నితమైన విషయం అర్థంకానివాళ్లతో వాదించడం శుద్ధ వేస్ట్.


    కనీసం ఇన్ టేక్ మొత్తం ద్రవాల రూపంలో పెడితేనైనా దేవుడు కాస్త తెలివైన పని చేసినట్టుండేది. అప్పుడు ఇంత అగ్లీగా ఉండేది కాదు. ఇన్ సెన్సిబుల్ గాడ్.


    పోనీ... ఇక ఇలాగే చేయడం తప్పలేదనుకుందాం. ఇంకొక ఆప్షన్ అయినా ఇచ్చివుండాల్సింది. మనిషనేవాడు అన్ని పనులూ ప్రతిరోజూ చేయడం కంటే, తమ వీలును బట్టి, ఒక్కోపని కొన్నాళ్లు చేసుకుంటూ పోతే ఎలా ఉంటుందీ?


    ఒక నాలుగేళ్లపాటు నిరంతరాయంగా తింటూనే ఉండాలి. ఓ రెండేళ్లపాటు స్నానం చేస్తూనే ఉండాలి. ఒక నెలరోజులపాటు ముక్కు చీదుతూనే ఉండాలి.

ఒక ఏడాది మొత్తం అదేపనిలో ఉంటే ఎలా ఉంటుందీ?


    ఊరిలో ఉన్న ఆ పాడుబడిని బావి నిండినట్టుగా అనిపించింది... యాక్!


    సగటు మనిషికి ఏడాదైతే, నీకు కచ్చితంగా రెండేళ్లు కావాలని తన భార్య తనను వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది.


    "అందులోంచి బయటకే రావు" అంటుంది.


    బయటికి రాకపోవడం కాదు, ఇప్పుడు లోపలికి పోయేట్టు లేదు కదా!


    ఆ నాలుగు మూలల చిన్న గది ఇంత విలువైందా?


    ఆ గదియేనా? ఆ గదినుంచి మొదలై ఆ తర్వాత తనకు తెలియకుండా జరిగే ప్రాసెస్ విలువైందా?


    తనదేం పోయింది. నీళ్లు కొట్టి వచ్చేస్తాడు.


    నీళ్లు పోస్తేనే సరిపోయిందా?

 

    ఆలోచించుకుంటూ ఆఫీసుకు చేరుకునేసరికి, అక్కడ కాస్త గందరగోళంగా ఉంది.


    ఎన్నడూ లేనిది ఎనిమిదింటికే ఇంత మందేమిటి?


    సాధారణంగా తను పదింటికి వస్తాడు. మిగతా సాధారణ జనం పదిన్నరకిగానీ రారు.


    లోని గందరగోళానికి తోడు బయటి గందరగోళం.


    మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఆఫీసది. బైక్ రోడ్డు పక్కన ఆపేసి గేటు దగ్గరికి వెళ్లాడు.


    పాండే విచిత్రంగా నవ్వాడు. అందులో ఏదైనా వెటకారం ఉందా?


    తనకు సంబంధించిన ఏదో చీకటి రహస్యం అతడికి తెలిసిపోయినట్టుగా ఉందా నవ్వు.


    "మార్నింగ్ పాండే" అనుకుంటూనే లోపలికి పోబోయాడు.


    "సా...బ్... లోపలికి పోవడానికి వీల్లేదు" నెమ్మదిగానే చెప్పాడు.


    "ఏం?"


    "అందరూ మీలాగే వచ్చారు. వాళ్ల ఇళ్లల్లో కూడా ఇదే ప్రాబ్లమట"


    ఎందుకు వచ్చాడో ఊహించడం ఒక ఘోరమైతే, లోపలికి వెళ్లనివ్వకపోవడం అంతకన్నా ఘోరం. తాను కాబట్టి కాస్త మర్యాదగా చెప్పినట్టున్నాడు, చాలామందిని తోసినంత పనిచేస్తున్నారు.


    "పోనిస్తే ఏమైంది?" ఇంత బేలతనం తన జన్మలో ఎక్కడా ఎవరిదగ్గరా చూపించలేదు.


    "ఆఫీసులోనూ ఇదే ప్రాబ్లమ్ నిన్నటినుంచి..."


    "మరి నీ సంగతేమిటి?" అని నోటిదాకా వచ్చి మానేశాడు.


    భోంచేశావా? అని అడగటం మర్యాదగానీ... ఇదెలా అడగటం?


    అప్పటిదాకా ఇక నిశ్చింత... అనుకున్నది, ఇప్పట్లో తేలేట్టు లేదూ అనుకునేసరికి... పొట్ట తిట్టిపోస్తోంది.


    మూడేళ్ల వయసులో ఓకేగానీ మరీ ముప్ఫై ఏళ్ల వయసులో ప్యాంటు పాడుచేసుకోవడం... ఓరి దేవుడా!


    ఎలా? ఎలా? ఎలా?

 

    ధ్యానమంత్రం ప్రయోగించాడు. లాభం లేదు.


    లైంగికోద్దీపన తంత్రం ప్రయోగించాడు. సరళనూ సబితనూ మార్చి మార్చి రమించాడు.


    ఎస్, మెదడును తప్పుదారి పట్టించగలిగాడు.


    కాస్త తెరిపినిచ్చింది.

 

    కాని ఏంటిదంతా?


    ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా ఉంది.


    క్లీన్ చేసేవాళ్లు, క్లియర్ చేసేవాళ్లు, మ్యాన్ హోల్స్ లో పనిచేసేవాళ్లు, వాహనాల్లో మోసుకుపోయేవాళ్లు... అందరూ కూడబలుక్కుని మానేసినట్టుగా ఉన్నారు.


    ఇప్పుడేం చేయాలి?


    రాజేంద్రనగర్ వైపు వెళ్లడం బెటరేమో! అటేమైనా పొలాలు ఉండింటాయా?


    సిగరెట్ కాల్చాలనిపించినా, మానుకున్నాడు. అది మరీ డేంజర్.


    ఆలోచిస్తూనే బైక్ స్టార్ట్ చేశాడు.

 

    వెళ్తూ రోడ్డు మీద కనబడ్డ ప్రతి ఒక్కరినీ గమనిస్తున్నాడు. వాళ్లందరి ముఖాలూ ఉబ్బిపోయినట్టూ, అందరూ భారంగా నడుస్తున్నట్టూ, దేన్నో ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్టూ అనిపిస్తోంది.


    పచ్చకామెర్లవాడి సామెత గుర్తొచ్చింది. ఏడుపు నవ్వుకున్నాడు.


    పోతుంటే ఓ బ్యానర్ కనబడింది. అదేమిటో చదివేలోగానే బైక్ దాటి వచ్చేసింది.


    అంతలో ఇంకో బ్యానర్. అరె, ఇక్కడో బ్యానర్... అరె, మళ్లీ బ్యానర్... ఊరంతా బ్యానర్లే...


    అరె, ఇక్కడ పోస్టర్లు కూడా ఉన్నాయి. రోడ్డు మీద కొట్టుకుపోతూ, బస్టాండుల్లో అంటించి, గోడలకు ఊగులాడుతూ... బ్యానర్లు, పోస్టర్లు...


    "మమ్మల్ని మీతో సమానంగా గౌరవించాలి"


    "మాకు నెలకు లక్ష రూపాయల జీతం ఇవ్వాలి"


    "ఈ డిమాండు తక్షణమే అమలు కావాలి"


    "లేకపోతే అన్నిపనులూ అంతటా ఆపేస్తాం"


    "పారిశుద్ధ్య కార్మికులారా, ఏకం కండి"


    రకరకాల అక్షరాల్లో, రకరకాల సైజుల్లో, రకరకాల వాక్యనిర్మాణాల్లో ఉన్న వందల వేల బ్యానర్లు, పోస్టర్లలో ఉన్న సారాంశం ఇదీ.


    ఏంటీ, నేనేమైనా ఓ నెల రెండునెళ్ల పాటు దీర్ఘనిద్రలో ఉండిగానీ లేచానా?


    చుట్టూ ఇంత జరుగుతున్నా నాకు తెలియలేదేమిటి?


    లేకపోతే ఇంత షార్ట్ టైమ్-లో ఇంత కదలిక ఎలా వచ్చింది?


    అయినా ఇళ్లల్లో, ఆఫీసుల్లో అన్నీ ఒకసారే నిండిపోవడం ఏమిటి?


    లేకపోతే కాల్పనిక ప్రపంచంలో ఏమైనా ఉన్నానా?


    ప్రతిదానికీ హడావుడి చేసే న్యూస్ ఛానళ్లు కనీసం చెప్పినట్టు లేదే!


    అవి దీన్ని ఓ సమస్యగా గుర్తించివుండవు. ఒకవేళ గుర్తించినా దీని గురించి ఏం మాట్లాడుతాయి? అయినా రిపోర్టర్లకు కూడా ఈ సమస్య ఉంటుందిగా! బహుశా వాళ్లు కూడా పల్లెటూళ్లనుంచే ఆపరేట్ చేస్తూ ఉండాలి.


    ఆమధ్యెప్పుడో చదివాడు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండి అప్ లోడ్ చేయొచ్చట. తనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్టం లేక పట్టించుకోలేదు. అయినా అక్కడే ఉంటే సిటీలో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి? వెళ్తూ వస్తూ ఉండాలి కావొచ్చు...


    ఛీయ్... ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు?

 

    నిజంగానే ఏదో జరుగుతోంది. తాను ఏదో కాల్పనిక జగత్తులోనే ఉన్నాడు. లేకపోతే... అటు చూడు... పత్రికల్లో తాటికాయంత హెడ్డింగులు కనబడుతున్నాయి. "ఇది సముచితమే", "ఇది అహేతుకం"...


    ఒక్కసారిగా లక్ష రూపాయలు ఇవ్వడం అన్యాయంగా కనిపిస్తోందేమో!


    కానీ, ఇలాంటి పనికి సిద్ధపడేవాళ్లకు ఆ మాత్రం ఇవ్వడం, ఇంకామాటకొస్తే ఎక్కువే ఇవ్వొచ్చేమో!


    నేను చూడు, ఆఫీసుకు వెళ్తాను, వస్తాను. మరి ఆ పనిలో ఉన్న కష్టం, అసహ్యం, జుగుప్స గుర్తించానా?


    కోటి ఇస్తే మాత్రం నేను చేస్తానా ఆ పని?


    వెళ్తుంటే ఏదో ఊరేగింపు వస్తోంది. వాళ్లే!


    అవే బ్యానర్లు. నెలకు లక్ష జీతం. సమానమైన గౌరం...


    వాళ్లకు మద్దతుగా 'ప్రకృతి' స్వచ్ఛంద సంస్థ.


    అరే... ఎక్కడున్నారు వీళ్లంతా ఇన్ని రోజులు?


    వాళ్లు ప్రతిరోజూ ఉన్నారు. నీకే కనబడలేదు.


    నాకేం కనపడుతుంది?


    మహా అయితే బ్యాక్ హుక్ బ్లౌజులు కనబడుతాయి, ముడి వేసీ వేయని వీపులు కనబడతాయి, ఏదో ప్రాచీన సహజాత కుతూహలం తట్టి లేపడానికి.


    "మీరు చాలా మంచివాడిలా కనబడతారు, మీరిలా ఆలోచిస్తారా?"


    "ఒక్కోసారి నన్ను నేనే ఇష్టపడనంత భయంకరమైన ఆలోచనలు వస్తాయమ్మా, అవన్నీ చెబితే..."


    "మనసులోకి రజోగుణపు ఆలోచనలు రానీయకూడదు"


    మీరెక్కడినుంచి వచ్చారు యోగామాస్టారు? నేను రమ్మంటే వచ్చిందా, పొమ్మంటే పోతుందా?


    అది వచ్చినప్పుడే వస్తుంది.


    అవును, అది వచ్చినప్పుడే వస్తుంది.


    చూడు, రోడ్డు మీద అప్సరసలు కూడా మామూలు మనుషుల్లాగే, ఆఫీసర్లు కూడా అదొక్కటే అర్జంట్ అన్నట్టుగానే...


    ఇన్ని తలకాయలు, ఇన్ని ముక్కులు, ఇన్ని చెంపలు, ఇన్ని గొంతులు... ఎన్ని చేసినా మళ్లీ రెండుడుగుల నేల కోసమే. వచ్చినప్పుడు పోవడం అంత లగ్జరీ ఈ భూప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇంత సింపుల్ విషయం ఎవరికీ ఎందుకు అర్థం కావట్లేదు?


    విలువ రహితంగా కనబడుతూనే అర్థవంతమైన పని, జీవితంలాగే.


    విలువ ఉన్నట్టు కనబడుతూనే అర్థం లేనిపని, మళ్లీ జీవితంలాగే.

 

    అందుకే తనకు ఎప్పుడూ ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, ఈ పట్నంలో, ఈ ఉద్యోగంలో, ఈ నాలుగు మూలల గదిలో.


    ఇక్కడ అన్నీ సమస్యలే. దానికోసం వెతికే పరిష్కారం, అది పరిష్కారంతోపాటు ఇంకొన్ని సమస్యలను వెంటబెట్టుకొని వస్తుంది. దానికి మళ్లీ పరిష్కారాలు అంటే మరిన్ని అదనపు సమస్యలు...


    ఏదో గుంపులో గోవిందంలా వచ్చిపడ్డాడు.


    ఆలోచనకూ ఆచరణకూ ఎప్పుడు లంకె కుదిరిందని! చేయికీ నోటికీ మధ్య లంకె కుదరనట్టుగానే.


    "టీ" అంటుంది తను.


    "వద్దొద్దు..." అని నోరు అంటుండగానే, చేయి తీసేసుకుంటుంది. నోరును కిందికి దించి కంటితో చూస్తే చేతిలో టీ గ్లాసు.


    వద్దొద్దు...


    అందరూ తనలాగే ఇటువైపే బైకులు వేసుకెళ్లడం మొదలుపెడితే...


    వద్దొద్దు... అని అక్కడివాళ్లు అందరూ కర్రలు తీసుకుని నిలబడితే...


    తనకు ఎప్పుడూ వర్జినిటీ ఉండదు. అన్నింటినీ అన్ని రకాలుగా ఆలోచిస్తాడు.


    రేపెప్పుడో అనుభవంలోకి వచ్చేదాన్ని కూడా ఇప్పుడే ఊహల్లో అనుభవించేస్తాడు. తీరా అది అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవంలో ఏమాత్రమూ ఆనందాన్ని పొందలేడు.


    ఇంటర్వ్యూకి వెళ్లబోతూ ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ముందే ఊహించుకుంటాడు. ఫలానా వాళ్లింటికి వెళ్లబోతూ ఎలాంటి మర్యాదలు చేస్తారో ఒక ప్లాన్ వేసుకుంటాడు. "రా నాయనా, టిఫిన్ చేద్దువు" అంటుందావిడ. "వ..ద్దు.." అని మొహమాట పడతాడు. "మా ఇంట్లో తినొద్దని చెప్పిందా మీ అమ్మ?" అంటుంది. "అదేం లేదాంటీ..." అంటూనే వెళ్తాడు. ముగిస్తాడు. "చేయి ఎక్కడ కడుక్కోవాలి?"


    అవును, ఎక్కడ కడుక్కోవాలి?

 

    ఏమో ఈ మాడర్న్ సెటప్ ఇప్పటికీ తనకు అర్థం కాలేదు.


    అప్పుడెప్పుడో చదువుకోవడానికి మామయ్య వాళ్లింటికి సిటీకి వచ్చిన కొత్తలో-


    పల్లెటూరిలో ఆరుబయలు తప్ప నాలుగ్గోడలు తెలియదు.


    తనకు అందులోకి పోవడానికి ఏదోలా ఉండేది. మరీ డైనింగ్ హాల్ పక్కనా?


    ఎప్పుడోసారి తన్నుకొని వచ్చినప్పుడు అందులోకి పోదామని అక్కడిదాకా వెళ్తాడుగానీ... ఏమో, ఇందులోకి ఏ ఉద్దేశంతో పోయానో వాళ్లకు తెలుస్తుందేమో అని సిగ్గుపడేవాడు. కాళ్లు కడుక్కోవడానికి వెళ్లినట్టుగా కాళ్లను తడుపుకొని బయటికి వచ్చేసేవాడు.


    ఎప్పుడో అందరూ ఏదో ఫంక్షన్ కని వెళ్లినరోజు...


    నిస్సిగ్గుగా అందులోకి అడుగుపెట్టాడు. అప్పటికి నాలుగు రోజులైందనుకుంటా... ఎండిపోయి... కష్టమైపోయి...


    "అలాంటి కష్టం ఎవరూ పడగూడదు. అందుకే నా మద్దతు వీళ్లకే..."

 

    ఆనందరావు ఏ సమస్య మీద రోడ్డుమీదకు వచ్చాడో దాదాపుగా మరిచిపోయాడు. ఆశ్చర్యానికి అన్నింటినీ అడ్డుకునే శక్తి ఉంది. ఊరేగింపును చూస్తూ కాసేపు నిలబడి, వాళ్లంతా తనను దాటి వెళ్లిపోయాక ముందుకు సాగాడు.


    ఎక్కడో చౌరస్తాలో టీవీ స్క్రీన్ పెట్టినట్టున్నారు.


    'కడుపులో కల్లోలం' శీర్షికన టీవీ నైన్టీన్ ఏదో షో చేస్తోంది. 'పీయింగ్ అవుట్ సైడ్ పిల్లాడి' లోగో బ్యాక్ గ్రౌండ్లో పెట్టారు. యాంకర్ ముఖం కూడా ఉబ్బివున్నట్టే కనిపించింది.


    ఎక్కడెక్కడినుంచో రిపోర్టర్లు హడావుడి చేస్తున్నారు.

 

    సరదాగా పట్టణాల్లో ఉంటున్నవాళ్లందరూ తమ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నట్టూ... ఉద్యోగులు తమ భార్యాపిల్లల్ని ఊళ్లకు పంపిస్తున్నట్టూ... అవీ పట్టణాలైతే అమ్మమ్మల ఊళ్లకు పొమ్మంటున్నట్టూ... అమ్మమ్మల ఊళ్లు లేనివాళ్లు కనీసం అమ్మమ్మ చెల్లెలో, అక్కో.... ఆ మాటకొస్తే ఎక్కడో కొత్త చుట్టరికం కలుపుకొని పల్లెటూళ్లకు పరుగులు పెడుతున్నట్టూ... కోచింగుల కోసం వచ్చినవాళ్లందరూ తమ తమ ఊళ్లకు బిస్తర్లు కడుతున్నట్టూ... ఉద్యోగులు సెలవులు పెడుతున్నట్టూ... సమస్య పరిష్కారమయ్యేదాకా కొన్ని సంస్థలు సెలవులు ప్రకటిస్తున్నట్టూ... ఎన్ని బస్సులు వేసినా చాలడం లేదన్నట్టూ... డబ్బున్నవాళ్లు కొందరు హుటాహుటిన విదేశాలకు వెళ్లిపోతున్నట్టూ... దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు ఏవీ తెరవలేదన్నట్టూ... పార్కులు, పబ్లిక్ ప్రదేశాలను సివిక్ సెన్సు లేనివాళ్లు ఖరాబు చేస్తున్నట్టూ... ఇలాంటి విపత్తు సమయంలో కూడా సివిక్ సెన్సు ఏమిటని కొందరు మండిపడుతున్నట్టూ... తినడానికి ఎటూ ఇవ్వరు, కనీసం పోవడానికైనా దారి చూపండి- అంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నట్టూ... సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా కడుపునొప్పితోనే బాధ పడుతున్నట్టూ... ఇది మన ఒక్క రాష్ట్రం సమస్యే కాదు, దేశమంతా ఇలాగే ఉంది కాబట్టి కేంద్రం స్పందించాలని ముఖ్యమంత్రి కోరబోతున్నట్టూ... అసలు పారిశుద్ధ్య కార్మికులు ఇలా సమ్మె చేయడం చట్ట విరుద్ధమని ఎవరో సుప్రీంకోర్టులో 'పిల్' దాఖలు చేసినట్టూ... తీర్పు వీలైనంత త్వరగా రావాలనీ, అది సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామనీ కేంద్ర న్యాయమంత్రి చెబుతున్నట్టూ... సానుకూలమంటే ఏమిటి? ఎవరివైపు వస్తే సానుకూలమని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నట్టూ... నేడు మొహాలీలో జరగాల్సిన ఇండియా-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ ను కొన్ని కారణాల వల్ల రద్దు చేసినట్టూ... తమ ఆటగాళ్లకు కనీసం ఆ సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆస్ట్రేలియా మేనేజర్ చిర్రుబుర్రులాడినట్టూ... సెన్సెక్స్ పదివేల దిశగా వెనక్కి పరుగులు తీస్తున్నట్టూ... అసలు దానికీ దీనికీ సంబంధమేంటని మదుపరులు పొట్టలు పట్టుకుంటున్నట్టూ... ఇన్ని వ్యవస్థలు ఒక్కసారిగా స్తంభించిపోతే దేశానికి జరిగే నష్టం గురించి ప్రముఖ ఆర్థికవేత్త ఆనందసేన్ విశ్లేషిస్తున్నట్టూ... నగరీకరణ విషయంలో మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, అని పార్లమెంటులో చర్చ జరిగితే బాగుంటుందని 'నిపుణులు' అభిప్రాయపడుతున్నట్టూ... మా కొత్త కంపెనీని ఫలానా ఊరిలో స్థాపిస్తాం, అని రాకేశ్ నంబానీ చెప్పినట్టూ... అందులో అర్థం లేదు, కంపెనీ పెట్టిన మరుక్షణం నుంచీ అది పట్టణం అవుతుందని ప్రజ్ఞా షెట్కార్ విమర్శించినట్టూ... ఎంతవారికైనా తప్పదు, అన్న హెడ్డింగుతో లోటా పట్టుకున్న సౌందర్యారాయ్ ఫొటోను 'మిడ్ నైట్' పత్రిక ప్రచురించినట్టూ... అది మార్ఫింగ్ ఇమేజనీ అసలు ఆమె ఇండియాలోనే లేరని ఆమె తరఫు న్యాయవాది ఎవరో బదులిస్తూ, మరీ అంత సుందరి ఇంత సిల్లీ పని ఎలా చేస్తుందో ఆలోచించాలని అతడు ఆ పత్రిక నుంచి పరువునష్టాన్ని డిమాండ్ చేస్తున్నట్టూ... అసలు ఇలాంటి వార్తలు అవి ఎవరికి సంబంధించినవైనా సభ్యతగా చూపించాలని మీడియాకు కేంద్ర ప్రసార మంత్రి సూచించినట్టూ... దేశం ఎప్పుడూ కనీసం ఊహించని, ఎప్పుడూ ఎదుర్కోని విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి, ప్రజలు సహనంతో వ్యవహరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేసినట్టూ...

 

    అసలు తాను ఎక్కడున్నాడో, అలా ఎంతసేపున్నాడో ఆనందరావుకు గుర్తేలేదు.


    అల్లకల్లోలం చేస్తుందనుకున్న కడుపు కంపం ఎలా సద్దుమణిగిందో తెలియదు. శరీరానికి అలాంటి శక్తి ఏదో ఉన్నట్టుంది. ఇక సొల్యూషన్ లేదు అనుకున్నప్పుడు, వేధించదనుకుంటా.


    సొల్యూషన్!


    ఇప్పటికి ఓకే. కాని సాయంత్రానికి? రేపటికి? ఎల్లుండికి? వచ్చే నెల మూడో తారీఖున?


    తనకు తెలుసు. "ఈమాత్రానికే ఊరెళ్లిపోతావా?" అంటాడు నర్సింగ్.


    "ఆలోచించు, ఇలాంటి ఉద్యోగం మళ్లీ దొరకదు" అంటాడు మధు.


    ఈ ఉద్యోగం చేయకపోతే నేనేమీ చచ్చిపోను. ఇవి లేకపోతే మనిషి చచ్చిపోతాడు అనేంత ఇంపార్టెంట్ అయినవి తప్ప, మిగతావన్నీ ఆగిపోయినా జనానికి నష్టమేమీ లేదు.


    కనీసం నాకు లేదు.


    నాన్నకు వెంటనే ఫోన్ చేయాలి.


    నాన్నా, ఇక ఈ ఉద్యోగం చేయలేను, ఇక్కడ ఉండలేను. నువ్వేమన్నా సరే... దాని మొహం, అదేమంటుంది... ఇద్దరిని పోషించుకోలేనా...


    ఇంకంతే. ఆగేది లేదు.

 

    అర్జెంటుగా, ఉన్నదున్నట్టుగా జూబ్లీ బస్టాండ్ వెళ్తాడు. బైకును పెయిడ్ పార్కింగులో పెడతాడు. చచ్చీ చెడి ఒక బస్సు దొరికిచ్చుకుంటాడు. అదృష్టం కొద్దీ సీటు కూడా దొరుకుతుంది.


    బస్సులో వెళ్తుంటే ఒకరిద్దరు మాట్లాడుకుంటుంటారు. అదేమీ తనకు అనూహ్యంగానో, అప్రధానంగానో అనిపించదు.


    "ఐదారు సాఫ్ట్ వేర్ సంబంధాలు చూస్తే కాదన్నారు, ఎవరైనా పాకీవాళ్లుంటే చెప్పండి"


    ఆ విషయంతో తనకు సంబంధం లేకపోయినా, ఎవరైనా తెలుసా అని ఒక్క క్షణం ఆలోచిస్తాడు.


    చాలా రంగాల్లో చాలామంది గౌరవనీయులుగా కనబడటానికి కారణం... వాళ్లు చేసే పని కాదు. వాళ్లకొచ్చే డబ్బు.


    ఇక ఈ సాఫ్ట్ వేర్ అనే ఏమిటి? ఏ రంగంలో ఉన్నవాళ్లయినా ఈ రంగంలోకి రావాల్సిందే. కాకపోతే కొంచెం స్టైలిష్ ట్యాగు తగిలించుకుంటారు. శానిటీ ఇంజినీర్!


    మనుషుల మధ్య ఎల్లలు కరిగిపోతున్నట్టుగా, సమాజం ఒక అనూహ్య సమతాస్థితికి చేరుకోబోతున్నట్టుగా అనిపించింది.


    తనకు తెలియకుండానే ఒక తృప్తి.


    చిరునవ్వుతో కళ్లు మూసుకుంటాడు. ఏవేవో జ్ఞాపకాలు ముసురుకుంటాయి, ఈగల్లాగా.


    ఈ కష్టాలు ఇక లేవు. కాలుష్యం లేకుండా, రసాయనాల రహితంగా... కిచెన్ కూ 'దానికీ' స్పష్టమైన దూరంలో...


    దూరం... అరే, అప్పుడే రెండొందల యాభై కిలోమీటర్లు ప్రయాణించానా!


    రెండు బస్సులు, ఒక ఆటో మారాక తన ఊరిలో దిగుతాడు. ఆ స్థానంలో ఒక్కడే ఉన్నట్టున్నాడు. రోడ్డు దిగి, నాలుగడుగులు వేశాక, ఒక చోట ఆగి, చేతులు ప్యాంటు మీదకు పోనిస్తాడు.


    కనుచూపుమేరా ఖాళీ జాగా తనను ఆహ్వానిస్తున్నట్టుగా.


    అబ్బా...


    ఎంత హాయిగా ఉంది! అత్యున్నత ఇహలోక సౌఖ్యం!

 

    జూబ్లీ వైపు బైక్ తిప్పి జాలీగా వెళ్తున్నాడు ఆనందరావు. ఎందుకో మిర్రర్-లో ముఖం చూసుకోవాలనిపించింది. కొత్త కళేదో ముఖం సంతరించుకుంది. ఆశ్చర్యంగా తన పక్కన వస్తున్నవాళ్లూ, ఎదురుగా కనబడుతున్నవాళ్లూ... అందరూ కాంతిమంతంగా కనపడుతున్నారు.


    ఎన్నడూ లేనిది అందరినీ ప్రేమించాలనిపిస్తోంది. అందరినీ క్షమించేయాలనిపిస్తోంది.


    అవునూ, ఇల్లు ఖాళీ చేయాలి కదా! ఉద్యోగం కూడా రిజైన్ చేయాలి కదా!


    తర్వాత వద్దాంలే, ఎటూ లీవులున్నాయి, అద్దె ఇచ్చి వారం కూడా కాలేదు.


    తీరిగ్గా వచ్చి, అందరినీ కలిసి, శాశ్వతంగా వెళ్లిపోవచ్చు. గుడ్ బై హైదరాబాద్!


    హా... కొందరిని, కొన్నింటిని మిస్సయ్యేమాట నిజమే.


    తప్పదు, మంచివాళ్లు మూర్ఖులు కాకూడదని ఏమీలేదు. ఈ మూర్ఖత్వాన్ని తను భరించలేడు.


    కిర్ ర్ ర్ ర్ మని జేబులో వైబ్రేషన్లో ఉన్న సెల్...


    బండి ఆపాడు.


    ఎన్నడూ లేనిది ఇంటి ఓనర్ నుంచి ఫోన్.


    కొంపదీసి బాగయిపోయింది, వెనక్కి రమ్మంటాడా ఏమిటి?


    మళ్లీ నా నిర్ణయాన్ని వెనక్కి తిప్పుతాడా ఏమిటి?


    ఏమిటి? ఏమిటి?


    జీవితంలో ఒకే ప్రశ్నకి రెండు పరస్పర విరుద్ధమైన సమాధానాలుండే సందర్భాలు కొన్ని ఉంటాయి. విచిత్రంగా అవి రెండూ కరెక్టే అయివుంటాయి.


    "హలో అంకుల్..."


(పాలపిట్ట ఉగాది ప్రత్యేక సంచిక 2011లో ప్రచురితం)

 

Comments