రెండో భార్య - సలీం

    
వచ్చిన క్షణం నుంచీ రిజ్వానా ఏడుస్తూనే ఉంది. ఏడ్చి ఏడ్చి పిల్ల సొమ్మసిల్లి పడిపోయేలా ఉంది. నిన్న ఉదయం పదింటికి రిజ్వానాని పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు గౌస్. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కొత్త అల్లుడు కదా అని మర్యాద చేయబోతే 'చాల్లెండి మీ మర్యాదలు... నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఈ పెళ్ళి చేసుకున్నందుకు' అంటూ మండిపడ్డాడు. విషయం అర్థం కాక రిజ్వానా తల్లిదండ్రులు కాళ్ళావేళ్ళా బడి కారణమడిగినా చెప్పలేదు. 'నా నోటితో ఎందుకు చెప్పిస్తారు... అపవిత్రమైన మాటలు... మీ అమ్మాయినే అడగండి' అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. 

    నిన్నటి నుండీ పిల్ల కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు. కంటిమీద కునుకులేదు. పెళ్ళయి నాలుగు రోజులు కాకుండానే అల్లుడికి ఎందుకు కోపం వచ్చిందో అర్థంకాక ఓవైపు, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల దుఃఖ సముద్రంలా మారిపోయి అల్లాడిపోతుంటే తట్టుకోలేని తల్లి హృదయం మరోవైపు... మల్లగుల్లాలు పడ్తోంది ఖాతూన్. ఏంచేయాలో తోచక మథనపడిపోతోంది.

    "నా తల్లివి కదా... నాతో చెప్పమ్మా... జల్వా ఐనాక నువ్వు అల్లుడితోపాటు విజయవాడ వెళ్లావు. మరుసటిరఒజు వలీమా... అదేరోజు రాత్రి సుహాగ్ రాత్ జరిగింది. సుహాగ్ రాత్ జరిగిన మరుసటి ఉదయమే నిన్ను పిల్చుకొచ్చి వదిలేశాడంటే అక్కడే ఏదో జరక్కూడనిది జరిగుండాలి. ఏం జరిగిదో చెప్పు" అనునయిస్తూ అడిగింది ఖాతూన్.

    కన్నీటితో బరువెక్కిన కన్రెప్పల్ల్ని బలవంతంగా ఎత్తి అమ్మవైపు చూసింది రిజ్వానా. ఆమె వెక్కిళ్ళే సమాధానంగా యిచ్చింది.

    ఆ ప్రశ్న ఎలా అడగాలో తెలీక యిబ్బంది పడ్తూనే అడిగింది ఖాతూన్. "ఆ రాత్రి అంతా సవ్యంగా జరిగిందా? అతన్ని నువ్వేమీ సతాయించలేదుగా?"

    అంత దుఃఖంలోనూ స్త్రీ సహజమైన సిగ్గుతో తల వొంచుకునే మెల్లగా తల వూపింది.

    "అతను కోరినట్లే ఉన్నావా... అడిగినవన్నీ చేశావా" సగం పదాల్ని మింగుతూనే అడిగింది.

    "వూ"

    "మరి జమాయిబాబుకి ఎందుకొచ్చిందే? ఎందుకిలా నిన్ను వదిలేసి పోయాడు?"

    రిజ్వానా సమాధానం చెప్పకపోయేప్పటికి ఆమెకి కోపం వచ్చింది. "చెప్పవే ముదనష్టపు దానా... ఏం తప్పు చేశావే?" కూతుర్ని భుజాల దగ్గర పట్టుకుని వూపేస్తూ అడిగింది.

    "ఏ తప్పూ చేయలేదమ్మా" అని కౌగిలించుకుని పెద్దగా ఏడ్చింది.

    ఖాతూన్‌కి ఏం చేయాలో దిక్కు తోచకుండా ఉంది. సమస్య ఎక్కడుందో తెలిస్తేగా పరిష్కారం ఆలోచించడానికి? ఓ వేళ నిజంగానే తన కూతురు తప్పుచేసి ఉంటే జమాయిబాబు కాళ్ళు పట్టుకోడానికి కూడా తనూ తన భర్త తయారుగా ఉన్నారు. 

    "నువ్వేమైనా అనకూడని మాట అన్నావా?"

    "నోరెత్తలేదమ్మా... మా కసం"

    "నా బంగారు కొండవికదా... నువ్వు నిజం చెప్పకపోతే నీ సంసారం చక్కదిద్దేదెట్లా చెప్పు. యిప్పటికే మన బిరాదారీలో నానారకాలుగా చెప్పుకొంటున్నారు. చెప్పమ్మా ఏమైంది?" చుబుకం పట్టుకుని బతిమాల్తూ అడిగింది. 

    "నేను చెడిపోయిన దాన్నటమ్మా..." అంటూ అమ్మని మరోసారి చుట్టుకుని భోరుమని ఏడ్చింది.

    నెత్తిమీద పిడుగు పడ్డట్లు వణికిపోయింది ఖాతూన్. సుహాగ్ రాత్ సమయంలో జరగడానికవకాశమున్న చిన్నచిన్న విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుని, అల్లుడుగారికి అందుకోసం కోపం వచ్చి ఉండొచ్చనుకుంది తప్ప యింతటి దారుణమైన నింద మోపి కూతుర్ని వదిలేసి ఉంటాడన్న వూహే ఆమెకు రాలేదు. 

    "చెడిపోవటమేమిటే అర్థమయ్యేలా చెప్పు... అలా అనుకోడానికి ఆధారం ఉండాలిగా?"

    "కన్నెపిల్లకయితే మొదటి కలయికలో రక్తం వస్తుందట కదమ్మా... నాకు రాలేదట... అందుకు... నాకు పెళ్ళికి ముందే వేరొకరితో సంబంధం ఉందని నిలదీశాడు. అతనెవడో చెప్పమని రాత్రంతా హింసించాడమ్మా. నేనెలాంటి దాన్నో నీకు తెలుసు కదమ్మా... నేనెలాంటి తప్పూ చేయలేదమ్మా."

    ఖాతూన్ శిలా ప్రతిమలా మారిపోయింది. రిజ్వానా చెప్తున్నవేవీ ఆమెకర్థం కావటం లేదు. అర్థమయిందల్లా ఒక్కటే... తన కూతురు బతుకు బండలైపోయిందని...

    రిజ్వానా పదోతరగతి పాసైనా కాలేజీకి పంపటం యిష్టంలేక చదువు మాన్పించేసి యింట్లో తనకు సాయంగా ఉంచేసుకుంది. బైటి పనులేమైనా ఉన్నా కూతుర్ని పంపించేది కాదు. కొడుకుల్నో లేకపోతే తన భర్తనో పంపించేది. రిజ్వానా ఎప్పుడూ తన కళ్ళముందే తిరగాడింది తప్ప తన కళ్ళుగప్పి ఎప్పుడూ బైటికెళ్ళలేదు. అటువంటి తన కూతుర్ని... పద్దెనిమిదేళ్ళుగా కంటికి రెప్పలా కాపాడుకున్న తన కూతుర్ని చెడిపోయిందని అంటాడా? వాడి కళ్ళు పీకేయావద్దూ... వాడి గొంతు కాళ్ళకిందేసి తొక్కేయవద్దూ... యా అల్లా... అల్లుడైపోయెనే... ఏం జరిగినా నష్టం మాత్రం తన కూతురికేగా...

    విషయాన్ని మెల్లగా తన భర్త చెవిలో వూదింది. ముస్లిం పెద్దల్ని నలుగుర్ని తోడు తీసుకుని అతను విజయవాడ వెళ్ళాడు. ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా అల్లుడు రెచ్చిపోయాడు. సెకండ్ హ్యాండ్ సరుకుతో సమాధానపడటానికి తనేమీ చాతకానివాణ్ణి కాదన్నాడు. కన్నెపిల్లతో అనుభవం ఎలా ఉంటుందో తనకు కొత్తేమీ కాదన్నాడు. 

    "వయసులో పెద్దవాళ్ళముందు అలా మాట్లాడటానికి సిగ్గులేదా?" రాయబారానికి వెళ్ళిన నలుగురిలో ఒకతను ఉగ్రుడైనాడు.

    "మగాణ్ణి. నాకెందుకు సిగ్గు... ఎవడ్తోనో తిరిగిన అమ్మాయిని నాకు నిఖార్సయిన సరుకని నమ్మించి కట్టబెట్టినందుకు దాని తండ్రి సిగ్గుపడాలి. వకాల్తా పుచ్చుకుని వచ్చిన మీరు సిగ్గుపడాలి. నేను కన్నెపిల్లల్తో తిరగబట్టే కదా అది కులట అని తెల్సింది. మగాడు తిరక్క చెడ్తాడట. నేను తిరిగాను కాబట్టే చెడిపోలేదు" అన్నాడు గౌస్.

    "నిఖా చేసుకున్నావు. ఒకరోజు కాపురం కూడా చేశావు. యిపుడు దాని గతేం కావాలి?" రిజ్వానా తండ్రి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

    "నేను దాంతో కాపురం చెయ్యను. వదిలేశాను. ఏ తలమాసినోడికో యిచ్చి రెండో పెళ్ళి చేయండి. లేదా రెండో పెళ్ళివాడికిచ్చి చేయండి. గంతకు తగ్గ బొంత... సరిపోతుంది. నేనీ క్షణమే తలాక్ చెప్పేస్తాను" అన్నాడతను.

    రిజ్వానా తండ్రి అతని కాళ్ళు పట్టుకున్నాడు. "జల్ద్ బాజీ మత్ కరో బేటా... ఓ ఆడపిల్ల జీవితం... ఈ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. యిపుడు ఆవేశంలో కోపంలో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించండి. తొందరపడకండి"

    "యింకేం ప్రశాంతత. నీ కూతుర్ని నిఖా చేసుకున్నప్పుడే పోయింది" అన్నాడు కటువుగా.

    వెళ్ళిన పెద్దలు మొఖాలు వేలాడేసుకుని తిరిగొచ్చారు. సమయమే కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందన్న నమ్మకంతో మూడు నెలలు ఎదురుచూశారు రిజ్వానా తల్లిదండ్రులు. అక్కడినుంచి ఏరకమైన కబురూ రాలేదు. వీళ్ళు మధ్యమధ్యలో పంపించిన విన్నపాలు పెడచెవిన పడ్డాయి.

    రిజ్వానాని పెళ్ళయిన నాలుగో రోజే భర్త ఎందుకు వదిలేశాడో వూళ్లో అందరికీ తెల్సిపోయింది. ఎదురుగా ఉన్నప్పుడు 'అయ్యో పాపం' అన్ననోళ్ళే పక్కకెళ్ళి 'చెడిపోయిందాంతో ఏ మగాడైనా కాపురం ఎలా చేస్తాడు?' అంటూ ఎగతాళి చేస్తున్నారు. రిజ్వానా తండ్రి మసీదుకెళ్ళడం మానుకున్నాడు. నమాజుకి ముందు వూరి జనాలు మాట్లాడుకునే పిచ్చాపాటిలో ముఖ్యంగా తన కూతురి ప్రస్తావన రావటం అతనికి నచ్చక, శుక్రవారం రోజు యింట్లోనే నమాజ్ చదువుకుంటున్నాడు.

    ఓ రోజు గౌస్ మరో అమ్మాయిని నిఖా చేసుకోబోతున్నాడన్న వార్త తెల్సి యింట్లో ఆడాళ్ళందరూ గొల్లుమన్నారు. ఆ అమ్మాయి యింటర్ చదివిందట... టీచర్‌గా ఉద్యోగం చేస్తోందట... అన్నీ తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నారట... ఈసారి రిజ్వానా తండ్రి ఓ పాతికమంది ముస్లిం పెద్దల్ని పిల్చుకుని తన ఖర్చులమీద విజయవాడ పిల్చుకెళ్ళాడు. అక్కడి ముస్లిం పెద్దలూ, గౌస్ తరఫు బంధువులూ, నిఖా చేసుకోబోతున్న అమ్మాయి తరఫు బంధువులూ... అందరితో పంచాయితీ పెట్టించాడు.

    "మా అమ్మాయి విషయం ఏం ఆలోచించారు?" దీనంగా మొహం పెట్టి అడిగాడు రిజ్వానా తండ్రి.

    "నేను మరో అమ్మాయిని నిఖా చేసుకోబోతున్నాను కదా. అలానే మీ అమ్మాయిని కూడా వేరే అతనికిచ్చి నిఖా చేయండి. ఈ మాట మీకెప్పుడో చెప్పాను కదా. ఈపాటికి వేరే సంబంధం చూసుకుని ఉంటారనుకున్నాను" అన్నాడు గౌస్.

    "పెళ్ళయి కాపురం చేసిన అమ్మాయికి సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి? ఐనా నిఖా చేసుకున్న భర్త మీరుండగా మళ్ళా నిఖా ఏమిటి" అన్నాడు రిజ్వానా తండ్రి.

    "నేను మీ అమ్మాయిని వదిలేశాగా... నాకేరకమైన సంబంధం లేదిప్పుడు. వచ్చే నెలలోనే మరో అమ్మాయితో నా నిఖా ఉంది. పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మీ అమ్మాయికి వేరే సంబంధం చూడండి"

    "మీరు వేరే కారణంతో వదిలేస్తే సమస్య యింత జటిలంగా ఉండేది కాదు. అమ్మాయి చెడిపోయిందని ముద్ర వేశారు. పదిమందికీ తెలిసేలా రచ్చ చేశారు. నిజానిజాలు ఆ అల్లాకే తెలిల్యాలి. అలాంటి అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? మీరే పెద్ద మనసు చేసుకుని..."

    "ఎవ్వరికీ పనికిరానిది నాకెట్లా పనికొస్తుంది? నేనేమీ వాజమ్మని కాను. రెండో పెళ్ళివాడికిచ్చి చేయమన్నాగా... బహు భార్యాత్వం మనలో నిషేదం కాదు కాబట్టి ఎవరైనా రెండో భార్యగానో నాలుగో భార్యగానో ఉంచుకుంటారేమో ప్రయత్నించండి. నా దగ్గరకొచ్చి ఏడిస్తే ఏం ప్రయోజనం? మీరెన్ని వేషాలు వేసినా నా నిఖాని మాత్రం ఆపలేరు."

    "వేరే వాళ్ళు ఎందుకు? ఆ రెండో భార్యగా నువ్వే చేసుకోవచ్చుగా" అన్నారెవరో... గొడవ గొడవగా మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. ఆ మాటతో తదుపరి సంభాషణంతా కొత్త మలుపు తిరిగింది. అలా చేస్తే తప్పేమిటని కొందరు... వద్దనుకున్నది మళ్ళా ఎందుకని కొందరు... రకరకాల అభిప్రాయాలు.

    "ఈ విషయం అంత సులభంగా తేలేది కాదు. నేనూ, నా తల్లిదండ్రులూ బంధువుల్తో పాటు నేను నిఖా చేసుకోబోయే అమ్మాయి తరఫు వాళ్ళతో కూడా చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. మనం మరలా సాయంకాలం కలుద్దాం. అప్పటివరకూ మమ్మల్ని ఆలోచించుకోనివ్వండి" అన్నాడు గౌస్.

    అతను ఒప్పుకుంటే చాలని, తన గుండెలమీదున్న బరువు దిగిపోయినట్లేనని, అలా జరిగితే గుంటూర్ మస్తాన్ వలి దర్గాకొచ్చి ఫాతెహా చదివిస్తానని రిజ్వానా తండ్రి మొక్కుకున్నాడు. సాయంత్రం మరలా సమావేశమైనప్పుడు పదిసార్లు బతిమాలించుకుని, పదిమంది చేత కాళ్ళూ గడ్డాలు పట్టించుకుని గౌస్‌మియా రిజ్వానాని భార్యగా స్వీకరించడానికి ఒప్పుకున్నాడు.

    "మీ అందరి సమక్షంలో చెప్తున్నా... మీరే సాక్షి... జాలిపడి రిజ్వానాని నా రెండో భార్యగా అంగీకరిస్తున్నా. మొదటి భార్యగా కాదు, రెండో భార్యగా... మళ్ళా ఈ విషయంలో తకరారు రాకూడదు" అన్నాడు.

    అదే మహద్భాగ్యమనుకుని రిజ్వానా తండ్రి, మిగతా వూరి పెద్దలూ సంబరపడ్తూ తిరిగొచ్చారు.

    "నీ అదృష్టం బాగుంది. గౌస్ మియా నిన్ను రెండో భార్యగా స్వీకరించడానికి ఒప్పుకునండు" యింటికి రాగానే రిజ్వానాతో అన్నాడు.

    విషయం అంతా వివరంగా విన్నాక ఖాతూన్ అంది. "రెండో భార్య ఏమిటి? మనమ్మాయిని కదా మొదట నిఖా చేసుకుంది... పెద్ద భార్య అన్పించుకునే హక్కు దానికేగా ఉంది? మీరెలా ఒప్పుకున్నారు? అందుకే నన్ను కూడా పిల్చుకెళ్ళమని పోరాను. మాట విన్పించుకుంటేగా" అంది నిష్ఠూరంగా.

    "అలా అడిగితే మొదటికే మోసమొచ్చి అసలు మీ అమ్మాయే వద్దు పొమ్మంటాడని భయపడ్డాను. నాకు మాత్రం తెలీదా... మొదటి భార్య ఐతే ఏంటట గొప్ప... కానీయ్... దానికి రాతలో అలా రాసి పెట్టి ఉంటే మనమేం చేయగలం?" అన్నాడు.

    తలొంచుకుని అక్కడే నిలబడి ఉన్న రిజ్వానాతో, "వచ్చే నెల పదకొండున ఆ అమ్మాయితో నిఖా... అందువల్ల మనం పదహారున వెళ్ళడం మంచిది. నిన్ను విజయవాడలో మీ అత్తగారింట్లో దింపేసి వస్తాను" అన్నాడు. 

    అప్పటి వరకూ నోరు విప్పని రిజ్వానా తలొంచుకునే "నాకిష్టంలేదు బా" అంది.

    వినకూడని మాట విన్నట్టు అంతెత్తున కోపంతో ఎగిరిపడ్డాడు. "నీ యిష్టాయిష్టాలెవరూ అడగటం లేదిక్కడ. నోర్మూసుకుని చెప్పినట్టు చేయి."

    "రెండో భార్యగా వెళ్ళటం యిష్టంలేదేమో" కూతురి తరఫున ఖాతూన్ మాట్లాడింది.

    "అతను మొదటి భార్యగా ఒప్పుకున్నా నాకొద్దు మా. నన్నొకదాన్నే భార్యగా అంగీకరించినా నాకొద్దు. అతన్ని భర్తగా వూహించుకుంటేనే వంటిమీద తేళ్ళూ జెర్రులూ పాకుతున్నట్లున్నాయి" అంది సన్నగా ఏడుస్తూ.

    "ఏం చూసుకునే నీకంత పొగరు? చెడిపోయిన దానివని ముద్రపడ్డాక నిన్నెవరైనా చేసుకుంటాడనుకున్నావా? రెండో భార్యగానే కాదు నిన్ను దాసి దానిలా ఉంచుకుంటానన్నా సరే సంతోషంగా పంపిస్తాం. కనీసం పూటకింత ముద్దయినా దొరుకుతుంది."

    "ముద్ద కోసం వాడికి రెండో భార్యగా వెళ్ళక్కరలేదు. అడుక్కున్నా దొరుకుతుంది" ఉక్రోషాన్ని ఆపుకోలేక అనేసింది.

    "ఏమన్నావే దరిద్రపుదానా? నా మాటకు ఎదురు చెప్తావా? నువ్వు అడుక్కోడానిక్కూడా పనికిరానంత నష్ట జాతకురాలివే. మరోసారి నోరులేపావా నిన్ను చంపి మేమందరం ఏ పురుగుల మందో తాగి చచ్చిపోతాం జాగ్రత్త" కోపంతో వూగిపోతున్న అతన్ని ఖాతూన్ దూరంగా లాక్కెళ్ళింది. 

    ఆ రాత్రంతా రిజ్వానా ఏడుస్తూనే ఉంది. యిదేం బతుకు... బానిసలకన్నా హీనమైన బతుకు... గౌస్‌తో పెళ్ళప్పుడు 'యితను నీకు నచ్చాడా?' అని తననెవ్వరూ అడగలేదు. నిఖారోజు 'కబూల్ హై' అని యాంత్రికంగా తనచేత అన్పించారు తప్ప చివరికి తన తల్లి కూడా 'ఈ పెళ్ళి నీకిష్టమేనా' అని అడిగి తన మనసులో మాట తెల్సుకునే ప్రయత్నం చేయలేదు.

    గౌస్ తనని అనుమానించి, అవమానించి వదిలేసి వెళ్తే ఏడుస్తున్న తనని అతను వదిలేసినందుకు ఏడుస్తున్నదనుకున్నారు తప్ప నిజమైన కారణమేమిటో ఎవ్వరూ అడగలేదు. అతను వదిలేసినందుకు తనకు ఏడుపు రాలేదు. తనని అనుమానించినందుకొచ్చింది. తనపైన చెడిపోయిన దాన్నని ముద్ర వేసినందుకు ఏడుపొచ్చింది. మొదటి రాత్రి అతను పెట్టిన హింసకి... తనకే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటే, ఎడంకాలితో తన్ని వదిలేసేది. అల్లా దయామయుడు. తను అడక్కుండానే అతనే వదిలేసి వెళ్ళాడు. తనకిక పెళ్ళికాకున్నా పర్లేదు కాని తన భర్తగా సంస్కారం లేని ఆ జంతువుని మాత్రం ఒప్పుకోదు.

    సుహాగ్ రాత్ రోజు ఏం జరిగిందో చెప్పమని అమ్మ అడిగినప్పుడు తను చెప్పకుండా దాచి పెట్టిన విషయం గుర్తొచ్చింది.

    'నువ్వింత అందంగా ఉన్నావు కదా... నీమీద మీ వూళ్లో చాలామని కుర్రాళ్ళు ఫిదా అయి ఉంటారే' అన్నాడు.

    'నేనింట్లోంచి బైటికొచ్చేదే తక్కువ' అంది తను సిగ్గుపడ్తూ.

    'ఐతే మీ యింటి ముందు మీసం మొలిచిన మగాళ్ళంతా క్యూ కట్టి ఉంటారే' అన్నాడు.

    అప్పటికి తొలి కలయిక ఐపోవటం వల్ల... అతను సరదాగా మాట్లాడుతున్నట్లు నటించడం వల్ల, కూపీలాగడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం ఆమెకు అర్థంకాలేదు.

    'మా అబ్బాజాన్ అంటే వూళ్ళోని కుర్రాళ్ళు భయపడ్తారు. ఎవ్వరూ రారు'

    'నీవైపు ప్రేమగా చూసి నవ్వినవాళ్ళు తప్పకుండా ఉండి ఉంటారు. ప్లీజ్ చెప్పు... నేనేం అనుకోనులే... దాచకుండా చెప్పు... ఇవన్నీ అందగత్తెల జీవితాల్లో సహజంగా జరిగేవే'

    తనకు వెంటనే ఖదీర్ గుర్తొచ్చాడు. గత ఐదారేళ్ళుగా యింటికాడకొచ్చి పాలుపోసే ఖదీర్... వాళ్ళకి రెండు బర్రెగొడ్లున్నాయని, పాలమ్ముకోవటమే జీవనాధారమని అమ్మ చెప్పింది. ఖదీర్‌కి ఇరవై ఏళ్ళుంటాయేమో... మనిషి సన్నగా పొడుగ్గా ఉంటాడు. చామనచాయ... కళ గల మొహం... ఆ కళ్ళు నవ్వుతున్నట్టే ఉంటాయి. పాలకోసం తను తలుపు తెరిచినప్పుడల్లా చాలా ఆత్మీయంగా నవ్వుతాడు. అంతే తప్ప అతనెప్పుడూ మరోలా ప్రవర్తించలేదు. ఆ నవ్వే... ఎన్నో యేళ్ళ నుంచి పరిచయమున్న స్నేహితులు కలిసినపుడు నవ్వేలాంటి నవ్వు.

    నిఖా మరో నాలుగు రోజుల్లో ఉందనగా తన చేతిలో ఉన్న స్టీల్ గిన్నెలో పాలుపోస్తూ 'నీ పెళ్ళట కదా' అన్నాడు. తను తలయెత్తి అతని కళ్ళలోకి చూసింది. అవి నవ్వటంలేదు. వాటిలో రహస్యంగా దాచుకున్న దుఃఖమేదో నీటిపొరలా మారి అడ్డుపడ్తున్నట్టు... తనేమీ సమాధానం చెప్పలేదు.

    గౌస్‌తో పాలబ్బాయి గురించి చెప్పింది. 'మంచి వాడండీ... వూరికే చూసి నవ్వుతాడంతే' అంది.

    అంతే... అతన్లో అనూహ్యమైన మార్పు... అప్పటివరకూ అతని లోపలెక్కడో దాక్కున్న రాక్షసుడు బైటికొచ్చినట్లు... అతని నవ్వు క్రూరంగా మారిపోయింది. 'ఓ... వాడితో అన్నమాట యిన్నాళ్ళూ నువ్వు కులికింది' అన్నాడు.

    అతనేం అంటున్నాడో అర్థం కాలేదు తనకి. 'నాకంటే ముందే ఆ పాలుపోసే పుండాకోర్ దగ్గర పడుకుని నంగనాచిలా నా దగ్గర కన్నెపిల్లలా నటిస్తే తెల్సుకోలేననుకున్నావా' అన్నాడు.

    తనకే పాపం తెలీదని ఏడ్చింది. కన్నీళ్ళతో అతని కాళ్ళు కడిగింది. ఐనా అతను కరగలేదు. తను చేయని తప్పుకి అతను శిక్ష విధిస్తుంటే మనసు మూగగా రోదించింది. అతను మనిషైతేగా... మృగం... మరలా ఆ మృగం దగ్గరకే పంపిస్తారట. వాడు తనని రెండో భార్యగా ఒప్పుకున్నందుకు అమ్మా నాన్నా ఎంత సంబరపడిపోతున్నారో... వాడెందుకు ఒప్పుకున్నాడో తనకర్థమైంది. వాడు, వాడి కాబోయే భార్య ఉద్యోగస్తులు కదా... యింటి చాకిరీ చేయడానికి, వంట చేసి పెట్టడానికి ఓ పని మనిషి అవసరం ఉంది. తనని రెండో భార్యగా ఉంచుకుంటే చాలు... నమ్మకమైన పని మనిషి చౌకగా దొరికినట్లే... యిస్లాంలోని బహుభార్యాతృత్వం ఓ సాకు మాత్రమే... వాడు చేసుకోబోతున్న అమ్మాయికి కూడా మొదటి రాత్రి రక్తం కన్పడకపోతే వదిలేసి ఆమెని మూడోభార్యగా ఒప్పుకుంటానంటాడా? ఈ రెండో భార్యగానో మూడో భార్యగానో ఉండటం ఏమిటో అర్థం కావటం లేదు. ఉంచుకోవటానికి వేసిన అందమైన ముసుగు... ముస్లిం ఆడపిల్లలు... వాళ్ళని కన్న తల్లిదండ్రులు... మతం పేరుతో చేసుకుంటున్న ఆత్మవంచన...

    ఈ గండం నుంచి ఎలా బైటపడాలో ఆమెకి అర్థం కావటం లేదు. నాన్నకు ఎదురు తిరిగి ప్రయోజనం ఉండదు. మొండివాడు. బలవంతంగా నైనా తనని తీస్కెళ్ళి గౌస్‌కి అప్పగిస్తాడు. ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించింది. కానీ ఆ ఆలోచన రుచించలేదు. తనేమీ తప్పుచేయలేదే... మరెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? జీవితాన్ని ఎదుర్కోలేని పిరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. తనకు కాలేజీ చదువు లేకున్నా ధైర్యం ఉంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లని తట్టుకునే ఆత్మస్థైర్యముంది.

    గౌస్ వదిలేశాడస్ని తెలిశాక ఖదీర్ పాలుపోయడానికొచ్చినప్పుడాల్లా తను కన్పిస్తే చాలు కళ్ళతోనే 'బాధపడకు' అనేలా చూడటం గుర్తొచ్చింది. దాంతోపాటు అతని దగ్గర నిలబడినప్పుడల్లా అల్లుకునే అవ్యక్తమైన ఆత్మీయత గుర్తొచ్చింది.

    విజయవాడ వెళ్ళాల్సిన రోజు దగ్గరపడే కొద్దీ ఖదీర్‌ని మరింత నిశితంగా పరిశీలించింది. తనంటే అతనికి నిజంగా యిష్టమా? ఏ రకమైన యిష్టం? తనేమైనా భ్రమపడ్తోందా? అపోహనా? పేదవాడైతేనేమి మనసున్నవాడు... తనని అవమానించిన గౌస్‌కి రెండో భార్యగా, శరీరాన్ని మనసుని వాడికప్పగించి బతికే బానిస బతుక్కన్నా సంస్కారం ఉన్న పేదోడితో కలిసి కలో గంజో తాగటంలోనే ఆనందం ఉందనుకుంది.

    అతన్తో మాట్లాడటానికి సరైన సమయం కోసం ఎదురు చూసింది. విజయవాడకి ప్రయాణం రేపనగా ఆమెకా అవకాశం దొరికింది. ఖదీర్ పాలు పోయడానికి వచ్చినప్పుడు అమ్మా నాన్న లేరు. సరుకులేవో కొనాలని బైటికెళ్ళారు.

    "రేపు మరలా అతని దగ్గరకే వెళ్తున్నావటగా... రెండో భార్యగా..." అన్నాడు ఖదీర్. అతని కళ్ళలో పల్చటిపొరలా అల్లుకున్న దుఃఖఛాయ... రెండో భార్యగా అంటూ వత్తి పలికిన ఆ గొంతులో ఎవరిమీదో కసి... కోపం...

    "ఏం వెళ్ళొద్దంటావా?" అంది రిజ్వానా.

    "నేనెవర్ని అంటానికి?" ఆమె వైపు దిగులుగా చూసాడు.

    ఆమె కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అడిగింది "నువ్వేమీ కానప్పుడు ఎందుకు బాధ పడ్తున్నావు?"

    అతను సమాధానం చెప్పకుండా తలొంచుకుని నిలబడ్డాడు.

    "జాలి పడ్తున్నావా?"

    "కాదు. నువ్వు అందంగా ఉంటావు. పదో తరగతి వరకు చదువుకున్నావు. చాలా మంచి అమ్మాయివి. సలక్షణంగా ఉండే నీకు రెండో భార్యగా వెళ్ళాల్సిన దుస్థితి పట్టినందుకు బాధేస్తోంది. తమ కూతుర్ని జీవితంలో యిలాంటివి జరక్కుండా అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులే నిన్ను బలవంతంగా అందులోకి నెడ్తున్నారని తెలిసి మరీ బాధనిపిస్తోంది"

    "నిజం చెప్పు. మన ముస్లిం యిలాకాలో ఎంతో మంది అమ్మాయిలు పేదరికం వల్ల అరబ్ షేకులకు అమ్ముడుపోయి బానిసల్లా బతుకుతున్నారు. పెళ్ళయినవాడికే నాలుగో భార్యగా ఐనాసరే వెళ్ళడానికి సిద్ధపడ్తున్నారు. వాళ్ళందర్నీ తల్చుకుని బాధపడ్తున్నావా మరి? నా విషయంలోనే ఎందుకంత శ్రద్ధ? ధైర్యంగా చెప్పు. నేనేమనుకోన్లే"

    ఖదీర్ కళ్ళెత్తి రిజ్వానా కళ్ళలోకి చూస్తూ "నువ్వంటే నాకిష్టం" అని మరలా కళ్ళు దించుకున్నాడు.

    జీవితమంతా చీకటి కాబోతుందని భయపడిన రిజ్వానాకి ఖదీర్ కళ్ళలో కొత్త వెలుగు కన్పించింది.

(పాలపిట్ట సెప్టెంబరు 2010 సంచికలో ప్రచురితం)  
Comments