రెండులోకాలు -వేదగిరి రాంబాబు

    
ఆ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రంగురంగుల లైట్లు కనులకింపుగా ఆ భవనాన్నంటుకుని వేళ్ళాడుతున్నాయ్. ఆ భవంతి ఆవరణలో కార్లు బారులు తీరి నిలబడుతున్నాయ్. హాల్లో ఏర్పాటు చేసిన కుర్చీల వరుసల్లో బోలెడు మంది స్త్రీలు కూర్చుని, తమ మధ్య ఆ ఇంటి కోడలు శ్రీలక్ష్మికి జరుగుతున్న సీమంత వేడుకు చూస్తున్నారు. నిముష నిముషానికి కూల్‌డ్రింక్ సీసాలు అందిస్తున్నారు పనివాళ్ళు.     వేడుక ముగిసింది.     పెద్ద ఎత్తున స్వీట్లూ, హాట్లతో పార్టీ మొదలయింది. కొంతమంది రెండేసి ప్లేత్లు తింటున్నారు. కొంత మంది కొంచెం రుచి చూసి వదిలేస్తున్నారు.     ఆ భవనం యజమాని నిరంజనం మేడమీద కూర్చుని ఆనందంలో తేలిపోతున్నాడు. తన కొడుక్కు వివాహమై నాలుగేళ్ళయింది. ఇన్నాళ్ళకి ఇప్పుడు కోడలు గర్భవతయింది. అదే ఆయన ఆనందానికి కారణం. ఆయనేకాదు ఆ యింట్లోని సభ్యులందరూ తమ వంశాన్ని నిలబెట్టే చిన్నిపాపాయి రాక కోసం వేయి కళ్ళతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. శ్రీలక్ష్మి ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఇద్దరు లేడీ డాక్టర్లను నియమించారు. ఒక నర్స్‌కి తాత్కాలికంగా ఇంట్లో ఉద్యోగం ఇచ్చారు. ఆమెని అడుగుపెట్టనీకుండా, అలసట చెందనీకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు.

    రాత్రి తొమ్మిదింటిగ్గానీ ఆ వేడుక తాలూకు హడావిడి తగ్గలేదు.
    శ్రీకాంత్ భార్య శ్రీలక్ష్మిని ఆప్యాయంగా తమ గదిలోకి తీసుకెళ్ళిపోయాడు.     "ఈ పండుగలో బాగా అలసిపోయినట్లున్నావ్! విశ్రాంతి తీసుకో" అన్నాడతను.     శ్రీలక్ష్మి అలసటగా నవ్వింది.     మంచం మీద అలగ్గా వాలింది.     "కూర్చుని కూర్చుని కొంచెం నడుం నొప్పిగా వుంది..." అంది చిన్నగా నవ్వుతూ.     శ్రీకాంత్ వెంటనే లేడీ డాక్టర్‌కి ఫోన్ చేశాడు.     "అబ్బే డాక్టరెందుకూ ఈ మాత్రానికే... వద్దండీ..." వారిస్తూ అందామె.     అతను వినిపించుకోలేదు.
    "నీకు తెలీదు శ్రీలక్ష్మీ! మన జాగ్రత్తలో మనం వుండడం మంచిది" సౌమ్యంగా అన్నాడతను.

* * * * * 

    ఆ భవనం ఎదురుగా శిథిలావస్థలో వున్న పాకల్లో కూడా ఆ రోజు సందడిగా వుంది. ఆ పాకల్లోని చాలామంది స్త్రీలు ఓ పాకదగ్గరకు చేరి అక్కడ నులకమంచం మీద పడుకొన్న నాగమ్మ వేపు జాలిగా చూసి మాట్లాడుకొంటున్నారు.
    నాగమ్మ బాధతో మెలికలు తిరుగుతోంది.     "కొంచెంసేపు ఓర్చుకోవే! అదే తగ్గిపోతుంది..." ఓ ముసలమ్మ అంటోంది.     "అయిదో నెల వచ్చినప్పట్నించీ ఇలాంటి నెప్పులు మామూలేలే" మరో స్త్రీ సర్ది చెప్తూ అంది.     "ఒకవేళ కడుపు పోయినా మంచిదే" నాగమ్మ అత్త అంది.     ఆ రాత్రంతా నాగమ్మ భర్తా, అత్తామామలు నిద్రలేకుండానే గడిపారు. ఏ క్షణాన ఆమెకు గర్భవిచ్చిత్తి అవుతుందోనని క్షణమొక యుగంగా ఎదురు చూశారు ఆ రాత్రంతా. బాధతో మూల్గుతూనే వుంది నాగమ్మ.
    "ఒకోళ్ళకి ఆ మందు వెంటనే పనిచేస్తుంది. అది వేసుకున్న గంటలో గర్భం పోతుంది. మరి మన రాతేంటో దీని కింతవరకూ ఆ సూచన కనిపించడం లేదు" దిగులుగా అంది అత్త. 

    వాళ్ళందరి వృత్తి రోడ్డు పక్కా - గుళ్ళు, సినిమా హాళ్ళ దగ్గరా కూర్చుని అడుక్కోవడం-
    ఈ పరిస్థితుల్లో నాగమ్మ గర్భం ధరించడం అందరికీ గుండెల్లో రాయి పడింది. తమకే కడుపునిండా తిండి దొరకడం లేదు. ఇక ఆ పసిగుడ్డు బయటికొస్తే దానికెవరు పెడతారు?     తెల్లారేసరికి నాగమ్మ నొప్పులు తగ్గిపోయాయ్.     "ఇంకేం చేస్తాం...పద అడుక్కోవడానికి..." అన్నాడామె భర్త.
    అలాగే, లేచి అతనితోపాటే అడుక్కోవడానికి బయల్దేరింది నాగమ్మ.

* * * * *

    శ్రీలక్ష్మికి నొప్పులు వచ్చాయ్. వెంటనే ఆమెను కార్లో అతి ఖరీదయిన ఓ నర్సింగ్‌హోమ్‌కి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెను అంతవరకు కనిపెట్టి వున్న లేడీ డాక్టర్లిద్దరూ కాక మరో స్పెషలిస్ట్ కూడా రప్పించ బడింది. ఆ వేళంతా ఆమెని కనిపెట్టే వున్నారందరూ. ఎప్పుడో అర్థరాత్రికి కాని ప్రసవించలేదు శ్రీలక్ష్మి. అదీ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత!

* * * * *

    ఆ రోజు నాగమ్మ బజార్లో అడుక్కొంటుంటే హఠాత్తుగా నొప్పులొచ్చాయ్. భరించలేని నొప్పులు.
    ఆమె రోడ్డుపక్కనే పడి బాధపడడం చూసిన దారినపోయేవాళ్ళు ఓ రిక్షా మాట్లాడి , ఆమెను అందులో వేసి హాస్పిటల్‌కి పంపించారు. ఆమెను ప్రభుత్వ హాస్పిటల్ వరండాలో పడేసి వెళ్ళిపోయాడు రిక్షావాడు.     హాస్పిటల్ సిబ్బంది ఆమెను చూసి కూడా చూడనట్లు ఎవరి దారిన వాళ్ళు తిరగసాగారు.     నాగమ్మకి నొప్పులు అధికమయ్యాయి.     గట్టిగా కేకలు పెడుతూ అటూ ఇటూ తిరిగే నర్సులనూ, డాక్టర్లనూ బ్రతిమాలసాగింది.     చివరికి ఆమె ఆ వరండాలోనే మరో ముష్టిదాని సాయంతో ప్రసవించేసింది.

* * * * *

    శ్రీలక్ష్మికి మగపిల్లాడు పుట్టాడు. అయితే ఆ పిల్లాడి కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయివున్నాయ్. ఇది చూస్తూనే ఆ ఇంటివాళ్ళంతా నిరుత్సాహ పడిపోయారు.
    వెంటనే కార్లు స్పెషలిస్టుల దగ్గరకు పరిగెత్తాయ్.     డాక్టర్లు ఒకరి తర్వాత మరొకరు పరీక్షించి ఆ పాపాయిని విదేశాలకు తీసుకెళ్ళాలనీ, అప్పుడే ఆ పాపాయికి కాళ్ళూ చేతులూ సరిగ్గా రావచ్చని అభిప్రాయాలు వెలిబుచ్చారు.     వారం తర్వాత అలాంటి కేసులు నయం చేశాడని పేరుపొందిన ఓ బొంబాయి వైద్యుని దగ్గరకు విమానంలో బయల్దేరిందా కుటుంబం.

* * * * *

    నాగమ్మకి ఆడపిల్ల పుట్టింది. పిల్ల ఆరోగ్యంగా వుంది. ఆ మర్నాడే మంచాలు ఖాళీ అవ్వాలని హాస్పిటల్ వాళ్ళు ఆమెను బయటికి గెంటేశారు. ఆ పసిగుడ్డును తీసుకుని నెమ్మదిగా ఇంటికి చేరుకుంది నాగమ్మ.
    ఆమె అంత త్వరగా ఇంటికి రావడం ఆ ఇంటిల్లిపాదికీ నచ్చలేదు.     "మరో రెండ్రోజులక్కడే వుంటే మంచి తిండి దొరికేదిగా" అందామె అత్త దిగులుగా.     "వుంటానంటున్నా బయటికి తోసేశారు..." చిన్నగా జవాబిచ్చింది నాగమ్మ.     పాపాయిని అందరూ మూగి చూశారు. బొద్దుగా ఆరోగ్యంగా వుందాపిల్ల.     "ఏ వంకా లేని పిల్ల" నిరుత్సాహంగా అంది అత్త.     "మన కర్మం! మన పాక్కెదురుగా వున్న గొప్పోలింట్లో కాల్లూ సేతులూ ఆడని బాబు పుట్టాడంట. దేవుడలాంటి పిల్లని మనకిస్తే ఎంత బావుండేది" విచారంగా అన్నాడామె మామ.     పిల్ల ఇల్లెగిరిపోయేటట్లు ఏడుపు మొదలెట్టింది. ఆకలికి ఓర్చుకుంటూనే ఆ పిల్లకు పాలు పట్టింది నాగమ్మ.     పాలు సరిగ్గా రాక పిల్ల వుండుండి ఏడుస్తూనే వుంది.     కన్నో కాలో వంకరతో పుడుతుందని అంతా ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే ఆ పిల్ల ఏ వంకా లేకుండా పుట్టింది.     ఇప్పుడిలాంటి ఆరోగ్యంగా వున్న పిల్లని బజార్లో పడేసి అడుక్కుంటే డబ్బెవరు పడేస్తారు?     కాళ్ళు లేని పిల్లో, చేతుల్లేని పిల్లో, చెవి, ముక్కు ఏదో ఒకటి వికృత రూపంలో వున్న పిల్లయితే నాలుగు డబ్బులు రాల్తేనే ఆ పిల్లకు, తమకూ కూడా జరుగుబాటు వుంటుంది.     ఇప్పుడేం దారి? ఏం చేయడం? నాగమ్మ ఆలోచనలో పడింది. ఎటూ తేలడం లేదామెకి.
    ఓ పక్క తన ఆకలి, మరోపక్క పిల్ల ఆకలి! ఏటూ తేలనీయడం లేదవి. ఏ ఆలోచనా తోచనీయడం లేదు.

* * * * *

    బొంబాయి చేరుకుని వారం రోజులైంది.
    నిరంజనం తన మనవడ్ని స్పెషలిస్టుకి చూపించాడు.     ఆయన ఎన్నో ఖరీదైన పరీక్షలు జరిపి - అంత తేలిగ్గా నయం కాదనీ, చాలా కాలం వైద్యం చేయిస్తే వుపయోగం వుండవచ్చనీ చెప్పాడు. తనకి వాళ్ళ వూరు వచ్చి చూడ్డం సాధ్యం కాదు కనక వాళ్ళనే కొంత కాలం బొంబాయిలో వుండిపొమ్మన్నాడూ.     తనకి కూడా సాధ్యం కాని పక్షంలో అప్పుడు అమెరికాకి వెళ్ళవచ్చని సలహానిచ్చాడు. దాంతో ఆ కుటుంబం మకాంని తాత్కాలికంగా బొంబాయికి మార్చేసింది. భగవంతుడి మీదా, ఆ డాక్టరుమీదా భారం వేసి వేలకివేలు డబ్బు ఖర్చు చేయసాగారు.     భగవంతుడికి మొక్కులూ, పూజలూ -     డాక్టరుకి ఫీజులూ, పార్టీలూ -
* * * * *

    రాన్రాను నాగమ్మకి ఆ పిల్లతో ప్రాణం మీద కొస్తోంది.     ఇంటిల్లిపాదీ అడుక్కొచ్చినా చాలటం లేదు. ఆ పిల్లను చూస్తుంటే నాగమ్మకి కోపం ముంచుకొస్తోంది!     తనేం పాపం చేసిందని దేవుడు తన కిలాంటి ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడు. తనకన్న రెండునెల్లు ముందు కన్న సన్యాసమ్మకి ఇద్దరు గుడ్డిపిల్లలు? అంతకుముందు రామిగాడి పెళ్ళాం రంగికి తల పెద్దది, శరీరం చిన్నదిగా వున్న పిల్లాడు పుట్టాడు...     ఇలా అందరికీ అదృష్టం కలిసొచ్చింది. ఆ పిల్లలను పడుకోబెట్టొ అడుక్కొంటుంటే వాళ్ళ జోలెలన్నీ నిండిపోతున్నయ్! తన ఖర్మే ఇలా కాలిపోయింది. ఆకలికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లని లాగి కొట్టింది నాగమ్మ. పిల్ల ఆ దెబ్బకి ఓర్చుకోలేక తల్లడిల్లిపోసాగింది.

* * * * *

    చాలారోజుల తర్వాత స్పెషలిస్ట్ వైద్యం కొంతవరకూ పని చేయడం ప్రారంభించింది. శ్రీలక్ష్మి పిల్లాడు కాళ్ళూ చేతుల్ని ఇప్పుడు కొంచెంకొంచెంగా కదప గలుగుతున్నాడు. రోజు పెద్ద పండగ జరిపేశారు వాళ్ళు. డాక్టరుకు ఖరీదయిన వాచీ బహూకరించారు

    "పూర్తిగా స్వస్థత చేకూరాలంటే అతి ఖరీదయిన ఆపరేషన్ని చేయాల్సి వుంటుంది" అన్నాడు డాక్టర్

    "ఎంత డబ్బయినా ఖర్చు చేస్తాం. మాక్కావల్సింది మా మనవడు అందరిలాగా తిరగడం... వాడు మిగతా అందరి పిల్లల్తో ఆడుకోవాలి. అంతే!" ఆవేదనతో అన్నారు నిరంజనంగారు

* * * * *

     వారం రోజులుగా ఇంటిల్లిపాదీ పిల్ల గురించే ఆలఒచిస్తున్నారు.
    రాన్రాను ఆ పిల్లను భరించడం కష్టమైపోతోంది వాళ్ళకి.     "ఏం సేద్దామే...?" నాగమ్మ భర్త దిగులుగా అడిగాడు.     "నువ్వే సెప్పు..." తోచక విసుగ్గా అన్నది నాగమ్మ.     "పోనీ, ఏడయినా ఇడిసేద్దామా..." అడిగాడతను.     "నీ ఇట్టం. ఇడిసేద్దామంటే ఇడిసేద్దాం" కొంత అయిష్టంగానే అందామె.     లోపల తను కన్న మొదటి సంతానాన్ని అలా పారేయడం ఆమెకు ఇష్టం లేదు.     "రేపు పొద్దుగుంకింతర్వా తట్టుకెల్లి ఏ రోడ్డు ప్రక్కనో ఇడిసేద్దాం. ఎవరో ఒకల్లట్టుకెల్లి పెంచుకుంటారు..." నిర్ణయించుకున్నట్లుగా అన్నాడతను.     "సరే..." వప్పుకుంది నాగమ్మ కన్నీళ్ళద్దుకుంటూ.     ఆ రాత్రి వాళ్ళ నిర్ణయాన్ని అత్తమామలు విన్నారు.     "ఆ పిల్ల కొద్దిగా పెద్దదయితే మనకి శానా వుపయోగపడుద్దిరా! అదే అడుక్కొంటది. అలా ఇడిసేత్తానంటే ఎలా?" అన్నాడు మామ.     "అవును. ఇంత కష్టపడి కని, ఆ పిల్లనట్టా ఇడిసేత్తే ఎట్టా?" తనూ అతన్ని సమర్థిస్తూ అంది అత్త.     "మరంతవరకూ దీన్నెలాగే సూట్టం?" చిరాగ్గా అన్నాడు నాగమ్మ భర్త.     అందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు.          "నేనో మాట సెప్తా ఇంటావా?" అడిగాడు మామ.     "ఆ పిల్లకి కాళ్ళూ, సేతులూ ఇరిసేద్దం. మర గొడవా వుండదు. రోడ్డు పక్కన పారేసి వుంచితే మనందర్నీ కూడా అదే పోసిత్తుంది..."     అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు.     కన్నపిల్లను పారేసుకోవడం కన్నా అదే నయమనిపించింది నాగమ్మకి.     అందరికీ ఆ పద్ధతే బాగనిపించింది.     అందరూ ముసలాడిని అంత మంచి ఉపాయం ఆలోచించినందుకు పొగిడారు. ఆ రాత్రి-     బొంబాయిలో శ్రీలక్ష్మి పాపాయికి కాళ్ళూ చేతులూ మామూలుగా వచ్చేందుకు ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు శ్రమపడుతూంటే...     నాగమ్మ పాకలోంచీ కాళ్ళూ చేతులూ మెలితిప్పబడ్డ శిశువు పాక ఎగిరిపోయేటట్లు ఏడ్వడం మొదలు పెట్టింది...
(యువ మాసపత్రిక ఫిబ్రవరి 1980లో ప్రచురితం)


    
      

    
Comments