రిగ్గింగ్ - నాగసూరి వేణుగోపాల్

    
అసహనం పెరిగిపోతోంది తనకు కథలు చదివి చదివి! చేసేది సాహిత్య మాసపత్రికలో సబ్ఎడిటర్ ఉద్యోగం. కుప్పలు తెప్పలుగా వచ్చి పడే కథల కొండలు తవ్వి మంచి కథలనే ఎలుకలు పట్టాలి.  ఈ ఉద్యోగాంలోకి రాక పూర్వం ఇందులో ఎంతో ఆనందం ఉందనీ, చదవడమనే ఉద్యోగం ఎంతో ఆహ్లాదకరమనీ భావించా. మన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎంత ఉందో యిక్కడా అంతే!

    చెత్తకథలు, సుత్తి కథలు చదివి, చదివి కథా సన్యాసం తీసుకోవాలనిపిస్తోంది. మరీ అలవోకగా అలా చూసి పడేద్దామంటే మంచి కథలు మిస్సయిపోతాయేమోనని భయం. విమర్శకుల చక్షువులు కూడా అందుకోనట్టి కథలను కొంతమంది కొత్త రచయితలు రాస్తారనీ, దాన్ని పసిగట్టడంలోనే ఎడిటర్ల గొప్పదనమంతా వుందనీ తెలుసు. అందుకే జాగ్రత్తగా చదవాలి. అయితే చెత్తా, చెదారం చదివి చదివి బోరు. పోనీ ఆ విసుగుకు ఒక వెలుగురేక వుండకపోతుందా, మంచి కథ దొరక్క పోతుందా అని ఆశగా ప్రతి కొత్త స్క్రిప్టు చదవడం నిరాశతో పూర్తి చేయడం.

    ఎడిటరుగారికి ఎంతో భరోసా కాబట్టి తనకా గౌరవం. అక్కడ మిగతా వారికి గుర్రు అని కూడా గదా! జూనియర్‌కి ఎందుకిచ్చారు ఆ పని అని. అందువల్ల జాగ్రత్తగా విధి నిర్వహించాలి గదా! అందుకే ఇంత శ్రమ.

    అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చెత్త కథలు కాబట్టే అన్ని అలా చదవగలగడం. లేకపోతే అన్నీ మంచి కథలూ, గొప్ప కథలూ అయితే అన్నింటిని అలా చదువగలనా? ఆస్వాదించగలనా? నిజంగా మంచికి విలువ రావాలంటే దాని చెంత చచ్చు పుచ్చు వుండక తప్పదేమో!

    తెలుగు నాట కథ చచ్చి పోయింది, పుచ్చి పోయింది - అనే దశలో కథకు దశ తిరిగింది. క్లాసు, మాసు అని స్థూలంగా రెండురకాలు వున్నట్టు, కథలు కూడా నిలువుగా చీలి రెండు రకాలు అయ్యాయి. 'మాస్' కథ పత్రికకు ప్రజలు సర్క్యులేషన్ పీటలేసినా 'అసలు' కథలు కూడా గుర్తింపు పొందుతున్నాయ్, గౌరవం అందుకుంటున్నాయ్! అందుకే ఈ పత్రికా, ఈ ఉద్యోగం!

    కథలు చదివి చదివి బోరవుతోంది!

    "ట్రింగ్...ట్రింగ్"

    ఫోనా?

    "హలో...హలో...మీరా...రమణయ్యగారా?... చెప్పండి...రెస్పాన్స్ ఎలా వుందా?... చూడలేదు... చూడాలి... థాంక్స్!"

    పబ్లిక్ రిలేషన్స్ పెద్ద తలనొప్పి!

    కథ చేరిందా? చూశారా? చదివారా? వచ్చిందా? ఎపుడు వేస్తారు? రెస్పాన్స్ ఎలా వుంది? రెమ్యూనరేషన్ పంపారా? రెమ్యూనరేషన్ చేరలేదు... ఇలా వుంటాయి ఫోన్లు, పర్సనల్ లెటర్లు!

    "కథా స్పందన" శీర్షికకు సెలెక్ట్ చేయాలి. అవును ఉత్తరాలు చూడటం చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఎంతో వైవిధ్యం! అచ్చులో పేరు చూసుకోవాలని కొందరు రాస్తే, నిశితంగా చదివి విశ్లేషణ రాసేవారు మరికొందరు. ఫలానా కథ బావుందని కొందరు రాస్తే, ఫలానా వారికథ బావుందని మరికొందరు! మంచికథలు వేస్తున్నారని కొందరు రాస్తే, ఆ కథలను పత్రికే అనువాద కార్యక్రమం చేపట్టాలని మరికొందరు; సుత్తి,చెత్త, బోరు... అని కొందరు; అద్భుతం, అమోఘం, అద్వితీయం అని మరికొందరు! ఇలా వుంటుంది ఉత్తరాల తీరు. అందులో కూడా సృజనాత్మకంగా ఎంపిక చేసి పాఠకుల ముందుంచాలి.

     ఆశ్చర్యం!

     ఒకటి...రెండు...పది... యిరవై...ముప్పై... బాప్‌రే! ఏమిటి యిది. ఒకే కథకు యింత రెస్పాన్సా?

     ఎందుకు అన్ని ఉత్తరాలు? ఎందుకంత రెస్పాన్సు? ఆ కథ రాసింది ప్రముఖుడే! బాగానే రాశాడు. అందరికీ తెలిసిన అంశమే! పేరుకు ప్రజాస్వామ్యం, కానీ వాస్తవానికి రిగ్గింగ్ రాజ్యం. వెనకబడిన ప్రాంతాల గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే ఎన్నికల పద్ధతులూ, పెద్ద మనుషుల దౌర్జన్యాలూ, హింసలూ, హక్కులు కాలరాయటాలూ వగైరాలు చాలా చక్కగా చిత్రించారు. సందేహం లేదు వాస్తవ జీవితాన్ని చిత్రించే కథలకు ఆదరణ వుంది.

     బస్సు ప్రయాణం, తుఫాన్ తాకిడి, ఎన్‌కౌంటర్ హత్య, వార్తా కథనం, అనుభవం... యిలా ఏదో వాస్తవానికి కల్పన రంగరించి, శిల్పం జోడించి కథలు రాయడం సహజమే!

     దాదాపు పదేళ్ళ నుండీ రమణయ్య గారి కథలు అచ్చవుతున్నాయి. దాదాపు అన్ని పత్రికల్లో వారి కథలు వచ్చాయి. కొన్ని సంపుటాల్లో వారి కథలు చోటు చేసుకున్నాయి. సొంతంగా ఓ సంపుటం వేసుకున్నారు. అయినా ఈ కథ మహత్యం ఏమిటో? ఏమిటో ఈ ఉత్తరాల వెల్లువ?

     ప్రజలను దగ్గరికి రానీయకుండా, భయభ్రాంతులను చేసి, గూండాలు ఎలా బాలెట్ కాగితాల మీద ముద్రలు వేసి "ప్రజాభిప్రాయాన్ని" పొందుతారో బాగా రాశాడు. అన్నీ తెలిసి అన్ని స్థాయిల్లోనూ అధికారులు ఎలా స్థాణువులై వుండిపోతున్నారో, వారి అసహాయతకు, ఈ వ్యవస్థ వైఫల్యానికీ పరిష్కారం ఎందుకు లేదో - పాఠకులను బాగ కదల్చ గలిగారు.

     ఈ "ప్రజాభిప్రాయం" మూటగట్టుకున్న వాడు చట్టాలు మారుస్తాడు. రేపటి ఓట్ల మూట నుంచి నోట్ల మూట కట్టుకుంటాడు. అవసరమయితే విదేశాల నుంచి అందుకుంటాడు. ప్రతిఫలంగా వారికి అగ్రిమెంట్లు రాసిస్తాడు! అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, నీరు కావచ్చు.  

    అలోచనలో పడ్డాను నేను! ఈ ఉత్తరాల్లో కొన్నింటిని ఎన్నిక చేయాలి? అరె... వీటిల్లో చేతిరాతలు ఒకేలా వున్నాయే! అయితే కొన్ని ఇంగ్లీషులో, కొన్ని తెలుగులో, ఇంకొన్ని టైపులో. కొన్ని పొగుడుతూ... మరికొన్ని తిడుతూ. ఏమిటో...అర్థం కావడం లేదు... ఆ... వీటిలో చాలాభాగం ఒకే ప్రాంతం నుండి పంపారే! తమాషా... మూడు వంతులు ఒకే చోట పోస్ట్ చేస్తారు... అయ్యా రమణయ్య... ఎక్కడో ఆరువందల కిలోమీటర్ల దూరం నుండి ఫోన్ చేసింది దీనికా? మనది ప్రజాస్వామ్యం! అన్నీ దొంగ ఉత్తరాలు, రాయించుకున్న ఉత్తరాలు. కాదండానికి వీలు లేదు. ఇది "ఇన్‌బిల్ట్" సమస్య. ఇటువంటి రాత ఆధారంగా పేరు, సన్మానాలూ, అవార్డులూ!

    ఇంతకూ మీకా కథ పేరు చెప్పలేదుగా?

    ఆ కథ పేరు "రిగ్గింగ్!"


(ఆహ్వానం మాసపత్రిక నవంబరు 1996 సంచికలో ప్రచురితం)     

Comments