ఋణం - ముళ్లపూడి సుబ్బారావు

    నేను మినీ కాన్ఫరెన్స్ హాలుకు చేరేసరికి ఇద్దరే వచ్చి ఉన్నారు. ఎలక్ట్రీషియన్ ఎల్.సీ.డీ ప్రొజెక్టరుకి పవర్‌ను సరి చూసుకుంటున్నాడు. నేనొక కుర్చీలో కూర్చుని 'వైఫై'కి కనెక్ట్ అయ్యి నోటుబుక్‌లో మెయిల్స్ చూస్తున్నా. కేసెట్ ఎయిర్ కండిషనర్ నుండి చల్లగాలి తలమీదుగా వీస్తోంది. మెల్లగా హాలు నిండింది. కుర్చీల శబ్దాలు, పరస్పర పలకరింపులు, సెల్ ఫోన్ రింగు టోన్లతో హాలు సందడిగా మారింది. ఖచ్చితంగా పది గంటలకు సి.ఎఫ్.ఓ (చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్) లోపలికి వచ్చారు. నిశ్శబ్దంగా అందరం లేచి నిలబడి ఆయన కూర్చున్నాక తిరిగి కూర్చున్నాం. ఆఫీసు పనికి సంబంధించిన సంభాషణలన్నీ ఎక్కువభాగం ఇంగ్లీషులోనే జరుగుతాయి. సీట్లో కూర్చుంటూనే "ఇంకా ఎవరైనా రావాలా'' అన్నారు సి.ఎఫ్.ఓ. అందరూ ఒకసారి అటూ ఇటూ చూశారు. "అందరూ వచ్చేశారు'' అందరి తరఫునా ఆయన టీ.ఎస్ (టెక్నికల్ సెక్రటరీ) చెప్పారు.

    ఎలక్ట్రీషియన్ లైట్లు ఆఫ్ చేశాడు. సి.ఎఫ్.ఓ లాప్ టాప్‌ను ఎల్.సీ.డీకి కనెక్ట్ చేశారు. తెరమీద ప్రొజక్షన్ అవుతుండగానే ఆయన చెప్పటం మొదలుపెట్టారు. "మీకు తెలుసు నేనొక వారం పాటు కంపెనీ పంపిన ఒక మానేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాముకు అటెండు అయ్యాను. ఆ కంటెంటుని మీతో పంచుకోవాలని పిలిపించాను. ఇది ప్రధానంగా సంస్థ మనుగడ తరతరాలు సాగడానికి కావలసిందేమిటి అనేదాన్ని చర్చిస్తుంది.''

    మొదటి స్లయిడ్‌లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఫోటో ఉంది. దానిని పాయింటరుతో సూచిస్తూ "ఈ బిల్డింగు ప్రాముఖ్యత మీకు తెలిసిందే. న్యూయార్క్‌లో చాలా ఎత్తయిన భవనం. ఈ భవనం భూమిపై ఎంత ఎత్తు ఉండగలదు అనేది దాని పునాది భూమిలోపల ఎంత లోతులో ఉన్నదనేదానిపై ఆధారపడి ఉంటుంది. అంటే పునాది అనేది భవనం ఎత్తును, దాని మనుగడను నిర్దేశిస్తుంది. మంచి పునాది ఉంటేనే అది తరతరాలుగా నిలవగలదు. భవనం పునాది మీద నిలబడినట్టే సంస్థ కొన్ని శాశ్వత విలువల మీద నిలబడుతుంది. వియ్ కెన్ కాల్ దెమ్ కోర్ వాల్యూస్.''

    వాల్యూస్ పదం వినపడగానే ముందు వరుసలో జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న ఆడిట్ అధికారి అలర్ట్ అయ్యి వినసాగాడు.
"కోర్ వాల్యూస్‌ను గుర్తించడం, వాటిని సంస్థ లక్ష్యాలతో సింక్రొనైజు చేయడం, వాటిని కిందిస్థాయి ఉద్యోగుల వరకూ తీసుకుపోవడం మానేజిమెంట్ ముందు ఉన్న పెద్ద చాలెంజి.'' అలా మొదలై, స్లయిడుల మార్పులతో నలభై నిమిషాలు ఆయన ఉపన్యాసం సాగింది.

    నిరంతరం నిలబెట్టుకోవాల్సిన లీడర్షిప్ లక్షణాలు, కల్ట్ తరహా పని సంస్కృతి, ఛేంజ్  మానేజ్‌మెంట్ , వర్కర్స్ కుటుంబాల సంక్షేమం, పరిసర ప్రాంతాల అభివృద్ధి... వగైరా మాటలన్నీ అందులో ఉన్నాయి. ఇవి తరతరాల వరకు కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వక్కాణించారు.

    చివరగా "మీకు తెలుసు. మన కంపెనీకి ఆరు సంవత్సరాల క్రితం ఒక విజన్ డాక్యుమెంటు, మిషన్ డాక్యుమెంటు తయారు చేసుకున్నాం. ఐతే దురదృష్టవశాత్తూ ఆ తయారీ ప్రక్రియలో మన డిపార్ట్‌మెంటు పాత్ర అంతగా లేదు. ఈమధ్య జరిగిన వివిధ విభాగ అధిపతుల సమావేశంలో ఆ పత్రాలను తిరిగి రాయాల్సిన అవసరం ఉందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఈసారి ఈ పనిలో మన ప్రమేయం ఎక్కువ ఉండేటట్టు అనిపిస్తోంది. అవసరమైతే పేరొందిన కన్సల్టెంటుల సేవలు తీసుకోవాల్సి రావచ్చు'' అన్నారు. అప్పటివరకూ శ్రోతలు ఎవరూ మాట్లాడాల్సిన అవసరం ఏమీ రాలేదు.

    "అది స్ట్రేటజిక్ ప్లానింగు వాళ్లు చేయవల్సిన పని కదా'' ఒక సెక్షన్ ఆఫీసరు అడిగాడు.

    "ఔను! వారిదే కాని ఛైర్మన్ నన్ను కూడా అసోసియేట్ అవమన్నారు. ఇది మన  డిపార్ట్‌మెంటుకి ఒక కొత్త గుర్తింపు'' కొద్దిగా గర్వంగా చెప్పారు బాస్. ఇద్దరు ప్యూనులు వెడల్పాటి ట్రేలలో పేపరు ప్లేట్లలో సర్ది ఉన్న స్నాక్స్‌ను డెస్క్‌పై పెడుతున్నారు.

    "స్నాక్స్ చూస్తే మీటింగు ప్రాధాన్యత తెలుస్తోంది'' ప్లేట్లో ఉన్న వేయించిన జీడిపప్పు, మినీ సమోసా, గల్ఫ్ ప్రాంతపు ఖర్జూరాలను చూస్తూ నా పక్కనున్న ఆఫీసరు నెమ్మదిగా అన్నాడు.

    "వాళ్ల కంటే బాగా మనమేం చెప్పగలం?'' జీడిపప్పు నోట్లో వేసకుంటూ నా చెవిలో గొణిగాడు సంతోష్.

    "అవసరమైన సమయంలో దీనిమీద పూర్తి స్థాయిలో చర్చిద్దాం.  డిపార్ట్‌మెంటులో అంతర్గత కమిటీని ఒకదాన్ని ఏర్పరుద్దాం'' 
ముగింపుగా అని నావంక చూస్తూ "మీటింగు పూర్తయ్యాక మీరు నా చాంబరుకు ఒకసారి వస్తారా?'' అని అడిగారు సి.ఎఫ్.ఓ.

    ఐదునిమిషాల తర్వాత బాసుతో సమావేశమయ్యాను. "మీరు రేపు కదూ లీవు కావాలన్నది? ఈ రోజు నాకో పని చేసిపెట్టగలరా? లోన్ తిరిగి చెల్లింపుపై మారటోరియం కాలాన్ని పెంచమని కేంద్ర ప్రభుత్వానికి లెటరు పెడదామనుకున్నాం గుర్తుందా? నిన్న ఢిల్లీ ఆఫీసు నుండి ఆ లెటరు త్వరగా పంపమని మెసేజ్ వచ్చింది. అది ఈ రోజు అరేంజి చేయగలరా?'' అడిగారాయన.

    అంతక్రితం రెండు మూడు సార్లు సెంట్రల్ గవర్నమెంటు లోన్ రీ -పేమెంటు మీద చర్చ అయితే జరిగింది కాని దాని పట్ల ఏకాభిప్రాయమైతే రాలేదు. అప్పుడు కూడా ఆయన మా అభిప్రాయాలు రాబట్టడానికే చర్చ పెట్టారు.

    నిజానికి లోన్ తాలూకూ చెల్లింపు వచ్చే నెల నుండి మొదలవ్వాలి. "సార్! మొదటి ఇన్‌స్టాల్‌మెంటు మొత్తాన్ని 'ఫండు ఫ్లో స్టేట్‌మెంటు'లో చూపించాం'' ఆయనకు గుర్తుచేశాను. "నాకు తెలుసు, నాకు తెలుసు'' రెండు సార్లు అన్నారు.

    "సారథీ! మీకు ఐడియా ఉందనుకుంటాను. లోన్ ఇప్పటివరకు మారటోరియంలో ఉంది. దానిపై మనం ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి అప్పును మరికొంత కాలం వాయిదా వెయడం వల్ల సంస్థకి లాభదాయకం. ఓ ప్రొఫెషనల్‌గా మీకీ విషయం నేను చెప్పక్కర్లేదు''

    ఆయన మొహంలోకి చూశాను. ముఖ కవళికల్ని సాధ్యమైనంత ప్రశాంతంగానే పెట్టుకున్నారు. నిన్ననే మానేజిమెంటు ప్రోగ్రాముకు వెళ్లొచ్చారుగా! నేను ఆ అవకాశాన్ని వినియోగించుకో దలుచుకున్నాను.

    "సార్! సంస్థ పునర్నిర్మాణ ప్యాకేజీలో భాగంగా అసలు కొంత రద్దు చేశారు. వడ్డీ కొంత మాఫీ అయ్యింది. మిగతా భాగంపై ఈ మారటోరియంను పదేళ్లనుండీ వాడుకుంటున్నాం. అన్ని రకాల రాయితీలు, కాల విలువను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే మనం చెల్లించేది అసలుకన్నా కూడా తక్కువౌతుంది. ఇప్పుడు చెల్లించేది లెక్కలోకి తీసుకున్నా, ఫండ్ పొజిషన్ కాని, లిక్విడిటీ కాని ఫేవరబుల్‌గానే ఉంటుంది'' వివరంగా చెప్పాను. ఆయనలో ఇంకా ట్రైనింగు తాలూకు యూఫోరియా కొనసాగుతూనే ఉంది. మళ్లీ చిన్నగా నవ్వాడు. "మనం ప్రాక్టికల్‌గా ఉందాం. ఈ మొత్తం గవర్నమెంటుకి బఠాణీలతో సమానం. మనకి మాత్రం గణనీయమైనదే. మనమొకసారి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? వాళ్లని "కాదు'' అని చెప్పనీయండి. మనం అడిగినంతకాలం కాకపోయినా కనీసం రెండు మూడేళ్ళు పెంచినా మనకు మంచిదే. మన  డిపార్ట్‌మెంటు  అచీవ్‌మెంటుగా మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఢిల్లీ ఆఫీసు వాళ్లు దీనికి అవసరమైన గ్రౌండు వర్క్ మినిస్ట్రీలో చేస్తామని చెప్పారు. అంతగా అవసరమైతే ఈ క్రెడిట్‌ను వాళ్లతో షేర్ చేసుకోవచ్చును'' అని కొద్దిసేపు ఆగారు.

    "నిజం చెప్పాలంటే, ప్రైవేటు రంగానికి ఇచ్చిన రాయితీలు లేదా రుణ మాఫీలతో పోలిస్తే మనలాంటి పబ్లిక్ సెక్టారు పొందేది లెక్కించ దగిందేకాదు. మనవైపు నుండి ఐదు సంవత్సరాల పెంపుదల కోసం ఒక ప్రపోజల్ ఛైర్మన్ వరకూ పంపిద్దాం. మినిస్ట్రీకి అడ్రస్ చేస్తూ ఒక డ్రాప్ట్ లెటరు కూడా తయారు చేసి ప్రపోజల్తో పాటు పంపిద్దాం. ప్రపోజల్ ఓకే అయితే లెటర్ మంత్రిత్వశాఖకు పంపిద్దాం'' చేయాల్సిన పనులు చెప్పి బెల్లు కొట్టారు.

    చాలామందితో కంటే బాస్ నాతో కొంతవరకూ 'ఫ్రీ'గానే మూవ్ అవుతారు. నేను చదివొచ్చిన ఇన్స్టిట్యూట్ పట్ల ఆయనకి మంచి అభిప్రాయం ఉంది. అందువల్ల ఆయన 'లైక్ మైండెడ్ పీపుల్' జాబితాలో నేను కూడా ఉన్నాను. నిజానికి ప్రపోజల్ గురించి రెండు నిమిషాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించొచ్చు. నన్ను కాబట్టి కొద్దిగా మాట్లాడనిచ్చి ఆయనకు కావాల్సింది చెప్పారు.

    ప్యూను ట్రేలో టీలు తీసుకువచ్చాడు. ఆయన పక్కన ఉన్న సొరుగులోంచి షుగర్ ఫ్రీ డబ్బా తీశారు. టీ పూర్తవుతుండగా "ఈ రోజు ప్రపోజల్‌ను పంపించి మీరు లీవులో వెళ్లవచ్చు'' అన్నారు.

    డెస్క్ దగ్గరకు తిరిగి వెళుతూ సంతోష్‌ను పిలిచాను. నా అసిస్టెంటుగా మూడేళ్లుగా ఉంటున్నాడు. అతనికి లోను చెల్లింపు విషయంలో కొంత అవగాహన ఉంది. ప్రపోజల్ గురించి అతనికి చెప్పి సైడు రేక్ నుంచి రెండు ఫైల్సు తీసి ఇచ్చాను. ప్రపోజల్‌కి అవసరమైన కేసు సమ్మరీ నా సిస్టంలో ఇదివరకే చేసి ఉంచాను. అది థంబ్ డ్రైవ్లోకి కాపీ చేసి సంతోష్కి ఇస్తూ "ఈ విషయం మీద ఇప్పటికే ఒక ఫైలు నడుస్తోంది. దానినే కొనసాగిస్తూ ప్రపోజల్ తయారుచేద్దాం. ఈ కింది కారణాలవల్ల కంపనీ వాయిదాలు చెల్లించలేని స్థితిలో ఉంది. అంచేత మారటోరియం కాలం మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని కోరుతున్నామని ముగిద్దాం'' అని చెప్పాను.

    "కారణాలుగా ఏం రాయమంటారు?'' చిట్ పాడ్ మీద రాసుకుంటూ అడిగాడు.

    ఈ పని నిజానికి నాకు ఇష్టం లేదు. తీర్చగలిగిన అప్పుకు వాయిదా అడగటం, అదీ కేవలం వడ్డీలేని అప్పు కావటం వల్ల ... దానికి మనకే నచ్చని కారణాలు చెప్పటం ... ఏదో ఆలోచనలో పడ్డాను.

    నేను మాట్లాడకపోవటం గమనించి సంతోష్ తలెత్తి చూశాడు.

    "సంతోష్! నువ్వు జాబ్‌లో చేరకముందట విషయాలు ఫైలు ద్వారా తెలుసుకునే ఉంటావు. పది సంవత్సరాల క్రితం సంస్థ స్థితి అస్సలు బాగాలేదు. ఒక్క పర్ఫార్మెన్స్ సూచికా ఆశావహంగా లేదు. సంస్థ నష్టాలు మూలధనాన్ని మించిపోయాయి. సంస్కరణల్లో భాగంగా ఒక పునర్నిర్మాణ పాకేజీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది. లోన్లో కొంత భాగం మూలధనంగా మార్చబడింది. వడ్డీపై కొంత రాయితీ వచ్చింది. మిగతా మొత్తాన్ని పది సంవత్సరాల తరవాత వాయిదాల పద్ధతిలో పది సంవత్సరాల పాటు చెల్లించాలనుకున్నారు. తర్వాతకాలంలో కంపెనీలో కొంత ఎఫిషియెన్సీ పెరగడం, పారిశ్రామిక వాతావరణంలో, ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పులతో సంస్థ ఆర్ధికంగా బాగా నిలదొక్కుకుంది'' చెప్పాను.

    "మరి ఇలాంటి పరిస్థితిలో తిరిగి చెల్లించడానికి అభ్యంతరం దేనికి?'' సంతోష్ ప్రశ్నించాడు.

    "ఒక విషయం చెప్పనా? మారటోరియం ఒక ప్రణాళికా కాలానికో ఇంకా పైకో పెరగాలని మన బాస్ కేం కోరిక లేదు. రెండు సంవత్సరాలు పెరిగితే చాలు హీ విల్ బి హ్యాపీ''

    "ఎందుకట్లా?''

    "అప్పటికి ఆయన రిటైర్ ఐపోతారు. ఈ సంవత్సరం పి.ఏ.ఆర్ (అప్రైజల్ రిపోర్ట్)లో ఇదో అచీవ్మెంటుగా రాసుకుంటారు. ఇంకో మెట్టు పై పొజిషన్లో రిటైర్ ఔతారు'' చెబుతూ టైం చూశాను.

    "సంతోష్! రీజన్ ఫర్ ఎక్ట్సెన్షన్ అడిగారు కదా. కొత్త వేతన ఒప్పందం వల్ల పెరిగే వేజి బిల్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదలయ్యే శివరామపూర్ ప్రాజెక్ట్‌కు మూలధన అవసరాలు, వచ్చే రెండు మూడు సంవత్సరాలలో మూతబడబోయే ప్రాజెక్టుల వల్ల తగ్గే రాబడి ఈ మూడు రాయండి. వీటికి సంబంధించిన లెక్కలు కేస్ సమ్మరీలో ఉన్నాయి. మీరు డ్రాఫ్ట్ తయారుచేసి తెస్తే, నేను వెరిఫై చేసి బాసు దగ్గరకు తీసుకెళదాం'' చెప్పాను. లంచ్ తరువాత ఒక గంటకల్లా అనుకున్న పని చేసి బాసుకు మెయిల్ చేశాను. అరగంటలో పిలుస్తానన్నారు. అరగంట ఎదురుచూడాలి. ఈ లోపు కాంటిన్లో కాఫీ తాగుదామని సంతోష్‌తోఅన్నాను.

    కాంటీన్ పైఫ్లోరులో ఉంది. ఆఫీసు ఈ కొత్త బిల్డింగుకి మారేక దీన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నడుపుతున్నారు. కొత్త ఫర్నిచరు, నీట్‌గా డ్రస్ చేసుకున్న సర్వర్లు. మూలగా ఉన్న టేబుల్ దగ్గర బైటవైపుకు చూస్తూ కూర్చుని పొడవైన కాగితపు కప్పులో కాఫీ తాగుతున్నాను. దూరంగా, కంపెనీకి సంబంధించిన టౌను షిప్పూ, ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఇళ్లూ, వాటి అవతల పొదలతో, చెట్లతో నిండిన విశాలమైన భూములూ, అపైన కొండలు, మధ్యలో రోడ్డు, రోడ్డు పైన బొగ్గును రవాణా చేస్తూ తిరుగుతున్న పద్దెనిమిది చక్రాల వాహనాలు. కిటికీ అద్దం నుండి టీవీ స్క్రీనులో మూకీ సినిమాలా కనిపిస్తున్నాయి. ఆ రోడ్డు మీదనుండే సాయంత్రం ఊరు వెళ్లాలి. ఊర్లో పొలం కౌలు గురించి మాట్లాడాల్సింది ఉంది. నిరుడు పెట్టిన జీడి మొక్కల్లో మనాదలు ... వీటితో పాటు నేనెప్పటినుండో తీర్చగలిగీ తీర్చకుండా ఉంచేసిన బాకీ ఒకటి మనసుని తొలుస్తోంది. రెండు నిమిషాలు ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. "సర్! ప్రపోజల్ విషయంలో మీరు కాస్త అనీజీగా ఉన్నట్లు అనిపిస్తోంది. సి.ఎఫ్.ఓ ఉద్దేశం ఏదైనా, ఈ రాయితీతో కంపెనీ ఎంతోకొంత లాభపడుతుంది కదా. మీరు అలా ఎందుకు తీసుకోరు?'' కొద్దిగా చొరవ తీసుకుని అన్నాడు సంతోష్.

    చప్పున ఆలోచనల్నిండి బైటకు వచ్చి "కాదు కాదు, ఆ విషయాన్ని నేను విడిగా చూడట్లేదు. బాస్ అనే కాదు. నేను చూసిన చాలామంది సీనియర్ ఆఫీసర్లకి, ఆ మాటకొస్తే మనకి కూడా సంస్థ పట్ల ఒకే ఆలోచనలేదు. సంస్థని నిర్వచించమంటే మన సంఖ్య కన్నా ఎక్కువ నిర్వచనాలు వస్తాయి. అందువల్లే సంస్థ బాగు అనే దానిపట్ల కూడా ఎవరి ఆలోచన వారికుంది. ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు అప్పు వాయిదా వల్ల బెనిఫిట్ వస్తుంది. రేపు వర్క్‌మెన్ నుంచి ఏదైనా అదనపు సౌకర్యం కోసం ప్రపోజల్ వస్తే ఆ లాభాన్ని ఇంతే ఈజీగా దానికి డైవర్ట్ చేయగలరా?'' అన్నాను. సంతోష్ ఏమీ మాట్లాడలేదు. సెల్ ఫోన్లో టైం చూశాను. మెట్లు దిగుతూ ఊరిలో నా స్నేహితుడు జనార్దన్‌కు నా రాక గురించి చెప్పటానికి ఫోన్ చేశాను.

* * *

    నెగడు సన్నగా మండుతోంది. జనార్దన్ పొలంలో బోరింగు షెడ్డు ముందు కొబ్బరి, పామాయిల్ మట్టలతో వేసిన మంట చుట్టూ ప్లాస్టిక్ చెయిర్లలో ఇద్దరం కూర్చుని ఉన్నాం. మోటరు నడుస్తున్న శబ్దం, నీరు తొట్టిలో పడుతున్న శబ్దంతో కలిసి వినిపిస్తోంది. కొద్ది దూరంలో ఉన్న నేషనల్ హైవేపై నడిచే వాహనాల లైట్లు వరస కట్టిన మిణుగురు పురుగుల్లా చెట్ల సందుల్నుంచి కనిపిస్తున్నాయి. మధ్యలో అప్పుడప్పుడు హారన్ల శబ్దం. షెడ్కు ముందు రేకులతో వేసిన పందిరి. పందిరి దగ్గర్లో పార్కు చేయబడిన దుమ్ముపట్టిన కారు దీర్ఘప్రయాణం తర్వాత అలసిన గుర్రంలా కనిపిస్తోంది. టైము పదకొండు కావస్తోంది. పగలల్లా పొలం పనులు, చుట్టాలను కలవడం సరిపోయింది. అప్పటికి రెండు గంటలనుండి ఊరి విషయాలు, స్నేహితుల విషయాలు జనార్దన్తో మాట్లాడుతున్నాను. దగ్గరలో ఉన్న రామాలయం నుండి మైకులో భజన తెరలు తెరలుగా వినిపిస్తోంది. "ఇంతకీ రేపు మాధవరావుని ఎందుకు కలవాలో చెప్పలేదు'' అన్నాడు.

    నిన్న అతనికి ఫోను చేసినపుడు మాదిరెడ్డిపాలెంలో నా స్కూలుమేటు మాధవరావును కలవాలనుకుంటున్నానని చెప్పి ఎల్లుండి ఊరిలో ఉంటాడేమో కనుక్కొమ్మన్నాను. గత పాతికేళ్లలో అనేకసార్లు ఊరు వచ్చి వెళ్లానుగాని అక్కడికి ఐదుమైళ్ల దూరంలో ఉన్న మాదిరెడ్డిపాలెం వెళ్లటంగాని, మాధవరావుని కలిసే ప్రయత్నంగానీ చెయ్యలేదు. ఆ సంగతి జనార్దన్కి తెలుసు. అందుకే "ఏంటి విషయం'' అని అడిగితే "ఒక పాత బాకీ తీర్చాలిలే. తర్వాత వివరంగా చెబుతా'' అని అన్నానప్పుడు. ముందుకి వంగి మంటను కొద్దిగా ఎగదోశాను.

    "నేను ఏడో తరగతిలో ఉన్నపుడు ఏలూరు దగ్గరున్న మా పెద్దమ్మగారి ఊరు వెళ్లాను. మా పెద్దమ్మ కొడుకు అప్పుడు ఇంటరు చదువుతుండేవాడు. ఎన్నో రిలీజో తెలీదు కానీ ఏలూర్లో అల్లూరి సీతారామరాజు సినిమా ఆడుతోంది. ఓ రోజు అన్నయ్య నాకు దొంగచాటుగా రాత్రి ఆ సినిమా చూపించాడు. నాకు సినిమా విపరీతంగా నచ్చేసింది. నా తపన చూసి తను దాచుకున్న ఆ సినిమా పాటల పుస్తకం నాకిచ్చేశాడు. తిరిగి వచ్చాక స్కూలు యానివర్సరీకి 'సీతారామరాజు' నాటకం వేద్దామనుకుని, పచ్చిగా ఉన్న సినిమా జ్ఞాపకాలతో, పుస్తకం సాయంతో మాకు సాధ్యమైనట్టుగా నాటకం రాసేశాం. రాయటంలో సాయపడ్డ రామకృష్ణ తాను సీతారామరాజు వేషం వేసి తీరాల్సిందే అన్నాడు. నేను రూధర్ఫర్డ్ వేషానికి సిద్ధపడ్డాను.

    రూధర్ఫర్డ్ వేషానికి కావాల్సిన బట్టలు టోపీ, బూట్లు వగైరాలు నా దగ్గర ఏమీ లేవు. వాటికోసం వేట మొదలుపెట్టాను. మా క్లాసులో పాంటు ఉన్నవాడు అరువుబట్టల షాపుకారు కొడుకు శివరామమూర్తి ఒక్కడే. వాడికి పబ్లిక్ పరీక్షలో పేపరు చూపిస్తానని ప్రామిస్ చేసి పాంటు, షర్టు ఎరువు ఇవ్వటానికి ఒప్పించాను. టోపీ తేలిగ్గానే దొరికింది. ఇంక కావలసింది బూట్లు. అప్పటిదాకా చెప్పులు కూడా లేని నాకు ఇప్పుడా బూట్లు కావాల్సొచ్చింది. మాదిరెడ్డిపాలెం నుంచి వచ్చే మా క్లాస్ మేటు మాధవరావుకి లేసులతో కట్టుకొనే నల్లరంగు బూట్లు ఉన్నాయని రామకృష్ణ చెప్పాడు. 

    మాధవరావు పెద్దగా చదివేవాడు కాదు. రోడ్డుకి దూరంగా ఉన్న పల్లెటూరునుండి సైకిల్‌కి తెల్ల కేరేజి కట్టుకుని స్కూలుకి వచ్చేవాడు. మా గ్రూపు వాళ్లం ఎవరం వాణ్ణి లెక్కలోకి తీసుకొనేవాళ్లం కాదు. వాణ్ణి బూట్లు అడగటానికి చాలా ప్రిపేరు కావాల్సి వచ్చింది. లంచి టైములో నిద్రగన్నేరు చెట్టు కింద అన్నం తింటున్న వాడి దగ్గరకు వెళ్లి బూట్లు అడిగాను. కొద్ది క్షణాలు నా వంక చూసి "నాటకం అయిన తెల్లారే బాగా పాలిష్ చేయించి ఇవ్వాలి. సరే అంటే నాటకం రోజు తీసుకొచ్చి ఇస్తాను'' అన్నాడు. సరే అన్నాను.

    యానివర్సరీ రోజు మా నాటకం అందర్నీ ఆకర్షించింది. నన్ను అంతవరకు ఎప్పుడూ మెచ్చుకోని లక్ష్మయ్య మాస్టారు కూడా స్టేజీ వెనకాల బట్టలు మార్చుకుంటుంటే దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేసి "రూధర్ఫర్డ్‌గా బాగున్నావోయ్'' అన్నారు. నా ఆనందానికి అంతులేదు. పాంటు, షర్టు విడిచేసరికి శివరామమూర్తి వచ్చి ఉన్నాడు. వాడి బట్టలు వాడికిచ్చేశాను. మాధవరావుకి బూట్లు పాలిష్ చేయించి రేపు తిరిగి ఇవ్వాలి. బూట్లు కాళ్లకి ఉంచుకొనే మిగతా ప్రోగ్రాములు చూసి పొద్దు పోయాక ఇంటికి వెళ్లాను. తడికకు ఉన్న తాడు విప్పుతుంటే 'భౌ భౌ' అంటూ అరుస్తూ తడిక దగ్గరకు వచ్చి నన్ను చూసి తోకాడిస్తూ నించుంది మోతీ. ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా బలవంతంగా దాన్ని ఆరునెలల క్రితం మాట్లు వేసే వాళ్ల దగ్గర నుండి తెచ్చాను. చలి కాలం కావడంతో ఆరుబైట ఎవరూ పడుకోలేదు. వసారాలో ఒకవైపు మా నాన్న. మేనత్త మంచంలో కదులుతూ "ఎవరూ?'' అనడిగింది. నేనే అని చెబుతూ వసారాలో గుమ్మం పక్క బూట్లు వదిలి వాసన వస్తున్న సాక్సు వూడదీసి బూట్లలో కుక్కి లోపలికి వెళ్లి పడుకున్నాను. చలికి మోరలెత్తి కుక్కలు అరుస్తున్నాయి.

    ఉదయం చీపురు శబ్దానికి మెలకువ వచ్చింది. వసారా ఊడుస్తూ అమ్మ "ఛీ పాడు కుక్క. చెప్పులెత్తుకెళ్లి ఎక్కడెక్కడో పెడుతుంది'' అంటూ తిడుతోంది. చెప్పులు అనే మాటకి దిగ్గున లేచి బైటకి పరిగెత్తాను. గుమ్మం పక్క ఒక బూటు మాత్రమే కనపడుతోంది. అదిరిపడి తలతిప్పి చూస్తే తడికకి ఎడమ పక్క దడి దగ్గర బోర్ల పడేసి ఉన్న రెండో బూటు కనపడింది. పరిగెత్తుకుంటూ వెళ్లి తీసాను. గొంతులో గుటక పడలేదు. ఎదురుగా చూస్తే కుడితి తొట్టి పక్కన నిలుచుని నా వంకే చూస్తున్న మోతీ కనిపించింది. కుడి కాలి బూటుతో రాత్రంతా ఆడుకున్నట్టుంది. లేసులు కట్టే చోట ఉన్న నాలికను సగానికి పైగా కొరికేసింది. బూటుకి ముందు భాగంలో బొటనవేలు ఆనేచోట చిన్న కన్నం చేసింది.

    బాధతో ఉక్రోషం తన్నుకు రాగా "నియ్యమ్మ'' అని తిడుతూ బూటు మోతీ మీదకు గిరాటు వేశాను. పక్కకు తిరిగి పారిపోయింది. ఏడుస్తూ వెళ్లి ఆ బూటు తీసుకుని పందిట్లోకి వచ్చాను. ఆ రోజు బూట్లు వాపసు ఇవ్వాలి. అదీ పాలిష్ చేయించి. పాలిష్కి అవసరమైన డబ్బు నా దగ్గరవుంది. కాని ఆ బూట్లు మాధవరావైతే వెనక్కి తీసుకోడు. ఏమి చెయ్యాలి. ఎంతకీ ఏమీ తోచట్లేదు. కొత్త బూట్లు కొనాలంటే ముప్పై రూపాయల పైనే కావాలి. ముప్పై రూపాయలు. పరీక్ష ఫీజు ఏడు రూపాయలే. అవే ఆఖరి తేదీ వరకు చేతికి రాలేదు. బూట్లు కొనడం అసాధ్యం. ఏమీ పాలు పోవడం లేదు. ఇవాళ గడిస్తే రేపు ఆదివారం. ఆలోచించుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. స్కూలుకు వెళ్లేటప్పుడు బూట్లు సంచిలో వేసుకుని తీసుకెళ్లాను. సిద్దయ్య చెప్పులు కుట్టే షాపు దగ్గర ఆగాను. బూట్లు తీసి చూపెట్టి "రిపేరు చేయడం కుదురుద్దా'' అని అడిగాను. బూటుని పట్టుకుని చూశాడు. "కొరికిన ఆనమాలు లేకుండా కుట్టాలి'' అన్నాను. తలూపాడు. "సాయంత్రానికల్లా కావాలి''. సిద్దయ్య ఏమీ మాట్లాడలేదు. "ఎంతవ్వుద్ది?'' అడిగాను. "రూపాయి అవ్వుద్ది'' అన్నాడు.

    అక్కడనుండి స్కూల్లో లైబ్రరీ రూంకి వెళ్లాను. మూడో బెల్లు అయ్యేంత వరకూ అక్కడే కూర్చుని అందరూ క్లాసు రూముల్లోకి వెళ్లాక క్లాసుకు వెళ్లాను. ఆ రోజు మొత్తం మాధవరావుకి కనపడకుండా తప్పించుకు తిరిగి స్కూల్ బెల్లు అవుతూనే సిద్దయ్య దగ్గరకు వెళ్లిపోయాను. అప్పటికి బూటు కుట్టడం పూర్తి చేసి పాలిషు పెడుతున్నాడు. బూటును చూశాను. లేసు దగ్గర నాలిక కొంతవరకు పర్వాలేదు. ముందు భాగంలో మాత్రం చిరుగు చొక్కామీద మాసిక వేసినట్టు కుట్లు కనబడుతున్నాయి. మాధవరావు ఏ మాత్రం వాటిని తీసుకుంటాడని అనిపించలేదు. రూపాయి సిద్దయ్య చేతిలో పెట్టి బూట్లతో ఇంటికి వెళ్లాను.

    ఏ పని చేస్తున్నా అనుక్షణం బూట్ల ధ్యాసే. వాటిని వెనక్కి ఎలా ఇవ్వాలి? సమస్య ఎవరికీ చెప్పుకోలేక పోతున్నాను. ఏమైనా చెప్పగలిగితే అక్కలకి మాత్రమే. వాళ్లు సానుభూతి చూపించగలరంతే. సోమవారం దాకా మాధవరావుకి దొరక్కుండా గడిపాను. సోమవారం నన్ను దొరకబట్టాడు. "బూట్లు పాలిషుకిచ్చా రేపు తీసుకు వస్తా'' అని చెప్పాను. మర్నాడు ఉదయం మళ్లా దొరికాను. "సాయంత్రం నువ్వు ఇంటికెళ్లేటప్పుడు మా ఇంటికాడ ఇస్తాను. తీసుకుపోదువుగాని'' అన్నాను. మాధవరావు కొద్దిగా అనుమానంగా చూశాడు. "మాస్టరు క్లాసుకొచ్చారు'' అంటూ ఇవతలకి వచ్చేశాను.

    సాయంత్రం సైకిలుతో స్కూలు గేటు దగ్గర నాకోసం నిలుచున్నాడు. తప్పనిసరై అతని సైకిలు ఎక్కాను. ఇంటికి వచ్చేంతవరకూ ఏమీ మాట్లాడలేదు. మా ఇంటికి దగ్గర్లోని కరెంటు స్తంభం దగ్గర సైకిలు ఆపి అక్కడ నుంచోమని లోపలికెళ్లాను. బూట్లు పేపర్లో చుట్టి సైకిల్ దగ్గరకొచ్చాను. పేపర్లో చుట్టిన బూట్లు సైకిల్ కేరేజీకి పెట్టి "మా అమ్మ పిలుస్తోంది. అమ్మా వస్తున్నా'' అంటూ లోపల్నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా ఇంట్లోకి పారిపోయాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒక నిమిషం గడిచేలోగానే మాధవరావు వాకిట్లోకి వచ్చి బూట్లు నేలమీద పారేసి నన్ను పిలిచాడు. నేను లోపలే నిలుచున్నా. ఒక నిమిషం ఎదురు చూసి బైటకి వెళ్లిపోయాడు. నెమ్మదిగా బైటకు వచ్చాను.

    కాని ఆ తెల్లారి స్కూల్లో దొరికిపోయాను. "నాకా కొరికేసిన బూట్లు వద్దు. కొత్తవన్నా కొనియ్యి. లేకపోతే డబ్బన్నా ఇవ్వు'' అని గట్టిగా అడిగాడు. మాట్లాడకుండా తలూపాను. "ఎప్పుడిస్తావ్?'' అన్నాడు గట్టిగా. "నెల్లోపులో ఇస్తా''నన్నాను. నెల ఎంతలోకి తిరిగొస్తుంది. నెల దాటంగానే కథ మళ్లీ మొదలు. రోజంతా అతన్ని తప్పించుకు తిరగడం మీదే నా దృష్టి.

    కొన్ని రోజులు వాయిదాలతో గడిచాక నాకో గట్టి వార్నింగు ఇచ్చాడు. "వారంలోగా తేకపోతే మా నాన్నని తీసుకొచ్చి మీ నాన్నని అడిగిస్తాను'' అన్నాడు. నాకు మరింత భయం, దుఃఖం కలిగాయి. ఏం చేయాలో తోచలేదు. నాన్నకి చెబుదామా అని మళ్లీ ఆలోచించి విరమించుకున్నాను. వారం అయ్యాక రోజురోజుకి నాలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. ఐతే అతను నన్ను అడగడం ఆపేశాడు. ప్రతిరోజూ సాయంత్రం నాన్న బూట్ల గురించి ఏమైనా మాట్లాడతాడేమోనని చూస్తుండేవాడిని. కొన్ని రోజులకు అలవాటయ్యి, కంగారు కొంత తగ్గింది. మాధవరావుకి నేను మొహం చాటేస్తూ తిరుగుతున్నాను. కారణం తెలీదు కానీ అతను కూడా నన్ను తరమటం ఆపేశాడు.

    ఏదో తప్పు చేసిన భావం. తెలియకుండానే నాలో వేగం తగ్గిపోయింది. ఆ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు. మెల్లగా చదువులో పడిపోయాను. పరీక్షలైపోయాయి.

    వేసవి సెలవుల్లో ఏదోవిధంగా బూట్లకి కావాల్సిన డబ్బులు పోగుచేయాలనుకున్నా. సంతలో మట్టి డిబ్బీ ఒకటి కొన్నాను. సెలవుల్లో చేతికి వచ్చిన పైసలల్లా డిబ్బీలో వేశాను. పరీక్ష రిజల్టు వచ్చింది. నేను ఊహించినట్టే మంచి మార్కులు వచ్చాయి. చాలామందితో పాటు మాధవరావు కూడా ఫెయిల్ అయ్యాడు. స్కూలు తెరిచారు. మాధవరావు స్కూల్లో కనపడటం లేదు. కొద్ది రోజులు గడిచాక ఆ వూరి స్టూడెంటు ఒకతన్ని అడిగితే మాధవరావు స్కూలు మానేశాడని చెప్పాడు.

    ఇది జరిగి ముప్పైయ్యేళ్లు దాటింది. అప్పటినుండీ ఇప్పటిదాకా మాధవరావుని చూడలేదు. ఐతే చాలాసార్లు ముఖ్యంగా షూస్ కొనే ప్రతీసారీ అతనికి నేను బాకీ ఉన్న సంగతి గుర్తు వస్తూంటుంది'' చెప్పటం ఆపాను.

    జనార్దన్ శ్రద్ధగా విన్నాడు. "రేపు మాధవరావుని కలిసి ఏమి చేయబోతున్నావ్?'' జనార్ధన్ అన్నాడు. "ఏమి మాట్లాడాలన్నది ఇంకా అనుకోలేదు. అప్పటి సందర్భాన్ని బట్టి'' చెప్పి అతని వంక చూశాను.

    తర్వాత కొద్దిసేపు వేరే విషయాలు మాట్లాడుకుని నిద్రపోయాం.

* * *

    ఉదయం ఎనిమిదిన్నరకు మాదిరెడ్డిపాలెం బయలుదేరాం. మాధవరావుకి జనార్దన్ ఫోన్ చేసి మా రాకను గుర్తు చేశాడు. ముప్పైయేళ్ల తర్వాత కలవబోతున్న బాల్యమిత్రుణ్ణి (!) ఫోనులోగాక నేరుగానే పలకరించాలని అనుకున్నాను. అప్పటిదాకా మాధవరావు ఎప్పుడు గుర్తుకొచ్చినా స్కూల్లో అతని ఉనికే రూపుకట్టేది. ఇవ్వాళ మాత్రం అతను ఎలా ఉంటాడో అని ఊహించసాగాను. జుట్టు నెరిసి ఉంటుందా, పలచబడి ఉంటుందా? జనార్దన్ కారుని డ్రైవ్ చేస్తూ రోడ్డు వెడల్పు చేయడానికి పడగొట్టబడ్డ మా చిన్నప్పటి మహావృక్షాల గురించి నాకు గుర్తు చేస్తున్నాడు. రకరకాల వాహనాలతో రోడ్డంతా రద్దీగా ఉంది. మా స్కూలు రోజుల్లో సింగిల్ రోడ్డుగా ఉన్న ఆ దారి మీద రాత్రుళ్లు మా స్నేహబృందం పడుకుని సినిమా కబుర్లు చెప్పుకునేది. పదినిమిషాలు, పావుగంటకి ఒక వాహనం వస్తే ఆ శబ్దానికి రోడ్డు మీదనుంచి లేచేవాళ్లం. పెద్దమాను, ఎదురుమెరక, ముసలమ్మ పుంత మొదలైన లాండుమార్కులు ఉండేవి. ఇప్పుడు అలాంటి పాత బండ గుర్తులేవీ లేవు. వంద అడుగుల వెడల్పుతో నల్ల తివాచీ పరచినట్టు ఎత్తుపల్లాలు లేకుండా వంకర్లు కూడా లేకుండా ఏక రహదారి తయారైంది.

    ఇంతలో కారు స్లో అయ్యి కుడి వైపు ఉన్న చిన్న రోడ్డులోకి తిరిగింది. రోడ్డు చిన్నదేకాని బాగుంది. పామాయిల్ తోటలు, చెరుకు తోటల మధ్యగా రెండు కి.మీ. ప్రయాణం చేసి ఊర్లోకి ప్రవేశించాం. తారు రోడ్డు నుంచి సిమెంటు రోడ్డులోకి మారి విశాలమైన వాకిలి ఉన్న ఒక డాబా ఇంటిముందు కారు ఆపి దిగాం. డాబా ఇంటిముందు ఉన్న సిమెంటు రేకుల పందిరికింద ట్రాక్టరు ఆపి ఉంది. ఇద్దరు వ్యక్తులు పందిట్లో ఏదో పనిలో ఉన్నారు. వాళ్లలో మాధవరావు లేడు. అప్పుడే ఇంటి గుమ్మంలోంచి కర్టెను తొలగించుకుంటూ తెల్ల లుంగీ పైకి కట్టుకుని, తెల్లచొక్కాతో మాధవరావు బయటకి వస్తున్నాడు. మనిషి కొద్దిగా రంగు తగ్గాడు. గిరజాల జుట్టు పలచబడింది. జుట్టు మొదళ్లలో కొద్దిగా తెల్లగా ఉంది. మరీ ఒళ్లు చేయలేదు. మెట్లమీదనుంచి దిగుతూనే "రా ... రా ... ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి'' అంటూ చెయ్యి చాపాడు. ఎవర్నో కేకేసి కుర్చీలు తెప్పించి మమ్మల్ని కూర్చోబెట్టాడు. తనూ కూర్చుని గుమ్మంలోకి చూస్తూ "ఏరా, ఇక్కడికి మంచినీళ్లు పట్రా. అమ్మని టీ పెట్టమను'' అని నావైపు తిరిగాడు. ముప్పై ఏళ్ల తర్వాత క్లాసుమేటును తిరిగి చూస్తున్నందుకు అతని మొహంలోనూ ఎక్సైటుమెంటు కనిపిస్తోంది.

    "హైదరాబాదు దగ్గర్లో గవర్నమెంటు కంపెనీలో పనిచేస్తున్నావని విన్నాను. నేను బడి మానేసాక మన క్లాసుమేట్లతో పెద్దగా సంబంధాలు లేవు'' అన్నాడు. టీ తాగుతూ కొద్దిసేపు ఇద్దరికీ కామన్‌గా తెలిసినవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. జనార్దన్‌కి మాధవరావుకి పరిచయం బానే ఉంది. కొద్దిసేపు ఆస్తిపాస్తుల వివరాలు మాట్లాడుకున్నాం. తన వాటా పొలం, భార్యవైపు అన్నీ కలిసి పాతికెకరాల వ్యవసాయం చేస్తున్నాడట. తల్లి చనిపోయింది. తండ్రి తనతోనే ఉంటున్నాడు. భార్య తండ్రికి మేనకోడలే.
"జనార్దను నువ్వు వస్తావని చెప్పినప్పుడు ఎందుకా అనుకొన్నాను. పిల్లల పెళ్లి వయసూ కాదు. సరే వచ్చాకైనా చెబుతావు కదా అని ఊరుకున్నా'' అంటూ నా రాకకు కారణం అడక్కుండానే అడిగాడు.

    ఒకసారి మొహంలోకి చూసి చెప్పాను. "నీకు గుర్తుండే ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు నీ బూట్లు తీసుకుని పాడు చేసి వాపసు ఇవ్వలేదు'' చప్పుడవుతున్న గేటువంక తల తిప్పి చూస్తూ "ఆ ... చాలా కాలమయ్యిందిగా. అయినా గుర్తుంది'' అన్నాడు.

    నెమ్మదిగా గేటు తీసి సుమారు డెబ్భైఏళ్ల వయసున్న ఒక పెద్దాయన లోపలికి వస్తున్నాడు. వెనక్కి దువ్విన ఓ మాదిరి పొడుగ్గా ఉన్న తెల్ల జుట్టు, పలుచని శరీరం, భుజాల దగ్గరదాకా మడతపెట్టబడ్డ తెల్ల ఖద్దరుచొక్కా, రెండు పొరలుగా లుంగీలా కట్టుకున్న పంచె. అప్పుడే గడ్డం గీయించుకొస్తున్నట్టున్నాడు. "ఇంటికి కార్లో ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరంట?'' అని అడుగుతూ కళ్లజోడులోంచి నా వైపు చూశాడు. "వచ్చింది ఈయనేలే. గుడిచెర్లలో ఘంటావాళ్ల అబ్బాయి. వాళ్ల నాన్న నీకు తెలుసులే'' అన్నాడు. ఆయన హఠాత్తుగా ఆగిపోయి "ఘంటా కృష్ణమూర్తి కొడుకంటావా?'' అన్నాడు. నేను ఔనన్నాను."ఆగాగు కాళ్లు కడుక్కొస్తాను'' అంటూ పెరట్లోకి వెళ్లాడాయన.

    అంతకుముందు ప్రస్తావన మళ్లీ మొదలుపెట్టాను. "బూట్ల గురించి అప్పుడు నువ్వు హఠాత్తుగా అడగడం ఎందుకు మానేశావో నాకు అర్థం కాలేదు. నిజానికి నేను ఇక్కడికి వచ్చింది అది తెలుసుకుని, సమాధానం చెప్పాలనే'' ఎప్పటినుంచో లోలోపలున్న సంజాయిషీ బయటకు వస్తోంది.

    మాధవరావు వెనక్కి ఆలోచించుకుంటున్నాడు. "ఆ రోజు నీతో అన్నాను కదా, మా నాన్నతో చెప్పి మీ నాన్న దగ్గరకి తీసుకువస్తానని. ఇంటికి వచ్చి నాన్నతో చెబితే ఎవరబ్బాయి అని అడిగాడు. మీ నాన్నపేరు చెప్పాను. ఏమనుకున్నాడో తెలీదు. సర్లే ఇంక అతన్ని ఏమీ అడక్కు అన్నాడు. అందుకే మళ్లీ నిన్ను అడగలేదు'' అన్నాడు.

    ఈ లోపున పెద్దాయన తుండుతో మొహం తుడుచుకుంటూ వచ్చి మా దగ్గర కూర్చున్నాడు. "నేను చదువుకొనే రోజుల్లో బూట్ల గురించి అడగమంటే వద్దన్నావు గుర్తుందా? ఇప్పుడు ఆ బాకీ తీరుస్తానని వచ్చాడు'' కొద్దిగా హాస్యం కలిపి చెప్పాడు మాధవరావు. ఆయన మా దగ్గరగా కూర్చుని నా వివరాలు, మిగతా కుటుంబ సభ్యుల గురించీ అడిగి తెలుసుకున్నాడు.

    "మీ నాన్న నాకు బాగా తెలుసబ్బాయ్. దూరపు బంధుత్వం కూడా ఉంది. కాని పెద్దగా రాకపోకల్లేవు. మేము అప్పుడప్పుడూ ఎల్.ఎం.బీ బాంకి దగ్గరా, కరెంటు ఆఫీసు దగ్గరా కలిసే వాళ్లం. ఒకసారి బోరు గురించో మరేదో అవసరమో గుర్తులేదు గానీ మా ఊరి షావుకారు దగ్గర మీ నాన్నకి అప్పు ఇప్పించాను. నిజానికి ఎల్.ఎం.బీ బాంకి వడ్డీ కన్నా షావుకారు దగ్గర వడ్డీ చాలా ఎక్కువ. బాంకిలో ఇంకొంచెం అప్పు దొరికేదే కాని, పొలంలో ఇంకో బోరు వేసినట్టు దరఖాస్తు పెట్టుకొమ్మని, బాంకి వాళ్లు తనిఖీకి వచ్చినప్పుడు పదడుగుల గొయ్యి తవ్వి, నాలుగంగుళాల గొట్టం పాతి చూపెడితే చాలు మానేజి చెయ్యవచ్చని బాంకిలో పనిచేసే మీ చుట్టం ఒకాయన సలహా ఇచ్చాడు కూడా. మరి దానికి ఇష్టంలేకో, రిస్కు ఎందుకనుకున్నాడో షావుకారు దగ్గరే నోటు రాసి అప్పు తీసుకున్నాడు. అప్పుడే తనకి ఉన్న బాంకి లోన్, గొల్లగూడెం షావుకారు దగ్గర కూడా అప్పు ఉందన్న సంగతి నాకు చెప్పాడు. ప్రామిసరీ నోటుమీద నేనే సాక్షి సంతకం పెట్టాను.

    అప్పటికింకా డ్రిల్లు బోరు స్కీము గవర్నమెంటు పెట్టలా. అవసరమున్న రైతులు సొంతంగా బోరు వేయించుకోవటమే. బోర్లు వెయ్యటానిక్కూడా మిషన్లు లేవు. మోటుగా మనుషుల్తో వేయించటమే. నా ఎరుకలో ఈ అప్లాండు ఏరియాలో బోర్లు పేరు మీద చితికిపోయిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలా చాలామంది దెబ్బ తిన్నాక వెంగళరావు టైములో అనుకుంటా పక్కన ఉన్న ఖమ్మంజిల్లాతో పాటు ఇటు కూడా డ్రిల్లు బోరు స్కీము కింద ఉమ్మడి బోర్లు వేశారు. అప్పు ఇచ్చిన ఏడెనిమిది నెలలకు కాబోలు మా ఊరి షావుకారి ఇల్లు తగలబడిపోయింది. దాంతో పాటు మీ నాన్న రాసిన నోటు కూడా కాలిపోయింది. కొత్త ప్రోనోటు రాయించమని షావుకారు నన్నడిగేవాడు. కొన్ని రోజుల తర్వాత సమితి ఆఫీసులో మీ నాన్న కలిశాడు. 

    నోటు కాలిపోవడం, ఇంకో నోటు రాయించమని షావుకారు అడగడం చెప్పాను. ఇద్దరం కలిసి మా ఇంటికి వచ్చాం. షావుకారుని పిలిపించి తేదీలు, అసలు వివరాలు కనుక్కుని కొత్తనోటు రాసి ఇచ్చాడు. నిజానికి నోటు రాయనన్నా చేయగలిగింది లేదు. అప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయనకు అదొక అవకాశమే. అయితే ఇప్పట్లాగా అప్పుడు బాంకి రుణాలు, వడ్డీలు మాఫీ చేయడం లేవు. అలాంటివి ఊహకి కూడా అందేవికావు. రెండేళ్ల క్రితం స్థోమత ఉండి అప్పు, వడ్డీ కట్టకుండా మాఫీతో లాభం పొందినోళ్లు ఎందరో '' అని కొడుకుని చూపిస్తూ "ఇదిగో వీడే రెండు లక్షలదాకా మిగుల్చుకున్నాడు'' కొద్దిగా నిష్ఠూరపు గొంతుతో అన్నాడు.

    "సరే, అలా నోటు రాసిన కొద్ది రోజుల్లోనే మీ బూట్ల తగువు నా దగ్గరకొచ్చింది. ఆ స్థితిలో మీ నాన్న దగ్గరకొచ్చి ఈ విషయం అడగ్గలనంటావా.'' అన్నాడాయన. కొద్దిగా ఆగి "మీ నాన్న కళ్లు ఎప్పుడూ తడిగా ఉన్నట్టుండేవి. అది గనక దుఃఖమై ఉంటే అది అనేకమంది తరపున ఆయన భరిస్తున్నట్టే'' చెప్పాడు.

    ఒక మనిషి కష్టనష్టాలు, సుఖదుఃఖాలు అతని స్వయంకృతాలే అనేమాట అన్నిసార్లూ నిజం కాదు. డ్రిల్లు బోరు స్కీము కొంతకాలం ముం దొస్తే ఒకతరం రైతుల యాతన, దుఃఖం తగ్గి ఉండేవి. రెండు మూడు రూపాయల వడ్డీకి తెచ్చి కరెంటు బిల్లులు కట్టిన రోజులున్నాయి. ఇప్పుడు కట్టగల స్థితిలో ఉన్నా కట్టాల్సిన అవసరం లేదు. మీ నాన్న లెక్కల్లో మనిషని నేను పైపై మాటగా అనటం లేదు. ఆయనపోయి ఇరవై ఏళ్లు దాటిందా? అయినా నాకు గుర్తే. అన్ని ఇబ్బందుల్లో ఉండీ మనిషి బెసకలేదు. నాకనిపిస్తుంది. అతనేవో కొన్ని పద్ధతుల్లాంటివి పెట్టుకుని బతికినన్ని రోజులు వాటిని అంటి పెట్టుకునే ఉన్నాడు. నువ్వు ఇన్ని రోజుల తర్వాతైనా వచ్చి ఎప్పటిదో చిన్న బాకీ లాంటిదాన్ని గుర్తుచేసుకున్నావంటే నాకు చాలా సంతోషం. ఈ పేరుతోనన్నా నిన్ను చూశాను. నిన్ను చూస్తే మీ నాన్నని చూసినట్టే ఉంది'' పెద్దాయన కంఠం రుద్ధమైంది. కళ్లు తడిశాయి.

    "ఆ బాకీ ఒక్క డబ్బుతోనే నేను తీర్చదలుచుకుంటే చాలాకాలం కిందే ఎవరితోనైనా పంపించేవాడ్ని. కాని ఎదురు పడటానికి ఏదో జంకు, మొహం చెల్లకపోవటం. అది డబ్బుతో తీర్చేది కాదు. క్షమాపణ లాంటి దానితో తీర్చాలనుకుని, ఆ ధైర్యాన్ని ఇప్పటికి సంపాదించి ఇక్కడికి వచ్చాను'' నేను నిజంగా అనుకుంటున్నదే చెప్పి, మాధవరావు వంక తిరిగి కుడి చేతిని అతని చెయ్యిమీద వేసి ఆపైన ఏమి మాట్లాడాలో తెలీక అతని మొహంలోకి చూశాను. ఏ మాత్రం ఊహించని ఈ పరిస్థితికి అతను కొద్దిగా ఇబ్బంది పడ్డట్టున్నాడు. వెంటనే నా చేతిని రెండు చేతుల్తో గట్టిగా ఒత్తి "బలేవాడివి సారథీ. చిన్న విషయాన్ని పెద్దది చేయకు. ఇక ఈ విషయం మరచిపో'' అన్నాడు.

    కుర్చీలో కొద్దిగా వెనక్కివాలి తలెత్తి ఎదురుగా ఉన్న గోడ మీద ఉన్న బ్లాక్ అండ్ వైటు ఫోటోలు చూశాను. సింహద్వారంపైన పంచె, కండువాతో కుర్చీలో కూర్చొని ఉన్న ఒక మధ్యవయస్కుడి ఫోటోకి దండ వేసి ఉంది. బహుశా అది మాధవరావు తాతదై ఉండవచ్చు. దానికి కొద్దిగా కింద పాతకాలపు రాజకీయ నాయకుడు, గాంధేయవాది మూర్తిరాజుగారితో మాధవరావు తండ్రి కలిసి దిగిన ఫోటో ఉంది.

    మేము బయలుదేరదామనుకుంటే మాధవరావు బలవంతంగా భోజనానికి ఆపేశాడు. భోజనాలయ్యాక తండ్రీకొడుకులు గేటు వరకూ వచ్చి వీడ్కోలు చెప్పారు. వచ్చిన పని అయ్యింది. మనసు ఉతికిన బట్టలా తేలిక అయ్యింది. దానితో పాటే గజిబిజిగా ఉన్న కొన్ని పాత విషయాల పట్ల క్లారిటీ వచ్చింది. "కుటుంబాలనండి, వంశాలనండి వాటికంటూ ఒక ధారలాంటిది ఉంటుంది. ఒకతరం వాళ్లు పొందిన జ్ఞానాన్ని రెండోతరం వాళ్లు అందుకోగల్గాలి. కాలంతో పాటు విలువలు మారుతూనే ఉంటాయి. కొన్ని మారి తీరాలి. ఐతే మారకూడని విలువలు కూడా ఉంటాయి'' ఆయన ఏ పదాలతో చెప్పినా నాకు అర్థమైన సారాంశమిది. కుటుంబాలకు కూడా రాయబడని విజన్, మిషన్ డాక్యుమెంట్లు ఉంటాయని అర్థమైంది. ఈ మారకూడని విలువలు, మొన్న ఆఫీసులో చర్చించిన కోర్ వాల్యూసూ ఒకటే అనిపించింది. ఎటొచ్చీ ఒకచోట అమలవుతాయి, ఒకచోట కావు. హైవే మీదకు వచ్చింది కారు. కూలిపోయిన లాండుమార్కుల పట్ల వెళ్లేటప్పుడు లోలోపల ఉన్న దిగుల్లాంటిది ఇప్పుడు లేదు. చెరపరాని అక్షాంశాలు, రేఖాంశాలు పరిసరాల్ని గుర్తుపట్టటానికి మనతో ఉంటూనే ఉంటాయి.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 8 మే 2011 సంచికలో ప్రచురితం)

Comments