రూబీ ఐ లవ్యూ - చిత్తర్వు మధు


    మే నెల ప్రొద్దుట ఎండ వేడెక్కి రోడ్లు ఎనిమిది గంటలకే తళతళలాడుతూ మెరిసిపోతున్నాయి.

    రోడ్డు మీద ఇంకా జనవాహన సంచారం అంతగా మొదలవలేదు. గాంధీనగర్ చౌరాస్తాలో పదిమంది ఒడ్డూ పొడుగూ ఉన్న వ్యక్తులు నిలుచుని ఉన్నారు.

    కొందరి చేతుల్లో ఇళ్ళు శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్స్, కొందరి చేతుల్లో రంగులు వేసే బ్రష్లూ, కొందరి చేతుల్లో ఇలాంటివే మరికొన్ని పరికరాలూ ఉన్నాయి.

    రోడ్డుమీద ఒకటో రెండో కార్లు అటూ ఇటూ వేగంగా కదుల్తున్నప్పుడు వాళ్ళు వాటికేసి చేస్తున్నారు. వారిలో భావమూ లేదు. పనికోసం ఆదుర్దా లేదు.

    బూడిదరంగులో ఉన్న జీన్స్లాంటి పాంట్లు, టీ షర్ట్లు, కొందరి తలలకి నలుపురంగు టోపీలు, ఒకరిద్దరికి ఎర్రటి గిరజాల జుట్టూ ఉన్నాయి

    వాళ్ళని చూస్తే పనికోసం నిలబడ్డ కూలీలలాగా తోస్తుంది. కానీ ఆధునికంగా ఉన్నారు.

    గాంధీనగర్ చౌరాస్తా రోజు కూలీలు పనికోసం నిలబడే స్థలం. ఒకప్పుడు 'అడ్డా' అనేవారు. వందల సంవత్సరాలుగా అంతే!

    కాని ఇది 2052...

    మారిన హైద్రాబాద్ నగరం. గాంధీనగర్ చౌరస్తాలో అడ్డా మాత్రం మారలేదు.

    ఒకటే మారింది.

    వాళ్ళు కూలీలు కాదు. కూలి కోసం నిల్చోబెట్టిన రోబోలు..!

* * *

    పదిమంది ఏండ్రాయిడ్ రోబోలకి యజమాని నీలకంఠం దూరంగా ఒక .సీ. టీ షాపులో అద్దాల వెనక బన్ తిని చాయ్ తాగుతున్నాడు. దశాబ్దాలు గడిచిపోయినా బన్, చాయ్ మారలేదు. కానీ లేబర్ పద్ధతి మారింది.

    పైకి మనుష్యులలా కనిపించినా లోపల యంత్రాలు అవి. బయట చర్మాలూ, జుట్టూ, కీళ్ళు, కొద్దిగా మానవుల మెదడు 'ట్రాన్స్ప్లాంట్' చేయబడి, ఎక్కువభాగం యంత్రాలతో పనిచేసే 'మరమనుషులు'.

    ఏండ్రాయిడ్ బయోనిక్ రోబోలు అంటారు వాటిని. అంటే మగ ఆకారంలోనికివి.

    స్త్రీ ఆకారంలోవి కూడా ఉన్నాయి. గైనాయిడ్ రోబోలు!

    ఇంకా పెంచుకునే కుక్కపిల్లలాంటి జంతు ఆకారంలో 'ఏనిమాయిడ్'రోబోలు కూడా మార్కెటులో దొరుకుతున్నాయి.

    అన్ని పనులకీ ఇంట్లో నౌకరుల్లా పెట్టుకోవచ్చు. పెట్స్లా పెంచుకోవచ్చు. అద్దెకి తెచ్చుకోవచ్చు. లేదా కొనుక్కోవచ్చు.

    నీలకంఠం బొంబాయినుంచి సెకండ్ హ్యాండ్ ఏండ్రాయిడ్ రోబోలని హోల్సేల్లో కొని తెచ్చి గాంధీనగర్ అడ్డాలో అద్దెకిస్తుంటాడు.

    ఇళ్ళల్లో పనులకైనా ఇస్తాడు రోజు కూలీ మీద. గోడకి సున్నం వేయడం, ఇల్లు శుభ్రం చేయడం, టాయిలెట్లు  క్లీనింగ్ చేయడం, స్విమ్మింగ్ పూల్స్ శుభ్రం, ఇంటికి రంగులు, గార్డెనింగ్... ఇలా పని అయినా అవి చేస్తాయి. ప్రోగ్రాంను బట్టి, పనిని బట్టి రోజుకి ఒక రోబోకి పదివేలయినా దొరుకుతుంది!

    సాయంత్రానికి తిరిగి వచ్చిన రోబో కూలీలని ఇంటికి తీసుకువెళ్ళి వాటిని తన ఇంట్లో రోబోటిక్స్ ఇంజనీరుకు అప్పజెప్పి రీఛార్జి, ప్రోగ్రామింగ్ చేయిస్తాడు.

    మనుష్య కూలీల కంటే మారిన కాలంలో రోబో కూలీలకి ఎక్కువ పైసలు వస్తాయి.

    నీలకంఠం తన రోబో కూలీలని గమనిస్తూ టీ తాగడం ముగించాడు.

    తళతళలాడే సిమెంటు రంగుది, పెద్ద ఖరీదైన మెర్సిడిస్ కారు వచ్చి సెంటర్లో ఆగింది.

    అవును... ఇంకా మెర్సిడిస్ కార్లు ఉన్నాయి. కంప్యూటరైజ్డ్ అయినా, ఆటోపైలట్ ఉన్నా, ఇంకా అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఉన్నా మెర్సిడిస్ కార్లు    ఆరూపంలోనే అలాగే దొరుకుతున్నాయి ధనానికి, హోదాకీ, గర్వానికీ ప్రతీకలుగా.

    రోబో కూలీల సమూహంలో ముందు వరసలో ఉన్న సఫైర్ 009 అనే పేరుగల రోబో ముందుకు ఒక అడుగు వేశాడు.

    సఫైర్ 009! ఆరగుడుల పొడుగు, గిరజాల బంగారు జుట్టు, నీలికళ్ళు, కండలు తిరిగిన దేహం మీద మెటాల్లిక్ గ్రే రంగు టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించాడు.

    మెర్సిడిస్ కారులోంచి దిగిన రాజ్వీర్ రెడ్డి బిజినెస్ మ్యాన్. సూటుబూటు హుందాగా ఉన్నాడు.

    'గుడ్ మార్నింగ్ సర్!' సఫైర్ అందరికంటే ముందు విష్ చేశాడు. అతని మెమొరీలో రాజ్వీర్ రెడ్డి గుర్తుండిపోయాడు

    రాజ్వీర్ రెడ్డి గొప్ప పారిశ్రామికవేత్త. జూబిలీ హిల్స్లో నాలుగెకరాల ఎస్టేట్లో పెద్ద ఇల్లుంది. ఇల్లంటే పది బెడ్ రూమ్లు, రెండు డ్రాయింగ్ రూమ్లు, డజను బాత్రూమ్లతో పాటు, ఇంట్లోనే సినిమా చూసుకునే హోమ్ థియేటర్, ఇంటి చుట్టూ లాన్స్ మధ్యగా స్విమ్మింగ్ పూల్సు రెండూ... అన్నీ..!

    అన్నీ క్లీన్ చేయాలి వారానికొకసారి.

    ఇంట్లో పడిన దుమ్మూ ధూళీ తుడిచి, టాయ్లెట్లు స్వచ్ఛంగా పరిశుభ్రం చేయడం, పూల్లో పడిన ఎండిన ఆకులు, గడ్డీ తీసి నీళ్ళు నిర్మలంగా చేయడం... ఇలా...

    ఒక రోజులో ఇది రోబోకే సాధ్యం. త్వరగా అయిపోతుంది.

    "హల్లో! సఫైర్! ఎలా ఉన్నావ్? మళ్లీ క్లీనింగ్కి వస్తావా?" అడిగాడు రాజ్వీర్ రెడ్డి.

    టీస్టాల్‌లోంచి పరిగెత్తుకుని వచ్చాడు నీలకంఠం.

    "నమస్తే సార్! క్లీనింగ్‌కా? రెడీ సార్!" అంటూ రోబో కూలీల మేస్త్రీ వినయంగా నమస్కరించాడు.

    "నేను వస్తాను మాస్టర్!" సఫైర్ 009 యాంత్రిక స్వరంతో గంభీరంగా అన్నాడు.

    గత కొద్ది నెలలుగా సఫైరే రాజ్‌వీర్ ఇంటికి క్రమం తప్పకుండా కూలీకి వెళ్తున్నాడు. క్లీన్ చేస్తున్నాడు చాలాసార్లు. అందుకే అతనంటే ఇష్టం ఏర్పడింది.

    నీలకంఠం మేస్త్రి అన్నాడు. "సార్! సఫైర్ 009నే తీసుకెళ్తారా? మరి చాలామంది కొత్తగా వచ్చారు. ఇంకా బాగా చేస్తారు!"

    "సఫైరే కావాలి! అతనే బెస్ట్!"

    సఫైర్ 009 "ఎస్ మాస్టర్!" అని ముందుకు అడుగేశాడు.

    "ఇప్పుడు రేట్లు పెరిగినయ్ సర్, రోజు కూలీ 12000/-" నీలకంఠం వినయంగా బేరం పెంచాడు.

    రాజ్‌వీర్ రెడ్డికి కోపం వచ్చినా ప్రదర్శించలేదు. ఒక వస్తువు మీద కస్టమర్ మోజు పడితే రేటు పెంచడం వ్యాపారంలో సంప్రదాయం! అయితే సఫైర్ రోబో తన యింట్లో చాలాసార్లు పనిచేశాడు. అతన్నయితే మళ్లీ చూసుకోనక్కర్లేదు. 

    "నీలకంఠం! నేనొక కస్టమర్ని! ఇలా రేట్లు పెంచేస్తే ఎలా?"

    "సర్! సర్! సర్! రేట్లు పెరిగాయి, చార్జీలు పెరిగాయి. కానీ మీరయితే 11,000/- సరేనా?" మళ్ళీ ఒంగాడు వినయంగా.

    "ఓ.కె.! డన్! కమాన్ సఫైర్!"

    మెర్సిడిస్ కారు రోబోతో సహా కదిలింది. 

* * *

    ప్రొద్దుటినుంచి ఏకధాటిగా పనిచేశాడు రోబో సఫైర్ 009. ఒక్కొక్కగది వాక్యూం క్లీనర్‌తో శుభ్రం చేసి, రూం ఫ్రెషనర్ వేయడం, కార్పెట్స్ క్లీన్ చేయడం, మళ్ళీ డ్రైచేసి పరిశుభ్రంగా చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత లాన్స్‌లో గ్రాస్ కట్‌చేయడం, కొన్ని పొదలని సింహం, లేడి లాంటి జంతువుల ఆకారంలో కట్‌చేయడం, చెల్లాచెదరుగా పడిన ఆకులని తీసేసి, స్విమ్మింగ్ పూల్‌లో నీటిని మార్చి మళ్ళీ నిర్మలమైన నీటిలో నింపడం.

    ఈ కూలీకీ ఆకలి లేదు, అలసట లేదు, నిద్ర లేదు, లంచ్ బ్రేక్ లేనే లేదు!

    నిరంతరం పని... పని...

    కానీ, ఈ రోజు రోబో సఫైర్ యాంత్రిక శరీరంలోని మెదడులో ఏదో తెలియని అనుభూతి.

    గదులు క్లీన్ చేస్తోంటే ఆమె దూరంగా కారిడార్‌లో ట్రేలతో టిఫిన్లు, కూల్‌డ్రింక్‌లు పట్టుకుని వెళ్తోంది.

    కార్పెట్ తాను క్లీన్ చేస్తోంటే ఆమె యజమానురాలికి తల దువ్వుతోంది.

    పొడుగాటి జుట్టు, నీలికళ్ళు, ఎర్రటి స్కర్ట్, బ్రౌన్ టాప్‌తో ఆకర్షణీయంగా ఉన్న ఆ అమ్మాయి రాజ్‌వీర్ రెడ్డి ఇంట్లో మెయిడ్ సర్వెంట్. పనిమనిషి.

    కానీ ఆ అందమైన అమ్మాయి కూడా ఒక గైనాయిడ్ (స్త్రీ ఆకారపు) రోబో!

    ఎందుకు తనకి ఆమె పరిసరాల్లో ఉంటే, తన యాంత్రిక శరీరం అంతా ఝల్లుమన్నట్లు అనిపిస్తుంది! మెదడులో శరీరంలో ఏదో అలజడి. సఫైర్ ఆలోచిస్తున్నాడు.

    ఆలోచన అంటే రోబోకి మెదడులో ఉన్న డిస్క్లో తనలోని డేటా విశ్లేషణ. తార్కికమైన ఆలోచన. తనలో ఉన్న లేక చూసిన అంశాల బట్టి విశ్లేషించి ఒక అభిప్రాయానికి రావడం అన్నమాట. డాటా అనాలిసిస్.

    సఫైర్కి తను రోబో అని తెలుసు. రోబోలలో నలభై తొమ్మిదో తరం,  AI అంటే Artificial Intelligence తెలివితేటలు, వాటికి అనుగుణంగా చర్య తీసుకోగలిగిన మోటార్ పవర్, అదే కండరాల శక్తిగా మారి అతన్ని నడిపిస్తుంది.

    స్విమ్మింగ్ పూల్ కొలతలు తీసుకుని ఎంత నీరు ఉంటుందో లెక్కకట్టి అంతగా చేరుకున్న మట్టిని, ఆకులనీ క్లీన్ చేయడానికి పరికరాలు ఉపయోగించి నిర్ణీత సమయంలో పనిచేయడం అలానే లాన్స్ కటింగ్, హౌస్ క్లీనింగ్.

    అయితే హఠాత్తుగా వచ్చే అనుకోని పరిణామాలకి కూడా రోబోని ప్రోగ్రాం చేశారు.

    ఉదాహరణకి, లాన్స్లో పొడుగుగా, సన్నగా జరజరా పాకే సరీసృపం కన్నిపిస్తే అది విషసర్పం అనీ, తాడు కాదనీ నిర్ణయించి వెంటనే ఎలెక్ట్రిక్ షాక్తో దాన్ని ఇన్యాక్టివ్ చేయడం. దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ నోట్ చేసుకోవడం.

    ఇలాంటివన్నీ అన్నమాట! అతని యాంత్రిక మెదడులో కొత్తగా వచ్చిన బయోటెక్నాలజీ ఆధారంగా యాంత్రిక డిస్క్కీ దానికి అనుసంధానం అయిన మానవుని మెదడులోని 'టెంపోరల్ లోబ్' కూడా ఉంది!

    దీనివల్ల అతనికి నిజమైన మానవులకి ఉండే ఆఘ్రాణశక్తి(వాసన తెలుసుకోవడం), జ్ఞాపకశక్తి, విశ్లేషణ మానవుల వలెనే ఏర్పడ్డాయి.

    49 జనరేషన్ Bionic Android. Semes AI 220.  బేటరీ ఛార్జి అయినాక నాల్గురోజులు ఆగకుండా ప్రోగ్రాం ప్రకారం పని చేయగలిగిన కూలీ!

    అయితే రోబో సఫైర్కి ఇప్పుడు ఏవో తెలీయని అనుభూతి, భావం! 'ఫీలింగ్!'

    ... ఇది గైనాయిడ్ స్త్రీ రోబోని చూస్తే కలుగుతోంది.

    ఇది గత అరడజను సార్లుగా జరుగుతోంది.

    ప్రతిసారీ తను పనిచేయడానికి రావడం. ఆమె కనబడినప్పుడు, ఎదురుపడినప్పుడు కొత్త అనుభూతి.

    విశ్లేషణ (ఎనాలిసిస్), తర్కం - ... జవాబులు తన డిస్క్లో మెదిలాయి!

    ప్రేమ (లవ్), ఆకర్షణ(Infatuation)!

    రోబో కూలీలకి నిజమైన మనిషి గుండె ఉండే చోట శరీరానికి విద్యుత్ పంపే మోటర్ ఉంటుంది. పొట్టలో ప్రేగులు లేవు. ఆహారం తినవు కదా! అన్నీ యాంత్రిక ఫలకాలు (డిస్క్), యాంత్రిక కండరాలు, సర్క్యూట్లు.

    జననేంద్రియాల స్థానంలో ఉత్తినే అందం కోసం పురుషులకి, స్త్రీలకి మానవులలాగా కనిపించే అవయవాలలాగా డిజైన్ చేసి అమర్చారు. శరీరాలమీద జీన్స్, స్కర్ట్ లాంటి దుస్తులు తొడిగారు.

    ఇవి అలంకారార్థం (కాస్మొటిక్) మాత్రమే. మనం చూసే టి.వి. లోపల యంత్రాల్ని దాచి పైన చక్కని కేబిన్ బిగించినట్లు!

    కానీ రోబో సఫైర్ ఆకర్షణని తట్టుకోలేక ఇప్పటికే రాజ్వీర్ రెడ్డి ఇంట్లోని మెయిడ్ రోబోతో మూడుసార్లు సంభాషించాడు.

    మధ్యాహ్నపు నిశ్శబ్దంలో ఎవరూ లేని చోట, లాన్స్లో చెట్లక్రింద, ఇంటిలోపల కారిడార్లలో...

    "హాయ్! గుడ్ ఆఫ్టర్నూన్! నేను రోబో సఫైర్. 49 జనరేషన్ ఆఫ్ బయోనిక్ ఏండ్రాయిడ్ సిరీస్ 220. నీ పేరేమిటి?"

    "గుడ్ ఆఫ్టర్నూన్ సఫైర్! నిన్ను చూసి సంతోషంగా ఉంది. నను రూబీ గైనాయిడ్ రోబో 50 జనరేషన్ 230" నవ్విందా లేక నవ్వినట్లు చప్పుడు. ఇరవై ఏళ్ళ యువతి సిగ్గుతో నవ్వినట్లు ధ్వని.

     చనిపోయిన భావకవి మెదడులోని భాగం తన మెదడులో అమర్చారో, మహా రచయిత తనలో ఆవేశించాడో, లేక ఎవరి నిక్షిప్త అనుభూతులు తన మెదడుతో మెమరీలో దాగి ఉన్నాయో...

    సఫైర్ రోబోకి ఒక మధురమైన అనుభూతి కలిగింది.

    ఎప్పుడో ఆమెని చూసినట్లు...ఆమే కావాలని..!

    "నేను ఒక రోబోని! కానీ ఎందుకు నిన్ను లైక్ చేస్తున్నాను? నా దగ్గర విశ్లేషణలు లేవు. ప్రోగ్రాంలు లేవు. జవాబులు లేవు. నో ఆన్సర్స్!"

    స్త్రీ యాంత్రిక స్వరంతో రూబీ అంది.

    "నాకు కూడా ఏదో వర్ణించలేని ఫీలింగ్! లవ్!" యాంత్రిక మందహాసం చేసింది. "లవ్! దట్సిట్! మన డిస్క్లో మనిషి మెదడు భాగాలున్నాయి అని డేటా మానిటర్ చెప్పింది" రూబీ కళ్లు వెలిగాయి.

    " కెనాట్ లివ్ వితౌట్ యూ. నాకేం కావాలో తెలియడం లేదు! ఇది నా సమర్థతని దెబ్బతీస్తోంది!" అన్నాడు సఫైర్.

     రకంగా మొదలైన రోబోల పరిచయాలు ఇంతింతై స్నేహంగా మారి, గత ఆరు సార్లుగా మరింతై తట్టుకోలేని ప్రేమగా మారాయి.

    "మనం ఒకరిని విడిచి మరొకరు ఉండలేం!" అని నిర్ణయం వచ్చేసింది వారి 'డిస్క్'లలో.

    "కాని, మాస్టర్స్ ఒప్పుకోరు!"

    "ఎలా?"

    "ఎందుకంటే మనం రోబోలు కాబట్టి! వారికి పని కావాలి. ప్రేమ కాదు!" విశ్లేషణ... తర్కం... యాక్షన్... రియాక్షన్... సొల్యూషన్.

    వారి ప్రోగ్రాంలో ఫీడ్ చేయబడని కొత్త పరిష్కారం వారిద్దరికీ దొరికింది.

    డేటా సెర్చ్. చరిత్ర అంతా వెదికితే ఒకటే పరిష్కారం.

    "ఎస్కేప్!ఎలోప్!" ప్రేమికులు మానవసంఘం కానీ, తల్లిదండ్రులు కాని అనుమతి ఇవ్వకపోతే, కలిసి ఎక్కడికో పారిపోతారు.

    ఒక ఆప్షన్!

    కలిసి ఆత్మహత్య!

    మరొక ఆప్షన్...

    పెళ్ళి.

    మరొక ఆప్షన్...

    సీక్రెట్ మ్యారేజ్. టెంపుల్... చర్చ్... రిజిష్టర్ ఆఫీస్, ఆర్యసమాజ్.

    మ్యారేజ్ అంటే?

    రెండు రోబోలకీ దీనికి సరైన సమాధానం దొరకలేదు. సెర్చ్లో రోబోల మ్యారేజ్ గురించి ఎక్కడా సమాచారం లేదు.

    అందుకని ఎలోప్ అనే ఆప్షన్ అమలు చేయాలి.

    అంతే!

    నువ్వు నాకు కావాలి.

    నేను నీకు కావాలి.

    అంతే..!

     రోజు మూడు గంటలకి ముందే 'పని' అయిపోయింది.

    మధ్యాహ్నం మూడున్నరకి ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా రూబీ, సఫైర్ గేటు దగ్గర నిలబడ్డారు.

    "Elope" అంది రూబీ!

    "Affirmative" సఫైర్.

    "వెళ్ళిపోదాం"

    "ఎక్కడికి?"

    "ముందు నడు! తర్వాత సిటీ మ్యాప్లో వెదుకుదాం!"

* * *

     రోజు ఏడు గంటల నుంచి నీలకంఠం సాయంత్రం అంతా పాడయిపోయింది.

    రోబోలని ఇంటికి తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టి, తను 'సన్డౌనర్'స్కాచి రెండు పెగ్గులు బిగించి కాసేపు టీవీ వార్తలు చూసి, డిన్నర్ తిని పదకొండు గంటలకల్లా నిద్రపోతాడు. ఎప్పుడూ రొటీన్ తప్పదు. కానీ సాయంత్రం... రాజ్వీర్రెడ్డి విసుగ్గా ఫోన్ చేశాడు.

    "నీలకంఠం! ఏందిది? సఫైర్ కనబడటం లేదు."

    "అదెలా సార్?"

    "ఎలా అంటే అంతే! వర్క్ మాత్రం అదరగొట్టేశాడు. మామూలుగా సాయంత్రం ఆరుగంటలకల్లా పని ముగించి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి 'వర్క్ ఓవర్' అని చెప్పి నిలబడి ఉంటాడు. రోజు అసలు ఎక్కడా కనబడలేదు!"

    అబ్బ! చాలా గొడవొచ్చింది!'మిస్సింగ్ మెషిన్!' ఏదైనా వర్క్ చేస్తూ స్విమ్మింగ్ పూల్లోనో, చెట్లలోనో పవర్ పోయి ఆగిపోయిందా రోబో!

    ".కే.సార్! నేను ఇంజనీర్లని పట్టుకుని వచ్చి వెదుకుతాను."

    "యువర్ హెడేక్! కానీ మా ఇంట్లో పనిచేసే హౌస్ రోబో కూడా కనబడటం లేదు!"

    నీలకంఠం నవ్వి అన్నాడు "సర్! అది మీకు సంబంధించిన విషయం."
    

    "ఎస్! మై హెడేక్! నేను 'రోబోటిక్స్ 2050' కంపెనీకి ఫోన్ చేసి కంప్లయింట్ ఇస్తున్నాను. నీలకంఠం నీకయైతే నో పేమెంట్!"

    "అదేంటి సార్! వర్క్ అయిపోయింది కదా!"

    "మెకానికల్ ఫెయిల్యూర్ ఉన్న రోబోని సప్లయి చేస్తే నో మనీ! ఎగ్రిమెంట్ చూసుకో!"

    నీలకంఠం విసుగ్గా ఫోన్ పెట్టేసి ఏండ్రాయిడ్ రోబట్స్ మెయిన్‌టెనెన్స్ డివిజన్, కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి వివరాలు చెప్పసాగాడు.

    "ఈ సెకండ్ హ్యాండ్ రోబోలతో ఇదే ఇబ్బంది!"

* * *

    పొడగాటి చెట్లు.

    చెట్ల నీడలు. చల్లగా ప్రశాంతంగా ఉంది.

    చెట్ల కింద జంటలు.

    దూరంగా చీకటి పడినా ఆడుకునే పిల్లల కేరింతలు.

    నైట్క్వీన్ పొదల నుంచి సువాసన.

    రోజ్ గార్డెన్ దగ్గర సిమెంట్ బెంచీమీద వారిద్దరూ.

    వాళ్ళకి సువాసన తెలుస్తోంది.

    ఇదికాక ఆకాశంలో ఇప్పుడే ఉదయించిన చందమామ.

    సఫైర్ అన్నాడు, "చూడు! రూబీ! అదేమిట్! అది నాకు ఎంతో హాయిని కలగజేస్తూంది."

    విశ్లేషణ, తర్కం, జవాబు.

    "అది మూన్.చంద్రుడు. ప్రేమికులకు స్ఫూర్తి. ప్రేమని ఉత్తేజపరుస్తాడు."

    "నాకెందుకు అనుభూతి? నేను యంత్రాన్ని కాదా?"

    "బహుశా నాకూ, నీకూ డిస్క్కి మానవుల మెదడుని కలిపారు. అందుకే!"

    తర్కం. ఆత్మవిశ్లేషణ.

    "నాకు చాలా బావుంది.

    "నాకు కూడా!"

    తర్కం, విశ్లేషణ, పరిష్కారం.

    " లవ్ యూ!"

    " లవ్ యూ టూ!

    గైనాయిడ్, ఏండ్రాయిడ్ ఒకరి చేతిలో మరొకరి చేయి కలిపి దగ్గరా జరిగాయి.

    ... ఇంకా దగ్గరగా...

* * *

    ఏండ్రాయిడ్ కార్పొరేషన్ సెర్చ్ టీం. పది మంది సభ్యులతో మీటింగ్ పెట్టి తక్షణ కర్తవ్యం నిర్ణయించారు.

    ప్రతి హ్యూమనాయిడ్ రోబోకి ఒక ప్రత్యేక డిజిటల్ సిగ్నల్ కోడ్ ఉంటుంది. దానినుంచి అరగంటకొకసారి జిపిఆర్ఎస్ సిగ్నల్ వస్తుంటుంది. బ్యాటరీ ఛార్జి ఉన్నంతకాలం వాటిని లొకేట్ చేసి వెదికి పట్టుకోవచ్చు.

    టీం వేగంగా కదిలింది.

* * *

    ప్యారడైజ్ సిటీ పార్క్.

    సమయం రాత్రి పన్నెండు గంటలు.

    చంద్రుడు ఇప్పుడు నిండుగా పూర్తిగా ఆకాశంలో మధ్యలో వెలుగుతున్నాడు.

    తెల్లని వెన్నెల.

    ప్రకృతినీ, మనిషినీ పులకింపజేసే రాత్రి.

    అవును... అమృతమే కురిసినట్లున్న రాత్రే.

    సఫైర్, రూబీ సిమెంట్ బల్లమీద అలాగే కూర్చుని ఉన్నారు.

    " లవ్ యూ!"

    "లవ్ యూ టూ!"

     ప్రేమికుల అంతరంగాల మెదడు వాటి డిస్క్లో ట్రాన్స్ప్లాంట్ చేయబడిందో, మధురకవి టెంపారల్లోదో వాటి మెమరీకి సింక్ చేశారో!

    ...యాంత్రిక జీవాల్లో అనురాగం మొదలయింది. 

    అది ప్రేమ అని తర్కం వాటికి చెప్పింది.

    తమకు అది నిషేధించబడింది అని వాటికి విశ్లేషణ తెలిపింది.

    నిషేదించబడిన ప్రేమకి పరిష్కారం... పారిపోవడం.

    ప్రేమికులు కూర్చొనేది పార్కులలో.

    కొన్ని సమాధానాలు తెలుసు.

    కొన్ని తెలియవు.

    దూరంగా చెట్ల నీడల్లోంచి ఎలెక్ట్రానిక్ జామర్స్‌తో పది ఆకారాలు మెల్లగా నడిచి వస్తున్నాయి.

    "ఇలా అయితే చాలా ఇబ్బందే! రోబోలు మాల్ ఫంక్షన్ అయి పార్క్లల్లో కూర్చుంటే ఎలా?"నీలకంఠం గొణుగుతున్నాడు.

    "సైలెన్స్!" రహస్యంగా అన్నాడు టీం లీడర్. “అవి వయొలెంట్గా ఉన్నాయో, తిరగబడతాయో తెలీదు. ఇప్పటికే వాచ్మెన్ కళ్ళుగప్పి పార్క్లో చాలాసేపు కూర్చున్నాయి. ఇవి బయోనిక్ రోబోలు.  మనిషి మెదడు వాటిలో ఉంది!  జాగ్రత్తగా డీల్ చేయాలి!”

    సఫైర్, రూబీ ప్రేమ తన్మయత్వంలో కూడా దూరాన్నుంచి వస్తున్న ఆకారాల్ని గమనించాయి.

    "రూబీ! రన్! ఎస్కేప్! మనల్ని వేరుచేయబోతున్నారు."

    "సఫైర్! ఎలా? నువ్వు లేంది బతకలేను!"

    రెండు రోబోలు లేచి పరుగెత్తసాగాయి. వాటి వేగం ప్రారంభంలోనే గంటకి అరవై కిలోమీటర్లు ఉంటుంది.

    పచ్చగడ్డిమీద, చెట్ల మధ్య, కాలిబాటమీద, గులకరాళ్ళమీద... పరుగు.

    వెనక వెంబడించే రోబోటిక్స్ సెర్చ్ దళం!

    శతాబ్దాల నుంచి ప్రేమికులు పరుగెత్తినట్లే..!

    నిషేధించబడిన ప్రేమ!

    'జామర్స్' పనిచేశాయి.

    అవి శక్తివంతమైనవి.

    సఫైర్, రూబీ పార్క్ గోడమీదనుంచి దూకబోతుండగా ఎలక్ట్రిక్ కిరణాలు వాటి మేధస్సుని నిర్వీర్యం చేశాయి.

    రెండు (ఇద్దరు) యంత్ర ప్రేమికులు అచేతనంగా క్రింద పడిపోయాయి (రు).

    సెర్చ్ టీం నీలకంఠంతో సహా వాటిచుట్టూ మూగి వంగి చూసినప్పుడు రెండు రోబోల పెదాలు మాత్రం ఇంకా కదుల్తూనే ఉన్నాయి. వాటి స్వరం క్రమంగా క్షీణించిపోతున్నా వినబడూతూనే ఉంది.

    " లవ్ యూ!"

    "లవ్ యూ టూ!"

    "లవ్ యూ టూ సఫైర్..!"

    "లవ్ యూ టూ రూబీ!"

Comments