రుక్కుతల్లి - బాలి

    
"విశ్వం...నాయనా విశ్వం - రామ్మా! పొద్దుపోయింది కదరా!! ఇంకా ఎక్కడ తిరుగుతున్నావూ. ఇంటికి రావూ. వచ్చేయమ్మా! ఇంకా అక్కడక్కడా తిరుగుతూ అన్నన్ని మాటలు అనిపించుకొంటుంటే నా మనసు ఊరుకొంటుందా చెప్పూ. నేను బాధ పడనూ. నాకు దుఃఖం రాదూ - అదిగో తాతగారు... నీ కిష్టమైన తాతగారు నీకోసం పక్కపరిచారురా. తెల్లదుప్పటి నీకిష్టం కదూ - రా చూడు - మంచం నిండా పరిచారు.

    బోల్డు కథలూ - కబుర్లూ చెబుతారు. ఈ వేళ పేపర్లో ఏం రాశారు తాతా అని మరిమరీ వార్తలు చెప్పించుకుంటావు కదమ్మా - నీ వంటికి మందు రాస్తూ తాతగారు కథలు చెప్తోంటే మధ్య మధ్య తాతగారు కథను ఆపితే ఎంతగోల చేస్తావనీ - నీకెంత గుర్తురా!! నా తండ్రీ, అన్నీ జ్ఞాపకమే నా చిట్టి తండ్రికి.

    బతికీ మాటలు పడ్డావు తండ్రీ -

    చనిపోయీ పడాలా అంతంత మాటలు "

    గుమ్మంలో లాంతరు వెలుగులో గోడకు చరబడి వింటున్న రామ్మూర్తి గారు కళ్లంబట బొటబొట నీళ్లు కారుతోంటే భుజం మీది తుండుతో కళ్లొత్తుకున్నారు.

    "నాయనా! విశ్వం నువ్వునాటిన బీరపాదు ఇవాళ రెండు పూలు పూసింది రోయ్ - తడిక మీద గాలికి ఊగుతోంది చూడు. - రావూ విశ్వం. నాకన్నతండ్రి నువ్వు పిలుస్తావే - సీతప్పా సీతప్పా అని - అది వచ్చిందిరా - అదంటే నీకిష్టం కదూ. పాలకోసం బంతి మొక్కల మధ్య కూచుని చూస్తోందిరా. నాయనా విశ్వం..."

    "రుక్మిణీ - రుక్కూ - ఇక నీ మాటలు నేను వినలేనే! ఎంత ప్రేమే!! వాడి మీద. ఆ భగవంతుడు ఎంత దుర్మార్గుడే - నీ చేతుల్లోంచి లాక్కొని దుఃఖాన్ని మిగిల్చాడా!" సన్నగా అంటూ రామ్మూర్తిగారు దుఃఖాన్ని దిగమింగుతూ తుండుతో కళ్లొత్తుకున్నారు.

    అది ఆ వూరిలో కొత్తగా వెలుస్తున్న వీధి, చిమ్మ చీకటి - అక్కడొకటి, ఇక్కడొకటి మునిసిపల్ లైట్లు వెలుగుతున్నాయి - ఇంకా రోడ్డు వెయ్యలేదు సరిగా - మట్టి పోశారేమో - వర్షానికి బురదబురదగా దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది.

    వీధిలో జనసంచారం లేదు.

    రుక్మిణి కళ్లొత్తుకొని వెదురు తలుపు దగ్గరగా వేస్ ఇనుపచువ్వ తగిలించి గుమ్మంలోకి వచ్చింది.

    "నేను వాడ్ని మరచిపోలేక పోతున్నానండీ! కూరగాయలమ్మే గంగమ్మ ఎంతెంత మాటలందనీ - వీడు దెయ్యమయ్యాడా - దారంట పోయే వాళ్లను భయపెడుతున్నాడా!!"

    నిస్సత్తువగా రామ్మూర్తిగార్ చేరబడి ఉన్న గోడకే చేరబడి పోయింది.

    "లోకులు పలుగాకులు, ఎవరికై చెప్తాం. అంతా వాడి కర్మ" రామ్మూర్తిగారు ఉక్మిణి చేతులు తన చేతుల్లోకి తీసుకున్నారు. లాంతరు వెలుగులో ఆమె తడిసిన కనురెప్పలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంఠం ముడిమీద చిన్నమెత్తు బంగారంతో ఉన్న కుత్తిగంటు ఊపిరి తీస్తున్నప్పుడల్లా కదులుతోంది.

    "మీరు మగవారు. తట్టుకుంటారు - నేను తట్టుకోలేక పోతున్నానండీ వాడి ఎడబాటును" తిరిగి అంది. రామ్మూర్తి గారి చేయి ఇంకా బిగుసుకుంది, తప్పన్నట్టుగా. 

    రామ్మూర్తిగారు పాలెం స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా రిటైర్ అయ్యారు. రుక్మిణమ్మ ఆయన భార్య. పిల్లలు లేరు. అప్పటిలో ఫించన్ సౌకర్యం లేదు. ఇంకా టీచర్ బతుకు గొర్రెతోక చందంగా ఉన్న రోజులే! - ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆ పేటలో చిన్న స్థలమైతే కొన్నారు గానీ ఇల్లు వేసుకోవాలంటే అప్పు చెయ్యక తప్పలేదు. చిన్నపాటి గదీ, ముందో వరండాలాంటి అరుగూ, పైన తాటాకు నేత - ఓ పక్క బావికీ తెచ్చిన డబ్బు సరిపోయింది. ఇక అప్పు చెయ్యాలంటే తలకు మించిన భారమయి, ఇద్దరికీ ఈ మాత్రం చాలు అనుకున్నారు. ష్తలం చుట్టూ తాటాకు దడీ, లోన మడులు కట్టి కూరగాయ మొక్కలూ, పాదులూ ఓ పక్క, మరో పక్క నాలుగు పూల మొక్కలూ వేశారు.

    రామ్మూర్తిగారు దగ్గరగా ఉన్న నాలుగైదు ఇళ్లలో ప్రయివేట్లు చెప్తున్నారు. అప్పు సంగతి గుర్తొస్తే ఇద్దరి గుండెలూ గుభేలుమంటుంటాయి.

    సరిగ్గా అదే రోజుల్లో ఓ విశేషం జరిగింది.

    రామ్మూర్తిగారికి దూరపు చుట్టమూ, కొంచెం ఆలోచనాపరుడూ పేరు పురుషోత్తం అనే ఆయన వారి ఇంటికి వచ్చి ఆమాటా ఈమాటా చెబుతూ సాయంకాలం వరకూ గడిపి మీరేమీ అనుకోకపోతే అంటూ అసలు విషయం చెప్పాడు. మిమ్మల్ని ఏదో పరిహసిస్తున్నని అనుకోవద్దు - ఇద్దరికి ప్రాణభిక్ష పెట్టిన వారవుతారు. మీ భార్యాభర్తల గుణగణాలు నాకు తెలుసు. మీ నిర్ణయం ఇంత త్వరగా చెప్పనవసరం లేదు. ఆలోచించుకొనే చెప్పండి అంటూ చెప్పవలసిన విషయం చెప్పి మీ నిర్ణయం ఏది ఏమైనా నాకు ఉత్తరం ద్వారా తెలియచెయ్యండి అని శెలవు తీసుకొని వెళ్లిపోయాడు. ఆరోజు తరువాత మరో నాలుగు రోజుల దాకా ఈ దంపతులిద్దరికీ కంటి మీద కునుకు లేదు. ఆలోచన - ఆలోచన - ఆలోచన... చివరకు రుక్మిణీయే అంది. "ఫరవాలేదు. ఉత్తరం రాయండి. మనం అంగీకరిస్తున్నామనే తెలపండి. భగవంతుడు నన్ను పరిశీలించాలనే ఇలా పుత్రభిక్ష ప్రసాదిస్త్సున్నాడనే అనుకుంటాను. మనకీ ఆర్థిక శక్తి వస్తుంది" అంది తడిబట్టలు తాడుమీద వేస్తూ.

    "గట్టిగా ఆలోచించుకో రుక్కూ - అంతా నీ చేతుల్లో ఉంది" అన్నారు రామ్మూర్తిగారు.

    "ఫరవాలేదు. అంగీకరిస్తున్నట్టే రాయండి" అంది ఇంకా గంభీరంగా. రామ్మూర్తిగారు ఉత్తరం రాశారు అలాగే - అది రాసిన నాలుగు రోజుల్లో పురుషోత్తంగారు - దగ్గరదగ్గర డెబ్బయి సంవత్సరాలున్న మరో వ్యక్తీ, ఆయన వేలు పట్టుకొని నడుస్తున్నా చిన్నబాబూ - రిక్షా దిగి దడి ముందుకు వచ్చారు.

    పరిచయాలు అయ్యాయి - ఆ పెద్దవయసున్న ఆయన పేరు కోదండ రామయ్య గారు - అందరూ కోదండం గారు అనే అంటారు - ఆ చిన్నబాబు పేరు విశ్వనాథం. అందరూ విశ్వం అనే పిలుస్తారు. వాడు ఆయన మనవడు. తెల్లగా బొద్దుగా ఉన్నాడు. పెద్దపెద్ద కళ్లతో చుట్టూ అమాయకంగా చూస్తున్నాడు. ఉర్క్మిణి గ్లాసులతో మంచినీళ్లు తెచ్చి గడపలో పెట్టి తన వేపే తదేకంగా చూస్తున్న ఆ పసివాడ్ని అందుకుంది. ఎంతో పరిచయం ఉన్నవాడిలా ఆ పసివాడు ఆమె భుజానికి చేరబడిపోయాడు. క్షణంలో కోదండంగారి గుండెలు కరిగి పోయాయి. కళ్లంబట బొట బొటా కన్నీళ్లు కారాయి. "అదమ్మా! ఆ అనురాగం కోసమే వాడు తపించుకుపోతున్నాడు తల్లీ - వయసులో నీకన్నా పెద్దవాడిని. భగవంతుడు నీ నీడకు మమ్మల్ని పంపించాడమ్మా... వాడికి ప్రాణభిక్ష పెట్టవూ" అంటూ గబుక్కున లేచి ఆమె పాదాలపై నుదురు ఆనించాడు ఆయన. ఆయన రెండు చేతులూ ఆమె పాదాల్ని చుట్టేశాయి.

    "అన్నగారూ మీరు పెద్దవారు - ఇదంతా దైవేచ్చ" అని రుక్మిణి పాదాలు దగ్గరగా తీసుకుంది.

    రామ్మూర్తిగారు ఆయన్ను లేపి కూర్చోపెట్టారు.

    "ఈ ప్రేమకోసమే ఆ భగవంతుడ్ని ప్రతిక్షణం వేడుకుంటున్నాను తల్లీ - 'దైవం మానుష రూపేణా' అన్నారు పెద్దలు. ఆ తల్లిని ఇలా దర్శనం చేయించాడు. అమ్మా రుక్మిణీ ఈ పసివాడ్ని నీ చేతుల్లో పెడుతున్నానమ్మా. ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ ముసలి బతుకు ఏమైపోయినా ఫరవాలేదు ఇక" దుఃఖం ఆపుకొంటూ అన్నారు.

    రామ్మూర్తిగారు నేలవంక చూస్తున్నారు.

    రుక్మిణి కళ్లు చెమర్చాయి. చెంగుతో ఒత్తుకొంది. పురుషోత్తం గారు "కోదండం గారు ఇక మీరు నిశ్చింతగా ఉండండి" అని అంటూ "అమ్మా రుక్మిణీ వీడు ఇక నీవాడు. వాడి ఆలనా పాలనా ఇక నీది" అన్నారు.

    "అన్నగారూ! ఇది దైవసంకల్పం - పిల్లలకోసం వయస్సులో పరితపించిపోయాను. అయినా మనవడి రూపంలో - పూర్వ జన్మబంధం ఎక్కడుందో - ఇప్పుడు పంపాడు" అంది ఆ పసివాడి బుగ్గలను తన బుగ్గలకేసి రాసుకొంటూ. అయితే ఆ పసితనపు నునుపు బుగ్గల్లో ఏదో తేడా ఉంది - అలాగే ఆ పసివాడి వేళ్లల్లోనూ! - ఆ చంటి వాడిది కుష్ఠు వ్యాధిలో అది మొదటి దశ.

    ఆ తరువాత పనులు చకచకా జరిగిపోయాయి. ఆ దంపతులు వద్దు, వద్దు మాకు ఫలితముండదు అని అంటున్నా "నాకు తృప్తి కావాలి కదమ్మా" అంటూనే కోదండంగారు వీడికోసమే దాచాను అంటూనే బ్యాంక్‌లో దాచిన డబ్బు తెచ్చి ఆ ఇంటి మీదున్న అప్పు తీర్చేశారు. నాకు ఫించన్ వస్తుంది. వీడి పళ్లకూ, పాలకూ, మందులకూ డబ్బు పంపుతాను. మీరు కాదనరాదు - అంటూ ప్రమాణం చేయించుకొని నెలనెలా డబ్బు పంపుతున్నారు. ఆ డబ్బు వేడ్నీళ్లకు చన్నీళ్లలా రామ్మూర్తిగారికి సరిపోతోంది. అయితే ప్రపంచం అసహ్యించుకొనేదీ రామ్మూర్తి దంపతులను ఆనందపరిచేదీ, అది డబ్బుతో కొనలేనిది ఒక్కటే - విశ్వం మీద రోజు రోజుకీ పెరుతున్న ప్రేమ.

    ఆ ప్రేమకు ప్రతికూలమా అన్నట్లు విశ్వంలో ఆ వ్యాధి ఇంకా బలంగా బయటకు కనిపిస్తోంది. "పిల్లాడేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా! కొత్త కదా!! అంటూ కోదండం గారు వారానికి రెడుత్తరాలన్నా వ్రాస్తున్నారు. అదేం లేదని రుక్కుకి బాగా మాలిమి అయ్యాడని వాడికి కావలసిన రుచులు వండించుకొని తింటున్నాడని వాడికి పూలమొక్కలన్నా, పిల్లులన్నా ఇష్టమనీ - పొద్దస్తమానం వాటి మధ్యే గడుపుతాడనీ రామ్మూర్తిగారు తిరుగు జవాబు ఇస్తుంటారు. ఆరు నెలల తరువాత ఆ ఇంటి ప్రాంగణంలోకి అడుగు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కోదండంగారికి కళ్లు ఆనందంతో నిండిన కన్నీటితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విశ్వం చిన్న డబ్బాతో నీళ్లు మొక్కలకు పోస్తున్నాడు. అప్పుడే స్నానం చేశాడు కాబోలు. కింద తడిసిన లాగూ ఉంది. 'విశ్శూ గేటు చప్పుడయ్యింది చూడూ' అంటూ లోనుండి రుక్మిణి కేకవేస్తోంది.

    కోదండం గారు ఆకాశం వంక తల ఎత్తి ఆ పరమాత్ముడికి మనసా నమస్కరించుకున్నారు. ఆయన మనస్సు పూర్తిగా ధైర్యంతో నిండి పోయింది.

    మధ్యాహ్నం భోజనాలయ్యాక కోదండంగారు రామ్మూర్తి దంపతులకు ఇన్నాళ్ళూ మీకు చెప్పుకోలేని, లేక చెప్పలేని విషయం అంటూ జరిగిన విషయాలు బయటపెట్టారు. "పురుషోత్తంగారు మీకు చెప్పే ఉంటారనుకుంటానమ్మా అంటూ! నాకిద్దరు మగపిల్లలు. మంచి ఉద్యోగాలే చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ నా మనవడినే చీదరించుకున్నారమ్మా మా వాళ్లు. ఇప్పుడు నేనూ వారికి చేదయిపోయాను. రెండో ఏటనే తల్లిని పోగొట్టుకున్నాడీ పసివాడు - వీడిని చూసి కన్నతండ్రి అసహ్యించుకొని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటే ఏం చెప్పను. సవతి తల్లి - పిన తండ్రి - పిన తల్లి అంత పసివాడిని వారి వారి గదుల్లోకి రానీయకుండా కుక్కని తరిమినట్టు కర్రలతో దూరంగా నెట్టేరంటే వాళ్లు మనుషులేనా తల్లీ - నా కడుపు చెరువైపోయేది ఆ దృశ్యం చూస్తుంటే. నన్ను చంపమని ఎక్కడన్నా వదిలి రమ్మనమనీ వీడి తండ్రే రోజుకి పదిసార్లన్నా చెప్పేవాడు. మా ఇద్దరికి మరణమే శరణమనుకున్నాను. రుక్కుతల్లీ వీడికి నీ ఆదరణ దొరికింది. నేను నా వాళ్లకి ఇప్పుడు చేదయిపోయాను! అందువల్ల కటక్‌లో వృద్ధాశ్రమానికి వెళ్లి పోతున్నాను - అది చెప్పడానికే వచ్చాను" అన్నారాయన గద్గదస్వరంతో.

    రుక్మిణీ, రామ్మూర్తిగార్లకు ఏం చెప్పాలో తెలియక ఆయనవంకే చూస్తున్నారు. ఈ ప్రపంచ పోకడ వారిలో ఆశ్చర్యాన్ని రేపుతోంది - ఓ రెండు రోజులుండి ఆయన బరంపురం వెళ్లిపోయారు.

    ఆ తరువాత కాలం తొందరగా కదిలిపోయినట్టయింది. కొన్నాళ్లకు కోదండం గారు పోయినట్టు వృద్ధాశ్రమ వాసులెవరో ఉత్తరం రాశారు - విశ్వం పెద్దవాడవుతున్నాడు. ఇంట్లో తాత, మామ్మ ఆదరణ తప్ప బయటప్రపంచం తనలోకి అతడిని రానీయకపోవడం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తాతగారితో స్కూల్లో చేరదామని పలక పుచ్చుకుని బయలుదేరితే టీచర్లు చేర్చుకోలేదు. రామ్మూర్తిగారు చాటుగా కళ్లు తుడుచుకుని 'నువ్వే టీచర్‌వి కదా! ఇంట్లోనే చదువు చెప్పు అన్నారని ఆ క్షణంలో అబద్ధం చెప్పి ఇంట్లోనే చదువు చెప్పడం ప్రారంభించారు.

    దుకాణంలో ఏదన్నా కొనుక్కోవాలనీ, తినాలనీ వెళ్తే డబ్బులు కింద పెట్టించి - అడిగిన జంతిక కింద పెట్టి తీసుకోమంటున్నారు - వీధితో పిల్లలతో ఆడుకోడానికి వెళితే వాడ్ని దూరం నుండే చూసి ఆటన్నా మానుకుంటున్నారు లేక ఆట మధ్యకి వీడ్ని రావొద్దనన్నా చెప్తున్నారు - ఇంటికి రావడం - రుక్కుతల్లికి ఫిర్యాదు చెయ్యడం ఆమె వాడి కన్నీరు తుడిచి సముదాయించడం జరుగుతోంది - కారణం తెలియడం లేదు ఆ చిన్నమనసుకి - సరియైన సమాధానం లేక కళ్లంబట నీళ్లూ కారుతున్నాయి.

    సెంటర్‌లో వినాయక చవితి నవరాత్రులు చేస్తున్నారు. రాత్రిపూట హరికథలు, భరతనాట్య ప్రదర్శనలూ ఉంటున్నాయి - పిల్లలూ పెద్దవాళ్లూ అక్కడికి చేరుతున్నారు. విశ్వం పెందరాడే అన్నం తిని అటు పరుగెత్తాడు - వాడ్ని అంతదూరంలో చూసి మరో వేపు వెళ్లారు ఆడుతున్న పిల్లలు - ప్రసాదాలు పంచారు. తనూ అందుకొని తిరిగి పిల్లల మధ్యకెళ్లాడు విశ్వం. కుష్టోడు...కుష్టోడు... అని అందరూ దూరంగా జరిగిపోయారు. పెద్దవాళ్లు - "మధ్య కొచ్చావేంరా వెధవా!" అన్నారు. విశ్వానికి ఏడుపు వచ్చింది - చీకటిలో పిట్టగోడకు ఆనుకొని తనివి తీరా ఏడ్చాడు - తన చేతివేళ్లు అందరిలా ఉండవు. ముఖమూ అంతే - చర్మమూ ఏదో మచ్చలుగా - పొలుసులుగా వుంటుంది. తాతగారు రోజూ రాత్రిపూట మందు రాస్తారే! - తనే ఇలా ఎందుకున్నాడు.  
 
    చేతి వేళ్ల వంక చూసుకొని ఇంకా ఏడ్చి ఇంటి ముఖం పట్టాడు. అప్పుడే ఆ దుఃఖం కోపంగా, కసిగా మారింది. దాన్ని తనకు అనుకూలంగా, ఆనందంగా మలుచుకున్నాడు ఆ తరువాత. ఆడుకుంటున్న పిల్లల మధ్యకు గబుక్కున ప్రవేశించడం... పిల్లలు తనరాకకు భయపడ్డం... తను నవూకోవడం లేక వారి వెంటపడ్డం... గబుక్కున చెయ్యి పట్టుకోవడం... వాళ్లు కొట్టబోతే...కొట్టండి... కొట్టండి... అని మీదకు వెళ్లడం...నన్ను ముట్టుకోండి... నన్ను ముట్టుకోండి... విరగబడి నవ్వడం... పరాగ్గా ఉంటే వారిని ఒక్కతోపు తొయ్యడం... వాళ్లు తిడితే తనూ తిట్టి నేలన ఊయడం... ఇవన్నీ జరుగుతున్నాయి.

    ఒకటి రెండు సార్లు రుక్కుతల్లి ఒడిలో పడుకొని తను చేస్తున్న గొప్ప పనులు చెప్పాడు. 'తప్పమ్మా! వాళ్లు తిట్టుకుంటారూ' అని నచ్చ చెబితే - ఇక అదీ చెప్పడం మానేశాడు ఇంట్లో.

    విశ్వానికి పద్నాలుగేళ్లు వచ్చాయి.

    రానురానూ వాడి ఆకారం మారిపోతోంది - అవయవాలు రాలి పోతున్నాయి - రెండు పాదాలను నేలకు సరిగా మోపి నడవలేకపోతున్నాడు. రామ్మూర్తి దంపతుల నుండి ప్రేమ వీసమెత్తన్నా తరగలేదు. పర్ణశాలలాంటి ఆ ఇంట్లో ఒకరికొకరు ఆనందంగా ఉంటున్నారు - ఆ దంపతులిద్దరికీ విశ్వాన్ని క్షణమన్నా వదలలేని పరిస్థితి అయ్యింది. మొక్కలకు మళ్లు కట్టి నీళ్లు పెడతాడు - కుక్క పిల్లలతోనూ - పిల్లులతోనూ ఇటి చుట్టూ ఆడుతాడు - పాలు పళ్లెంలో పోసి అవి ఆర్చుకు ఆర్చుకు తాగి మూతిని ముందర కాళ్లతో తుడుచుకుంటే మురిసిపోతాడు.

    అలాంటి రోజుల్లోనే టైఫాయిడ్ లాంటి జబ్బు చేసి పదిపదిహేను రోజులు మంచం పట్టి ఓ తెల్లవారు ఝామున పెద్ద వాంతి అయి "నన్ను వదలకే మామ్మా" అంటూ రుక్కుతల్లి చేయి గట్టిగా పట్టుకొని ఆమె ఒడిలో అలాగే ప్రాణం వదిలాడు. రుక్కుతల్లి తల్లడిల్లిపోయింది.

    రెండు మూడు నెలలు గడిచి ఉంటాయి. కూరలు అమ్ముకొనే గంగమ్మ "అలా అనుకుంటున్నారమ్మా" అంటూ "మీ మనవడు బొట్టెడు రెండో ఆట సూసొస్తున్న అల్లా పెంకుటింటి అప్పారావుని యెనక నుండి ఫెడీల్న ఇక్కడే మీ ఇంటి ముందే తోసీనాడంట - ఆడు బురదలో పడి 'వోలమ్మె విశ్వంగారు దయ్యమై పోనా'డని ఈదిలో అందరికీ చెప్పినాడంటమ్మా!" 

    "ఎందుకమ్మా నిన్ననే రామరాజు వోకిట్లో తొంగుంటే ఆడి గుండెల మీద కెక్కి తొక్కీసినాడంట - ఆడు భయంతో కేకలేసి లేసిపోయి 'ఓలమ్మో విశ్వంగోడే నా గుండెల మీద కెక్కి తొక్కీసినాడని అందరికీ సెప్పినాడంట" అంది బుగ్గలు నొక్కుకొంటూ.

    రుక్కుతల్లి మనసంతా ఏదోలా అయిపోయి - కళ్లంబట నీళ్లు కారుతోంటే గుమ్మంలో కూలబడి పోయింది. తానీ అన్యాయం మాటలు భరించగలదా!

    తన బిడ్డ మీద ఎంతెంత అభాండాలు

* * *

    అర్థరాత్రి ఏదో చప్పుడయితే కళ్లెత్తి చూసింది రుక్కుతల్లి. మంచం మీద గాలికి చెదిరిన విశ్వాని కోసం వేసిన తెల్లటి పక్క దుప్పటి సరిగా సర్ది - "విశ్వం చలివేస్తోందా నాయనా" అంటూ కాళ్ల వేపున్న మరో దుప్పట్టి తీసి మంచం మీద నిండుగా దానిపై పరిచి "పడుకో - ఎటూ వెళ్లకు" అంటూ కళ్లొత్తుకుంటున్నారు రామ్మూర్తిగారు.

    ఆ దృశ్యాన్ని చూశిన రుక్కుతల్లి కళ్లలో తిరిగిన కన్నీటిని చెంగుతో తుడుచుకుంటూ "ఆయనది మాత్రం మనసు కాదా" అనుకుంది మనసు నిండుగా.

(నవ్య వీక్లీ ఆగస్టు 18,2010 సంచికలో ప్రచురితం)  
 
 
  

Comments