S/o. అమ్మ - దగ్గుమాటి పద్మాకర్

    మే నెల ఎండ తీవ్రంగా వుంది.

 

    పన్నెండేళ్ళ చలపతి కొడుకు పిండివంటల పళ్ళెం పట్టుకుని కావు... కావు... మంటున్నాడు పీలగొంతుతో.

 

    నాతో పాటు సుమతి అన్న, మా కాలేజీ లెక్చరర్లిద్దరూ, పక్క ఇళ్ళ వాళ్ళొక నలుగురూ, చలపతి బంధువులు మరో ఇద్దరు ముగ్గురు - అందరం నిర్లిప్తంగా నిలబడి వున్నాం! పక్కనే జంగం దేవర కూడా!

 

    శిథిలమైనవి, పాతవి, కొత్తవి... రకరకాల సమాధులు స్మశానమంతటా పరుచుకుని వైరాగ్యానికి గురి చేస్తున్నాయి.

 

    ఇక్కడ శవాలకు, సమాధులకు ప్రకృతి ప్రసాదించిన కాపలా అన్నట్లు పచ్చని పెద్ద పెద్ద కొమ్మలు విశాలంగా పరచుకున్న మర్రిచెట్లు, నేరేడు చెట్లు విసురు గాలితో ఊగిపోతున్నాయి.


    నేను మామూలుగా అయితే ఇంతసేపు ఎండలో నిలబడలేను.


    "రాను రాను ఎండలు మండిపోతున్నాయిరా చలపతీ" అంటూ ప్రతి వేసవి ప్రారంభంలోనూ చలపతితో అనేవాణ్ణి.


    "ఎండ తీక్షణతలో పెద్ద తేడా వుండదురా! ఆ పిల్లలు చూడు! నువ్వు భరించలేనంటున్న ఎండలో ఎంత కులాసాగా ఆడుకుంటున్నారో! రాను రాను మనకే శరీర సామర్థ్యం సన్నగిల్లుతోంది!" అంటూ వేసవి తాపాన్ని విశ్లేషిస్తూ చలపతి అనడం గుర్తొస్తుంది నాకు.


    ఇప్పుడనడానికి ఎండ వుందిగాని, చలపతి లేడు!


    ప్రతిసారి చెప్పి వీడ్కోలు తీసుకునే చలపతి ఈసారి... మొన్న రాత్రి... నిద్రలోనే పోయాడు. 


    నిన్ననే... ఇక్కడే... ఈ స్మశానంలోనే దహనమయ్యాడు చలపతి.


    'దహన మయ్యాడ'ని అనడం చలపతికి అన్యాయం చేసినట్లవుతుందేమోనని అనిపిస్తుంది నాకు!


    చలపతి మబ్బుగా, మంకుగా అనిపిస్తాడందరికి - వాడి భార్య సుమతికి కూడా.


    కానీ చలపతి నివురుగప్పిన నిప్పు!


    నడుస్తున్నా, నిలబడి మాట్లాడుతున్నా వాడొక అగ్నికీల! వాడొక దగ్ధ దేహం!


    నిన్నటి నుంచి నేనేం చేయాలో పాల్ పోవడం లేదు. నలభై రెండేళ్ళ వయసులో పది పన్నెండూసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను. వాడి శవాన్ని పాడెపై నుండి భుజానికెత్తుకుంటుంటే సుమతి వాడి మీద పడి విలపించింది. 


    నాకా అవకాశం యివ్వని సుమతిపై అసూయతో, ప్రపంచం మగవాడికి నేర్పిన గాంభీర్యం ముసుగులో నేనూ రోదించాను.


    ఒరే చలపతీ! నువ్వు లేని కష్టాన్నీ, నువ్వు లేని భయాన్ని ఇప్పుడిక ఎవరితో పంచుకునేదిరా చలపతీ!


    ప్రతి దినం నీతో గడిపిన కాలాన్ని... ఉదయాలనీ, సాయంత్రాలనీ, ఆలోచనలనీ, నవ్వునీ, స్నేహ మాధుర్యాన్నీ యికపై ఎవరి సాన్నిహిత్యంలో గడపాలో చెప్పరా చలపతీ! అంటూ పాడె నిలిపి ప్రశ్నించాలనుకున్నాను.


    పాడె పైకి లేస్తున్నప్పుడు పదిమందీ 'గోవిందా... గోవిందా!' అంటుంటే నేను గట్టిగా  కళ్ళు మూసుకుని 'చలప్తీ... చలపతీ!' అని మనసులో మూలిగాను. 


    మా అమ్మ పోయినప్పుడు నేను దుఃఖించలేదంటే మీరు నమ్మకపోవచ్చు. మా అమ్మ పాలిచ్చి పెంచిందేగాని నాకొచ్చే సవాలక్ష సందేహాలు తీర్చలేదు. అవి తీర్చినవాడు చలపతి! మీకు చెప్పూకోలేని కష్టాలలో నన్నోదార్చినవాడు చలపతి!


    ఒకనాడన్నాడు స్నేహం గురించి చెబుతూ... అప్పుడొక కుటుంబం నగ్రం నడిబొడ్డున చార్మినార్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందే... అప్పుడు...


    "శంకరం! మనిషికి ఆస్తులు పోనీ, తల్లిదండ్రులు పోనీ, పిల్లలూ భార్యా కూడా పోనీ! వీళ్ళందరినీ తీసిపెట్టు - వీళ్ళేం చేయలేరురా! జీవితాన్ని విశ్లేషించి ఓదార్చే ఒక్క స్నేహితుడుంటే చాలురా! మనిషి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు  దరిదాపులకు కూడా రావు! కష్టాల్ని కక్కినప్పుడు దోసిలి పట్టే స్నేహితుడుంటే చాలురా! ఆత్మ హత్యలే కాదురా - హత్యలు, రేప్‌లు చేసేవాళ్ళ పరిస్థితీ అంతేరా! ఇలాంటి వాళ్ళంతా కసితో, యావతో రగిలి పోతుంటారు! బరువైన గడ్డిమోపు మోస్తున్న రైతుకూలీలా దించి - తిరిగి తలకెత్తే వారి కోసం దేవులాడుతూ వుంటారు. వాళ్ళు! ఎవరూ దొరకలేదనుకో? మర్నాడు పేపర్లో మనం హత్య గురించో, రేప్ గురించో చదువుతాం! నేనైతే నేరస్తుల ఒంటరితనానికి జాలి పడతాను. సమాజంలో కూడు, కొంప దొరక్కపోతే పోనీ! స్నేహమూ కరువైపోతుందిరా! 


    నేనంటున్నది అవసరం కోసమో, అప్పులకోసమో, పక్కింటి వాడనో, పక్కసీటు వాడనో కాదు-


    లక్ష్యం ఒక్కటైనంత మాత్రాన గొప్ప స్నేహమంటే నేన్నమ్మను! విప్లవకారులైనా సరే, ఆప్తుల నొకరిని అట్టిపెట్టుకోవాలి! లేకపోతే పాతికేళ్ళు విప్లవం కోసం పనిచేసినా ఆ తర్వాత సంవత్సరం విద్రోహిగా మారవచ్చు! వాళ్ళు ఆత్మ విమర్శ గురించి మాట్లాడవచ్చు. ఆత్మ విమర్శ మనిషిని ఓదార్చి స్వాంతన పరుస్తుందని నాకు నమ్మకంలేదు! అందుకే;


    భిన్న లక్ష్యాలతో సైతం నిలబడేది యేదైతే వుందో అదే గొప్ప స్నేహం! ఏమంటే వీడు అవతలి వాడికి పూర్తిగా సహకరిస్తాడు. వీడి లక్ష్యం అవతలివాడ్ని కాపాడుకోవటం! అలాంటివారిని ప్రతివారూ వెతుక్కోవాలి! స్త్రీలైనా పురుషులైనా! అప్పుడిక తన్ని తాను కాపాడుకున్నట్టే!" అంటూ ముగించాడు. 


    చలపతి ఉన్నన్నాళ్ళూ నాకొక పెద్ద ధీమా! నా ప్రతి చిన్న సమస్యనీ వాడికి చెప్పుకునే వాణ్ణి. మంచిగానీ చెడుగానీ వాడు చెప్పిందే వేదం. నా మంచి కోరేవాడు మరొకడు లేడని నాకుతెలుసు. కానీ వాడిప్పుడు లేడు! ప్రపంచాన్ని పరిశీలించడం - నాకు నేను చేసుకోవాలిక!


    ఒరే! చలపతి! నన్నవిటివాడ్ని చేసి వెళ్ళిపోతావురా! నా కళ్ళను నీటి గుంటలు చెసి వెళ్ళిపోతావురా! దింపుడు కల్లంలో సైతం... నీవన్నట్టు... ఆప్తుణ్ణి... నేను పిల్చినా పలక్కుండా వుంటావురా!


    డెత్ సర్టిఫికెట్ వివరాల కోసం... చిత్రగుప్తుడట... పిలవడంతో నేను తేరుకున్నాను. 


    బహుశా యాభై పైబడ్డ వయసుంటుందేమో! పెద్ద నేరేడు చెట్టు నీడలో ఎవరిదో సమాధిపై కూర్చుని ఇటు చూస్తున్నాడు.


    ఎవరో అన్నారు నన్ను వెళ్ళమని.


    ఇవాళ చిన్న కర్మని తెలుసు గనుక అడిగినట్టున్నాడు.


    "నిన్ననే గదా చనిపోయింది?"


    "మొన్నరాత్రి... నిద్రలోనే..." నేనేదో హిప్నాటిక్ స్థితిలో సమాధానమిస్తున్నాననిపిస్తుంది.


    తేదీ వేసుకుని; "అంటే సహజ మరణమా?" అనడిగాడు.


    "అవును" అనడానికి గాని, "ఆ" అనడానికి గాని నాకు నోరు రాక తల ఊపాను.


    "పేరు?"


    "చలపతి - ఆత్మకూరు చలపతి"


    "తండ్రి పేరు?"


    బాంబు పేలింది!


    చలపతి రూపు దిద్దుకుని నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా వుంది! "చూడ్రా! శంకరం! వీడు... ఈ నాకొడుకు... నన్ను చచ్చినా వదల్లేదు!" అని గట్టిగా కౌగలించుకుని ఏడుస్తున్నట్టుగా అనిపించింది.


    బ్రతికి వుండగా అయిదారేళ్ళ క్రితం చలపతి వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను గాఢాలింగనం చేసుకున్న సందర్భం తెరలా మెదిలింది నా కళ్ళముందు.


    ఆ రోజు సుదినమో దుర్దినమో నేను చెప్పలేను.


    నా ప్రియుడు, నా మిత్రుడు నా గురుడు - సహచరుడు అలా యేడవడం... నా ఆసరాతో నన్ను కౌగిలించుకుని విలపించడం దుర్దినం కాక మరేమిటి?


    మా స్నేహం మరింత చేరువై మధురమై వికసించినందుకు అది సుదినమనీ అన్పించేది!


    ఆరోజు వాడికి 'విద్య - బోధనా పద్ధతులు' అనుకుంటాను... వాడి థీసిస్‌కి డాక్టరేట్ వచ్చింది. మేమిద్దరం ఒకే కాలేజీలో లెక్చరర్స్‌గా చేస్తున్నాం. హైస్కూలు నాటి పరిచయం నిర్విఘ్నంగా కొనసాగుతూంది. 


    ఫంక్షన్ రోజు చలపతితో నేనూ తిరుపతి వెళ్ళాను.


    సభికులతో ఆడిటొరియం నిండిపోయింది. తిరుమలలో దైవకార్యం నిమిత్తం వచ్చిన రాష్ట్రపతి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయిన కార్యక్రమం అది. 


    సభికుల హర్షధ్వానాల మధ్య, రాష్ట్రపతి చేతులమీదుగా ఫోటో ఫ్లాష్‌లను మించి వచ్చిన మెరుపులాంటి కళ్ళతో పట్టా, ఫైల్ పుచ్చుకుని నా పక్కన వచ్చి కూర్చున్నాడు చలపతి.


    వాడు కూర్చోబోయే ముందు కరచాలనం కోసం అందించిన చేయిని వాడు కూర్చున్నా వదలలేదు. 


    అరనిమిషం తర్వాత మెల్లిగా నా చేయి విడిపించుకుని ఫైల్ తెరిచి సర్టిఫికేట్ తీసి చూసుకున్నాడు.


    బహుశా రెండు లైన్లు చదివాడో... లేదో... లెక్క తప్పొచ్చిన కాగితంలా వుండ చేసేశాడు దాన్ని!


    నేనది గ్రహించి "చలపతీ!" అన్నాను.


    అప్పటికే ఎర్రగా వాడి కళ్ళు!


    ఆ కళ్ళ నిండా కన్నీళ్ళు!


    'దా! బయట కెళదాం!' అంటూ జబ్బ పట్టుకుని లేపాను. స్టేజీపై ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. చలపతీ, నేనూ గమనించే స్థితిలో లేము.


    ఇద్దరం అలా స్టేడియం నుంచి బయటకు కదిలాం.

 

    మధ్యలో ఎక్కడా ఆగలేదు, మాట్లాడుకోనూ లేదు. లైబ్రరీ మెట్ల దగ్గర కొచ్చి కూర్చున్నాం. 


    "చలపతీ! ఏమైంది?" అన్నాను నేను కూర్చుంటూ.


    "చూడరా! ఈ ప్రపంచం నన్ను వేటాడి చంపుతోందిరా! సున్నితంగాను, పట్టుదలగాను వున్నవాడు ఈ ప్రపంచంలో బతికేందుకు అర్హుడు కాడేమోననిపి స్తోందిరా!" అని, వుండ జేసిన పట్టా కాగితాన్ని విప్పి యిస్తూ "చదువు!" అన్నాడు.


    నేను మెల్లిగా చదువసాగాను.


    ఎస్వీ యూనివర్శిటీ - 


    ఫేకల్టీ ఆఫ్...


    దిసీస్ టు సర్టిఫై దట్ శ్రీ ఆత్మకూరు చలపతిరావు S/o ఆత్మకూరు రంగనాథరావు...


    అంతవరకే చదివాను.


    బద్దలయ్యాడు చలపతి.


    "వీడే! ఆ నా కొడుకే! వీడేరా... నన్ను చిన్నపట్నుంచి ఈ క్షణం వరకు చిత్రవధ చేస్తున్న శత్రువు - వీడు చావడు! నన్నొక్కసారిగా చంపడు!


    వీడెప్పుడో తుపుక్కున మా అమ్మపై ఊసిన ఉమ్మికే విలువనిచ్చి నా తల్లి లాలనని, ప్రేమని, ఆమె నా పెంపకానికై పడ్డ శ్రమని - ఈ ప్రపంచం నా మెడల మీదెక్కి అవహేళన చేస్తున్నట్లుంటుంది.!


    వీడెప్పుడో ముప్ఫయ్యయిదేళ్ళ క్రితం మోసం చేశాడు. ఆవిడకు కడుపు చేసి రెండేళ్ళు కాపురం చేశాడు. వెళ్ళిపోయాడు. అవకాశం, తెలివి వున్న ప్రతివాడూ యితరులను తరతరాలుగా అందినమేరకు ఏదో రకంగా దోచుకుంటూనే వున్నాడు. అందుకు నేను బాధపడను. కానీ వీడీనాటికీ మా అమ్మపై పెత్తనం చెలాయిస్తూనే వున్నాడు.


    మా అమ్మ తాను విస్తర్లు కట్టి అర్థాకలితో నన్ను చదివిస్తున్న నాటినుండి - గవర్నమెంటు కాలేజి లెక్చరర్‌గా నెలకు పదివేలు సంపాదిస్తున్న ఈనాటికీ - నిద్రలేచి ముందుగా వాడు కట్టిన తాళిని కళ్ళకద్దుకుంటుంది! తలుచుకుంటేనే రక్తం పొంగుతుందిరా!


    మా అమ్మనలా ఒకసారి తెల్లవారుజామున చూశాను.


    ఆవిడ అమాయకత్వానికి జాలి...


    ఆవిడ మూర్ఖత్వానికి కోపం...


    ద్రోహులపై సైతం ఆవిడ ఆరాధనకి ప్రేమ...


    ముప్పేటగా కలిసి నన్ను ముట్టడించాయి. నేనా రోజంతా తీవ్రంగా ఆలోచించాను. 


    జైలు అన్నదానికి అర్థం తెలిసింది.


    పక్షికి పంజరమొక్కటే జైలు - మనిషికి అంతరంగంలో చాలా జైళ్ళున్నాయి.


    మా అమ్మ మానవజాతిలో ద్రోహియైన ఒక మగాడినే చూసింది, కొంత కాలమైనా వాడినే భరించింది, అనుభవించింది. మరో మగవాడినీ, వాడితో స్నేహాన్నీ, పరిచయాన్నీ, ఆలోచననీ, ప్రయోగాన్నీ పంచుకుని తానెరుగదు.


    మెళ్ళో తాళి, ఒళ్ళో నన్ను అంటగట్టి వాడెళ్ళటంతో మా అమ్మ యవ్వనమంటే తెలియకుండా జీవించింది!


    నన్ను అది మరీ బాధించింది. 


    నా పెళ్ళయినప్పటినుండి ఈనాటికీ సుమతీ, నేనూ కలుసుకోవటం కూడా ఏదో దొంగ తిండి తిన్నట్టే వుంటుంది - ఐమీన్ - అమ్మంకు దొరకని తిండి నేను తిన్నట్టు!


    అవతలి గదిలో అమ్మ ఒంటరి ఆలోచనలు.


    ఆవిడ తాళి తీయదు! నొసటన, పాపిట్లో ఆ కుంకుమ బొట్లు మానదు! మానమని నేను చెప్పలేను! ఎందుకంటే నేను మా అమ్మని చూసినప్పుడంతా అమ్మ కంటే ముందు వాడు గుర్తుకొస్తాడు!


    మా అమ్మ కష్టపడి పెంచి, నేను యిష్టపడి చదివి పాసైన మార్క్‌లిస్టు చూస్తే -


    నా అస్తిత్వం - గుర్తింపు - వీడి ద్వారా నా అనిపిస్తుంది!


    వాడు వదిలిన ఒక్క కణానికి కోట్ల కణాలను తన శరీరం నుంచి పోగుచేసి నాకు రూపునిచ్చిన మా అమ్మనెందుకురా గుర్తించ నిరాకరిస్తారు?


    మనల్ని కన్నదెవర్రా?


    మన వయసు నిమిషాలలో, గంటలలో వున్నప్పుడు భయానికి హత్తుకునిందెవర్రా?


    ఆకలికి పాలిచ్చిందెవర్రా?


    నిద్రకు జోకొట్టిందెవర్రా? 


    కోడిపిల్లలు, కుక్కపిల్లలు ఎవరి బిడ్డలుగా గుర్తింపు?


    నేను ఇంటర్మీడియట్‌లో చేరేప్పుడు...


    నీకు తెలీదు...


    తండ్రి పేరున్న కాలమ్ దగ్గర, తండ్రిని కొట్టి తల్లి పేరుగా దిద్ది మా అమ్మ పేరు రాశాను.


    "ఇక్కడడిగింది తండ్రిపేరు! అప్లికేషన్స్ లో నీ యిష్టమొచ్చిన కాలమ్స్, నీ యిష్టమొచ్చిన జవాబులు కాదు రాయాల్సింది" అన్నాడు ఎల్.డి.సి. 


    నేనమాయకంగా, "మా అమ్మ పేరు రాయకూడదా?" అన్నాను.


    మీ నాయన లేడా? చచ్చిపోయినా ఫర్వాలేదు! మీనాన్న పేరే రాయమన్నాడు.


    వాస్తవం చెప్పి మా అమ్మను జాలికి, అవమానానికి గురి చేయడం యిష్టం లేక అలాగే - ఈ నా కొడుకు - పేరే  రాసి వచ్చేశాను.


    "శంకరం! వీడు నీడలా కాదు - నిప్పుల శెగలా వెంటాడుతున్నాడురా నన్ను"


    "నేను మా అమ్మ కొడుకుగా ప్రకటించుకుంటానంటే ఎందుకురా ఈ ప్రపంచం వొప్పుకోదు?" అంటూ నన్ను కావలించుకుని నా భుజాలపై వాలిపోయాడు.


* * * 


    చిత్రగుప్తుడు అడిగాడు.


    "అయ్యా! తమరు దుఃఖంలో వున్నట్టున్నారు. మిమ్మల్ని ఈ చలపతిగారి తండ్రి పేరడిగాను!" అన్నాడు.


    కళ్ళు తుడుచుకుని అడిగాను.


    "తల్లి పేరు రాయకూడదా?"


    అతను వివరణాత్మకంగా అన్నాడు.


    "ఈయన ప్రభుత్వోద్యోగి అయితే భార్యకో, పిల్లలకో ఇదవసరం అవుతుంది. ఒక్క అక్షరం తప్పు పోయినా వారసులకు ఉద్యోగం రాదు!"


    "లేదు! ఈయన భార్యకు ఉద్యోగం అవసరం!" అన్నాను.


    "అయితే ఇక్కడ అడిగినట్లు రాయడం మంచిది"


    "సరే రాయండి! ఆత్మకూరు రంగనాథరావు" వణుకుతూ అన్నాను.


    ఆ తర్వాత అతడేవో అడిగాడు.


    నేను చెప్పాను. 


    నా చేతికో కాగితం యిచ్చి - ఆశగా, అవసరంగా చూశాడు.


    అతనికో వంద యిచ్చి - కాగితం చదువుకుంటూ అనుకున్నాను.


    "ఒరే! చలపతీ! నన్ను క్షమించరా! ఈ కాగితాలతో పనేముందిరా! నువ్వు మీ అమ్మ కొడుకువే లేరా! అందరం అమ్మ కొడుకులమేలేరా!"


    ఇలా అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాను.


    నా చీకటి కళ్ళలో చలపతి రూపం... నన్ను కావిలించుకుని ఏడుస్తూ.   


(ఆహ్వానం మాసపత్రిక నవంబరు 1996 సంచికలో ప్రచురితం)   

Comments