సబల - విరించి

 
    " నందూ !....."
   
    పరిచయమున్న కంఠమేదో పిలిచినట్టుగా వినిపించడంతో  ముందుకు పడబోతున్న అడుగు ఠక్కున ఆగిపోయింది. 
   
    ఆ పిలుపులో తొణికిసలాడే ప్రేమ అనురాగం ఆప్యాయతలు సత్యానంద్‌కు కొత్తేం కాదు. 
   
    ఒకప్పుడైతే ఆ గొంతు వినగానే అతని తనువు పులకరించేది. 
   
    పదేళ్ళ క్రిందటే దూరం చేసుకున్న ఒక తీయని అనుబంధం ఆ పిలుపు. 
   
    చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు అదే పిలుపు.
   
    అదే ప్రేమ అదే మమకారం అదే మాధుర్యం కలిసి వినిపించడంతో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాడు. 
       
    ఎదురుగా ఐరావతం లాంటి తెల్లని పెద్ద కారు.
      
    ఆ కారు దిగి, బంగారు వర్ణపు అంచు గల ఎర్రని కంచి పట్టు చీర దానికి మ్యాచింగ్ బ్లౌజు  వేసుకున్న  అందమైన యువతి  సాయంకాలం సూర్యాస్తమయ వేళ పశ్చిమాకాశాన్నావరించిన లేత కెంజాయ రంగు శరీరం, కొదమ తేటుల దండు ముసిరినట్టుగా నల్లని ఒత్తైన జుత్తుతో మరీ సన్నగా కాక అలా అని మరీ లావుగా కాకుండా ఎత్తుకు తగ్గ లావుతో పాత కాలం తెలుగు సినిమాలోని హీరొయిన్‌లా వున్న స్త్రీ  నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తనవైపు వస్తుంటే మహా ఋషుల  తపస్సుని భంగమొనర్చడానికి దేవలోకం నుండి దిగివచ్చిన అప్సరస దారి తప్పి తన వైపు వస్తుందేమో అన్నంత ఆశ్చర్యంగా నోరెళ్ళ బెట్టుకొని చూస్తుండి పోయాడు.
      
     ఆమె నడుస్తూ అతని వైపు వస్తుంటే ఇద్దరి మధ్య దూరం తగ్గ సాగింది.
    
    ఇద్దరి మధ్య దూరం కేవలం ఆరడుగులకు చేరింది,  అప్పటి వరకు ఆమె ఎవరో అర్థం కాక మెదడు  లోని ఆలోచన పొరల్ని కదలిస్తుండగా ఒక్క సారిగా అతని ఆలోచనా దొంతరల్లో తళుక్కున మెరుపేదో మెరిసినట్టయింది, 
           
    ఆమె... ఆమె... పదేళ్ళ క్రితం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి సర్వస్వాన్ని అర్పించి తనచే వంచించ బడిన వసంత .
     
    వసంత ఆనాడు ఎన్నో మాయ మాటలు, ప్రేమ కబుర్లు చెప్పి చివరికి ఆత్మహత్య అనే ఆయుధాన్ని ఉపయోగించి లొంగదీసుకొని మోజు తీర్చుకొని తర్వాత నిరుపేద కుటుంబానికి చెందినదన్న ఒకే ఒక కారణంతో ఆనాడు దూరం చేసుకున్న వసంత.
   
    ఆమెను గుర్తించగానే తెలియని భయమేదొ గుండెలో ఆవరించింది .
     
    'నా బ్రతుకుతో ఎందుకాడుకున్నావ్' అని నిలదీస్తుందేమో అనే భయం కావచ్చు .
     
    "వ... వ... వసు... నువ్వు... నువ్వు... నువ్వేనా..."
    
    అప్రయత్నంగా అతని పెదవులపై నుండి వచ్చిన మాటలవి.
     
    తడారి పోయిన గొంతును ఆ గొంతులోని తడబాటును ఆమె గుర్తించినా గుర్తించనట్టుగానే మందహాసంతో 
      
    "ఊ... మరి ఎవరనుకున్నావ్ నందూ!.." అని అడిగింది. 
      
    ఆ గొంతులో అదే లాలిత్యం.  అదే  ప్రేమ.  ఆనాడు  ఆమె ఎంత ప్రేమగా పిలిచేదో ఈరోజు అంతే ప్రేమగా పిలవడం అతనికాశ్చర్యం కలిగించింది.
     
    "ఏంటి వసు, నువ్వు ఇక్కడ నమ్మలేక పోతున్నాను, నువ్వు... ఈ కారు..."
    
    అతనడగబోయే  దేమిటో అర్థం చేసుకున్న వసంత 
    
    "అవన్నీ చెప్పాలంటే ఐదారు నిమిషాలు ఈ రోడ్డు మీద మాట్లాడుకుంటే సరిపోతుందంటావా నందూ! ఈ రోడ్డు మీద డిస్కషన్ లెందుకు అసహ్యంగా... పద కార్లో కూర్చొని మాట్లాడు కుందాం" అంటూ అతని జవాబు కొరకు ఎదురు చూడకుండా వెనుతిరిగి కారు కేసి నడవసాగింది.
   
    ఆ కంఠంలో కమాండింగ్ వుంది. ఆ నడకలో ఠీవి వుంది .
   
    హంస గమనం లాంటి ఆ నడక అతనికిష్టం. 
   
    ఆమె  నడుస్తుంటే లయబద్ధంగా కదలే ఆమె నితంబాలని చూడడమంటే ఇంకా ఇష్టం.
   
    లయబద్ధంగా కదిలే పిరుదులపై ఒత్తైన నల్లని జడ దరువేస్తుంటే చూడడం ఇంకా ఇంకా ఇష్టం.

    అది ఈరోజు ఏర్పడ్డ ఇష్టం కాదు, పదేళ్ళ క్రిందటే ఏర్పడ్డ ఇష్టం.
    
    ఆ నడకలో ఇంతకు ముందులేని హుందాతనం  వుంది.
    
    ఆనాడు తానెరిగిన వసంత కంటే ఇప్పుడు వసంత ఇనుమడించిన అందంతో హుందాతనంతో నిండు గోదారిలా వుంది.
   
    ఆనాటి వసంత గలగలా గోదారైతే, నేడు నిండు గోదారి.
   
    వశీకరణ మంత్రానికి లోబడిన వాడిలా అమెననుసరించి కారులో కూర్చున్నాడు.
   
    వసంత కారును స్టార్ట్ చేసి నెమ్మదిగా పోనివ్వసాగింది.
   
    నెమ్మదిగా కారు రోడ్డు పై వెళ్తుంటే సత్యానంద్ మనసు ఆలోచనా తరంగాలను తట్టి లేపుతుంది.
    
    క్షణాలు నిమిషాలయ్యాయి. ఇద్దరి మధ్య మౌనం వీర విహారం చేస్తుంది. ఆ నిమిషాలు గంటలుగా మారే ప్రమాదాన్ని గ్రహించిన వసంత నిశ్శబ్దాన్ని నిర్వీర్యం చేస్తూ ......
     
    "ఏంటీ నందూ! ఎందుకీ మౌనం..." రోడ్డు వైపు చూస్తూనే అడిగింది.
       
    "సారీ వసంతా, ఆరోజు నేనలా చేయడం..." నీళ్ళు నములుతూ జరిగిన దానికి సంజాయషీ ఇవ్వబోతున్న విషయం అర్థమై అతని మాటలని మధ్యలోనే త్రుంచుతూ
      
    "ఓ!  నువ్వింకా ఆ పాత విషయం మర్చి పోనేలేదా! దానిగురించి ఇంకా బాధ పడుతున్నావా పిచ్చి నందూ... నేనప్పుడే మర్చి పోయా, ఏదో కుర్రతనం కదా ఐనా నువ్వేంటి సారీ... ఏంటి...  తప్పులు చేసినా తలెత్తుకు తిరిగే దమ్మున్న మొనగాణ్ని అని కదా ఆరోజు అన్నావ్ మరి ఇప్పుడు ఈ సారీలెందుకు?  
 లీవ్ ఇట్ నందూ. నాకు పూర్వపు నందే ఇష్టం బి ఫ్రీ నందూ." అతని కుడి చేతి పై తన చేతిని వేసి నొక్కుతూ అంది. 
      
    అంత వరకు అతనిలో చోటు చేసుకున్న అపరాధ భావన ఆ చర్యతో తొలగిపోయింది. 
    
    సీట్లో సర్దుకు కూర్చున్నాడు, ఎన్నో అనుమానాలు అతని మనసును తొలుస్తూనే వున్నాయి. ఎన్నో ప్రశ్నలు??? పేదతనంతో కొట్టుమిట్టాడే ఈమెకు ఇంత సంపదెలా వచ్చింది. ఆలోచనలకందని ప్రశ్నగా మారడంతో 
    
    "వసంతా ఈ కారూ..." ఏదో అడగబోతూ ఆమె తనకేసి తీక్షణంగా చూడడంతో ఠక్కున ఆపేశాడు .
   
    అతని కళ్ళలో కనిపించిన బెదురు చూసి నవ్వుతూ  "వసంతా... ఏమిటి వసంతా. పరాయివాడు పిలిచినట్టు  పిలవాలనుకుంటే ఎప్పట్లా ఏరా వసూ అనే పిలువ్ నువ్వలా పిలిస్తేనే నాకిష్టం" అన్నది.
  
    ఆమె కళ్ళలో కనిపించిన తీక్ష్ణతకి కారణం తెలిసి ఫక్కున నవ్వాడు `ఓస్ ఇంతేనా` అన్నట్టు.
      
    "అదే వసూ ఈ కారూ..." అతడు ఎమడగాలను కుంటున్నాడో  ఆమెకు తెలుసు. ఈ ప్రశ్ననామె ఎప్పుడో ఎక్స్‌పెక్ట్ చేసుకున్నది కూడా.
    
    "నాదే నోయ్... ఇప్పుడీ  వసూ పాత వసూ కాదులే.... అంటే డబ్బుల్లో మాత్రమేలే" నవ్వుతూ అంది .
      
    "అంటే..."
      
    "అంటే... పిచ్చి మొద్దూ ఈ కారే కాదు నగరం లోని భువనా కాంప్లెక్స్, రంజితా షాపింగ్ మాల్, విశ్వాత్మ టవర్స్, కాత్యాయని కమర్షియల్ ఎన్క్లేవ్, యశస్వి ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్,  కల్యాణి కన్‌స్ట్రక్షన్స్, భారతి సూపర్ మార్కెట్ ఇవన్నీ నా సొంత బిజినెస్‌లు తెల్సా? మంత్లీ టర్నోవర్  కొట్లలో వుంటుంది . నా గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ నీ గురించి చెప్పు సిటీకి ఎప్పుడొచ్చావ్? ఎన్ని రోజులుంటావ్, ఎందరు పిల్లలు నీ భార్యారత్నం ఎలా వుంది " ఫుల్ స్టాప్ కాని కామా కాని లేకుండా గబగబా అడిగేసింది. 
        
    ఒకనాడు రెండు పూటలా తిండికి మొహం వాచిన కుటుంబం.  అంతే కాదు ఎవరినీ ఎలాంటి సాయం అడగలేని ఆత్మాభిమానం మెండుగా గల కుటుంబం అమెది.  ఆత్మాభిమానం, పేదరికం రెండూ ఒక చోట కలిసి వుంటే కుటుంబాలు ఎదగవన్న వాస్తవం అతనికి తెలుసు. మరి ఈవిడ గారికి ఇంతటి స్థితి...
   
    ఆమె పట్ల ఈర్ష్య ప్రారంభమయ్యింది. ఆ ఈర్ష్య, అసూయలను బయటకు కనిపించ నీయకుండా దాచడానికి ఎంతో ప్రయత్నించాల్సొస్తోంది.
     
    "ఏంటి నందూ ఎప్పుడూ పరధ్యానమేనా ...... చెప్పూ  నీ గురించి" రెట్టించి అడిగింది. 
     ఆమె అలా రెట్టించి అడిగే సరికి రాణి నవ్వునోసారి పెదాలపై అతికించుకొని  ఓ వేడి నిట్టూర్పు వదులుతూ  "ఓడలు బండ్లవుతాయ్ బండ్లు ఓడలవుతాయ్ అంటే ఇదేనేమో..."
   
    ఉపోద్ఘాతంలా ప్రారంభించి చెప్పడమారంభించాడు.

    "డిగ్రీ కుడా పూర్తి కాకుండానే నువ్వొచ్చి  నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని పెళ్లి చేసుకొమ్మని అడిగే సరికి  నేనెక్కడ నిన్ను పెండ్లాడతాననో మా అమ్మ నాన్నలు లతతో నా పెండ్లి ఖాయం చేసారు. 

    లత కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. మాకున్న కోట్లకు అదనంగా మరిన్ని కోట్లు చేరుతుండడంతో నిన్ను అనరాని మాటలని అవమానించి, చివరికి పెళ్ళికాకుండా నే నాపక్కలో పడుకున్నదానివి పెండ్లయ్యాక మరొకని పక్కలోకి వెళ్లవన్న గ్యారంటీ ఏమిటి? అని కూడా అవమానించి ఆమెను పెండ్లాడాను.
'వివాహం విద్య నాశాయ శోభనం సర్వ నాశనం' అన్నట్టు పెళ్ళితో నా చదువు అటకెక్కింది. ధనవంతులమన్న అహంకారం నా భార్య ఆస్తి కలిసి రావడంతో దురహంకారంగా మారింది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి అని భ్రమించాం కాని కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని మర్చిపోయాం. మా అమ్మానాన్నలు లతా వాళ్ళ అమ్మానాన్నలు కలిసి దక్షిణ యాత్రలకి వెళ్లి మధ్యలో ఆక్సిడెంట్‌లో పోయారు. ఇక మాకు మంచి చెప్పేవారు కానీ బుద్ధులు చెప్పే వారు గాని లేక అనుభవాల గురించి ఆలోచన లేకుండానే ఎన్నో వ్యాపారాలారంభించి నష్టాల ఊబిలో కూరుకు పోయాము. 
     
    మేము కళ్ళు తెరిచే సరికి జరగాల్సిన ఘోరం జరిగి పోయింది. ఆస్తులన్నీ కరిగాయి, అప్పులకోసం మా ఇద్దరి ఇండ్లూ అమ్ముకోవలసొచ్చింది. అప్పటికే మాకు ఇద్దరు పసికూనలు. 
    
    పూలమ్మిన చోట కట్టెలమ్మలేక పసివాళ్లతో బాటు బ్రతుకు తెరువు కోసం ఈ నగరానికొచ్చాం. డిగ్రీ కూడా లేని నాకు జాబెవడిస్తాడు? చాలా రోజులు ఉద్యోగం సద్యోగం లేక పైసా సంపాదన లేక ఎన్నో రోజులు పస్తులున్నాం. మొన్న మొన్నే ఓ ఫైనాన్సు కంపనిలో క్లర్కుగా చేరా. ఓ ఆరు వేలిస్తున్నారు. మాకోసం కాకున్నా పసివాళ్ళ కోసమైనా బ్రతకాలిగా. అందుకే భారంగా బ్రత్కు బండి నీడుస్తున్నాము." ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం కూడా లేకపోవడంతో తల వంచుకొని గద్గద స్వరంతో చెబుతుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. 
        
    అతన్ని ఊరడిస్తున్నట్టుగా అతని చేతిని సున్నితంగా స్పృశించింది.

    ఇద్దరి మధ్య మౌనమే కాసేపు ఆధిపత్యాన్ని చాటుకుంది.
      
    కారు నెమ్మదిగా ముందుకు పోతుంది. వాళ్ళ మనసులలోని ఆలోచనల్లా నిశ్శబ్దాన్ని నీరుకారుస్తూ వసంత "నందూ......" పిలిచింది. 
     
    "ఊ..."
     
    "చీఫ్ అడ్వైజర్‌గా జబిస్తాను చేస్తావా?"
     
    ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు సత్యానంద్. 
    
    "నేనేంటి అడ్వైజరెంటి? డిగ్రీ కూడా లేని నేనేమిస్తాను అడ్వైజ్  చెప్పు?"
     
    అతని మాటలకు నవ్వుతూ  "నీ బోడి అడ్వైజులెవడిక్కావాలోయ్. వాటికి మా కంపనీలో చాలా మంది వున్నారు గాని నేనిచ్చే ఈ జాబు నాకోసం. నా కోసం నువ్వీ జాబు చేస్తావా?  జీతం నీకెంత కావాలంటే అంత తీసుకో. నాకు నువ్వు కావాలి" ఆమె రోడ్డు వైపు చూస్తూ మాట్లాడ్డంతో ఆమె ముఖంలోని భావాలేమి కనిపించలేదు అతనికి. ఆమె మాటలు అర్థమై అర్థం కానట్టుండడంతో 
      
    "అంటే..."అడిగాడు.
 
    "ట్యూబ్ లైట్ అంటే ఏమిటో తెల్సా? అడిగింది 
     
    "ఓ తెలుసు మా ఇంట్లో నాలుగున్నాయ్" చెప్పాడతను. 
   
    ఆ జవాబుకు బిగ్గరగా నవ్వసాగింది వసంత. 
     
    ఆమె అలా నవ్వుతుంటే ఎత్తైన ఆమె వక్షస్థలం ఎగిరెగిరి పడసాగింది. ఆ కదలికకు అప్పటివరకు స్తనసంపదను దాచిన పయ్యెద స్థానభ్రంశం చెంది ఉన్నత శిఖరాలను పోలిన స్తనద్వయం బహిర్గతం కావడంతో అతని కనులు రెప్ప వేయడం కూడా మరిచి పోయాయి. ఇదేది గమనించని ఆమె అతి కష్టం మీద నవ్వుని కంట్రోల్ చేసుకొని "ఔను మీ ఇంట్లో నాలుగు ట్యూబ్ లైట్లు. ఒకటి నువ్వు రెండు మీ ఆవిడ మిగతా రెండేమో మీ పిల్లలు కదూ" అంటూ తిరిగి నవ్వసాగింది. 
   
    ఆమె తనని ఎగతాళి చేస్తుందని అర్థమై ఉడుక్కుని బుంగమూతి పెట్టుకున్నాడు .

    అతని అవస్థ చూసి నవ్వుకుంటూ కారునొక నిర్జన ప్రదేశంలో ఆపి వివరంగా చెప్పాలని నిర్ణయించుకొని ఎలా ప్రారంభించాలా అని ఓ రెండు నిమిషాలు ఆలోచించి మొదలు పెట్టింది .
       
    "విశ్వనాథ్ ఈ నగరం లో ఒక బడా పారిశ్రామిక వేత్త. టీనేజ్‌లోని సహజమైన దూకుడు అతని పాలిట శాపమైంది. బైక్ మీద వేగంగా వెళుతూ ప్రమాదానికి గురై స్పైనల్కాడ్ దెబ్బ తినడంతో సంసార సుఖాలకు పనికి రాకుండా పోయాడు. పెళ్లి పెటాకులు, పిల్లలు లేకుంటే  సమాజంలో పరువుండదని భావించి నా పుట్టబోయే కొడుక్కి తండ్రిగా నాకు భర్తగా ఉండడానికి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు.
  
    మా పెళ్ళైన రెండు సంవత్సరాలకే మళ్ళీ నా దురదృష్టం వెక్కిరించింది. సడెన్ హార్ట్ ఎటాక్‌తో వారు పోయారు. మళ్ళీ ఒంటరినయ్యా .
        
    కొదువలేని సంపదలున్నాయ్ కాని వయసు కోరే సుఖాలు తీరక నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను. మరో పెళ్లి చేసుకుంటే మా వారికి అన్యాయం చేసిన దానినవుతాను అలాగని అడ్డదారులంటే సంస్కారం ఒప్పుకోలేదు. ఇంత కాలం నా ఖర్మ ఇంతేనని సరిపెట్టుకున్నా.  కానీ వారం క్రితం నిన్ను ఇక్కడే చూసాను. ఆ రోజు పిలిచాను నీకు వినపడలేదేమో.  కానీ ఆ రోజు నుండి నా మనసు నా మాట వినట్లేదు. బాగా ఆలోచించా నువ్వు నాలో చూడనిది కాని నువ్వు తాకని ప్రాంతం కాని నాలో ఏమి లేవు. నా సర్వస్వాన్ని అర్పించింది నీకే. ఆనాటి నుండి ఈనాటి వరకు నా హృదయంలో వున్నది నువ్వే. అందుకే ఇక మడికట్టుకు కూర్చోవడమెందుకనే నిర్ణయానికొచ్చా. చాటో మాటో నాకు తోడుగా నీడగా నెలలో కొన్నిరోజులైనా నీ సమక్షంలో గడపాలని అనుకున్నా.
      
    నీ భార్య ఆరోజు అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయ్. 'తేనెటీగ లాంటి వాడు మగవాడు. తనకు కావలసిన మధువు కొరకు ఎన్ని పూవులపైన నైనా ఆ తుమ్మెద వాలినట్టే మగవాడు ఎంత మంది ఆడవాళ్లని అయినా కోరుకుంటాడు. మా సత్యం నీ లాంటి వలలు విసిరే ఆడవాళ్ళని పది మందిని మేన్‌టెయిన్  చేసినా తనకు అభ్యంతరం లేదం'ది కదా, ఆమెకైతే అభ్యంతరం ఉండదు మరి నీ సంగతి?  ఈ ప్రపోజల్ నీకిష్టమైతేనే" అంటూ ఆపింది.   
    
    ఆమె మాటల్లోని ఆంతర్యం అర్థమైంది. అతని సంతోషానికి అవధులు లేవు. 
   
    'అదృష్టమంటే నీదేరా సత్తిగా!' అని అంతరాత్మ వీపుపై తడుతూ అభినందించినట్టు అనిపించింది.
 
    అందాల భరిణ తనకు తానుగా చేర రమ్మంటే కాదని చెప్పేంత అర్భకుడేం కాదు. ఈ అవకాశం కలిసొస్తుంటే అతనిలోని ఒరిజినల్ మనిషి తిరిగి  ఆవులిస్తూ నిద్ర లేచాడు.
      
'ఇప్పుడీ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నలిచ్చి పాలకోవాలాంటి దీని పొంకాలతో ఆడుకొంటూ రెండు మూడేళ్ళలో ఈవిడ గారి ఆస్తినంతా హస్తగతం చేసుకోవచ్చు. తిరిగి నేను పూర్వవైభవం పొందొచ్చు. ఇది నిజంగా పిచ్చిది. గొర్రె కసాయిని నమ్మినంత ఈజీగా ఇది నన్ను నమ్ముతోంది. దీనిలాంటి బకారాలున్నంత కాలం నాలాంటి వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయ్' అని వక్ర మార్గంలో అతని ఆలోచనలు పరుగెత్త సాగాయ్. అయినా బయటకెంతమాత్రం తన భావాలను కనిపించనీయక ఎంతో బాధ పడుతున్న ఫోజోకటిచ్చి ఆమె భుజాలపై చేతులేసి కౌగిలిలోకి తీసుకుంటూ 
      
    "సారీరా! నీ బాధలకు నేనే కదా కారణం. నా తప్పును దిద్దుకునే అవకాశం వచ్చింది కదా. ఇక నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను లేరా" తన జీవితాన్నే త్యాగం చేస్తున్నంత బిల్డప్ ఇచ్చాడు.
   
    "థాంక్ యు నందూ నువ్వోప్పుకోవేమో అని భయపడ్డాను" అంటూ అతని కౌగిట్లో ఒదిగిపోయింది. 
    
    ఆమె తలలోని మల్లెలు మత్తేక్కిస్తుంటే  అతని చేతులేదో చిలిపి పని చేయబోతుంటే ఆమె నవ్వుతూ 
    
    "నీ చేతులను  కాస్త ఆపవోయి అన్ని ఫస్ట్ డేట్ తర్వాత ఊటి వెళ్లి ఓ పది రోజులు ఎంజాయ్ చేసొద్దాం సరేనా" అంటూ అతని కౌగిలి నుండి విడివడి పర్స్ నుండి యాభై వేలు తీసి అడ్వాన్స్‌గా ఇచ్చి అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఫస్ట్ డేట్ నాడు ప్రొద్దున తొమ్మిది వరకు ఆఫీసుకు రమ్మని చెప్పి అతన్ని విడువలేక విడువలేక వెళ్లి పోయింది.
     
    జేబులో యాభై వేలు మదిలో కొబ్బరిలడ్డు లాంటి ఒకనాటి ప్రియురాలు అతని సంతోషానికి హద్దు లేకుండా పోయింది. హుషారుగా ఈల వేస్తూ వస్తున్న భర్తను చూసి "ఏమిటీ ఈరోజు  ఆలస్యమైంది? పైగా చాలా హుషారుగా వున్నారు?" అని లత అడిగింది.
   
    ఆ ప్రశ్నకు ఎంత మాత్రం తడుముకోకుండా "నాకు నెలకు యాభై వేల జీతం వచ్చే కొత్త జాబు వచ్చింది. ఫస్ట్ నుండి ఓ పదిహేను రోజులు బెంగుళూరులో ట్రైనింగ్ " అని అబద్ధం చెప్పి నమ్మించడానికి జేబులోని రూపాయలని అడ్వాన్స్ ఇచ్చారని చెప్పి అమెకిచ్చాడు. 
      
    ఆ వార్త ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
    
    ఫస్ట్ ఇంకా ఐదు రోజులుంది. సత్యానంద్‌కు క్షణమొక యుగంలా గడుస్తున్నా ఏ క్షణము ఆగిపోలేదు, ఆగదు కూడా. కాలం గాలానికందేది కాదు కదా. అనుకున్న ఫస్ట్ డేట్ రానే వచ్చింది.
     
    ప్లాన్ ప్రకారం సత్యానంద్ వసంతల హానీమూన్ ప్రారంభమైంది. పదిహేను రోజులనుకున్న టూర్ నెలరోజులు సాగింది. 
    
    కోల్పోయాననుకున్న సుఖాలను కోరి కోరి దక్కించుకుంది వసంత.  నెల తర్వాత నగరానికి తిరిగి వచ్చారు. ప్రయాణ బడలిక వాటర్ ఎలర్జీ వీటికి తోడు వాతావరణ మార్పు వలన కాస్త సుస్తీ గా వుండడంతో  ఆరోజు రాత్రి వసంత వాళ్ళ గెస్ట్ హౌజ్ లో పడుకొని మరునాడు ఇంటికి వెళ్లాలనుకున్నాడు సత్యానంద్.  
          
    మామూలు నలత అనుకున్నది తీవ్ర జ్వరంలోకి మారి నాలుగు రోజులు మంచం మీదనుండి లేవలేక పోయాడు. నెలరోజులనుండి బిజినెస్ వ్యవహారాలకు దూరంగా వుండడం మూలంగానేమో వసంతకు ప్రస్తుతం పని భారం పెరగడం వల్ల ఆమె ఆ గెస్ట్ హౌజ్  ఛాయలకే రాలేదు. 

    సమయానికి మందులో నీళ్ళో కనీసం పలకరించే వారు కాని ఎవరూ లేకపోవడం సత్యానంద్ కు ప్రత్యక్ష నరకమే ఎదురైంది. గొంతు తడారి నీళ్ళు  కావాలన్నాఇచ్చేవారు లేక, తానే స్వయంగా  లేచి వెళ్ళే శక్తి లేక, డాక్టర్ ను తీసుకొచ్చే నాథుడు లేక, కనీసం పారసిటమల్  మాత్ర కూడా లేక,  ఇక తనకు చావు మూడిందనే  నిశ్చయానికి వచ్చాడు.
   
    నెల రోజులు పొందిన సుఖ సంతోషాల కంటే ఈ నాలుగు రోజుల జ్వరం పెట్టిన ఇబ్బందే ఎక్కువ .
 
    ఆరోజు జ్వరం కాస్తంత తెరిపి ఇవ్వడంతో మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకొని స్నానం చేసి డ్రెస్ వేసుకుంటుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. డ్రెస్ వేసుకొని వెళ్లి డోర్ తెరిచి ఎదురుగా వున్న వ్యక్తిని చూసి నిర్ఘాంత పోయాడు.
    
    ఎదురుగా చింపిరి తల మాసి నలిగినా పాత కాటన్ చీర చెంపలపై కన్నీటి చారలతో లతా నిలబడి వుంది. లతని అక్కడ అలా చూడగానే మొదట ఖంగు తిన్నాడు. 
    
    నోట మాటరాక బొమ్మలా నిలబడిన భర్తని చూసి ఎద లోతుల్లోంచి  దుఃఖం తన్నుకు రాగా 
       
    "ఏమండీ! మీకు ఆక్సిడెంట్..."  ఆపై మాట్లాడే శక్తి లేనట్టు అతన్ని ఆరాధనగా కౌగిట్లోకి తీసుకొని బావురుమంది.

    విషయం ఎంతమాత్రం అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ నిలుచున్నాడు సత్యానంద్. 
   
    ఏడుపులో తీవ్రత కాస్త తగ్గ గానే "ట్రైనింగన్నావ్ బెంగళూరన్నావ్ మరి ఇక్కడ?.."
   
    ఆమె ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే  వెనుక నుండి చప్పట్లు చరిచిన చప్పుడు వినిపించి ఇద్దరు ఒకేసారి అటు వైపు చూసారు. 
  
    అక్కడ విలాసవంతంగా నవ్వుతూ వసంత. 
  
    ఆమెను చూసి ఇద్దరికిద్దరు షాక్ అయ్యారు. అతనొకందుకు షాకైతే ఆమె మరొకందుకు షాక్ అయింది. 
     
    "నువ్... నువ్... వసంత కదూ..." నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అడిగింది లత.   
      
    "ఔను. నేను నీ మొగుడు ప్రేమించానానని నమ్మించి వంచించిన బికారి వసంతనే! నా గర్భ స్రావానికి  మూడువేలు ఖర్చవుతాయని, నా గర్భానికి నీ మొగుడితో పాటు నా పొరపాటు సగమని తీర్పు చెప్పి వీడితో పదిహేను వందలు ఇస్తే సరిపోతుందని చెప్పావు చూడు ఆ వసంతను నేనే" కోపంతో ముక్కుపుటాలు అదురుతుంటే ఆనాటి అవమానం జ్ఞాపకం రావడంతో గొంతు జీర పోయింది. 
     
    అదేది గమనించని లత వసంతతో "ఏం మావారు మళ్ళీ ఓ స్టేజి కోస్తున్నారని తెలిసి మళ్లీపట్టుకున్నావా శనిగ్రహంలా "అంది కోపంగా.
     
    పెద్ద పెట్టున వికట్టహాసం చేసింది వసంత. "స్టేజి కోచ్చాడో పతనానికి చేరువయ్యాడో తెలుసుకొవే ముందు. డబ్బుందన్న అహంకారంతో ఎగిరెగిరి పడి నా బ్రతుకుతో ఫుట్బాల్ ఆడుకున్నారు కదే.  ఇప్పుడు నా రివెంజ్ ఏ లెవెల్లో వుందో ఈ రిపోర్ట్ చూసి నిర్ణయించుకోండి" అంటూ ఒక మెడికల్ రిపోర్ట్ ను ఆమె వైపు విసిరింది. 

    మూగగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ నిల్చున్నాడు సత్యానంద్. 
   
    రిపోర్ట్ చదివిన లత పెద్దగా నవ్వుతూ "పిచ్చి మొహమా ఈ రిపోర్ట్స్ నీవేనే" అంది తేలికగా తీసి పారేస్తూ. 
    
    "ఓకే ఆ రిపోర్ట్ నాదే. అందులో ఏమందో చూసావా ఎయిడ్స్. నాకు ఎయిడ్స్" వసంత చెబుతుంటే ఆమెను పిచ్చిదానిలా చూస్తూ "పతనమైంది నువ్వేనే మా వారు కాదు" అన్నది హేళనగా నవ్వుతు లత. 
   
    ఎయిడ్స్ అన్న మాట వినగానే సత్యానంద్‌కు ముచ్చెమటలు పట్టాయి. ఆమె తనమీద ఎలా రివెంజ్ తీసుకుందో అర్థమైంది. దుఃఖం ఆవేశం ప్రాణభయం ఒక్కసారిగా అతన్నావరించాయి .
    
    "యూ డర్టీ  బిచ్..." అంటూ వసంత పైకి చేతులెత్తి కొట్టడానికి వెళ్ళాడు. 
    
    అతని చర్యకు హేళనగా నవ్వుతు "తగ్గారా కుక్కా. ఇప్పుడు నేనేం పాత వసంతను కాదు నీలాంటి గజ్జి కుక్కలకు బెదరి పోవడానికి"  ఆమె కళ్ళల్లో కనిపించిన ఎరుపు జీర చూసి నిజంగానే భయపడ్డాడు. 
    
    "విశ్వనాథ్, పెళ్లి ,ఐశ్వర్యం అనే కట్టు కథను నమ్మావ్ కదూ, నా జీవితం వడ్డించిన విస్తరి అనుకున్నావ్ కదూ.  ఆనాడు  నీవు వంచించినపుడు ఆడది సాటి ఆడదాన్ని అర్థం చేసుకుంటుందేమో అని ఈ మహారాణి దగ్గరకెళ్తే ఆమె నన్ను కావరం పట్టి డబ్బుకోసం నా అందాన్ని ఎర వేసానని డబ్బులేని ఆడది పూటకొక్క మగాణ్ణి మారుస్తారని పూవు తుమ్మెద అంటూ ఎంతగా అవమానించింది. 
    
    నాకు  అన్యాయం జరిగిందన్న బాధతో పాటు కుటుంబ పరువు గంగ పాలైందని నాన్న ఉరేసుకుని చనిపోతే నాన్న పోయిన  ఆరు నెలల్లో అమ్మ మంచానపడి క్రుంగి కృశించి పోయింది. 
     
    కడుపులో ఈ సమాజం అంగీకరించని బిడ్డ. నా అన్న వారు లేని అనాథ బ్రతుకు. పెద్దలు సంపాదించిన ఆస్తులా లేవు. నిలువ నీడ లేని ఒంటరి ఆడదాని బ్రతుకేమవుతుంది? ధనమదాంధుల కామందుల పాలవుతుంది. నా గతి అంతే అయింది. 
   
    బజారు పాలైన ఆడదానికి అదనంగా తోడయ్యేవి సుఖరోగాలు. అవి మాత్రం నాకు పుష్కలంగా చేరాయి.  ఎయిడ్స్ కూడా రావడం నాకు బొనస్ అయింది.
      
    ఆడుతూ పాడుతూ చదువే లోకంగా ప్రతీ పరీక్షలో ర్యాంకులతో పాసయ్యే దాన్ని, నాకీ ప్రేమలు వద్దురా బాబూ అని ఎంత తిరస్కరించినా ఆత్మహత్య పేరుతో బెదిరించి నా జీవితంలోకి ప్రవేశించి నన్ను వంచించి నాకీగతి పట్టడానికి కారణం నువ్వు కదూ! అందుకే నీ మీద పగతీర్చుకోవాలనే ఈ ప్లాన్ వేశా.  ఎయిడ్స్ రోగంతో రోజురోజుకూ క్రుశిస్తూ చచ్చే రోజుల్లోనైనా  నేను గుర్తుండి పోతాను. ఇక ఒక్క క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళండి" తర్జనిని గుమ్మం వైపు చూపుతూ కటినంగా అన్నది వసంత..
    
    అపరకాళిలా మారిన వసంత కళ్ళలోకి కూడా చూసే ధైర్యం లేక బరువెక్కిన హృదయాలతో బయటకు అడుగులేసారు భార్యాభర్తలు. 
        
    ఒక్కసారిగా వందేళ్ళు పైబడ్డట్టు అయింది  ఇద్దరికీ. నడలేక పోతున్నాడు సత్యానంద్. భార్య భుజంపై చేయి వేయబోయాడు. అతని చేతికి అందనంత దూరంగా జరిగి "నన్ను తాకొద్దు" అంటున్న లతను చూసి హాయిగా నవ్వుకుంది వసంత.
  
ఉపసంహారం :

    పడక్కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న వసంత ఫోన్ రింగవడంతో కాఫీ కప్‌ను ప్రక్కనే పెట్టి రిసీవర్ ఎత్తింది. 
   
    "హలో వసూ నేనేనే  భానూని " అవతలివైపు నుండి వినరాగానే వసంత ఎంతో హుషారుగా
   
    "ఓ భానూ చిన్నూ గాడెలా ఉన్నాడే" అడిగింది. 
    
    "వాడికేమోయ్ దొర బాబులా వున్నాడు కాని నీ విలన్ గాడు నీకు ఎయిడ్స్ అని చెప్పగానే నమ్మాడా?"
     
    "ఎందుకు నమ్మడు ఇంకో వారంలో చచ్చేవాడిలా డీలా పడిపోయాడు గురుడు" చెప్పింది వసంత.
    
    "అయినా నీ పిచ్చికాని ఈ అబద్ధం ఎన్ని రోజులాగుతుందే? రేపు ఎప్పుడో టెస్ట్ చేయించుకుంటే ఎయిడ్స్ లేదని తెలిసి పోదేంటి" 

    "ఊహు చేయించుకోరు సమాజంలో విలువ ఉండదని. ఈ సమాజమెక్కడ తమ కుటుంబాన్ని వేలివేస్తారో అనే భయం.  ఏదైనా కాని వాడు నన్ను తన జల్సాలకు వాడుకుని వదిలినందుకు  నేను వాణ్ని నా విలాసానికి వాడుకొని ఎయిడ్స్ భూతంతో బెదర గొట్టాను. ఈ భయంతో భార్యా భర్తలు ఒకరినొకరు  తాకడానికే భయపడుతూ రోజూ చస్తూ జీవచ్ఛవాల్లా కనీసం ఓ నెల అనుక్షణం చస్తూ బ్రతకాలి. అదే నేను వాళ్ళకు వేసిన శిక్ష" ఉద్వేగంగా చెప్పి తిరిగి భాను నుండి ఎలాంటి రిప్లైరాకముందే 
      
    "నేనింకో పని చేసానే. పాపం వాళ్లకు ఇద్దరు పిల్లలే . వీళ్ళు చేసిన తప్పుకోసం వాళ్ళని శిక్షించ కూడదని వాళ్ళకోసం ప్రతి నెల పది వేలు అందించే ఏర్పాటు చేసానే" చెప్పింది వసంత.
        
    "చేసావు కదా ఎంతైనా ఆడ మనసుకదా, సరేలే ఉంటా మరి" ఫోన్ పెట్టేసింది భాను.

Comments