సచ్‌కా సామ్‌నా-జస్ట్ ఎ ఫార్మాలిటీ - వసుంధర

    ప్రముఖ జర్నలిస్టుననుకునే రవి 'అభయం' పత్రికలో విలేకరి. తన వృత్తికి ఎదుటివాళ్ల చేత నిజం పలికించే శక్తి అవసరమని - ప్రముఖ హిప్నాటిస్టుననుకునే తన మేనమామని ఆశ్రయించి కొన్ని ట్రిక్సు తెలుసుకున్నాడు. తర్వాత ప్రముఖ రచయితననుకునే జయరాజుని కలుసుకున్నాడు.

 

    "నమస్కారమండీ - జయరాజుగారూ! నా పేరు రవి. నేను 'అభయం' పత్రికా విలేకరిని. మీ ఇంటర్వ్యూ తీసుకుందుకు వచ్చాను. రేపు మీకు సన్మానమట కదా!''


    "అరే - అప్పుడే ఈ విషయం మీదాకా వచ్చిందా! సన్మానమంటే ఏదో ఫార్మాలిటీ - ఓ పుస్తకానికి ముందుమాట రాసానని ...''


    "ఔననుకోండి - కానీ పుస్తకం రాసిన మాణిక్యాల్రావుకి జరగని సన్మానం - ముందుమాట రాసిన మీకు జరగడం విచిత్రం కదా!''


    "మనలో మనమాట - ఆ పుస్తకంలో విలువైనది ఆ ముందుమాటొక్కటే మరి ...''


    "అలాగంటారా - మరా పుస్తకానికి ముందుమాట రాయడానికి హేమాహేమీలు పోటీ పడ్డారనీ, ఆ రేసులో అదృష్టం మిమ్మల్ని వరించిందనీ అనుకుంటున్నారు ..''


    "పోనీ అదే నిజమనుకోండి - హేమాహేమీల రేసులో నెగ్గడం విశేషమే కదా ...''


    "అంటే - మీ సన్మానం ముందుమాటకి కాదు, రేసులో నెగ్గినందుకు - అంటారు ..''


    "సన్మానం ముందుమాటకనడం ఫార్మాలిటీ! వేరే కారణముంటే - అది సన్మానం చేసేవారు చెబుతారు. నేననకూడదు'' "అది సరే. హేమాహేమీలు పోటీ పడ్డారంటే - ఆ పుస్తకం గొప్పదయుండాలి కదా?''


    "గొప్పతనం పుస్తకానిది కాదు. రాసిన వ్యక్తిది. మాణిక్యాల్రావు గొప్ప వ్యాపారవేత్త''


    "అంత గొప్ప వ్యాపారవేత్త తన జీవితానుభవాల్ని 'మణిక్వచనం'గా పాఠకుల ముందుంచితే అది గొప్ప పుస్తకం కాకుండా పోతుందా?''


    "ఆయన అనుభవాలు చాలా గొప్పవే కానీ ఆయన రాస్తే కాదు. మీకు తెలియందేముందీ - గొప్పవాళ్ల కథలెప్పుడూ వేరే వాళ్లే రాస్తారు ..''

 

    "ఏమో - తమ అనుభవాలు తామే రాసుకున్న గొప్పవాళ్లు చాలామందే తెలుసు నాకు''


    "మీరు మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వగైరాల గురించి అంటున్నారేమో - వాళ్లు స్వతహాగా రచయితలు ...'' "కాదు, నేను స్వతహాగా రచయితలు కాని గొప్పవాళ్ల గురించే చెబుతున్నాను''


    "సరే - రచయితలు కాని గొప్పవాళ్లకి రచయితలం అనిపించుకోవాలన్న తపన ఉంటే - ఘోస్టు రైటర్సుని పెట్టుకుంటారు. రచయిత పేరుదేముంది - అదో ఫార్మాలిటీ - అంతే!''


    "పాయింటుకొచ్చారు - 'మణిక్వచనం' రాసింది ఘోస్టు రైటరేనని అభిజ్ఞవర్గాల ఉవాచ''


    "ఇన్ని తెలిసిన మీకు - ఆ ఘోస్టు రైటరు సత్యారావని తెలియదా? తన రాతలకి పబ్లిషర్సు దొరక్క ఇలాంటి పనుల కొప్పుకుంటున్న ఆయనమీద జాలిపడ్డం మినహా మనమేం చేయగలం?''


    "కానీ ఈ పుస్తకానికి ఘోస్టు రైటరు కావడానికి హేమాహేమీలు పోటీ పడితే - ఆ రేసులో సత్యారావు నెగ్గాడంటున్నారు. మీరేమంటారు?''


    "డొంకతిరుగుడెందుకూ? ఆ రేసులో నేనూ ఉన్నానని మీకు తెలుసు. డబ్బెవరికి చేదు చెప్పండి. మహాకవి కాళిదాసు కూడా భోజరాజిచ్చే అక్షరలక్షలకి ఆశపడే కవిత్వం చెప్పాడు ..''

 

    "ఆయనిస్తాడని ఈయన చెప్పాడో, ఈయన చెప్పాడని ఆయనిచ్చాడోనని కాళిదాసు విషయంలో మనకి డౌటుంది. కానీ మీ విషయంలో అలాంటి డౌటేం లేదంటారు. ఇంతకీ మీ ముందుమాటలో పుస్తక రచనని తెగ పొగిడారు. అంటే - సత్యారావు రచన మీకు నచ్చినట్టేగా?''


    "ముందుమాటలో రచనని పొగడ్డం ఫార్మాలిటీ. అది మాణిక్యాల్రావుకీ తెలుసు. అందుకే నా ముందుమాటతో పుస్తకం విలువ పెంచాలనుకున్నాడు ...''


    "కానీ ముందుమాటైనా రాసే అవకాశమిమ్మని మీరు కాళ్లావేళ్లా పడ్డారని విన్నాను ...''


    "పుకార్లకేం - అసలు మాణిక్యాల్రావు కోట్లు సంపాదించడానికి ఏమేం చేసాడో తెలుసుకుందుకు కోట్ల కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక్కటీ 'మణిక్వచనం'లో లేదు మరి''


    "పుకార్లు గాలికెగిరిపోయేవి. పుస్తకం చరిత్రగా మిగిలిపోయేది. పుకార్లని చెరిపేయాలనే - మాణిక్యాల్రావా పుస్తక రచనకి పూనుకున్నాడని అందరికీ తెలుసు. మీరిప్పుడది «ద్రువపరిచారు''


    "టాపిక్ పక్కదారి పట్టింది. నేను చెప్పదల్చుకున్నది వేరు. కాళ్లావేళ్లాపడి నేనాయన పుస్తకానికి ముందుమాట రాసానే అనుకోండి. మరాయన నాకు సన్మానమెందుకు తలపెడతాడూ?''

 

    "ఓ కంపెనీ కొత్తగా బట్టల సబ్బు తయారు చేసిందనుకోండి. ఆ ఘనత సైంటిస్టుదే ఐనా ప్రచారానికి - సైంటిస్టు పేరు వాడదుగా. ఓ సామాన్య గృహిణి చేత దాని గొప్పతనం చెప్పిస్తుంది. మరి మాణిక్యాల్రావు చాలా పెద్ద బిజినెస్‌మాన్. మీకు సన్మానం తలపెట్టడం ఓ కొత్త మార్కెటింగ్ టెక్నిక్ అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు ...''


    "అలాంటి వాళ్లు చెవులు కొరకడం మాని కళ్లెట్టుకు చూస్తే - సబ్బుల ప్రచారం చేసేది సామాన్యులు కాదు - ఐశ్వర్యారాయ్, కత్రీనా కైఫ్, జెనీలియా లాంటి ప్రముఖ తారలు ...''


    "నేను మాట్లాడుతున్నది బట్టలుతికే సబ్బుల గురించి ...''


    "కానీ నేనంటున్నది సౌందర్య సాధనాల గురించి ...''

    "ముందుమాట రాసింది అరుంధతీరాయో, రంగనాయకమ్మో ఐతే - నేనా ఉదాహరణ ఇచ్చేవాణ్ణి. ఈ సందర్భానికి సామాన్య గృహిణే సబబు...''

 

    "ఇది స్వతంత్ర భారతం. మీకు తోచింది మీరనుకోవచ్చు. కానీ మాణిక్యాల్రావంతటివాడు తన పుస్తకానికి నాచేత ముందుమాట రాయించుకోవడమే కాక, సన్మానం కూడా చేస్తున్నాడు. నాకిది గొప్ప గుర్తింపే!'' "మీ సన్మానసభకి ప్రముఖ సినీకవి రసికశ్రీ ముఖ్య అతిథిగా రావడానికి ఒప్పుకోవడం కూడా మీకు గొప్ప గుర్తింపే - ఏమంటారు?''


    "నేను రసికశ్రీకంటే పదేళ్లు ముందు ఫీల్డులోకి వచ్చాను. నాకాయన వల్ల గుర్తింపేమిటి? మీకు తెలుసో లేదో - అసలాయన గేయాలమీద నేను వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలవల్లనే ఆయనకి గుర్తింపొచ్చింది. ఆ విషయం ఆయనే నాకు స్వయంగా చెప్పాడు''


    "కానీ ఏ వేదికపైనా ప్రస్తావించినట్లు లేదే?''


    "లబ్ద ప్రతిష్టులతో ఉన్న తంటాయే అది. ఎదుటివాళ్ల గొప్పతనాన్ని మనిషి ముందు ఒప్పుకున్నా - వేదికమీద పొగడ్డానికి మనసు రాదు ...''


    "ఇప్పుడు మీ సన్మాన సభకి ఆయన ముఖ్య అతిథి. ఈ సారి వేదికమీదనైనా ఆయన మీ గొప్పతనాన్ని ఒప్పుకుంటాడంటారా?''


    "సన్మాన సభలో సన్మానితుడే కదా ముఖ్యుడు! ముఖ్య అతిథి అంటారా - సన్మానసభకి అదో ఫార్మాలిటీ అంతే!''


    "నా ప్రశ్నకి మీరు జవాబివ్వలేదు. మీ వల్ల తనకి గుర్తింపు వచ్చిందని ఆయన ఈ సభలోనైనా ఒప్పుకుంటారా?'' "ఈ విషయమై నాకు లేని పట్టింపు మీకెందుకు? ఆయన ఒప్పుకుంటేనేం, ఒప్పుకోకపోతేనేం? ఫాక్ట్ ఈజ్ ఫాక్ట్ ...'' "అదే ఆ ఫాక్ట్ విషయంలోనే చిన్న డౌటు. ఆయన గురించి రాయడం వల్లనే మీకు గుర్తింపు వచ్చిందని కొందరంటారు!'' "అంటే సరిపోతుందా? నేతాజీ బ్రతికున్నాడని ఇంకా నమ్మేవాళ్లున్నారు. దానివల్ల పత్రికల్లో కాలమ్సు నిండడమే తప్ప జాతికేమైనా ప్రయోజనముందా?''

 

    "రసికశ్రీ గురించి మీరు రాసిన వ్యాసాల గురించీ కొందరికి అదే అభిప్రాయం''


    "సరే - అన్నారు. ఆ కొందరి సంగతీ మర్చిపోండి. మీ గురించి చెప్పండి. ఆ వ్యాసాల మీద మీ అభిప్రాయమేమిటి?''


    "నిజం చెప్పాలంటే - మీరెప్పుడు ఫీల్డులోకి వచ్చిందీ నాకు తెలియదు. ఆయనమీద మీ వ్యాసాలు చూసాకే - నాకు మీ గురించి తెలిసింది ...''


    "అలాగన్నారు కాబట్టి అడుగుతున్నా. అసలు రసికశ్రీ ఫీల్డులోకి ఎప్పుడొచ్చిందీ మీకు తెలుసా?''


    "సమయమొచ్చింది కాబట్టి చెబుతున్నా. సినీ ఫీల్డు గ్లామర్ని సాహిత్యంతో ముడిపెట్టలేం. నాకాయన గురించి చాలా వివరాలు ఎప్పట్నించో తెలుసు. కానీ అవిప్పుడు అప్రస్తుతం''


    "మరైతే మీకు తెలుసో తెలియదో - ఇప్పుడంతా అర్థం పర్థం లేదని జుట్టు పీక్కుంటున్నారే - ఆ తరహా సినీ సాహిత్యానికి శ్రీకారం చుట్టింది ఆయనే! తన పాటల్ని అంతా దుమ్మెత్తిపోస్తున్నారని గోలెడుతుంటే జాలిపడి ఆ వ్యాసాల్రాసాను''

 

    "కానీ ఊరక రాయరు మహాత్ములంటారు ...?''


    "అంటే - మీ ఉద్దేశ్యమేమిటో నాకర్థం కాలేదు ...''


    "అంటే - ఇందాకా మీరన్నారే - ఆ పద్ధతిలో ఆయన భోజరాజూ, మీరు కాళిదాసూనూ?''


    "ఆఁ భోజరాజే అనాలి. అక్షర లక్షలు కాకపోయినా ఆరు పేజీలకి లింగులింగుమంటూ ఆరొందలిచ్చాడుగా''


    "అంటే - ఆరంటే ఆరొందలకోసం - మీరు చీదరించుకునే పాటల్ని బాగున్నాయని మెచ్చుకుంటూ వ్యాసం రాసానంటారు'' 


    "వ్యాసాల్లో అలా మెచ్చుకోవడం ఓ ఫార్మాలిటీ''


    "అంతేనా, ఇంకేమైనా ఉందా?''


    "అడిగారు కాబట్టి చెబుతున్నా. అందులో లోక కల్యాణం కూడా ఉంది ...''


    "బాగోలేని రసికశ్రీ పాటల్ని మెచ్చుకోవడం లోక కల్యాణమా?''


    "అలా ఆశ్చర్యపోకండి. సినిమావాళ్లేమో అడుగుతున్నారు. ఆయనేమో రాస్తున్నాడు. జనమేమో ఆదరిస్తున్నారు. కానీ ఒక్కరూ మెచ్చుకున్నట్లు తోచదు. అది సినిమావాళ్లకీ, ఆయనకీ, జనానికీ కూడా చెడ్డ పేరే కదా! అంతమందికి వచ్చిన చెడ్డపేరు పోగొట్టడం లోక కల్యాణమే కదా! ఆ తపనతో రాసాను తప్ప - వ్యాసం ఒక్కింటికీ ఆయనిచ్చిన ఆరొందలకి కాదు ...''

 

    "ఏమైతేనేం - మీకు నచ్చని విషయాల్ని తెగ మెచ్చుకుంటూ వ్యాసాలు రాసే అలవాటు మీకుంది. ఆ విషయం సభాముఖంగా చెబితే 'మణిక్వచనం' విలువేమిటంటారు?''


    "సభాముఖంగా చెప్పాల్సిన అవసరం నాకేముంది?''


    "పోనీ నాకుందనుకోండి ...''


    "మీకు మాత్రం ఎందుకుంటుంది?''


    "ఏముందీ - మన దేశంలో ఏ రంగంలో చూసినా ముఖంమీద చెప్పేదొకటి, చాటుగా అనుకునేదొకటి! నిజం తెలియక ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు. అందుకని ఓ టీవీ ఛానెల్ 'సచ్‌కా సామ్‌నా' అని కొత్త రియాలిటీ షో మొదలెట్టింది. మా పత్రికల్లోనూ అలాంటిదొకటి మొదలెడదామనుకుంటున్నాం. మచ్చుకి - ఇప్పుడు మీరు చెప్పిన నిజాలన్నీ అచ్చులో వస్తే ఎలా ఉంటుందంటారు?''

 

    "చూడండి రవిగారూ! రోజూ పత్రికల్లో, టీవీ ఛానెల్సులో ఎన్నో సంచలన వార్తలొస్తున్నాయి. అవి సంచలనం కలిగిస్తాయని వాళ్లనుకోవడం లేదు. ప్రజల్లో సంచలనమూ కలగడం లేదు. ప్రచురణ, ప్రదర్శన - మీడియా ఫార్మాలిటీ. చదవడం, చూడడం జనం ఫార్మాలిటీ. మీరనుకుంటున్నట్లు ఎవరూ అయోమయంలో లేరు. ఎవరి జీవితం వారిది. కాబట్టి మీరీ ఇంటర్వ్యూ అచ్చులో రాసినా, ఛానెల్సులో చూపినా - అందువల్ల నాకో, మీకో గుర్తింపు పెరగడం తప్ప జనానికి ఒరిగేదేమీ లేదు. ఏం చేయదల్చుకున్నదీ మీ ఇష్టం''

 

* * *

 

    రవి కొద్ది క్షణాలు ఆలోచించాడు. ఈ ఇంటర్వ్యూ బహిర్గతం చేస్తే - జయరాజుకి గొప్ప ప్రచారం లభిస్తుంది. తనకి మాణిక్యాల్రావుతో, రసికశ్రీతో గొడవొస్తుంది తప్ప లాభమేముండదు.


    "సరే - జయరాజుగారూ, మీరు చెప్పిందాంట్లో పాయింటుందని నాకూ అనిపిస్తోంది. మరిప్పుడేం చేద్దామంటారు?'' అన్నాడతడు.

 

    "ఏముందీ, వారఫలాల స్టయిల్ ఫాలో అయిపోండి ...'' అన్నాడు జయరాజు.


    "అంటే ...?''


    "పదేళ్లక్రితం జరిగిన ఇలాంటి సభమీద వచ్చిన వార్తా విశేషాల్ని - పేర్లు మార్చి సందర్భానుసారంగా అన్వయించి రాసేయండి ...''


    "అలా చేసేవాణ్ణయితే మీకో ఫోను కొట్టేవాణ్ణే తప్ప పెట్రోలు ఖర్చు పెట్టుకుని మరీ మీ ఇంటికెందుకొస్తాను?''


    "ఐతే ఇంటర్వ్యూ మళ్లీ మొదలా?''


    "అబ్బే - అదేం అవసరం లేదు. సన్మానసభ గురించి మీరే ఏమైనా రాసివ్వండి. యధాతథంగా ప్రచురిస్తాను''

అన్నాడతడు.


    "మరి - ఇప్పుడు చేసిన ఇంటర్వ్యూ అంతా దేనికి?'' అడిగాడు జయరాజు.


    "ఆఁ అదా - జస్ట్ ఎ ఫార్మాలిటీ!''


(ఆదివారం ఆంధ్రజ్యోతి  02-01-2011 సంచికలో ప్రచురితం)

 

Comments