సహనానికి సరిహద్దు - కవనశర్మ

  
     
ఉత్తర రామాయణం చదువుతున్నాను. రాముడి రెండో అగ్నిపరీక్షను అంగీకరించలేక తల్లితో సీత "నాకు 'వివరం'(విముక్తి)ని వరంగా ఇమ్మ''ని అడిగే ఘట్టం దగ్గర ఆగిపోయి ఆలోచనలో పడ్డాను. రాముడి మొదటి అగ్నిపరీక్షని అయిష్టంగానే అయినా సర్దుకుని నిలబడింది. అయోధ్యావాసులు వేసిన అపనిందని, కడుపులోని ప్రాణాలతో పాటు, పెట్టుకుని భరించింది. సత్యశారద రాసిన గీతం 'సీతా'స్ ఆప్షన్స్' గుర్తుకు వచ్చింది.

    లక్ష్మణుడు అడవిలో విడిచివెళ్లాక సీత తనకున్న మార్గాల్లో తనున్న పరిస్థితుల్లో వాల్మీకి ఆశ్రమానికి వెళ్లటమే ఏకైక గౌరవప్రదమైన మార్గమని, అది కష్టతరమే అయినా ఎన్నుకోక తప్పదని అనుకుని వాల్మీకితో "దిసీజ్ మై వోన్లీ ఆప్షన్ ఫాదర్" అంటుంది. వాల్మీకి "లివ్ ఫర్ ది లైఫ్ దట్ ఈజ్ విత్ఇన్ యూ" అంటాడు. ఆ మాటలని ఆమె శిరసావహించింది. అది అప్పుడు. రాముడు రెండో అగ్నిపరీక్ష పెట్టిన సమయంలో పరిస్థితులు వేరు. ఆ వేరైన పరిస్థితుల్లో ఆ పరీక్ష ఆమె సహనానికున్న సరిహద్దు దాటింది. "ఇప్పుడు నేను నాకున్న బంధాలలో ఒకదాని నుంచి తప్ప అన్నింటినుంచి బయటపడ్డాను. ఆ చివరి బంధాన్ని కూడా తెంచుకోవటానికి సిద్ధపడుతున్నాను. నాకు వివరం ప్రసాదించు ధరణీ మాతా!'' అని వేడుకుంటున్న ఘట్టం అది.

    ఇంతలో ఫోను మోగింది. ఫోను తీసాను. "అత్తా! నేను ఓడిపోతానేమోనని భయంగా ఉంది'' ఫోనులో సీత. పరిస్థితులకు తన పద్ధతిలో ఎదురొడ్డి నిలిచే సీత. పోరాటాల సీత. వివాహ నియమాల సంకెళ్లను తెంచుకున్న సీత. నా స్నేహితురాలు సావిత్రి కూతురు సీత. నాకు, సావిత్రికి స్నేహమే కాని చుట్టరికం లేదు. తన పెళ్లి కాకముందు మా ఇద్దరికీ వదినా మరదళ్ల వరస లేదు. అవసరం రాలేదు. ఆ అవసరం సావిత్రికి ఆమె భర్త రాజేష్ కలిగించాడు. అందమైన రూపం, మాటల చాతుర్యం, హోదా. అతనికి ఆడవారిని ఆకర్షించగలిగే ఆభరణాలన్నీ ఉన్నాయి. వాటిని చూసే సావిత్రి ముచ్చటపడి కోరి పెళ్లి చేసుకుంది.
రాజేష్ చెల్లెలు రమ నాకు, సావిత్రికి సహాధ్యాయి. రమ పుట్టినరోజున ఆమె తన ఇంటికి పిలిస్తే నేను, సావిత్రి వెళ్లాం. అందంగా ఉండి చెల్లెలు స్నేహితురాళ్లతో కలివిడిగా సరదాగా మాట్లాడిన రాజేష్ ఆ రోజు ఆ వేడుకకి వెళ్లిన మా అందరి మనసుల మీద బలమైన బలమైన ముద్ర వేసాడు. నిజం చెప్పాలంటే నేను కూడా ఆకర్షితురాలనయ్యాను. అయితే సావిత్రి మాత్రం ఆకర్షణ దాటి ఆరాధనలో పడింది. మాలో సావిత్రి అందమైనది, భాగ్యవంతురాలు. పైగా రమది, సావిత్రిది ఒకే కులం. రమ తల్లిదండ్రులకి సావిత్రిని కోడలుగా తెచ్చుకోవడానికి, రాజేష్‌కి ఆమెను భార్యగా వరించటానికి అభ్యంతరాలు లేకపోవటమే కాక రాజేష్ ఉద్యోగం సావిత్రి పెద్దలకి నచ్చటంతో పెళ్లి ఘనంగా జరిగిపోయింది.

    ఒకరోజు సావిత్రిని చూడటానికి వాళ్లింటికి వెళ్లినప్పుడు రాజేష్ ఇంట్లోనే ఉన్నాడు. మా కబుర్లలో తనూ పాల్గొన్నాడు. మాటల్లో "మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది'' అన్నాడు నాతో. నాకు కొంచెం గర్వం కలిగింది ఆ మాటలకి.

    "మీకు రమ నవ్వులోను, ఉమ నవ్వులోను అందాలు కనిపిస్తాయి. వాళ్లు మీ చెల్లెళ్లు కదా! నేను పరాయిదాన్ని. ఏదో జాలిపడి, ఉద్దరిద్దామని నన్ను పెళ్లి చేసుకున్నారు'' అంటూ సావిత్రి నాకు, తన భర్తకి అన్నా-చెల్లెలు వరస కుదిర్చింది. "మరే'' అన్నాడు రాజేష్ నవ్వుతూ.

    కొన్నాళ్లకి వారికి కూతురు పుట్టింది. తన తల్లి పేరైన సీతా మహాలక్ష్మిని కుదించి 'సీత' అంటూ నామకరణం చేసాడు రాజేష్. సీతకి మాటలు వచ్చే వయసు రాకుండానే రమకి పెళ్లయి వెళ్లి పోవటంతో 'అత్త , తాత' అనగలిగేసరికి వాళ్లమ్మ నన్ను చూపించి "ఎవరు?'' అని అడిగితే ముద్దుగా "అత్త'' అంటూ నన్ను మురిపించేది.నా చదువై, నేను చదువుకున్న కాలేజిలోనే లెక్చరర్‌గా స్థిరపడ్డాను. నాకు పూనుకుని పెళ్లి చేసే ఓపికున్న వాళ్లు లేక, స్వంతంగా చేసుకునే చొరవ లేక పెళ్లయి 'అమ్మ'గా మారక 'అత్త'గానే మిగిలిపోయాను.

    నాకు ఒకటి రెండు సార్లు రాజేష్ బయట వేరే అమ్మాయితో కనిపించాడు. సావిత్రిని అడిగితే ముభావంగా, "ఎవరో ఆఫీసులో పనిచేసే అమ్మాయి అయి ఉంటుంది'' అంది. ఏదైనా ఎన్నాళ్లు దాగుతుంది. రాజేష్ గ్రంథం నడపగలిగిన వాడేనని నాక్కూడా అర్థమైంది. సావిత్రి నన్ను రాజేష్‌కి చెల్లెల్ని చెయ్యటం ఆమె ముందుజాగ్రత్తలో భాగమని నాకర్థమైంది. అతను నాతో ఎప్పుడూ హద్దు మీరలేదు. ఆ మాత్రం వరస పాటించే అతని గుణం వలన సావిత్రికీ నాకూ ఉన్న స్నేహం నిలబడింది.

    రాజేష్ ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడన్న విషయం నిర్ధారణగా తేలాక సావిత్రిని ఆ విషయం అడిగాను. "తెలుసు. అత్తా మావలకి కూడా తెలిసి ఆయనకి చీవాట్లు పెట్టారు. సర్దుకుపోవటం సంసారానికి మంచిదన్నారు. ఎప్పటికైనా నా దగ్గరకు చేరాల్సిన ఆయనే కదా! ఇప్పటికీ నాతో సంసారం చేస్తూనే ఉన్నారు. సంఘంలో అందరూ నన్నే భార్యగా గుర్తిస్తున్నారు'' అని చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో సత్యభామ గర్వం లేదు. తనకున్న మార్గాల్లో ఈ మార్గాన్నే ఎంచుకోవాల్సి వచ్చిందన్న ఎరుక ఉంది.

    అత్తా మామ పోయారు. సీత పెద్దదైంది. పెళ్లీడుకి వచ్చింది. సీతకి తల్లి సర్దుబాటుతనం రాలేదు. నేను క్లాసులో నూరిపోసే తిరుగుబాటుతనం వచ్చింది.
"మేనత్త కాని అత్త పోలిక దానిది'' అనేది సావిత్రి. అది ఎత్తిపొడుపో మెచ్చుకోలో నాకు తెలియదు.

    ఆ రోజు ఆదివారం. సీత మల్లెతీగకి పూసిన పూలను దండగా గుచ్చుతూ, "ఆడవాళ్లం, అలంకరించుకుని మగవాళ్ల కళ్లకి అందంగా కనపడాలని, ఎందుకంత ఉబలాటపడతాం అత్తా! వాళ్లు మన కోసం అలంకరించుకోరేం'' అని అడిగింది.

    "మనం మనల్ని అలంకరించుకోటానికి కష్టపడితే ఆ పిచ్చి వెధవలు మనల్ని అలంకరించటానికి శ్రమపడతారు. మనం అలంకరించుకుని ఆనందిస్తే, వాళ్లు మనం అలంకరించుకుంటే ఆనందిస్తారు. వాళ్ల అజ్ఞానమే మనకీ వాళ్లకీ శ్రేయస్కరం'' అన్నాను.

    "ఫో! అత్తా! నువ్వు మరీ!'' అని సీత అంటుంటే, పనిపిల్ల జ్యోతి వచ్చింది.

    "ఏమిటింత ఆలస్యం చేసావు జ్యోతీ!'' అని నేనడిగితే "మనకి ఆదివారం పూర్తిగా సెలవు కాబట్టి జ్యోతికి కనీసం గంట లేట్ పర్మిషన్ ఇవ్వొచ్చు'' అంది సీత.

    జ్యోతి మా మాటలు పట్టించుకోకుండా, "ఇంట్లో గొడవైందమ్మా!'' అంది. ఏం గొడవైందో జ్యోతి చెప్పదల్చుకుంటే తనే చెప్తుంది. లేకపోతే అడిగినా చెప్పదు. అందుకని నేను అడగలేదు.

    "గొడవా! ఏమైంది?'' సీత అడిగింది. సీత తనదాకా వచ్చిన ఏ గొడవనీ పూర్వాపరాలు తెల్సుకోకుండా, తన అభిప్రాయం వెలిబుచ్చకుండా పోనియ్యదు.

    "చేతకాని, అమ్మచాటు ఎదవ కొట్టాడు'' అంది జ్యోతి.

    "చాలా మంచివాడు అని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా! ఆ మొగుడ్ని పట్టుకుని వెధవంటావేం?'' అన్నాను నవ్వుతూ. జ్యోతికి వాళ్లాయన అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు.

    "మొగుడు కొట్టాడా!'' అని సీత ఆశ్చర్యపోయింది.

    "ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఆ చికాకులో మొగుడు పెళ్లాన్ని కాకపోతే ఎవర్ని కొడతాడు! మామూలుగా అయితే నేను పనిలోకి వెళ్లినప్పుడు మా అత్త నా కొడుకుని చూసుకుంటుంది. కాని ఇవాళ వాడికి కొద్దిగా జ్వరం వచ్చి తిక్కతిక్కగా ఉన్నాడు. వేసిన మందుల వల్ల కాబోలు. పని మానెయ్యి అంది మా అత్త. ఇప్పటికే చాలా నాగాలు పెట్టాను. మరీ ఎక్కువ పెడ్తే ఉమమ్మగారు మాన్పించరేమోగాని మిగిలిన అమ్మగార్లు వేరేదాన్ని పెట్టుకుంటారు. నా మొగుడి సంపాదన ఇల్లు గడపడానికి సరిపోతుంది కాని పిల్లాడికి చొక్కా కొన్నా, నేను తిలకం కొనుక్కున్నా పొదుపుచేసినా అది నా సంపాదనలోనే!''

    "మరి మానెయ్యమని మీ అత్త ఎలా అంది నీతో?'' సీత విచారణ సాగుతోంది.

    "చేసే ఓపిక లేక!''

    "సరే మొగుడెందుకు కొట్టాడు?''

    "అత్త మానెయ్యమని, నేను మానెయ్యనని వాదించుకుంటుంటే తను పిల్లాడ్ని చూసుకునే వీలులేక, తల్లిని చూడమనటమో, నన్ను ఇవాళ పని మానెయ్యమనటమో అనలేక అమ్మా! ఇప్పటికే ఆలస్యం అయింది. చాలా ఇళ్లకి వెళ్లాలి. నన్ను కబుర్లలో పెట్టకు సీతమ్మ తల్లీ!''అంటూ జ్యోతి పనిలో జొరపడింది.

    "వీళ్లకి చదువులేక, మరో మార్గం తోచక సహించి కుటుంబంలో సర్దుకుపోతూ ఉంటారు!'' అంది సీత.

    "చదువున్నా మీ అమ్మ సర్దుకుపోవటం లేదూ!'' అన్నాను నోరుజారి. సీత హఠాత్తుగా మౌనం వహించింది. కాసేపు తరువాత "వెళ్తాను అత్తా'' అంది.
ఆ తరువాత సావిత్రిని కలిసినప్పుడు సీత తనతో గొడవ పడిందని చెప్పింది. నేను నోరు జారే వరకు సీతకు తన తల్లి కూడా అదేవిధంగా సర్దుకు పోతుండవచ్చనే ఆలోచనే వచ్చినట్టు లేదు. దానికి కారణం తండ్రి పట్ల తనకున్న ప్రేమ వల్ల కావచ్చు, తల్లి ఆయనతో గొడవ పడకపోతుండడం వల్ల కూడా కావచ్చు.

    "భర్త ప్రవర్తన తన సహనపు సరిహద్దు దాటి ఉన్నప్పుడే స్త్రీ గొడవ పడుతుందని, చిన్న చిన్న విషయాలకి గొడవ పడదని, గొడవపడటం లేదంటే, విషయం చిన్నదని సీత అనుకుంటున్నట్టు నాకు అర్థమైంది. వెసులుబాటు తక్కువైనప్పుడు, సహనం పెరిగి, సరిహద్దు దూరం పెరుగుతుందని తనకి చెప్పాల్సివచ్చింది. ఆ వెసులుబాటు విడిగా జీవించగలగటానికి ఉండాలి. అది నాకు లేదు'' అంది సావిత్రి నాతో . "సీత, నిన్ను ఏమని అడిగింది?''అని నేను సావిత్రిని అడిగాను. "'నాన్న' మరో ఆవిడతో కూడా సంసారం చెయ్యటం నీకు బాధ కలిగిస్తోందా?'' అని అడిగింది. 'ఎందుకు కలిగించదు? కలిగిస్తోంది' అన్నాను. 'మరి నాన్నకా విషయం చెప్పావా?' 'చెప్పకపోతే తెలియనంత అజ్ఞాని కాదు మీ నాన్న. ఆయన ఏ కారణంవల్లనో ఆమెతో ఉంటున్నారు. నేను కావాలో ఆమె కావాలో తేల్చుకోండి అని నేను అనలేదు. ఆమె కూడా అని ఉండదు' అన్నాను.''

    సీతకి, సావిత్రికి జరిగిన చర్చ సారాంశం ఏమిటని నాకర్థమైందంటే సీత దృష్టిలో సావిత్రి బాధ భరించలేనిదైతే రాజేష్‌ని విడిచిపెట్టాలని. సావిత్రి దృష్టిలో బాధ ఎంతటిదైనా భరించాలని. "నాకున్న మార్గాల్లో పుట్టింటికి చేరటమో, చావటమో, లేదా విడిగా ఉండి మనోవర్తికి దావా వెయ్యటమో, భర్తతో సర్దుకుపోతూ వీధిన పడకుండా ఉండటమో ఇవే ఉన్నాయి. సర్దుకుపోవటానికి నిర్ణయించుకున్నాక బాధ భరించక తప్పదు. భరిస్తాం! కనక ఇతర్ల కది చిన్నదిగా తోస్తుంది. నేను పుట్టింటికి వెళ్తే సీతను తీసుకువెళ్లాలి. అక్కడ సీత రెండో తరగతి సభ్యురాలవుతుంది. నేను చచ్చిపోతే దిక్కులేనిది అవుతుంది.

    'ఆమె తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఓ రాక్షసుడు' అనే లోక నిర్ణయం వీపున తగిలించుకుని తిరగాల్సి వస్తుంది. విడిపోతే తల్లీతండ్రి విడిపోయిన ఆడపిల్లకి పెళ్లవటం, అత్తవారు గౌరవంగా చూడటం అంత మామూలు విషయం కాదు. పెళ్లిలో తండ్రిగా రాజేష్ నిలబడ్తాడా? నిలబడ్తే తల్లిగా ఆమె నిలబడ్తుందా? నేను నిలబడ్తానా? కలిసి ఉంటే ఈ ప్రశ్నలు రావు. సమాజం దృష్టిలో, న్యాయస్థానం దృష్టిలో నేనే రాజేష్ భార్యని. నాకే ఆ గౌరవం. నాకున్న మార్గాల్లో నేనా మార్గాన్నే ఎంచుకున్నాను. ఈ విషయమే సీతకి చెప్పాను'' అని సావిత్రి నాకు చెప్పింది. దానివలన సావిత్రి, మరో ఆమెతో భర్త పక్కను పంచుకుందేమో గానీ, సమాజంలో తన స్థానాన్ని కాదు. భర్తపోయాక అతని ఆస్తిని కాదు.

    ఆ తర్వాత కొంత కాలానికి సీతకు పెళ్లయింది. తను కోరుకున్నవాడినే చేసుకుంది. భర్తతో చిన్నవాటికి పెద్దవాటికి గొడవలు పడింది. ఉద్యోగం ఇచ్చిన ఆర్థికపరమైన వెసులుబాటు వలన, రాజేష్ ఇచ్చిన ఆసరా వలన కొంతకాలానికి మొగుడికి విడాకులిచ్చి తల్లిదండ్రులతో ఉండటం మొదలుపెట్టింది.
రాజేష్ పోయాడు. ఇల్లూ అధికారం సావిత్రి చేతిలోకి వచ్చాయి. సావిత్రి తనను పడ్డ వ్యథ అంతా మర్చిపోయింది. భర్తకి ప్రతిసంవత్సరం కొడుకు చేత తద్దినాలు శ్రద్ధగా పెట్టిస్తోంది. తండ్రి పోయాక సీతకి తండ్రి ఆస్తిలో వాటా దక్కినా మరదలు వచ్చాక అధికారం దక్కలేదు. ఒకరోజున సీత వచ్చి, "అత్తా! నేను విడిగా ఇల్లు చూసుకున్నాను. వీలున్నపుడు వస్తూ ఉండు'' అని తన చిరునామా ఇచ్చి వెళ్లింది. అప్పుడప్పుడు నేను వీలు చూసుకుని సీత ఇంటికి వె ళ్లి వస్తున్నా, ఎక్కువగా సీతే వస్తూ ఉంటుంది.

    "పురుషాధిపత్యం ఇంకానా! ఇకపై సాగనివ్వరాదు'' అంటూ సీత పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసింది. ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమెను ఎన్నో సంస్థలు ఉపన్యాసాలివ్వటానికి పిలవసాగాయి. ఆమె వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టింది. గృహహింసకి లోనైనవారికి ఆసరా కల్పించే మార్గాలు వెతికి ఆచరణలో పెట్టింది. లా చదివి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఎంతోమంది పురుషుల చేయూత కూడా సంపాదించి, లైంగిక అత్యాచారాలను , ఏసిడ్ అటాక్‌లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది.

    ఆ సీత ఈ రోజున "నేను ఓడిపోతానేమోనని భయంగా ఉంది అత్తా'' అంటోంది. సుబ్బుతో గాని గొడవ పడిందేమో.

    ఏడాది క్రితం మొదటిసారి సుబ్బును చూసాను. సీతను తన బైక్‌మీద నా ఇంటివద్ద దింపడానికి వచ్చినపుడు మర్యాదకి లోపలికి వచ్చి నన్ను పలకరించి పనుందంటూ వెళ్లిపోయాడు.

    "బావున్నాడు సీతా! ''అన్నాను చిన్న ఆశతో.

    "మంచివాడు అత్తా! ఎన్విరాన్‌మెంటలిస్టు. ఎన్టీఓ ఉందతనికి'' అంది.

    "మంచివాడైతే హాయిగా పెళ్లి చేసుకో'' అన్నాను.

    "మళ్లీ పెళ్లి గొడవెందుకు! ఏ గొడవా లేకుండా హాయిగా కల్సి ఉంటున్నాం'' అంది సీత.

    "ఎంత కాలంగా?''

    "దూరంగా ఓ ఆర్నెల్లు, ఒకే ఇంట్లో మరో ఆర్నెల్లు'' అంది సీత.

    సీత ధైర్యాన్ని అభినందించాను.

    ఇంకోరోజు సీత కాస్త కోపంగా వచ్చింది. "సుబ్బుతో ఏమైనా గొడవ పడ్డావా?'' అని అడిగాను. "కట్టుకున్న వాడినే ఠక్కుమని వదిలివేసినదాన్ని, కలిసి ఉంటున్న వాడితో గొడవపడితే పొమ్మంటాను. అయినా విషయం అతను కాదు, శేఖర్'' అంది సీత.

    నాకు శేఖర్‌నీ పరిచయం చేసింది సీత. ఒకసారి నేను సీత ఇంటికి వెళ్లినప్పుడు శేఖర్ అక్కడే ఉన్నాడు. మంచి పరిచయాలు, పలుకుబడి ఉన్న మరీ పెద్దవాడు గాని పారిశ్రామికవేత్త అతను. అందువలన సీత చేసే పనులకి అతని నుంచి మాట సాయం, మూట సాయం అందుతున్నాయని అర్థమైంది నాకు.

    "శేఖర్‌తో నీకు వచ్చిన సమస్య ఏమిటి?'' అని అడిగాను.

    "శేఖర్‌కి తను చేసే సాయానికి ప్రతిఫలంగా...అతను నేరుగా చెప్పటం లేదు కాని..నేను కావాలి!'' సీత సూటిగా సమస్య చెప్పింది. "అదెలా! నువ్వు సుబ్బుతో ఉంటున్నావు కదా!''

    "సుబ్బు నాకు తాళి కట్టలేదు. నేను అతనికి నన్ను తాకట్టు పెట్టుకోలేదు. అది కాదు సమస్య''.

    "మరేమిటి సమస్య?''

    "శేఖర్ మీద నాకు ఆ విధమైన ఇష్టం కలగలేదు. పోనీ అతని సహాయానికి ప్రతిఫలంగా ...అనుకున్నా అతనికి భార్య వుంది!'' "నీకభ్యంతరం లేకపోతే ఆమె సంగతి అతను చూసుకుంటాడు. బహుశా ఆమె మీ అమ్మలా సర్దుకుపోతుందేమో!''

    నా మాటలు సీత తాలూకు అతి సున్నితమూ, అతి గోప్యమూ అయిన మనసుభాగానికి తగిలాయి. కావాలనే అన్నాను మరి.

    "అదే నాకిష్టం లేదు. కాదంటే నేను తలకెత్తుకున్న కార్యక్రమాలకి కనీసం తాత్కాలికంగానైనా గట్టి ఇబ్బందులు ఎదురవుతాయి.
అవుననటానికి, అతని భార్యని మా అమ్మ పరిస్థితుల్లోకి నెట్టలేను!''

    "మనకున్న అవసరాలను తీర్చుకోవడానికి మనకున్న మార్గాల్లో మనకి నచ్చినవి లేకపోతే ఉన్న ఒక్కమార్గం మన మనసుని బాధ పెట్టేదైతే సర్దుకుంటామా? లేదా? అన్నది ప్రశ్న. సర్దుకోకపోతే అవసరానికి అఘాతం. సర్దుకోవాలంటే, సహనానికి మనం ఏర్పరచుకున్న సరిహద్దుని జరుపుకుని సమాధాన పడిపోవాలి. లేదూ సర్దుకోమూ! దాని వలన కలిగే కష్టాలను భరించే శకి ్త పెంచుకోవాలి. పెంచుకోవాలంటే కంఫర్ట్‌జోన్ సరిహద్దు కుదించుకోవాలి. దానికి అవతల బతకటానికి సిద్ధపడాలి. నేను పెళ్లిచేసుకోక, మీ అమ్మ చేసుకుని ఆ విధంగా బతికాం.''

    నేను చెప్పింది సీత శ్రద్ధగా వింది.

    "అత్తా! నేను సాధించదలుచుకున్న దానికి మరింత కష్టపడ్తాను. మరింత సహనంతో దీక్షతో పనిచేస్తాను. నేను ఓడిపోను. నా నిర్ణయం శేఖర్‌కి చెప్తాను. ఆపైన అతని ఇష్టం'' అంది, ఏ విషయంలో సహనానికి సరిహద్దు జరుపుకోవడానికి తను సిద్ధపడుతోందో తెలియజేస్తూ సీత.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 15-09-2013 సంచికలో ప్రచురితం) 
Comments