సజీవ దహనం - రాచమళ్ళ ఉపేందర్

    ఊరూ, భార్య పిల్లలను విడిచి, వెలుగును కోల్పోయి చిమ్మచీకటిలొ బతుకీడ్వబట్టి పదునాలుగేళ్ళు కావొస్తుంది. ఎండకు వాడిన గడ్డిపూవుల్లా... జీవచ్ఛవంలా...  జైలు జీవితం గడుస్తోంది. నా బతుకుదెరువైన భూమిని అక్రమించుకొవాలనుకున్న కరణం కొడుకుపై ఆవేశం పొంగింది. ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఇద్దరికి మాటా, మాటా పెరిగింది. చేతినున్న పలుగుతొ తలపై మోదానంతే కరణం కొడుకు రక్తపు మడుగులొ కుప్పకూలిపోయాడు. పంజరంలొ చిలుకలా నేను జైలు గోడల మధ్య బందీనైనాను. భార్యా, పిల్లలు కళ్ళల్లో కదలాడిన ప్రతిసారి విముక్తికె జైలు గోడలదిరేలా కన్నీటితో ప్రార్దించినా ఏ దేవుడి గుండె కరగలేదు. సంకెళ్ళు నానాటికి బిగుసుకున్నాయే తప్ప విముక్తి కలుగలేదు. 

    ఇన్నేళ్ళ తరువాత జైలు తలుపులు పూర్తిగా తెరుచుకోబోతున్నాయి కాబోలు సూర్య కిరణాలు కాంతిని గుప్పిస్తున్నాయి. టక్... టక్... టక్ మంటూ బూట్ల శబ్దం. ముగ్గురు ఖాకీలు నడిసొస్తున్న నీడ నా గది గోడలపై కదులుతోంది. గది ముందు నిలబడ్డారు ముగ్గురు. "ఒరేయ్ సూర్యం రేపు విడుదలవుతున్నావు" కరుకుగా అరిచిందొక గొంతు. నే మౌనంగా వుండటంతో వారు వెనుదిరిగారు. సంతోషం, దుఃఖం జివ్వుమన్నాయి మనసులో. ఇన్నేళ్ళలో నా వాళ్ళు ఒక్కసారొచ్చిందీ లేదూ, వారి జాడ నాకు తెలిసిందీ కాదు. నా వూరు, భార్య, పిల్లలు నన్నాహ్వానిస్తారా? తృణీకరిస్తారా? హంతకుడనే నెపంతో దూరంగా నెట్టేస్తారా.. ఎన్నో ప్రశ్నలు మదిని తొలుస్తుండగా కళ్ళు నిద్రలోకి జారుకున్నాయి.

* * *  

    తూర్పు వాకిట భానుడు వెచ్చబడుతున్నాడు. బుక్కులో నిశానేయించుకొన్న జైలధికారి "క్షేమంగా వెళ్లు సూర్యం" అంటూ భుజాలు తట్టాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని ఆప్యాయత నాలో ధైర్యాన్ని నింపింది. గుండెలపై బరువు దిగినట్లయింది. పంజరం వీడిన చిలుకలా మనసంతా తేలిక్తెంది. స్టేషన్ లో ప్లాట్‌ఫామ్‌పై  సిద్ధంగా వున్న రైలెక్కాను. మూడు గంటలు కళ్ళు మూసుకుంటే చాలనుకుంటూ... కిటికి ప్రక్కన ఖాళీ సీట్లొ కూర్చోగానె రైలు కుదుపులకు జోలపాడినట్లై నిద్రలోకి ఒరిగాను. భీకర కూతతో గమ్యం వైపు దూసుకపోయేందుకు అరవీర భయంకరంగా పట్టాలపై పరుగందుకొంది రైలు. 

       మూడు గంటలు మూడు నిమిషాల్లా గడిచాయి. క్రీచ్‌మంటూ బ్రేక్ పడ్డంతో రైలాగింది. రైలు దిగి స్టేషన్ బయటకొచ్చాను. అక్కడనుంచి పది కిలోమీటర్ల దూరంలో వూరు. కాలిబాట ప్రయాణం. నడక ప్రారంభించాను. ముందుకెళ్ళగానె ఆశ్చర్యపోవడం నా వంతైన్ది. కాలిబాట స్థానంలో తారురోడ్డు పరుచుకొంది. 'ఎంతమార్ఫు' నమ్మలేకపోయాను. గజానికో ఆటో చొప్పన పది ఆటోలాగివున్నాయి. నా ముందొక ఆటో వచ్చి ఆగింది. "మంచుకొండ... మంచుకొండ..." అంటూ ఆటో డ్రైవర్ కేక వేస్తున్నాడు. నేవెళ్ళాల్సిన వూరదే కావటంతో, ఆటో ఎక్కి డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాను. అతన్ని చూస్తుంటే దగ్గరివాడిలా అన్పించాడు. ఆటో కదిలింది. 

    'బాబు మీదేవూరు?'

    'మంచుకొండ!'

    మా ఊరే.. ఉత్సాహం ఉరకలేసింది నాలో.

    'ఎవరి కొడుకువి?'

    మాట పెగలటం లేదతనికి. బండరాయిలా బిగుసుకుపోయాడు. సుడులు తిరిగిన నీళ్ళు కళ్ళల్లోంచి మోకాళ్ళపై  పడుతున్నాయి.

    'బాబు ఏమైంది?' భుజాలు పట్టి ఊపాను.

    'తిరిగిరాని లోకాలకెళ్ళిన నాన్న గుర్తొచ్చారు' జీరబోయిందతని గొంతు.

    'అయ్యో పాపం క్ష్మించు బాబు బాధపెట్టినందుకు' అంటూ చేతిలో చెయ్యేసాను.

    'ఫర్లేదండి!' ఆటో అద్దం సరిచేసుకుంటూ అన్నాడు.

    అతని ముభావాన్ని తొలగించేందుకు 'మీ నాన్న పేరేమిటి?' అన్నాన్నేను.

    "సూర్యం...!"

    గుండె పిండినట్లయింది. ఆత్రం పెరిగింది. ఆవేదన జనించింది.

    'ఏ సూర్యం...? ఏం చేసేవాడు...?'

    'అనురాగపు సూర్యం.. చెప్పలు కుడుతూ, ఎగసాయం చేసేవాడట.'

    నే.. నే... నేనే ఆ సూర్యాన్ని... మీ నాన్ననని చెప్పేందుకు మాట రాక... భోరున విలపించాను... జోరువానలా ఏడ్చేశాను. బ్రతికున్న నేను చావడమేమిటి? పుండు మీద కారం చల్లినట్లుగా గుండె ఆవేదనతో మండుతోంది. ఒళ్ళంతా చెమటలు. కొన్ని క్షణాలు అచేతనుడినయ్యాను. సడన్ బ్రేక్‌తో కుదుపులకు లోనైన ఆటో ఆగిపోయింది. 

    'ఏమండి...! ఎందుకలా ఏడ్చారు?' నన్ను తన చేతుల్లోకి తీసుకొచ్చాడు. అతని ఎదప్తె వాలాన్నేను. మమత, మమకారం పొంగుకొచ్చాయి నాలో. అయినా నన్ను నేను తమాయించుకున్నాను. ఏదో గుర్తుకు వచ్చిందంటూ మాట దాటేశాను. మళ్ళీ ఆటో కదిలింది. కాసేపట్లోనే వూరొచ్చింది. ఆటో దిగాను. వూరి గాలి పీల్చి ఎన్ని సంవత్సరాలైంది. భారంగా నిట్టూర్చాను. వూరంతా మారింది. బస్టాండు, ఆటోస్టాండే  కాదు వూర్లోకి తారురోడ్డు పరచుకుంది. మస్తాన్ భాయ్ కాకా హోటల్ స్థానంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ కళకళలాడుతోంది. ఓ హస్పిటల్ దాని ప్రక్కనే మందులషాపు. నాకు తెలిసినంతవరకు పెనుమార్పే ఇది. నన్నెవరూ గుర్తుపట్టడం లేదు. ఎవ్వరి పనికి వారే హడావిడిగా వెళ్తున్నారు. ఒక్క క్షణం నిట్టూర్చి, ముందుకు నడవసాగాను. నా బాల్య మిత్రుడు రాఘవులు అవిటికాలితో కుంటుకుంటూ ఎదురు పడ్డాడు. నన్ను పరిశీలనగా చూసాడు. 

    'ఒరేయ్ సూర్యం! నీవు బ్రతికున్నావా?'

    ఆశ్చర్యానందంతో నన్ను కావలించుకున్నాడు. అదే ప్రేమ, ఆపాయ్యత. తనలో మార్పేమీ లేదు. తన్మయత్వంతో ఒకరినొకరం హత్తుకపోయాము.

    "పదా.. పదా... మా ఇంటికెళదాం! వద్దు... ఇంటికి కాదు... మన స్నేహనికి గుర్తుగా ఉన్న వేపచేట్టు నీడకెళదాం. మన బాల్య జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి" నా చేయి పట్టుకున్నాడు. తను అవిటివాడైనా నాతో సమానంగా అడుగులేస్తున్నాడు. నడకలో ఉత్సాహం, తనలో ఉద్వేగం తొణికిసలాడుతున్నాయి. 

    'సూరీ! వూరు చాలా మారిందిరా! మడుసులు మహ చెడ్డోల్లైనారు. ప్రేమానురాగాలు తరిగినై. డబ్బున్నోడిదే పెత్తనం, చెల్లుబాటు. నోటుంటేనే మాటైనా, ఆటైనా, పాటైనా, సాపాటైనా. అంతెందుకు నా ఇంట్లోనే నేనే పరవాసినైనాను. రెక్కలు ముక్కలు చేసి బిడ్డలను పెద్దోళ్ళని చేస్తే... ఎగిరిగిరి నన్నే తంతున్నారు. సరేలే నా గొడవెందుకుకిప్పుడు కానీ, నీవెలా బ్రతికావో చెప్ప'మంటూ ఆత్రంగా అడిగాడు. 

    "అసలు నేను చనిపోవడం ఏంటి? నాకర్థం కావడం లేదు?" అసహనంగా ప్రశ్నించాను. 

    మళ్ళీ తను మొదలెట్టాడు...

    "నీవు జైలుకెళ్ళిన మూడు రోజులకు పేపర్లో ఓ వార్తొచ్చింది. 'జైలు నుండి సూర్యమనే ఖైదీ పరారు. పోలీసులు కాల్చివేత' ఆ వార్తతో మేమంతా నెల రోజులు మనుషులం కాలేకపోయాం. పాపం సీత! పిచ్చిదానిలా తయారైంది. చిన్న పిల్లల భవిష్యత్ కై ధైర్యంగా నిలబడి, అష్టకష్టాలు పడి వారిని చదివించింది. సూరీ! నీవా రోజు కరణం కొడుకుతో పోరాడి భూమిని దక్కించుకోబట్టే నీ పిల్లలు ఒకరికి చేయి చాచకుండా స్థిరపడ్డారు. పెద్దోడు రైల్వేలో ఉద్యోగం, కూతురికి గొప్పింటి సంబంధం, చిన్నోడు ఆటోతో జీవనం. నీవొచ్చాని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. దేవుడు అందరి రాత ఒకలా రాస్తే నీ రాత అడ్డదిడ్డంగా రాసుండొచ్చు. నెల రోజుల క్రిందటే సీత కన్నుమూసింది" రాఘవులి మాట తడబడుతోంది. 
    సీత లేదన్న మాటకు నా గుండె పొక్కిల్తెంది. పొంగుకొస్తున్న కన్నీళ్ళు తను నన్ను తట్టడంతో కనురెప్పల మద్యనే ఆగిపొయాయి. 
    "పదా... మీ ఇంటికెళదాం..." నన్ను ప్తెకి లేపాడు. తన భుజాలప్తె నా చెయ్యేసుకొని నడిపిస్తున్నాడు. ఇల్లొచ్చింది. 'ఒరేయ్ రాంబాబూ! మీ నాన్నొచ్చాడురా!' పరుగునెళ్లి కేకేసాడు రాఘవులు. ముందు కొడుకూ వెనకాల కోడలు వచ్చారు. 'ఆటోలో నా ప్రక్కన కూర్చున్న వ్యక్తే నా తండ్రా! గుర్తించలేని దర్భాగ్యుడి'నంటూ  ఒక్క ఉదుటున వచ్చి నన్ను వాటేసుకున్నాడు. పిల్లోడిలా ఏడ్చాడు. నన్నింట్లోకి తీసుకెళ్ళాడు. గదిలో అడుగెట్టగానే సీత ముఖంలో చిరునవ్వు చిందుతోంది. కళ్ళల్లో అనురాగం పొంగుతోంది. కానీ ఆ ముగ్ధమనోహర రూపం దండల్తో, ఫోటోఫ్రేములో బంధించబడింది. ఫ్రేము గ్లాసు సీత ముఖంలో నా ముఖాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది. ఇద్దిరినేకం చేసి చూపిస్తుంది. కానీ నే ఒంటరినిప్పడు. తట్టుకోలేకపోయాను! దిక్కులు పిక్కట్టిల్లేలా సీతా..! సీతా..! అరవాలనుకున్నాను. అరవలేకపోయాను. ఆగిపోయాను. వారం రోజులు గడిచింది. 
    ఓ రోజు కోడలు చిన్నగా మాట్లాడుతున్నా నాకు పెద్దగానే విన్పిస్తోంది. 'ఏమండీ! ముసల్ది చచ్చిందనుకుంటే, ముసలోడొచ్చాడు. మనమే చాలీ చాలనీ డబ్బులతో జీవిస్తున్నాం.చచ్చిన ముసలోడు బ్రతికొచ్చి మనకు భారమైనాడు. చంపుతున్నాడు. మీ అన్నయ్యది పెద్ద ఉద్యోగమే కదా! అక్కడికి తోలండం'టూ.. విసుక్కుంటోంది.'సరేలే పంపిస్తాన్లే నాలుగు రోజులాగు అంటూ సముదాయిస్తున్నాడు చిన్నోడు. కోడలి మాటలు తూటాల్లా పేలుతూనే వున్నాయి నాలో. నిద్ర పట్టడం లేదు. తెల్లవారటం లేదు. రాత్రి భారంగా గడిచింది.

    తెల్లారింది. చిన్నోడితో అన్నయ్యను చూడాలన్పిస్తోందిరా! తీసుకెళ్ళమన్నాను. సరేనన్నాడు. ఇద్దరం ఆటోలో బయలుదేరాం. వెళ్తుండగా ఫోనొచ్చింది. ఆ... అన్నయ్యా! నీ దగ్గరికే వస్తున్నాం. నాన్న బ్రతికేవున్నారు. అంటుండగానే ఏదిరా వాడి గొంతొకసారి వినాలంటూ ఫోన్ లాగేసుకున్నాను. "ఒరేయ్ తమ్ముడూ! చచ్చినోడు ఎలా వచ్చాడురా! మీ వదినసలికే మంచిది కాదు. హంతకుడు ఇంట్లో వుంటే పిల్లలూ చెడిపోతారంటూ నానా రభస చేస్తుంది. ఇక్కడికి తీసుకురాకు..." పిడుగు పడ్డట్లైంది. దేహం రెండుగా చీలుతున్నట్లనిపించింది. ఫోన్ ప్రక్కనే పడేశాను. వెనుక సీట్లోకి వాలిపోయాను. కోడలంటే పరాయిది, తనలా అన్నదంటే ఓ అర్థం వుంది. వాడు నా కన్నకొడుకు, నాకు ప్రతిరూపం. కసాయిలా మాట్లాడుతున్నాడు. నాకు దిక్కెవ్వరిప్పుడు?

    ఏం చేయాలి! ఏదో నెపంతో మళ్ళీ జైలుకెళ్ళడమా? అంతోపిక లేదునాకిక.

    కపటపు నవ్వుతో వేషదారిగా గమనం సాగిస్తున్న సమాజంతో సాగిపోవడమా? నా వల్ల కాదిక.

    హంతకుడన్న మాటే నా మనసును కకావికలం చేస్తోంది. అసలు హంతకుడెవరు?

    కన్నతండ్రిని ఆదరించలేని ప్రతి కొడుకూ హంతకుడు కాదా?

    మమతానురాగాలను మట్టిలో పాతి, డబ్బు చుట్టూ తిరిగే ప్రతి మనిషి హంతకుడు కాదా?

    ఇలా... ఎన్నో ఆలోచనలు.. ప్రశ్నలు సముహలు... నా ఎదలోతుల్లో స్వారీ చేస్తున్నాయి...

    రోడ్డుప్తె ఆటో దూసుకెళ్తోంది. ర్తెల్వే స్టేషన్ వచ్చింది. 

    "నే వెళ్తాలే చిన్నోడా! నువ్వు క్షేమంగా వెళ్ళు! భార్య, పిల్లలూ జాగ్రత్తం"టూ స్టేషన్ లోకి వెళ్ళాను.

    మనసు మనసులా లేదు. నాగలితో భూమి దున్నినట్లవుతోంది.

    సీత గుర్తొచ్చింది. తనే బ్రతికుంటే నాకీ కష్టముండేది కాదే!

    ఏ చెట్టుక్రిందైనా బ్రతికేవాళ్ళం!

    స్టేషన్లో బల్లపై కూర్చున్నాను. ఆకాశంలో సూర్యుడు పడమటకు జారుతున్నాడు. 

    ఎక్స్‌ప్రెస్ కాబోలు బిగ్గరగా కూతేస్తూ స్టేషన్లోకి రాబోతుంది.

    కూర్చున్న చోటినుంచి లేచాను. ఫ్లాట్‌ఫాం పైనుండి క్రిందకి దూకాను.

    రైలు పట్టాల మధ్యలో నుండి పరుగందుకున్నాను.

    ఎదురుగా వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్... దానికెదురుగా వేగంగా పరుగెడుతూ నేను...

    జనమంతా గోలగా అరుస్తున్నారు... కేకలేస్తున్నారు... వొద్దంటున్నారు.... ఆపండంటున్నారు...

    శక్తికొలది ఇంకెక్కువ పరుగెడుతున్నాను. అలసటొచ్చేలోపే... చెమటకారేలోపే...

    దభేల్మని బండికి గుద్దుకొని దూరంగా పడిపోయాను. కొద్ది దూరం దూసుకెళ్ళి ఆగింది రైలు. 

    స్పృహ కోల్పోతున్నాను....

    "అయ్యో పాపం!" అంటున్నారు... ఏడుస్తున్నారు మరికొందరు...

    ఎంత కష్టమొచ్చిందో... గుండెలు  బాదుకుంటున్నారు ఇంకొందరు...

    అరుపులకు తెలిసింది కాబోలు "నాన్న" అంటూ ఉరికొస్తున్నాడు చిన్నోడు.

    రైలు దిగిన డ్రైవర్ "తమ్ముడూ" అంటూ వాడెనక పరుగందుకొన్నాడు.

    నాకవే చివరి కన్నీళ్ళు కావొచ్చు బలవంతంగా దూకబోతున్నాయి...

    దూరంలో పెద్దోడి రూపం కదలాడుతుంది. అచ్చం నాలానే వున్నాడు. మనసు మాత్రం కసాయి.

    నా శ్వాస వేగం తగ్గుతోంది... శక్తి క్రమంగా క్షీణిస్తోంది...

    ఇద్దరు కొడుకులుండీ... ముసలోడ్ని చంపుకున్నారు. లేదు.. లేదు.. చంపారంటూ... జనమంతా హేళన చేస్తున్నారు... నిందిస్తున్నారు. ఎత్తిపొడుస్తున్నారు....

    పడమరలో అస్తమిస్తున్నాడు సూర్యుడు...నా కళ్ళు మూసుకుపోతున్నాయి.   
  

Comments