సకల - దేవరకొండ సహదేవరావు

    అప్పుడే ఆఫీసునించి వచ్చి, బట్టలు మార్చుకుని, స్నానం చెయ్యడానికి ఓపిక లేక, మొహం,కాళ్ళూ,చేతులు కడుక్కుని బాల్కనీలో ఈజీచైర్లో వాలి అలసటగా కళ్ళు మూసుకున్నాడు కాంతారావు. ఆలోచన్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. శరీరం విశ్రాంతి తీసుకోమంటోంది కాని మనసు విశ్రాంతి తీసుకోనని మొరాయిస్తోంది.

    ఇంతలో హఠాత్తుగా 'నాన్నా' అన్న కేక వినబడి తుళ్ళి పడ్డాడు. కూతురు సకల పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో తల పెట్టుకుని "ఎందుకిలా జరిగింది నాన్నా" అంటూ ఏడవడం మొదలెట్టింది. అయితే ఇన్నేళ్ళూ తను దాచి ఉంచిన విషయం తెలిసిపోయిందన్న మాట, కూతురు తల నిమురుతూ అనుకున్నాడు.

* * *

    కాంతారావు విద్యార్థిగా ఉంటున్నప్పటి నుండి గొప్ప అభ్యుదయవాది. ఇప్పటి చాలా మంది యువకుల్లాగ భక్తి కోసం, ముక్తి కోసం ప్రతి అడ్డమైన గాడిదకి మొక్కుతూ, గుళ్ళ ముందు క్యూల్లో నిలబడి కాలాన్ని, శక్తిని వృథా చేసేవాడు కాడు. సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ  చక్కని గొంతుతో శ్రావ్యంగా పాటలు పాడుతూ అందరికీ తలలో నాలుకగా మెలగుతూ ఉండేవాడు. లలిత సంగీత కార్యక్రమాలు పెట్టి చందాలు వసూలు చేసి ఆ ధనాన్ని అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి ఇస్తూ ఉండేవాడు.

    ఆ సందర్భంగా కాంతారావుకి రాధతో పరిచయమయ్యింది. రాధ కూడా మంచి గాయని. ఎంతటి కష్టతరమైన పాటనైనా సునాయాసంగా చక్కని గమకాలతో పాడి శ్రోతలని అలరించేది. ఇద్దరూ కలిసి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల బాగా చనువు ఏర్పడింది. పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకున్నారు.     కాంతారావు తండ్రి సైన్సు టీచరు. అంతేకాకుండా ఆయన హేతువాది. మంత్రాలు, తంత్రాలు, మహిమలు అన్నీ బూటకమని ఉపన్యాసాలు ఇవ్వడమే కాక, అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయంటే వెంటనే అక్కడికి వెళ్లి అవి అబద్ధమని ఋజువు చేసేవాడు. ఎక్కడో వేపచెట్టు నించి పాలు కారుతున్నాయని పోలోమని జనాలు విరగబడుతూంటే వెంటనే వృక్ష శాస్త్రజ్ఞుల దగ్గరకెళ్ళి దానికి కారణం కనుక్కుని జన్యులోపం వల్ల కొన్ని వృక్షాలలో అలా జరుగుతుందని కొంతసేపటికి అది ఆగిపోతుందని సహేతుకంగా పేపర్లలో వివరణ ఇచ్చేవాడు. తల్లి కూడా మహిళా సంఘాల కార్యక్రమాలలో పాల్గొంటూ మహిళల్లో ఉన్న అజ్ఞానాన్ని, మతమౌఢ్యాన్ని సాధ్యమైనంత వరకు తొలగించడానికి ప్రయత్నించేది.     కాంతారావు రాధని పెళ్ళి చేసుకుంటాననగానే వెంటనే ఇద్దరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే కొడుకు తప్పుడు పనులు చెయ్యడం గాని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం గాని ఇంతవకు చెయ్యలేదు. అయినా అమ్మాయి గురించి వివరాలు కనుక్కున్నాడు. ఎందుకంటే వాళ్ళు మూఢభక్తులైతే ఎప్పటికైనా గొడవలు వస్తాయేమోనని. రాధకి తల్లి మాత్రమే ఉందని, తండ్రి చిన్నప్పుడే పోయాడని తరువాత ఆమె కొన్నాళ్ళు క్రిస్టియన్ మతం స్వీకరించి ఇప్పుడు దాన్ని కూడా విడిచిపెట్టిందని తెలుసుకున్నారు. ఆమె ఒక ప్రైమరీ స్కూలులో ఉపాధ్యాయురాలిగా ఉంది.  
    పెళ్ళి చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఆరోజే సాయంత్రం దగ్గర వాళ్ళని, స్నేహితులని పిలిచి చిన్న పార్టీలాగ చేసుకున్నారు. స్నేహితులందరూ లలిత సంగీత కచేరి ఏర్పాటు చేసారు. 

    పెళ్ళయిన రెండు సంవత్సరాల వరకు జీవితం ఆడుతూ పాడుతూ హాయిగా గడిచిపోయింది. రెండు సంవత్సరాలకి సకల పుట్టింది. అప్పటినించి రాధలో ఏదో మార్పుని గమనిస్తున్నాడు కాంతారావు. పూర్వంలాగా చనువుగా ఉండటం లేదు. దూర దూరంగా ఉంటోంది. పసిపిల్లని కూడా అంతగా పట్టించుకోవడన్లేదు. కారణం అడిగితే ఏమీ చెప్పడం లేదు. మాములుగానే ఉన్నాను అంటోంది.

    ఒకరోజు అందుకో తలనొప్పిగా అనిపిస్తే సాయంత్రం కొంచెం ముందుగా ఇంటికి వచ్చాడు. హాల్లో రాధకి ఎదురుగా సోఫాలో కూర్చుని ఎవరో కొత్త కుర్రాడు కనిపించేడు. మంచి ఒడ్డూ పొడుగు స్ఫురద్రూపిలా ఉన్నాడు. నవ్వుతూ మాట్లాడుతూన్న రాధ భర్తని చూసి వెంటనే అతనికి పరిచయం చేసింది.     "అదుగో మా ఆయన. ఆయన గురించి నీకు ఇంతకు ముందే చెప్పానుగా. కాంతా! ఈ అబ్బాయి సుకాంత్. మా దూరపు చుట్టం. ఎథెలెటిక్ ఫెడరేషన్‌లో కోచ్‌గా ఉంటున్నాడు. ఈ మధ్యనే ఈ ఊరికి డిప్యుటేషన్ మీద ఇక్కడి ఎథెలెట్స్‌కి కోచింగ్ ఇవ్వడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి. కాఫీ తీసుకొస్తాను" అని లోపలికి వెళ్ళింది.
    కాంతారావు అతన్ని పలకరించి ఎథెలెటిక్ కోచింగ్ గురించి వాళ్ళ జీతభత్యాలను గురించి అన్నీ అడిగి తెలుసుకున్నాడు. సుకాంత్ చాలా సరదాగా మాట్లాడేడు. ఏదో నెపం పెట్టి సంవత్సరంలో కనీసం రెండు మూడు సార్లు విదేశాలకి టూర్లు వెళ్తుంటామని, ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ఇలా ఎవేవో చాలా విషయాలు చెప్పేడు. కాఫీ తాగాక మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కాని మళ్ళా అతనెప్పుడూ ఇంటికి రావడం చూడలేదు కాంతారావు.

    ఒక రెండు మూడు నెల్లు గడిచాక ఒక రోజు ఇంటికొచేసరికి రాధ ఇంట్లో ఎక్కడా కనబడలేదు. ఉయ్యాల్లో బట్టలు తడిపేసుకుందేమో సకల ఏడుస్తున్నది. పిల్లని ఎత్తుకొని ఓదార్చి రాధ ఎక్కడికెళ్ళి ఉంటుందా అని ఆలోచించడం మొదలెట్టేడు. ఎప్పుడూ ఇలా చెయ్యలేదు. ఎక్కడీకైనా వెళ్ళనుకుంటే తని ఫోన్ చేసి చెప్పేది. ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ కాబట్టి ఇద్దరి ఇంటి దగ్గరా తాళం చెవులు ఉన్నాయి. తను తొందరగా పని ముగించుకుని ఇంటికొస్తూ ఉండేవాడు. ఇద్దరు ముగ్గురు ఆమె స్నేహితులకి ఫోన్ చేసాడు. వాళ్ళెవరూ తమదగ్గరికి రాలేదని చెప్పారు. రెండు మూడు గంటలు చూసాడు. ఆమె సెల్‌కి ఫోన్ చేస్తే స్విచ్‌డాఫ్ అని జవాబు వస్తోంది. ఏం చెయ్యడానికి తోచక ఇలాంటి క్లిష్ట సందర్భాలలో తనకు ఎల్లప్పుడూ తోడూనీడగా ఉండే స్నేహితుడు కిరణ్‌కి ఫోన్ చేసాడు. వెంటనే కిరణ్ వచ్చాడు. ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ, నవ్విస్తూ ఎంత పెద్ద సమస్యనైనా తేలిగ్గా కొట్టిపారేసేవాడు అలా మౌనంగా ఉండి పోగానే కాంతారావుకి ఏదో భయం వేసింది. ఏదో విషయాన్ని దాస్తున్నాడనిపించి అడిగేడు.

    "కిరణ్! ఏం అలాగున్నావు? ఎప్పుడూ ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చేవాడివి. ఎందుకంత మౌనంగా ఉన్నావ్? ఏదో దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పరా?" అని ఆతృతగా అడిగేడు.
    "కాంతా! నీకు ఎన్నో రోజుల్నించి ఒక విషయం చెబ్దామని అనుకొని చెప్పలేక పోతున్నాను. నేను ఊహిస్తున్నది వట్టి అనుమానమేమోనని ధైర్యం చేయలేకపోయాను" అని ఆగిపొయాడు.     "ఏంట్రా సస్పెన్స్‌తో చంపక వెంటనే విషయమేమిటో చెప్పరా!"     "మీ ఇంటికి తరచు వస్తూంటాడే ఒకబ్బాయి. బయట రెస్టారెంట్లలో పార్కుల్లో కూడా రాధ అతనితో తిరగడం చూసాను. అయితే మీ ఇద్దరి అన్యోన్య దాంపత్యం తెలుసుకాబట్టి, నీకు తెలిసే ఇదంతా జరుగుతున్నదేమో ! నేనే అనవసరంగా నీలో అనుమానాలు రేకెత్తిస్తానేమో, అనే భయంతో చెప్పలేదు"     "ఛ, రాధ అలాంటిది కాదురా. ఎక్కడికో ఏదో తొందరలో వెళ్ళుంటుంది. వాళ్ళ పిన్నిగారు పక్క ఊర్లో ఉన్నారని, ఆమెకి ఈ మధ్యన వంట్లో బాగులేదని చెప్పింది. బహుశ అక్కడినించి కబురేదైనా వస్తే వెళ్ళి ఉంటుంది" అన్నాడు కాంతారావు తన్నితాను సమాధాన పర్చుకుంటూ.

    అయ్యుండొచ్చు అని చెప్పి కొంతసేపు కాంతారావుకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్ అతని నమ్మకాన్ని వమ్ము చెయ్యడం ఇష్టం లేక.     రాత్రి పడుకున్నప్పుడు తలగడలు సర్దుతుంటే తలగడ కింద ఫేను గాలికి రెపరెపలాడుతూ కాగితం కనబడింది. తీసి చూశాడు కాంతారావు. రాధ రాసిన ఉత్తరం.     "కాంతా! నన్ను క్షమించు. సుకాంత్, నేను కలిసి సింగపూర్ వెళ్తున్నాం. అక్క్డ్నించి హాంకాంగ్, మలేషియా తిరిగి వస్తాం. నీకు ముందుగా చెప్పి నీ అనుమతి తీసుకొని వెళ్దామనుకున్నాను. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్య పడదని అనుకున్నాను. ఇది వ్యామోహమో, తొందరపాటు చర్యో ఏదైనా అనుకో. కాని ఎందుకో సుకాంత్‌తో కలిసి తిరగాలనిపించింది. ఒక వేళ నేను తిరిగి రాకపోతే బాధ పడకు. నీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించు - రాధ "     ఆ రాత్రంతా కాంతారావుకి నిద్రపట్టలేదు. పచార్లు చేసాడు. పుస్తకం ఏదో తీసి చదువుదామనుకున్నాడు. అక్షరాలని కళ్లు చూస్తున్నాయి కాని మెదడు వరకు చేరడం లేదు. సకల లేస్తే కొంతసేపు ఆడించి పాలు పెట్టి పడుకో బెట్టేడు. ఆఖరికి తెలతెలవారుతుండగా చిన్న కునుకు పట్టింది.     తల్లిదండ్రులకీ విషయం తెలిసి వెంటనే వచ్చారు.     "రాధని అర్థంచేసుకోవడంలో ఎక్కడో పరపాటు జరిగింది నాన్నా! జీవితంలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగూ ఉంటాయి. నువ్వేం దిగులు పడకు. నీకు ఇష్టమైతే ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకో. పిల్లని మేం పెంచుకుంటాం" అని తండ్రి సలహా ఇచ్చాడు. మరో పెళ్ళికి కాంతారావు ఇష్టపడకపోతే పసిపిల్లని చూడ్డానికి భార్యని ఉండమని తను వెళ్ళి పోయేడు. పిల్ల కొంత ఎదిగి నడవడం మొదలెట్టేక కాంతారావు తల్లిని పంపించి బేబీ సిట్టింగ్ చేసే ఒక మంచి కుటుంబాన్ని చూసి, ఉదయం తను ఆఫీసుకెళ్తున్నప్పుడు వాళ్ళింట్లో వదిలేసి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు.     రాధ తల్లి కూడా వచ్చి చాలా బాధ పడింది. తన కూతురు ఇలాంటి వెధవ పని చేస్తుందని తను కలలో కూడా అనుకోలేదని, తన పెంపకంలో ఎక్కడో లోపం ఉందని, తనని క్షమించమని బతిమాలుకుంది. పిల్లనిస్తే తను జాగ్రత్తగా పెంచి పెద్దదాన్ని చేస్తానని, తనకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తీసికెళ్ళొచ్చని సలహా ఇచ్చింది. కాంతారావు ఆమె సహృదయతకి సంతోషిస్తూ, ఆమె సలహాని సున్నితంగా తిరస్కరించాడు.     రాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ తన దృష్టంతా కూతురి మీద కేంద్రీకరించి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్దదాన్ని చేసాడు. ఎంతో మంది సలహా ఇచ్చారు పెళ్ళి చేసుకోమని. కాని అతని దృఢనిశ్చయాన్ని ఎవ్వరూ కాదనలేక పోయారు. కొంత వయస్సు వచ్చి జ్ఞానం వచ్చాక సకల ఒక రోజు అడిగింది.     "నాన్నా! అందరు పిల్లలూ వాళ్ల అమ్మానాన్నలతో స్కూలు ఫంక్షన్‌కి వస్తున్నారు. నువ్వొక్కడివే వస్తున్నావు. అమ్మేది నాన్నా!" అని అమాయకంగా అడిగింది. ఇన్నాళ్ళు తల్లిలేని లోటు తెలియకుండా ఎంతో జాగ్రత్తగా అభిమానంగా కూతుర్ని పెంచాడు. ఇప్పుడు జ్ఞానం వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటున్నది. తల్లి గురించి ఏదో ఒకటి చెప్పాలి. కాని తల్లి మీద ద్వేషం కలిగించే నిజాన్ని చెప్పి ఆ పసి మనస్సుని బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. "నువ్వు పుట్టాక కొన్ని రోజులకే మీ అమ్మ చచ్చి పోయిందమ్మా! నువ్వు చూసావుగా మన పక్కింట్లో తాతగారు మొన్న చ్చైపోయారు కదా! అలాగే అమ్మకూడా!" అంటుంటే అందుకుంది సకల.     "తాతగారు బాగా ముసలయ్యారు కాబట్టి చచ్చి పోయారని చెప్పావు. అమ్మ మరి ముసలవ్వకుండా ఎలా చచ్చిపోయింది" చిన్న పిల్లల్లో ఉండే ఉత్సుకతతో అడిగింది.     దానికి వివరంగా సమాధానం ఇచ్చాడు కాంతారావు.     "మనిషి పుట్టిన దగ్గర్నించి కొన్ని జీవకణాలు కొత్తవి పుడుతుంటాయి. పాతబడిన జీవకణాలు చచ్చి పోతుంటాయి. కొంత వయసు వచ్చే వరకు పుట్టే జీవకణాలు ఎక్కువగానూ, చనిపోయే జీవకణాలు తక్కువగాను ఉంటాయి. ముసలవుతున్న కొద్ది కొత్తగా పుట్టే జీవకణాలు తగ్గిపోతాయి. చనిపోయేవే ఎక్కువవుతూ ఉంటాయి. ఆఖరి జీవకణాలు కూడా నశించి పోయాక మనిషి చనిపోతాడు. కొంతమందిలో జబ్బుతోనో, ప్రమాదాలవల్లో జీవకణాలు తొందరగా నశించిపోతాయి. అప్పుడు ముసలవ్వకుండానే చనిపోవడం జరుగుతుంది." చిన్నప్పట్నించి విజ్ఞానదాయకమైన విషయాల్ని, లోకజ్ఞానాన్ని బోధించడం వల్ల సకల తండ్రి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంది.     కాంతారావు లాంటి తండ్రులు అందరి పిల్లలకి దొరికితే మనదేశం ఎంతో విజ్ఞానదాయకంగా అభివృద్ధి చెంది ఉండేది. అలా జరక్క పోవడం వల్ల మనదేశంలో చాలా మంది మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు కూడా హఠాత్తుగా ప్రాణాలు ఎక్కడికో ఎగిరిపోతాయని, జీవాత్మలు, పరమాత్మలు, దెయ్యాలు, భూతాలు అని జడ్డి జడ్డి కబుర్లు చెప్తూ అందర్ని మోసం చేస్తూ ఉంటారు. చావుని అర్థం చేసుకుంటే ఈ సంగిరంతా ఉండదు.     ఈ లోపల రాధగురించి, సుకాంత్ గురించి కిరణ్ ద్వారా వార్తలు తెలుస్తున్నాయి. సుకాంత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, రాధ ఒంటరిగా ఎక్కడో జీవితాన్ని గడుపుతూ కేన్సర్‌తో చనిపోయిందని తెలుసుకున్నాడు. ఇవేవీ కూతురికి తెలియనివ్వకుండా సకలని సర్వజ్ఞాన సుందరంగా పెంచుతున్నాడు. సకల కూడా తండ్రి అనే భావన లేకుండా ఒక ఆత్మీయుడైన స్నేహితుడిలాగా అన్ని విషయాలు అతనికి చెప్పి ఏవైనా సమస్యలు, సందేహాలు వస్తే చర్చిస్తూ ఉంటుంది.

* * *
    ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ సంతోషంగా గడిపే కూతురు ఈ రోజు ఇలా ఏడవడం చూసి భరించలేక పోయాడు. రాధ విషయం తెలిసుంటుందని ఊహించినా కూతురు ద్వారానే తెలుసుకుందామని     "ఏవైందమ్మా! నువ్వలా ఏడుస్తూ బాధ పడితే నేను భరించలేనమ్మా. చెప్పమ్మా! ఇప్పుడంత హఠాత్తుగా ఏం కష్టమొచ్చింది? మీ నాన్నతో చెప్పమ్మా!" అని బతిమాలుతూ అడిగేడు.     "కష్టం నాకు కాదు నాన్నా నీకే! ఇన్నేళ్ళు గుండెల్లో కష్టాన్ని దాచుకుని నన్ను ఇంత సంతోషంగా, ఆనందంగా ఏ కష్టం తెలీకుండా పెంచి పెద్దదాన్ని చేశావు. నువ్వే ఒక సారి చెప్పావు. కొవ్వొత్తి తను మండిపోతూ, కరిగి పోతూ మనకి వెలుగుని ప్రసాదిస్తుందని. నువ్వుకూడా అలాగే కుమిలి పోతూ, నాకేమీ తెలియనివ్వకుండా చేసావు. ఎందుకునాన్న! నీకే ఇంత కష్టం ఎందుకు రావాలి నాన్నా! నా కోసం నీ జీవితాన్నంతా త్యాగం చేసావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను నాన్నా!" అని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలీక సతమతమౌతూ నలిగి పోతున్న పరిస్థితిలో కిరణ్ వచ్చాడు.     "అమ్మా సకలా! నాన్నని బాధ పెట్టకూడదనే షరతు మీద నీకు నిజం చెప్పాను. చూడు నువ్వేడుస్తుంటే మీ నాన్న ఎంతలా బాధ పడుతున్నాడో! నువ్వు నవ్వుతూ ఆడుతుంటే తన కష్టాన్నంతా దిగమింగుకుని నువ్వే తన సర్వస్వంల్గా భావిస్తూ ఇన్నాళ్ళు హాయిగా గడిపేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుచేసి నాన్నని ఇబ్బంది పెట్టకమ్మా" అని ఓదార్చేడు.     కిరణ్ మాటలతో కొంత స్వాంతన పొంది తండ్రివొళ్ళో తల పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకుంటున్న కూతురి తల నిమురుతూ కృతజ్ఞతగా చూశాడు కాంతారావు.
Comments