శాలువా - పిడుగుపాపిరెడ్డి

    "ఒరే మాదవా! మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువు. మొండికెయ్యకుండా మీ అయ్య చెప్పినట్లు విను" సర్ది చెప్పాడు శంకరయ్య.

    వాడి వాలకం చూస్తే వినేటట్లు లేదు. "అది కాదు తాతా! ఆయన మొయ్యొద్దు దించొద్దు, నా భాగం నాకు పారేస్తే నా బాధ నేను పడ్తాను.

    కళ్ళు పూర్తిగా తెరవని పిల్లకాకి, మీసాలింక మొలవనే లేదు. వాడు భాగమడుగుతుంటె శంకరయ్యకు ఆశ్చర్యమేసింది.
 
    "ఇదీ మామా వరుస. మాట్లాడితే నా బాగమంటాడు. బాగమిస్తే వాడేంచేస్తడు. ఆ బాగంతో చదువైద్దా? నౌకరొస్తదా? అటు అదిరాక ఇటు పనికిపోక ఈడు రెండందాల చెడతాడని నా బాద"
 
    "నా బాద కూడ విను తాతా! ఎంతకాలం వ్యవసాయం చేసినా ఏమొస్తది? అప్పులు తప్ప. పదవతరగతి ఫస్టులో ఫాసైనా. చదువుకోరా బాగుపడతావని పంతులందరు చెబుతుంటే ఈయనేమో తను తెగించి చదివించలేడు. నాది నాకియ్యమంటె ఒప్పుకోడు. నువ్వు అట్టా అనుకుంటె క్రిష్ణ మామ అంత చదువు చదివేవాడా, అమెరికాకు వెళ్ళే వాడా. కావాలంటే ఇవాళ ఈ వూరినంతా తిప్పి కట్టిస్తాడు."
 
    కొడుకు మాట వినే సరికి శంకరయ్య గుండెలో కొత్త వసంతమొచ్చింది. మాధవ నోట కొడుకు మాట కోకిలపాటగా విన్పించింది. మనసు ఒక్కసారిగా మారిపోయి మనవడి కోపుపట్టాడు. "ఒరే సుబ్బయ్యా! వాడు చెప్పేది కూడా బాగానే ఉందిరా. ఇంటర్ చదివించు. తర్వాత ఆలోచిద్దాం."
 
    సుబ్బయ్యకిది సుతరాం నచ్చలేదు. "జమీందార్లాంటి మీతో పోటీ పెట్టుకుంటె ఎట్టామామా. ఇల్లు జరిగేదెట్టా, పెట్టుబడికెట్లా అని కొటకలాడుతుంటే వాడ్ని పట్నం పంపించమంటవు. చదువంటే మాటలా!" శంకరయ్య ఒక నిశ్చయానికి వచ్చాడు. అన్ని మొక్కలు పెరగనివ్వాలి. ఏ మొక్క ఏ పూలు పూస్తుందో ఎవరికి తెలుసు.

    "పట్నంలో నాకు తెలిసిన పంతులున్నాడు. ఆయన పనిచేసే కాలేజీలో వీడ్ని చేరుద్దాం. అన్నం పెట్టే ఏర్పాటు చేస్తా. చదువుకు పెట్టుకో. ఇంటర్ అయితే ఆ తర్వాత చూద్దాం రా సుబ్బయ్యా" అన్నాడు శంకరయ్య.

    కొడుకు బతుక్కు ఒక మార్గం దొరికినందుకు మనసులో సంతోషపడ్డా, ఆ మాత్రమైన తను పెట్టుకోగలనా అనే సందేహంతో తటపటాయిస్తూనే తలూపాడు సుబ్బయ్య. మాధవకు ఏనుగు యెక్కినంత సంతోషమైంది. శంకరయ్యకు దండం పెట్టి తండ్రి కొడుకులిద్దరు తృప్తిగా వెళ్ళిపోయారు. శంకరయ్య మనస్సు సంతోషంతో నిండిపోయింది. అవును పిల్లలందరు చదువుకొని వృద్ధిలోకొస్తే ఊరు బాగుపడతది. అదే తనుకోరేది అనుకున్నాడు శంకరయ్య.
 
    ప్రక్కనే ఉన్న వెంకటయ్యను పిలిచి, "ట్రాక్టరు తీసుకొని చేలోకి పొయ్యి దుక్కిదున్నరా. తడారిపోతే దుక్కి రాదు" అన్నాడు శంకరయ్య. నెత్తి గీరుకుంటు నిలబడ్డ నాగయ్యను చూసి "నీవేందిరా అట్లా నిలబడి పొయ్యావు?" అడిగాడు.
 
    "ఏంలేదు పెద్దయ్య! గోపాలుగాడు రేపు యేతమేస్తడంట. వాడు యేస్తే నా చేలోకి పోడానికి దారుండదు. ఇయ్యాల ఎయ్యకుంటే నా చేను బీడే. అందుకని ట్రాక్టరు అడుగుదామని వచ్చినా."
 
    "ఒరేయ్ బలె పితలాటకం తెచ్చి పెట్టినవే. ఎట్లామరి. ఒక నాటి అదును ఒక యేటికిరాదని. మా చేను ఆరిపోతుంటే ఏం చెయ్యాలబ్బా!" శంకరయ్య ఆలోచనలో పడ్డాడు.
 
    "ఏం చెయ్యాలన్నా నువ్వే పెద్దయ్యా" అన్నాడు నాగయ్య బాధగా.
 
    "సరిసరే. ఒరే వెంకటయ్యా! వీడు నాగయ్య బాధపడ్తున్నాడు. వాడి చేను యేసి మాపటాల మన చేలోకి పోరా" అన్నాడు శంకరయ్య. నాగయ్య నెత్తి మీద బండ క్రిందికి దించినట్లౌంది. పెద్దయ్య వైపు కృతజ్ఞతతో చూసి సంతోషంగా వెళ్ళిపోయాడు నాగయ్య.
 
    పార్వతమ్మ వచ్చి పక్కన నిలబడింది. "తనకుమాలిన ధర్మం పనికిరాదని ఇదేమిటి వాడి చేనికోసం మన చేను బీడు పెట్టుకుంటామా. పోయినేడు ఇట్లాగే కొంత బీడాయె. ఈయేడైనా కాలమైనప్పుడు ఏసుకోక పోతే ఎట్లా? మనం నిలబడితెగదా పక్కోల్లను నిలబెట్టేది" అంది.
 
    "ఏం చేద్దాం? పిల్లలుగలోడు వాడు బాధపడ్తుంటే మనం చూస్తూ ఉండగలమా!"
 
    "బాగుంది వరస. ఊర్లో ఎవరికేదొచ్చినా అది మన తప్పేనా! అది తీర్చాల్సిన బాధ్యత మనదేనా! వాడికి చదువన్నావు, వీడికి పొలమన్నావు. ఇలా తలా ఒకటి అందిస్తూ కూర్చో. ఆ తర్వాత తిందువుగాని" అంది పార్వతమ్మ నిష్ఠూరంగా. పార్వతమ్మ నిష్ఠూరం అల్లం వేసిన టీలా తియ్యతియ్యగా, కారకారంగా వుంటుంది. అందుకే పార్వతమ్మ నిష్ఠూరం శంకరయ్యకు చాలా ఇష్టం.
    "నీవు మాత్రం తక్కువా పార్వతి! ఆయమ్మ ఈయమ్మ పక్కన చేరి పప్పులోకి ఉప్పునో, పాలలోకి పంచదారనో అంటే అరువుతెచ్చి అయినా వారికి సాయపడుతుంటావు. ఇదేందే ఇల్లుగుల్ల చేస్తున్నావంటే 'పాపం! లేకే కదండి నోరు తెరిచి అడిగేది. ఇట్లాంటి చిన్నచిన్నవి తప్ప నేనేం చేయగలను. సత్రాలు కట్టిస్తానా! చెరువులేయిస్తానా!' అంటావు."
    
    ఇట్లా ఒకరికొకరు నిజంగా నిష్ఠూరమాడుకుంటున్నారో లేక పరుల బాధలను పంచుకునేందుకు మనసులను కూడదీసుకుంటున్నారో తెలీయదు. కాని ఎవరికి వారు తోడుదొంగల్లా యితరులకు సహాయపడడంలో పోటీ పడుతుంటారు.
 
    పక్క బజారులో రామచంద్రయ్య యింటిలో ఏదో గోలగా వుంది. జనం చాలామంది చేరారు. శంకరయ్య వెళ్లి "ఏందిరా" అని అడిగాడు.
 
    "చూడు చిన్నాయనా! ఇదేం పనిచేసిందో" అంటూ పెళ్ళాం మీదకు దూకుతున్న రామచంద్రయ్యను చెంచయ్య ఆపుతున్నాడు.

    "ఏందే కోడలు పిల్లా ఏం జేశావు?" అన్నాడు శంకరయ్య. "ఛూడు మామా! ఈ చెంచన్న చెబితే రాత్రి మినపొడలు చేసి పెట్టినా. పొద్దున్న లేచి కొట్టను మొదులు పెట్టిండు" అంది.
 
    "ఇత్తనాలకు తెచ్చిన మినుములు వడలు చేసింది చిన్నాయనా. యీడు యితండపోడు. చెబితే మాత్రం ఆలోచించొద్దూ? ఇప్పుడు యిత్తనాలెట్లా?" ఆగ్రహంతో ఊగిపోతున్నాడు రామచంద్రయ్య.
 
    "అట్టెందుకు సేసినావురా చెంచయ్యా!"
 
    "ఆ! ఏం లేదు మామా!వీళ్ళిద్దరూ ఎప్పుడూ కుసుకుసుమంటూ కూనిరాగాలు తీస్తూ బలే కుశాలుగా వుంటుంటే ఐయినా చూద్దామని ఓ పుల్ల గీసేసా. అంతే తాటాకు కొంపలా తగలబడింది."
 
    "ఇదేం కుశాలరా, తప్పుకాదూ?"
 
    "అందుకే కదా మామా! అరగంట నుంచి అక్కమీద కమరబడుతున్న రాంబావని ఆపుతూ కూర్చున్న" అన్నాడు చెంచయ్య.
 
    "ఆపడం కాదోయ్. యిత్తనాల సంగతి తేల్చు" రామచంద్రయ్య నిలదీస్తుంటే ఏమీ తోచక అందరూ దిగులుగా నిలబడిపోయారు.
 
    శంకరయ్య నవ్వి "నువ్వు బలేవాడివిరా చెంచులు. కోడలు పిల్ల కుతిక మీదికి తెస్తివే ఎట్లా?" అంటూ "ఆ గుర్తొచ్చింది. మా యింట్లో వుండాల. మీ అత్త దగ్గరకు పోయి తెచ్చుకో పోయే పిల్ల" అన్నాడు శంకరయ్య. 
 
    బతుకు జీవుడా అంటూ పరుగెత్తింది కోటమ్మ. "అత్తాత్తా మినుములుండయంట. రెండుకేజీలీయత్తా. ఇయ్యాల మా మామ దేవుడాలవచ్చి నా మానం కాపాడిండు" అంది.
 
    "ఏమైందే నీ మానానికి?" అడిగింది పార్వతమ్మ.
 
    "ఏముంది. ఆ చెతురు చెంచన్న వచ్చి 'మినుములున్నాయంటక్క యిసిరి వడలు చేసి పెట్టమన్నాడు బావ' అని నవ్వకుండా చెప్పేసరికి నేను నిజమనుకొన్నా. వడలు చేసి నేతికారమేసి పెడితే కమ్మగా తిని, పొద్దున లేచి నా కుతిక పట్టుకున్నాడత్తా నీ కొడుకు. అవి యిత్తనాలకు తెచ్చిన మినుములంట. నాకేమి తెలుసు. మా మామ వచ్చి సమయానికి సెక్కరం అడ్డమేసిండు" అంది.
 
    పార్వతి పకపక నవ్వింది. కళ్ళల్లో నీరూరింది. కోటమ్మ కథకు నవ్వు, చేను బీడుబడతదే అనే వ్యధతో కన్నీళ్ళు. కోటమ్మ మానం మామ నిలబెడితే, మామ మానం నిలబెట్టటానికి పార్వతమ్మ మినుములు యివ్వక తప్పలేదు.
 
    ఆ యేడు చేను బీడే. 
 
    యేటికేడు దిగదుడుపు అవుతున్న తీరుచూసి పార్వతమ్మ నిట్టూరుస్తూ "ఇట్లయితే ఎట్లా" అంది.
 
    "మనకేమి జమీందారులం. పది ఎకరాల మామిడి తోట, పదిహేనెకరాల మాగాణీ, పాతికెకరాల మెట్ట. వ్యవసాయానికి కొత్త వరవడి దిద్ది రాజనాలు పండించిన రైతుబిడ్డను. ఊరిపెద్దగా, ఉత్తమ రైతుగా గౌరవించి ముఖ్యమంత్రి కప్పిన శాలువా నా భుజం మీద ఉన్నంతవరకు ఈ ఊరి బాధ్యత మనం మోయాల్సిందే. బాధ్యతన్న తరువాత కొన్ని బాధలు తప్పవు. అంతమాత్రానికే మన జమీందారీ పోద్దా?" అన్నాడు శంకరయ్య.
 
    "పేరుకేమో జమీందారు, పూటకు మాత్రం కరువు. వెనకటికొకడు వక్క పుటుక్కున కొరికాడంట. 'ఈ బల్లిపల్లి సంస్థానంలో ఇంత నిర్భయంగా ఎవడ్రా వక్క కొరికింది?' అన్నాడట సంస్థానాధీశుడు. కొరికినోడు 'నేనే స్వామీ' అన్నాడట భయపడుతూ. 'అయితే సగమిట్టా పంపించు' అన్నాడట ఆ సంస్థానాధీశుడు" శంకరయ్యకు ఒకటే నవ్వు. పార్వతమ్మ కూడా నవ్వుతూ "మన సమస్థానమూ అంతే. తోట, మాగాణి అంతా అడుమానం పెట్టి అప్పు తెస్తివి. అది తీరేది కాదు. భూమి మనకు దక్కేది కాదు. పోనీ పిల్లవాడికైనా మన బాధ చెప్పుకుందామంటే ఒప్పుకోకపోతివి."
 
    శంకరయ్య పార్వతమ్మ వైపు సాలోచనగా చూస్తూ "నేను వాడికి తండ్రినే. కొడుకును కాదు. వాడు ఏదడిగినా తండ్రిగా ఇంతకాలం ఇస్తూనే వచ్చాను. ఇవ్వడంలో వున్న ఆనందం తీసుకోవడంలో వుండదు. అందుకే నేను ఎప్పుడూ ఇస్తూనే వుంటాను. ఆఖరున ఈ ఊరిని కూడా వాడికే ఇస్తాను."
 
    రంగుల ప్రపంచానికి దూరంగా ఎక్కడో విసిరేసినట్లుగా వుందావూరు. నవనాగరికతకు సంబంధించిన ఏ అంశమూ ఇంకా ఆ ఊరి పొలిమేరలకు చేరలేదు. అందుకే ఆ వూరిలొ ఆందరూ కులమతాలకతీతంగా అన్న,అక్క, అత్త, మామా అంటూ వరుసలు కలుపుకొని ఆప్యాయంగా పిలుచుకుంటూ వుంటారు. వాస్తవంగా శంకరయ్య వాళ్ళకేమీ కాడు. కాని అందరూ ఆయన బంధువులే. అందరికీ ఆయన ఆత్మీయుడే. కష్టసుఖాలు కలబోసుకొని జీవితాలలోని వెతలను పంచుకుంటారు. చితికి పోయిన బతుకులకు ఆదరాభిమానాల అతుకులు వేసుకుంటారు.
    కరువొచ్చి కాలం కలిసిరాక వ్యవసాయం కొడిగట్టింది. కులవృత్తులన్ని కొండెక్కాయి. పాలకుల పథకాలేవి ఆ పల్లె ఛాయలకు రావు. చక్కెర, కిరసనాయిలు పట్నానికే పరిమితం. రెండు, మూడు మాసాలకు ఒకసారి బియ్యం మాత్రం వస్తాయి. అవి కూడా తెచ్చిన కొత్తల్లోనే అయిపోఅతాయి.
 
    బక్కచిక్కిన పేదలు, పస్తులుండే తల్లులు, పాలు రాక కుతి తీరక చీకే పిల్లలు, మంచానికి అతుక్కుపోయిన వృద్ధులు ఈ భయానక వాతావరణాన్ని చూడలేక శంకరయ్య గ్రామస్థుల సహకారంతో గంజి కేంద్రాన్ని ఏర్పాటుచేశాడు. శంకరయ్య పట్టుశాలువా కప్పుకొని, ఉత్తమ రైతు పేరు మీద ఉన్నవాళ్ళను కలుపుకొని దాతల దయాదాక్షిణ్యాల మీద బక్క పేగులకింత గంజి పోస్తున్నాడు. మూడు నెలల నుండి రాత్రింబవళ్ళు కప్పుకున్న శాలువా విప్పకుండా, అడిగినవాడిని అడక్కుండా విరాళాలు వసూలు చేస్తున్నాడు. ఎండాకాలం కూడా ఆయన పట్టు శాలువా ముసుగు తీయడం లేదు. ఆయనే కాదు పార్వతమ్మ కూడా పట్టు చీరలే కడుతుంది.
 
    ఆ రాత్రి ఊరి పెద్దలను పిలిచి నోట్లకట్టలు చేతిలో పెట్టి 'గంజి కేంద్రం నాగాలేకుండా జరపండిరా' అన్నాడు. ఆయకందార్లు ఆస్తి వ్రాయించుకొని అప్పు పోగా మిగతా ఇచ్చిన రొఖ్ఖం అది. "కొంతయినా ఖర్చులకుంచుకోండి" అని కోరారు వాళ్ళు. "ఇద్దరికీ గుండె జబ్బు; ఎప్పుడు ఏమౌతుందో తెలియదు. మాకెందుకు డబ్బు" అన్నాడు.
 
    ఒకరోజు మాపిటాల రామచంద్రయ్యను పిలిచి "చెంబెడు గంజి తెచ్చియ్యరా మీ సిన్నమ్మ ఉప్పు చూస్తదంట." అన్నాడు శంకరయ్య.
 
    "చిన్నాయనా!" అన్నాడు కాని నోట మాట రాలేదు.
 
    "అవునురా. మీ సిన్నమ్మ రెండురోజులైంది ఉప్పు చూడక" గొణిగినట్లుగా అన్నాడు శంకరయ్య.
 
    కోటమ్మ ఘుమఘుమలాడే వంటలతో గిన్నెలు ఇంట్లో పెట్టిపోతుంటే "కోడలు పిల్ల బలే హుషారుగా వుందే" అన్నాడు శంకరయ్య.
 
    "దానికేం వుండక" అన్నది పార్వతమ్మ కూడా నవ్వుతూ.
 
    కోటమ్మ నవ్వలేదు. తలవంచుకొని వెళ్ళిపోయింది. తల యెత్తితే కళ్ళు కాల్వలైతాయని భయం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయారు.
 
    ఆ రెండు హంసలు జంటగా ఏ యరకాడ ఎగిరిపోయాయో యెవ్వరికీ తెలియదు.
 
    తెల్లవారేసరికి ఈ వార్త వూరంతా గుప్పుమంది. పగిలిన పుట్టలోనుండి బయటికి వస్తున్న చీమల్లా జనం. పట్టు శాలువా వంటి నిండా కప్పుకొని పండబెట్టిన నిండు విగ్రహంలా వున్నాడు శంకరయ్య. పక్కనే పట్టుచీరలో పార్వతమ్మ.
 
    కొడుకుకు ఫోన్ చేయమని పక్కన వున్న పట్టణానికి మనిషిని పంపారు. ఆయన అందరాలేడని అందరికి తెలుసు. ఏం చేద్దాం అన్నట్టు జనమంతా సందిగ్ధంలో పడ్డారు. అంతలో ఒకడన్నాడు "ఆయన కృష్ణమూర్తినే కాదు మనల్ని కూడా బిడ్డల మాదిరి సాకిండు. మనమే చేద్దాం ఖర్మ." కర్తవ్యం బోధ పడినట్లు అందరూ ఎవరి పని వారు చేయడం మొదలు పెట్టారు. "ఆగండిరా" అన్నా వినకుండా దేవిగాడి ముఠా తప్పెట్లు వాంచుతున్నారు.  మేళగాండ్లు సొంత పెండ్లిలా సన్నాయి వూదుతున్నారు.
 
    శంకరయ్యను మోసుకొచ్చి మొత్తకానించి నీళ్ళు పోయటానికి శాలువా తీశారు. అంతే తప్పెట్లు ఆగిపోయాయి. మేళతాళాలు మూగబోయాయి. జనమంతా శిలాప్రతిమల్లా నిలబడిపోయారు.
శంకరయ్య వంటి మీద చొక్కాలేదు. ముని చేతివరకు చేతులు, మెడ మీద పట్టీ తప్ప మిగతా చొక్కా అంతా శరీరానికి దిగేసిన పేలికల్లా వున్నాయి. తోలు చుట్టిన ఎముకల గూడులా వుంది శరీరం. వూరు బాధ్యతగా వంటి మీద కప్పుకున్న శాలువా ఆఖరిదాకా ఆయనకు అండగా వుంది. పట్టు గుడ్డలు పగలు రాత్రి వదలకుండా ఎందుకు చుట్టుకున్నారో అర్థమై జనసంద్రం శోక సముద్రమైంది. నిశబ్దాన్ని చీల్చుకుంటూ ఎదలోని బాధ బయటకు వచ్చిందేమో అన్నట్లు జనసమూహం ఉత్తుంగ తరంగంలా లేచింది.
 
    అది శవయాత్రలా లేదు. దేవతా ప్రతిష్టలా సాగింది.
 
    కారు దిగిన కొడుకు జనం మధ్య దారి చేసుకుంటూ గుడిలాంటి యింట్లో కాలు పెట్టాడు. ఎదురుగా రెండు జ్యోతుల మధ్య పరంజ్యోతుల్లా వెలుగుతున్న శంకరయ్య పార్వతమ్మల ఫోటోకు దండ వేసి, పక్కనున్న శాలువా తీసి వంటి నిండా కప్పుకున్నాడు క్రిష్ణమూర్తి.
 
(ఆదివారం ఆంధ్రభూమి 25 మార్చి 2007 సంచికలో ప్రచురితం. రాష్ట్ర స్థాయి ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)
Comments