సమ్మెటపోట్లు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

    
అసలు గుండె లోతుల్లోంచి బాధ తన్నుకొస్తుందా? అంత బాధ వుంటుందా? అనిపించేది. అది కేవలం పుస్తకాల్లో కనిపించే వర్ణన అనుకునే దాన్ని. కాని ఏదన్నా అనుభవంలోకొస్తేనే కదా తెలిసేది. అందర్నీ కాదని ఆయన్ని పెళ్ళి చేసుకున్నాక జగమంత సంతోషాన్ని కౌగలించుకుంటుంన్నంత ఆనందం కలిగింది. కొంతకాలం మేమిద్దరం చిలకా గోరింకలమే! కనిపించిన చోటికల్లా కలయ తిరిగేశాం! ఆ మధురోహల్ని అక్షరీకరిస్తే ఒక భారీ సంకలనం తయారవుతుంది. ఆ తర్వాత 'మా వాళ్ళు మన తప్పుని(?) క్షమించేశారు.. మనని వాళ్ళతో కలిసుండమంటున్నారు' అని ఆయనంటే రోజులు ఇంకా బాగుండబోతున్నాయనుకున్నా. కాని వాళ్ళు ఆయన సంపాదన కోసం ఆయన్ని క్షమించేశారు కాని ఆ ముసలానికి(ఫ్రేమ) కారణమైన నన్ను కాదు. అది వాళ్ళ మాటల్లో చేతల్లో స్పష్టంగా కనిపిస్తుండేది. ఆయనకీ అది తెలుసు కాని నా తప్పులేమీ లేకపోయినా నన్ను వెనకేసుకొచ్చేవారు కాదు. బహుశా వాళ్ళ మీద మమకారమో... అభిమానమో... నా మీద తగ్గిన వ్యామోహమో..! అలాంటి పరిస్థితుల్లో ఓ ఆడది ఏం చేస్తుంది? రాజీ! అవును రాజీ పడ్డాను. అదీగాక మా వాళ్ళు ఆయన సంబంధీకులంత ఉదార స్వభావులు కారు. అందుకే వాళ్ళ మనసుల్లో చంపేసుకుని పిండాలు పెట్టేశారు.

    పూలతలా ఆడదానికి ఓ ఆధారం కావలసిందేకదా! నాకు వారి పంచనుండడమే శ్రేయస్కరం! రాజీ! ఆత్మాభిమానం ఆడదానికుండకూడదు. నా జీవితంలో తెలుసుకున్న ప్రథమ పాఠం. అలా తెల్లారా పొద్దుగూకల్లో రోజులు నిస్సారంగా గడిచిపోతుంటే నా జీవితంలో కాస్త ఊరట కలిగింది. అదీ నాకడుపులో ఓ బీజం పడింది. నా ఆనందానికి చెలియలికట్ట లేదు. నాకు మాత్రమే సొంతమైన ఆ అనుభూతి. అనుభవైకవేద్యమైన అనుభూతి. ఆయన ఎందుకో నాకు ప్రాధాన్యత నిస్తున్నాడు. ఆయనే కాదు ఆయనవాళ్ళూ నాకే ప్రాధాన్యత నిస్తున్నారు. మళ్ళీ నా జీవితం చిగురేసింది. మధురానుభూతులు ప్రాణం పోసుకుంటున్నాయి.

    బాబు పుట్టాడు.

    వాడే నా జీవితం... వాడితోడిదే నా ప్రపంచం.

    దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతున్నాడు. 

    "ఒరెయ్ కన్నా నీకెవరంటే ఇష్టం?" అడిగాడాయన.

    బాబు నావంక చూశాడు. నా తల్లి మనసు పురివిప్పిన నెమలైంది. "నాన్న" చిలక పలుకులే... నా గుండెల్లో గుచ్చుకున్న ములుకులు.

    వాడి మలమూత్రాదులెత్తడం... ఏడుస్తుంటే ఊర్కుండబెట్టడం... మారం చేస్తుంటే నా పొట్టేదో నిండుతున్నట్టు గోరుముద్దలు తినిపించడం... రోగమొస్తే రాత్రంతా కంటికి రెప్పలా కాచుకునివుండడం అన్నీ... అన్నీ గుర్తుకొచ్చాయి. కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి. చాకిరి చేసిన నేను గాక నాన్నెందుకు గుర్తుకొచ్చాడో! నాన్నగుర్తుకురావడం తప్పనను. కాని ప్రథమ స్థానమిస్తూ నాన్నంటే ఇష్టమనడం. ఆ క్షణం మాత్రమే బాధ కలిగింది. మరో క్షణంలోనే మర్చిపోయాను. నా జీవితంలో రెండో పాఠం మర్చిపోవడం. ఎట్లీస్ట్ మర్చిపోయినట్టుగా నటించడం.

    నా రొటీన్ నాకు మాములే. పిల్లలకి ఏం పేరుపెట్టాలి? ఏం చదివించాలి? వాళ్ళ అభివృద్ధి అంతా ఆయనదే! పిల్లల తోటకి ఆయనే యజమాని. నేను కేవలం తోటమాలిని. మమకారాలవీ వుండకూడదు. వాళ్ళ ఎదుగుదలకి కారణమైనందుకు నేను ఆనందించాలి కాని అందులో భాగం కోరుకోకూడదు. పనివాళ్ళంతే కదా! (తల్లులందరూ కళ్ళెర్ర చేస్తారు కాని... నిజం మాత్రం ఇదే). మూడో పాఠం భార్య స్థానమైనా... మాతృస్థానమైనా అది కేవలం పనితోకూడుకున్నది. బంధమన్నది అభిమానంతో కట్టిపడెయ్యడానికి కాదు. గాడిద చాకిరిచెయ్యడానికి.

    రెండో సంతానం అమ్మాయి పుట్టింది. ఫర్వాలేదు చిన్నదైనా నా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఆడ తోడు నాకు భగవంతుడిచ్చాడనుకున్నాను. ఎదుగుతున్నకొద్దీ నాన్నే దాని ప్రపంచం! 'కూతురంటే తండ్రికీ..తండ్రంటే కూతురికీ ఎక్కువ ప్రేమ వుంటుందట' మా అత్తగారు దీర్ఘాలు తీస్తూ చెప్పింది.

    అయిపోయింది... కడుపున పుట్టిన వాళ్ళయినా తనవాళ్ళు కాదు. పేగుబంధాన్ని శాసించేదేమిటి. డబ్బా? లేక నరనరానా జీర్ణించుకుపోయిన కుహనా సంస్కృతా? ఏదేమైతేనేం? తను ఒంటరి. సముద్రంలో చుట్టూ నీరున్నా తాగలేనట్టే..అందరూ తనవాళ్ళయినా తను వంటరి. కొంతమంది ఆ వ్యత్యాసాన్ని ప్రశ్నించాలని చూస్తారు. అందుకై గొంతెత్తుతారు. అప్పుడే "గయ్యాళి" ముద్రపడుతుంది. రాక్షసత్వానికి అదోరూపమవుతుంది. 

    సమాన హక్కులంటూ రోడ్డెక్కినా.. స్వసంపాదన వున్నా ఆడదానిదెప్పుడూ వెనకడుగే! తరాలు మారినా తరతరాలు ఎదురు చూసినా ఆ విషయంలో మాత్రం న్యాయం జరగదు.

    సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ పాత్రధారులే! అయితే పురుషుడు పొందే గౌరవ మర్యాదల ముందు స్త్రీ దిగదుడుపే! ప్రకృతి పరంగా కొన్ని తేడాలున్నా అవి బలహీనతలు ఎంతమాత్రం కాదు. కాని సమాజంలో పురుషాధిక్యత వర్ధిల్లాలంటే అవి బలహీనతలుగా చిత్రీకరించబడాలి. చిత్రీకరించబడ్డాయి. ఎన్నోఏళ్ళుగా ఒక క్రతువులా సాగుతున్న ఈ తంతు ఒక్క సారిగా ఆగదు. ఆలోపల ఎంతమంది మహిళలు సమిధలు కావాలో? "న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి" నరనరాల్లో ఇంకిపోయిన భావన సమాజంలో స్త్రీని రెండవ స్థానంలోనే వుంచుతుంది. పురుషుడి సమాన స్థాయికి మాత్రం తీసుకెళ్ళదు. 'ఆడది అబల కాదు సబల' అని వక్తృత్వ పోటీల్లో బహుమతులు తెచ్చుకోవాలి తప్ప నిజజీవితంలో సబల అయినా అబల అయినట్టే నటించాలి అప్పుడే అస్తిత్వం.
పిల్లలు పెరిగారు. కూతురికి మంచిసంబంధమే చూసి పెళ్ళి చేశా(రు)ము. నా కూతురు మరో చోట నేనయ్యింది. అది మంచి సంబంధమైనా రొంపిలోకే దిగిందన్నది వాస్తవం.

    కొడుకు పెరిగి గడ్డాల వాడయ్యాడు. వాడి ధోరణేదో వాడిది. నాతో మాట్లడడం వాడికి నామోషి. నేను వాడి దృష్టిలో అనాగరికురాలిని. తన తండ్రి 'నన్నెలా పెళ్ళి చేసుకున్నాడో" అని వాడి డౌటు(అది ఒక సారి ఎక్స్ ప్రెస్ చేశాడు కూడా!). వాడు ఒకమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో వున్న స్త్రీని అర్థం చేసుకోడు కాని మరో స్త్రీ అర్థాంగిగా కావాలి. అవును మరి వాడి పురుషాధిక్యత వాడిది.

    అమ్మాయి కుందనపు బొమ్మలా వుంది. మా వాడిది మంచి సెలక్షనే. నాకు ఒకతోడు వచ్చినందుకు ఆనందపడ్డాను. కాని ఆమెకి ఎవరో అత్తగారు ఎంత భయంకరంగా వుంటుందో నూరి పోశారు. నేను దగ్గరవుదాం అనుకుంటున్న కొద్దీ ఆమె అనుమానంతో దూరమవసాగింది. అంతేకాదు వాడిని మా నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది. బహుశా మా పెళ్లయిన కొత్తలో మా అత్తగారు కూడా అలాగే అనుకునుంటుంది. ఈ తారతమ్యాలు వైషమ్యాలు ఒక్క ఆడవాళ్ళమధ్యనే కాని మగవాళ్ళ మధ్య చోటుచేసుకోవు. వాళ్ళ మంచితనం ఎక్కడికీ పోకూడదు కదా! కూతురు-కోడలు-అత్తగారు ఎక్కడైనా ఇవే పాత్రలు అష్టకష్టాలు పడేది. 

    ఈ మధ్యన మా ఆయన ఆరోగ్యం సరిగా వుండడంలేదు. వయసు మీద పడుతోంది కదా! నాకూ మోకాళ్ళ నెప్పులు నడవలేక పోతున్నాను కాని అది అప్రస్తుతం. పతికి సేవ చేయడంలో ఎంత ఆనందముంటుంది. ఆయన నామీద ఆధార పడుతున్నా నేను సేవ చేస్తున్నానన్న తృప్తి వ్యక్తం చేయడంలోనే అందరి అహం చల్ల పడుతుంది. పతివ్రతల కథలు నినదించేది అదే కదా! 

    నేను కొడుకింటికెళ్ళినా..కూతురింటికెళ్ళినా సేవ చెయ్యాల్సిందే! అరే ఇంత కాలం నుండి శ్రమిస్తూ పిల్లల్ని ఇంతింత చేసింది అన్న స్పృహ ఏ ఒక్కరికీ వుండదు. మనవళ్ళు మనవరాళ్ళు గారాబాలు పోయేది నా దగ్గరే..వాళ్ళకి రకరకాల పిండి వంటలు చేసి పెడితే  అదోతృప్తి. పుట్టింది మొదలు గిట్టే వరకు  స్త్రీ జీవితం నరకమే! చనిపోయకన్నా డైరెక్టుగా స్వర్గానికి పోతామో లేదో! అయినా స్వర్గమంటే ఏమిటి? సాటి స్త్రీ లైన రంభ ఊర్వశులు నృత్యం చేస్తుంటే అది చూసి మగాళ్ళు ఆనందిస్తుంటే తనూ కూర్చుని చూడ్డమా? అదా తనకి కావలసింది? అక్కడ కూడా కష్టం సుఖం చెప్పుకోవడానికి ఏ వైషమ్యాలు తారతమ్యాలు లేని స్త్రీ వుండదా? లేక అక్కడ కూడా ఇలాగే చాకిరి చెయ్యాలా? అదే స్వర్గమనుకోవాలా?

    ఈమధ్య గుండెల్లో నెప్పిగా వుంటోంది. భర్తకి చెప్పి చూసింది. నవ్వి ఊరుకున్నాడు. అత్తగారు మాత్రం "నువ్వు అంత త్వరగా పోవు పుణిస్త్రీగా పోయే యోగం అందరికీ వుండదు" తేల్చేసింది. చనిపోవడంలో కూడా పాతివ్రత్యాన్ని డిమాన్‍స్ట్రేట్ చేయడం. ఎవరు రూపకల్పన చేశారో గాని ఆడపిల్ల పుట్టింది మొదలు గిట్టేవరకు కట్టుబాటు దారంతో అందంగా కుట్టేశారు. ఎక్కడన్నా కాస్త పక్కకి జరిగితే 'బరితెగించింది' అన్న ముద్ర వేసేస్తారు. స్త్రీ భయం భయంగా బతుకీడ్వవలసిందే! నాలుగు గోడల మధ్యే స్వేచ్చ అనుకోవాలి. నిజమైన స్వేఛ్ఛ అందని ద్రాక్షే! 

    ఇనుముని కాల్చి ఓ మంచి రూపమివ్వడానికి సమ్మెట పోట్లేస్తారు. కాని పాపగా... బాలికగా... కన్యగా... భార్యగా... తల్లిగా... ఏ రూపం పొందాలన్నా స్త్రీ జీవితాన సమ్మెటపోట్లు తప్పవు. అడుగడుగునా గుండె లోతుల్లోంచి బాధ తన్నుకొస్తున్నా నవ్వుతూ వుండాలి. ఏ  స్త్రీ జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం.


Comments