సామాజిక'వల'యం - ఆకునూరి మురళీకృష్ణ

    
    "నలభై ఏళ్ల వయసులో కూడా ప్రపంచాన్ని నీ ఇరవైఏళ్ళ వయసులో ఉన్నట్టుగా చూస్తున్నావంటే ఇరవైఏళ్ల కాలాన్ని నువ్వు వృథా చేసావని అర్ధం!"

    మా అబ్బాయి దీపక్‌ని ఇంటికి తీసుకువెళ్లడానికి స్కూలుకి వచ్చాను. వాడు క్లాసునుంచి రావడానికి ఇంకా పదిహేను నిముషాల సమయం ఉండడంతో కారుని స్కూల్ కాంపౌండ్ లోపల ఒక వారగా ఆపి, కారులో కూర్చుని ఐ ఫోన్లో ఫేస్ బుక్ తెరిచాను. తెరవగానే నా చిన్ననాటి స్నేహితురాలు రాధ అందులో వుంచిన ఆ తాజా వ్యాఖ్య ప్రత్యక్షమైంది. వ్యాఖ్యని చదివి నాలో నేనే నవ్వుకున్నాను.

    టచ్ స్క్రీన్‌మీద స్క్రోల్ చేస్తూ మిగిలిన స్నేహితుల వ్యాఖ్యలని కూడా చదవసాగాను.

    "జీవితం అంటే జోక్ కాదని నేను నమ్ముతాను. ఎందుకంటే దాన్ని నేనెప్పుడూ ఎంజాయ్ చేయలేదు కనుక" రాగిణి రాసింది. 'అదింకా ఏం మారలేదు' అనుకున్నాను ఆ వ్యాఖ్య చదివి. దానికి చిన్నప్పటినుంచీ కష్టాలే...అయినా, ప్రతి కష్టాన్నీ నవ్వుతూ ఎదుర్కొంటూ ఇలా తనమీద తనే జోకులేసుకోవడం దానికి చిన్నప్పటినుంచీ అలవాటే. పైకి సరదాగా కనిపించినా, దాని వ్యాఖ్యలోని లోతుని అర్ధం చేసుకుని కాసేపు ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాను.
అంతలోనే ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నాకూ మా శ్రీవారు హరీష్‌కీ కామన్ ఫ్రెండ్ అయిన సారథి ఫోటోతో సహా వుంచిన మరో వ్యాఖ్య ప్రత్యక్షమైంది స్క్రీన్‌మీద. ఏదో ఫారిన్ బ్రాండ్ లిక్కర్, దాని పక్కనే లిక్కర్ నింపిన గ్లాసు, కింద వ్యాఖ్య- "హాంగోవర్ బాధనుంచి తప్పించుకోవాలంటే తాగడం మానేయక్కర్లేదు... ఎప్పుడూ తాగే వుంటే సరిపోతుంది!!"

    అది చదివి నవ్వాపుకోలేకపోయాను.

    ఆ తరువాత అతడే వుంచిన మరో వ్యాఖ్య ఫోటోతో సహా మళ్లీ ప్రత్యక్షమైంది. ఒక సొరంగం. అంతా చీకటి. చివరగా ఎక్కడో చిన్న వెలుతురు కనిపిస్తూ ఉంటుందా ఫోటోలో.. దానికింద ఇలా రాశాడు. "ప్రతి సొరంగం చివరా చిన్న వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఆశకూడా అలాంటిదే. నువ్వు చేయాల్సిందేమిటీ అంటే ఆ కనిపించే వెలుతురు ఏదో రైలు తాలూకు హెడ్‌లైట్ కాకూడదని దేవుడిని ప్రార్ధించడమే!"

    చాలాసేపు నవ్వుకుంటూ ఉండిపోయాను. ‘సారథి బ్రాండ్ ఫిలాసఫీ’ అన్న కామెంట్ రాసి వాటిల్ని వెంటనే హరీష్‌కి ఫార్వర్డ్ చేసాను.

    సారథి అలాంటి చతుర సంభాషణలకి పెట్టింది పేరు. ఆ రోజుల్లో అతడితో మాట్లాడుతుంటే సమయం తెలిసేది కాదు. కాసేపు మన కష్టాలనీ, ఒత్తిళ్లనీ అన్నీ మరిచిపోయి జీవితం అంటే ఇలా తేలికగా నవ్వుకోవడమే అనిపించేది. చదువుకునే రోజుల్లోనూ, ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు, హరీష్‌తో నా ప్రేమ ఇద్దరి ఇళ్లల్లోనూ సమస్య అయినప్పుడూ మేము మమ్మల్ని మేం కోల్పోకుండా ఉండేందుకు చాలామటుకు అతడి సమక్షంలోనే సేద తీరేవాళ్లం. తరువాత ఎవరి జీవితాల్లో వాళ్లు స్థిరపడిపోయాక కలుసుకోవడం, మాట్లాడుకోవడం తగ్గింది. ఈమధ్యన మళ్లీ ఈ ఫేస్ బుక్ పుణ్యమాని అతడితో రోజూ మాట్లాడుతున్న అనుభూతి కలుగుతోంది.

    ఒక్క సారథి అనే కాదు, జీవన పోరాటంలో పడి మరిచిపోయిన చాలామంది స్నేహితులూ, సన్నిహిత బంధువులూ ఇలాఈ ఫేస్ బుక్, ఇతర సోషల్ నెట్‌వర్క్ పుణ్యమా అని మళ్లీ మా జీవితాల్లోకి ప్రవేశించి ఎన్నాళ్లుగానో పేరుకునిపోతున్న వంటరితనాన్ని దూరం చేసారు. అందుకే ఇప్పుడు చాలామందిలాగ నాకూ ఫేస్‌బుక్ లేనిదే తోచదు. నిముషం ఖాళీ దొరికితే నేను సృష్టించుకున్న ఆ నా మరో ప్రపంచంలోకి నేను వెళ్లిపోతుంటాను.

    తాదాత్మ్యతతో సాధన చేస్తున్న సంగీత విద్వాంసురాలిలా నేను ఫేస్‌బుక్‌ని పరిశీలించడంలో మునిగిపోయాను. మా బాబాయి కూతురు తన కుటుంబంతో సహా చేసిన జర్మనీ యాత్ర తాలూకు ఫోటోలని అప్‌లోడ్ చేసింది. ప్రతి ఫోటోకి కింద దాని వ్యాఖ్యానం, వివరణలతో దాని కళ్లతో జర్మనీని చూపించడానికి ప్రయత్నించింది. మా అత్తయ్య అమెరికాలో జరిగిన వాళ్ల అబ్బాయి ఎంగేజ్‌మెంట్ ఫోటోలని ఉంచి, కాబోయే కోడల్ని ఫోటోలో అందరికీ పరిచయం చేసింది.
మాతో పాటు ఇంజనీరింగ్ చదువుకుని ప్రస్తుతం బిజినెస్ ఉమన్‌గా స్థిరపడిన కాత్యాయిని తన గురించి దక్కన్ క్రానికల్లో ప్రచురించిన వార్తా కథనానికి లింకు పోస్టు చేసింది. ఆ విశేషాలన్నింటినీ చూస్తూ వాటిని మెచ్చుకుంటూ, నా వ్యాఖ్యలని పోస్టు చేసేసరికి సమయం ఎలా గడిచిందో తెలియలేదు. కేవలం నాకు తెలిసిన పాత స్నేహితులే కాకుండా నా అభిరుచికి తగిన ఎందరెందరో కొత్త స్నేహితుల్ని కూడా నాకు అందించింది ఈ అంతర్జాలం. ఎక్కడెక్కడి ఆత్మీయుల విశేషాలనీ అలా అరచేతిలో చూసుకుంటుంటే, నాకు ప్రపంచమే ఒక కుగ్రామమైపోయిందా అనిపించింది.

    కాసేపటికి ఫేస్‌బుక్‌లోంచి లాగవుట్ అయి వాచీ చూసుకున్న నేను ఉలిక్కిపడ్డాను.

    నేను గుర్తించలేదు కానీ, దాదాపు అరగంట పైనే గడిచింది సమయం. అప్పటికే చాలామంది పిల్లలు బయటకి వచ్చేసారు. నేను కారు దిగి దీపక్‌కోసం చుట్టు వెదికాను. నేను కిందికి దిగకపోయినా, సాధారణంగా వాడు మా కారు ఎక్కడ ఆగివుందో చూసుకుని వచ్చేస్తాడు. దీపక్ కారు దగ్గర కనిపించకపోయేసరికి నేను దూరంగా వస్తున్న పిల్లల వైపు దృష్టి సారించాను.

    చాలామంది అప్పటికే బయటికి వెళ్లిపోయి ఉన్నారేమో, పల్చగా వున్నారు జనం. దూరంగా వస్తున్న పిల్లల్లో కూడా నాకు దీపక్ కనిపించకపోయేసరికి కొంచెం కంగారుగా అనిపించింది. అప్రయత్నంగానే నా అడుగులు ముందుకు పడ్డాయి. దీపక్‌ని వెదుక్కుంటూ స్కూలు భవనంలోకి వెళ్లాను. అక్కడ కూడా వాడు కనిపించలేదు. నాకు భయం వేసింది.

    గబగబ నడుస్తూ వాడి తరగతి గదివైపు వెళ్లాను. తరగతి గదిలో టీచరు లేదు. నలుగురైదుగురు పిల్లలు మాత్రం ఏవో స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్లెవరూ నాకు తెలియదు. నేను సాధారణంగా వాడి తరగతి గది దగ్గరికి ఎప్పుడు రాను. రోజూ దీపక్ పక్కన నడుస్తూ కబుర్లు చెప్పే ఒకరిద్దరి పిల్లల ముఖాలు మాత్రం గుర్తున్నాయి. వాళ్లలో ఆ పిల్లలు లేరు.

    గది గుమ్మంలో నిలబడ్డ నన్ను ఆ పిల్లలు ఆశ్చర్యంగా చూసారు. తినడం ఆపి ఏమిటన్నట్టుగా చూసారు. ‘‘దీపక్ వెళ్లిపోయాడా?’’ అని అడిగాను వాళ్లని.
వాళ్లు అర్ధం కానట్టుగా ఒకసారి ముఖం పెట్టారు. గబగబ నా దగ్గరికి వచ్చి నా చుట్టూ మూగారు. నేను మరేదో అనేలోగా ఏదో గుర్తుపట్టిన వాడిలా వాళ్లలో ఒకడు అన్నాడు 'టి.ఎ.దీపకా ఆంటీ?'

    'అవును' అన్నాను నేను ఆత్రంగా తల వూపుతూ

    'క్లాసవ్వగానే వెళ్లిపోయాడుగా ఆంటీ' అన్నారు వాళ్లు.

    నాకు అయోమయంగా అనిపించింది. క్లాసునుంచి బయట పేరంట్స్ ఎదురు చూసే ప్రదేశానికి నేరుగా ఒకటే దారి. నేను ఆ దారిలోనే వచ్చాను. దీపక్ నాకు ఎదురు కాలేదంటే మరెక్కడికి వెళ్లినట్టు? 'దీపక్ క్లాసునుంచి వెళ్లడం మీరు సరిగ్గా చూసారా?' అని అడిగాను వాళ్లని. 'చూసాం ఆంటీ' అన్నారు వాళ్లు.
నాకు ఏం చేయాలో తోచలేదు. 'మీ క్లాసు టీచరు ఎక్కడ ఉంటారు?' అని అడిగాను.

    'అక్కడ స్టాఫ్ రూమ్‌లో ఉంటారు ఆంటీ. పదండి చూపిస్తాం' అంటూ నన్ను వసారా చివర వున్న స్టాఫ్ రూమ్‌కి తీసుకుని వెళ్లి వాళ్ల క్లాసు టీచర్ని చూపించారు. ఒకటి రెండుసార్లు ఆమెని పేరెంట్స్ మీట్ సందర్భంలో కలుసుకున్నట్టు గుర్తు. ఆమె నన్ను చూడగానే గుర్తుపట్టినట్టు నవ్వింది. నేను కూడా పలకరింపుగా నవ్వినట్టు చేసి దీపక్ గురించి అడిగాను.

    "దీపక్‌ని నేను మధ్యాహ్నం క్లాసులో చూసాను. మీరేమీ ఖంగారు పడాల్సిన అవసరం లేదు. స్కూలు వదిలి బయటికి ఎక్కడికి వెళ్లడానికి పిల్లలని ఒంటరిగా వదలం. ఏ ప్లేగ్రౌండ్‌కో వెళ్లి ఉండవచ్చు. లాస్ట్ పీరియడ్ నాది కాదు...సోషల్ టీచర్‌ది. ఆమెని అడగండి. ఆమెకేమైనా చెప్పాడేమో" అందామె.

    "సోషల్ టీచర్ ఎక్కడ ఉన్నారు?" అడిగాను ఆమెని.

    "సోషల్ టీచర్ నిర్మలగారు ఆమె అటెండెన్స్ రిజిస్టర్ సబ్మిట్ చేయడానికి ప్రిన్సిపాల్ గారి గదికి వెళ్లారు. వచ్చేస్తారు కూర్చోండి" అందామె.
ఆమె వచ్చేదాకా ఆగాలంటే నావల్ల కాలేదు. రోజూ స్కూలుకి వస్తునే వున్నా నాకు దీపక్ టీచర్లెవరితోనూ నాకు పెద్దగా పరిచయం లేదు. సోషల్ టీచర్ని కలవడానికి మళ్లీ నేను ఆ పిల్లలనే ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్లు నన్ను ఉత్సాహంగా ప్రిన్సిపాల్ గది దగ్గరికి తీసుకుని వెళ్లారు. మేము వెళ్లేసరికి గదిలోంచి బయటికి వస్తున్న ఒకామెని చూపిస్తూ 'ఆవిడే నిర్మలా టీచర్ ఆంటీ' అన్నారు.

    గబగబా ఆమె దగ్గరికి వెళ్లి 'మా దీపక్ అందరు పిల్లలతోపాటు బయటికి రాలేదు. మీకేమైనా తెలుసా? ఆఖరి పీరియడ్ మీదేనని క్లాసు టీచరు మిమ్మల్ని అడగమన్నారు' అన్నాను.

    ఆమె ఒక్క క్షణం ఆలోచించి, 'దీపక్ వంశీతో కలిసి క్లాసు బయటికి వెళ్లడం చూసాను. వంశీ వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడారా?' అంది. నేను అయోమయంగా తలూపాను లేదన్నట్టుగా.

    'మీ అబ్బాయి క్లాసు పూర్తయ్యేదాకా క్లాసులోనే ఉన్నాడు. మీరేమీ కంగారు పడాల్సిన పనిలేదు. మీరిటు వచ్చినప్పుడు వాడు బయటికి వెళ్లి ఉంటాడు. మీరు గమనించి ఉండరు. బయటే వెయిట్ చేస్తూ వుండి వుంటాడు. మీరు ఒకసారి బయటికి వెళ్లి మీకు తెలిసిన మిగిలిన పేరెంట్స్‌ని వాకబు చేయండి' అందామె.

    నేను నీరసంగా బయటికి కదిలాను. నాతోపాటు ఆ పిల్లలు కూడా కదిలారు. 'వంశీ వాళ్ల పేరెంట్స్ మీకు తెలుసా?' నిస్సత్తువుగా అడిగాను వాళ్లని.

    'తెలుసాంటీ, పదండి బయటికి వెళ్లాం' అంటూ నా చేయి పట్టుకున్నాడు వాళ్లలో ఒకడు. బాగా అలసిపోయినట్టు వున్న నాకు చేతులకి తగిలిన ఆ లేత చేతుల స్పర్శ ఏదో తెలియని ఓదార్పునిచ్చినట్టనిపించింది. వాడి చేతిని గట్టిగా పట్టుకుని బయటికి నడిచాను.

    బయట అప్పటికే చాలామంది పేరెంట్స్ వెళ్లిపోయారు. కొద్దిమంది మాత్రమే ఉన్నారు. దీపక్ కోసం చుట్టు వెదికాను. వాడు కనిపించకపోయేసరికి నా భయం మళ్లీ హెచ్చింది.

    'వంశీ వెళ్లిపోయినట్టున్నాడు ఆంటీ..వాళ్ల పేరెంట్స్ కనిపించడంలేదు' అన్నారు ఆ పిల్లలు.

    నాకేం చేయాలో తోచలేదు. 'బయట మీకు తెలిసిన మరెవరినైనా అడగండి' అన్న నిర్మలా టీచర్ మాటలు గుర్తుకు వచ్చాయి. చుట్టు చూసిన నాకు ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. అక్కడా నాకు తెలిసిన వాళ్లు ఎ..వ...రూ లేరు!!

    అక్కడ వున్న వాళ్లతో ఎవరితోనూ నాకు కనీసం 'ముఖ పరిచయం' కూడా లేదు. ప్రతిరోజూ స్కూలుకి రావడం, దీపక్ వచ్చేదాకా కారులో కూర్చుని ఎదురు చూడడం, వాడు వచ్చాక వాడిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోవడమే తప్ప అక్కడ ఎదురు చూసే మిగిలిన పేరెంట్స్‌తో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మాట్లాడాల్సిన అవసరం రాలేదు నాకు. హఠాత్తుగా నాకు ఒంటరిగా అయిపోయిన భావం కలగసాగింది.

    అడుగులు తడబడుతుండగా అక్కడ నిలబడి వున్న ఒకామె దగ్గరికి వెళ్లి ఎలాగో నోరు పెగుల్చుకుని అడిగాను "మా అబ్బాయి ఇంకా రాలేదండీ బయటికి, స్కూలు లోపలికి వెళ్లి కూడా చూసాను. అక్కడా లేడు. మీరేమైనా చూసారా?"

    ఆమె నా వంక తేరిపార చూసింది. "మీ అబ్బాయా? ఎలా ఉంటాడు?" అని అడిగింది.

    'బొద్దుగా, తెల్లగా స్కూలు డ్రస్ వేసుకుని..' ఇంకేం చెప్పాలో తెలియనట్టుగా ఆగిపోయాను. అక్కడ అందరి పిల్లలు స్కూలు డ్రస్ వేసుకుని టైలు కట్టుకునే ఉంటారు. పరిచయముంటే తప్ప గుర్తించడం కష్టం. నాకు గొంతు తడారిపోయినట్టుగా అయింది. ఆమె మరొక ప్రశ్న వేస్తే ఏడ్చేటట్టు ఉన్నాను.

    నా పరిస్థితి అర్థం చేసుకున్నట్టుగా ఆమె ఓదార్పుగా నా చేతిమీద చేయి వేసింది. "కంగారు పడకండి. ఏమీ కాదు. ఇక్కడే ఎక్కడో వుండి ఉంటాడు. వెదుకుదాం" అంది.

    "మీరు ఎక్కడ ఉంటారు?" అంటూ ఆమె నా వివరాలు అడిగింది. తన వివరాలు చెప్పి, "మా అబ్బాయి కూడా ఇక్కడ ఆరో తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఆఖరి పీరియడ్ గేమ్స్ అని ఇంకో అరగంట ఎక్కువసేపు ఆడుకుంటానన్నాడు. అందుకే ఎదురు చూస్తున్నా" అని చెప్పింది. ఆమె చెప్పిన వివరాలని బట్టి చూస్తే వాళ్లు కూడా మేము వుండే దగ్గరే వుంటారని అర్థమైంది. కానీ ఇంటి దగ్గర కానీ, స్కూలు దగ్గర కానీ ఆమెతో నాకు ఏ మాత్రం పరిచయం లేకపోవడం విచిత్రంగా అనిపించింది.

    మేము మాట్లాడుతుండగానే మరికొందరు పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి విషయం తెలుసుకున్నారు.

    "ఒక పని చేద్దాం. మీరు ఇక్కడే వుండండి. మేము ఈ పిల్లలను తీసుకుని మళ్లీ స్కూల్లోకి వెళ్లి ప్లే గ్రవుండ్‌లోను, మిగిలిన క్లాసుల్లోనూ చూసి వస్తాం. అవసరమైతే ప్రిన్సిపాల్‌ని కూడా కలిసి మాట్లాడి వస్తాం" అన్నాడు వాళ్లల్లో వున్న ఒక మధ్య వయసాయన.

    నేను సరేనన్నట్టుగా తలూపాను. క్షణంలోనో మరుక్షణంలోనో ఏడ్చేయడానికి సిద్ధంగా వున్న నా దగ్గరికి వచ్చి అన్నారు ఒకరు "మీరు వాళ్ల క్లాసు మాత్రమే చూసారు. అక్కడ లేకపోయేసరికి కంగారు పడుతున్నారు కానీ స్కూలు చాలా పెద్దది కదా? మీ దీపక్ క్లాసు అయిపోయాక గ్రవుండ్‌కో, మరో చోటకో స్నేహితులతో వెళ్లి వుంటాడు. పిల్లలు అంతే, స్నేహితులతో ఆటల్లో పడితే వాళ్లకి సమయం తెలియదు. వచ్చేస్తాడు కంగారుపడకండి."

    నా ఆలోచనలు మళ్లించడానికి అన్నట్టుగా నాతో ఏదేదో మాట్లాడుతున్నారు అందరూ కల్పించుకుని. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరి పిల్లలు వస్తున్నారు. వాళ్ల పిల్లలని నాకు పరిచయం చేసి దీపక్ గురించి అడుగుతున్నారు. ఎవరి దగ్గరనుంచీ సరైన సమాధానం రావడంలేదు. అప్పటికే స్కూలు వదిలి నలభై నిముషాలు పైనే అయిపోయింది. వాళ్లే కనుక పూనుకుని అలా ధైర్యం చెప్పకపోయి వుంటే నేను అక్కడే కూలబడిపోయి ఉండేదాన్ని. వాళ్లతో మాట్లాడుతునే నా కళ్లు దీపక్ కోసం వెదుకుతునే ఉన్నాయి.

    దాదాపు పదిహేన్నిముషాల తరువాత దూరంగా ఇందాక లోపలికి వెళ్లిన వాళ్లు బయటికి వస్తూ కనిపించారు. వాళ్లతోపాటు వస్తున్న పిల్లల్లో దీపక్‌ని చూసిన నా కళ్లు ఆనందంతో మెరిసాయి. 'భగవంతుడా!' అనుకున్నాను కృతజ్ఞతగా.

    "అదిగో మా అబ్బాయి వస్తున్నాడు" అన్నాను ఆనందంగా. నాతో మాట్లాడుతున్న వాళ్లందరు ఒక్కసారిగా తలలు తప్పి అటు వైపు చూసారు. "మేం చెప్పలేదూ? ఎక్కడికి పోతాడు?" "హమ్మయ్యా మీ బెంగ తీరిందా? ఇంక నవ్వండి" "మీవాడు మిమ్మల్ని భలే హడలగొట్టేసాడు సుమండీ" అంటూ అందరూ తలోవిధంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

    నా కళ్లలో నీళ్లు దాచుకోవడానికి అవస్థపడుతుంటే వాళ్లు దగ్గరికి వచ్చేసారు. "స్నేహితులతో కలిసి లైబ్రరీకి వెళ్లాడుటండీ మీవాడు. స్కూల్లో వెదుకుతూ ఎందుకైనా మంచిదని లైబ్రరీలో కూడా చూసాం. అక్కడున్నాడు" అన్నాడు దీపక్‌ని తీసుకుని వచ్చిన మధ్య వయసాయన.

    ఏమాత్రం ముఖ పరిచయం లేని ఆయన నొక క్షణంలో ఎంతో ఆత్మీయంగా కనిపించాడు. నేను ఆయన వంక కృతజ్ఞతగా చూసాను. ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఆయన వివరాలు కనుక్కున్నాను. అక్కడున్న మిగిలిన వాళ్లకి కూడా మా అబ్బాయిని పరిచయం చేసాను.

    దీపక్ రావడంతో నా మనసులో వున్న టెన్షన్ అంతా తొలగిపోయింది. కాసేపు అక్కడే నిలబడి పిల్లలు చేసే ఇలాంటి అల్లరిపనుల గురించి ముచ్చటించుకున్నాం. చాలాసేపటి తర్వాత వారికి కృతజ్ఞతలు చెప్పి రోజూకన్నా చాలా ఆలస్యంగా ఇంటికి బయలుదేరాను.

* * *

    మర్నాడు కూడా నేను దీపక్‌ని తీసుకుని రావడానికి స్కూలు దగ్గరికి వెళ్లాను. కారు పార్కు చేస్తుంటే దూరంగా చెట్టు కింద ముందు రోజు దీపక్‌ని వెదికి తీసుకుని వచ్చిన మధ్యవయసాయన కనిపించాడు. కారు ఆపుతున్న నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు.

    నాకెందుకో రోజులా కారులో కూర్చుని ఐఫోన్లో 'ఫేస్‌బుక్'ని తెరవబుద్ధి కాలేదు. కారు దిగి డోర్ లాక్‌చేసి చెట్టుకిందికి నడిచాను ఆయన్ని పలకరిస్తూ. కాసేపటికి మరికొంతమంది వచ్చారు అక్కడికి.అందరూ నిన్న పరిచయమైన వాళ్లే. ఒకరినొకరం నవ్వుతూ పలకరించుకున్నాం. ఏవేవో మాటలు... కొంతసేపటికి పిల్లలు రావడం మొదలైంది. ఎవరి పిల్లలు వచ్చాక వాళ్లు ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకుని ఇళ్లకి బయలుదేరాం.

    ఆ తరువాతనుంచీ అదే దినచర్య అలవాటైంది నాకు. అవేమీ పెద్ద పెద్ద స్నేహాలు కాకపోయినా, మేము మాట్లాడుకునేది చాలా మామూలు విషయాలే అయినా అలా మాట్లాడుకోవడం నాకేదో తెలియని ప్రశాంతతని, ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. నిజమైన ‘సోషల్ నెట్‌వర్క్’కి అర్థం తెలుస్తున్నట్టనిపిస్తోంది.!!

    ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాలం మనకి ఎన్ని అవకాశాలు కల్పించినప్పటికీ వాస్తవాన్ని మించిన జీవన మాధుర్యం ఉండదని ఈ కొత్త పరిచయాల వల్ల నాకు అనుభవమవుతోంది. ఎక్కడెక్కడి వాళ్లతోనో సెల్ ఫోన్లలో మాట్లాడుతూ పార్కుల్లో వాకింగ్ చేసే వాళ్లనీ, ప్రయాణాల్లో పక్కనెవరున్నారో అన్న స్పృహ లేకుండా మెయిల్స్‌తోను, చాటింగ్‌లోను మునిగిపోయేవాళ్లని చూస్తే ‘చుక్కల ప్రపంచంలోనే కాదు, చుట్టుపక్కల కూడా చూడమని’ తట్టి చెప్పాలనిపిస్తోంది.

(ఆంధ్రభూమి ఆదివారం 25ఆగష్టు 2013 సంచికలో ప్రచురితం) 
Comments