సామాన్యుని సమాధి - పోతుకూచి సాంబశివరావు

  
    శృంగాటకంలో నాయకుడి శిలావిగ్రహం. అందరూ భక్తితో శ్రద్ధాంజలులర్పించారు ఒక పెద్ద సభలో. 

    ఈ విగ్రహ నిర్మాణానికి ఒక కోటిరూపాయలు ఖర్చయిందని సభా ప్రారంభకులు నివేదించారు.

    "ఈ నాయకుడు చాలా గొప్పవాడు" అన్నాడు ఒక రాజకీయవేత్త.

    "అంతా బాగానే ఉందికాని ఈ విగ్రహంలో నాయకుడి మొహం పోలికలు ఎక్కువ కనిపించటంలేదు" అన్నాడు  ఒక సామాన్య ప్రేక్షకుడు.

    ఆ ప్రేక్షకుని మాటలు గుసగుసలుగా సభలో వ్యాపించాయి. కలవరం - కలకలం. అవి వినిపించకుండా సభా ప్రారంభకులు మైకులో గట్టిగా అరిచారు ఉపన్యాస ధోరణిలో.

    ఆవిష్కరింపబడిన ఆ శిలా విగ్రహం పైన ఒక కాకి వాలింది. అంతటితో ఊరుకోలేదు. రెట్ట కూడా వేసింది. ఆ రెట్ట ఆ విగ్రహం ముఖారవిందం మీదపడింది.

    అది గమనించిన ఒక రాజకీయ భక్తుడు 'హుష్' అని కాకిని పారదోలేడు. అయితే ఆ భక్తుడు మరీ పొట్టి. ఆ విగ్రహం ఎత్తుకు అందుకోలేక విగ్రహం ముఖం మీద రెట్టచార తుడవలేక కన్నీరు కార్చాడు.

    సభ సమాప్తమయింది. జనం ఎవరిదారిని వారు వెళ్లిపోయారు.

    ఆ నాయకుడు బ్రతికున్నరోజుల్లో మద్యనిషేధం అమలు జరపాలని వాదించారు. శీలానికి ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో బిచ్చగాళ్లు ఉండకూడదన్నారు. అందరికీ ఉపాధి కల్పించాలన్నారు. ఏ రకమైన దొంగతనమైనా హర్షించేది లేదన్నారు. అందుకే ఆయన చనిపోయాక, జ్ఞాపక చిహ్నంగా ఈ విగ్రహం నిర్మించారు. అయితే దీనికి కోటి రూపాయలు ఖర్చు అవుతుందా అన్నారు జనం. ఆ కోటి ఖర్చులో ఎంత చీకటి ఖర్చో అని జనం అంతర్భావం.

    చీకటి పడింది. మునిసిపాలిటీ వారి విద్యుద్దీపాలలో విగ్రహం కొత్తది కాబట్టి మెరుస్తోంది. "జగమే మాయా బ్రతుకే మాయా" అంటూ ఒకడు తాగి తూలుతూ ఆ విగ్రహం దగ్గర కూర్చున్నాడు. "ఏమండీ నాయకుడు గారూ ఎందుకంత కోపం! మీకూ ఒక చుక్కయివ్వనా" అంటూ వెకిలిగా నవ్వాడు ఆ తాగుబోతు. ఆ నాయకుడి విగ్రహం ఏమనుకుందో పక్కనే ఉన్న వెలుగుతున్న ఎడ్వర్టయిజుమెంట్ ఎర్రలైటులో ముఖం ఎర్రబారి పోయింది.   

    పక్కనే మర్రిచెట్టు. గాలి జోరుగా వీస్తోంది. కిలకిలలాడుకుంటూ ఒక వీధి రౌడీ మరో వీధి విలాసినితో అక్కడకు వచ్చాడు. దూరంగా పోలీసుల ఈలధ్వని గమనించి ఆ విగ్రహం చాటుకు ఇద్దరూ చేరారు. పోలీసులు ఈల వేసుకుంటూ రోడ్డు మీద పోయారు విగ్రహం చాటున ఉన్న వారిని గమనించకుండా.

    ఆ నాయకుడి పాదాలవద్ద వాలారు వారిద్దరూ. గాఢ పరిష్వంగంలో విగ్రహం నీడలో మత్తులో తేలుతూ మైమరిచారు వారిద్దరూ కొద్ది సేపు. వీధి విలాసిని చేతిలో రెండు రూపాయలు ఖంగుమన్నాయి. వీధి రౌడీ లుంగీ దులుపుకుని 'టాటా' అంటూ నిష్క్రమించాడు. 

    వీధి విద్యుద్దీపాల తెల్ల వెలుగు నాయకుడి వదనం మీద పడింది. ముఖం తెల్లబోయినట్లనిపించింది.

    పెద్దమీసాలు, నల్లముఖం, గిరిజాల జుట్టు, గళ్ల లుంగీ, బనీను, మొలను కత్తి ఈ ఆకారంతో ఒకడు బండి లాగుతూ అటు చేరాడు. బండిని ఆపి విగ్రహం చేరువలో నిలిపాడు. రాత్రి రెండుగంటలు. దూరాన రైల్వేస్టేషన్ గడియారం మోగింది. 

    మొలసంచి లోంచి సుత్తీ, ఉలీ తీశాడు. నాయకుడి పాదాల చుట్టూ ఉలీ, సుత్తీ వడివడిగా పనిచేశాయి. విగ్రహ పీఠం పైకి ఎక్కి నాయకుడిని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిలో నాయకుడిని కదిలించేశాడు. పీకకు తాడు కట్టి మెల్లిగా విగ్రహాన్ని వంచి స్తంభం నుంచి విడదీసి, బండిపై చేర్చాడు. నిట్టూర్పు విడిచాడు. "కోటి రూపాయల విలువా దీనిది!" అంటూ నవ్వుకున్నాడు. ఈ ఊరి నాయకుడికి ఇందులో వాటా దేనికి? అనుకున్నాడు.

    విగ్రహం బండిపై పడుకోపెట్టి గుడ్డకప్పాడు. టైర్ల చక్రాల బండి గబగబా పరుగెత్తింది వీధిమలుపు దాటి.

    తర్వాత పోలీసులు జాగ్రత్తగా గస్తీ కాసారు ఈలలు వేసుకుంటూ ఆరోడ్డు మీద. అయితే రోడ్డు వైపే కాని ఎటూ చూడలేదు వారు - వారికి గస్తీ ప్రధానం కనుక. 

    దగ్గుతూ, తూలుతూ, చింపిరిజుట్టుతో చేతికర్ర టక్కు టక్కుమనిపిస్తూ భుజాన జోలెతో ఒక ముష్టివాడు ఆ వైపు నడిచాడు. ఒక పెద్ద చెట్టూ, పక్కనే నాయకుడి విగ్రహ స్థలం చూసి మెల్లిగా చేరాడు. విగ్రహం స్తంభం కింద నడుం వాల్చాడు.

    దగ్గు తెరలు తెరలుగా వచ్చింది. ముష్టివాడి శరీరం వణకి పోయింది. 

    వేగుచుక్క పొడిచింది.

    తూర్పున తొలితెలి రేఖలు ప్రసరించాయి.

    జనం తిరుగసాగారు.

    "అరే నాయకుడి విగ్రహ మేదీ!" అన్నాడొకడు.

    "అరే ఎవరీ ముష్టివాడు - కింద చచ్చి పడున్నాడు" అన్నాడు మరొకడు.

    నాయకుడి విగ్రహం పోయిందన్న వార్త గుప్పుమంది.

    పోలీసులు వచ్చారు. అంతా పరిశీలించారు. పరిశోధన ప్రారంభించారు. 

    నాయకులూ వచ్చారు. సానుభూతి చూపారు - నాయకుడి విగ్రహం పోయినందుకు.

    చచ్చిన బిచ్చగాడిని మున్సిపాలిటీవారు ఈడ్చేశారు. 

    సంవత్సరాలు గడిచినా నాయకుడి విగ్రహం దొరకలేదు.

    కానీ అక్కడ ముష్టివాళ్ళు చేరి కాలం గడుపుతున్నారు. కొందరు తమ అంతిమ యాత్రా స్థలంగా దాన్ని మార్చుకుంటున్నారు. కాకులు అరుస్తూ విలపిస్తున్నాయి. కుక్కలు పక్కనే నిలిచి సానుభూతి చూపుతున్నాయి.

(ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో)    
Comments