సంపెంగ - సడ్లపల్లె చిదంబర రెడ్డి

    
మా వూరి సెలయేటికి అలుపే వుండేదికాదు.  రాత్రీపగలూ ఎడతెరపిలేని పరుగులు, పడుచుపిల్ల కాలి బంగారు మువ్వలవంటి లయబద్ధమైన నాదం - ఇప్పటికీ మనసు పొదల్లో ప్రవహించినట్లే, స్వరమై రవళించినట్లే వుంది. 

    కాలువలను స్వాగత ద్వారాలు చేసి రైతులు పొలాలకు ఆహ్వానిస్తే - ఎండి పెళుసు బారిన మట్టి పెళ్ళలన్నీ - అమృతంతో తడిసిన వెన్నముద్దలై రైతుల పాదాలకు మోకరిల్లేవి. తడిసిన ప్రతి భూకమతమూ కామధేనువు పిట్టై - విత్తిన గింజగింజనూ ప్రేమగా పొదిగి పచ్చపచ్చగా పొలాలంతా మొలిపించేది. 

    మొలిచిన ప్రతి మొక్కా - కాయలో, ఫలాలో, గింజలో, పూలో అతిథిగా మోసుకొచ్చేది - రైతులకు కానుకలుగా సమర్పించేది. అలాంటి పచ్చని పైర్ల వయ్యారాలు చూడటానికే అన్నట్లు పక్షులు ఆకాశంలో గుంపులై విహరించేవి. కిలకిలరవాలై ఆహ్లాదించేవి. అదో అందమైన లోకం!!

    ఆ లోకంలో అన్ని కాలాలకన్న చలికాలానిది ప్రత్యేకత. తెల్లారి నాలుగ్గంటలకు లేవడం, పశువులను బయటకు తోలుతూ పేడ తియ్యడం మొదటిపని. తర్వాత పొలాలకు దౌడు తీయడం, ఒళ్ళంతా వణికించే చలిని పరుగుల వేడితో తరమడం ఒక ఎత్తయితే బావుల్లో దూకి చెమట్లు పట్టేలా ఈదడం మరో గమ్మత్తు.

    ఆడామగా తేడాలేదు. అందరూ జలచరాలై ఈదేవారం. తర్వాత గడ్డి, వంటచెరక్కు, పళ్లకు, కాయలకు, పూలకు... ఎవరి పనులకు వారు వెళ్ళేవారం. దాంతో దినచర్య మొదటి అంకం ముగిసేది. తర్వాత పశువులు కాయడం. 

    ఆ కాలంలో ఇళ్లు కట్టడం పశువులకోసమే! పశువులకు చాలి మిగిల్తేనే మనుష్యుల కాపురం. ఏటిగట్టులో ఎక్కడ చూసినా పచ్చ్కీ బయళ్లు. పశువులు పోట్లాడకుండా ఒకరిద్దరు కాపలావుంటే చాలు. మిగిలిన అందరికీ లెక్కలేనన్ని ఆటలు, చిల్లర చేష్టలు. 

    కొందరు గుమ్మడి కాయలు తెచ్చి నీటి ఆవిరిలో వుడికించేవారు. కొందరు ఆనప, కందికాయలు తెచ్చి కాల్చడమో, గుగ్గిళ్లుగానో చేసేవారు. ఇంకొందరు నల్లేటి కాలువ బొరియల్లో ఎండ్రికాయలు వెతికేవారు. ఆడపిల్లలయితే పైటల్లు విప్పి ఏటి ప్రవాహాల్లో వలల్లా దేవుతూ చేపలు పట్టేవారు. చేల పొదల్లోను, పుట్టల్లోను రహస్యంగా దాచుకున్న తేనెతుట్టల్ని వెదికి తెచ్చేవారు మరికొంతమంది.

    ఒక గుంపు కోతికొమ్మచ్చి ఆట ఆడితే, ఇంకోగుంపు చల్లే మల్లెల కుప్పలాట ఆడేది.

    అక్కడికి అర ఫర్లాంగు దూరంలో పొలంగట్టు వెంబడి పక్కపల్లెకు దారివుండేది. పాదాలు మోపడానికి మాత్రమే ఖాళీవుండి రెడువేపులా ఎత్తుగా గడ్డి పెరిగేది. ఆగడ్డి కొసలను గంటు వేసి కొందరు చెట్ల చాటులో దాక్కొనేవారు. తెలిసినవారు దారివెంబడి కనిపిస్తే మాటలతో ఏమార్చి వేరేదారికి మళ్లించేవారు. పిసినారులో, వడ్డీవ్యాపారులో, గొట్టం ప్యాంటుతో వగలుగా నడిచే వారో గడ్డి కొసలు కాళ్లకు అడ్డు తగిలిపడితే ఆనందానికి హద్దు వుండేది కాదు. పడినవారు దుమ్ముదులుపుకొని, బురద కడుక్కొని లేచేసరికి - అక్కడ పశువులు తప్ప మా పిలకాయల జాడ కనిపించేదికాదు. 

    అప్పుడు పగలంతా పనిచేస్తే రెండు అణాలకూలీ! అంటే పండ్రెండు పైసలు. ఆడవారి అణామాత్రమే!! ఇప్పటి పదిపైసలు నాణెం మాదిరి అణాకు చుట్టూ నొక్కులుండేవి. రెండు అణాల నాణెం ఐదుపైసల బిళ్లలాగా చతురస్రంగా వుండేది. 

    ఆనంద్ మా పక్కింటివాడు. భలే అల్లరిపిడుగు. వాళ్ల నాన్నది కమ్మరిపని. వాడెప్పుడూ ఇనుప బద్దలతో అణా, రెండణాల ఆకారాలు చేసి తన దగ్గర వుంచుకునేవాడు. 

    శుక్రవారం పట్నం సంత. చుట్టూ పల్లెల నుండి జనం జాత్రకు వెళ్లినట్లు వెళ్లేవారు. అప్పటికే దర్జీ కొడుకు బాబాజాన్‌గాడు పాత పంచెలను చీరలను కత్తిరించి కర్చీపుల్లా తయారు చేసేవాడు. వాటి అంచుల్లో నాణ్యాల ఆకారాల బిళ్లలు పిడికెడు కట్టి ఒంటరిగా వెళ్లే వెర్రిబాగుల వంటి వారిని గమనించి దారిలో జారవిడిచేవారు.

    అది నిజమైన డబ్బుగా భ్రమించి చుట్టూ పారజూచి ఎవరూ గమనించలేదనే నిర్ధారణలో తీసుకునేవారు. అది ఎంత సత్యకాలమంటే - ఎక్కువ డబ్బు దొరికిందనే ఆనందంతో, విప్పి లెక్కేస్తే ఎవరయినా చూస్తారేమో అన్న ఆత్రంతో, పరుల సొమ్ము తీసుకొంటున్నామనే దానికి ప్రాయశ్చిత్తంతో - తమ జేబు నుండి రెండు మూడు పైసలు తీసి అక్కడ వేసిపోయేవారు. 

    ఆ పైసలకే తినగలిగినన్ని బుందీలు, బొరుగులు వచ్చేవి అంగట్లో!!

    అప్పుడు మా వూరిపొలాల్లో సగం చెరుకుపంటే వుండేది. సంక్రాంతి మాసంలో ఎక్కడ చూసినా చెరకు గానుగలే!! గానుగ మర బాగా పనిచేయాలని, బెల్లం చెడిపోకుండా శ్రీమార్కు రంగుతో ఉండలు తిరగాలని ప్రతిరోజు పూజలు జరిగేవి. పూజలు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలుండేవి. 

    గానుగలకు పూలసరఫరా మా నాన్న పని. బడికి సెలవులుంటే అది నాపని. అందుకే అందరికంటే ముందే పొలాలకు వెళ్లి రేకులు విచ్చని మొగ్గలతో సహా రకరకాల పూలు బుట్టలు నింపేవాడిని. ప్రతిగానుగా నేను కట్టే పూలమాలల్తో రంగుల తేరుగా తిరిగేది. అందుకే ఏ గానుగ దగ్గరకు వెళ్లినా చెరకులకు, లేత బెల్లానికి నాకు కొదువే వుండేది కాదు. 

    ఆ చొరవతో దుత్తనిండా బెల్లం పాకం తెచ్చేవాడిని. దానిని అరటి, ఆముదపు ఆకుల్లో వేసి - ఉడికిన గుమ్మడి కాయల్తో తనివితీర తినేవాళ్లం. కాల్చిన చేపలు, ఎండ్రకాయలు గుగ్గుళ్లు నంజుకోవడం అదో మరపురాని రుచి. 

    చివరగా మిగిలిన బెల్లం పాకంలో మట్టి పెళ్లలు ముంచేవాడు నామాలోడు . వాడి అసలు పేరు నారాయణ. నామాలోడని ఎందుకు పేరొచ్చిందో తర్వాత చెబుతా. ఆ బెల్లం పూసిన మట్టి ముద్దలు ఎండలో ఆరనిచ్చి ఊళ్లోకెళ్లేవాడు. అంగడి లక్ష్మయ్యకు కనబడే విధంగా దూరంగా భయం నటిస్తూ కాసేపు తచ్చాడేవాడు. ఎవరూ లేనిది గమనించి పరిగెత్తు కొచ్చి పాతగుడ్డలో చుట్టి లక్ష్మయ్యకిచ్చేవాడు. దొంగసరకు కొంటున్న భయంతో లక్ష్మయ్య దాన్ని ఆదరాబాదరా దాచిపెట్టి ఒకటో రెండో రాగిబొట్లు వాడిచేతిలో పెట్టేవాడు. 

    ఇలాంటి పని నారాయణ ముఖానికి సున్నంతో నిలువు నామాలు దిద్దుకొని ఒకరోజు, అడ్డనామాలు తీసి ఒకరోజు, బిచ్చగాడిలా మెడకు జోలి తగిలించ్కొని మరోరోజు చాకచక్యంగా చేసేవాడు. అందుకే అందరి నోటా వాడు నామాలోడయ్యాడు. 

    ఇలా ఇరవై మంది దాకావున్న మా గుంపులో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. అందులో అయిదారు మంది అమ్మాయిలున్నా మేంచేసే చేష్టలకు ప్రేక్షకులుగా మాత్రమే వుండేవారు. ఒక్క గౌరిది మాత్రం ప్రత్యకమైన వ్యక్తిత్వం. 

    ఆమె నవ్వితే మల్లెలు విచ్చేవి. పలికితే గులాబీలు గుబాళించేవి. విచిత్రమేమిటంటే ఆమెకు చెవులు ఏమాత్రం పనిచేయవు. చిన్నప్పుడు చీముకారితే ఎవో నాటు వైద్యాలు చేశారట. మందులు వికటించి చెవులు వినికిడి శక్తి కోల్పోయాయి. అయినా ఆమెకున్న అమోఘమైన పరిజ్ఞానం ముందు చెవులున్న మేమంతా తలవంచుకోవాల్సిందే!!

    ఎదుటివారి మాటల శబ్దాలు వినడంద్వారా వాటిలోని అర్థాన్ని భావాన్ని విశ్లేషించుకుంటాం మనం. ఆమెకు శబ్దాలతో పనిలేదు. మాట్లాడేవారు ఆమె ఎదురు లేకపోయినా ఆ మాటలు వింటున్న రెండోవ్యక్తి ముఖకవళికలను బట్టే మొదటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో పసిగట్టగలదు!!

    ఒకసారి కొందరు ఎండ్రకాయలు పట్టుకొచ్చారు. కొండీలు విరిచి మంటల్లో కాల్చడమే తరువాయి... వాటిని గమనించిన గౌరి "కడుపుల్తోవున్న ఆడ ఎండ్రకాయలే ఎక్కువగా తెచ్చారు. వాటిని చంపితే మరలా మనకు ఎండ్రకాయలెలా వృద్ధి చెందుతాయ్? అన్నీ వదిలేయండి" అని బతిమిలాడసాగింది.

    మేమంతా ఆమెకు ఎదురుగా వున్నాం. నామాలోడు మాత్రమే ఆమెకు వెనుకగా నిలబడ్డాడు. "ఈ చెవిటి దానికి రానురాను అతి ఎక్కువవుతూ వుంది కదరా" అని గొణిగాడు.

    ఆ మాటలు మా చెవుల్లో పడీపడగానే మా ముఖాల ద్వారా అర్థాన్ని తెలుసుకొని  వాడి జుట్టుపట్టి చెంపలు పగులగొట్టడం క్షణంలో జరిగిపోయింది. 

    ఆమె కాళ్లను పట్టుకొని ఏడుస్తూ వాడు క్షమాపణలు అడుగుతూ వుంటే - చేష్టలుడిగిన జీవశవాల్లా మేమంతా మారిపోయాం. అప్పట్నుంచి ఎండ్రకాయలు చేపలు పట్టడం కాదుగదా... పశువులను కొట్టడం కూడా మానేశాం.

    మా గుంపులో ఎవరు లేకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా ఏమీ ముంచుకొచ్చేది కాదు. ఆమె ఒక్క క్షణం మాట్లాడకపోతే ప్రళయం సంభవించినట్లుండేది. ఆమె మాటల మాధుర్యం మనుష్యుల్నే కాదు పశువుల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేసేవి. ఒళ్లు పులకరించే ఆమె పిలుపుల్తో పశువులన్నీ ఆజ్ఞ పాటించేవి. పాట పాడితే గాంధర్వలోకంలో విహరించినట్లుండేది. 

    నేను పూజకు కోసే పూలు ముడుచుకోవడానికిమ్మని ఆడపిల్లలంతా దేబిరించేవారు. ఆమె మాత్రం పూలవేపు కన్నెత్తి కూడా చూసేది కాదు. మల్లెలు, జాజులు, రోజాలు ప్రత్యేకంగా తెచ్చి ఇన్వ్వడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ముట్టేదికాదు. 

    "వాటిని తలలో ముడుచుకొంటే పది నిమిషాల్లోనే వాడిపోతాయి. చెట్టుతల్లి ఒడిలోనే వదిలేస్తే పదిరోజులదాకా అందరి కళ్లకు విందు చేస్తాయి. పరిమళాలను పంచుతాయి" అనేది.

    ఆడవారిని పూలతోను, తీగలతోను పోలుస్తారు. నిజమే!!

    పూల మొక్కలు గాని, తీగలు గాని ఎదుగుదలలేని జాతులు. ఎవరయినా అలా వంచి కావలసినన్ని తుంచుకోవచ్చు. అయితే వాటిలో ఒకే ఒక్కటి మినహాయింపు. అదే సంపెంగ చెట్టు. 

    మా ఏటి గట్టులో పనసచెట్లతో పోటీపడి పెరిగేది ఆ చెట్టు మాత్రమే! నిటారుగా పెరిగి విస్తరించిన ఆ చెట్టు నుండి పూలు కోయడానికి ఆశగా ఎక్కి ప్రాణాలు అరచేత పట్టుకొని ఎన్నిసార్లు నిరాశగా దిగిపోయానో నాకే తెలియదు. 

    అందుకే పూలు ముడవని గౌరిని చూస్తే నాకు పూలు అందుకోనివ్వని సంపెంగ గుర్తుకువస్తుంది.

    ఒకరోజు సాయంత్రం గౌరి ఇంటివేపు వెళ్లాను. తలంటిస్నానం చేయించి పట్టుచీర కట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. అమ్మలక్కలంతా హడావుడి చేస్తున్నాడు. ఆ తతంగం నాకు ఏదో అర్థమయ్యీ కానట్లుంది. అంతలో వాళ్ల అమ్మ నన్ను కేకేసి పిలిచింది. "ఎక్కడ వెదికినా పూలే దొరకలేదు. గౌరికి ముడవడానికి కొన్ని పూలయినా తెచ్చిపెట్టవా" అని బతిమిలాడింది. 

    గౌరి ముడుచుకోవాలే గాని - ఏడు సముద్రాలయినా దాటి తేవాలనిపించింది. ఆ సమయంలో ఎక్కడా దొరకవు ఏటిగట్టు సంపెంగ చెట్టులో తప్ప. ఆలస్యం చేయలేదు. ఒక్క పరుగులో చెట్టు దగ్గర చేరాను.

    రెమ్మల చివర్లో బంగారు రంగుతో మెరుస్తున్నాయి పూలు. సాయంత్రపు చల్లనిగాలి కడుపునిండా పరిమళాలను తాగి మత్తుగా వీస్తూ వుంది. ఆ సౌరభాలను ఆశ్వాదిస్తూనే పరవశమైపోయి చకచకా చెట్టుమీదకు చేరాను. ఏం లాభం? ఒక్క పువూ అందలేదు. కొమ్మల అంచుల్లో అందీ అందనట్లు దోబూచులాడుతున్నాయి. అతి ప్రయాసతో ఒకటి రెండందుకొని జేబులో వేసుకొన్నాను. అయినా తృప్తి కలుగలేదు. 

    ఇంకాయింకా కావాలి. గౌరి జడ నిండా సంపెంగలే నిండిపోవాలి. ఇల్లాంతా ఆ సువాసనలే గుభాళించాలి అని అనుకొని మరో కొమ్మకు ఎగబాకాను. అంతే... చేయే జారిందో, కొమ్మే విరిగిందో మరేం జరిగిందో ఎమీ తెలియదు. స్పృహవచ్చి కళ్లు తెరిచే సరికి పెద్దసుపత్రిలో వున్నాను. నడుం విరిగింది. కాళ్లకు స్పర్శలేదు. కదలడానికి శక్తి లేదు... చుట్టూ అమ్మా నాన్నలు కన్నీటిపర్యంతం విలపిస్తూ... అలాగే కాలం దొర్లిపోతూ వుంది...

    పల్లెను పట్నం కాటేసింది. పారే ఏరును ఫ్యాక్టరీలు పీల్చివేశాయి. ఏటికి ముత్తయిదువులా నిండుతనాన్నిచ్చే ఇసకను నగరాలు దోచుకెళ్లాయి. నాటి ఏ ఆనవాళ్లూ లేవు. ఏ ఆశలూ మిగల్లేదు. అన్ని ఆశయాలమీదా కాలం చీకటి ముసుగు కప్పివేసింది.

    అయినా ఏ క్షణమూ మరపునకు రాక నన్ను వెంటాడుతూనేవుంద్ సంపెంగ పూల పరిమళం. 

    ఏం చేయను? ఎక్కడికీ కదలలేని అవిటితనం. జీవిక కోసం పెట్టుకొన్న సైకిల్ రిపేరీ కొట్టు. ఆ కొట్టుకు నీడనిస్తున్నది సంపెంగ చెట్టు. అక్కడి నుండే ఎన్ని దరఖాస్తులను పెట్టుకొన్నానో, ఆ దారి వెంబడి వెళ్లే ఎందరి కాళ్లకు మొక్కుకొన్నానో - నా అవిటితనాన్ని మరిపించే ఏదయినా సహాయం చేయమని. అయినా ఎవరి దయావర్షమూ నామీద కురవలేదు. ఏ అధినాయకుడికీ నా గోడు వినిపించలేదు.

    ఒక్క సంపెంగ చెట్టుకు మాత్రమే నా బాధలగాధలు తెలిసినట్లుంది. అది మూగచెట్టయినా దాని నిట్టూర్పులనో, కన్నీటి బొట్లనో పండుటాకులుగా చేసి నా మీద అప్పుడప్పుడు రాల్చి ఓదారుస్తూ వుంటుంది. 

    ఆ రోజు రోడ్డంతా శుభ్రం చేస్తున్నారు. ఆనుకొని వున్న అంగళ్లనంతా ఖాళీ చేయిస్తున్నారు. కొత్తగా బదిలీపై వచ్చిన కలెక్టరుగారు అటువేపు వస్తున్నారని తెలిసింది. పోలీసులు వచ్చి " ఏ లంగడా జర దూరం జరుగు" అంటూ నన్నూ నా సామాన్లనూ బూట్ల కాళ్లతోనే మాట్లాడించారు. అందరినీ దేవిరించిన నా నిరాశ పరాకాష్టకు చేరింది. ఇక ఎవర్నీ యాచించదలచుకోలేదు. మనస్సు రాయి చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. వచ్చీపోయే వాహనాలను గమనించడం మొదలుపెట్టాను. 

    వాహనాల రద్దీ పెరిగింది. అరచుకొంటూ పోలీసు వాహనం వెళ్లిపోయింది. దానివెనకాలే తెల్లకారు వచ్చేస్తూ వుంది. మనస్సులోని ఆశలనంతా చంపుకొన్నాను. శరీరంలోని శక్తినంతా రెండు చేతుల్లోకి తెచ్చుకొన్నాను. కళ్లు మూసుకొని కారు కింద దూరడానికి కప్పల ఎగిరానో లేదో కీచు శబ్దంతో అది అక్కడే ఆగిపోయింది. అయ్యో! ప్రయత్నం వృథా అయ్యింది. మూసిన కళ్లు తెరవడానికి... నా మీద నాకే అసహ్యం,జుగుప్స. అవమానభారంతో అప్పటికప్పుడు గుండె పగిలి చనిపొతే బాగుండునన్న బాధతో నడిరోడ్లో పడిపోయాను. కళ్లు తెరిస్తే పోలీసుల క్రౌర్యాన్ని లాఠీదెబ్బల రాక్షసత్వాన్ని చూడవలసి వస్తుందన్న హృదయ వేదనతో వుండిపోయాను.

    చుట్టూ నిశ్శబ్దం. ఎవరిమాటలూ వినిపించడం లేదు. భూకంపం వచ్చి ఆగిపోయినప్పటి పరిస్థితి. ఏ దుర్మార్గానికి బలికావలసి వస్తుందో అన్న నా ఆలోచన క్షణంలో పటాపంచలయ్యింది. ఎవరో ఎత్తుకొని నన్ను ఎక్కడో కూర్చోపెట్టినట్లయితే కల చెదిరినంత గాభరాతో కళ్లు తెరిచాను. 

    మల్లెలు పరిచినట్టి మెత్తని సీటుమీద నేను. అదే కారులో అభిమానము, దయ, జాలి, కరుణ... వంటి వందల వేల భావాలు కలగలిపిన వెన్నెల చూపులతో అపరదేవతగా అగుపించిన కలెక్టరుగారు.

    ఆ కలెక్టరే గౌరి అని తెలుసుకొన్న మరుక్షణం సునామీలా పొంగుకొచ్చిన నా మనోభావాలను మాటలలో ఎలా చెప్పను? చెప్పడానికి నోరు తెరిస్తే ఆ ఉద్వేగంతో గుండె ఆగిపోవచ్చు. ఆనందము, అభిమానము అతిశయించి గొంతు పూడిపోవచ్చు. అందుకే మూగగా ఆమె ముందు రెండు చేతులు జోడించాను. 

(నెలవంక నెమలీక మాసపత్రిక చైత్రమాసం 2011 సంచికలో ప్రచురితం)              
Comments