సంధ్య - సి.ఎస్.రాజేశ్వరి

    
సముద్రపు వొడ్డున ఇసుక తిన్నెపై కూర్చున్నాను. ఎదురుగా సముద్రపు హోరు. నా గుండెల్లోని హోరును అణచుకొంటూ సంధ్య కోసం ఎదురుచూస్తున్నాను. దూరంగా ప్రేమికుల జంటలు. ఇసుకతో గోపురం కట్టాను. ఎత్తుగా ఎదిగిన గోపురం ఎందుకో నేల మట్టమయింది- నా జీవితంలా.తడబడుతున్న అడుగులతో, నీలిమేలి ముసుగులో ప్రకృతి వొడిలో పరవశించేందుకు ప్రవేశిస్తోంది సంధ్య. నా కిష్టమయిన దృశ్యమది. ఆ దృశ్యం నాకు కొత్త కాదు. నా సంధ్యతో కలసి ఎన్నో సంధ్యాసమయాలను తిలకించాను. సంధ్య--
    సంధ్యను నేను ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు.పెళ్ళి చేసుకొని ప్రేమించాను. ఆరాధించాను. యవ్వనారంభం నుండి సౌందర్యోపాసకుడిని నేను. పేరున్న గొప్ప రచయితని. వివాహమయినప్పటి నుండి సంధ్యారాధకుడినయ్యాను.సౌందర్యానికి ప్రతీక సంధ్య. నా రచనలు సరికొత్త ఊపిరులు సంతరించు కొన్నదంటే అందుకు కారణం సంధ్య. నాకు సంధ్యా, సంధ్యకు నేనూ. యుగాలు క్షణాల్లా దొర్లడమంటే ఏమిటో సంధ్య సాన్నిహిత్యంలోనే తెలిసింది నాకు. పసిపాపను అందివ్వబోయే సంధ్యను పసిపాపలా చూసుకొన్నాను. మాతృత్వం స్త్రీ పాలిట వరమంటారు. కాని నా సంధ్య పాలిట శాపమయింది.
    దూరంగా పిల్లల కేరింతలు. ఆలోచనలనుండి తేరుకొన్నాను. సంధ్య నిష్క్రమించింది. నా సంధ్యను కబళించిన మృత్యువులా చీకటి సంధ్యను మింగేసింది. ప్రకృతి వొడిలోకి సంధ్య మళ్ళీ రేపొస్తుంది. నా సంధ్య నా జీవితంలోకి ఇక రాదు. అనాథగా పెరిగిన నన్ను మళ్ళీ అనాథను చేసింది. లేచాను. నాకు దూరంగ వున్న ప్రేమికుల జంట కూడా లేచారు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొంటూ కబుర్లు చెప్పుకొంటూ నడుస్తోందా జంట. దాదాపు పదిహేను రోజులుగా చూస్తున్నాను వారిని. "మేడ్ ఫర్ ఈచ్ అదర్"అన్నట్లుగా వుంటుందా జంట.వారితో పరిచయం చేసుకోవాలన్న పదిహేను రోజుల వయసున్న నా కోరికకు ఒక రూపం కల్పించడానికి వారి వైపు అడుగులు వేశాను.ముందుగా నన్ను చూసింది ఆ అమ్మాయి. ఎందుకో ఒక్క క్షణం ఆగింది. ఆమె కన్నుల్లో మెఱుపు.అధరాలపై దరహాసం. "మాస్టారు" అస్పష్టంగా ఉచ్చరించాయి ఆమె పెదవులు.నా హృదయంలో కలవరం. అతనూ నావైపు తిరిగాడు. పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. "మాస్టారూ నేను గుర్తున్నానా? విజయవాడలో వున్నపుడు మీ స్టూడెంట్‌ని" చెబుతోంది ఆ అమ్మాయి. నా జ్ఞాపకాలలో విజయవాడ రోజులు మెదిలాయి. ఆ అమ్మాయి నాకు గుర్తు రావడంలేదు.అయినా ఎలా గుర్తుంటుంది? సంధ్య నా జీవితంలో ప్రవేశించిన తొలి రోజులవి. సంధ్య ప్రేమామృతంలో తడుస్తూ లోకాన్నే మరచిన నాకు ఈ అమ్మాయేం గుర్తుంటుంది.ఆలోచనల్లో నిమగ్నమైన నేను ఆ అమ్మాయి నవ్వుతో ఈ లోకంలోకొచ్చాను.
     "మీకు గుర్తు లేదు లెండి మాస్టారూ. నా పేరు మృదుల. వీరు .." అంటూ ఆగిపోయింది ఆ అమ్మాయి. నేను నవ్వుతూ అతనివైపు చూశాను పరిచయం కోసం. అతనూ నవ్వాడు. "నా పేరు రాఘవ. కెనరా బ్యాంక్ మేనేజరుగా పనిచేస్తున్నాను" అంటూ కరచాలనం చేశాడు.
    "మాస్టారూ! మిమ్మల్నిలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది" మృదుల అంది. నేను నవ్వాను. "మిష్టర్ రాఘవా, మృదులా నిజం చెప్పనా? అసలు నేనే ముందు మీ పరిచయం కోసం వచ్చాను. కాని మృదులే పరిచయం చేసేసింది." కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ నడిచాక మా దారులు వేరయ్యాయి.మరో సారి ఆ జంట వైపు చూస్తూ "గాడ్ బ్లెస్ యు బ్యూటిఫుల్ కపుల్" అనుకొన్నాను మనస్ఫూర్తిగా.
మర్నాడు సాయంకాలం-
    సంధ్యను స్వాగతమిస్తూ దూరంగా వున్న లైట్ హౌస్‌ను తిలకిస్తున్నాను నేను. "మాస్టారూ!" అన్న పిలుపుతో వెనక్కు తిరిగాను. రాఘవ, మృదుల.
    "మాస్టారూ! ఒంటరిగా వచ్చారేం. మీ శ్రీమతి రాలేదా?" అడగకూడదనుకొన్న ప్రశ్న రాఘవ అడిగాడు. మనస్సాగరంలో దుఃఖ తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. అణచి పెట్టుకొంటూ చెప్పాను సంధ్య ఇక లేదని. మృదుల కళ్ళల్లో అంతులేని జాలి, నిశ్శబ్దం ఆవరించింది. వాతావరణం బరువుగా వున్నట్లు తోచింది. ముందుగా నేనే మాట్లాడాను."రాఘవా మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారు?" మృదుల తల దించుకొంది సిగ్గు కాబోలు.
    "త్వరలోనే మాస్టారూ" రాఘవ అన్నాడు. సంధ్య నిష్క్రమించింది. ముగ్గురం లేచాము."మాస్టారూ ఆదివారం మీరు మా ఇంటికి రావాలి" మృదుల ఆహ్వానం. ఆప్యాయతతో కూడీన్ పిలుపును కాదనలేక పోయాను."మాస్టారొక్కరేనా? నేను రావద్దా?" రాఘవ ఉడికించాడు.
    "మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాలా ఏమిటి?" మృదుల గడుసుగా అంది. ముగ్గురం నవ్వుకున్నాము.
ఆదివారం-
    వాళ్ళ నాన్నగారికి నన్ను పరిచయం చేసింది మృదుల. వాళ్ళమ్మగారు అందించిన స్వీటు తింటూ కబుర్లలో పడ్డాం రాఘవా, నేనూ, మృదుల తండ్రి అనంతయ్యగారు. గంట సేపు సంభాషణలో మృదుల కుటుంబం నాకు బాగా అర్థమయింది. కొన్ని ఆదర్శాలు కలిగిన వ్యక్తి అనంతయ్య గారు. కొద్దిపాటి భూమితో పెన్షన్‌తో కాలం వెళ్ళబుచ్చుతున్న సామాన్య జీవి. మృదుల జీవితం సుఖమయం కావడమే ఆ దంపతుల జీవిత లక్ష్యం. కొద్దిపాటి పరిచయంతోనే ఆప్తులయినారు అనంతయ్యగారు. రాఘవ కొద్దిసేపుండి వెళతానన్నాడు. సాగనంపడానికి గేటు వరకు వెళ్ళింది మృదుల. వారివైఒకసారి సాలోచనగా చూచి నిట్టూర్చి అనంతయ్యగారు "బాబూ మృదుల తప్ప మరే బాధ్యతా లేదు నాకు. మృదులను ఇష్టపడే రాఘవను, వారి ప్రేమనూ కాదని, మృదులను మరొకడీకి ముడివేసే కిరాతకుడీని కాను నేను.రాఘవ తల్లిదండ్రులకూ మృదుల కోడలు కావడం ఇష్టమే. మృదుల అదృష్టవంతురాలు కదూ!" ఆయనకు తన కూతురి పట్ల గల ప్రేమకు ఎందుకో నా కళ్లు చెమర్చాయి. ఈ సంఘటనతో వారందరూ నాకు ఆత్మీయులయినారు.
    పని మీద పదిహేను రోజులు హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది నాకు. స్టేషన్‌కు వచ్చాడు రాఘవ. "మాస్టారూ నేను కూడా రేపే మా వూరికి వెళుతున్నాను. తాంబూలాలు పుచ్చుకోవడానికి ఏర్పాట్లు చేయాలి.మీరు వచ్చాకనే పెళ్ళి" రైలెక్కాక రాఘవ అన్నాడు.
    "అలాగే రాఘవా. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్." అన్నాను ఆప్యాయతతో. నేను కనబడేంత వరకు రాఘవ చేయి ఊపుతునే వున్నాడు.
    సంధ్య పోయాక ఏకాంతం నా కాప్తమయింది. ఒంటరిగా కూర్చొని సంధ్యతో గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకోవడం నా కిష్టం. కఠినంగా సంధ్యను నా నుండి లాక్కున్న మృత్యువు నా మనసునుండి సంధ్యను వేరు చేయలేక పోయింది. మరెవ్వరూ సంధ్యను నా నుండి దూరం చేయలేరు. ఇది నా నిర్ణయం.
    కాని మృదుల రాఘవల ప్రేమ నాలో సంచలనం కలిగించింది.సంధ్యను గుర్తు తెచ్చే మృదుల చూపులు, పలుకులు, రూపం నాకు మనస్తాపం కలిగిస్తున్నాయి.సంధ్య తప్ప మరెవ్వరూ ప్రవేశించలేని నా హృదయాంగణంలోకి అడపా దడపా మృదుల వచ్చి వెడుతోంది. 
ఎందుకిలా? అంత చపలచిత్తుడినా నేను? మగవాడి ప్రేమ కపటం, అశాశ్వితం అన్న పదాలను తొందరలో నేను కూడా శాశ్వితంగా జీవించేటట్లు చేస్తున్నానా? నా ప్రేమను అపహాస్యం చేస్తున్న అంతరాత్మను ఎందుకో గద్దించ లేక పోయాను.
    హైదరాబాద్ నుండి తిరిగొచ్చాను. నేను లేని ఈ పదిహేను రోజుల్లో మృదులా రాఘవల వివాహ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలన్న ఉత్సాహం రైలు దిగినప్పటినుండి నన్ను నిలువనీయటం లేదు.నా గది తలుపులు తెరవగానే స్వాగతం పలికింది క్రింద పడివున్న వెడ్డింగ్ కార్డు. దాన్ని విప్పి చూడక మునుపే అనిపించింది అది మృదులది కాదని.అయినా ఒకే ఊళ్ళో వున్నవాళ్ళం. వాళ్ళెందుకు పోస్ట్‌లో పంపుతారు? ఇంకెవరిదై వుంటుందో అనుకొంటూ కవర్ ఓపెన్ చేసి చదవసాగాను. "రామనాథంగారి పుత్రుడు రాఘవకు" నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఇంతకీ పెళ్ళి ఎప్పుడో అనుకొంటూ డేట్ చూశాను.ఆగస్టు పదహారు అంటే ఈరోజు తేదీ ఇరవై. అరే అప్పుడే పెళ్ళైపోయిందా? నాకు మొదటిసారి మృదులపై కోపం వచ్చింది.నన్ను పిలవకుండా పెళ్ళి చేసుకొన్నందుకు ఆమెపై కోపాన్నంతా వెడ్డింగ్ కార్డులోని ఆమె పేరుపై ప్రదర్శించబోయి ఉలిక్కిపడ్డాను."రాధిక" నాలో కలిగే భావావేశాన్ని అణచుకోలేక పోయాను. ఎవరీ రాధిక? అతి ప్రయత్నం మీద చదివాను."లాయర్ రాజారావ్‌గారి కుమార్తె రాధికను ఇచ్చి" ఇదేమిటి రాఘవ మృదులకు పెళ్ళి జరగలేదా? అయ్యో ఏమిటీ అన్యాయం? నాకు కాళ్ళు నిలువలేదు. మరో ఐదు నిమిషాల్లో మృదుల ఇల్లు చేరుకొన్నాను.నన్ను చూడగానే నవ్వి పలకరించారు అనంతయ్య గారు. ఆ నవ్వులో జీవం లేదు.
    "మృదుల ఎక్కడ?" ఆత్రంగా అడిగాను. గదివైపు చూపించారు అనంతయ్య గారు. గదిలోకి అడుగు పెట్టాను. టేబిల్‌పై తలవాల్చి చేత్తో పిచ్చిగీతలు గీస్తోంది మృదుల.ఎలా పలకరించాలో, ఏడిస్తే ఎలా ఓదార్చాలో తెలియక సతమతమై పోతూ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. నన్ను గమనించే స్థితిలో లేదు మృదుల."మృదులా" మెల్లగా పిలిచాను. ఉలిక్కిపడి తలెత్తి "ఓ మీరా మాస్టారు. కూర్చోండి" కుర్చీ చూపించింది. నాకు ఆశ్చర్యం కలిగింది. నేనూహించిన విధంగా లేదామె. "మాస్టారూ ఊరినుండి ఎప్పుడొచ్చారు?" అడిగింది మృదుల. జవాబుగా "మృదులా ఇది నిజమేనా?" వెడ్డింగ్ కార్డు ఆమె ముందు వుంచాను. తలూపింది అవునంటూ.
    "ఏం జరిగింది మృదులా?" నా మాటల్లో ఆతృత. నిట్టూర్చింది మృదుల.
    "మాస్టారూ నేనిలా జరుగుతుందని ఊహించలేదు. తొలి పరిచయంలోనే రాఘవా నేనూ ప్రేమించుకొన్నం. ప్రేమించినవాడు భర్త కాబోతుంటే నా అంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయాను. కాని రాఘవ డబ్బు మనిషి అనుకోలేదు." ఆగింది ఆమె. బహుశా గతంలోని సంఘటనలను గుర్తు చేసుకొంటోందేమో.
ఆ రోజు:-
    తాంబూలాలు పుచ్చుకోవడానికి రాఘవా అతని తల్లిదండ్రులు వచ్చారు. కాఫీ టిఫిన్‌లు అయాక అసలు విషయంలోకి వచ్చారు రాఘవ తండ్రి రామనాథం గారు. "బావగారూ. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకొన్నారు కాబట్టి పెళ్ళి చూపుల సంగతి జరగలేదు. అందుకని ఇప్పుడు చెప్పాల్సి వస్తోంది. మా అంతస్తు సంగతి మీకు తెలియనిది కాదు. నాకు వాడొక్కడే సంతానం. మాకు రాబోయే కోడలు కూడా ఘన లాంచనాలతో రావాలని మా కోరిక. వాడికి లక్షల కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి. కాని అబ్బాయి మనసు పడ్డాడు కాబట్టి మీరు యాభైవేలయినా ఇచ్చుకోవాలి. ఇక లాంచనాల విషయం మీ ఇష్టం. మా అంతస్తుకు తగినట్లుంటే చాలు" ఉపన్యాసాన్ని పూర్తి చేశారు రామనాథంగారు. గుండెల్లో రాయి పడింది అనంతయ్యగారికి. లోపల గదిలో వున్న మృదుల ఉలిక్కిపడింది.
    "బావగారూ! నాకున్నది కొద్దిపాటి పొలం. యాభైవేలు ఇవ్వాలంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మీరు దయతలచాలి" బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నారు అనంతయ్యగారు. రాఘవ తనకేం పట్టనట్లు దినపత్రిక చూస్తున్నాడు. గదినుండి వెలుపలికొచ్చింది మృదుల. తండ్రి ప్రక్కగా నిలబడి "రాఘవ గారూ మీతో మాట్లాడాలి అలా వస్తారా" మృదుత్వం లోపించిన కంఠంతో అంది మృదుల. రాఘవ లేచాడు.ఇద్దరూ ఇంటిముందున్న విశాలమైన తోటలో కూర్చున్నారు. ముందుగా మృదులే అంది. "రాఘవా! ఇప్పుడేమిటి మీ నాన్నగారు కట్నం అంటున్నారు. అంత డబ్బు మా నాన్న ఇవ్వగలరనే అనుకొంటున్నారా?"
    "మృదూ! అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు.మనకెందుకు. ఏవైనా తియాటి కబుర్లు చెప్పు వింటాను."
    "రాఘవా మీరు సంపాదిస్తున్నారు. మీకెంతో ఆస్తి ఉంది. మీకు కట్నం అవసరమే నంటారా?" మృదుల ప్రశ్నించింది.
    "మృదులా! నీవింత సీరియస్‌గా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. మాకు డబ్బుల్లేవని మానాన్న కట్నం తీసుకోవటం లేదు. అది స్టేటస్‌కు సంబంధించిన విషయం.తన స్టేటస్‌కు ఏమాత్రం భంగం వాటిల్లినా మా నాన్న భరించలేడు. మా నాన్న మాటను కాదనలేను" రాఘవ అన్నాడు. మృదుల మనసు ఉడికిపోతోంది అతని మాటలకు.
    "రాఘవా! మన ప్రేమను డబ్బుతో ముడివేస్తున్నారా? డబ్బుకు అమ్ముడు పోవాలనుకుంటున్నారా?" బాధగా అంది మృదుల.
    "మృదులా ఇందులో అమ్ముడు పోవడమంటూ ఏముంది? పెళ్ళయ్యాక ఆ డబ్బు నీది మాత్రం కాదా?"రాఘవ సందేహం.
    "నాదే కావచ్చును. కానీ డబ్బుతో కొనుక్కొన్న భర్తతో, ప్రేమకూ డబ్బుకూ లంకె వేసే పురుషుడితో ఏ ఆడది అయినా రాజీ పడలేదు. ఇది నగ్నసత్యం. విద్యావంతులూ, సంస్కారవంతులూ అయిన మీరే కట్నం ఆశిస్తే ఇక వరకట్న నిర్మూలనకు మార్గమేది? దేశ రథ సారథులైన మీరే అవినీతిని ప్రోత్సహిస్తుంటే దేశం ఎటు పయనించగలదో చెప్పగలవా రాఘవా?"ఆవేశంగా అంది మృదుల.
    రాఘవ ముఖంలో రంగులు మారాయి."ఓహో వరకట్న నిర్మూలనకు కంకణం కట్టుకున్నావన్న మాట.అయితే నీకు సన్మానం చేయాల్సిందే. నీ నిర్ణయం మారని పక్షంలో నా నిర్ణయాన్ని కూడా విను.మా నాన్న మాట కాదనే అలవాటు నాకులేదు. స్టేటస్ మాకు ముఖ్యం. కట్నం అందితేనే ఈ పెళ్ళి జరుగుతుంది. లేదంటే మనం విడిపోవడమే మంచిది. ఇన్నాళ్ళ మన స్నేహంలో నీవింత మూర్ఖురాలివని తెలుసుకోలేక పోయాను. అయినా అయినిటి కోడలు కావడానికి చాలా అర్హతలుండాల్లే.అందం ఒక్కటి చాలదు"రాఘవ కంఠంలో కఠినత్వం.
    వ్యంగ్యంగా నవ్వింది మృదుల."వెల్ మిష్టర్ రాఘవా! మీ ప్రేమకు అర్థం ఇప్పుడు తెలిసింది. మీ దృష్టిలో ప్రేమకు నిర్వచనం డబ్బు.థాంక్ గాడ్. మీ ప్రేమలో పరవశించానే కాని మోసపోలేదు.అంతవరకు నే నదృష్టవంతురాల్నే. నా ప్రవర్తన మూర్ఖంగా అనిపిస్తే అందుకు కారణం మీ అజ్ఞానం. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి. కట్నం తీసుకున్న ఏ మగాడైనా భార్యచే మనస్ఫూర్తిగా ప్రేమించబడి, గౌరవించ బడలేడని మాత్రం తెలుసుకోండి" గిరుక్కున ఇంట్లోకి వచ్చేసింది మృదుల.
    రాఘవ ఇంట్లోకి రావడం, తండ్రిని పిలుచుకొని కోపంగా వెళ్ళిపోవడం, "ఓహో కట్నం ఎగరేద్దామని మా అబ్బాయిపై అమ్మాయిని ఉసిగొల్పారన్న మాట"రాఘవ తండ్రి అనడం వినిపిస్తూనే వుంది మృదులకు.ఛీ ఇటువంటి వాడినా నేను ప్రేమించింది. తన చదువు సంస్కారం ఏమయిపోయాయి.తన ఎంపిక ఇంత నీచమైనదా? తన పెళ్ళిపై ఎన్నో ఆశళు పెట్టుకొన్న తండ్రికి ఎలా ముఖం చూపించేది? తండ్రి పిలిచేవరకు ఆలోచనల నుండి తేరుకోలేక పోయింది.
    "నాన్నా! నన్ను క్షమించ గలరా? నా అభిప్రాయాలతో ఏకీభవించ గలరా?" తండ్రి పాదాలను తాకింది మృదుల. కూతుర్ని లేవనెత్తారు అనంతయ్యగారు. "మృదులా నీవు తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించవమ్మా! నాకా నమ్మకం వుంది. కట్నం గురించి ప్రథమంలోనే ప్రస్తావించక పోవటం మనిద్దరి తప్పు. నీ అభిప్రాయాలకు విరుద్ధంగా కట్నం ఇచ్చయినా రాఘవతోనే నీ పెళ్ళి జరిపించడం నా స్వభావానికే విరుద్ధం. అయితే నీవు రాఘవ విషయంలో బాధ పడనని మాటివ్వు మృదులా. మరో రాఘవను నీ మనసులో నిలుపుకోగలిగే ధైర్యాన్ని నీవు పొందాలి తల్లీ."
    "ప్రయత్నిస్తాను నాన్నగారూ!" గొంతు జీరబోతుండగా అంది మృదుల.
ఇదీ మాస్టారూ జరిగింది-
    మృదుల చెప్పింది విని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. రాఘవ అంత డబ్బు మనిషా. కత్నం కోసం ఎంతగానో ప్రేమించిన మృదులనే కాదన్నాడా? చాలా బాధేసింది నాకు. "మృదులా నీకు బాధగా లేదా?" బాధగానే అడిగాను. అదోలా నవ్వింది మృదుల."బాధ కాదు మాస్టారూ! నాపై నాకే కోపం. మనుష్యుల మనస్తత్వాలు తెలుసుకోకుండా మాయలో పడ్డ నాలాంటి ఆడపిల్లలకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. ఇప్పటికైనా నన్ను నేను తెలుసుకొన్నానన్న ఆనందం. ఎలాగో బాధ పడి వాళ్లు కోరినంత ఇచ్చి మూడు ముళ్లు వేయించుకొన్నా నేను సుఖపడగల నంటారా? మాస్టారూ అంతకన్నా ఉరిపోసుకోవడం నయం."
    మృదుల మాటలు నాకు ఆనందం కలిగించాయి. ఆడపిల్ల అంటే అలా ఉండాలి అనుకొన్నాను. "మృదులా ఆడపిల్లలందరూ నీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది" మెచ్చుకోలుగా అన్నాను.
    రోజులు గడుస్తున్నాయి. ఒంటరితనం నాకు భయంకరంగా కన్పించసాగింది.దానికి తోడు మృదుల గురించిన ఆలోచనలు ఎక్కువయి పోయాయి.ఎంత విచిత్రమైన అమ్మాయి. ప్రేమించినన్నాళ్ళూ మనస్ఫూర్తిగా ప్రేఅమించింది. తాను ఆరాధించింది గంజాయి మొక్కనని తెలియగానే మనసునుండి పెకిలించింది. ప్రశాంతంగా జీవిస్తోంది.అలా ఎందరికి సాధ్యం? "కట్నమిచ్చి తాళి కట్టించుకొనేకన్నా ఉరిపోసుకోవడం నయం మాస్టారూ." ఆత్మగౌరవం వున్న ఆమె పట్ల మరింత గౌరవం పెరిగిపోసాగింది. ఆమె తన జీవిత భాగస్వామి అయితే? అలోచనలు ఎటూ తెగడం లేదు. అచ్చం అలాగే కాకపోయినా ఎన్నోవిధాల సంధ్యలా ఉన్వ్వ మృదుల నన్ను కలవర పెడుతోంది.మృదులను దూరం చేసుకోవడం అదృష్టాన్ని కాలదన్నుకోవడమే అవుతుంది. మథనపడి మథనపడి నా నిర్ణయానికో రూపం ఇచ్చాను. సంధ్యపై గల నా ప్రేమసుమం మృదుల రాకతో మరింత గుభాళిస్తుందని తెలుసుకొన్నాను. నా నిర్ణయాన్ని మూగగా సంధ్యకు విన్నవించుకొన్నాను. నా నిర్ణయాన్ని మృదుల ముందు అనంతయ్యగారి ముందు వుంచాను. నా నిర్ణయం విన్న మృదుల కళ్ళ్లో కాంతి. ఆ కాంతిలో నేను నా సంధ్యను చూశాను. అనంతయ్య దంపతుల అనుమతి లభించింది. సంధ్య మృదులగా నా దగ్గరికి వచ్చింది మళ్ళీ. "మాస్టారూ మీకు కట్నం ఎంత కావాలి?" ఏకాంతంలో ఇద్దరమే వున్నప్పుడు మృదుల సంశయం. నాకు కావలసిందేదో ఆమె చెవిలో గుసగుసగా చెప్పాను. ఏడాది తిరక్కుండానే నేనడిగిన కానుక నాకిచ్చేసింది మృదుల పండంటి పాపను. పేరు మృదులే నిర్ణయించేసింది. పాప పేరు "సంధ్య." నా జీవితంలోకి సంధ్య మళ్ళీ ప్రవేశించింది.
[గౌతమప్రభ సచిత్ర సాహిత్య మాస పత్రిక ఫిబ్రవరి 1984 సంచికలో ప్రచురితం]
Comments