సంఘం అంటే వీళ్ళకీ భయమే - పోడూరి కృష్ణకుమారి

    తయారయి బయల్దేరబోతూ రూప గదిలోకి తొంగి చూసింది రమ్య. అప్పుడే లేచింది కాబోలు పాచి మూతి నవ్వొకటి నవ్వింది రూపమొహమాటానికి చిన్నగా నవ్వి "నేను బయల్దేరుతున్నా" అనేసి,  డోర్‌లాక్ పడేలా వీధిగుమ్మం వేసేసి బయట కొచ్చింది. స్కూటర్ తీసి గేటుదాటి రోడ్డెక్కి కొంచెం దూరం పోనిచ్చి మరో బిల్డింగు దగ్గర ఆగి అక్కడి వాచ్‌మన్ గదివైపు నడిచింది. అది సగం కడుతూ కడుతూ ఉన్న ఎపార్ట్ మెంటు భవనం. అక్కడ స్తంభాలకి ప్లాస్టిక్ షీట్లు అడ్డంకట్టుకుని కట్టడం పనిచేసే వాళ్ళు కొందరు కాపురాలుంటుంటారువాచ్‌మన్కి మాత్రం ఓ పక్కా గది కట్టిచ్చాడు బిల్డరువాచ్‌మన్ భార్య సీత చుట్టుపక్కల ఇళ్ళల్లో పనుల చేస్తుంటుంది. రమ్యక్కూడా ఆమే పనిమనిషిలోపలి నించి చూసింది గాబోలు "అమ్మాయిగోరూ మీరే వొచ్చారా?" అంటూ సీత ఎదురొచ్చింది. నున్నగా తలదువ్వుకుని కొప్పు చుట్టుకుని కొప్పులో రెండు పూలు కూడా తురుముకుంది. ముఖాన తళతళ లాడుతున్న బొట్టుబిళ్ళ. జరదా కిళ్ళీ మహత్యం కాబోలు పెదాలు ఎర్రగా మెరుస్తున్నాయి. చక్కగా తోమిన రాగి చెంబులా ఉంది సీత మొహం. మేచింగ్ బ్లౌజుతో పచ్చటి సింథటిక్ చీర. చటుక్కున చూడగానే గొప్ప నీటుగా కనిపించింది. "నిన్న మావూర్నించి చుట్టాలొచ్చారమ్మాయిగోరూ, ఆల్లకి వొంటలు చేసి పెట్టి ఆల్లతో సిణివాఁ కెల్లొచ్చి అప్పుడు మల్లీ వొండుకోడం. ఇంకియ్యాల పొద్దున్న లెగ లేకపోయా. పనిలోకి రాలేదందుకే." రమ్య అడగకముందే తనే చెప్పేస్తూ దగ్గరగా వచ్చింది సీత. చమట కంపు గుఫ్ఫుమంది. 'సోకులన్నీ పైపై పటారాలే!' అనుకుంటూ,  "సరేలే. సాయంత్రం నేనొచ్చాక  రా."  సీత కూతురు మూడేళ్ళ రాణి గోడకానుక్కూచుని ఓపళ్ళెంలోంచి రొట్టి ముక్కలు తీసుకు తింటోంది. చింపిరి జుట్టూ మాసి అట్టకట్టిన బట్టలూ చూస్తుంటే ఆ పిల్లకి స్నానం చేయించి రెండురోజులయ్యుంటుందనిపిస్తోంది. "కాస్త పిల్లకి తలదువ్వి నీళ్ళుపోస్తుండు సీతా, రకరకాల రోగాలొస్తున్నాయి సీజను  బాలేదు" అంది రమ్య స్కూటరుకేసి నడుస్తూ. "ఇదిగో చేతిలో పనయిపోంగానే పిల్లకి పోసేస్తాను." గట్టిగా రెట్టిస్తే సీత రోజూ పోస్తున్నానని డబాయించేస్తుంది. అనడానికి లేదు. స్కూటరు స్టార్ట్ చెయ్య బోతూ, "నిన్న మీ బిల్డింగులో ఎవరో ఏదో గొడవ పడ్డట్టున్నారే? ఒకటే అరుపులూ ఏడుపులూ మా ఇంటిదాకా వినబడ్డాయ్!" అడిగింది రమ్య. "గొడవలకేటి లోటా? అయి రోజూ ఉండేవేలే తల్లీ. ఈ మద్దెన కూసంత తగ్గినాయ్. మీరా ఇంట్లోకొచ్చాక నిన్ననే ఇన్నట్టున్నారు. ఏవుంది రోజంతా ఒల్లుపులిసి పోయేలా పని సెయ్యడం సంపాదిచ్చిందంతా తాగడం కొట్టుకోడం. శనివోరాలు బట్వాడ గదండమ్మ నాలుగుడబ్బులు సేతిలో పడతాయి. తవఁరికి తెలీన్దే వుంది" నవ్వింది సీత. చేతిలో ఉన్న రొట్టిముక్క అయిపోయింది కాబోలు "అమ్మా అప్పచ్చే" రాగం తీసింది రాణి.

       స్కూటరు స్టార్ట్ చేస్తుండగా తమ గేట్లోంచి రూప చిన్న పరుగుతో ఇవతలకి రావడం కనిపించింది  పరుగుపరుగున వచ్చి వెనకసీటు దర్జాగా ఎక్కేసి, "నాస్పాట్ లోనన్నుదింపెయ్. యాజ్ యూజువల్" మహారాణిలా ఆజ్ఞాపించింది. విస్తుబోయింది రమ్య. తనిక్కడికొచ్చి పదినిముషాలైనా అయిందోలేదోపది నిముషాల క్రితం నిద్రలేచిన ఈవిడగారు అప్పుడే స్నానంగీనం చేసి ఆఫీసుకి బయల్దేరిపోడం! ఈ కాసేపటిలో మొహంకడిగి ఇతరకాలకృత్యాలు తీర్చుకుని స్నానంచేసి తయారవడం అనేది ఎవరికైనా అసాధ్యమే. రూప ట్రిక్కులు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతున్నాయి. ఒంటిమీద పౌడరు చల్లేసుకోడం, మొహానికి సుష్టుగా మేకప్ దట్టించడం, మౌత్ వాష్ తో పుక్కిలించెయ్యడం. జిగజిగ మెరిసే షర్టూ అట్టలుకట్టిన జీన్సూ ధరించేసి స్ప్రే దట్టంగా కొట్టె య్యడం. ఈ అమ్మాయి శుభ్రతా సూత్రాలు తలుచుకుంటే రమ్యకి ఒళ్ళు జలదరించి పోతోంది. ప్రస్తుతం బుగ్గల రంగు గజిబిజి అయి ఎవరో చెంపఛెళ్ళు మనిపించినట్టుంది మొహం. ఓ పేద్ద కంప్యూటర్ కంపెనీలో ఏదో ఉద్యోగం చేస్తూ వేలు సంపాదిస్తున్న రూపకి, నాలుగైదొందల జీతానికి మూడునాలు గిళ్ళల్లో పాచిపని చేసే సీతకిశుభ్రత విషయంలో ఆట్టే తేడాలేదు! వీళ్ళ సందుదాటి జంక్షన్ దాకా వెడితే అక్కడికి రూపవాళ్ళ కంపెనీ  క్యాబ్ కానీ, బస్ కానీ వస్తుంది. మాట్లాడకుండా స్కూటర్ పోనిచ్చింది. రమ్యది బ్యాంకు ఉద్యోగం.

       బ్యాంకులోకి ప్రవేశించాక పని ఒత్తిడిలో మర్చిపోయిందిగానీ, ఇంటికెళ్ళే సమయం దగ్గర పడుతున్న కొద్దీ రమ్యకి రూప గురించిన ఆలోచనలు తేనెటీగల్లాగా ముసిరి చిరాకు పెట్టసాగాయి.

       రెండు నెలల  క్రితం బ్యాoకులో పరిచయమైంది రూప. అక్కడే ఏదో ఫ్లాట్ లో ఉంటున్నానని పరిచయం చేసుకుంది. సాయంత్రాలు ఇంటికొచ్చి కూచుని కబుర్లేసుకునేది. ఓ స్నేహితురాలు దొరికినందుకు సంతోషించింది రమ్య. తనున్న ఫ్లాట్ లో నీళ్ళు రావట్లేదని, తనకు మంచి ఫ్లాట్ మరోటి దొరికే వరకూ అయినా తనని రమ్యతోబాటు ఉండనిమ్మనీ బతిమాలింది. తనకీ సాయంగా ఉంటుందికదా  అని రమ్య ఇంటివాళ్ళని ఒప్పించి చే్ర్చుకుంది. నెమ్మది నెమ్మ దిగా రూపకీ తనకీ ఉన్న వ్యత్యాసాలు తెలిసొస్తున్నాయి రమ్యకి.

        రమ్య ఉండే పోర్షనుకి చిన్నవే అయినా రెండు బెడ్రూములు, ఒక చిన్న వంటిల్లు ఉన్నాయి. నాలుగు కుర్చీలు పట్టే డ్రాయింగురూము కూడా ఒకటి ఉందిఅందులో రెండు ప్లాస్టిక్ కుర్చీలు, టీపాయ్ అమర్చింది రమ్య. ఒక పోర్టబుల్ టీవీ కూడా పెట్టుకుంది.

      సాయంత్రం డోర్‌లాక్ తీసి ఇంట్లోకి అడుగుపెట్టిన రమ్యకి టీవీ "బొఁయ్" మంటూ స్వాగతం పలి కింది. రూప చూసినా చూడకపోయినా టీవీ పెట్టేస్తుంది. కానీ కట్టదు. నిట్టూరుస్తూ టీవీ ఆఫ్ చేసి కుర్చీలో కూలబడింది రమ్య. ముందరున్న బల్లమీద ఉప్మాముద్దలు, తను హెడ్ లైన్స్ చదివి మడతపెట్టి వెళ్ళిన న్యూస్ పేపరు మీద ఆవకాయ రంగులు పులిమి కనబడ్డాయి. చింపిరి జుట్టు, చీమిడిముక్కు తో రొట్టెముక్కలు తింటున్న సీతకూతురు దృశ్యం కళ్ళముందు కొచ్చింది. ఆ మూడేళ్ళపిల్ల స్థానంలో రూప రూపం నిలిచింది. కడుపులో దేవినట్టయింది రమ్యకి.

      రూప మహాతల్లి కాఫీ కలుపుకుంది కాబోలు వంటింటిగట్టు మీద డికాక్షను మురిక్కాలవలా పారి, చారికలు కట్టింది. తప్పతాగి తన్నుకున్న వాళ్ళలా అడ్డంగా పడి పొర్లు తున్నాయి గిన్నెలు. అసహ్యం తో, కోపంతో రగిలిపోయింది రమ్యపేపరు తీసి చెత్త బుట్టలోకి విసిరేసింది. గట్టుమీద దొర్లుతున్న క్షత గాత్రులన్నిటినీ తీసి సింకులో వేసి, టీపాయ్ తీసుకుపోయి బాత్రూములో కుళాయికింద  కడిగేసి గది లో పెట్టేసింది. షవర్ తిప్పుకుని తను కూడా స్నానం చేస్తూంటే బాత్రూమంతా ఒకటే వాసన. ఒక మూలగా గత మూడురోజులుగా పడిఉన్న  రూప బట్టలు తడిసి, నాని దుర్గంధం వెదజల్లుతున్నాయిచకచకా స్నానం చేసి బయటపడే సరికి సీత వచ్చింది. ఆమె అంట్లుతోమి, గదులుతుడిచి వెళ్ళాక  అన్ని గదుల్లోను రూమ్ ఫ్రెషెనర్ కొట్టి ఫాన్ వేసుక్కూచుంటే కాస్త మనసు స్థిమిత పడ్డట్టయింది.

       ఆరాత్రి తొమ్మిదవుతుండగా వచ్చింది రూప. "రూపా, నీబట్టలా నీళ్ళగదిలో పడి నాని కంపు కొడుతున్నాయి. రేపు కొంచెం ముందుగా లేచి వాటి సంగతి చూడు." అంది రమ్య కాస్త కటువుగానే. ఏ కళనుందో మాటాడకుండా నీళ్ళగదిలోకెళ్ళిపోయింది రూప. కొంత సేపటికి బట్టలుతుకుతున్నచప్పు డు వినబ డింది నీళ్ళగదిలోంచి. ఈ అర్ధరా త్రి అంకమ్మశివాల్లా ఈవిడగారు బట్టలుతికి ట్యాంకు ఖాళీచేస్తే  ఇంటివాళ్ళేమను కుంటారో అన్న బెంగతో రమ్యకి ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు.

       మర్నాడు ఏదో శలవు రోజు. రూప పడీపడీ మొద్దునిద్ర పోతూనే ఉంది. పనులు పూర్తిచేసుకుని తీరిగ్గా పేపరు చదువుతూ కూచుంది రమ్య. పదకొండవుతుండగా ఎవరో డోర్ బెల్ కొడితే తలుపు తీసింది. చూడ్డానికి సినిమాల్లో విలనుకి సైడ్ కిక్ లా ఉన్నవాడొకడు నిలబడున్నాడు " రూప...రూప స్టేస్ హియర్"అన్నాడు. ప్రశ్నో, ప్రెస్ స్టేట్‌మెంటో అది! అప్పుడే లేచొచ్చింది కాబోలు. బటన్స్ తెగిపోయి భుజాల మీంచి జారిపోతున్న నైటీతో నిలబడి ఒళ్లువిరుచుకుంటున్న రూప, "హాయ్ రమ్మీస్కమాన్ యార్" అంటూ సైడ్ కిక్ ని తన బెడ్రూములోకి లాక్కు పోయింది. ఇద్దరూ గందరగోళంగా గుడుగుడు మాటలు. పెద్ద పెట్టున నవ్వులూ. యధాప్రకారం డ్రైక్లీనింగు పధ్ధతిలో చిటికలో తయారై అతని బైక్ మీద సవారి చేస్తూ ఎటో పోయింది రూప.

        తరవాత  ప్రతీరోజు సైడుకిక్కుగాడిలాటి  బోయ్ ఫ్రెండు ఎవడో ఒకడు వచ్చి ఆమెను ఏ బైక్ మీదో తీసుకెళ్ళడం, దింపడం చేస్తున్నాడు. ఓరోజు, "ఇవాళ పబ్ లో మా గ్యాంగ్ పార్టీ చేసుకుంటున్నాం వస్తావా నువ్వుకూడా? అలాంటి పార్టీలు నువ్వెప్పుడూ చూసుండవు ఒకసారి చూస్తే మా లైఫ్ స్టైల్ లోనే నువ్వూ చేరిపోతావ్" అంది ఊరిస్తున్నట్టు. "నేను రాను" అంది రమ్య. "నీకర్మ" అనేసి వెళ్ళిపోయింది రూప. ఆరోజు ఇంటివాళ్ళ దగ్గరకెళ్ళింది రమ్య. "ఆంటీ, అంకుల్! అయామ్ వెరీసారీఈ రూప బిహేవియర్ నాకేమీ నచ్చట్లేదు. మీకూ నచ్చదని నాకు తెలుసు. ఈ పిల్లని తీసుకొచ్చి పెట్టినందుకు వెరీసారీ. ఎలాగైనా ఈపిల్లని వదలించుకోడానికి హెల్ప్ చెయ్యండి. నేను చెప్తే వెడుతుందని నాకు నమ్మకంలేదు" అంది. "బలేదానివే. నువ్వుమాత్రం ఏంచేస్తావ్. రేపు పొద్దున్న మేము ఇంట్లోనే ఉంటాంగా ఆ అమ్మాయిని మా దగ్గరకి తీసుకురా మేం కొంచెం గట్టిగా చెప్పి వదులుస్తాం." అన్నారు వాళ్లు.

       మామూలుగా రాత్రి పదకొండింటికి గేటు తాళంవేసే ఇంటాయన ఆరోజు పదింటికే వేసేసాడు. ఆ రోజు శనివారం. డబ్బులు చేతిలో పడ్డట్టున్నాయి. సీతా వాళ్ళ బిల్డింగునుంచి నానా రభసా వినబడు తోంది. పన్నెండింటి వరకూ అక్కడ గొడవ, తన్నులాటలు జరుగుతూనే ఉన్నాయి. నైట్ రౌండ్స్ వేసే పోలీసు జీపు పన్నెండింటికి అటుగా వచ్చి గొడవచేస్తున్న వాళ్ళని పట్టుకు పోయింది. అప్పటికి వీధి సద్దు మణిగింది. రూప జాడలేదు. రాత్రి రెండింటికి గేటుదగ్గర పెద్దపెద్ద గొంతులతో మాటలు వినబడు తుంటే మెలుకువ వచ్చి కిటికీలోంచి చూసింది రమ్య. మారుతీ వ్యానేదో ఆగి ఉంది గేటవతల.                              

     నలుగురు యువకులమధ్య రూప నిలబడి ఉంది. ఊగిపోతున్న రూపని పట్టుకుని నిలకడగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారో ఇద్దరు కుర్రాళ్ళు. అందరూ కారణంలేకుండా బిగ్గరగా నవ్వుతు న్నారు. "గేటు తియ్యండి. ఓపెన్ ది గేట్" అరుస్తూ గేటు ఊపి చప్పుడు చేస్తున్నారు. మళ్ళీ నవ్వులు. ఇంటాయన లేచాడు కాబోలు. "హూ ఈజ్ దట్? ఎవరూ? గొడవ చెయ్యకుండా వెళ్ళిపోండి. గొడవ చేస్తే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తా" కిటికీలోంచి అరిచాడాయన. ఇంతలో మళ్ళీ రౌండ్స్ కొస్తున్న పోలీస్ సైరన్ వినబడింది. "ఓల్డ్ బాస్టర్డ్!" లాంటి తిట్లు వల్లించు కుంటూ మళ్లీ అంతా వేనెక్కి పోయారు.

         మర్నాడు సాయంత్రానికి ఇల్లు చేరింది రూప. ఆ పిల్ల చెయ్యి పట్టుకుని గబగబా లాక్కెళ్ళి ఇంటాయన ముందు నిలబెట్టింది రమ్య. "చూడమ్మా రూపా, నువ్వు నాలుగు రోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యాలి" అన్నాడాయన క్లుప్తంగా. రూప ఆలోచించింది."అలాకాదంకుల్, రమ్య ఇస్తున్న అద్దెకి రెట్టింపిస్తాను. రమ్యని ఖాళీ చేసెయ్య మనండి నేనుంటాను." అంది."అద్దెకి ఆశపడి ఇవ్వలేదులే ఇల్లు. రమ్య తండ్రి నా స్నేహితుడు. స్నేహం కొద్దీ ఇచ్చాం. నీకు ఇల్లిచ్చే ప్రసక్తే లేదు" మృదువుగానే ఆయినా ఖచ్చితం గా చెప్పేసాడు ఇంటాయన. మొహం మాడ్చుకుంది రూప.

       మళ్ళీ ఆదివారానికి ఒక వ్యాను, నలుగురు బోయ్ ఫ్రెండ్సూతో దిగింది రూప. అందరూ కలిసి రూప రూములో చిందరవందరగా పడున్న బట్టలు, సామాన్లు అన్నీ మూటగట్టి వేన్ లో పడేసారు. "ఇదిగో ఈ 'డ్రమ్స్' ఉన్న బిల్డింగ్ లోనే నాకూ ఫ్లాట్ కుదిర్చి పెట్టాడు" అని 'డ్రమ్స్' గాడి వీపు మీద చరిచి చూపెట్టి పెద్దగా నవ్వింది రూప. మర్యాదకి ఓ చిరునవ్వు నవ్వి వీడ్కోలు చెప్పింది రమ్య. తరవాత అప్పుడప్పుడు బ్యాంకులో కనిపిస్తూనే ఉంది రూప. మొహమాటానికి పలకరించి మాటాడ్డం తప్ప రూపతో మళ్ళీ ఎక్కువగా ఏం పెట్టుకోలేదు రమ్య.

       ఓ రోజు హడావిడిగా బేంకులోకొచ్చి "రమ్యా నీతో కొంచెం మాటాడాలి వస్తావా?" అంది. అప్పటికి కస్టమర్ల రద్దీ తగ్గిపోవడంతో రూపకి తన పక్కనే కుర్చీ వేయించి వచ్చి కూచోమన్నట్టు సైగ చే సింది. "ఫలానా ఛానెల్ వాళ్ళు వారంవారం డిస్కషన్ ప్రోగ్రాములు.. ఆదే....  చర్చలు పెడుతుంటారుగాఈ సారి ప్రోగ్రామ్ యూత్ గురించిట. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళూ ఉంటారుట. మోడర్న్ యూత్ కోసం మా ఆఫీస్ కొచ్చి కొంతమందిని సెలెక్ట్ చేసారు పార్టిసిపేట్ చెయ్యడానికి. కాకపోతే వాళ్ళకి కాస్త కన్జర్వేటివ్ ఆవుట్ లుక్ ఉన్న యంగ్ పెర్సన్స్ కూడా కావాల్ట. అంటే చూడు కాస్త పాతకాలం భావాలూ అవీ ఉండి ట్రెడిషనల్ గా ఉంటారు చూడూ...." "కన్జర్వేటివ్ అంటే ఖచ్చితంగా అర్ధం నాకు తెలుసులే చెప్పు " అడ్డుకుంది రమ్య.  "అలాంటి వాళ్ళెవరూ మా ఆఫీసులో లేరు. నాకు గబుక్కుని నువ్వు గుర్తుకొచ్చావ్. నువ్వొస్తావా? పార్టిసిపేట్ చేస్తావా?"  అనడిగింది. "ష్యూర్" అంది రమ్య. "రానంటావేమో ననుకున్నా." అని ఏ స్టూడియోకి రావాలో ఎలా రావాలో చెప్పింది. "ఈ ప్రోగ్రామ్ లో మా ఫ్రెండొకడు ఇన్వాల్వ్ అయ్యాడులే అందుకని అసలు సెలెక్షన్స్ కి మా ఆఫీసుకొచ్చారు. నీ పేరు చెప్తా లిస్టులో వేసుకోమని" అని వెళ్ళిపోయింది.

       ప్రోగ్రామ్ రికార్డింగ్ రోజు ఛానెల్ వాళ్ళ స్టుడియోకెళ్ళిన రమ్య తనకీ ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషించింది అక్కడికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, సేవాసంస్థలు, ధార్మికసంస్థలు నిర్వహిస్తున్నవాళ్ళు, రకరకాలవృత్తుల్లో ఉన్నవాళ్ళు వచ్చారు. అన్నిరంగాల్లోనూ యువకులు, పెద్దలు కూడా ఉన్నారు. కొంతమంది ప్రముఖులను గుర్తుపట్టి వాళ్ళకి నమస్కరించి తననుతాను పరిచయం చేసుకుంది. వచ్చిన వాళ్ళని 'అల్ట్రాస్ ' - 'మోడరేట్స్' అని రెండుగ్రూపులుగా విభజించి  కూచోబెట్టి కార్యక్రమం ప్రారంభించారు. రమ్య ఉన్న 'మోడరేట్స్' గ్రూపులో పెద్దలు, యువకులు కూడా న్నారు. 'అల్ట్రాస్ ' లో మాత్రం అందరూ రూప టైపే.

       ఒక్కొక్కరు తమతమ అబిప్రాయాలు చెపుతున్నారు. పెద్దల్లో చాలామంది, 'ఈ కాలం యువతలో తెలివితేటలు, కండబలం, గుండెబలం ఉన్నాయిగానీ సద్వినియోగం కావట్లేదు' అన్న అసంతృప్తి నే వెలిబుచ్చారు. "అసలీనాటి యువతకి పెద్దలపట్లగౌరవం, సమాజం పట్ల బాధ్యత, సంఘం అంటే భయమూ లేనేలేవు" అన్నాడు పెద్దల గ్రూప్ లో చివరగా మాట్లాడినాయన. "అవునండీ. అవును. మాకు సంఘం అంటే భయంలేదు." అంటూ అందుకున్నాడు రూప చేత 'డ్రమ్స్' అని పిలవబడ్డ కుర్రాడు. కెమేరా అతనివైపుకి తిరిగింది. "పెద్దల పట్ల గౌరవం లేదంటే మాత్రం ఊరుకోను. మేం ఏ సెవెన్త్ క్లాసుకో వచ్చేసరికి ఇంజనీరింగో మెడిసినో చదవాలని మమ్మల్ని ప్రెషరైజ్ చేస్తారు. అలాగే చేసారు నన్నూ నాఫ్రెండ్స్ ని. ఆల్రైట్. వాళ్ళు చెప్పినట్టే చచ్చీ చెడీ చదివి సీట్లు సంపాదించాం. ఇవాళ మేం బీ .టెక్, ఎమ్ టెక్, ఎమ్ బి ఏ  ఎట్సెట్రా ఎట్సెట్రాలన్నీ పాసయి ఉద్యోగాలు సంపాదించాం. మా డబ్బు మేం సంపాదించుకుని ఖర్చుపెట్టుకుంటున్నాం. అవసరమైతే అమ్మానాన్నలకి పంపుతున్నాం. ఇంకా ఏం చెయ్యాలి? ఇంతా చేసినా మా టైంపాస్ లు మాకుండకూడదు, మా ప్లెజర్స్ మాకుండ కూడదు. ఇంకా దేనికో భయపడాలి! మేం ఎప్పుడూ చేతులుకట్టుకుని అణిగిపోయే ఉండాలి అని ఈ పెద్దవాళ్ల సమాజం ఆశిస్తే మేం లొంగం అంతే" అన్నాడు కొంచెం ఆవేశంగా. అతని పక్కనే కూచున్న రూప, ఇతర మిత్రబృందం మైకులు దద్దరీల్లేలా చప్పట్లు కొట్టి ఏకీభావం ప్రకటించారు." అంతకంటే మీకు బాధ్యతల్లేవా? సమాజ నియమాలు కొంతైనా మీరు అనుసరించాలన్న భావం ఇక్కడి పెద్దలు వ్యక్తం చేస్తున్నారే?" అన్నాడు ఏంకరుగా వ్యవహరిస్తున్న వ్యక్తి. "నియమాలంటే  ఏంటి? నాకు తెలుసు లెండి. మేం అమ్మాయిలు అబ్బాయిలు కలిసితిరుగుతాం. పబ్స్ లో రాత్రిళ్ళు ధూమ్ ధామ్ గా మస్తీ చేసి కాలక్షేపం చేస్తాం. స్మోక్ చేస్తాం. తాగుతాం. అప్పుడప్పుడూ ఎక్స్ టసీ లాంటి డ్రగ్స్ కూడా ప్రవేశిస్తాయి మా పార్టీల్లో. మా కదే రిలాక్సేషన్. ఇవన్నీ మీకు సంఘం నియమాలు ఉల్లంఘించడం  అనిపిస్తుంది. కానీ అదిమా కల్చర్. అదే మా కల్చర్!" "అయితే మీరు సంఘాన్ని సంప్రదాయాన్నీ లెక్క చెయ్యరా?" రెచ్చగొడుతున్నట్టు ప్రశ్నించాడు ఏంకర్. "నో. లెక్కచెయ్యం. చూడండి సార్. మేం తిరిగే సర్కిల్స్ లో యువకుడికి, లేక యువతికి గర్ల్ ఫ్రెండ్ ఆర్ బోయ్ ఫ్రెండ్ లేక పోతే అదొక స్టిగ్మామాయని మచ్చ. వీడికి ఒక్క గర్ల్ ఫ్రెండు కూడా లేదు వీడిలో ఏదో లోపం ఉంది అని టాక్ వచ్చేస్తుంది. అమ్మాయిల సిట్యుయేషన్ కూడా అంతే. బోయ్ ఫ్రెండ్స్ లేకపోతే దద్దమ్మల లిస్టులో కెక్కిపోతారు. మీలాంటి పెద్దల నోటికి దడిసి మేం ఎవరమైనా డిఫరెంట్ గా ఉంటే మాకు స్నేహితులే ఉండరు. మా పీర్ గ్రూప్ ప్రెషర్స్ మాకుంటాయ్ సార్. మా సర్కిల్స్ లో 'ఆడ్' గా కనిపించాలని మేం ఎవరం కోరుకోంఅన్నాడు మరో టిమ్స్. మళ్ళీ దిక్కులు పిక్కటిల్లే చప్పట్లు.

       చిన్నగా చేయెత్తి తనకీ అవకాశమిమ్మన్నట్టు ఏంకర్ కి సూచించింది రమ్య. ఏంకర్ మైక్  అందించాడు. కెమెరాలు తిరిగాయి. మానిటర్ మీదకి రమ్య ముఖం క్లోజప్ వచ్చింది.

      "దొరికి పోయారండి దొంగలు" అంది. తలలన్నీ రమ్యవైపు తిరిగాయి. "ఇప్పుడే ఈ యువకులు మేం సంఘానికి భయపడం అని ఘంటాపదంగా చెప్పారు. మళ్ళీ వీళ్ళేచెప్తున్నారు, తాము తిరిగే సర్కిల్స్ లో గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అదో మచ్చగా చూస్తారు అదో 'స్టిగ్మా' అందుకే ఆ లైఫ్ స్టైల్ అనుసరిస్తున్నాం అంటున్నారు. వాడుతున్నపదాలు మారాయి అంతే. బావం మారలేదు. భయం పోలేదు. ఆయన 'పీర్ గ్రూప్' అనేమాట వాడారు. మేం తిరిగే 'సర్కిల్స్' అంటున్నారు. అదే కదా సంఘం అంటే? సమాజం అన్నా అదే. ఒకప్పటి సంఘ నియమాలు ఒకలా ఉంటే వీళ్ళ సంఘనియమాలు ఇలా ఉన్నాయి. ఆ నియమాలని ఉల్లంఘించడానికి వీళ్ళకీ భయమేనన్నమాట. మా అమ్మమ్మ కాలంనాడు ఆడపిల్లకి పదహారేళ్ళలోపు పెళ్ళయిపోవాలనే వారు. అలా ఆ వయసులో కూతురికి పెళ్లి చెయ్యలేక పోయిన తండ్రిని చిన్న చూపు చూసేవారు. ఇప్పుడు వీళ్ళని గర్ల్ ఫ్రెండు లేకపోతే చూసినట్టు. ఆ తరవాత మా అమ్మకాలం. ఆడ పిల్లలకి కాస్త బియ్యే వరకైనా చదువులు చెప్పించే కాలం అన్నమాట. ఈ కాలానికీ కొన్ని నియమాలుండేవి. ఎంత చదివినా 'ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే' పాతికేళ్లొచ్చినా పిల్లకి పెళ్లికాకపోతే ఆ పిల్లలోలోపమో, లేక పోతే వాళ్ళనాన్న దద్దమ్మైనా అయ్యుండాలి. వయసు ముదిరినా పెళ్ళికాకపోతే ఆడకైనా మగకైనా ఆయన చెప్పినట్టు 'స్టిగ్మా'నే. ఇప్పుడు ఈ యువకుల కాలమొచ్చింది. వీళ్ళకి వయసురాగానే గర్ల్ లేక బోయ్ ఫ్రెండు లేకపోవడం 'స్టిగ్మా'. ఆ కాలంలో పెళ్ళన్నారు వీళ్ళు ఫ్రెండన్నారు. అంటే వీళ్ళు 'పీర్ గ్రూప్' అని ముద్దు గా పిలుచుకునే 'సంఘం' ఒకటి ఉంది దానికి వీళ్ళూ దడుస్తున్నారు. 'సంఘానికి వీళ్ళు భయపడరు' అన్నది ఉట్టిమాట." 

       ఈసారి చప్పట్లతో మైకులు మార్మోగించిన వాళ్ళు మోడరేట్స్- సంప్రదాయవాదులు. రూప అండ్ ముఠా ముఖాల్లో మొదట విభ్రాంతి, ఆపైన ఉక్రోషం, రోషం కెమెరాలతో చక్కగా పట్టారు టీవీ క్రూ 

       "నేనింకొక్క పాయింట్ చెప్పదల్చుకున్నాను. నేనున్న వీధిలో నాలుగు అపార్ట్ మెంటు భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని కడుతున్న పనివాళ్ళు చాలామంది ఆ సగంసగం కడుతున్న బిల్డింగుల్లోనే కాపురాలుంటూంటారు. వాళ్ళ జీవనవిధానాలు గమనిస్తూ ఉంటాను నేను. రోజుకి నూరురూపాయల నించి రెండొందలు వరకు డబ్బు సంపాదిస్తుంటారు వాళ్ళు. ఆ సంపాదనలో సగానికి పైగానే తాగుడికి ధారపోస్తారు వాళ్ళల్లో తొంభైశాతం మంది. ఇక్కడ చర్చలో పాల్గొంటున్న యువత లాగానే వాళ్ళకీ అదే రిలాక్సేషన్. తాగుతారు. తందనాలాడతారు. తన్నుకుంటారు. ఆడవాళ్ళని తంతారు. జస్ట్ రిలాక్సేషన్ కోసం! వాళ్ళూ యువతే. యువతరమే. వీళ్ళలాగే సంపాదిస్తారు వీళ్ళలాగే కష్టపడి పనిచేస్తారు. రిలాక్సవుతారు. వాళ్ళు అయిదారు క్లాసులతో చదువునాపేసి కాయ కష్టం చేసుకుంటున్న శ్రమజీవులు. మహా అయితే వేలల్లో సంపాదిస్తారు. వీళ్ళు వేలకొద్దీ ఖర్చుపెట్టి వృత్తివిద్యలనభ్యసించిన వారు. లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఈ రెండు వర్గాల - అంటే - విద్యా గంధంలేని వర్గం, విద్యావంతులైన వర్గం -ఈ రెండువర్గాల యువజనుల అభిరుచులూ, అలవాట్లు, కాలక్షేపాలు ఒకటే. పెట్టే ఖర్చులోనే తేడా. హెల్త్ అన్డ్ హైజీన్ విషయంలో కూడా రెండు వర్గాలవారివీ ఒకే రకం అలవాట్లు. ఆ వర్గానికి సౌకర్యాలు లేక ఆరోగ్య సూత్రాలు పాటించరు. ఈ వర్గం వారికి పాపం టైమ్ లేక పాటించరుఇదీ నవతరం వారి నవ్య సంఘం! ఈ సంఘానికివి నియమాలు. ఈ నియమాలనుల్లంఘించడానికి నేను చెప్పిన రెండు వర్గాల వారూ ఇష్టపడరు. సమసమాజం ఇలా సాధిస్తున్నట్టున్నారు భారతీయ యువత!" నిట్టూర్చింది రమ్య.

       ఒక్కక్షణం నిశ్శబ్దం! తరవాత పెద్దలు తామూ ఆ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నామన్నట్టు ఆపకుండా చప్పట్లు కొడుతున్నారు. కొన్ని క్షణాల తరవాత నెమ్మదిగా డ్రమ్స్, టిమ్స్, ఇంకొందరూ ఒక్కొక్క రే చప్పట్లు కలిపారు. రూప,రమ్మీస్, ఇంకొందరు ఇంకా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి రమ్య మాటలు అర్ధమైనట్టు లేదు.

Comments