సంకల్పం - పి.వి.శేషారత్నం

    ఏడేళ్ల శర్వాణి దీక్షగా టీవీలో వస్తున్న డాన్సు కార్యక్రమాన్ని తదేకంగా చూస్తోంది. తను కూడా టీవీలోని పాపలా చేతులు తిప్పేందుకు ప్రయత్నిస్తోంది.

    కూతురుకోసం ఇల్లంతా వెతుకుతూ ఇందిర హాల్లోకి వచ్చింది.

    'చిట్టితల్లీ... ఇక్కడున్నావా? పొద్దుననగా తాగిన పాలు, ఆకలేయడంలేదా? టీవీ చూడడంలో పడితే... నీకేమీ అక్కర్లేదు కదా.' పాప తల్లికేసి తలెత్తి కూడా చూడలేదు. అది అలవాటయిన విషయంలా ఇందిర కూడా పట్టించుకోలేదు.

    'ఏంటీ టీవీ పాపలా డాన్సు చేస్తావా? అలాగేలే... నీకు రేపు మంచి డాన్సు సీడీ తెచ్చి చూపిస్తాను సరేనా? దా, అన్నం తిందువుగాని. ఆ, నోరు తెరు.'

    ప్రేమగా శర్వాణికి వెండిగిన్నెలో కలిపి తెచ్చిన అన్నం తినిపిద్దామని ప్రయత్నిస్తోంటే తల తిప్పేసుకుంది శర్వాణి.
 
    'అలా బుర్ర తిప్పేస్తే ఎలా తల్లీ. అన్నం తినకపోతే బొజ్జకి ఆకలెయ్యదూ... ఇది అమ్మ ముద్ద... ఇది నాన్న ముద్ద... ఇది మామ్మ ముద్ద...'
 
    అయినా శర్వాణి తినడానికి ఇష్టపడనట్టు అదేపనిగా తల తిప్పడం చూసి ఇందిర మాతృహృదయ్మ్ కలత చెందింది. పట్టు వదలని విక్రమార్కుడిలా కూతురి ముఖాన్ని తనవైపుకి తిప్పుకుని నవ్వించడానికి ప్రయత్నించింది.
 
    'అలా కాదు చిట్టీ... బువ్వ తినకపోతే నీ బుగ్గలు ముసలమ్మలా ఇలా లొట్టలు పడిపోవూ...' ఇందిరి ముసలమ్మలా తన బుగ్గలు లోపలికి లాక్కుని లొట్టలు పడినట్టు నడించి చూపించేసరికి అర్థమైనట్టే శర్వాని కిలకిలా నవ్వింది.
 
    ఇందిర మనసు ఆర్ద్రమైంది. 'అదీ అలా నవ్వాలి... మరి నన్ను అమ్మా అని ఎప్పుడు పిలుస్తావురా చిట్టీ... పోనీలే... ఇవాళ కాక పోతే... రేపు... నాకు తొందర లేదులే... నువ్వు నా కళ్లముందుంటే అంత చాలు...' ఇందిర బలవంతంగా పాపనోట్లో ముద్దలు పెట్టింది. తర్వాత శర్వాణీ మూతిని కొంగుతో తుడిచి పైకి లేచింది.
 
    కొంగులాగిన శర్వాణిని ముద్దు పెట్టుకుని 'ఏమిటీ ఆడుకుందామా? ఇదిగో ఈ గిన్నె లోపల పెట్టేసి ఇపుడే వచ్చేస్తాను. నువ్వీలోగా టీవీ చూసుకో... సరేనా?' అంటూ లోపలికెళ్లింది ఇందిర.

    ఇదంతా అక్కడ హాల్లో పేపరు చదువుకుంటున్నట్టు నటిస్తూ ఓరకంట గమనిస్తున్న ఇందిరి భర్త సుధాకర్ టీవీ కార్యక్రమంలో మునిగిపోయిన కూతురు శర్వాణి వంక ఓ క్షణం నిరసనగా చుసి మళ్లీ పేపర్లోకి తల దూర్చాడు. 'దీని మొహానికి డాన్సు ఒక్కటే తక్కువ' అన్నట్టు.

    టీవీలో డాన్సు షో అయిపోగానే ఆసక్తి పోయింది శర్వాణికి ఏదో గుర్తొచ్చినట్టు హాల్లోని షోకేస్‌వైపు చూసింది శర్వాణి. అక్కడున్న తన టెడ్డీబేర్ బొమ్మ తీసుకోవడం కోసం ఒక స్టూలు జరుపుకుని దానిమీద కెక్కి ఆ బొమ్మ అందుకోవడానికి ప్ర్యత్నించడలో పక్కనే ఉన్న కృష్ణుడి బొమ్మ కిందపడి పగిలి పెద్ద శబ్దం చేసినా శర్వాణికి వినిపించలేదు. స్టూలు అంచుకి జరుగుతున్నా ఆ ప్రయత్నం మానలేదు.

    బొమ్మ బద్దలయిన శబ్దానికి సుధాకర్ కోపంగా కూతురికేసి చూసి 'ఇందిరా' అని లోపలున్న భార్యను పిలుస్తూ అరిచాడు. 

    ఇందిర లోపల్నుంచి పరిగెత్తుకొచ్చి స్టూలుమీంచి పడిపోబోతున్న పాపను గభాలున పట్టుకుంది.

    సుధాకర్ కోపం పట్టలేక భార్య చేతుల్లోంచి శర్వాణిని లాగి వీపుమీద దబదబా నాలు దెబ్బలు వేసాడు.

    ఇందిర పాపను లాక్కుని గుండెకి హత్తుకుని గ్రుడ్లనీరు కక్కుకుంది. 'అయ్యయ్యో అది నోరులేని పసిపిల్లండీ...'

    'అయితే మాత్రం ఖరీదైన దేవుడిబొమ్మను పగలగొడుతుందా?' సుధాకర్ కళ్లల్లో అంతులేని ఆగ్రహం.

    'పసివాళ్లు కూడా దేవుడితో సమానమేగా...'

    సుధాకర్‌కి తిక్కరేగింది.

    'అయితే దాన్ని దేవుడి గూట్లో కూర్చోబెట్టి పూజించుకో... ఓమాటా పలుకూలేని దీని దేభ్యం మూగి మొహం చూడాలంటేనే రోత కలుగుతోంది.'

    కూతురిని మూగి అనేసరికి ఇందిర కూడా కోపంగా ఎదురు తిరిగింది.

    'అసలు మీరు కన్న తండ్రేనా?' సుధాకర్ తగ్గాడు.

    'ఇందిరా... సూటిగా చెబితే నీకర్థం కాదా? ఇది మాట్లాడదు. మనం మాట్లాడితే వినబడి చావదు... ఏదన్నా శరణాలయంలో పడేస్తే మనకి ఈ అవస్థ తప్పుతుంది.'

    ఇందిర ఆవేశంగా రెచ్చిపోయింది. 'మనకి అనకండి... మీకు అనండి...'

    సుధాకర్ కూడా కోపంగా 'ఈ నికృష్టపు మూగి మొహాన్న్ని చూడలేక మా అమ్మ మా అక్క దగ్గరకి వెళ్లిపోయింది. నేను ఏదో ఒకరోజు సన్యాసుల్లో కలిసిపోతానులే.'

    ఇందిర కంఠంలో వెటకారం తొణికిసలాడింది. 'అది మీకు సరిపోదులెండి. సన్యాసులకు బాగా సహనం ఉండాలి.' సుధాకర్ చిటపటలాడుతూ బయటికి వెళ్లిపోయాడు.

    'హు... మాటకు మాట... చ... ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. ఇదంతా ఈ మూగ దెయ్యం మూలానే.'

    ఇందిర హృదయంలో దుఃఖం బద్దలైంది. కూతురిని గుండెకి హత్తుకుంటూ ఏడ్చింది.

    'చూడమ్మా చిట్టీ... మీనాన్న ఎంతలేసి మాటలన్నారో... ఎవరు నిన్ను కాదనుకున్నా నేను మాత్రం నా గుండెల్లో దాచుకుంటాను.

    ఏడేళ్లుగా భర్తతో అత్తగారితో రోజూ ఇదే తగవు.

    ఏమనుకుందో ఏడుస్తున్న తల్లిని చూసి తను ఏడుపు ఆపి తల్లి కన్నీళ్లు తన చిన్న అరచేతులతో తుడుస్తున్న కూతురిని చూసి మరింత ఏడ్చింది ఇందిర.

* * *

    కూతురిని నడిపించుకుంటూ తీసుకొచ్చి పార్కులో శర్వాణిని ఓ చోట పదిలంగా కూర్చోబెట్టింది ఇందిర. 

    'చిట్టీ... ఇదిగో ఈ పక్కనే ఉన్న షాపుకెళ్లి నీకు చాక్లెట్లు, బిస్కెట్లు... కొనుక్కొస్తాను. నువ్వేమో ఎంచక్కా ఈబెంచ్‌మీద కూర్చుని ఆ గాలిపటాలెగరేస్తున్న ఆ పిల్లలని చూస్తుండు. సరేనా?'

    తల్లి మాటలకి మూగగా కళ్లప్పగించి చూస్తుంది తప్ప మాట్లాడలేదు శర్వాణి.

    తన పంచ ప్రాణాలు అక్కడే ఉంచినట్టుగా ఇందిర వెనక్కిచూస్తూనే బయటికి వెళ్లింది.

    ఇందిర వెళ్లిపోగానే పిల్లలు చుట్టుముట్టారు శర్వాణిని. పదేళ్ల ఓ కుర్రాడు శర్వాణి చెయ్యి పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

    'ఇదిగో... నీపేరేంటి? నువ్వూ మాతో ఆడుకుంటావా? నాతో రా... నీకు గాలిపటం ఇస్తాను.' అంటూ చెయ్యిపట్టుకుని తీసికెళ్లాడు.

    శర్వాణికి ఆ కుర్రాడి మాటలు వినిపించకపోయినా ఆ పసిముఖంలో ఆనందం కదలాడింది.

    ఇంకో పిల్ల చకచకా వచ్చి ఆ కుర్రాడి చేతిని విడదీసి శర్వాణి చేతిలోని గాలిపటం లాక్కుంది. 
    
    'చందూ దీన్నెందుకు తీసుకొచ్చావురా... ఇది మూగది. దీనికే ఆటలూ రావు. మా ఇంటిపక్కనే వీళ్ల ఇల్లు...'
 
    చందూకి మాత్రం జాలేసింది. 'పోనీలే బుజ్జీ... మమమే ఆడిద్దాం...'
 
    ఆ పిల్ల ఒప్పుకోలేదు. 'వద్దురా... ఇది వట్టి మొద్దు... దీనికి వినబడదు కూడా...'
 
    'ఓహో అందుకేనా అలా గుడ్లప్పగించి చూస్తోంది...' తన మాటలకి సమాధానం చెప్పని శర్వాణిని చూసి చందుకీ విసుగొచ్చింది.
 
    శర్వాణి గాలిపటం కావాలన్నట్టు ఇవ్వమన్నట్టు సైగలు చేస్తుంటే పకపకా నవ్వింది బుజ్జి అనే ఆ పిల్ల.
'ఎ...ఎ... నీకు గాలిపటం ఎందుకే మూగీ... పో అవతలకి.'
 
    శర్వాణికి ఆ పిల్ల ఏమంటున్నదీ అర్థం కాకపోయినా గాలిపటం ఇవ్వనందుకు ఏడుపుమొహం పెట్టింది.
చివరకి ఎవరూ తనను ఆడనివ్వకపోవడంతో పార్కుమధ్యలో పెట్టిన విగ్రహం భంగిమను పరిశీలించడంలో మునిగిపోయింది.
 
    అప్పుడే అక్కడకు వచ్చి అక్కడే సిమెంటు బల్లమీద కూర్చున్న ఒక ముసలాయన ఆ బొమ్మను, దానిని అనుకరించే ప్రయత్నంలో చేతులు సరిచూసుకుంటూ నిమగ్నమైన శర్వాణిని గమనించిన ఆయన ముఖంలో చిత్రమైన చిరునవ్వు...
 
    దీక్షగా చూస్తుండిపోయాడు.
 
    ఓ అరగంట గడిచాక ఇందిర పక్కనే ఉన్న షాపులో తనకి కావలసిన వస్తువులు కొనుక్కొచ్చి కూతురి కోసం వెతుక్కుంది.  'ఇక్కడున్నావా చిట్టీ... నీతో ఎవరూ ఆడలేదా... పోనీలే... నేను ఆడతాగా... ఆ... ఇదిగో నీ చాక్లెట్టు... నా బంగారుతల్లి.' పేచీ పెట్టకుండా బుద్ధిగా కూర్చున్న కూతురిని చూసి ఆ మాతృహృదయం పొంగిపోయింది.
 
    తల్లీకూతుళ్లను అదేపనిగా గమనించిన ముసలాయన నోరువిప్పాడు.

    'పాపా... ఇలారామ్మా. నీ పేరేంటి?' పిలిచాడు శర్వాణిని. శర్వాణి తలెత్తలేదు. ఆయనకేసి చూడలేదు.

    ఇందిర నొచ్చుకుంటున్నట్టు 'సమాధానం చెప్పలేదని ఏమీ అనుకోకండి. మా శర్వాణికి మాటలు రావండీ... చెముడు కూడా...' అంది.

    'మీరేం బాధపడకండి. ఇలాంటివాళ్లకే భగవంతుడు కళల్లో మంచి ప్రవేశం కలిగిస్తాడు.'

    తర్వాత అడక్కుండానే తన వివరాలు చెబుతూ 'నా పేరు భార్గవ శర్మ... కొడుకులు అమెరికాలో... భార్య ఈమధ్యే కాలం చేసింది. ఇప్పటికీ ఆసక్తితో వచ్చిన ఒకరిద్దరు పిల్లలకి డాన్సు పాఠాలు చెబుతుంటాను. అయినా ఈకాలంలో శాస్త్రీయ కళలపట్ల అభిరుచి ఎవరికుంది? ఈ పక్క వీధిలోనే మా ఇల్లు... మీకభ్యంతరం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఎపుడైనా మీపాపను నా దగ్గరికి తీసుకువచ్చి వదిలెయ్యండి. నాకూ కాలక్షేపం.' అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ.

    భగవంతుడు ఒక్కొక్కళ్లకి ఒక్కోలోటూ పెడతాడు కాబోలు. రెక్కలొచ్చిన బిడ్డలు అమెరికా ఎగిరిపోతే ఒంటరిగా బ్రతుకీడుస్తున్న ఆ వృద్ధుడిని చూసి ఇందిర గాఢంగా నిట్టూర్చి కూతుర్ని తీసుకుని బయల్దేరింది. 'అలాగే... చాలా పొద్దుపోయింది... వస్తామండి.'
 
* * *

    బాబ్డ్ హెయిర్... చూడ చక్కని రూపం... ఆధునిక అలంకరణ... ఆ అమ్మాయి చాలాసేపు స్నేహితురాలు ఇందిర ఇంటికోసం వెతుక్కుంటూ తిరుగుతుందేమో చీరకి ఆ ఇంటిముందు నేంప్లేట్ మీద ఇందిర భర్త సుధాకర్ పేరు చూసి తేలికగా నిట్టూర్చింది.

    'ఐ.సుధాకర్... ఆ...ఇది మా ఇందిర ఇల్లే... ఇందూ! ఇంట్లో ఉందో లేక కూతురితో షికార్లు కొడుతోందో? అబ్బ ఈ పాప బంగారు బొమ్మలా ఎంత బావుందో? ఇలా రామ్మా పాపా. నువ్వు మా ఇందూ కూతురువే కదూ! నా పేరు  నిర్మల. మీ అమ్మకి ప్రాణ స్నేహితురాలిని. నువ్వు పుట్టినప్పుడు ఫారిన్‌లో ఉండడంవల్ల రాలేకపోయాను. అదిసరేగాని... నీ పేరేంటి?'

    కూతురికి బోర్నవీటా కలుపుకుని వచ్చిన ఇందిర స్నేహితురాలు నిర్మలను చూసి సంతోషం పట్టలేకపోయింది.

    'ఏంటే నిర్మలా అప్పుడే మా శర్వాణితో కబుర్లు చెప్పేస్తున్నావా? పూర్తిగా ఇండీఇయా వచ్చేసినట్టేనా? ఇదేనా రావడం? ఇన్నాళ్లకి జ్ఞాపకం వచ్చనన్నమాట.'

    'అప్పుడే నిష్టూరం మొదలెట్టావా తల్లీ... అయితే నీ జట్టు పచ్చి... అన్నట్టు నీకూతురు అచ్చం నీనోట్లోంచి ఊడిపడ్డట్టుందే... అందాల భరిణె.'

    'ఊ... అపుడే మొదలెట్టావూ భట్రాజు పొగడ్తలు...' ఇందిర సన్నగా నవ్వింది నిర్మల బుగ్గలు సాగదీస్తూ.

    'పోన్లేవే... నీ కూతురికి దిష్టి తగలకుండా ఓ కేజీ జీడిపప్పు దిష్టి తీసి నేతిలో వేయించి ఇచ్చెయ్.. హాయిగా తినేస్తాను.'

    'దేశాలు తిరిగొచ్చినా నువ్వూ నీమాటలూ ఏం మారలేదే!"
   
     'ఏం చేస్తాం పుట్టుకతో వచ్చిన బుద్ధాయె. నువ్వు మాత్రం కూతురి సేవలోపడి బాగా మారిపోయావే. అదిసరేగాని మీ శ్రీవారు ఎక్కడా కనిపించరేం?' చుట్టూ చూసింది నిర్మల.
 
    ఇందిర గాఢంగా నిట్టూర్చింది.
 
    'ఆయనకి ఇంటికంటే ఆఫీసే పదిలం. ఆ... అంతదూరం ప్రయాణం చేసి వచ్చావు. స్నానం చేసి త్వరగా వస్తే వేడివేడిగా పెసరట్లు వేస్తాను.'
 
    'చిన్నప్పటిలా వీపుమీద కాదుకదా!"
 
    'పోవే నీకొంటెమాటలూ నువ్వూను.' ఇందిర మనోహరంగా నవ్వింది.
 
    'అబ్బ అలా నీ అందమైన నవ్వు చూసి ఎన్నాళ్లయిందోనే ఇందూ?'
 
    'నేను మనసారా నవ్వి చాలా నాళ్లయిందిలే.' మనసులోనే భారంగా నిట్టూర్చింది ఇందిర.
 
    'టిఫిన్‌కి ఏం కంగారు లేదులే... తాపీగా చెయ్యి.. నేనీలోగా ఈ బంగారు తల్లితో కబుర్లు చెప్పుకుంటాను.'
 
    'అలాకాదు. వంటింట్లో నాతో మీ ఆయన కబుర్లు చెప్పుదువుగాని రా.' నిర్మలను లోపలికి లాక్కువెళ్లింది.
 
* * *
 
    రెండోరోజు ఉండబట్టలేక ఇందిర భుజంమీద చెయ్యేసి అడిగేసింది నిర్మల.
    
    'ఇందూ! నిన్నో మాట అడుగుతాను దాచవు కదా!'
 
    'నీదగ్గర నాకు దాపరికమేమిటే?' ఇందిరకి అర్థమైపోయింది స్నేహితురాలు అడగబోయేదేమిటో.
 
    'పాపని చూస్తుంటే... అంటే...???' అంతకన్నా ఎలా అడగాలో అర్థంకాలేదు నిర్మలకు.
ఇందిరకి దుఃఖం పొంగుకొచ్చింది.
 
    'అంతా నా దురదృష్టం నిర్మలా! అవును నువ్వు ఊహించినట్టు... శర్వాణి మూగది. గుండెల్లో దాచుకోవలసిన అభంశుభం తెలియని మనవరాలీని చీటికీ మాటికీ ఇష్టం వచ్చినట్టు తిడుతూంటే నా మనసుకి కష్టం కలిగి 'పెద్దవాళ్లు మీరు కూడా అలా అనడం ఏం బాగుంటుమద్ని' ఓ మాట అన్నానని ఈమధ్యనే మా అత్తగారు కోపంవచ్చి మా ఆడపడుచు దగ్గరికి వెళ్లిపోయింది.'
 
    'మరి మీ ఆయన...?'
 
    ఇందిర నిట్టూర్చింది. 'కన్నతండ్రి... ఆయనకి దాన్ని చూస్తే ఎందుకంత ద్వేషమో అర్థం కాదే... దీని మొహం చూడాలంటే అసహ్యమట. పైగా మూగ మొద్దూ అని పిలవడం...'
 
    నిర్మల విస్తుపోయింది. ఆమె కంటంలో కోపం 'ఇందూ! మీ ఆయన్ని ఇలా అంటున్నందుకు నన్ను ఎన్నయినా తిట్టు భరిస్తాను. కాని రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కించపరిచే అతను క్షమార్హుడు కాదు.'
 
    ఇందిరకి బాధను పంచుకోవడానికి ఇన్నాళ్లకి మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఒక తోడు కనిపించగానే అది కన్నీటిరూపంలో లావాలా బయటికి పొంగుకొచ్చింది.
 
    'మొన్నేమైందో తెలుసా? శర్వాణికి మాటలు రాకపోయినా మనసుంది కదా... ఎంత ఊహో... అందరి పిల్లలనూ చూసి దానికీ తండ్రితో ఆడుకోవాలని అనిపించింది కాబోలు. అయితే సమయాసమయాలు చిన్నపిల్లకేం తెలుస్తాయ్ నిర్మలా! బయట వరండాలో ఫ్రెండ్స్‌తో బాతాఖానీ వేస్తున్న తండ్రి దగ్గరకువెళ్ళి చనువుగా ఆయన చెయ్యి పట్టుకుంది. ఆయన స్నేహితులు ఆయనలాంటి వారే... పిల్లను చూసి గుసగుసలాడుకున్నారని ఇంక చూడు ఆయన కోపం...? వాళ్లనేమీ అనలేక పాపని రెక్కపట్టుకు ఈడ్చుకెళ్ళి బెల్టుతో వాతలు తేలేలా కొట్టారు. కానీ బాధకీ ఆనందానికీ తేడా తెలియని నా చిట్టి తల్లి అన్ని దెబ్బలు తిని అమాయకంగా చూస్తుంటే నా గుండె తరుక్కు పోయింది నిర్మలా...' వెక్కిళ్లు పెడుతున్న ఇందిరను ఓదార్చడం కష్టమైంది నిర్మలకి.
 
    'బాధపడకే ఇందూ... అనుబంధాల అల్లికలో కష్టసుఖాల మధ్య సాగేదే మానవ జీవితం... కాలమే మీ సుధాకర్‌ను మారుస్తుంది.'
 
    'పెళ్లయిన నాలుగేళ్లకీ పుట్టిన శర్వాని నా కలల పంటే. దీనికి మాటలు రాలేదని... నేను తిరగని హాస్పిటల్ లేదు... కాని పాప పుట్టు మూగ చెవిటి అని తేలింది. దీనికి సాయం... మాటలే రాని పాపకి 'శర్వాణి'పేరెంటని ఇరుగూ పొరుగూ నా వెనక వెక్కిరింపులు... నేను మాత్రం ఛాలెంజ్‌గా తీసుకుంటున్నానే... మాటలు రాకపోతేనేం నా బంగారు తల్లికి ఎంత గ్రహింపో తెలుసా?'

    'ఈ నాలుగు రోజులగా నేనూ గమనిస్తున్నాలే... అదిగో చూడు ఆ పిల్లలని ఎలా పలకరిస్తోందో...'

    'కాని ఆ పిల్లలంతా దీన్ని వెక్కిరించినా చిరునవ్వులని చిందిస్తుందే గాని కోపం రాదే నా తల్లికి...'

    'బాధపడకే ఇందూ!... పిల్లల ప్రపంచంలో నెగిటివ్ థింకింగ్ ఉండదే. ముందు ఎగతాళి చేసినా తర్వాత వాళ్లలో కలిపేసుకుంటార్లే.'

    'అదీ నిజమే... నిర్మలా... నా కొక్కటే కోరికే. ఈ జన్మలో అది నన్ను అమ్మా అని పిలిస్తే చాలు...'

    'పాపని ఏదన్నా దగ్గర్లోని స్కూల్లో వేయలేకపోయావా?'

    'ఆ ముచ్చటా అయిందే... ఏం జరిగిందంటే... ఫీజుకోసం శర్వాణికి జాయిన్ చేసుకున్న స్కూలు ప్రిన్సిపల్ ఏడాది తిరిగాక 'ఈ పిల్లకి చదువెందుకండి? స్కూలు మాంపించేసి హాయిగా ఇంటి పనులు నేర్పించండి చాలు.' అని సలహా ఇచ్చింది. నేనూ ఊరుకోలేదులే.'దురదృష్టవంతులైన మా శర్వాణి లాంటి పిల్లల విషయంలో కాస్త ఓపిక, అనురాగం మానవత్వం చూపించలేని మీకు డిగ్రీలెందుకు. మూటకట్టి అటకమీద దాచుకోండి.' అనేసరికి దారికొచ్చిందనుకో. అక్కడ చదువుతున్న పిల్లలు ఇంటికెళ్లాక శర్వాణిని అనుకరిస్తూ మూగచేష్టలు చేస్తున్నారని కొంతమంది కొంతమంది తల్లిదండ్రులు ఆవిడగారికి కంప్లయింట్ చేసారట. ఆ విషయానికీ సమాధానం గట్టిగానే చెప్పాను.'
    
    ఇందిర మాటలు వింటున్న నిర్మలకీ ఆవేశమొచ్చింది.
    'వాళ్ళింట్లోనే అక్క చెల్లెళ్లుగా ఇలాంటిపిల్లలు ఉంటే వాల్లేంచేస్తారో అడగనాల్సింది...'ఎదటివాళ్లెలాపోతేనేం' అనే స్వార్థంవల్ల మానవత్వం లేకపోవడం వల్లనే ఇలాంటి కంప్లయింట్లు... అసలు వీళ్లనీ...'

    'అయినా దురదృష్టం మాది. డొనేషన్లతో నడిచే స్కూలు ప్రించిపల్ అంతకంటె ఎలా ప్రవర్తిస్తుంది. పాప నిస్సహాయత నాకు అర్థమయినట్టు వాళ్లకి అర్థం కాదుగా. అందుకే పౌరుషంగా ఆ స్కూలు మానిపించేసాను. మా శర్వాణికి ఈ లోకమంతా అసూయపడేలా నేనే తీర్చిద్దుకుంటాను నిర్మలా...'

    'ఇందిరా! నువ్వెప్పుడయినా గూడు కడుతున్న సాలెపురుగుని గమనించావా? అది ఎన్నిసార్లు పడిపోతుందని. అయినా పడుతూ లేస్తూనే పట్టుదలగా తనకంటూ చివరికి ఓ గూడుని నిర్మించుకుంటుంది. సాధిస్తుంది."అనుకున్నది జరిగితీరాలన్న కోరిక మనలో బలంగా ఉంటే అందుకు అనువైన పరిస్థితులు వాటంతట అవే సమకూరుతాయి. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే. మన మనసు మాట వినడం... ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం" అన్నారు పాలోకోయిలో... తెలుసా? అలాగే...'

    'అర్థమయిందే...నా కూతురు ఎలుగెత్తి అమ్మా అని ఏనాటికైనా నన్ను పిలవకపోతుందా అని నా ఆశ. అది తీరడంకోసం నువ్వు అన్నట్టు సాలీడులా ఎంత కష్టాన్నయినా భరిస్తాను.'
 
    'నీది గొప్ప సంకల్పమేనే ఇందూ... అది తప్పక సిద్ధిస్తుందని నా మనసు చెబుతోంది. అన్నట్టు శర్వాణికి కాక్లియర్ ఇన్‌ప్లాంటేషన్ చేయించడానికి వీలవుతుందేమో ఇయన్‌టీ స్పెషలిస్టును సంప్రదించు. అది సక్సెస్ అయితే అతి చిన్నగా శబ్దాలు వినబడే అవకాశం అయినా మన శర్వాణికి కలగొచ్చు.'
 
    'నాకింతవరకు ఈ ఆలోచనే రాలేదు. తప్పకుండా సంప్రదిస్తాను నిర్మలా! పాప భవిష్యత్తుకోసం ఎంత అప్పయినా చేయడానికి వెనకాడను. ఇంతకీ శర్వాణి ఎక్కడ?' కబుర్లతో పడిపోయిన మిత్రులిద్దరూ శర్వాణి కోసం అటూఇటూ చూసారు.
    
    శర్వాణి కేలండరులోని నటరాజమూర్తి భంగిమను ప్రదర్శించేంద్కు కుస్తీ పడుతోంది. అది చూసి ఇందిర నవ్వింది. ఆ నవ్వులో నిశ్చింత కనిపించింది నిర్మలకి.
 
    'రియల్లీ షిఈజ్ బ్రిలియంట్...' అంటూ పాపను ముద్దుపెట్టుకుంది నిర్మల.
 
* * *
 
    ఇంటిముందు పచ్చని లాన్‌లో పచార్లు చేస్తున్న నిర్మలతో సంతకం పెట్టించుకుని పెద్ద కవరు ఇచ్చి వెళ్లిపోయాడు పోస్ట్‌మేన్.
 
    కవరు మీద వ్రాతను చూడగానే నిర్మల మొహం విచ్చుకుంది. రెండేళ్లయిపోయింది ఇందిరను శర్వాణిని చూసి.
    
    కవరు బరువుగా ఉంది. కవరులోని నిలువెత్తు ఫోటోలో... స్టేజిమీద చక్కని నాట్య భంగిమలో శర్వాణి సాంస్కృతిక శాఖామంత్రిగారి నుంచి బహుమతి అందుకుంటున్న దృశ్యం చూసి మతిపోయింది నిర్మలకి. పక్కనే అరమోడ్పు కన్నులతో 'అంభా' అనే బుజ్జి తువ్వాయి పిలుపుకు పరవశించిపోతున్న గోమాతలా చూస్తోంది ఇందిర.
 
    ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం? నిర్మల రెప్పవెయ్యకుండా అలాగే చూస్తుండిపోయింది చాలాసేపు.
తర్వాత కవరులోంచి ఉత్తరాన్ని బయటకి తీసింది.
 
'నిర్మలా!
 
    రేపటి ఆశల చప్పుళ్లే సరిగమలుగా రాత్రివేళ... నిశ్శబ్ద సంగీతంలాంటి మా శర్వాణిని గుండెల్లో దాచుకుని ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన నా నిరీక్షణ ఇన్నాళ్లకి ఫలించిందే. నోరు లేని నా బిడ్డ నన్ను 'అమ్మా' అని ఈ ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా... ఎలా పిలిచిందో చూశావా? ఇది కలకాను. నిజమే...
 
    మూగ పిల్ల అన్న కారణంతో అంతా వెలివేసిన నా కూతురికి కూచిపూడినృత్యంలో నాట్యంలో రాష్ట్రస్థాయి పోటీలలో ప్రథమ బహుమతి వచ్చిందే... ఈ కవరులో ఆ ఫోటోలు పంపించాను. చూశావుగా...
 
    నా బంగారు తల్లి మంత్రిగారి చేతులమీదుగా బహుమతి అందుకున్నదీ అంటే... ఆ కరతాళధ్వనులు... అవీ... ఓహ్...నేనింకా నమ్మలేక పోతున్నానే...
 
    బహుమతి అందుకున్న వెంటనే చిన్ని...నా చిన్ని... ఏంచేసిందో తెలుసా? నా చెంపమీద చిన్న ముద్దుతో ముద్ర వేస్తూంటే వేలాది కెమేరాలు క్లిక్‌మంటూంటే చాలు... నా జన్మ ధన్యమయిపోయిందే...
 
    అన్నట్టు నీకో విషయం చెప్పనా? నువ్వు వచ్చి వెళ్లాక ఎంతో ఆలోచించాను. ఎందుకో ప్రశాంతమైన  భార్గవ శర్మ గారి ముఖం, ఆయన డాన్స్ స్కూలు వాతావరణం శర్వాణికి సరిపోతాయనిపించి పాపను భార్గవ శర్మగారి దగ్గర చేర్చాను. నీకు చెప్పాను కదా... ఆయన మూడేళ్ల క్రితం పార్కులో కలసి మా శర్వాణి లోని నృత్యాభిలాషని కనిపెట్టి తొలిసారిగా మెచ్చుకున్న కళాకారుడు... వారి సలహాతో ఇప్పుడూ... మా శర్వాణి భవిష్యత్తు కోసం నా కూతురిని ఈమధ్యనే ఢిల్లీలోని ఓ మంచి ఆర్ట్‌స్కూళ్లో చేర్పించాను. వారికి సదా ఋణపడి ఉంటాను.

    నిర్మలా... చిత్రం!!! ఇప్పుడు అది రాత్రిళ్లు నా పక్కలో లేకపోయినా నాకు బెంగగా అనిపించడం లేదే... ఎందుకో తెలుసా? ఇక్కడనుంచే నా చిన్ని బంగారు భవిష్యత్తును నా మనోనేత్రంతో చూడగలుగు తున్నాను కనుక...

    ఇన్నాళ్లకి జీవితంలో నేను గెలిచాను నిర్మలా! సాలె పురుగులా పట్టువదలకుండా సమాజం పుల్లవిరుపు మాటలు పట్టించుకోకుండా నా సంకల్పాన్ని సిద్ధింప చేసుకున్నాను కదూ...

    ఈ విజయంలో నీకూ భాగముంది. ఎందుకంటే కాక్లియర్ ఇన్‌ప్లాంటేషన్‌తో నువ్వన్నట్టుగానే మా శర్వాణికి లోగొంతుకతో మాట్లాడుతున్నట్టు అన్నీ వినిపిస్తున్నాయి. అందుకే నాట్యం కూడా బాగా నేర్చుకోగలిగింది. 

    ఈ ఉత్తరానికి కొసమెరుపేంటో తెలుసా?

    ఎప్పుడూ కన్నకూతురిని ప్రేమగా దగ్గరకి తీసుకోని దాని తండ్రి గర్వంగా ఇప్పుడు 'అది నా కూతురని' పొంగిపోతూ చెప్పుకోవడం...

    మా అత్తగారు శర్వాణిని ఆకాశానికెత్తేస్తూ 'ఈ కళాకారిణి నా మనవరాలని' ఊరూవాడా చాటడం... నా బిడ్డ చదువుకోవడానికి పనికిరాదని అర్ధాంతంతరంగా స్కూలునుంచి పంపేసిన స్కూలు ప్రిన్సిపాల్ మళ్లీ సీటిస్తానని నా గుమ్మం ముందుకు రావడం...

    నా విజయానందం పంచుకునేందుకు నీకంటె నాకెవరున్నారే... నా సంకల్పసిద్ధికి దోహదం చేసిన నీకు... ఊహూ కృతజ్ఞతలు చెప్పనులే. ఎందుకంటే శర్వాణి నా ప్రాణంలో ప్రాణం అయితే నువ్వు నా బహిఃప్రాణానివి. ఉండనా మరి...

నీ ఇందూ...'

    లోపలికి వచ్చి టీవీ ఆన్ చేసింది.

    "మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.
     ఎదిగిన కొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది."

    ఆ పాటలోని అంధ కళాకారుల కళ్లనుండి కారుతున్న ఆనంద భాష్పాల్లాగే నిర్మల చెంపల వెంబడి కూడా అవిరళంగా కన్నీరు ప్రవహిస్తోంది.

Comments