సంస్కారం - అడపా రామకృష్ణ

    ‘‘అందరూ దూరంగా జరగండి, ఏం చూస్తారు చోద్యం?’’ చేతులు పైకెరగేస్తూ, కసురుకుంటూ, అక్కడ మూగిన గుంపును చెదరగొడుతూ అదమాయిస్తున్నారు కాపలాదారులు.

    మూడు కార్లు, రెండు వ్యాన్ల నిండా అధికారులు దిగారు. ఖాకీ డ్రెస్‌లో పోలీసులు, నల్లకోట్లలో లాయరు, మరి కొంతమంది అక్కడున్న మూడంతస్తుల భవనంలోకి అడుగుపెట్టారు.

    లక్షలు, కోట్లు రాసులు పోసి కట్టారా అన్నట్లు అందమైన ఆకృతిలో, చెక్కుడు చలువ రాతితో చెక్కినట్లు ఉన్న అధునాతన భవంతి అది. ఆ వీధికి, చెప్పాలంటే ఆ వూరికే తలమానికం. ఖరీదైన కార్పొరేట్ నిర్మాణం అంటే ఇలా వంటుందా అని చూసేవారు విస్తుపోవడం పరిపాటి. ఖరీదైన కారులో షికారు కొట్టే ఆ ఇంటి యజమాని హంగామా పలువురిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆయనే సింధుఘోష్. భార్య, పదిమంది పరిచారికలు మాత్రమే ఉంటారు.

    ‘‘ఇదిగో సార్, మీ ఇంటిని జప్తు చేయమని కోర్టు నోటీసు. రోజువారీ సామగ్రి ఉంటే పట్టుకెళ్లవచ్చు. మీరు బయటికి వెళితే ఇంటిని సీజ్ చేస్తాం’’ నిస్సంకోచంగా, నిష్కర్షగా చెప్పవలసింది చెప్పాడు ఒక అధికారి.

    చేతికిచ్చిన కాగితాల్ని చూసుకుని నమ్మశక్యం కాని పరిస్థితిలో అవాక్కయ్యాడు.

    ‘‘ఈ ఇంటి మీద అయిదు కోట్లు అప్పు తీసుకున్నట్లు నాకు తెలియదు. ఇప్పుడేం చేయాలి?’’ సింధుఘోష్ సంకోచంలో పడ్డాడు.

    విదేశాల్లో ఉన్న కొడుకుతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. సిగ్నల్ అంతరాయం. కాల్ కలవలేదు.

    చలిజ్వరం వచ్చిన వాడిలా వణికిపోసాగాడు. అవమాన భారంతో అతని భార్య తల దించుకుంది.

    ఆ భవంతికి దగ్గరలో నివాసముంటున్న గోపీనాథ్ అక్కడ జరుగుతున్నదంతా గమనించి పరిచయం ఉన్నవాడిలా చొరవగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు.

    ‘‘ఆగండి! ఎవరు మీరు? లోపలికి వెళ్లడానికి ఎవరికీ పర్మిషన్ లేదు’’ అన్నాడొకతను దురుసుగా.

    ‘‘నన్ను వెళ్లనివ్వండి. వాళ్లకు కావలసిన వాడినే! మాట్లాడాలి’’ అన్నాడు దూకుడుగా గోపీనాథ్.

    అంతలో ఎవరో ఒకాయన కల్పించుకుని ‘‘వారిని విడిచిపెట్టండి ఫరవాలేదు’’ అన్నాడు.

    గోపీనాథ్ ఆ దగ్గరలోనే ఒక పాత ఇంట్లో ఉంటూ ఈ మధ్యనే పునర్నిర్మాణానికి ఇచ్చేసాడు ఇంటిని. ఆ పక్క వీధిలో అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్నాడు తన ఇల్లు పూర్తయ్యే వరకు.

    సింధుఘోష్‌ను పరామర్శిస్తూ ‘‘బాధపడకండి! ఇప్పుడేం చేద్దామో ఆలోచించండి. మేమంతా ఉన్నాం. మీకేం ఫరవాలేదు’’ అంటూ ధైర్యం చెప్పాడు.

    ఇంట్లో ఉన్న తేలికపాటి వస్తువులు, అవసరమైన కొన్నింటిని మెల్లగా ఒకొటొకటిగా వీధి బయట పెడుతున్నారు.

    ‘‘టైమవుతోంది! అందరూ బయటికి నడవండి. తాళం వేసి సీజ్ చేయాలి. అయ్యగారు కోప్పడుతున్నారు’’ అన్నాడు బంట్రోతు.

    సింధుఘోష్ గొంతు పిడచగట్టుకుపోయింది. భార్య అచేతనంగా గోడకి చేరగిలబడిపోయింది.

    గోపీనాథ్ అతి కష్టమీద ఆ ఇద్దరినీ బయటికి తీసుకొచ్చి గేటు దాటించాడు. అక్కడే నిలుచున్న వారి కారు డ్రైవర్ని అడిగి కారు తాళాలు తీసుకున్నారు అధికారులు.

    ‘‘ఇది కూడా కోర్టు సొత్తే’’ అన్నాడు.

    చెట్టు కింద కుర్చీ వేసి సింధుఘోష్‌ని, అతని భార్యని కూర్చోబెట్టారు.

    ‘‘సార్! మీ అబ్బాయి ఏమీ చెప్పలేదా? అర్ధంతరంగా వీధిలోకి నెట్టేయడం ఘోరాతిఘోరం’’ అన్నాడు గోపీనాథ్.

    అందరూ చోద్యంగా చూడసాగారు.

    ‘‘మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఫోన్ చేయమంటారా? ఎవరో ఒకరు వచ్చి ఆదుకోవాలి కదా’’ ఆందోళన పడుతున్నట్లు గోపీనాథ్ ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. సింధుఘోష్ పరిస్థితి వినేలా లేదు.

    మరి కొంత సేపటికి కోట్లకి పడగలెత్తిన ఆ అరుదైన భవంతికి తలుపులు మూసి, తాళం వేసి, లక్కతో అతికించిన సీలు వేసి బయటికి వచ్చేశారు. ఆ ఇంటి యజమానిగా, ఎంతో ఠీవీగా బతికిన సింధుఘోష్, ఆయన భార్య నిశే్చష్టులై, గుండె పగిలేటట్లు కన్నీరు పెట్టారు. వారిని చూసి గోపీనాథ్ మనసు ద్రవించిపోయింది. అంత వరకు జాలి చూపిన వారంతా మెల్లగా జారుకున్నారు.

    ‘‘సార్ రండి ఫరవాలేదు. మా ఇల్లు ఖాళీగా ఉంది. అమ్మగారిని ఎంత సేపు ఇలా వీధిలో కూర్చోబెడతారు?’’ అని గోపీనాథ్ బలవంతంగా ఇద్దరినీ అక్కడే పడి ఉన్న సామగ్రితో తన ఇంటికి తీసుకెళ్లాడు.

    ఒకరోజు గోపీనాథ్ కొడుకు గోకుల్ ఆ దారిన పోతూ తన పాత ఇంట్లో ఎవరో ఉండడం చూసి తండ్రికి ఫోన్ చేశాడు.

    ‘‘ఎవరు డాడీ మన పాత ఇంట్లో ఉన్నారు. అద్దెకిచ్చారా?’’ అన్నాడు.

    ‘‘లేదు! పక్క వీధిలో సింధుఘోష్‌గారిల్లు కోర్టు గొడవల్లో ఉంటే తాళం వేశారు. పాపం ఎక్కడికి పోతారు. కొద్ది రోజులు మనింట్లో ఉండమన్నాను’’ చెప్పాడు గోపీనాథ్.

    ‘‘నో డాడీ! ఇట్ షుడ్ నాట్ బి! నా పేరున డాక్యుమెంట్ రాశారు కదా. నాకు తెలియకుండా, నన్ను అడగకుండా ఇల్లెలా ఇస్తారు?’’ కొడుకు గోకుల్ నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా గొడ్డలితో నరికినట్లు అడిగేసరికి గోపీనాథ్ నిరుత్తరుడయ్యాడు. కళ్లు గిర్రున తిరిగాయి.

    నోటి వెంట మాట రాలేదు. నిజంగా తొందరపాటు జరిగిపోయిందా? అనిపించింది.

    కోటీశ్వరుడు సింధుఘోష్ కొడుక్కి లేని సంస్కారం తన కొడుకు గోకుల్‌కి ఉంటుందనుకోవడం పొరపాటే అనిపించింది. ఏదో తప్పనిసరి నిర్ణయానికి వచ్చినట్లు వాడిలా గోపీనాథ్ తన కొడుక్కి రాసిన వీలునామా పత్రాన్ని రద్దు చేయడానికి బయలుదేరాడు తనని తాను సంస్కరించుకున్న వాడిలా!


(ఆంధ్రభూమి దినపత్రిక 14-06-2015 సంచికలో ప్రచురితం)

Comments