సంస్కారం - కాకాని చక్రపాణి

    
'పోయాడు, పీడాపోయింది' అని గొణుక్కుంది ఆమె, నిర్జీవమై పడి ఉన్న తన భర్త హరినారాయణ శవం వంక చూస్తూ. కానీ, ఆ స్వాంతన పొందే అవకాశం ఆమెకు లేదు. విగత భర్తృక అయిన హైందవ స్త్రీ విలపించక తప్పదు. లేకపోతే లోకం ఆడిపోసుకుంటుంది. అయినా ఆమె గుండెలు బాదుకుంటూ ఏడవలేదు. ఆమె కళ్ళంబట నీళ్ళు కారాయి కానీ అవి ఆ శవం పట్ల ఉన్న ఆర్ద్రత వల్ల కాదు.

    శవం క్రింద పేర్చిన ఐసు గడ్డలు కరిగి, ఊకను తడిపి, చుట్టూ చీమలు రాకుండా చల్లిన గెమాక్సిన్‌ను కలుపుకుని వరండాలోనుంచి మెట్లమీదుగా నీళ్ళ రూపంలో కారుతున్నాయి.

    చుట్టూ ఉన్న జనం లోగొంతుకల్లో మాట్లాడుకుంటున్నారు.     'దిగులు పడకు. ఎక్కడకు పోయాడామ్మా, నేను మాత్రం పోయానా?' అన్న మామగారి గొంతు తన గుండె లోతుల్లో నుండి విన్పించింది.     'అమ్మో! ఈయన తన్ను వదలి పెట్టాడా?' అని ఉలిక్కిపడింది ఆమె. తేరుకుంటూ, 'అసలాయన తన్ను పట్టుకు కూర్చుంది ఎప్పుడు. తనే తన గుండెల్లో గుడి కట్టింది ఆయనకు. ఆయన తన విషయంలో నిర్వికారమైన మనిషి. ఆ దేవుడు తనకు కష్టాల్లో స్వాంతన కల్గించేవాడు' అని అనుకుంది ఆమె.     తన మామగారు తన తండ్రి బాల్య మిత్రుడని చెప్పి తన్ను కొడుకు హరినారాయణకు చేసుకున్నాడు. ఆయన భార్య పరమేశ్వరి అందుకు ఘాటుగానే ప్రతిస్పందించింది. తను మంచి అనుకున్నది ఎవరు మొత్తుకున్నా వినకుండా చేయటం ఆయన వ్యక్తిత్వం. తను కాపురానికి వచ్చిన కొత్తల్లోనే ఆమె అంటే ఏమిటో తనకు తెలియసాగింది. ఓసారి ఆ దంపతుల సంభాషణ తను వినటం జరిగింది.

    "బాల్య మిత్రుడి కూతురని చెప్పి ఆపిల్లను కొడుక్కు ఎందుకు చేసుకున్నావో ఇప్పుడు నాకు అర్థమయింది" అంది ఆమె.     "ఎందుకు చేసుకున్నానటా?" అడిగాడు ఆయన.     "ఆ పిల్ల చిదిమి దీపం పెట్టినట్లుంది కనక!"     "విషపు నోరు...!"     "పాముకు కోరల్లోనే విషముంటుందట..."     "ఖలునకు నిలువెల్ల విషము..." అని ఆమె వాక్యాన్ని పూర్తి చేసి నవ్వాడు ఆయన."ఆ పిల్లను గూర్చి పెడర్థాలు తియ్యకు. మనకు బిడ్డలాంటిది."     "అది నిజమే. కానీ తమ విషయంలో నాకు మహా అపనమ్మకం!'     ఆమె కొడుకు పెళ్ళయ్యాక, ఇంటిలో ఉన్న శత్రువుతో పాటు, మరో కొత్త శత్రువు జత అయినట్లయింది. పాత శత్రువు భర్త అయితే కొత్త శత్రువు తను.     ఓ రోజు కొడుక్కు చెప్పింది ఆ సంస్కారంలేని మనిషి

    "జాగ్రత్త! మీ నాయన కొంపలార్పే మనిషి. నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో" అని.
    ఆ కొడుక్కు ఆ తల్లి మాట వేదవాక్కు. తనెప్పుడయినా ఆయన చూస్తుండగా మామ ఎదుట పడితే ఆ ముఖం మటమటలాడి పోయేది. ఓ రోజు, "నీకు బుద్ధి లేదా? బరి తెగించిన ముండలా, సిగ్గూఎగ్గూ లేకండా ఏమిటా తిరగటం, మగాళ్ళ ముందు!" తన్ను కసిరాడు తల్లి సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్న తన మొగుడు.     "ఎందుకురా, ఆ పిల్లనలా కోప్పడతావు? ఇక్కడ పరాయివాళ్ళెవరూ? ఉన్నది నేనేగా" అడిగాడు తన మామ.     "భర్త తప్ప మరే మగాడయినా పరాయివాడే" అంది తన అత్త దీర్ఘాలు తీస్తూ.     "అమ్మ మాట అక్షరాలా నిజం" అన్నాడు తన భర్త.
    "నోరు ముయ్యరా వెధవా! మీ అమ్మ నిన్ను మనిషిలా ఎదగనివ్వదు. చదువు మధ్యలో ఆపేశావు. కనీసం నా ఆఫీసుకయినా వెళ్ళి కూర్చో. వ్యాపార విషయాలు అర్థమవుతాయి!" అన్నాడు మామ నారాయణ స్వామి.

    "చిన్న వెధవ! వాడికిప్పటి నుండే ఆ ఝంఝాటమెందుకూ? నువ్వు సంపాదిస్తున్నావు చాలదా? కొత్తగా పెళ్ళయినవాడు. నాలుగు రోజులు వాడిని సుఖంగా ఉండనీ."
    "సుఖం మరిగిన శరీరం కష్టానికి ఓర్చుకోలేదు. చిన్నప్పటినుండీ బిజినెస్ వ్యవహారాలు తెల్సుకొంటే తేలిగ్గా ఒంటబడతాయి."
    ఆయన హితోక్తులు ఆ తల్లీకొడుకులకు పట్టలేదు. మొదటినుండీ వాళ్ళిద్దరూ ఓ జట్టు. ఆయన్ని దూరం చెయ్యసాగారు. తను కాపురానికొచ్చే సమయానికే ఆయన కుటుంబంనుండి బాగా జరిగి పోయాడు. తిని తిరుగుతూ నిర్వ్యాపారంగా గడపటం తన భర్త తత్వమైపోయింది. తల్లి వత్తాసు ఆయనకెప్పుడూ ఉంది. తన కొడుకును బాగు చెయ్యాలన్న మమకారంతో తను బీదపిల్ల అయినా తన్ను కోడలుగా చేసుకున్నాడు మామ నారాయణ స్వామి.

    గొల్లపూడిలో తాతముత్తాతలనాటి పెంకుటిల్లు, రెండెకరాల భూమి తప్ప ఆయనకు సంక్రమించిందేంలేదు. వ్యాపారంలో బాగా సంపాదించాడు. పెద్ద గుండె ఉన్న మనిషి నారాయణ స్వామి. నలుగురికి పెట్టి తాను తిన్నాడు. తన పెళ్ళయేటప్పటికి ఆయనకు విజయవాడ సూర్యారావుపేటలో పెద్ద ఇల్లుండేది. ఏ ఖర్మవల్ల తన అత్త పరమేశ్వరితో ఆయనకు ముడిపడిందో, ఆయన్నామె బతకనిచ్చేదికాదు. అనుమానపురోగం. ఇంట్లో సుఖం కొరవడిన మనిషి బయటదారి చూసుకున్నాడు. ఎన్నాళ్ళనుండీ ఆ వ్యవహారం కొనసాగుతోందో తనకు తెలియదు. అయినా తను నమ్మి చేరదీసిన విశాలాక్షి పట్ల వ్యామోహం నుండి ఆయన తేరుకోలేక పోయాడు. వాటాదార్లు ముంచారు. వ్యాపారం కుదేలయింది. విశాలాక్షి 'ఛీ' కొట్టింది. పువ్వులమ్మిన చోట కట్టెలమ్మలేక చివరకు తన పుట్టిన ఊరు చేరాడు. తను కాపరానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ పని జరిగింది. అంత దురదృష్టానికి, ఇంటికి తెచ్చుకున్న జెష్ట పెద్దమ్మే కారణం. తనే ఆ 'జెష్ట పెద్దమ్మ'. అదే తనకు ఆ ఇంటిలో తన అత్త పెట్టిన పేరు.
    'కోడలొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ' అంటూ, "నువ్వే ఈ శనిగ్రహాన్ని తెచ్చిపెట్టావు" అని దెప్పితే, చెప్పాడు ఆయన ఆమెకు; "వ్యాపారంలో నష్ట పోవడానికి కారణం నేనే. ఆ పిల్లేం చేసింది? అన్ని పట్టించుకోవల్సిన వాడిని, ముఖ్యమైన విషయాలు కూడా మందికి వదిలేస్తే ఎవడికి తోచింది వాడు తినేశాడు" అని.

    "ఎందుకు వదిలేశావు?" అందామె ముఖం గంటుపెట్టుకుని.
    ఆయన మాట్లాడలేదు.     "విశాలాక్షి మోహంలో పడేనా?"     "అవును నా అపజయానికి కారణం నేనే."     "నా కొంప కూల్చావు! ఆ విశాలాక్షి నా కాపురానికి పీడలా అవతరించింది. దెష్ట మొహంది! దాని పాడె గట్టా! దాని కొంప నాశనంగాను! దాన్నోట్లో దుమ్ముపడ!" అని శాపనార్థాలు పెట్టసాగింది అత్త పరమేశ్వరి.
    "ఆమె వృత్తే అది. ఈ విషయంలో ఆమెను ఆడిపోసుకుని ప్రయోజనం లేదు. తప్పు నాది. అందుకు శిక్ష నేను అనుభవించాలి." 

    "నీతో అయిందా - ఆ శిక్ష మేంకూడా అనుభవిస్తున్నాంగా?"
    "మరి తప్పదు. నా సుఖాలు అనుభవించినప్పుడు, నా కష్టాలూ పంచుకోవాల్సి వుంటుంది."     తనకప్పుడు తెలియలేదు గానీ, ఇప్పుడు అర్థమవుతున్నది. ఆయన చేసిన పొరపాటులో తన అత్త పరమేశ్వరికీ భాగముంది. తన పొరపాటును, తప్పిదాన్ని ఒప్పుకునే ధైర్యం మామకుంది. తన అత్త భిన్నమైన మనిషి. తన అపజయాలకు, వైఫల్యాలకు కారణం మరో వ్యక్తో, పరిస్థితులో కారణం గానీ, తనే మాత్రం కాదని ఆమె నిశ్చితాభిప్రాయం. తనంత పతివ్రత, ఇంటిని తీర్చిదిద్దే నేర్పుగల ఇల్లాలు మరొకరు లేరని ఆమె భావన. స్వేచ్ఛాప్రియుడైన భర్తను కట్టిపడేసింది ఆమె. ఆ బంధనాలు తెంచుకునే ప్రయత్నంలోనే ఆయన విశాలాక్షి కౌగిలి చేరాడు.     మహా అనుమానం పిశాచి తన అత్త! అందుకు వావీ వరస కూడా లేవు ఆమెకు. తనకిప్పటికీ బాగా గుర్తు! ఆ రోజు మామగారు ఎండలో ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. చెమటలు కండువాతో తుడుచుకుంటూ, హాల్లో కనిపించిన తన్ను, "కాస్త మంచినీళ్ళు తెచ్చివ్వమ్మా, గొంతెండుకుపోతోంది" అన్నాడు.     ఎండలో తిరిగి వచ్చిన మనిషికి మంచినీళ్ళివ్వాలన్న జ్ఞానం కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గిరుక్కున వంట ఇంట్లోకి పోతున్న తను, అత్తగారి మాట విని మ్రాన్పడిపోయింది.
    "నే ఇంట్లో తగలడి లేనూ? దాని మీద కూడా కన్ను పడాలా? కొడుకు పెళ్ళామన్న జ్ఞానమైనా లేదు మనిషికి!" అని ముక్కుతూ, మూలుగుతూ లేచి వంటింట్లో నుండి గ్లాసుతో మంచి నీళ్ళు తెచ్చింది. తనెక్కడున్నా ఓచెవి భర్త వైపు ప్రసరించే ఉంచుతుందామె.

    అయితే, ఆయన ఆమె తెచ్చిన నీళ్ళు తాగలేదు. "ఒరే రాముడూ! బావిలో చేద వేసి ఓ చెంబెడు నీళ్ళు పట్టుకు రారా!" అన్నాడు.
    "వాడు...ఆ అస్పృశ్యుడు...తెచ్చిన నీళ్ళు తాగుతావా?" అంది అత్తగారు.     "తాగుతాను. జన్మ చేత ఎవరూ అస్పృశ్యులు కారు, బుద్ధి చేత తప్ప" అంటూ ఆయన దొడ్లోకి వెళ్ళాడు.     అయితే ఆమె సంరక్షణలో ఆయన ఎక్కువ కాలం బతికింది లేదు. ఓ రోజు గుండె చటుక్కున ఆగిపోయింది.     ఆయన పోయాకయినా ఓ పట్టాన తన భర్త హరినారాయణ ఇంటి బాధ్యత స్వీకరించిందిలేదు. మామగారు బతికి ఉన్న రోజుల్లో తండ్రి పోరినా ఆయన వ్యాపారంలో చేరి మెలకువలు నేర్చుకోలేదు. చీకూ చింతా లేకుండా తిరిగాడు. ఒక్కడే కొడుకవటం వల్ల తన అత్తకు కొడుకంటే గారాబం. కొడుకుని ఒక్క మాట అననిచ్చేది కాదు ఆమె. మామగారు పోయాక, ఆయన స్నేహితుడు రామానుజరావు తన భర్తకు విజయవాడ మునిసిపాలిటీలో ఓ చిన్న ఉద్యోగమిప్పించాడు. తాము మళ్ళీ విజయవాడకు మారలేదు. గొల్లపూడి నుండే నౌకరీకి వెళ్ళేవాడు ఆయన.     మామపోయాక ఇక అత్తకు తనే ఆలంబన. 'తను ఆ కొంపకు పట్టిన పీడ! దెష్ట! జెష్ట పెద్దమ్మ! తను గృహ ప్రవేశం చేయటం, మామగారు స్మశాన ప్రవేశం చేయటం జరిగింది! తన ఇంటి వటవృక్షాన్ని కూల్చింది కోడలే!' ఈ ఎత్తిపొడుపులు, సాధింపుల్లోనే తను అమలను కన్నది. మనుషుల మధ్య స్నేహం, సౌహార్థం ఎలా ఉన్నా, శరీరాలు దగ్గరైతే సంతానం కలగక పోదు. పిల్ల అచ్చంగా తన అత్తగారిలా ఉండేది. ఆ బుద్ధులు రాకుంటే బాగుండునని తాననుకుంది. పోలికలెక్కడికి పోతాయి! పెరుగుతూ తన అత్తనే తలపించేట్టుగా పెరిగింది అమల. అమల పుట్టిన పదేళ్ళకు జగదీశుడు పుట్టాడు. ఆమెకు పిల్లవాడంటే పడేది కాదు. వాడు తన పోలికట! మనవరాల్ని పొగిడి అందలాలెక్కించేది.
    తన భర్తకిదంతా పట్టేది కాదు. ఆయనకు తన సుఖం, సంతోషం ముఖ్యం! ఎవరెట్లా పోయినా లెక్కలేదు. జీతం ఇంటికి వచ్చేది కాదు. తాగుడూ, పేకాటకూ ఎక్కడి డబ్బు సరిపోయేది కాదు. తనకు మామగారు పెళ్ళప్పుడు పెట్టిన నగలు కూడా ఊడ్చేశాడు. ఇంటికి వచ్చే రోజు వచ్చేవాడు. రాని నాడు లేదు. డబ్బు చాలనప్పుడు తన్ని కొట్టేవాడు. అప్పుడు అత్తగారు సంతోషించేది. "ఇంకా నాలుగు తగలనియ్యి! పీడ ముం..ని! కొంపకు శనిలా పట్టుకుంది. దీని వల్లే మన సంసారం ఈతీరుకు వచ్చింది." అని కొడుకును ప్రోత్సహించేది కానీ, కొడుకు చెడిపోతున్నాడని మాత్రం ఆమె బాధ పడలేదు. దొడ్లో చిక్కుడు పాదుకు పట్టిన చీడను చూసి, "ఈ చీడ - పీడ ఎప్పుడు పోతుందో" అనేది ఆమె. ఆ చీడ - పీడ తనే అని ఆమె ఉద్దేశం. తన్ను హింసించి, కల్గే ఆనందం పట్టలేక ఆమె కూడా ఓ రోజు హరీమంది.

    తన భర్త తద్దినాలు పెట్టేవాడు కాదు. తనామాట చెప్తే, తిట్లు తినడం తప్ప మరో ప్రయోజనం ఉండేది కాదు. అందుకే తనే బ్రాహ్మడిని పిల్చి తన అత్త మామల తద్దినం రోజున స్వయంపాకమిచ్చి, చేతనైన దక్షిణ ఇచ్చి పంపేది. తన భర్తకది ఇష్టముండేది కాదు. "ముండాకొడుకు పోయాడని ఏడిచ్చస్తున్నావే. ఏం మందు పెట్టాడో నీకు! బతికుంటే వాడి దగ్గరే పడుకుని పిల్లల్ని కనేదానివి! వాడిని తల్చుకుంటూ జగదీశుని కన్నావు, వాడా మనిషి పోలికల్లోనే పుట్టాడు. మనిషి పోయినా నాకా దరిద్రం వదల్లేదు. మళ్ళా స్వయంపాకాలూ, దక్షిణలూ అంటూ కొంప గుండం చేశావా, నీ ప్రాణం తీస్తాను" అని కేకలేసేవాడు. 'మరి నీ కూతుర్ని ఎవర్ని తల్చుకుంటూ కన్నాను' అని అడిగే సంస్కృతి తనకు లేకపోయింది.

    పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. చదువుల్లో పడ్డారు. పంట చేతికొచ్చాక ఇంటికి కావలసిన వడ్లు మాత్రం ఉంచి, మిగతావి అమ్మించి తను ఎంతో కష్టం మీద సంసారం నెట్టుకురాగలిగింది. ఊళ్ళోనే తన అన్న రామదాసు ఉండేవాడు కనుక, పంట తన భర్త చేతికి చిక్కకుండా చూసేవాడు. మొదట్లో ఇంటి విషయంలో తన అన్న జోక్యం భర్త కంటగింపుగా ఉండేదికానీ, ఆఫీసులో లంచాలు మరిగాక, తాగుడికీ, పేకాటకూ డబ్బు లభ్యమవటం మొదలయాక పంట విషయం పట్టించుకోలేదు ఆయన.

    అమల టెన్తు క్లాసు పాసయ్యాక పెళ్ళి చెయ్యాలని తను తహతహలాడింది. ఆమె కప్పటికే నాయనమ్మ నేర్పి పోయిన పాటాలు పూర్తిగా నెత్తికెక్కాయి. "మీ అమ్మ నిన్ను ఎదగనివ్వదే, అమ్మా! నీ భవిష్యత్తు నువ్వే చూసుకోవాలి" అన్న తన అత్త మాటలు ఒంట పట్టించుకున్న అమల ఇంటర్ చదవాలని పట్టుబట్టింది. అందుకు తన భర్త వత్తాసు. కాలేజీ ఫీజులు తను కట్టగలదా అని తండ్రీ, కూతురూ ఆలోచించలేదు. మొదటి టరం ఫీజు చెల్లించి కాలేజీలో చేర్పించటంతో ఆయన బాధ్యత వదలి పోయింది. ఆ తర్వాత పుస్తకాలకు, టరం ఫీజులు చెల్లించటానికీ తను ఎన్నో అగచాట్లు పడింది. ఆపిల్లకూడా దేనికీ సర్దుకునేది కాదు. తన డ్రస్సు విషయంలోగానీ, సినిమాలు షికార్ల విషయంలో కానీ రాజీ పడేది కాదు. తనెంత ఇబ్బంది పడినా ఆపిల్లకు లెక్కుండేది కాదు. తనకు కావల్సిన అవసరం తల్లి తీర్చవల్సిందే.
    ఇంటరై, బియస్సీలో చేర్తూనే ప్రేమలో పడింది. ఆ కుర్రాడు చలపతి డబ్బున్నవారి పిల్లవాడే. అతని తండ్రి వ్యాపారి. ఆయనకు తన మామగారు తెల్సు, ఆయన ఎలాంటి వారో తెల్సు. అందుకే ఆయన అమలను తన కోడలిగా చేసుకోటానికి అంగీకరించాడు. కానీ కట్నం భారీగా చదివించక తప్పలేదు. తన మాట ఎవరూ విన్పించుకోలేదు. అప్పటి రోజుల్లో ఎనిమిదేళ్ళ క్రితమే తాము ఐదు లక్షలు కట్నమిచ్చి పెళ్ళి జరిపించారు. పొలం అమ్మాల్సి వచ్చింది. తన భర్తకులెక్కలేదు. అంత పెద్ద కుటుంబంతో వియ్యమందటానికి ఖర్చు కాదూ మరి! పొలం బేరం పెట్టటం, మాట్లాడటంలాంటి పనులు చెయ్యటం ఆయనకు నామోషీ. అందుకు తన అన్న రామదాసును నియోగించాడు.

    కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పటికి పొలం పరాయివారి పాలయింది. కృష్ణకు ఎగువన సుక్షేత్రమైన మాగాణి భూమి. ఎంత కష్టమొచ్చినా దాన్ని అమ్మటానికి తన మామ కూడా సాహసించలేదు. పెళ్ళయ్యాక మళ్ళా కొంపలో దరిద్రం పెనవేసుకు పోయింది. తన అన్న ప్రతి నెలా ఇంతని సాయం చెయ్యసాగాడు. తను ఆయన దగ్గర నుండి తీసుకోవటానికి మొహమాట పడ్తే, "ఇది మీ డబ్బేనే. పొలం ఎనిమిది లక్షలకమ్మాను. ఆరని చెప్తే బావ నమ్మాడు. మొత్తం డబ్బిస్తే అప్పుడే అల్లం బెల్లం చేస్తారని అప్పుడివ్వలేదు. దిగులు పడకు. ఈ డబ్బయ్యేలోపల నీ కొడుకు చేతికక్కరకు రావచ్చు" అన్నాడు.
    కానీ తన దిగులందుకే. కూతురు తన అత్తను పోలింది. తనంటే అసలు లక్ష్యమే లేదు. కొడుకు తండ్రిని పోలితే తనకు చిప్ప చేతికే. ఇంకా వాడు చిన్నవాడు. ఎదిగితే కానీ తెలియదు.     కాలం గడుస్తోంది. సంసారం ఎలా గడుస్తోందని తన భర్త అడిగిన పాపాన పోలేదు. పిల్లవాడు టెన్త్ పరీక్ష పాసయ్యాక, పాలీటెక్నిక్‌లో సీటు లభించింది. కాస్తంత ప్రశాంతంగా జీవితం గడుస్తుందనుకున్న తరుణంలో తన భర్త అరెస్టు అయ్యాడు - లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తను లబోదిబోమంది. ఏంచెయ్యాలో తనకు కాళ్ళు చేతులు ఆడలేదు. తన అన్న రామదాసుకు ఈ కేసుల వ్యవహారం తెలియదు. అల్లుడినీ కూతురినీ అర్థించింది. అల్లుడు డబ్బు, పలుకుబడి ప్రయోగించి ప్రయత్నించాడు. ఎంత ఖర్చయిందో తెలియదు. కేసు లేకుండా బయట పడేయించాడు. కానీ ఉద్యోగం మాత్రం ఊడిపోయింది.     విడుదలై ఇంట్లోకి వస్తున్న ఆయన్ను చూసి, "అయ్యో ఎంత చిక్కిపొయ్యారో!" అని పరామర్శించింది తను.     తన మాటలు ఆయనకెలా ధ్వనించాయో మరి, "జెష్ట పెద్దమ్మా! నిన్ను కట్టుకున్నాక, నాకింతకంటే మేలేం జరుగుతుంది. నా జీవితానికి పీడలా పట్టుకున్నావు. నీవల్లే నేను జైలు పాలయ్యాను" అని తన జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టబోయాడు.     అప్పుడు, జగదీశు అడ్డమొచ్చాడు.

    "అమ్మేం చేసింది. నిన్ను తప్పుడు పన్లు చేసి జెయిలుకు వెళ్ళమందా? అమ్మ ఒంటి మీద చెయ్యి పడితే నేనూర్కోను" అన్నాడు.     "చంపుతా, నా కొడకా! తండ్రినే ఎదిరించే వాడివయ్యావా?"     "నువ్వు తండ్రివా? పందీ కంటుంది. నువ్వూ కన్నావు! ఏవిటీ తేడా?"     ఆ మాటలని జగదీశు బయటాకు వెళ్ళిపోయాడు. కొడుకు చేతిలో అంత మాట పడ్డాక, కూలబడి పోయాడు తన భర్త.     ఇప్పుడు ఆయనకు ఇంటి నుండి బయటకు పోవాల్సిన పని లేదు. తాగుడుకు, పేకాటకు డబ్బులేదు. ఇల్లు అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ మాట ఎలా చేరిందో అల్లుడికి. తన కూతురూ, అల్లుడూ వచ్చారు. అల్లుడు మామగారికి చెప్పాడు, "మీరు విడుదల అవటానికి రెండు లక్షలు ఖర్చయింది. ఈ ఇల్లు మహా అయితే నాలుగు లక్షలు ధర పలుకుతుందేమో. రెండు లక్షలకు వడ్డీ యాభై వేలు. మిగిలిన నూటయాభై మీకిచ్చేస్తాను. ఇల్లు నాపేర రాయండి" అని.     "గొల్లపూడి విజయవాడలో కలిసిపోయిందయ్యా! ఇంత ఇల్లు, వెయ్యిగజాల స్థలం, పెరడు - కనీసం పదిలక్షలయినా చేస్తుంది. మరో మాట చెప్పు" అన్నాడు తన భర్త.     "అంత కంటే రాదు. కావల్నంటే బయటమ్ముకోండి. నా రెండున్నర లక్షలు ఇచ్చెయ్యండి" అన్నాడు అల్లుడు.     భర్త హరినారాయణకు మరో బేరం వచ్చిందాక ఆగే ఓర్పులేదు. తాగుడు లేక ఆయన గొంతు ఆర్చుకు పోతోంది. పేకముక్కలు ఆడక చేతులు మొద్దు పారాయి. ఎవర్నీ సంప్రదించే అలవాటెప్పుడూ ఆయనకు లేదు. ఇల్లు అల్లుడికి అమ్మినట్టు రిజిష్టర్ చేయించేశాడు.     ఇస్తానన్న లక్షన్నర అల్లుడు ఇవ్వలేదు. ఓ పదివేలు చేత బెట్టాడు. "మీకు అవసరమొచ్చినప్పుడడగండి. మొత్తం ఇచ్చేస్తే ఇప్పుడే ఖర్చు చేస్తారు" అన్నాడు. 

    ఏ క్షణానికాక్షణం బతికే మనిషి తన భర్త. ఇవ్వాళ పదివేలు చేస్తిలో ఉన్నాయి - చాలు. అదీ ఆయన తత్త్వం. ఆ పదివేలతో రెండు నెలలు కూడా గడవలేదు భర్తకు. అల్లుడిని ఎన్నిసార్లు డబ్బడిగినా "ఇవాళ రేపూ" అంటూ గడిపేశాడు. "ఇవాళ ఆ సంగతేంటో తేల్చి వేస్తా" అంటూ విజయవాడ వెళ్ళిన తన భర్త హరినారాయణ మర్నాటి మధ్యాహ్నానికల్లా శవమై ఇంటికి వచ్చాడు. అల్లుడిని ఆయన కలిశాడోలేదో, అతను డబ్బిచ్చాడోలేదో తనకు తెలియదు. ఇస్తే ఆడబ్బేమయిందో తెలియదు. డబ్బులేక కల్తీ కల్లు తాగాడట! కల్లుపాకలో ఆయనతో పాటు స్పృహ తప్పి పడిపోయిన పది మందిని పొలీసులు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కల్లుపాక యజమానిని నిర్బంధంలోకి తీసుకున్నార్ట! ఆ పది మందీ మొన్న రాత్రే ప్రాణాలు వదిలరు. పోస్టుమార్టం అయాక పోలిసులు ఆయన శవాన్ని తీసుకువచ్చి క్రితం సాయంత్రం ఇంట్లో పడేశారు. వెంటనే తన అన్న అమలకు ఫోన్ చేశాడు. కానీ, అది భర్తతో పెళ్ళికి అనకాపల్లి వెళ్ళింది. ఫోనందుకున్నాక, పొద్దునకల్లా తన భర్తతో కల్సి వస్తానంది.

    రామదాసు దగ్గరగా రావటం చూసిన భాగ్యలక్ష్మి ఇహలోకంలో పడింది.
    "పొద్దుననగా వస్తానన్నది. ఒంటిగంట అవుతోంది. ఎప్పుడొస్తారో ఏమో - కారు ట్రబులిచ్చిందేమో" అన్నాడు.     "వస్తారులే. నువ్వసలే షుగరు మనిషివి! వెళ్ళి వీధి చివరి హోటల్లో ఎమయినా తినిరా అన్నయ్యా!" అంది భాగ్యలక్ష్మి.     "కానీయ్ చూద్దాం...అంత అవసరమనిపిస్తే తిని వస్తాలే!" అన్నాడు రామదాసు. బావగారి శవాన్ని అక్కడ పెట్టుకుని ఏదైనా తినాలన్నా మనస్కరించలేదు అతనికి.     పల్లెటూరు. క్రితం సాయంత్రం నుండి శవజాగారం చేస్తున్నారు జనం. దహన సంస్కారం పూర్తయితే ఎవరి కొంపలకు వాళ్ళు నిశ్చింతగా వెళ్ళచ్చు. అందుకే వాళ్ళు అసహనంగా అమల రాకకై నిరీక్షిస్తున్నారు.అంతలో జనంలో కలకలం. కారు వచ్చింది. "హరినారాయణగారి కూతురు వచ్చింది. తప్పుకోండి" అంటున్నారు ఎవరో.     ఆమాటలు విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది భాగ్యలక్ష్మి. కారు దిగివచ్చి తన ఎదుట నిలబడింది అత్తగారే అన్నట్లు తత్తర పడిపోయింది భాగ్యలక్ష్మి. తన పెళ్ళయిన కొత్తల్లో తను చూసిన మనిషే, అదే లావు, అదే పొడుగు, అదే నడకతీరు...కూతురు చేతులూపుకుంటూ నడుస్తూంటే అత్తగారు తన మీదకు దండెత్తటానికి వస్తున్నట్టుగానే వుంది.
    కలవరపడుతూ గోడకు జారగిలపడింది భాగ్యలక్ష్మి.

    "మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు కదే...రెండు రోజుల్లోనే ఏమయింది?" అంది విసురుగా కూతురు, తల్లే తండ్రిని చంపినట్లు. ఆ గొంతులో భాగ్యలక్ష్మికి తన అత్త ధ్వనించింది!
    "ఏమోనమ్మా, అంతా నా ఖర్మ! నా తలరాత!" అంది భాగ్యలక్ష్మి చేతుల్తో తన బాదుకుంటూ.     "అమ్మా! ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. పద లోపలకు వెళ్దాం. నీతో మాట్లాడాలి" అంది పక్కగదిలోకి దారితీస్తూ.     'ఎందుకో?' అనుకుంటూ భాగ్యలక్ష్మి లేచి నిలబడింది.     అమల గది గుమ్మం ముందు నిలబడి, "నువ్వు కూడా రారా జగదీశూ!" అని పిలిచింది తమ్ముడిని కూడా.     "వాడెందుకూ చిన్న వెధవ! ఆ చెప్పేదేదో నాకు చెప్పు" అంది భాగ్యలక్ష్మి.     "చిన్నవెధవని కూర్చుంటే అవుతుందా? ఇంక నాలుగు నెలల్లో పద్దెనిమిదేళ్ళు నిండబోతున్నాయి. పాలీటెక్నిక్ పరీక్ష పాసయాడు. ఇంక మీ సంసారాన్ని ఈదాల్సినవాడు వాడే కదా?" అంది అమల. ఆ తర్వాత, "మామయ్యా! నువ్వూ రా" అని రామదాసునీ లోపలికి పిలిచింది.     గదిలోకి వెళ్ళాక ఖిన్నురాలవుతూ,"ఏం మాటలే అవి! మా సంసారమా...?" అంది తల్లి కూతురి వంక చూస్తూ.     "మరి, నా సంసారమా! సెంటిమెంటుకు తావు లేదమ్మా! ప్రాక్టికల్ ఏమిటో అది చూడాలి. ఈ ఇంటిని నాన్న మాకు అమ్మాడు. నీకు తెల్సనుకుంటాను. పత్రాలున్నాయి. అవసర పడినప్పుడు వచ్చి ఆయన దగ్గర డబ్బు పట్టుకెళ్తుండే వాడు. 'విజయవాడలో బిజినెస్ పెంచుకోవాలి, మీరు ఇల్లు ఖాళీ చేస్తే అమ్ముకుంటామ'ని మా ఆయన ఎన్నిసారు చెప్పినా 'ఇదుగో అదుగో' అంటూ తాత్సారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తప్పదు. శవదహన సంస్కారానికి కూడా మీ దగ్గర పైస లేదని నాకు తెల్సు. అంత్యక్రియలు అయాక, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేస్తామంటే, నాకు తోచిన సాయం నేనూ చేస్తాను, కూతురుగా అది నా కనీస ధర్మం!..."     "చేయకుంటే...!" అడిగాడు తమ్ముడు.     "ఆయన కర్మకాండల సంగతి మీరే చూసుకోవాల్సి ఉంటుంది. నేను, ఆయనా ఇప్పుడే వెళ్ళిపోతాం. ఇంటి ఇవాక్యుయేషనుకు ఎప్పుడో డిక్రీ పొందాం. అది ఎక్జిక్యూట్ చేయిస్తాం. ఆ తర్వాత 'అక్క ఇలా చేయించింది' అని నన్నాడి పోసుకుని లాభంలేదు. ఎవరి బతుకు వారిది. మీతోపాటు నేనూ మునగలేను కదా!"

    "నిజమే. సరే, ఎంత సాయం చేస్తావేం?"
    "అరవై వేలు. ఆయన ఎవరికీ అన్యాయం చెయ్యని మనిషి! అంతా లెక్క రాసి పెట్టారు."     "సరే, ఆ లెక్కలేవో చూపించు. నాకు సరి అనిపిస్తే, శవదహనమైన మరుక్షణం మేం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం."     ఆ అక్క, తమ్ముళ్ళ మాటలు వింటున్న రామదాసుకు మతి చలించినట్లయింది.     అమల తన చేతిలో ఉన్న నోటుబుక్కును, ఇతర కాయితాలను తమ్ముడికిచ్చింది. అతను తీరిగ్గా వాటిని పరిశీలించసాగాడు. తండ్రి తన బావగారి దగ్గర తీసుకున్న లెక్క చూశాడు. గడచిన రెండేండ్ల కాలంలో, ఇంటిని తాకట్టు పెట్టి హరినారాయణ అల్లుడి నుండి అవసరపడినప్పుడల్లా పైకం అప్పు తీసుకునేవాడు, చివరకు అల్లుడికే ఇల్లు అమ్మేశాడు.
    "ఇల్లు నాన్న స్వార్జితం కాదు, తాతది. కనుక, ఆయనకు దీన్ని తనకిష్టమొచ్చినట్లు అమ్ముకునే హక్కులేదు. ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బులో మిగిలింది లక్షన్నర. అందులోనూ ముప్పైవేలు అప్పుడప్పుడు తీసుకున్నాడు. మిగిలింది లక్షాఇరవై. నాన్న పోయారు కనుక, మూడు భాగాలు చేశారు మీ బావగారు. అమ్మకు, నీకు, నాకు తలా ఒక భాగం. నా వాటా ముప్పైపోనూ, మీ వాటా అరవైవేలు మిగులుతుంది. అదిస్తాం. లెక్క చూసుకో, అంతా సరిగ్గానే ఉంది. నువ్వు మైనరువు కనుక ఇంటి అమ్మకానికి నీ సంతకం అవసరం లేకపోయింది" అంటూ అక్క తమ్ముడికి లెక్కల వివరాలు చెప్పసాగింది.

    "మేం ఇప్పుడు ఇల్లు ఖాళీచేసి వెళ్ళేస్థితిలో లేం. నా వాటా డబ్బు నాకిస్తే అంత్యక్రియలకీ, నాలుగు రోజుల జరుగుబాటుకూ పనికి వస్తుంది" అన్నాడు జగదీశు.
    ఆ మాటలకి గయ్యిమని లేచింది అమల. "ఖాళీ చెయ్యమంటే కుదర్దు. ఇదే మీ అభిప్రాయమైతే, మేం ఈ క్షణం వెళ్ళిపోతాం. మీ చావు మీరు చావండి...శవాన్ని తగలేసుకుంటారో, మునిసిపాలిటీ బండిలో పడేసి ఈడ్చుకెళతారో మీ ఇష్టం! 'మా వాళ్ళ జోక్యం మనకొద్దండీ, ఆ సంతతో మనం వేగలేం' అని ఆయనతో అప్పుడే మొత్తుకున్నాను. వినలేదు ఆయన...తప్పుడు పన్లుచేసి జైళ్ళకెళ్తే మా సాయమే కావాలి. అప్పులూ మేమే పెట్టాలి...కారు చెడిపోయింది. దాన్ని బాగుచేయించుకుని వచ్చేటప్పటికి ఎంత హైరాన పడాల్సి వచ్చింది. తీరా వస్తే అనే మాటలు ఇవి..." అని రబ్బసాగింది.

    "అవేం మాటలే అమ్మాయి! మీ నాయనకు నువ్వు తప్ప ఎవరు చేస్తారు. వాడా ఇంకా చిన్నవాడు. పెద్ద పిల్లవు, నీకు తప్పుతుందా?" అన్నాడు రామదాసు కల్పించుకుంటూ.
    "మరి చూడు, మామయ్యా! నేనేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నాడు, వెధవ! ఇల్లు అమ్మేశాక పరాయి వాడెవడయినా ఇన్ని రోజులు ఉండనిస్తాడా? నేను అయిందాన్ని కాబట్టి ఊరుకున్నాను. ఇవాళ పేపరులో చూడలా... కల్తీ సారా తాగి చచ్చినవాళ్ళందరి కుటుంబాలకూ ప్రభుత్వం తలా లక్షా ఇస్తుందట! న్యాయంగా నాకూ దాంట్లో భాగం రావాల్సి వున్నా, మంచిదాన్ని కాబట్టి నేను అడగటం లేదు... వాళ్ళనే... వాళ్ళనే అనుభవించనీ అని ఊరుకున్నాను..."     "సరే, ఇల్లు ఖాళీ చేస్తాం. లెక్కలు బాగానే ఉన్నయ్యి! నీ సాయంగానీ, నీ దయగానీ మాకేం అక్కర్లేదు. మా వాటా ఆ అరవై వేలూ ఇచ్చేస్తే, ఇవాళ దహనం, ఎల్లుండి అస్థి సంచయనం, నిమజ్జనం పూర్తి చేసి వెళ్ళిపోతాం" అన్నాడు జగదీశు.          "అదేం మాట! మామగారి కర్మకాండ పూర్తయే వరకు ఉండండి. మేమేం హడావుడి చెయ్యటం లేదు" అన్నాడు అప్పుడే లోపలకు ప్రవేశించిన బావగారు.     "కానీ కర్మలు చేయగలిగే స్తోమత లేదు మాకు. తప్పదు కనుక, దహన సంస్కారం చెయ్యటమే."     "అవేం అప్రాచ్యపు మాటలురా?!"అన్నాడు మేనమామ రామదాసు.     "స్తోమతును మించి ఖర్చు చేయలేం కదా, మామయ్యా! అప్పుచెయ్యాలి. మాకు అప్పెవరిస్తారు? పైగా అప్పుచేసి నమ్మకంలేని కర్మకాండలు జరపాల్సిన అవసరం నాకు లేదు. తాహతు లేదు కనుక అమ్మ కూడా అంగీకరించక తప్పదు..."

    "ప్రేత సంస్కారం జరగకపోతే ఆ జీవుడు స్వర్గానికీ, నరకానికీ కాకుండా అలమటిస్తాడు. నీకివ్వాల్సిన అరవై వేలూ ఇప్పుడే ఇచ్చేస్తాను" అంది అమల.
    "అదెలాగో తప్పదులే. బావగారూ, నువ్వూ మాత్రమే న్యాయంగా ప్రవర్తించే మనుషులు కాదు. అమ్మా, నేనూ కూడా న్యాయంగానే ప్రవర్తిస్తాం. అమ్మకు ఆ నమ్మకాలు ఉన్నాయి కనుక, ఆమె సెంటిమెంటును గౌరవిస్తూ కర్మకాండలు జరుపుతాను. నీ సెంటిమెంటును గౌరవిస్తూ కాదు. నువ్వు భాగస్వామివి. ఆస్తిలో భాగం పంచుకున్నావు. ఖర్చులోనూ భాగం పంచుకోక తప్పదు. అయితే, నువ్వు కోరేది జరగాలంటే నీకు నా సహకారం తప్పదు. హిందూ మతం ప్రేత సంస్కార క్రియలన్నీ కొడుక్కే దఖలు పరిచింది. కనుక, నేనే చెయ్యాలి. నాకు నమ్మకం లేదు కనుక చెయ్యను. నేనడిగిన కిరాయి ఇస్తే చేస్తాను. కిరాయి బ్రాహ్మడిని పెట్టుకున్నా పదివేలు డిమాండు చేస్తాడు. నేనయితే శ్రేష్ఠం. అమ్మ సెంటిమెంటును గౌరవిస్తూ ఓ అయిదు వేలు తగ్గించుకుంటాను. ఖర్చుమాత్రం మొత్తం నీదే. నేను పెట్టను. పెట్టే స్తోమత నాకు లేదు. నా డబ్బిచ్చెయ్యి. మా అరవై వేలూ ప్లస్ కూలీ అయిదు వేలూ - మొత్తం అరవై అయిదు. పని మొదలు పెడతాను" అన్నాడు జగదీశు.     "ఛీ,ఛీ! మీ అక్కా, తమ్ముళ్ళ మాటలు వింటుంటే నాకు డోకు వస్తున్నదయ్యా! శవాన్ని అక్కడ పెట్టుకునేనా ఈ మాటలన్నీ?" అన్నాడు బావగారు.     "మా అక్క ప్రాక్టికల్ మనిషి! ఆమె సెంటిమెంటును గౌరవించవద్దా, బావగారూ!" అన్నాడు జగదీశు.     "ఇంకా నయం! అమ్మ పోషణ క్రింద నన్ను వాటా వెయ్యమనలేదు" అంది అమల ముఖం గంటు పెట్టుకుని.     "అడగాల్సిందే. కానీ అడగను. అమ్మను పోషించటానికి నువ్వేమిస్తావని అడగటం ఆత్మ ద్రోహం. మనమేదో చేస్తామని ఆమె మన్ని కని పెంచి పెద్ద చేయలేదు. ఆమె చేసింది ఆమె చేసింది. నేను చేయాల్సింది నేను చేయాలి."     కొడుకు వంక స్వాంతనగా చూసింది భాగ్యలక్ష్మి.
    "అదేం గొప్పకాదులే! తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఎప్పుడూ కొడుకులదే. ఖర్మ కాలిన వాళ్ళే కూతుళ్ళ కొంపలకొస్తారు..."

    "సరే, ఈగోలంతా ఎందుకూ, నిన్నేం అమ్మను ఉంచుకోమనలేదుగా? డబ్బు పడెయి, ఏర్పాట్లు చూడు. చెయ్యి తిప్పడమే నా పని."
    "ఏమిటలా కాబూలివాడిలా 'డబ్బు డబ్బ'ని వెంట పడతావు! మా మీద అంత నమ్మకం లేదా?"     "డబ్బు దగ్గర నమ్మకం పనికిరాదని నువ్వే చెప్పావు. నువ్వు చూపించిన లెక్కల్లో ఆయన ఎంత తీసుకున్నాడో, నువ్వెంత రాసుకున్నావో ఆయన ఇప్పుడు లేచొచ్చి చెప్పలేడుగా?" ఆ మాటతో అమలకు తమ్ముడిని మింగేయాలన్నంత కోపం వచ్చింది.     "ఆ డబ్బేదో వాడి మొహాన కొట్టండి" అని మొగుడికి చెప్పి, "దరిద్రుడు! దౌర్భాగ్యుడు! వీడు పుట్టాకనే కొంపకు దరిద్రం పట్టుకుంది" అని చీదరించుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.     అమల భర్త లెక్కపెట్టి అరవైఅయిదువేలూ ఇవ్వబోతే, "మా మామయ్యకివ్వండి బావగారూ! ఆయన డబ్బు భద్రం చేస్తాడు" అన్నాడు జగదీశు. ఆయన డబ్బు ఇచ్చి బయటికెళ్ళిపోయాక, "ఆ అరవై వేలతో ఎలారా బతకటం! మీ నాయనేమో...!"     "వద్దమ్మా! మన దౌర్భాగ్యానికి ఎవర్నో నిందించి ప్రయోజనం లేదు. ఆ డబ్బు తీసుకుని హైదరాబాదు వెళ్దాం. మమ బతుకు ఎలా ఉందో పరీక్షించుకుందాం. ఏమంటావు, మామయ్యా!" అన్నాడు జగదీశు.     "నిజమేరా, మీతాతలా మాట్లాడావు. నాకు సంతోషమేస్తోంది. పద బ్రాహ్మడు వచ్చినట్లున్నాడు. ఆ ఏర్పాట్లు చూదాం లే" అన్నాడు రామదాసు.     "అవసరమొచ్చినప్పుడు, కఠినంగా మాట్లాడక తప్పదు, మామయ్యా! నువ్వేమనుకోవద్దు. ఇంక మిగిలింది ప్రేమా ఆప్యాయతలూ కాదు, కర్మకాండే! మంచీ, మర్యాదా, సంస్కారాలు లేవు. మిగిలిందల్లా అంతిమ సంస్కారం పట్ల నమ్మకం. అది జరక్కపోతే మనకేమన్నా పీడ పట్టుకుంటుందేమో నన్న భయమూ మిగిలింది" అన్నాడు జగదీశు మేనమామతో బయటకు వెళ్తూ.

    గదిలో చీకటిగా వుంది. ఎదురుగా మామగారి ఫోటో ఉంది. ఆయన అందులోనుండి మాట్లాడుతున్నట్లు అనిపించింది.
    "భయపడకు. మేం ఎక్కడకూ పోలేదు. ఆత్మవత్ పుత్రనామాసి. పోయిన వాళ్ళు పుత్రపౌత్రుల్లో సజీవంగానే ఉంటారు. నిన్నంతా 'చీడ-పీడ' అన్నారు. నువ్వు ఇతర్లను 'పీడ' అనుకుంటూ బతికావు. నీ మొగుడి చావుతో 'పీడ' పోయిందనుకున్నావు! నీ బతుకు నుండి ఎదగటానికి నువ్వేం ప్రయత్నించావమ్మా?" అని ఆయన ప్రశ్నించినట్లయి ఉలిక్కి పడింది భాగ్యలక్ష్మి.     "ఏం ప్రయత్నించాలన్నా కొత్త మార్గం వెతుక్కోవాలి. బతుకు సగమయాక, కొత్తగా ఏం నేర్చుకుంటాం మామగారూ!" అంది ఆమె.     "అవసరం పడినప్పుడు నేర్చుకోక తప్పదు. బతుకొక్క తీరునే ఉండదు. అంతా అయాక నేను ప్రయత్నించబోయాను. సమయం లేకపోయింది. వెళ్ళిపోవల్సి వచ్చింది. పీడ ఎక్కడో లేదు. మన ఆలోచనల్లోనే ఉంది. క్రియాశీలమైన ఆలోచనతో, ప్రవర్తనతో పీడ తొలగిపోతుంది" అన్నాడు ఆయన.     భాగ్యలక్ష్మి సంభ్రమంగా తన్ను తాను మర్చిపోయి కూర్చుండి పోయింది. 'తన అత్త, మామ చని పోలేదు. తన సంతానంలో ఆ పోలికలు, మనస్తత్వాలు జాగృతమయ్యే ఉన్నాయి. తన బతుకు తను ఇప్పటికయినా బతకటం మొదలెట్టాలి' అనుకుంది భాగ్యలక్ష్మి. అంతలో మళ్ళా ఆమెకు తను, తన భర్త గుర్తుకు వచ్చారు. తామెక్కడున్నారు పిల్లల్లో...?     బయట బ్రాహ్మడు వచ్చి దహన సంస్కారానికి ప్రారంభం పలకటంతో భాగ్యలక్ష్మి ఆలోచనలు భగ్నమయాయి.
    ఇంటా, బయటా ఎవరూ పోయిన మనిషి కోసం దుఃఖపడలేదు. శవదహనమైతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అందుకే ఆ హడావుడి అంతా!
(మల్లెతీగ మాస పత్రిక, ఆగష్టు,2009 సంచికలో ప్రచురితం)
Comments