శాపగ్రస్తుడు - కల్పనాకిరణ్

    నిశిరాత్రి...


    నారాయణగూడ నాలుగు కూడళ్లు కలిసే రోడ్డు నర సంచారం లేకుండా ప్రశాంతంగా ఉ ంది. ఫుట్‌పాత్‌ పై పడుకుని ఉన్న అభాగ్యులు ఆదమరచి నిద్రపోతున్నారు.


    నిశ్చబ్దాన్ని ప్రశాంతతని భంగపరుస్తూ వాయువేగంతో టాప్‌లెస్‌ కారొకటి రయ్యిమని దూసుకెళ్లింది.


    చప్పుడుకి నిశ్చంతగా నిద్రకి ఉపక్రమించిన ఫుట్‌పాత్‌పై పడుకున్న వాళ్లలో యాదయ్య ఉలిక్కిపడి లేచాడు. ఎవరో భుజం తట్టి లేపినట్లుగా లేచి కూర్చున్నాడు. హఠాత్తుగా మేల్కొనడం వల్ల కళ్లు చింత నిప్పుల్లా ఉన్నాయి. చుట్టు పక్కల బిత్తర చూపులు చూశాడు. రోడ్లు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు అనిపించింది. ప్రతి రోజు తనతో పడుకునే తన బోటి అర్భకులు గురకలు పెడుతూ నిద్రపోతున్నారు.

    

    నిర్మానుష్యంగా ఉన్న తారురోడ్లు.. జన సంచారం లేని కాలం... రెండూ తన మదిలో నిలిచిన .. మధ్యాహ్నం మార్కెట్‌ సందుల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు చూసిన గుండ్రటి వస్తువుని జ్ఞప్తికి తెచ్చింది. ముఖంలో సంతోషం నక్షత్రంలా మెరిసింది.


    యాదయ్య ఆ వస్తువుని అప్పుడే తెచ్చుకోవచ్చు. కానీ జన సంచారం తిరుగుతోంది. దాన్ని దక్కించుకోవాలంటే ఇదే అనువైన సమయం అనిపించింది.


    ఊహల్లో మెదులుతోంది. రా రమ్మని ఊరిస్తోంది. సొంతం చేసుకొమ్మని ఉసిగొల్పుతోంది. వెళ్లాలా వద్దా? తీరా అక్కడికెళ్లాక అది లేకపోతే? అంతలోనే నిరాశ... ఆశ వెనువెంటనే చుట్టుముడుతున్నాయి. మదనపడిపోతున్నాడు ఎటూ తేల్చుకోలేక! ఆశే గెలిచింది. వెళ్లాలని నిర్ణయానికొచ్చాడు. యాదయ్య ఇక ఉండలేకపోయాడు. మార్కెట్‌ సందులోకి తక్షణమే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పైకి లేచాడు. లేచినంత వేగంగా ధడేలుమని నిల్చున్నచోటే కిందపడిపోయాడు. లిప్తకాలం అర్థం కాలేదు తన సామర్థ్యం మీద. అప్పుడు గుర్తొచ్చింది.


    రెండు రోజులుగా తన శరీరాన్ని అంటిపెట్టుకున్న జ్వరం కారణమని! ఒళ్లు సలసల కాలిపోతోంది. అడుగులు ముందుకు వేసే పరిస్థితి లేదనిపించింది. నీరసంగా ఉంది. అయినా పర్వాలేదు. వెళ్లాలి. ఆ వస్తువుని పొందడం ఎంతో ముఖ్యం. ధైర్యం తెచ్చుకుని మళ్లీ పైకి లేవడానికి ప్రయత్నించాడు. ప్చ్‌... ఒంట్లో శక్తి సహకరించట్లేదు. నీరసం చుట్టుకుని ఉంది. కదలనివ్వడం లేదు. కళ్లముందు తన అవసరం తీర్చే వస్తువు మళ్లీ కదలాడింది. ప్రాణం వచ్చినట్లుంది. ప్రయత్నం విరమించుకోదలచలేదు. గుండెల నిండా గాలి పీల్చి శరీరంలోని శక్తినంతటిని కూడగట్టుకుని లేచి నిలబడ్డాడు. అనారోగ్య కారణంగా లేని బలాన్ని తెచ్చుకోవడం వల్ల నిలబడ్డ చోటే తాగుబోతులా ముందుకి వెనక్కి తూలుతున్నాడు. యాదయ్యకి ఇంతకమునుపు కన్నా ఇప్పుడు కాస్త ఆనందం ఎక్కువైంది.


    తను నిలబడగలిగాడు. ఆత్రుత మొదలైంది. ఎలాగైనా తను చూసిన వస్తువుని కైవసం చేసుకోవాలని. అందుకోగలనన్న నమ్మకం ఏర్పడింది. అడుగు తీసి అడుగు వేయడం ప్రారంభించాడు. ఒంట్లో బలాన్ని కాళ్లలోకి చేర్చి తప్పటడుగులు వేస్తూ కదులుతున్నాడు. అడుగులు పడేకొద్దీ చెప్పలేని సంతోషం! ఎలాగోలా ఆ మార్కెట్‌ సందులోకి చేరుకోవాలన్న సంకల్పం తప్ప మరోటి లేదు మస్తిష్కంలో. లేని సామర్ధ్యాన్ని తెచ్చిపెట్టుకుని వడివడిగా నడుస్తున్నాడు. దూరం తరిగే కొద్దీ మది ఆనంద తాండవం చేస్తోంది. ఉత్సాహం, ఆశ నడిపిస్తోంది. కాసేపట్లో తన అవసరం తీర్చే దాన్ని సొంతం చేసుకోబోతున్నాడు. అది అతనికి చాలా అమూల్యమైనది. ఆత్రుత... సంతోషం ఉధృతం అవుతోంది.


    రెండు... మూడు మలుపులు కూడా తిరిగేశాడు. యాదయ్య కుతూహలంగా నడుస్తున్నాడు. పోలీస్‌జీపు యాదయ్య వెళ్లే వీధిలోనే అల్లంత దూరంలో సైరన్‌ ఇస్తూ తేరులా కదులుతూ వస్తోంది. వాళ్లు నైట్‌ బీట్‌ పోలీసులు. యాదయ్య జీపు రావడం గమనించాడు. గుండెలు దడదడలాడాయి. ప్రాణాలు గాలిలో ఆవిరైనట్టుంది. కొయ్యబొమ్మలా స్థంభించిపోవడమే కాకుండా నిస్తేజంగా అయిపోయాడు.


    ''అమ్మో పోలీసులు...'' మెదడు మొద్దుబారిపోయింది. ఇప్పుడు పూర్వం ఉన్న ఆనందం లేదు. ముఖం భీతితో నిండిపోయింది. పోలీస్‌ వాహనం దగ్గరవుతున్న కొద్దీ వెన్నులోంచి భయం పుట్టుకొచ్చింది.


    ఇప్పుడు గానీ పోలీసులు ఈ రాత్రివేళ చూస్తే ఇంకేమయినా ఉందా? భయంతో కంపించిపోతున్నాడు. ఆలోచనలు రావడం లేదు. తైల సంస్కారం లేని చింపిరి జుట్టు. ఎముకల గూడులా ఉన్న శరీరం... పీక్కుపోయిన ముఖం.. చిరిగిపోయి మాసిపోయిన బట్టలు, ఈ అవతారంతో చూస్తే దొంగ కింద లెక్కకట్టి కటకటాల్లో కూర్చోబెడతారు. అప్పుడు తను సొంతం చేసుకోవాలనుకున్న వస్తువు చేజారిపోవచ్చు. ఈ పోలీసులు తన ప్రయత్నాన్ని ఆపడానికి వస్తున్నట్లు అనిపించింది. వాళ్లు తీసుకోబోయే చర్యలు తలచుకోగానే ఒళ్లంతా చెమటలు పట్టేసింది. ఈ సమయంలో ఏం చెప్పినా తన అవతారాన్ని చూసి నమ్మకుండా ఇక్కడికిక్కడే లాఠీత్తో చితక్కొడతారు. కొడితే కొట్టారు.. తన అవసరం తీర్చే వస్తువు చేజిక్కించుకున్నాక కొట్టినా పర్వాలేదు. ముందుగానే ఏ ఉపద్రవం రాకముందే జాగ్రత్త పడాలనిపించింది. ఆదుర్దాలోంచి తేరుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. పోలీస్‌ జీప్‌ దగ్గరవుతోంది. చుట్టు పక్కల పరికించి చూశాడు. రెండు అడుగుల దూరంలో మునిసిపాలిటీ కుప్పతొట్టి కనిపించింది. మరో క్షణం ఆలస్యం చేయకుండా అందులోకి దూకేశాడు. పోలీస్‌ జీపు ఏనుగులా ముందుకు వస్తోంది. అది దగ్గరయ్యే కొద్దీ దాక్కున్న యాదయ్య భయంతో బిక్కచచ్చిపోతున్నాడు. లేని బాధల్లా ఒకటే. తన దారికి అడ్డు వస్తారనే భయం తప్ప మరొకటి లేదు.


    పోలీసులు డేగ కళ్లేసుకుని అన్ని వైపులా పరిశీలనగా చూస్తూ వస్తున్నారు. యాదయ్య కంగారు మరింత ఉధృతమవుతోంది. వణికిపోతున్నాడు. జీపు సరాసరి వచ్చి యాదయ్య దాక్కున్న కుప్పతొట్టి వద్ద ఆగింది. గుండె మరింత దడదడలాడింది. కుప్పతొట్టిలో ఎటువంటి కదలికలు లేకుండా బిగుసుకుపోయి కూర్చున్నాడు. ఆ కుప్ప తొట్టిలో రకరకాల కుళ్లు పడేసి ఉన్నాయి. ఆ వాసన భరింపరానిదిగా ఉంది. అయినా యాదయ్య భరిస్తున్నాడు. నీచమైన కుళ్లును, వాసనను తమాయించుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. మెదడులో ఒక్కటే ఆలోచన. తను అనుకున్నది దక్కించుకోడానికి ఎంతైనా భరిస్తాను అన్న భావన అతనిలో ఉంది. మరొకరైతే ఊపిరాడక తల్లడిల్లి చచ్చేవారు.


    పోలీసులు అక్కడ్నుంచి వెళ్లే వరకు ఓర్మితో ఉంటే అక్కడ్నుంచి సునాయాసంగా వెళ్లిపోవచ్చు అనిపించింది.


    వాసనకి ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. అది భరించలేకే కాబోలు అక్కడ్నుంచి కదిలారు. జీప్‌ కదిలి ముందుకు వెళ్లే చప్పుడు విన్నాడు. క్రమేపీ దూరం అవుతోంది. అది తనకి దూరం అవుతుందని గ్రహించాడు. పూర్తిగా దూరం అయిందని నిర్ధారణకొచ్చాకే ఆ కంపులో నుంచి బయటకొచ్చాడు. కడుపులో వాసన మెలిపెట్టినట్లుంది. వాంతి వచ్చినంత పనయ్యింది. బలంగా నిట్టూర్చాడు పరిస్థితిని తేలికగా చేసుకోవడం కోసం. పాదాలు గమ్యం వైపు పయనమయ్యాయి.


    ఇప్పుడు పడ్డ కష్టం ఇంకాసేపట్లో మబ్బులా తొలిగి సంతోషం ఇస్తుంది అని తలుచుకోగానే ముఖం మతాబులా వెలిగిపోయింది. దూరం మరింత దగ్గరయిపోతుంది. తను చేరాల్సిన మార్కెట్‌ సందు మొదలుకి వచ్చేశాడు. ఆ సందంతా చీకట్లో ఉంది. ఒక్కసారి ఆయాసం అంతా ఎగిరిపోయింది. సందు చివర వరకు చీకటి కమ్ముకుని ఉంది. మెల్లగా అడుగుదీసి చప్పుడు చెయ్యకుండా వెళ్తున్నాడు.


    చీకట్లో అడుగులు ముందుకు పడేకొద్దీ యాదయ్యలో ఉద్వేగం, ఉద్విగత రెట్టింపు అవుతోంది. కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ ముందు ఆగాడు. కరెంట్‌ తీగల రాపిడికి నిప్పులా కరెంటు రాజుకుంటోంది. మిణుకు మిణుకుమంటూ వెలుగులీనుతోంది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఆనుకుని ఉన్న చిన్న మురికి కాలువ మీద గుండ్రటి ఆకారంలో యాదయ్య ఆశించిన వస్తువు కనిపించింది. యాదయ్యకి ఆత్రుత, ఆనందం ఎక్కువైంది. తన నమ్మకం వమ్ము కాలేదు. సంభ్రమాశ్చర్యంతో వంగి కాలువ మీద పడివున్నదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మృదువుగా, కాస్తంత బరువుగా, అరచేతి పరిమాణం కన్నా కాస్త ఎక్కువగా నిగనిగలాడుతూ కనిపించిన దాన్ని చూసుకున్నాడు.


    యాదయ్య ఇంత దూరం వచ్చింది దీని కోసమే. కుళ్లు కంపులో, బాధని భరించింది దీనికోసమే. పోలీసులకి చిక్కకుండా తప్పించుకుంది దీనికోసమే. తన అవసరం తీర్చేది ఇది. తన ఆకలి తీర్చేది. ఆ ఎర్రటి ఆపిల్‌! ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఉబ్బితబ్బిబ్బయి పోతున్నాడు. ఆ ఆపిల్‌ వల్ల తన ఆకలి తీరబోతుందన్న సంతోషం ఉంది తనలో. రెండు చేతులతో మురిపెంగా చూసుకుంటున్నాడు. ఆపిల్‌ కాయని! రెండు రోజులుగా తిండిలేదు. పెట్టేవారూ లేరు. తెగిన గాలిపటం లాంటి జీవితం యాదయ్యది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సిగెల్‌ దగ్గర చేతి రుమాలు అమ్మేపని. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. జ్వరం రావడంతో పన్లోకెళ్లి రెండు రోజులయింది. తన గురించి పట్టించుకునే వాడే లేడు ఈ భూమ్మీద.


    ఎంతో ఆకలితో ఆశగా నోరు తెరిచి నిప్పులా రేగే ఆకల్ని ఆర్పడానికి ఆపిల్‌ని కొరకబోయాడు. చీకట్లో ఎక్కడ్నుండి వచ్చిందో కానీ యాదయ్య వీపుమీద బలమైన దెబ్బ ఒకటి పడింది దుడ్డు కర్రతో. వెన్ను విరిగినంత శబ్దం వచ్చింది. ఒక్కసారిగా కిందపడిపోయాడు. చీకట్లో ఆ వ్యక్తి యాదయ్యని దుడ్డు కర్రతో బలం కొద్దీ కొడుతున్నాడు. అయినా యాదయ్య ఏ మాత్రం అరవకుండా నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. యాదయ్య సంతోషం ఒక్కసారిగా పటాపంచలైంది. గాభరా పడిపోకుండా తప్పించుకోడానికి రెండడుగులు వేశాడు. చీకట్లో పారిపోకుండా ఆ వ్యక్తి యాదయ్య చొక్కా పట్టుకుని డొక్కలో నాలుగు దెబ్బలు, మోకాలుమీద పది దెబ్బలు కొట్టాడు. అమ్మా! అని గానీ, అయ్యా అని గానీ దెబ్బలకు మూలుగు కానీ రాలేదు. తనకు తన ఆకలి బాధ తప్ప మరేమీ కనిపించట్లేదు. దెబ్బలని భరిస్తున్నాడు. కొట్టేవ్యక్తి అసహనంగా మండిపడుతూ ''ఏంరా.. లండీ కొడకా! ఇక్కడేం చేస్తున్నావురా? షాపులకి కన్నాలు వేయడానికొచ్చావా?'' అని బలమైన పిడిగుద్దులు గుద్దుతున్నాడు. అయినా ఉలుకూ పలుకూ లేకుండా దెబ్బలు తింటున్నాడే కానీ ఎదుర్కొనే ప్రయత్నాలేం చేయడంలేదు.


    అవతలి వ్యక్తి మరింత రెచ్చిపోతూ 'అరే రాస్కెల్‌ నా మటుకు నేను వాగుతుంటే మౌనంగా ఉన్నావేంట్రా బాడ్కోవ్‌. ఒంటిమీద దెబ్బలు అంత బాగున్నాయా?'' కోపంగా అంటున్నాడు. యాదయ్యని అన్నేసి మాటలు అంటున్నా నోరు మెదపకపోవడానికి కారణం వుంది. అతను అనాథ మాత్రమే కాదు, నోరు లేనివాడు కూడా. యాదయ్యని ఆ దెబ్బలు బాధించడం లేదు, ఆకలి బాధిస్తోంది. ఆకలి తీర్చుకోవడం కోసం అక్కడ్నుంచి ఇక తప్పించుకోవడం అవసరం లేకపోతే ఆకలి తీరేలా లేదని అర్థమైపోయింది.


    ఎదుర్కోక తప్పదని, బలంకొద్దీ అతన్ని కొట్టే వ్యక్తిని ఒక తోపు తోశాడు. అతను దూరంగా వెళ్లి కింద పడ్డాడు. కింద పడ్డ వ్యక్తి అవమానం తట్టుకోలేకపోయాడు. కోపం తారాస్థాయికి చేరుకుంది. తోక తెగిన కోతిలా రెచ్చిపోయాడు. పైకి లేస్తూ 'అరే బద్మాష్‌! పోలీసోడ్నే కింద పడేస్తావురా! నీ అంతు చూస్తా ఇవాళ. దొంగతనం చేయడానికి వచ్చిందే కాకుండా నన్నే పడేస్తావురా'' తీవ్రంగా అరిచాడు.


    యాదయ్యకి అప్పుడు కానీ అర్థం కాలేదు... తను నెట్టింది ఒక పోలీసోడ్నని. భయం మొదలయింది. పోలీస్‌ యాదయ్య చొక్కా పట్టుకున్నాడు. తప్పించుకోవడానికి పెనుగులాడుతున్నాడు.


    గుంజులాటలోంచి యాదయ్య తప్పించుకుని అక్కడ్నుంచి పరుగు లంకించుకున్నాడు. దొరికితే కాళ్లు చేతులు విరగ్గొడతాడు పోలీసోడు. పారిపోవాలి... దూరంగా.. చాలా దూరంగా వెళ్లి ఆకలి తీర్చుకోవాలి. ఆలోచనలు పరిగెడుతున్నాయి తన పరుగులాగే. ఒక మలుపు కనిపించింది. ప్రవేశించాడు. పోలీసోడి బూట్ల చప్పుడు వినపడింది. కంగారు మరింత ఎక్కువైంది. యాదయ్య పరిగెడుతున్నాడు. ఏ మలుపు తిరిగినా పోలీసోడు వెంట పడడం మానలేదు. ఏ సందులో పరుగెడుతున్నా అవే బూట్ల శబ్దం. తనని పట్టుకోడానికి. ప్రాణం బిగపట్టుకుని పరుగెడుతున్నాడు. ఆకలి తీర్చుకోడానికి. తన ఒంట్లోకి శక్తి ఎలా వస్తుందో అర్ధం కావట్లేదు యాదయ్యకి. అలా ఎంత దూరం పరుగెత్తాడో తనకే అర్ధం కావట్లేదు. చాలా దూరం వచ్చేశాడు. మళ్లీ బూట్ల శబ్దం తనని వెంటాడడం మొదలైంది. ఈసారి పోలీసోడు పట్టుకోలేనంత దూరంగా పరుగెత్తాలని బలంగా నిర్ణయించుకుని, కాళ్లల్లోకి శక్తిని తెచ్చుకుని పరుగెడుతున్నాడు. సరిగ్గా ఓ మలుపు తిరిగే దగ్గర కాంతి కళ్లను కప్పేసింది. తేరుకోడానికి కళ్లకడ్డుగా చేతులు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కాంతి లేదు. పరుగెత్తాలి... పరుగెత్తాలి... దొరకకూడదు.. అని వేగంగా పరుగులు తీస్తున్నాడు.


    చాలా దూరం వచ్చేశాడు. మనసుకి, శరీరానికి ప్రశాంతంగా చల్లగా ఉంది. ఇంతకు ముందున్న భారం లేదిప్పుడు. తేలికగా ఉంది శరీరం. అలుపు లేదు. ఆయాసం లేదు. ఇప్పుడు పరుగెత్తడం లేదు. నడుస్తున్నాడు. దూరంగా సిమెంట్‌ చప్టా కనిపించింది. ఇక పోలీసోడు ఇక్కడికి రాడు. నిశ్చింతగా ఇక్కడ కూర్చొని ఆకలి తీర్చుకోవచ్చని వెళ్లి చప్టా మీద కూలబడ్డాడు. ఎంతో ఆబగా ఆపిల్‌ కాయ కోసం చూశాడు. తన చేతుల్లో లేదు. ప్యాంట్‌ జేబులో చూసుకున్నాడు. లేదు!


    పిచ్చిపట్టినట్లయింది. తను ఇంత కష్టపడింది ఆ ఆపిల్‌ కోసమే! వెర్రివాడులా వెతికాడు. కిందామీదా అన్నిచోట్లా. ఎక్కడా కనిపించలేదు. యాదయ్యకి బాధ తన్నుకొస్తోంది. ఆ చీకటి సందులోనే పడిపోయిందా అన్న అనుమానం కలిగింది. అవును... అక్కడే పడిపోయి ఉండొచ్చు అనిపించింది. ఆకలి తీరాలంటే తప్పదు, వెతకాలి. వచ్చినంత దూరం వెనక్కి వెళ్లాలి. నిర్ణయించుకున్నాడు. మళ్లీ పోలీసోడి సమస్య ఎదురుకావచ్చా? ఈసారి బలంగా ఎదుర్కోకపోతే నా ఆకలి తీరదు అనుకున్నాడు. నిరాశగా నడక ప్రారంభించాడు. ఇంత బాధపడింది ఆ ఆపిల్‌ కోసమే. అదే చేజారిపోయింది. ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుంటున్నాడు. తారు రోడ్డుమీద నడుస్తున్నాడు.


    వెంటాడే పోలీసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా ఓ పెద్ద మలుపు తిరిగాడు. ఊహించని సంఘటనే జరిగింది. ఆ దారిగుండా వేగంగా వెళ్లే ఇసుక లారీ గుద్దేసింది. ఢ కొట్టిన వాహనం ఏమీ పట్టనట్లు యథాలాపంగా వెళ్లిపోయింది. యాదయ్య దేహమంతా నుజ్జునుజ్జయిపోయి రక్తం పారుతోంది. భయంతో ఆఖరి క్షణంలో పెద్దవైన యాదయ్య కళ్లు దీనంగా అలా చూస్తుండిపోయాయి. గంట క్రితం ఉన్న ఆకలి, ఆరాటం ఇప్పుడా ప్రాణం లేని దేహంలో లేదు. ఇప్పుడు ఆకలి లేదు. దప్పిక లేదు. అసలీ లోకంతోనే సంబంధం లేదా శరీరానికి. సుఖవంతులు మందు, విందు పుచ్చుకుని నిషాతో ఓ వైపు వెళ్తున్నారు. మరో వైపు యాదయ్య శవం ఒంటరిగా దిక్కూ మొక్కూ లేకుండా పడివుంది. ఏ ఒక్కడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అనాథ అయిన యాదయ్య జీవితం చివరి క్షణం వరకు ఆకలి.. ఆకలి.. అంటూనే చనిపోయాడు.


    ముగిసింది. యాదయ్య లాంటి అనాథలు ఈ సమాజంలో ఫ్లైవోవర్లకింద, ప్లాట్‌ఫాంల మీద ఎంతో మంది కనిపిస్తూనే ఉంటారు. చీకటి తప్పులకో, పరిపక్వం లేని ప్రేమలకు పుట్టిన వాళ్ల బతుకులు ఇలాగే ముగిసిపోతాయన్నదానికి నిదర్శనం యాదయ్య. నా అనేవాళ్లు లేక పట్టెడన్నం పెట్టే దిక్కులేక, చివరికి ఆకలి చావుకి బలవడమో, లేదా సంఘం, సమాజంమీద కోపం పెంచుకుని సంఘ విద్రోహ శక్తులుగానో తయారవుతున్నారు. ఎవరి పాపానికి ఫలితం యాదయ్య లాంటి వాళ్లు? ఇలాంటి వారికి బాధ్యులెవరు? మనుషుల చీకటి పాపాలకి జన్మించిన శాపగ్రస్తులా?


    అంబరాన్నంటే మేడలు అడుగుకొకటి నిర్మించేంత ధనికులు వున్న ఈ భూమ్మీద ఇంకా ఇటువంటి అనాథ ఆకలి చావులు వున్నాయి.


(ప్రజాశక్తి ఆదివారం అనుబంధం 25 ఆగష్టు 2013 సంచికలో ప్రచురితం)

Comments