సారీ...సారీ...వైదేహీ! - భీమరాజు వెంకట రమణ

    ఆరోజు ఉదయం పినాకినీ ఎక్స్‌ప్రెస్ తెనాలికి సరైన సమయానికే వచ్చింది. నేను ఎక్కిన ఛెయిర్ కార్లో పెద్దగా జనాలు లేరు. అక్కడక్కడా కొంతమంది ఉన్నారు. అలా ఉంటేనే నాకిష్టం. ఎవరికైనా అంతే అనుకోండి. ప్రయాణం ప్రశాంతంగా జరుగుతుంది. చెన్నై చేరేసరికి మధ్యాహ్నం ఒకటో రెండో అవుతుంది. రాత్రికి స్నేహితుడి కూతురు పెళ్లి చూసుకొని పొద్దుటే బయలుదేరి రావాలి.

    రెండు మూడు స్టేజీలలో ఎవరూ ఎక్కలేదు. ఒంగోలు వచ్చేసరికి ఒక యువతి, యువకుడు, మరొక మధ్యవయస్కురాలు ఎక్కారు. నెంబర్లు చూసుకొని నా వెనకున్న సీట్లలో ముగ్గురూ కూర్చున్నారు. మరో నలుగురు ప్లాట్‌ఫాం మీద ఉన్నారు. కిటికీలోంచి చూస్తూ చేతులూపుతున్నారు.

     రైలు కదిలింది.

    "వైదేహీ! సుమంత్‌ని రాత్రికి ఫ్లయిట్ ఎక్కించి నువ్వు ఎక్కడికెళతావ్?'' అడిగింది ఆ మధ్యవయస్కురాలు.

    "సుందరం బాబాయి ఇంటికెళ్లి రెండురోజులుండి వచ్చేస్తానత్తయ్యా.''

    "పెళ్లయిన తరువాత నెల్లూరుకొచ్చి మా ఇంట్లో రెండురోజులైనా ఉండాలి, లేకుంటే ఒప్పుకోను'' అన్నదామె.

     నాకు విషయం అర్థమైపోయింది. ఇద్దరు యువతీయువకులకు ఇంకా పెళ్లికాలేదు, త్వరలో చేసుకోబోతున్నారు. ఆమె అమ్మాయికి అత్త. బహుశా నాన్న చెల్లెలేమో. అబ్బాయి తల్లి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పెళ్లి తరువాత వాళ్లింటికి రావాలని ఆహ్వానిస్తున్నది కదా. అబ్బాయి, అదే సుమంత్ రాత్రికి దేశానికో వెళుతున్నాడన్నమాట.

    ఆ అమ్మాయి చెబుతోంది "అలాగే అత్తయ్యా! ఎటూ తిరుపతి ప్రోగ్రాం పెడతారు కదా! వెళ్లేటప్పుడో వచ్చేటప్పుడో తప్పక వస్తాం.''

    సీట్లు అటు తిరిగి ఉండటం వల్ల వాళ్ల ముఖాలు నాకు కనపడకపోయినా మాటలు స్పష్టంగానే వినపడుతున్నాయి.

    ఊసుపోక కాసేపు వాళ్ల సంభాషణ వినటానికి ఉపక్రమించాను. సంస్కారం కాదేమో అని లోలోపల అనిపిస్తున్నా సిద్ధపడ్డాను. మధ్యాహ్నం దాకా కూర్చోవాలి కదా! మరి కాలక్షేపం ఎట్లా? అంతగా విసుగనిపిస్తే బ్యాగులో పుస్తకాలు ఉండనే ఉన్నాయి.

    మరికాసేపటికి నాకు చాలా విషయాలు తెలిసిపోయాయి.

    క్రితంరోజే వాళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఆ అబ్బాయి రాత్రి ఫ్లయిట్‌కి లండన్ వెళుతున్నాడు. ఆ అమ్మాయి అతనివెంట చెన్నైదాకా వెళుతోంది. అతను వెళ్లాక బంధువుల ఇంట్లో రెండురోజులుండి తిరిగి ఒంగోలు వచ్చేస్తుంది. ఆ పెద్దావిడ నేను ఊహించినట్లే అమ్మాయి మేనత్త. వాళ్లు నెల్లూరులో ఉంటారు. ఈలోగా నెల్లూరు స్టేషన్ రానే వచ్చింది. ఆమె వాళ్లిద్దరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్పి రైలు దిగింది.

    రైలు కదిలింది.

     మళ్లీ వాళ్ల మాటలు వినడానికి అటెన్షన్లోకి వచ్చేశాను. కానీ నిశ్శబ్దం. వీళ్లిద్దరూ ఏమీ మాట్లాడుకోవడం లేదేంటి? వయసులో ఉన్నారు కదా! కాస్త ఏకాంతం దొరికింది. ఏమైనా చిలిపి చేష్టలు చేస్తున్నారా? నేనొకణ్ణి వెనుక కూర్చున్నానన్న స్పృహ వాళ్లకున్నదో లేదో! అనవసరమైన ఊహలు, ఆలోచనలు చేస్తున్న నా మనసును కాస్త మందలించా. కాసేపు ఊరుకున్నా మళ్లీ మొదలుపెట్టింది. అలవాటెక్కడికి పోతుంది?

    నిశ్చితార్థం అయితే మాత్రం ఆడపిల్లని ఆ అబ్బాయితో అలా ఒంటరిగా పంపొచ్చా ఆ అమ్మాయి తల్లిదండ్రులు? మరొకరెవరైనా వాళ్ల కూడా వెళ్లొచ్చుగా? కనీసం ఆ నెల్లూరు అత్తయ్యనైనా చెన్నైదాకా వెళ్లే ఏర్పాటు చేయొచ్చుగా? కాలం మారిపోయింది. అయినా అంతదూరం ఆలోచించి నా బుర్ర వేడెక్కించుకోవడం దేనికి? బ్యాగులోంచి భరాగోగారి కథల పుస్తకం తీసి పేజీలు తిప్పడం మొదలుపెట్టాను.

    కాసేపటికి చిన్నచిన్నగా మాటలు వినబడుతున్నాయి. ఉన్నట్లుండి ఆ అమ్మాయి ఏడుపు వినిపిస్తోంది. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా? ఆ పెద్దావిడ దిగిపోగానే పరిస్థితి మారిపోయిందేమిటి? ఇంకాస్త వెనక్కి వంగి వినటానికి ప్రయత్నించాను.

    "సారీ వైదేహీ! నీ మనసు కష్టపెడుతున్నాను. ఎలాగైనా మీ వాళ్లకు నీవు సర్ది చెప్పాలి. మా అమ్మానాన్నలకు నేను చెప్పుకుంటా. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి'' అన్నాడతను. ఆ మాటలకు నేను నిర్ఘాంతపోయాను. నా చెవులు మరింత తీక్షణంగా పనిచేయసాగాయి.

    "అయినా వైదేహీ! నాకొక సందేహం. ఇంజనీరింగ్ మనిద్దరం ఒంగోలులో ఒకే కాలేజీలో చదివాం. నువ్వు నాకు ఒక సంవత్సరం జూనియర్‌వి. అందరితోపాటు నీకు కాలేజీలో మారుమోగిన నా ప్రేమకథ తెలిసే ఉంటుంది. నేను గాఢంగా ప్రేమించిన అక్షర నా ప్రేమ నిరాకరించి నలుగురిలో నన్ను అనరాని మాటలు అన్నది. ప్రిన్సిపాల్‌కి రిపోర్ట్ కూడా ఇచ్చింది. మా నాన్న వచ్చి అందరికీ సర్ది చెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది. అటువంటి చరిత్ర ఉన్న నన్ను నువ్వు పెళ్లిచేసుకోవడానికి ముందుకు రావడమేమిటి? దానికి మీ అమ్మానాన్నలు ఒప్పుకోవడమేమిటి?'' అడిగాడు.

 

    "సుమంత్! కాలేజీలో నువ్వు మంచి బ్రైట్ స్టూడెంట్‌వి. మేము కాలేజీలో చేరిన సంవత్సరం ర్యాగింగ్‌కి వ్యతిరేకంగా నువ్వు నీ స్నేహితులతో కలిసి కాలేజీ అంతా తిరుగుతూ మేమందరం ఇబ్బంది పడకుండా చూశావు. అందరూ నిన్ను మెచ్చుకున్నారు. అప్పటినుండి నిన్ను గమనించడం మొదలుపెట్టాను.

    మనం ఒక కాలనీలోనే ఉంటున్నాం. మీ నాన్న మా నాన్న రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో కొలీగ్స్ అని తెలిసింది. నీతో పరిచయం పెంచుకోవడానికి మనసు ఉవ్విళ్లూరుతున్నా ధైర్యం చెయ్యలేకపోయాను. క్రమేపీ నీపై ఇష్టం పెరిగింది. రోజూ కాలేజీలో నీ కోసం ఆతృతగా వెతకటం నా కళ్లకు, నువ్వు కనిపించాక ఆనందించటం నా మనసుకు అలవాటైపోయింది. అంతలో అక్షరతో నీ ప్రేమ విషయం తెలిసి హతాశురాలినయ్యాను. నా దురదృష్టానికి బాధపడ్డాను. నీమీద కోపం కూడా వచ్చింది. అక్షర నాకంటే అందగత్తే కావచ్చు. కానీ ఆమె వేసే డ్రస్సులు, బాయ్‌ఫ్రెండ్స్‌తో సన్నిహితంగా తిరగటం చూశాక అలాంటి అమ్మాయి కోసం నువ్వు తాపత్రయపడటం నాకు నచ్చలేదు. కానీ నాకు నచ్చడం ఎవరికి కావాలి? నీకు నచ్చిందిగా! ఆలోచిస్తే నీకు అమ్మాయే సరైన జోడీయేమో అనిపించింది. అమ్మాయి గురించి నేను అనవసరంగా లేనిపోనివి ఊహించుకుంటున్నానేమో అని కూడా అనిపించింది. మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉందని సమాధానపడ్డాను. అయినా నీమీద ఇష్టం ఏమాత్రం తగ్గలేదు. తరువాత నీకు అక్షరతో గొడవయ్యింది. చాలా బాధపడ్డాను. నువ్వెలా ఉన్నావో అని ఎవరెవరి ద్వారానో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఇంజనీరింగ్ కాగానే నువ్వు బెంగుళూరులో జాబ్లో చేరి ఆర్నెల్లకే లండన్ వెళ్లిపోయావు. మధ్య మావాళ్లు నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా నాన్నతో నీమీద ఉన్న ఇష్టాన్ని చెప్పాను. ఇంట్లో కాసేపు చర్చ జరిగింది. మీ కుటుంబం మా నాన్నకు తెలుసు కాబట్టి మీ నాన్నతో మా నాన్న మాట్లాడారు. మీవాళ్లు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. దానికి వాళ్లకున్న కారణాలు ఏమైనా కావచ్చు. నువ్వూ ఒప్పుకున్నావు. నా ఆనందానికి అవధుల్లేవు. అంతా నాకు అనుకూలంగా జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పేమాటలు నాకు అంతుపట్టకుండా ఉన్నాయి. ఇష్టం లేకపోతే నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నట్లు? ఒక్కరోజులోనే మనసు మార్చుకొని ఎందుకు కాదంటున్నట్లు? నాకు అర్థం కావడం లేదు'' అంటూ మాట్లాడడం ఆపేసింది. కాసేపు మళ్లీ నిశ్శబ్దం.

     నా గుండె బరువెక్కింది. అమ్మాయిమీద జాలేసింది. ఇంత పెద్దవిషయాన్ని అబ్బాయి ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాడు? తను చేస్తున్న నిర్వాకం వల్ల ఎంతమంది మనసులు అల్లాడిపోతాయి?

    గూడూరు స్టేషన్ వచ్చింది. ఎవరో ఇద్దరు లోపలికి రావడం గమనించాను. వాళ్లు మా దగ్గరకు వచ్చి కూర్చోకుండా ఉంటే బావుణ్ణు అనుకున్నాను. నేను కోరుకున్నట్టే వాళ్లు మమ్మల్ని దాటుకొని అవతల వెళ్లి కూర్చున్నారు. హమ్మయ్య అనుకున్నాను.

    "ప్రస్తుత పరిస్థితికీ ఒక విధంగా అక్షరే కారణం'' అన్నాడతను నసుగుతున్నట్లుగా.

    "అక్షరా? ఎలా? నాకు అర్థమయ్యేట్లు చెప్పు'' అడిగింది వైదేహి.

    "నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వనుకున్నందుకు నాకూ చాలా సంతోషమేసింది. అక్షర విషయంలో భంగపడ్డ నాకు మీవాళ్ల ప్రపోజల్ ఊరటనిచ్చింది...'' అంటూ మౌనంగా ఉండిపోయాడు. "ఏమిటి ఆగిపోయావ్ చెప్పు?'' వైదేహి ఆతృతగా అడిగింది.

    "రాత్రి అక్షర ఫోన్ చేసింది. ఎవరెవర్నో అడిగి నా సెల్ నెంబర్ సంపాదించిందిట. తను తప్పు చేశానని ఏడ్చింది. నా ప్రేమను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు ఏ శిక్ష అయినా విధించమన్నది. తనను పెళ్లి చేసుకోమని బతిమాలింది. నాకోసం తన ఉద్యోగాన్ని లండన్ హెడ్డాఫీస్‌కి మార్చుకుందిట. ఈరోజు ఫ్లయిట్‌లో వస్తోందట. నన్ను చెన్నై ఎయిర్‌పోర్టులో కలుస్తానన్నది. మన నిశ్చితార్థం విషయం చెప్పాను. నిశ్చితార్థమే కదా! పెళ్లికాలేదు కదా అన్నది. ప్రాథేయపడింది. నాకోసం ఆశగా ఎదురుచూస్తుంటానని చెప్పింది. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. మీ కుటుంబానికి అవమానం జరగటం నాకిష్టం లేదు. కానీ నేను ప్రేమించిన అక్షర నాకు దక్కుతుందనే ఆలోచన నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషయం నీ ముందుపెట్టి నీ సహకారాన్ని కోరదామనుకున్నాను'' అని చెప్పి ఆగాడు.

     "ఓరి దుర్మార్గుడా! ఎంత సున్నితంగా వైదేహిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావ్? ఛీకొట్టింది మళ్లీ పిలిచిందని నిన్ను కావాలనుకున్న అమ్మాయిని కాదనుకోడానికి సిద్ధపడతావా? అప్పుడు కాదన్న అమ్మాయి మళ్లీ ఇప్పుడు ఎందుకు అవునంటున్నదో? రేపు పెళ్లయిన తరువాత మళ్లీ కాదంటే? తిక్క కుదురుతుంది వెధవకి!'' ఆలోచనలతో నా మనసు గందరగోళంగా మారింది. వైదేహి ఏమంటుందో అని ఉత్కంఠగా ఉన్నాను.

    "సుమంత్! అక్షర అంటే నీకు అంతిష్టమా?'' అడిగిందామె.

    అతను ఏమీ మాట్లాడలేదు. బహుశా సిగ్గుపడుతూ తలూపాడేమో శుంఠ! నాకు కనపడదుగా!

    చాలాసేపు మళ్లీ నిశ్శబ్దం.

    ఆ అమ్మాయి గొంతు నీరసంగా వినబడింది "సరే సుమంత్, నీ కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ నీకు దగ్గర కాబోయి కాలేకపోతున్నానన్న బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది. అయితే నువ్వు నాకొక ప్రామిస్ చెయ్యాలి.''

    "ఏం చెయ్యాలో చెప్పు'' ఆత్రుతగా అడిగాడతను.

     "అప్పుడప్పుడూ నువ్వు నాకు ఫోన్ చేస్తుండాలి. ఎందుకంటే నీ మాటలే నాకు ఊరట'' అన్నది.

    "తప్పకుండా వైదేహీ. కానీ నువ్వు కూడా త్వరలో మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలి'' అన్నాడతను సంతోషంగా.

    ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు.

    నాకు తల తిరిగిపోతోంది. నిశ్చితార్థం అయిన తరువాత వీళ్లు ఎంత తేలికగా నిర్ణయాలు మార్చేసుకుంటున్నారు? అయినా ఈ అమ్మాయి అంత తేలిగ్గా ఒప్పేసుకుందేమిటి? కాలేజీలో చెడ్డపేరు తెచ్చుకున్నా అతనే కావాలనుకుంది, ఇప్పుడు నట్టేట ముంచిపోతున్నా అప్పుడప్పుడూ ఫోన్ చేస్తే ఊరట చెందుతానంటున్నది. నాకు ఈ వైదేహిని చూస్తే పాలగుమ్మి పద్మరాజు పడవప్రయాణంలో రంగి పాత్ర గుర్తుకొస్తున్నది. ఆమే ఇంతే! తనను నానా ఇబ్బందులకు గురిచేస్తూ చివరికి గుడిశెలో ఉండగా నిప్పంటించినా సరే వాణ్ణే కావాలనుకుంటుంది. దీన్ని ప్రేమ అంటే సరిపోదేమో, అసలు ఇది మనసుకు సంబంధించినది కాదేమో!

     పేరుకు తగ్గట్లు ఎంత నిదానంగా నిశ్చలంగా మాట్లాడుతున్నది వైదేహి! అలాంటి అమ్మాయిని వదులుకొని రంగేళిరాణి వెంటపడుతున్నాడే లండన్ దొర? నాకు బాధ, కోపం రెండూ వస్తున్నాయి, నా వాళ్లకేదో అపకారం జరుగుతున్నట్లు. లేచి వెళ్లి వాళ్లిద్దరినీ చెడామడా చివాట్లు పెట్టి బుద్ధి చెబితే? దాదాపు సీట్లోంచి సగం లేచాను. కానీ బుద్ధి వెనక్కి లాగింది. తనకుమాలిన ధర్మం నీకేల అని నన్ను హెచ్చరించింది. వాళ్లు నా మాటలు వింటారా? వ్యవహారం బెడిసికొట్టి వాళ్లు అఘాయిత్యమో చేసుకుంటే? మళ్లీ సీట్లో చతికిలబడ్డాను. రైలు సూళ్లూరుపేటలో ఆగింది.

    అతను కిందికి దిగి ఏదో కొనటానికి కాబోలు వెళ్లాడు. నేనూ రైలు దిగి కొంచెం అటూ ఇటూ తిరిగి ఒక కాఫీ తాగి వచ్చాను. వస్తూ వైదేహిని తీక్షణంగా చూశాను. కళ్లుమూసుకొని ఉంది. ఏమి ఆలోచిస్తున్నదో! జాలేసింది. వచ్చి నా సీట్లో కూర్చున్నాను. అతగాడు వచ్చాడు రెండు జ్యూస్ టిన్‌లు పట్టుకొని. హుషారుగా ఉన్నాడు. అనుకున్నది జరిగిపోతున్నదిగా మరి? రైలు కదిలింది.

    సెల్ ఫోన్ రింగయ్యింది. అతను హుషారుగా మాట్లాడాడు. అనుకున్న సమయానికే ఎయిర్‌పోర్టుకి వస్తానని చెబుతున్నాడు. బహుశా ఆ వగలమారికే అయుంటుంది. రైలు చెన్నై చేరేసరికి మధ్యాహ్నం రెండయింది. బోగీలో ఉన్నవాళ్లు ఒక్కొక్కరమే దిగుతున్నాం. వాళ్లిద్దరినీ మరొకసారి చూశాను. నన్నూ వాళ్లు చూశారు. స్టేషన్ లోంచి బయటకొచ్చేదాకా వాళ్ల వెనకనే నడిచాను. బయటకు రాగానే ఎవరో ఒక పెద్దమనిషి వచ్చి ఇద్దరినీ పలకరించి తనతో కారుదగ్గరకు తీసుకెళ్లాడు. బహుశా అతను వైదేహి బాబాయి కాబోలు. రాత్రి ఫ్లయిట్ సమయం వరకూ ఆయన ఇంట్లోనే ఉంటారేమో! వాళ్ల కారు వెళ్లిపోయింది.

     సాయంత్రం నా మిత్రుడి కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. నా మిత్రుడు నేను వచ్చినందుకు తెగ ఆనందపడ్డాడు. రాత్రి భోజనాలయ్యాక పాతస్నేహితులందరం ఒకచోట చేరాం. అలనాటి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నాం. ఎంతో సందడిగా సమయం గడచిపోతోంది. రాత్రి పదకొండు దాటింది.

    వైదేహి, సుమంత్ ఎయిర్‌పోర్టు చేరి ఉంటారా? నాకు తెలియకుండానే నా మనసు వాళ్ల గురించి ఆలోచిస్తున్నదని నాకు అర్థమయింది. అప్పటికప్పుడు అనుకుని లేచి బయటకొచ్చి టాక్సీ మాట్లాడుకుని ఎయిర్‌పోర్టుకి బయలుదేరాను.

    ఎయిర్‌పోర్టు చేరగానే ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలకు వెళ్లాను. ఆతృతగా అన్ని వైపులా చూస్తున్నాను. చాలామంది జనమున్నారు. అసలు వాళ్లు వచ్చారా? లేదా? ఎవరింటికో వెళ్లారుగా అక్కడేమైనా జరిగుంటుందా? లేదు! వాళ్ల మధ్య జరిగిన సంభాషణను బట్టి విషయం ఇప్పుడే ఎవరితో చెప్పేట్లు లేరు. అతను కచ్చితంగా లండను వెళుతున్నాడా? వైదేహి ఎయిర్‌పోర్టుకి వస్తుందా రాదా? నేను అనవసరంగా వచ్చానా? ఉన్నవి లేనివి అన్నీ ఊహించుకుంటున్నాను. అలవాటయిపోయింది మరి!

     అంతలోనే నా కళ్లు వాళ్లను పసిగట్టేశాయి! అక్కడ ఒక కాఫీ షాప్ దగ్గర వైదేహి, సుమంత్లు కూర్చొని కాఫీ తాగుతున్నారు. వాళ్ల పక్కన మరో అమ్మాయి కూడా ఉంది. వైదేహి కంటే అందంగా ఉం దనే చెప్పాలి. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకొని... జుట్టు విరబోసుకొని... చేతులూ భుజాలూ ఊపుతూ మాట్లాడుతూ... ఎంత వయ్యారం వలకబోస్తోందో! ఆమెగారేనా అక్షర? ఏమో! వైదేహి నిశ్చలంగా కూర్చొని ఉంది.

    నేను అప్పటికే రెండు కాఫీలు తాగేశాను. మరిక నావల్ల కాదు. దూరంగా కూర్చొని చూస్తూ ఉండిపోయాను. అనౌన్సుమెంట్లు వినబడుతున్నాయి. వాళ్లిద్దరూ లేచారు. వైదేహితో చేతులు కలిపారు. మెల్లగా లోపలికి వెళ్లారు. చెకిన్ చెయ్యటానికి లగేజీ ఏమీ లేదేమో, హ్యాండ్ లగేజీతోనే సెక్యూరిటీ చెక్ వైపు వెళుతున్నారు. వైదేహి వాళ్లనే చూస్తూ అక్కడే కూర్చుంది. ఆమెనే చూస్తూ నిలబడ్డాను.

    కొన్ని నిమిషాలు గడిచాయి.

     వాళ్లిద్దరూ జనాల్లో కలిసిపోయి కనుమరుగయ్యారు. వైదేహిని తీసికెళ్లటానికి బహుశా ఎవరైనా వస్తారేమో! వాచీ చూసుకుంటోంది. లేచి కాసేపు అటూ ఇటూ తిరిగింది. మళ్లీ కూర్చుంది. పాపం మనసులో ఎంత బాధ పడుతోందో? ఇప్పుడు ఏం చేస్తుందో? ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కుంటుందా? దీని తరువాత విషయాలు నాకెలా తెలుస్తాయి? ఇంతసేపూ ఒక అలవాటులేని గూఢచారి పాత్రను పోషించాను.

    ఆమెకు ఎదుటపడి పరిచయం చేసుకొని ధైర్యం చెబితే? ఆ అమ్మాయి ధైర్యంగానే ఉన్నట్లుందిగా! లేకుంటే అతనిచ్చిన షాకుకు తట్టుకోలేనిదైతే నిన్న ఆ రైల్లోనుండే దూకేసేది. లేదా తరువాతైనా వెళ్లిపోయేది. కానీ ఎయిర్‌పోర్టు వరకూ వచ్చింది.

    అలా అనుకోగానే నాకు ఊరట కలిగింది. ఆడపిల్లలు ఈ రోజుల్లో ఇలానే ఉండాలి. అంతలో ఉన్నట్లుండి వైదేహి లేచి నిలబడింది. ఎవరో పెద్దాయన హడావిడిగా వస్తున్నాడు వాచీ చూసుకుంటూ. బహుశా వాళ్ల బాబాయే మో! రావటం ఆలస్యం అయిందని విచారిస్తున్నట్లుంది ఆయన వాలకం. ఇద్దరూ కలుసుకుని ఒక నిమిషం మాట్లాడుకుని బయలుదేరారు. నా మనసు భారంగా ఉంది. నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. నేనూ వాళ్ల వెనకాలే మెల్లగా వెళుతున్నాను.

    అంతలో నన్ను దాదాపు రాసుకుంటూ ఎవరో పరిగెత్తారు. చూద్దును కదా ... సుమంత్! వైదేహి దగ్గరకు వెళ్లి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఆమె ఇటు తిరిగింది. ఆమె కళ్లలో మెరుపు నాకు స్పష్టంగా కనబడుతోంది. అతను అమాంతం వైదేహిని కౌగిలించుకున్నాడు.

     జరుగుతున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. వాళ్లకు దగ్గరగా వెళ్లి అటు తిరిగి నిలబడ్డాను విషయం తెలుసుకోవడానికి. అతను కాస్త గట్టిగానే చెబుతున్నాడు "అయాం సారీ వైదేహీ, నిన్ను బాధపెట్టాను. నిన్నొదిలి అక్షరతో నేను వెళ్లడానికి నువ్వు ఒప్పుకున్నప్పటినుండీ నీ గురించే ఆలోచిస్తున్నాను. అక్షరవైపు ఆకర్షణ ఉన్నా అంతకు మించిందేదో నన్ను నీవైపు లాగేస్తోంది. నేను వెంటబడిన అక్షరకంటే నా కోసం, నా ఇష్టం నెరవేర్చడం కోసం సిద్ధపడ్డ నిన్ను నేను వదులుకోలేను, ప్రస్తుతం లండన్ వెళ్లడం లేదు ... రెండు రోజుల తరువాత వెళతా'' అన్నాడు.

    వైదేహి కళ్లు చెమర్చడం నాకు కనపడింది. దాదాపు నాదీ అదే పరిస్థితి. గుండెనిండా గాలిపీల్చి వదిలాను. ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు సాధారణమైపోయిన ఈ రోజుల్లో ఇలాంటి జంటను చూసినందుకు మనసు ఉల్లాసంతో ఊగిపోయింది. ఈసారి వెనక్కిలాగే నా మనసుమాట వినదలుచుకోలేదు. ధైర్యంగా వెళ్లి "కంగ్రాట్యులేషన్స్! గాడ్ బ్లెస్ యూ బోత్'' అన్నాను.

    "మీరు ... మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే!'' అంటున్నాడతను.

    "కనుక్కోండి చూద్దాం'' అన్నట్లు వాళ్లవైపు చూసి హుషారుగా నడుచుకుంటూ వచ్చేశాను.


(ఆంధ్రజ్యోతి ఆదివారం 15జనవరి 2012 సంచికలో ప్రచురితం)

Comments