సరిహద్దులు - దాసరి శిరీష

    అంత దూరం నుంచే గంట గణగణ లాడించుకుంటూ వస్తున్న కేశవుల్ని చూసి కేరింతలు కొడుతూ పిల్లలంతా "రిక్షాబ్బాయి, రిక్షాబ్బాయి" అంటూ ఎదురొచ్చారు.

    కాస్త పెద్ద పిల్లలు రిక్షా పూర్తిగా ఆగకముందే చెంగుమని రిక్షాలోకి ఎగిరి సర్దుకొని కూచున్నారు. ఇంకాస్త చిన్న పిల్లలు కేశవులకి బాగ్స్ అందించి, మెల్లగా ఎక్కి బుద్ధిమంతుల్లా కూచుని, కుతూహలంగా రోడ్డుని చూస్తున్నారు. 

    ఇంకా చిన్నారులు - మాటలు క్షుణ్ణంగా నేర్వకముందే చదువుల భారాన్ని మోస్తున్న బాధితులు - నిస్సహాయంగా చూస్తూ తమ తల్లుల చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకుని, ఒకేసారి గొంతులు పెంచేశారు. 

    అతనికీ దృశ్యం మామూలే. ఓపిగ్గా అందర్నీ పేరుపేరునా బుజ్జగించి, నవ్వించి రిక్షాలో జాగ్రత్తగా కూచోబెట్టి తలూపుతూ రిక్షా మెల్లగా పోనిచ్చాడు.

    ఏలూరు రోడ్డుమీద పోతున్న రిక్షా చుట్టుగుంట వైపు తిరిగింది. విశాలాంధ్ర ఆఫీసు దాటాక రిక్షాని ఆపాడు. వగర్చుకుంటూ పరిగెత్తుకొస్తున్న కొడుకుని చూసి ముద్దుగా బూతులు తిడుతూ, పావలా కాసు జేబులోంచి తీసాడు. 

    రవికి తండ్రి రిక్షాని, అందులో పిల్లల్ని చూడడం మహా సరదా. చాలా రోజుల్నించి వాడినో కోరిక వేధిస్తోంది. ఈ మధ్య రోజూ అందుకు మారాం చేయడం మొదలెట్టాడు. 

    "ఇంక లగెత్తరా ఇస్కూలుకి టయిమయిపోతుంది. అయ్యా రవీ! ఇక ఎల్లరా"

    "నానా అడుగుతావా?" పరిగెత్తుతూ తండ్రిని తన కోరిక గురించి హెచ్చరించాడు. కేశవులు తలూపుతూ రిక్షా వేగం పెంచి ఏదో పాత సినిమా పాట అందుకున్నాడు.

    బిల బిల మంటూ గేటులోంచి ప్రేయర్ హాల్‌వైపు నడుస్తున్న పిల్లల్ని చూస్తూ నిలబడ్డాడు. ఎందుకో కొడుకు గుర్తుకొచ్చి కళ్లు చెమర్చాయి. పితృ హృదయం స్పందించింది. 

    లేత నీలం రంగు డ్రెస్‌తో, ముదురు నీలం రంగు టై, బ్లాక్ బెల్టుతో - పిల్లలు ఠీవిగా, ముచ్చటగా పావురాళ్లలా చకచకా వెళ్లిపోతున్నారు. ఈ స్కూలు ప్రారంభించి రెండేళ్లే అయినా చాలా త్వరగా మంచి గుర్తింపుని పొందింది. తను స్కూలు రిక్షా అబ్బాయిగా పెర్మనెంటుగా జీతం తీసుకోవడంతో పాటు, తన భార్య లక్ష్మి కూడా స్కూలు ఓనరుగారింట్లో పాచిపని చేయడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది కేశవులకి. అందుకే ఆ స్కూలు, ఆ పిల్లలు, ఆ పరిసరాలు అన్నీ తన స్వంత ఆస్తిలా చాలా అభిమానంగా పరిశీలిస్తూ చూసుకుంటూ ఆనందిస్తుంటాడు.

    వచ్చే సంవత్సరం అడ్మిషన్స్ కోసం ఈ మార్చిలోనే అప్లికేషన్సు తీసుకోవడం మొదలైంది. ఆఫీసు రూం ముందు క్యూ ప్రారంభమైంది. 

    ప్రిన్సిపాల్ రూం దగ్గరకెళ్లి "అమ్మగారు ఖాళీగా ఉన్నారా?" అన్నాడు నెమ్మదిగా మంచినీళ్ల కూజా పట్టుకుని వస్తున్న ఆయాతో.

    "ఉండారు, హెడ్మాస్టరమ్మేలే, ఎల్లు" అంది ఆయా.

    గులాబీ రంగు డ్రెస్‌లో సింపుల్‌గా, హుందాగా ఉన్న సరోజ ఎప్పుడూ ఫ్రెష్‌గా చూపరులకి ముచ్చటగా అగుపిస్తూ ఉంటుంది. అందమూ, వాక్చాతుర్యమూ, డబ్బూ, పలుకుబడీ పుష్కలంగా ఉండడంతో, ఆ స్కూలు ఓనర్ కూతురిగా, ప్రిన్సిపాల్‌గా చాలా గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటుంది.

    కేశవుల్ని చూడగానే కళ్లతోనే పలకరించి -"ఏమిట్రా!" అంది హుషారుగా.

    ఆవిడని ఎపుడు చూసినా ఓ దేవతని చూసినట్లు భక్తిభావం కలుగుతూ ఉంటుంది అతనికి. నమస్కరించి వినయంగా చేతులు కట్టుకున్నాడు.

    "ఏవిట్రా!" అంది విసుగ్గా నవ్వుతూ. "చెప్పు" అంది తలెగరేస్తూ. పెద్ద పెద్ద రింగులు నాజూగ్గా కదిలాయి. బుగ్గలు సొట్టలు పడ్డాయి.

    "మా యావిడ సెప్పిందేవో గదమ్మా"

    "లక్ష్మా? అది పనికొచ్చే టయిమ్‌కి నేనికా లేవనేలేవను"

    లక్ష్మిని మనసులో వంద తిట్లు తిట్టుకుంటూ గొంతు సవరించుకున్నాడు. గొంతు పెగల్లేదు. అమ్మాయిగారికి కోపం వస్తుందేమో ఇలా తాత్సారం చేస్తే - అని భయపడుతూ పాఠం వల్లించినట్లు వల్లించేశాడు. 

    సరోజకి ముందు అర్థం కాలేదు. అర్హ్తమయ్యక కోపమొచ్చింది. అసలు కోపం తెచ్చుకోవడం కూడా ఎందుకులే అనుకుని పకపకా నవ్వింది. ఎదురుగా ఉన్న హెడ్‌మిస్ట్రెస్ కేశవులు వైపు చూస్తూ తనూ శ్రుతి కలిపింది. ఆ ఇద్దరి నవ్వులూ పన్నీటిజల్లుల్లా అనిపిస్తూ కేశవుల కేదో ధైర్యాన్నిచ్చాయి.

    "ఏ క్లాసు మీ వాడు?" హూంకరించింది.

    "రెండమ్మా"

    "అసలిక్కడ యల్‌కేజీ సీటు దొరకడమే చాలా కష్టం. తెలుసు గదా?"

    "తెలుసమ్మా. అయినా అయిదోక్లాసు వరకూ అదేదో పరీచ్చ రాయించి అప్పుడు తీసుకుంటన్నారంట గదమ్మా."

    "అబ్బో చాలా తెలుసుకున్నావే"

    "మాకున్నది ఆడూ, రెండేళ్ల పాపేనమ్మా"

    "ఏం ఆపరేష్సన్ చేయించేసేవా?"

    "నేనే చేయించుకున్నానమ్మగారు. రెక్కాడితే గాని డొక్కాడని మా బోటోళ్లకి ఇంకా పిల్లలెందుకండమ్మగారూ?" 

    "ఓ హి ఈజ్ సో ఎడ్వాన్స్‌డ్"అంటూ ఎదురుగా ఉన్న హెడ్ మిస్ట్రెస్ లలిత జోక్ చేసింది. ఇంకా ఎందుకనో సరైన వయసులో ఉన్నా మంచి జోడీ దొరకక పెళ్లి కాని సరోజలి ఇంకా చిలిపితనం, వేళాకోళం చేయడం తగ్గలేదు. ఆ ధోరణిలోనే ఇంగ్లీషులో సరదాగా తనో జోక్ కట్ చేసింది. లలిత అయిష్టతని కప్పిపుచ్చు కుంటూ మెల్లగా నవ్వింది.

    "ఎన్ని శ్రమలు పడయినా ఫీజు కట్టుకుంటానండమ్మా. మీరు దయుంచండి. ఆ ఫారాలేయో ఇప్పించి తవరే పూర్తి చేయిస్తే సంతకం బెడతాను."

    "సంతకం వచ్చా?"

    "మూడో క్లాసు దాకా చదివానమ్మా. సదువంటే నాకు మా సెడ్డ ఇష్టం."

    "ఇక అతనితో సంభాషణ పెంచి టైం వేస్ట్ చేసుకోవడం సరోజకి బాగా అనిపించలేదు. ఆఫ్ట్రాల్ హి ఈజ్ ఏ రిక్షా పుల్లర్. ఆమె కళ్లు ఎర్రబడ్డాయి. "మా స్కూల్‌లో సీటు కావాలంటే తల్లిదండ్రులిద్దరూ బి.ఎ.గాని, ఎం.ఎ.గాని చదివి ఉండాలి. వెయ్యి రూపాయలు డొనేషన్ కట్టాలి. ఇప్పుడు వీథికొక కాన్వెంట్ ఉంది. మీ గుడిసెలు మా ఇంటి దగ్గరేగా, అక్కడే ఏదో ఓ చిన్న కాన్వెంట్ కూడా ఉంది. నెలకి ఇంతింత ఫీజులు అక్కడ వుండవు. చేర్పించు" అంది. కోపంగా మొదలుపెట్టి, చాలా ఔదార్యంగా తన సంభాషణ ముగించి, ఎదురుగా ఉన్న ఫైలు తెరిచింది.

    "అమ్మగారూ!" అన్నాడు చేతులు నలుపుకుంటూ. అప్రయత్నంగా దణ్ణం పెట్టాడు. 

    సరోజ మొహం చిట్లించి లలిత వైపు చూసింది.

    ఆ చూపులకి అర్థం తెలిసిన లలిత "వెళ్లు వెళ్లు. అమ్మగార్ని విసిగించకు" అంది నెమ్మదిగా. కేశవులు మళ్లీ ధైర్యం పుంజుకున్నాడు. 'కాస్త బతిమాలితే అమ్మగారు కనికరిస్తుంది' అనుకున్నాడు. 

    "దయుంచండమ్మా, మీరు చెప్పిన ఫీజులన్నీ కడతాను. నా కొడుకుని బాగా సదివించుకునే అవకాశం తమరివ్వండి. నా రిక్షాబండిలో పిల్లల్ని చూసి ఆడు మహా సంబరపడిపోతుంటాడు. పిచ్చి సన్నాసి." రోజూ రిక్షా దగ్గరికి పరిగెత్తుకొచ్చే కొడుకు కళ్లముందు మెదిలి కేశవులు కంఠం రుద్ధమయ్యింది. 

    ఇక సహనంగా ఉండటం సరోజ వల్ల కాలేదు. ఇప్పటికే వాడికి ఎక్కువ అవకాశం ఇచ్చింది తను. "ఏమనుకుంటున్నావురా కేశవులు? రేపు నీ కొడుకూ, మన స్వీపర్ కొడుకూ, ఆయా కొడుకూ - అందరూ ఇదే స్కూల్లో చదివితే మేమంతా వీధించ పాడాల్సి వస్తుంది. పోనీలే పాపం, చాలా కాలం బట్టి తెలిసున్న వాడివని జాలిపడి మాట్లాడితే ఏమిటేమిటో వాగుతున్నావ్! బేరాలుడుతున్నవ్. ఫో, ఫో, ఇంకెళ్లు!" ఖంగుమని ఈ ఈ మాటలనేసి తీవ్రంగా తినేసేలా చూసింది.

    ఇంతలో వరండాలో నడుస్తున్న ఇద్దరు టీచర్స్ "ఏమయింది మేడమ్" అంటూ గాభరాగా వచ్చారు. ఆమె ఇంగ్లీషులో వాళ్ళకేదో చెప్పడం, వాళ్లు వింతగా చూస్తూ నవ్వడం... 

    కేశవులు తల వంగిపోయింది అవమానంతో. దుఃఖంతో మొహం జేవురించింది.

    తనని అందరూ మెచ్చుకుని ప్రోత్సహించి సీటిస్తారనుకున్నాడు. అసలెందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదు.

    "ఇంకెందుకు నిలబడ్డావు? అమ్మగార్కి కోపం వచ్చింది" దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న ఆయా మందలింపుగా అంది. 

    కేశవులు సర్వం అర్థమైన జ్ఞానిలా తల పంకించి భారంగా అడుగులేశాడు. భారంగా ఊపిరి వదిలాడు.

* * *

    "ఆళ్లింట్లో పని మానెయ్యవే నీయమ్మ!"

    "మంచోడివే. నువ్వు రిక్షా ఆళ్ల స్కూలుకి నడపడం మానేత్తావా?" మొగుడికి కంచంలో అన్నం పెట్టి చేపల పులుసు గిన్నె దగ్గరబెడుతూ "ఈ అన్నం ఆళ్లిచ్చిందే. అయిదేళ్ల మట్టీ ఆ ఇంట్లో పనిజేత్తన్నాను. కాత్త కాత్త జీతం పెంచారు. పాత సీరలిస్తారు. సంవత్సరానికోసారి కొత్తసీరెడతారు."

    "ఆపనే నీయమ్మా. అసలీ కూడొద్దు నాకు" కంచం నుంచునుంచి లేచిపోయాడు. లక్ష్మి నొచ్చుకుంటూ లబలబలాడుతూ మొగుణ్ణి బ్రతిమలాడటం ప్రారంభించింది.

    "నేను బయటకి పోయి ఇడ్లీ తింటాను. ఆ సద్దికూడు నువ్వు దిను, నాకొద్దు" తలపాగా తీసి దులుపుకుని మళ్లీ తలకి చుట్టుకుని కొండ దిగి రిక్షా దగ్గరకి నడిచాడు. వంద గజాల దూరంలో పసుపురంగు మేడని చూడగానే కోపం నసాళానికంటింది. "అంత గీర్వాణం ఉండబట్టే ఆ ఆడకూతురికి ఇంకా పెళ్లి కాలేదు" అనుకున్నాడు సరోజని మనసులో శపిస్తూ.

    హఠాత్తుగా రోడ్డుమీద కలకలం మొదలైంది. పోలీసులు పరిగెత్తుకొస్తున్నారు. కుర్రాళ్ల గుంపు అటువైపుగా వచ్చి ఓ చిన్న సందులోకి మాయమైంది. మెయిన్ రోడ్డుమీద అరుపులు వినిపిస్తున్నాయి.

    ఓ అరగంటసేపు రిక్షా తీయకుండా అలాగే జమ్మిచెట్టు దగ్గర బీడీ కాల్చుకుంటూ నిలబడ్డాడు. చాలామంది గుంపులు గుంపులుగా చేరి నగరంలో ఏదో ఘోరం జరిగిందని, ఇంకా ఘోరాలు జరగబోతున్నాయని ఆవేదనగా చెప్పుకుంటున్నారు. 

    కర్ఫ్యూ పెట్టారట. చాలామంది రిక్షావాళ్లు తిరిగొచ్చేస్తూ కనబడ్డారు. కర్ఫ్యూ అనగానే రిక్షా వాళ్ల గుండెలు గుభేల్ మన్నాయి. అన్ని రోజులూ కూలి డబ్బులుండవ్. కూడూ నీళ్లుండవ్.

    జేబులో డబ్బు తీసి లెక్కబెట్టుకున్నాడు. స్వంత రిక్షా కాబట్టి అద్దె కట్టక్కర్లేదు. నలభై రూపాయలున్నాయి. నయమే! అసలు ఒక్క రూపాయి కూడా దగ్గరుంచుకోఅలేని నిర్భాగ్యులున్నారు. 

    "ఏంటో కలికాలం! దేశంలో ఏ గొడవలొచ్చిన ముందీ ఊరికే ముప్పొస్తది. ఇక్కడ జరిగినన్ని గొడవలు ఇంకేసోటా జరగవ్." గొణుక్కుంటూ అటూ ఇటూ చూశాడు.

    ఇంతలో దూరంగా కేకలు వినిపించి ఖంగారుగా అటు చూశాడు.

    లక్ష్మీ చేతులు తిప్పుకుంటూ ఆక్రందనలు చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తోంది. కేశవులు గుండె జారిపోయింది. అసలు పిల్లలెక్కడున్నారో? ఏ ప్రమాదం ముంచుకొచ్చిందో?

    "పిల్లలేరే?" అన్నాడు వణుకుతూ.

    "పిల్లలు మా పిన్నమ్మింటికాడుండార్లే గాని, ఆ బాబుగారు కళ్లు తిరిగి పడ్డారయ్యా, సెంటర్లో యాంటో గొడవ గొడవగా ఉందట. మేడమీద కెక్కిచూసి మంటలూ, అయ్యీ కనపడగానే పడిపోయారంట. గుండె నొప్పి వచ్చిందంట. ఆయమ్మ ఒకటే శోకాలు, ఒకటే శోకాలు. రాయ్యా, సమయానికి పెద్దమ్మగారు గూడా లేరు. సిన్నబాబుగారూ, ఆ యమ్మా పెళ్లికి బోయారంట."

    లక్ష్మి మాటలు వింటూ గబగబ నడిచాడు కేశవులు. గారేజ్‌లో కారుంది. ఆ ప్రాంతంలో అన్నీ ఆధునికంగా, అందంగా దూరదూరంగా కట్టిన ఇళ్లు. అసలే నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు మరీ మౌనంగా ఉంది.

    వరండాలో కంగారుగా తిరుగుతున్న సరోజ "వచ్చారా" అంది ఆత్రంగా. కళ్లు వాచిపోయున్నాయి. జుట్టు రేగిపోయింది. లంఖణాలు చేసిన దానిలా నిస్త్రాణగా ఉంది. 

    "సమయానికింట్లో ఎవరూ లేదు, ఎవరికి ఫోన్ చేసినా ఈ సమయంలో కారు తీసుకుని రావ్టానికి ధైర్యం చేయట్లేదు. నాలుగు సందు లవతలే నాన్నగారి డాక్టరున్నారు" ఆపద్భాంద్భవుణ్ణి చూసినట్టుగా ఆమె దీనంగా అంది. 

    నిన్నటి ఆ ఠీవి, ఆ దర్పం ఏమయిపోయాయో? శోకదేవతలా దీనాతిదీనంగా ఉన్న ఆమెని చూడగానే కేశవులు చలించిపోయాడు. 

    "అమ్మగారా, భయపడమాకండి. ఎల్లి ఆ డాట్టర్గార్ని తీసుకురానా! ఫోన్ చేశారా?"

    "చేశాను, అటువైపు మరీ గొడవగా ఉందిట. ఎలాగోలా నాన్నగార్నే తీసుకురమ్మన్నారు" భయం, కంగారు ఎక్కువై సరోజ కళ్లల్లోంచి ధారాపాతంగా నీళ్లు కారసాగాయి. 

    కేశవులు మరింక ఆలస్యం చేయలేదు. ఊరడిస్తూ లక్ష్మి సాయంతో జాగ్రత్తగా రిక్షాలో భూషణంగార్ని చేర్చాడు. సరోజ తండ్రి తల ఒళ్లో పెట్టుకుని జాగ్రత్తగా కూచుంది. తండ్రితో ఆమెకు అనుబంధం ఎక్కువ. ఈ ఆపదని ఒంటరిగా ఎదుర్కోవడం ఆమెని మానసికంగా భీరువుగా చేస్తోంది.

    "అసలు కారు చెడిపోయిందిరా కేశవులూ. లేకపోత నేనే డ్రైవ్ చేసుకుంటూ నాన్నగార్ని తీసుకెళ్లేదాన్ని. చూడు, అన్నీ కలిసొచ్చాయి" దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.

    "కాదా మారి?" అనుకున్నాడు రిక్షా జాగ్రత్తగా పోనిస్తూ. ఏదో అవాంతరాం రాబట్టిగానీ ఆళ్లకేం కర్మ? అసలిటువంటి ఉపద్రవంలో అయ్యగార్ని ఏసుకెళ్లాసిన అవసరమేముంది? అయితే ఏ టయిం ఎట్టుంటిదో ఆ భగవంతుడికే తెలియాలి అనుకుంటూ ప్రాణమొకెత్తుగా భావిస్తూ భూషణంగార్ని హాస్పిటల్‌కి చేర్చాడు. ఆ డాక్టరుగారు ప్రతిభావంతుడు. భూషణంగారికి ఆత్మీయుడు. చకచకా జరగవల్సినవి జరిగిపోతున్నాయి. అయ్యగారికి భయంలేదులే అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడే బయట మెట్లమీద కూలబడ్డాడు. కనీసం టీ కుడా తాగలేదు. ఇప్పుడు బాగా కళ్లు తిరుగుతున్నాయి. తూలొస్తోంది.

    కాంపౌండర్ బయటికొచ్చి ఓ చీటీ చేతిలో పెట్టి "ఇవి ఇంకో హాస్పిటల్‌లో ఉన్నాయంట. జాగ్రత్తగా వెళ్లి నిన్ను తెమ్మన్నారు. అక్కడికి అయ్యగారు ఫోన్ చేశారు నిన్ను పంపిస్తున్నట్లు" అన్నాడు.

    ఇక సందేహించకుండా లేచి నిలబడ్డాడు. అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. శక్తి ఎలా వచ్చిందో తెలియదు. ఆఘమేఘాల మీద పరిగెత్తుకెళ్లి అల్లర్లనీ, గొడవలనీ పట్టించుకోకుండా, పోలీసుల ప్రశ్నలకి శాంతంగా జవాబిచ్చి చీటీ చూపించి అవసరమైనవి పట్టుకొచ్చి ఇచ్చాడు.

    "దేవుడిలా రక్షించావురా కేశవులూ! ఇదిగో ఈ పది రూపాయలుంచుకో. లక్ష్మీ, నువ్వూ ఇల్లు కనిపెట్టుకొని చూడండి. చిన్న తమ్ముడొక్కడే ఉన్నాడూ" ఆపద గడిచిన ధైర్యంతో కృతజ్ఞతగా అంది సరోజ. చేతిలో సిప్ చేస్తున్న కాఫీ కప్పుంది.

    "అమ్మా, బండుందేమో - సమయానికి అయ్యగార్ని కాపాడుకోగలిగాం. మీరు సల్లగా ఉంటేనే తల్లా మాబోటి వాళ్లకింత కూడుండేది. డబ్బులుంచండి. మనింటికాడకెళ్లి మద్దానానికి వత్తానిక్కడికి. ఏ బెంగ పడకండి" ధైర్య వచనాలు చెప్పి కదిలాడు.

    మంజూ నిలయం దగ్గరకెళ్లి వరండాలో కూలబడ్డ లక్ష్మి దగ్గరకెళ్లి అన్నీ వివరించి చెప్పాడు. లక్ష్మి చేతులు జోడించి దేవుడికెన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సంతృప్తిగా నిట్టూరుతూ వింటోంది.

    "నేనిక్కడ కూసునాన్లే. పిల్లలెలా ఉండారో చూసిరా. వచ్చేటపుడు కాత్త కాఫీ చేసుకురా" అన్నాడు అలసటగా.

    "వంటమె కూడా రాలేదు. అసలెక్కడా రోడ్డుమీద నడిచే ఈలుందా యావన్నానా? ఇందాక సిన్నబాబుగారు అడిగితే కాసిచ్చాను. అడుగూ బొడుగూ ఉంది. పట్టుకొత్తా నుండు" అంది లక్ష్మి. లోపలికెళ్లి ఓ విరిగిన కప్పు వెతికి కాఫీ పోసుకొచ్చి భర్త కిచ్చింది.

    ఆ సమయంలో ఆ కాఫీనీళ్లు పడగానే కేశవులుకి పోతున్న ప్రాణాలు తిరిగొచ్చినట్టయింది. తాగిన ఖాళీ కప్పు కింద పెట్టగానే ఓ పెద్ద గుంపు గేటు తీసుకొని లోపలికి రావడం కంటపడింది.

    "ఎవరయ్యా" అన్నాడు ఆశ్చర్యంగా లేచి నిలబడి.

    "అదిగో, ఆ షెడ్లో కారుంది. ఈ ఇంటోడూ అడ్డమైన గడ్డీ తిని సంపాదించాడు. రండి, ఇరగ్గొట్టండి. తగలేయండి" బాగా తాగున్న ఓ ముప్పయ్యేళ్ల వ్యక్తి పచ్చి బూతులు తిడుతూ రంకెలేశాడు.

    "అసలిక్కడెందుకురా? సెంటర్లో షాపులున్నాయి ఈడికి. అక్కడికే పదండ్రా."

    "కాదిక్కడా మన తడాఖా సూపిద్దాం. ఈ డబ్బులున్నోళ్లంతా ఈ రోజుతో నేల కరవాల్సిందే" ఇంకో మనిషి అన్నాడు.

    కేశవులకేం అర్థం కావడంలేదు. వీళ్లు మరీ రౌడీలుగా కనబడడం లేదు. కొన్ని తెలిసిన మొహాలు కూడా కనబడుతున్నాయి. ఓ ఉన్మాదపు రాక్షసి నగరంలో తాండవం చేస్తోంది. దాని ప్రభావం వల్ల ఎవరూ ఏ ఆలోచనా లేకుండా, ఏదో మత్తులో - అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరికెవరు శత్రువ్లో తెలియడంలేదు. ఎందుకు దోపిడీ చేస్తున్నారో తెలియదు. నిద్రాణమైన కసీ, అసంతృప్తీ, క్రౌర్యం ఈ రోజున వీరవిహారం చేస్తున్నాయి.

    ఎవరో లోపలికెళ్లి కుర్చీలూ, బల్లలూ ఎడాపెడా లాగుతూ వరండాలోకి తీసుకొచ్చారు. కేశవులకి కోపం నసాళానికి అంటింది. "అసలెవురీ గాడిదలు" అనుకుంటూ పళ్లు నూరాడు. అయినా తను రెచ్చిపోవడానికిది సమయం కాదనుకుంటూ చేతులు దగ్గరికి చేర్చి ప్రార్థించాడు. 

    "అన్నల్లారా, ఇది పద్ధతి కాదు. ఎక్కడో ఏవో గొడవలు జరిగాయని ఇలా డబ్బుగలోళ్ళ ఇళ్లమీద పడి దోసేయడం న్యాయంగాదు. అరేయ్ రంగయ్యా! నువ్వు నాయకత్వం జేసి ఈళ్లందర్నీ లాక్కొచేవు గదరా. మనం రెక్కలమ్ముకొని బతికేవాళ్లమే గాని రౌడీలం గాదు. ఎల్లిపొండి. మన రాత బాగోక పోలీసులు చేతిలో జిక్కితే ఇరగబాదుతారు. ఎల్లిపొండిం, ఎల్లిపొండి."

    "అరేయ్ ఈణ్ణి రెండూ పీకండి.ఏంటో లెక్చర్లు దంచుతున్నాడు. అసలు ఇప్లవం అంటే ఈ సన్నాసిగాడికేం తెలుసు? ఎప్పుడయినా మీటింగులకొచ్చాడా యావన్నానా? లోపలికి పోయి బీరువాలు తెరవండి" పూనకం వచ్చిన వాడిలా ఆ గ్రూపుకి లీడర్‌లా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి గర్జించాడు. అందరూ పోలోమంటూ ముందుకు రాబోయారు.

    "ఆగండి!" శివమెత్తిన వాడిలా గుమ్మానికడ్డంగా నిలబడి కేశవులు హూంకరించాడు. అనుకోని ఈ ప్రతిఘటనకి ముందు అందరూ విస్తుబోయారు. ఆ తరువాత చప్పున తేరుకుని కేశవుల్ని ఓ నెట్టు నెట్టారు. కింద పడ్డ కేశవులు తల పగిలి రక్తం కారసాగింది. లోపల గజగజా వణుకుతున్న లక్ష్మి బావురుమంటూ వచ్చి - "అయ్యా, బాబా అన్నలారా" అంటూ అందరికీ అడ్డంగా నిలబడింది. "అయ్యా నా మొగుణ్ణేం చేయకండి. దేవుడులాంటి ఈ ఇంటి మడిసి, ఉదయమ్నుంచీ ఆయనకి గుండె నొప్పి. ఆసుపత్రిలో ఉండారు. ఇంటిలో ఎవరూ లేరు బాబూ! నా మాటిని ఎనిక్కి ఎల్లండి. మీ తోడబుట్టిందాన్ని. ఎల్లిపొండి" వలవలా ఏడుస్తూ అందరికీ దణ్ణాలు పెడుతూ బ్రతిమలాడసాగింది. ఈ లోపల కారుతున్న రక్తాన్ని తలగుడ్డతో అదిమిపెడుతూ కేశవులు లేచి నిలబడ్డాడు. 

    ఎంత అరాచకంగా ప్రవర్తించే మనుషులైనా వాళ్లకీ కొన్ని నియమాలున్నాయి. ఆడకూతురి మొహం చూస్తూ మరీ దౌర్జన్యంగా ప్రవర్తించలేక ముందు కెళ్లలేక, వెనక్కి పోవడానికి పౌరుషం అడ్డురాగా కాస్త తటపటాయిస్తూ నిలబడ్డారు.

    ఇంతలో ఆ పరిస్థితిని రక్షించటానికా అన్నట్లు పోలీసు విజిల్ వినిపించింది. అంతే ఎక్కడి వాళ్లక్కడ తుపాకీ శబ్దానికి చెల్లాచెదురైన పిట్టల్లా తలో మూలకి పరిగెత్తారు. 

    లక్ష్మీ కేశవుల ఆనందం చెప్పతరం కాదు. కొన్ని వస్తువులు విరిగితే విరిగాయిగానీ. అసలేమీ నష్టం జరగలేదు. వరండాలోవన్నీ జాగ్రత్తగా లోపలికి సర్దారు. లోపల గదిలో దాక్కున్న చిన్నబాబు సూర్యం అస్సలు బయటకు రాలేకపోతున్నాడు. కేశవులు ఆ గది దగ్గరకు వెళ్లి ఒకటికి పదిసార్లు "బయపడమాకండి బాబూ" అని ధైర్యం చెప్పాడు. 

    ఆ తరువాత రెండు రోజులకి గాని ఇంటామె, పెద్ద కొడుకు రాలేకపోయారు. భూషణం గారికి ప్రాణగండం తప్పింది. ఆ రెండు రోజులూ తమ పిల్లల్ని కూడా లెక్కచేయకుండా కంటికి రెప్పలా ఇల్లు కాపాడుతూ - హాస్పిటల్‌కీ, ఇంటికీ ఓపిగ్గా తిరిగారు లక్ష్మీ, కేశవులు.

    కొన్నాళ్ల పాటు నగరంలో భీకర సంగ్రామం సాగింది. విధ్వంసకాండలు జరిగాయి. దాడులు జరిగాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఏళ్ల తరబడి శ్రమలకోర్చి సంపాదించుకున్న ఆస్తులన్నీ బూడిదైపోతుంటే నిస్సహాయంగా చూడడం మినహా ఏమీ చేయలేకపోయారు. 

    తిరిగి మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొని ఎప్పటిలా స్కూలుకి రిక్షా నడిపించే సమయం వచ్చేసరికి, నిజంగానే ఇంకో జన్మ ఎత్తినట్టుగా అనిపించింది కేశవులకి.

* * *

    చాలా రోజుల తరువాత కలుసుకున్న పిల్లలంతా తమకు తోచిన మేరకు అమాయకంగా, వింతగా ఊళ్లో జరిగినవన్నీ కథలుగా చెప్పుకుంటున్నారు. "అవును కదా రిక్షాబ్బాయి" అంటూ మధ్య మధ్య అడుగుతున్నారు. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ రిక్షాని స్కూలు ముందాపి పసివాళ్లని జాగ్రత్తగా లోపలికి నడిపించుకెళ్లాడు.

    ప్రేయర్ జరిగిన తర్వాత అమ్మగారి గదిముందు అసంకల్పితంగా నిలబడ్డాడు. చొరవగా లోపలికి అడుగుపెట్టాడు. వినయంగా నవ్వుతూ, నమస్కారం చేశాడు.

    అప్పటికీ, ఇప్పటికీ సరోజ వైఖరిలో తేడా ఉంది. ఎందుకొచ్చాడో గ్రహించగలిగింది. శాంతంగా కేశవులు చెప్పింది వింది. మొహంలో కోపచ్ఛాయలు కనబడకుండా జాగ్రత్తపడింది. దయగా తలూపుతూ చిరునవ్వుతో వింది. 

    "దయుంచండమ్మా" అన్నాడు సంబరంగా వెనక్కి తిరుగుతూ. తన పిల్లాడు అప్పుడే యూనిఫారంలో ఆ స్కూలుకి రిక్షాలో ఎక్కివస్తున్నట్లు ఊహించుకుంటూ కలల్లో తేలుతూ బయటకి నడిచాడు. 

    'వీడికీ కోరిక ఎందుకు పుట్టిందో? ఆదిలోనే తుంచెయ్యకపోతే చాలా ప్రమాదం. మొన్నటి గొడవల్లో ఈ రిక్షా వాళ్లు కూడా ఎంతగా దోపిడీలు చేశారో కథలు కథలుగా అందరూ చెప్పుకున్నారు. ఎలాగౌఅ స్కూలు బస్ నడపబోతున్నారు. ఆ వనకపెట్టి రెండు రోజుల్లో వీడికి ఉద్వాసన చెప్పాలి. రోజూ ఈ స్కూలుని చూడడం వల్ల వీడి కోరిక పెరిగి, మహావృక్షమవుతోంది. తనేమిటో, తన లెవలేమిటో మరిచి మరీ వాడి పిల్లాడి కోసం సీటు మళ్లీ అడుగుతున్నాడు. చాలా తెలివిగా తను ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి.'

    ప్రిన్సిపాల్ సరోజ బుర్ర పాదరసంగా పనిచేయడం ప్రారంభించింది. 

(ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక 1987లో ప్రచురితం)                      
Comments