సరికొత్త సూర్యోదయం - శైలజామిత్ర

    
"మధూ...! మధూ...!" అంటూ గోడ అవతలనుండి సుజాత ఆంటి గొంతు వినబడింది మాధవికి.

    "ఏంటి ఆంటీ...?" అంటూ చదువుతున్న పేపర్ పక్కనే పెట్టి వెళ్ళింది మాధవి.
 
    "ఏమీలేదమ్మా...ఏదయినా పనిమీద వున్నావా? పని ఏదైయినా వుంటే చూసుకోమ్మా... పర్వాలేదులే. మా అబ్బాయి అమెరికానుండి నాకు నెక్లెస్ పంపాడు. అది నీకు చూపుదామని అంతే..." అంటూ  చేతిలో వున్న నెక్లెస్‌ను చూపించింది... ముఖం అంతా ఆనందంతో నిండిపోగా. 

    అది గమనించిన మాధవి "చాలా బావుంది ఆంటీ...మీకైతే ఇంకా బావుంటుంది..."అంది నవ్వుతూ చేతుల్లోకి తీసుకుని చూస్తూ. 

    "దీని ఖరీదెంత అనుకుంటున్నావు?" అడిగింది అదే ఆనందంతో...

    "నాకు తెలియదాంటీ... నేనెప్పుడూ బంగారాన్ని కొనలేదు. మీరే చెప్పండి" అంది నవ్వుతూ.

    "డెబ్భై అయిదు వేలటమ్మా... అదీ నా కోడలికి తెలియకుండా పంపాడు పిచ్చినాగన్న. వాడికి నేనంటే ఎంత ప్రేమో..." అంది మరింత మురిసిపోతూ సుజాత.

    "అలాగా" అని ఇంకే వివరాలు అడగకపోవడంతో "నీకో విషయం తెలుసా...? అసలు నా కోడలికి మా అబ్బాయి మా ఇంటికి రావడం కూడా ఇష్టం వుండదు. ఇక్కడకొచ్చిన వారం కూడా వుండనివ్వదు. మొనంటికి మొన్న నన్ను పుణ్యక్షేత్రాలకు పంపుతానంటే ఎందుకు ఆవిడకు ఆరోగ్యం బాగుండదు. మనతో పాటు తీసుకెళదాములే అంటోంది. అయినా అవన్నీ మా వాడు పట్టించుకోడులే..."అంటూన్న ఆమాటలు ఆగవని గ్రహించిన మాధవి 

    "ఆంటీ... ఏమనుకోకండి. మావారు పిలుస్తున్నట్లున్నారు. నేను మళ్ళీ కలుస్తాను!" అంటూ బయట పడీంది.

    'ఏంటో దాదాపు డెబ్బై ఏళ్ళున్న సుజాతమ్మకు కొడుకుపై ప్రేమ వుండటం సహజమే... కానీ... కోడలిని ఆడిపోసుకోవడం అనేది అనవసరం. అయినా వీరు మారరా? ఆరోగ్యం బాగుండదని తనతో తీసుకెళతానంది గానీ పంపొద్దు అనలేదు కదా? బంగారంపై అంత ఇష్టత ఎందుకో' అనుకుంటే సగం చదివి వదిలేసిన పేపర్‌ను చేతిలోకి తీసుకుంది మాధవి.

    సామాన్యంగా ఆడవారందరికి బంగారంపై మోజు వుంటుంది కానీ ... మాధవికి ఏమాత్రం చిన్నతనం నుండి ఉండేదికాదు. తాను పుట్టి పెరిగింది మధ్యతరగతి కుటుంబంలో. ఆరుగురు సంతానం మధ్య పెరగటం వల్లనో మరే కారణమో తెలియదు కానీ మాధవికి దేనిమీదా పెద్దగా మక్కువ వుండదు...అందుకే ఎప్పుడూ ఏదో కొనుక్కోలేదని ఎపుడూ బాధపడదు కూడా. తలుపు వేసినా కూడా సుజాత ఆంటి వేరెవరికో తనకు కొడుకు నగ ఇచ్చిన సంగతి కోడలు మనస్తత్వం గురించి చెబుతున్న మాటలు వినబడుతూనే వున్నాయి. వీరు మారరు అనుకుని మాధవి తన భర్త ఊరి ప్రయాణానికి బ్యాగ్ సర్దడానికి లోపలికి వెళ్లింది. 

    "మధూ...అన్నీ సర్దావా? పోయినసారి నువ్వు సాక్స్ పెట్టలేదు. నిన్ను నమ్ముకుని నేను తెల్లవారేసరికి నా పరిస్థితి చాలా చిరాకుగా మారింది. సరే ఏం చెయ్యను? పాతవే వేసుకుని బయటకు వెళ్లిన నేను రూంకు వచ్చేటప్పుడు కొత్తవి కొనాల్సి వచ్చింది. అనవసరంగా డబ్బు వేస్టయింది. తర్వాత నల్ల ప్యాంటుమీద ఆ గోల్డుకలర్ షర్ట్ పెట్టకుండా గ్రీన్ షర్ట్ పెట్టావు. ఛీ...నలుగురిలో సిగ్గేసిందనుకో" అంటూ ఎవేవో మాధవి చేస్తిన తప్పుల్ని పొరపాట్లను చెబుతూనే వున్నాడు.

    ఆ మాటలకు అడ్డుతగులుతూ "మీకేం కావాలో మీరే ఉదయం బయట పెట్టేస్తే నేను సర్దేస్తాను కదా" అంది మెల్లగా మాధవి.

    "అంతా నేనే చేసుకుంటే తమరేం చేస్తారట? కూర్చుని తింటారా? అందరూ అంటున్నారు ఏంటి? ఈరోజుల్లోకూడా నీ భార్య అంత చదువుకుని ఇంట్లోనే వుంటోందా? నిజంగా నిన్ను మెచ్చుకోవాలి... నిజంగా నీయంత మంచివాడు ఎక్కడ దొరుకుతాడు అని. నువ్వేమో ఏదో ఉదయం పిల్లలకి కాస్త తిండి వండి పెట్టడానికి కూడా యెంతో అలసిపోయినట్లు ఫీలవుతూ... కనీసం భర్త ఊరు వెడుతున్నా... బ్యాగ్ సరిగా సర్దడానికి కూడా ఓపిక లేకుండా టి.వి. చూస్తూ కాలక్షేపం చేస్తున్నావు.  అయినా నిన్ననీ ఏం లాభం? మీ నాన్నని అనాలి. ఎందుక్కూ పనికిరానిదాన్ని నాకు అంటగట్టాడు" అంటూ విసుగుతో భర్త మాటలు పడుతూనే మౌనంగా వుండకుండా...

    "అలాంటప్పుడు పెళ్లయిన కొత్తలోనే ఇలా అనివుంటే నేను సంపాదనలో పడివుండేదాన్ని. ఇప్పుడు మీరు రాత్రిదాకా పనిచేయమంటే నావల్లకాదు. అయినా మీకు కావల్సింది అనాల్సింది ఏదో మనసులో ఉంచుకుని మీరిలా సందర్భం లేకుండా మాట్లాడటం మంచిది కాదు" అంది మాధవి కాస్త కోపంగా. 

    "మాటకు మాట బాగా నేర్చావు... మూదుపూట్ల తిని నీడపట్టున వుంటున్నావుకదా...!" అంటూ తిన్న చేతిని మాధవి కొంగుకే తుడుచుకుని బయటపడ్డాడు మూర్తి.

    ఇక ఆపై ఇంకేమీ మాట్లాడలేకపోయింది మాధవి. ఏంటి తాను తిన్నది...అతను పెట్టింది? అని కాస్సేపు ఆలోచిస్తే పెదవులపై విరక్తిని సూచించే నవ్వొకటి విరిసింది. మగవాడు అనడం ఆడవారు పడటం అనేది ఎంత ఆధునికంలోకి పరుగులు తీస్తున్నా తప్పటంలేదు. నాగరికత అంటూ ఏదైనా వుంది అంటే అది స్త్రీకూడా సంపాదించడం...సరే... అంటూ అంతలో కాలేజీకని వెళ్ళిన పిల్లలు రావడంతో వారిపనిలో పడింది మాధవి.

    అంతలో పక్కింటి సుజాత ఆంటి మళ్ళీ పిలవడంతో... ఏమయిందో అనుకుంటూ "ఏంటి ఆంటీ?" అడిగింది పక్కనే వున్న తలుపును తీస్తూ. 

    "ఏమీ లేదమ్మా ఇందాక నువ్వు మీవారితో ఏదో తగువులాడుతున్నట్లున్నావు. వినబడిందిలే. మగాళ్ళు అంతేనమ్మా... ఈరోజు మీ అంకుల్ చాలా సౌమ్యంగా కనబడుతున్నారే కానీ పెళ్ళయిన కొత్తలో ఆయనా అంతే... అయినదానికి కానిదానికి ఒకటే గొడవ. ఛ...ఛ... చాలా పడ్డానమ్మా. అయినా మాటకు మాట అస్సలు నేను నీలా ఇచ్చేదాన్ని కాను. అలా మౌనంగా పడివుండేదాన్ని" అంటున్న ఆమె తనను పొగుడుతోందో  తెగుడుతోందో తెలియనట్లయింది మాధవి పరిస్థితి. అయినా ఊరుకోకుండా ఊరుకోకుండా... "నేను మాటకు మాట ఇవ్వటం లేదాంటీ... మరీ మా నాన్నను తిట్టడమెందుకని అన్నానంతే..." అంది మెల్లగా.

    "అదే అలానే మన పుట్టింటివారిని అనడమే వారికి అలవాటు. చదువుకున్నావు కదా ఎలా పడతావులే... అయినా ఈ ఊరయినా వెళితే నీకోసం కనీసం చీరయినా తెస్తారా?" అంది ఆరాతీస్తూ.

    "అపుడపుడు ఆంటీ... అయినా నాకు వాటి మీద పెద్దగా ఇష్టముండదు. ఉన్నాయి కదా చాలు అనిపిస్తుంది. ఏదో సరదాగా నవ్వుకుంటూ గడిపేయాలనిపిస్తుంది ఆంటీ. కనీ మగవారు  భార్యతో కలిసి సరదాగా సమానంగా మాట్లాడితే తామేదో తగ్గిపోయినట్లు ఫీలవుతారు" అంది మాధవి కాస్త నిరాశ ధ్వనించే స్వరంతో.

    "మా కాలాల్లో ఎంతో భయపడి చచ్చేవారం అనుకో... వారు కళ్ళతో చెబితే దాసీల్లా పనిచేయాల్సిందే... కాదు కూడదు అన్నామో ఇక అంతే పుట్టినిటికి పంపేవారు. అయినా మేము నోరెత్తకుండా ఇప్పటిదాకా వుంటున్నాం కూడా... ఇక సరదానా... అలాంటి మాటలే వుండేవికావు. ఏదో ఇప్పుడంటే పెద్దాడు పెళ్ళయాక వాడింటికి వెళితే సినిమాలు, గుళ్ళు గోపురాలు అంతే... అయినా నా కోడలుందే అమ్మో..." అని మొదలెట్టగానే "ఆంటీ అబ్బాయి పిలుస్తున్నాడు మళ్ళీ మాట్లాడతాను" అంటూ లోపలికి రాబోయింది. అయినా  ఆపి "ఆగు... అసలు విషయం చెప్పడం మరిచాను. మా అబ్బాయి ఎల్లుండి వస్తున్నాడు. నన్ను మీ అంకుల్ని తీసుకుని కోడలు అందరూ కాశీ వెళుతున్నాం..." ఆనందం అంతా ముఖంనిండా వెల్లివిరియగా చెప్పింది సుజాత. 

    పాపం ఈ పెద్దవారు చిన్న విషయానికే ఎంత ఆనందపడతారో అనుకుంటూ "అలాగా ఆంటీ. వెళ్ళండి...వెళ్ళండి... మీరెప్పటినుండో కాశీవెళ్ళాలని అనుకుంటున్నారు. ఇన్నాళ్ళకు కుదిరింది. వెళ్ళండి ఆంటీ" అంది ఆనందంగా మాధవి.

    "సరేనమ్మా... నువ్వేదో పని వుందన్నావు కదా. చేసుకో. నేను  చేగోడీలు చేయాలి. అబ్బాయికి చేగోడీలు అంటే ఎంతో ఇష్టం. రాగానే నేను చేతికి ఇచ్చాననుకో 'అమ్మా... నాకోసం ఎంత కష్టపడి చేసావా' అంటూ నా భుజాల చుట్టూ చేతులు వేస్తూ మరీ చిన్న పిల్లాడైపోతాడనుకో..." అంటూ ఆనందంగా లోపలికి వెళ్ళింది. 

    సుజాతకు నవ్వు వచ్చింది ఆవిడ సరదా చూసి. ముచ్చటేసింది కూడా. చిన్నతనంలోనే అమ్మపోయింది కానీ... ఉండివుంటే అమ్మకూడా ఇలాగే వుండేదేమో అనుకుంది మాధవి లోపలికి వస్తూ. 

    ఇలాగే దాదాపు పదిహేను రోజులు గడిచాయి. మూర్తి ఇంటికి వచ్చాడు. ఎంతో సరదాగా కాశీ వెళ్ళిన సుజాతాంటీ కూడా తిరిగి వచ్చింది. కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్లతో ఆమె యిల్లు చాలా సందడిగా వుంది. విషయం మూర్తితో చెప్పింది కూడా... విన్న మూర్తి "ఏం? నీకూ వెళ్ళాలని వుందా? మనకు ఇప్పుడేం కుదురుతుంది. పిల్లల బాధ్యతలు అంటూ వుంటాయి కదా...! నీకు అంత ఇష్టంగా వుంటే చెప్పు. ఏదో ట్రావెల్స్ ద్వారా పంపేస్తాను ". మూర్తి మాటల్లోని వెటకారం మాధవిని ఎంతో బాధించింది. అయినా మాటకు మాట పెంచడం ఇష్టం లేక ఊరుకుంది.

* * *

    "అమ్మాయీ...! మాధవీ"

    "చెప్పండి ఆంటీ...ఎలా జరిగింది ప్రయాణం? మీరు రావడం నాకు వారం క్రితమే తెలుసు కానీ మీరేదో హడావిడిగా వున్నారని పలకరించలేదు. అందరూ వెళ్ళారా ఆంటీ?" అంది యథాలాపంగా పలకరిస్తూ మాధవి.

    "వెళ్ళారమ్మా. కానీ... నీకు ప్రసాదం ఇద్దామని వచ్చినప్పటినుండి ప్రయత్నిస్తున్నా. ఏదీ సమయం వుంటేగా... పసిపిల్లలు కదా... జాగ్రత్తగా చూసుకోవాలి మరి. దానికి తోడు పనిపిల్ల ఇప్పుడే మానేయడం మరింత ఇబ్బందిగా వుంది" అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది సుజాత.

    "అబ్బే...మరేం పర్లేదు ఆంటీ. నేను చూస్తున్నాను కదా...!!" అంటూ అందుకుంది.

    ఇక అప్పటి నుండి మొదలు పెట్టింది... తానెలా ప్రయాణం చేసిందో దర్శనం ఎలా జరిగిందో ఎంత డబ్బుపెట్టి ముందుగా ఏ కష్టంలేకుండా తన కొడుకు తనను ఎలా చూసుకున్నాడో చెప్పడం ఆరంభించింది. తను కొనుక్కున్న చీరలు తన కోడలికన్నా ఎంత రేటు తక్కువగా వున్నాయో చెప్పి బాధపడింది. తన కొడుకు కొందామన్నా తన కోడలు ఎలా అడ్డుతగిలిందో వివరించింది. ఆమె మాటలకు అడ్డు తగులుతూ "మరి కాశీలో ఏదో మన కిష్టమయినది తినుబండారం వదిలేస్తారుటగా... మీరేం వదిలేసారాంటీ...?" అంటూ అడిగింది మాధవి. 

    "ఎందుకు వదిలేయలేదూ... నాకిష్టమైన బెండకాయ వదిలేశాను. ఎందుకంటే ఇందులో ఒక మతలబు ఉంది. మీ అంకుల్‌కేమో యిష్టం వుండదు. ఆ కూర వండుకున్నప్పుడల్లా అంకుల్‌కు మరో కూర వండాలి. అలాగని నేను వండుకోకుండా వుండను. అందుకని ఇలా ఏదో ఒకటి చేస్తే తప్ప నేను మానన్లేనని ఈ నిర్ణయం తీసుకున్నాను..." అంది తన తెలివిని ప్రదర్శిస్తూ సుజాత.

    సుజాత తెలివికి ముందుచూపుకు చిన్నగా నవ్వుకుంటూ "పోనీలెండి... మంచిపని చేసి ఒక పెద్దపనిని తప్పించుకున్నారు" అంది.

    "నా కోడలు సంగతి అడగవేం? తనేం వదలదటమ్మా. 'మేము మళ్ళీ వచ్చినపుడు వదిలేస్తాం అత్తయ్యా. ఈసారికి ఇలా కానివ్వండి' అంది ముఖం మీదే. అంటే ఈసారి మీరు రావద్దనే కదా అర్థం? అంతమాత్రం తెలియదనుకుందా ఏంటి? తనలాగా ఇంగ్లీషు చదవలేదు.ఈవిడకేం తెలుసులే అనుకుని ఆపిల్ల నా కొడుకుతో ఇంగ్లీషులో మాట్లాడుతుందమ్మా. అవన్నీ నామీదే... నాకు తెలియననుకుంటోంది. ఆమాత్రం ముఖ కవళికలు పట్టలేనా ఏంటి?" అంది కళ్ళజోడు సరిచేసుకుంటూ సుజాత. ఆవిడ మాటలు వింటూంటే జీవతాన్ని తరచి చూసిన వృద్ధాప్యం కంటే మాధవికి పసితనం కనబడింది. బాల్యం వృద్ధాప్యం ఒకటే అనే మాటకు అర్థం స్ఫురిస్తోంది.  

* * *  

    "మధూ ఏం చేస్తున్నావ్?" అన్న మూర్తి మాటలకు ఉలిక్కిపడి లేచి "ఇప్పుడే నిద్రపట్టిందండి" అంది మెల్లగా.

    "మధూ... మొన్న మీ అన్నయ్య వాళ్ళు మీ అమ్మ తాలూకు డబ్బును ఇచ్చారు కదా? ఏం చేసావు" అడిగాడు కాస్త తీవ్రంగానే.

    "అవును అది తీసుకోవడం కొన్ని బాకీలు తీర్చడమూ అయింది. మిగిలింది పదివేలు అంతే... అది చిన్నదాని పేరుమీద డిపాజిట్ చేసాను. అయినా ఆ విషయం మీకు మొన్ననే మీరు అడగకముందే చెప్పానుగా..." అంది గుర్తుచేయాలని ప్రయత్నిస్తూ.

    "చెప్పావులే... కానీ ఇప్పుడు దానికి పదివేలతో ఏమంత అవసరం వుంది. నేను ఏదైనా అవసరం వుంటే ఇస్తాగా. నువ్వు వీలైతే ఉందయం నాకు ఆ పదివేలు యిస్తే...నాకు అర్జెంట్ పనిపడింది... తర్వాత వారంలోగా నీకిస్తాను" అన్నాడు నిజాయితీగా మూర్తి.

    "ఛ... ఏం మాటలండి ఇవి. డబ్బు అనేది నీది నాది అంటూ రెండు రకాలు వుండవు. మనది అంతే. మీకంతగా అవసరం వుంటే రేపే ఇస్తాను. ఇదేమైనా అప్పా మళ్ళీ వారం ఇవ్వడానికి. ఏంటో ఇందకటినుండి అలా అలోచిస్తున్నారు" అంది మాధవి నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ.

    "అవునూ... నిన్న నువ్వు తలనొప్పి అన్నావు. తగ్గిందా" అడిగాడు అనునయంగా తలపై చెయ్యివేస్తూ.

    "తగ్గింది. టాబ్లెట్ వేసుకున్నాను" అంది మాధవి ముక్తసరిగా.

    "రేపు తప్పకుండా డాక్టర్‌దగ్గరకు వెళదాం. సరేనా? నాకెన్ని పనులున్నా నిన్ను ముందు అక్కడికి తీసుకెళ్లిన తర్వాతే " అంటూ ఏవో మాటలు మాట్లాడాడు మూర్తి.

    ఆ మాటలకు మాధవి ఏమీ స్పందించలేదు. ఒక్కటి మాత్రం అనుకుంది. ఇక రెండురోజులవరకు తనకు ఎలాంటి సతాయింపు వుండదని. మనుషులు వారి మధ్య అనుబందం లేకపోవడంలో కొత్తదనం లేదు. కానీ ముఖాలు కూడా రూపాయినోట్లుగా మారిపోతుంటే ఎవరికోసం బతకాలో...ఎందుకోసం ఇంకా బతకాలో అర్థం కావడం లేదనిపించింది మాధవికి. రానురాను తన ధోరణిలో మార్పు కనబడుతోంది. ఎందుకిలా వున్న కాస్త జీవితాన్ని ఇలా నరకం చేసుకుంటారో తెలియని స్థితిలో వుంది. తాను పడుకుందో లేదో తెలియని మూర్తి "మధూ...మధూ" అంటూ రెండుసార్లు పిలిచాడు. మాధవి నిద్రలో లేకున్నా పలకాలని అనిపించక పలకలేదు... తనకు ఒకటే ఆలోచన... తనకెంతకాలం ఇలాంటి జీవితం...?

    ఒకవైపు కాశీకి వెళ్ళిన ఇష్టమీన కూరల్ని వదిలి వచ్చే బదులు సాటి మనసుకు నిత్యం కష్టం...నష్టం... కలిగించే గుణాలు ఒక్కొక్కటి వదలవచ్చు కదా...!! నిత్యం కోడల్ని పరాయి వ్యక్తిగా చూస్తూ నిందలు వేసే తత్వానికి నీళ్ళు వదిలేయొచ్చుగా... అలాగే డబ్బే ప్రధానంగా భావించే మూర్తి లాంటివారు భార్య మనసులేని ఒక వస్తువు అనే భావానికి నీళ్ళు వదిలేయొచ్చుగా...!! వీరికి మనసుండదా? మరమనుషుల్లా ప్రవర్తించే వీరి తీరులో మార్పు వస్తుందా? ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని, ఆకుల కదలికలను,పక్షుల అరుపులను, పసిపిల్లల ఆటలను గమనించలేని జీవితాలు ఇలాగే వుంటాయి మరి అనుకుని వచ్చే సూర్యోదయానికై ఎదురుచూస్తూ నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది మాధవి. 
Comments