శాశ్వతం - వేదాంతం శ్రీపతి శర్మ

    
నా బం
డి సామాన్యంగా వాన కురుస్తున్నప్పుడు ఆగకుండా సాగిపోతుంది. ఇదిగో ఆగిపోవచ్చు, అదిగో మరల స్టార్ట్ చేయాలి అని పలు మార్లు అనిపిస్తుంది. కానీ అదేమి విచిత్రమో ఎన్ని సార్లు వర్షం నీటిలో దానిని తడిపినా, ఎన్ని గోతులలోంచి నెట్టినా అది ఆగలేదు. కాకపోతే వాతావరణం నిర్మలంగా, పొడిగా ఉన్న రోజున చాలా త్వరగా ఎక్కడికైనా వెళ్లాలి అని అనుకున్నప్పుడు గబ గబా క్రిందకి దిగి దానిని స్టార్ట్ చేయాలని కిక్కుల మీద కిక్కులు తగిలించినా అలా కదలిక లేకుండా, అసలు సిసలు తెలుగు పాఠకునిలాగా ఏ స్పందనా లేకుండా, భావాతీతమైన స్థితిలోకి వెళ్లి నీకు నాతో ఏంటి పని? ఎందుకీ శ్రమ? అసలు ఎందుకు వ్రాయాలి నువ్వు? ఎవరికోసం బాధ పడాలి అనే ప్రశ్నలు అడగకుండానే అడుగుతుంది. దానికి తోడు ఎదురింటి ఆంటీకి ఎందుకో నేను బండి ఎలా స్టార్ట్ చేస్తానో చూడాలనే ఆసక్తి హెచ్చు. రోజూ ఎంత పని ఉన్నా అలా ఆ వేళ్టకి బయటకి వచ్చి నిలబడుతుంది. అలా అని చక్కగా స్టార్ట్ అయిన రోజున టాటా చెప్పదు, కాని రోజున సానుభూతీ చూపించదు... కాలం కదలీ కదలని బండిలాగా అలా సాగిపోతోంది...

    నా బండి గొప్పది. వానలో ఆగదు. అర్థం కాని వానే కదా, అర్థం కాని వారే కదా, ఎప్పుడు వస్తుందో తెలియని సమస్యలే కదా జీవితంలోని మిర్చీలు, మసాలాలు!

    అదే ఆలోచనలో మరో వానలోంచి ధైర్యంగా సాగిపోతున్నాను. ఆ చెరువు ప్రక్కన ప్రతి రోజూ వరుసగా నేరేడు పండ్లతోనూ, వేరు శనగ కాయలతోనూ, కొన్ని మామిడి పండ్లతోనూ కొందరు కూర్చుని ఉంటారు. వానకి ఎవరూ లేరు. ఎందుకో నా కళ్లు ఒక్కడి మీద పడ్డాయి. అంత వానలోనూ ఒక గోతం ముక్క నెత్తి మీద వేసుకుని ఆ ముసలాయన తన ముందు తడిసిపోతున్న రెండే రెండు మామిడి పండ్లను పెట్టుకుని కూర్చుని ఉన్నాడు.  ఎవరు ఆగాలని, ఎవరు కొనాలని, అలా ముందుకు వెళుతూనే ఆలోచించాను. కొద్దిగా ముందుకు వెళ్లి బండీ ఆపి వెనక్కి వచ్చాను. 

    'ఇవి ఈ సమయంలో ఎవరు ఆగి కొంటారని కూర్చున్నావు?' అడిగాను.

    అతను పళ్లికిలించాడు.

    'వాన ఆగదా సారూ?'

    అటూ ఇటూ చూసాను.'ఇప్పుడప్పుడే ఆగదేమో మరి '

    'చాలా వానలు చూసాం సారూ '

    'ఏంటీ? రాత్రి తొమ్మిదైనా ఎవరో ఇటు వెళ్లే వాడు ఆగి ఈ రెండిటినీ కొంటాడనా?'

    అతను నవ్వి ఊరుకున్నాడు.

    వెర్రి వాడనుకుని వెనుదిరిగాను.

    'దుకాణం అమ్మటం కోసమేనా?' వెనుక నుండి వినిపించింది.

    మరల ఇటు తిరిగాను.

    'మరి?'

    'రెయిన్ కోటు ఎందుకు తొడుక్కోలేదు సారూ?'

    'ఇంత నీరు నా లోపలికి వెళ్లిపోదు కదా?'

    'ఆ మెట్టు ఎక్కేకనే జీవితం సారూ!'

    'ఛా!'

    'ఇక్కడ ఓ పది మంది కూర్చుంటాం. నేనొక్కడినే రోజూ కూర్చుంటాను,ఏమున్నా లేకపోయినా '

    'ఎందుకు?'

    'మనం శాశ్వతం కాదు సారూ, మన వ్యవహారం శాశ్వతం...'

    'కరెక్ట్! కానీ వానలో కూర్చోవాలా?'

    'ఈ రెండు పండ్లు చూస్తే మీకేమనిపిస్తుంది? ఏమీ చేతకాని వాడు కనీసం ఈ రెండిటినీ అమ్మేసి కడుపు నింపుకుంటాడనా లేక ఓ గంప అమ్మేసి చివరికి ఈ రెండూ మిగుల్చుకున్న ఓ వ్యాపారి అనా?'

    వాన జోరుగానే ఉంది. ఇతను చాలా అనుభవించినట్లున్నాడు. నేను ఆగినందుకు ఆనందించాను.

    'మొదటిదే అనిపిస్తుంది.'

    'అవును. నేను ఊళ్లోకి పోయి చాలా వ్యాపారం చేసే వాడిని సారూ! ఇప్పుడోపిక లేదు. దగ్గరలో ఉన్న ఇళ్ల వారికోసం ఇలా రోజూ కూర్చుంటాను. ఏదో ఒకటి పెట్టుకుంటాను. నేను ఇక్కడికి వచ్చిన టైం ప్రకారం అందరూ టైం చూసుకుంటారు. ఎవరున్నా లేకపోయినా నేనుంటానని అందరికీ తెలుసు. పది మంది అమ్ముకుంటున్నా నా దగ్గరే ఎక్కువ మంది కొంటారు...'

    'పట్టుదల బాగుంది.ఇలా తడిస్తే ఈ వయసులో ఆరోగ్యం దెబ్బ తినదా?'

    '...'

    'ఇంకా ఎంత సేపు కూర్చుంటావు?'

    'పోలీసు జీపు తప్ప ఇంకేమీ రానంత వరకూ!', నవ్వాడతను.

    'ఇంట్లో ఎవరూ లేరా?'

    'ఉండేవారు!'

    'ఓ! ఓ పని చేయి. ఆ రెండూ నాకిచ్చి వెళ్లిపో!'

    డబ్బులు తీయబోయాను.

    'వద్దు సారూ!'

    'ఇదేంటి?'

    'ఈ వానలో బయటకు రాలేని ముసలోళ్లు ఉంటారు, ఎక్కడో దాక్కున్నగరీబులూ ఉంటారు. వాళ్లు నా మీద ఆశతో వాన ఆగాక ఇలా రావచ్చు.వాళ్లకు ఇచ్చేసి నేనూ లేస్తాను.'

    ఆ మాటకి నా తల సిగ్గుతో వంగిపోయింది. అతని ముందుకు కూర్చుని ఆ పండ్లను పట్టుకుని చూసాను.

    'నీరు పండులోకి వెళ్లదు సారూ! ఒక్క సారి తుడిస్తే చాలు!'

    అవి బాగా సడలిపోయున్నాయి.

    'ఇది కూడా దొరకని వారు ఉన్నారా లేరా?' ప్రశ్నించాడు.

    అవునన్నట్లు తలూపి లెచాను.

    'ఎక్కడుంటారు సారూ?'

    'లోపల కాలనీ...'

    'ఇంత దూరం వచ్చి ఇంటికి పోవచ్చు కదా? ఎందుకాగారు?'

    నవ్వొచ్చింది. రోజూ పద్దులు చూసుకునే వాడిలాగా కాకుండా కొద్ది సేపు ఆగిపోయి శాశ్వతమైన వాటి వైపు చూడలేకపోతే ఈ మొద్దు జీవితంలోని ముద్దూ లేదు, ముచ్చట అంతకంటే లేదు.

    'వస్తాను..', అని కదిలాను.

    'సారూ, రేపు పొద్దున మరల ఓ పది మంది నా పక్కన తయారవుతారు. ఈ చోటును మటుకు మరువకండి. నా కాళ్లు కదలలేనప్పుడు నా చోట్లో మరొకడిని పెట్టే పోతాను...'

* * *

    బండిని స్టార్ట్ చేసాను. సమస్యలు చూపించిన ఈ బండిని, సమస్యలో వెంటుండే ఈ బండిని, వట్టిదనంలో గట్టితనాన్ని నేర్పిన ఈ బండిని కాలితోనే తన్ని స్టార్ట్ చేయటం మొదటి సారి బాధ కలిగించింది... నాలో ఒక్క శాశ్వతమైన మంచి వ్యవహారం ఎవరికైనా గుర్తుంటుందా?

    షెడ్ కు వెళ్లిపోయిన రోజున ఈ బండి నా ఈ శాశ్వతమైన వ్యవహారాన్నే గుర్తు పెట్టుకుంటుంది... నా లాంటి నీచుడు ఈ సృష్టిలోనే లేడు!
Comments