సత్య సుందరం - చందు నాగేశ్వరరావు

    చేపకి మడుగు, పక్షికి గూడు, మొక్కకి పాది యిలా ప్రతీ ప్రాణికి ఆసరా వుంది. ప్రకృతి ఆదరణ వుంది. ఏ ఆలనా ఆచ్ఛాదనా లేని మానవ దేహాలకు ప్రభుత్వ ఆసుపత్రి వుంది. ఏళ్ళు ముదిరి కీళ్ళు కదిలిన దిక్కులేని దీనులు. అడుక్కునే శక్తిలేని అనాథలు. తమకంటూ ఏమీలేని నిర్భాగ్యులు. ఎవరి పలకరింపు పరామర్శలేని నిరాదరులు. ఒకరికి మించిన కష్టం మరొకరిది. ఒకరికి మించిన దైన్యం మరొకరిది. వారు ఆశగా ఆతృతగా ఎదురుచూసేది ఒక్కటే... అదే చావు. ఆ చావురాని చేవలేని శరీరాల్లో యిదీ ఒకటి.

    ఆ శరీరం ఇక్కడికి చేరి శనివారానికి వారం. చింకిపాతతో సమంగా చివికిన దేహం. ఏ ఆనవాళ్ళు, 'నా' అనేవాళ్ళు లేని ఆ శరీరాన్ని యిక్కడకు చేర్చింది సుబ్బారావు, సాగరం. చేర్చింది మొదలు యిడ్లి, పాలు నోటికి పట్టడం, అన్నం పెట్టడం, మందులు పోయడం. ముడ్డి మూతి తుడవడం, ఉచ్చపియ్య ఎత్తేయడం. ఇదీ నాలుగు రోజులుగా వారి విధి. ఆ చావురాని శరీరానికి వీరికి బంధం ఏది? ఎక్కడ వుంది? వుంది. ఇదిగో ఇక్కడ.

    అది వయోజన సంక్షేమ సంఘం. సమాజంలో తమ వునికికి అర్థం చెప్పుకుని వివిధ రంగాలలో వివిధ హోదాలలో తలపడి తలపండిన వారితో ఏర్పడింది ఆ సంఘం. దానికి కార్యాలయం వుంది. కార్యవర్గం వుంది. ఆ సంఘం కార్యకర్తలు సుబ్బారావు, సాగరాలైతే ఆ కార్యాలయానికి సేవకుడు రాత్రి సంరక్షకుడు ఆ శరీర యజమాని. తాను యజమాని ఆ శరీరానికి మాత్రమే.తెగిన గాలిపటం గున్నమామిడి గుబురుకు చిక్కుకున్నట్లు పది సంవత్సరాలుగా కార్యాలయమే కొలువు నెలవు ఆ శరీరాసామికి. ఉభయతారకంగా అతనికి ఆసరా దొరికింది సంఘానికి మనిషి దొరికాడు. ఆ విధంగా మొదలైంది వీరి అనుబంధం.

    కొంపగోడు లేదు. ఊరుపేరు లేదు. 'ఏమని పిలవాలి ముసిలోడా' అంటే 'ఎలా పిలిచినా పలుకుతానయ్యా' అన్నాడు. ఇక ముసిలోడా, ముసిలోడా... ముసిలిగా స్థిరపడి పోయింది పిలుపు. తనను ఏ పేరుతోను పిలిచేవాళ్ళు లేనిచోటా 'ముసిలి, ముసిలి' అని ఒకరికి పదిమంది తనను ఆప్యాయంగా పిలుస్తుంటే మురిసిపోయేవాడు.కానీ పిలిచే పిలుపులో వ్యంగ్యమో, వెటకారమో ధ్వనిస్తే చిరుబురులాడేవాడు. అప్పుడప్పుడు "గుర్రం ఎక్కే" అలవాటు వుంది ముసిలికి. 'అబ్బో ఈ పూట గుర్రమెక్కినట్లున్నావే ముసిలోడా' అంటే ఉక్రోషంతో వూగిపోయేవాడు. 'మీకేం పెద్దాళ్ళు పెద్ద గుర్రాలు, విదేశీ గుర్రా లెక్కుతారు. ఇంటికెళ్ళి మంచాలెక్కుతారు. నాదేముంది 'చీపు గుర్రం చాప నిద్రేగా' అని చురక అంటించేవాడు. 

    నిజానికి అక్కడ ఎవరూ మందు బాబులు లేరు. అయినా ముసిలోడి రుసరుసలకి మారుమాటాడక మిన్నకుండిపోయేవారు. ముసిలోడు మొండి ఘటం. 'తన తిక్కకి ఒక లెక్క ఉందన్నట్లు' వదిలి పెట్టిపోయినా పోతాడు. తాము యిచ్చే నామమాత్రపు జీతానికి యీ మాత్రం సేవలు చేస్తున్నాడంటే పడాల్సిందే. అదన్నమాట వారందరి సహనానికి సహకారాన్ని సమకూరుస్స్తున్నది. యీ సర్దుబాటన్నమాట. ఒక్కొక్కప్పుడు 'చీపు' ఎక్కువై వూగి తూగిపోతూ, మాటతూలినా పట్టించుకొనేవారు కాదు. 'భూమితో పాటు పుట్టాడు.పెద్దముండా వాడ'ని సరిపెట్టుకునే వారు. మరుసటిరోజు యివన్నీ లీలగా గుర్తొస్తాయేమో ఆ మన్నింపుకి  కృతజ్ఞతగా మెలిగేవాడు.

    సుబ్బారావు సాగరులంటే మరింత విశ్వాసంగా వుండేవాడు. 'తిట్టినా... పెట్టినా' వారేనని తన నమ్మకం. అయినా, వారికి ఒక్కొక్కప్పుడు కోపం తెప్పించేవాడు. 'నువ్వు పోక దాపరించావు ముసలోడా' అంటే 'అయ్యా అయ్యా అంతమాటనకండయ్యా' అమొ వేడుకొనే వాడు. మళ్ళీ 'అయ్యా ఒకవేళ పఒయినా మీరే పారేయాలయ్యా అదీ ఘనంగా' అనేవాడు. ఒకసారి చేతిలో చేయికూడా వేయించుకున్నాడు. అదిగో ఆ ప్రమాణమే యీ ప్రాణానికి యిప్పుడు ఆసరా యిచ్చింది.

    సుబ్బారావు కూతురిని అత్తింటినుంచి తీసుకువచ్చారు. సీమంతం చేయాలి. పిలుపులు, బంధువులు, వేడుక, సందడి. కరేపాకు దగ్గర్నుండి కలర్ టి.వి. వరకు తానే వెంటవుండి కొనిస్తేకాని తృప్తికాదు తన భార్యకి. నాలుగు రోజులుగా ఇదే పని సుబ్బారావుకి.

    సాగరం సమీప బంధువు చనిపోయాడు. తన సామాజిక బంధువర్గంలో ఎవరు పోయినా ముందుగా కబురొచ్చేది సాగరానికే. తానొచ్చి నిలబడి అన్నీతానై చివరిదాక, కథ కంచికి చేరేదాకా ఈ దయాసాగరం చేతులమీదుగా జరగాల్సిందే. అది ఆచారంగా ఆనవాయితీగా మారిపోయింది. 

    అయినా ఇద్దరికీ ముసిలోడిదే యావ. 'బాగున్నాడా, బాల్చీ తన్నేశాడా?' తాము పైసలిచ్చి పురమాయించిన ఆయా సరిగా చూస్తోందా లేదా? ఏదైనా జరిగితే ఎట్లా? ఒక్క ఫోన్ కొట్టమన్నాము అటువంటిదేం లేదు. అయినా ముసిలోదు గట్టిపిండం. అంత తేలిగ్గా పోయేప్రాణం కాదనుకుంటూ నెట్టుకొస్తున్నారు.

    మర్నాడు ఆస్పత్రికి వస్తూనే ఆదుర్దా, ఏదో ఆందోళన. 'ఈ శాల్తీ వుందా గల్లంతైందా?' వేటగాడి చూపులు లక్ష్యంమీద వున్నట్లు ముసిలోడి మంచాన్నే వెతుకుతున్నాయి వారి కళ్ళు. కానీ మంచం ఖాళీ. ఒకరిమొకమొకరు చూసుకున్నారు. నిబ్బరించుకున్నారు. నెమ్మదిగా అడుగుమరొకడుగుగా మంచం దాపుగా చేరారు. సమీపంగా నేలమీద మొలకు మూరెడు బట్టతో మానవదేహం. మన ముసిలోడేనా 'చీపు' కొట్టి దొర్లడమా, యిటు తిప్పిచూశారు. అమ్మయ్య కదిలాడు. తాగిన మైకంలో ఉన్నాడు. కాని మన ముసిలోడు కాదు. చచ్చే చావొచ్చిందిరా బాబూ. ఏమైవుంటాడీ ముసిలోడన్న సందేహంతో, భయంతో ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి వారి ముఖాలు.

    వీరినే గమనిస్తున్న ప్రక్క బెడ్డుమీది ముసిలవ్వ ప్రాణమూ, మాటలూ కూడదీసుకొని 'అయ్యా ఆ మంచం మీది ముసిలోడి కోసమా? పాపం నిన్న... కాదు మొన్న పోయాడయ్యా... శవాల కొట్లో పారేసుంటారయ్యా' రేపటి తన పరిస్థితిని ముందే ఆరాతీసుకున్నట్లు, తెలిసిందల్లా చెప్పింది. విని నిరుత్తరులయ్యారు. నీరుగారిపోయారు.

    మెల్లగా మనసు కూడదీసుకుని శవాల కొట్టు వైపు కదిలారు. అబ్బో వాసన, దుర్గంధం, కంపు. శవాల కంపు కడుపులో దేవినట్లైంది. డోకొచ్చి వాంతి అయ్యేలా వుంది. చావు కబురు చావు కంపు కడుపులో దేవుతున్నది. పొర్లితే ఏరులే కానీ దిగమింగారు. ఈ లోపులో ముసిలోడి పరామర్శకోసం వచ్చిన మరో కార్యకర్త చలమయ్యకూడా వీరితో చేరాడు. పోస్టుమార్టం చేసివుంటారా? మార్చురీలో పెట్టివుంటారా? లాంటి ధర్ర్మసందేహాలతో తచ్చాడుతున్నారు. అటుగా వస్తున్న శవాలకొట్టు కాపలాదారుని ఆపి జరిగింది చెప్పారు.

    అనుమానాస్పద మృతులు, ప్రమాదాలలో పోయినవారు, హత్యకు గురైన వారికి పోస్టుమార్టం చేస్తారుగాని, సహజమరణాలకి చేయరని ఆ ముసిలోడి కాయం లోపలే వుందని, అనాథ శవంగా తేల్చి మున్సిపాలిటీ వారికి కబురు పెట్టినట్లున్నారని చెప్పారు. ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు. శవాల కొట్టు కిటికీ రెక్కలు నెట్టి తొంగి చూశాడు చలమయ్య. వొంటిమీద నూలుపోగు లేక, నిగడదన్ని నేలమీద పడున్న శవాన్ని చూసి "మన ముసిలోడే"నన్నాడు. ముగ్గురూ ధృవపర్చుకున్నారు. గబగబా ప్రవేశించారు. అప్పుడే రింగ్ చెసిన సూపరింటెండెంట్ "హలో! మున్సిపాలిటీ వారా" అనడంతో "సార్... ప్లీజ్... ప్లీజ్... జస్ట్ వెయిట్. ఉయ్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఆర్ఫన్ కార్ప్స్" అని ముగ్గురూ ఒక్కసారే అనడంతో అవాక్కయ్యారు సూపరింటెండెంట్.

    పరుగులో వెనకబడినా ఫర్వాలేదు. ఇది పరువు. పరువు పోతే తిరిగిరాదు. వయోజన సంక్షేమ సంఘం పరువు. ఒక వయోజనుడు, అదీ తమకు సేవలు చేసిని వాని చావుతో ముడిపడిన పరువు. బాధ్యత, సేవానుబంధంతో కలిసి ఉన్న పరువు. సరైన సమయంలో కదిలి సమయస్ఫూర్తిగా వ్యవహరించి పరువుని, ప్రతిష్టని పొదివి పట్టుకున్నారు. శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    వైకుంఠపురికి కబురు చేశారు. వైకుంఠ రథం వచ్చింది. పూలు, దండలు, అగరబత్తీ, పన్నీరు, చాప, తాడు, తెల్లబట్ట అంతిమ యాత్రకు కావలసిన సమస్త సామాగ్రి వచ్చిచేరింది. సంఘం సెక్రటరీ వచ్చారు. "ఆ నలుగురు"తో పాటు మరో పదిమంది వైకుంఠ రథాన్ని అనుసరించారు. 

    ముసిలోడికి వారసులు లేరు. గోత్రీకులు లేరు. తలకొరివి పెట్టేవారూ లేరు. అయితే దహనసంస్కారం "నావల్ల కాదన్నా"డు కాటికాపరి. అది వారి సంప్రదాయం. తలకొరివి పెట్టిన తర్వాత మాత్రమే మిగతా కార్యం పూర్తి చేయడం ఆనవాయితి అని తేల్చాడు. తలగోక్కొన్నారందరూ. తలోదిక్కూ చూశారు. ఆలోచించారు. ఏం తోచడం లేదు. కాటికాపరే సలహా చెప్పాడు "మట్టి చేస్తే అడ్డుచెప్పమ"ని. క్షణాల్లో గొయ్యి తీశారు. పార్థివ శరీరాన్ని అందులో వునచ్చారు. ఆ పార్థివ శరీరం మీద తలో దోసెడు మట్టి ధర్మం చేశారు. మిగతా కార్యక్రమం కాటికాపరి పూర్తిచేశాడు. ముసిలోడికి జోహార్లు చెప్పి సెలవు తీసుకున్నారు.

    ఆరోజు సాయంత్రం ముసిలోడి వస్తుసామాగ్రికి పంచనామా పెట్టారు. చెంబు, బక్కెట్టు, దుప్పటి, కర్ర ఇత్యాదులతోపాటు పెట్టె తెరచి అందులో వున్న బట్టలు వగైరా ఏవిధంగా వీలుంటే ఆ విధంగా పేదలకు యిద్దామని నిర్ణయించారు. అందరూ చేరి పెట్టె తెరిచారు.

    ఒక్కసారిగా నోళ్ళు తెరిచి ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. నోట్లు, పచ్చనోట్లు. 500లు, 100లు, 50లు, 10లు కలిపి లెక్కిస్తే 21,600 రూపాయలు. "కన్నులుండి చూడలేరు కొంతమంది జనం. దారితప్పి తిరగడమే తెలివిలేనితనం." కొందరు డబ్బంటే లెక్కేలేకుండా ఖర్చు చేస్తూ బ్రతికేస్తున్నారు. మరికొంతమంది నిర్లక్ష్య నిరర్థక జీవితాలతో బ్రతుకులీడుస్తున్నారు. కానీ ముసిలోడి బ్రతుకులో ఎంత అణకువ, ఎంత అభిమానం. తాము డబ్బు సమకూర్చుతాం. కానీ ఎక్కడ తినేవాడో, ఏది తినేవాడో ఎవరికీ తెలియదు. అంతే వుద్విజ్ఞతతో అందరి కళ్ళూ చెమర్చాయి.    

ఆ పంచనామాలో డబ్బు డినామినేషన్‌తో సహా లెక్కతేల్చి ఆ డబ్బు పెట్టి ఉంచిన సంచిలో  మడతపెట్టి ఉంచిన కాగితం... కాదు... ఉత్తరం... లేదు... 'వీలునామా', ఆ పత్రం విప్పి చదివారు. అందులో సారాంశం. 

    తన పేరు సత్య సుందరమని, తనది కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర ఫలానా ఊరని, తనకు అయినవాళ్ళు, పైసలున్న వాళ్ళున్నారని, అయినా విలువ, గౌరవం లేనిచోట యిమడలేక అన్నీ వదులుకుని వచ్చేశానని, ఒక అధికారి వద్ద వ్యక్తిగత సేవకునిగా వుండేవాడినని, అది పర్మినెంట్ అయిందని, కానీ, అధికారి భార్య వేధింపులు పడలేక అంటే... అడ్డమైన చాకిరి, అడ్డదిడ్డంగా పురమాయించేదని, మగవాడు ఆడదానిమీద పెత్తనం చేయడమే సహించలేని తాను అధికారి భార్య అయిన ఆడది తన మీద పెత్తనం చేయడం భరించలేక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకోలేక ఉద్యోగం వదిలి వచ్చేసానని... అక్కడక్కడా పనీ పాటు చేస్తూ బ్రతికానని, చివరకు ఇక్కడకు చేరానని, ఇక్కడ అందరూ పెద్దలు, పెద్దమనస్సు కలవారూనని, తనని బాగానే చూసుకున్నారని, అప్పుడప్పుడూ తాను దురుసుగా ప్రవర్తించినా పెద్దముండా కొడుకనిమన్నించారని, అటువంటి ఈ పెద్దలకి, పెద్దల భవనానికి ఋణపడి వుంటానని, ఈ పెట్టెలో ఎంతోకొంత డబ్బు వుందని, అది ఎంతో తనకు తెలియదని, అకస్మాత్తుగా పోతే ఈ మొత్తాన్ని ఒక "నిధి"గా పెట్టి వచ్చినంతలో ప్రతి సంవత్సరం బీదలకు అన్నదానం చేయాలని, అన్నం అడిగే వాళ్ళు లేనంత కాలం దాకా ఇలా జరగాలని, అప్పటి వరకు తాను పోయిన రోజున తనను తలచుకుంటూ తన సేవలను గుర్తుచేసుకుని పెద్దలు సభలో పోయిన వారికి జోహార్లు చెబుతున్నట్లు తననూ గుర్తుచేసుకుంటూ జోహార్లు చెప్పాలని కోరుకున్నాడు. 

    కాదు ఆజ్ఞాపించాడు... అవును ఆజ్ఞాపించాడు... బ్రతికున్నంత కాలం సంఘానికి సేవచేశాడు. పోయిన తర్వాత సమాజానికి ధర్మం చేస్తున్నాడు. ఇది సత్య సుందరమనే పేరుగల ముసలాయన నమ్మిన ధర్మం. కనీస మానవ ధర్మం.

(ప్రజాసాహితి ఏప్రిల్ 2013 సంచికలో   ప్రచురితం)  
Comments