సత్యం - టి.శ్రీవల్లీరాధిక

    
"సత్తెమ్మా! పాప స్కూల్ బ్యాగ్ వ్యాన్ లో పెట్టు" 

    రోజూ ఏడున్నర అవుతూండగా ఆ కేక వినబడడం.. వంట గదిలో పని చేసుకుంటూన్న నేను అప్రయత్నంగా తలత్రిప్పి కిటికీలో నుంచి ప్రక్క యింటి వైపు చూపు సారించడం క్రమం తప్పకుండా జరిగే వ్యవహారం.

    బరువైన స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూన్న డెబ్భై యేళ్ళ సత్తెమ్మా .. చక్కటి స్కూల్ డ్రెస్ లో మెరిసే షూస్ తో చేతులూపుకుంటూ వెళ్తూన్న పదమూడేళ్ళ శరణ్యా ...ఎన్నో రోజులుగా అలవాటయిన దృశ్యమే. అయినా ఏ రోజూ మింగుడు పడదు.

    రెండో విడత కాఫీ కలుపుకుని కప్పుతో పాటూ ఉత్తరం వైపు బాల్కనీ లోకి నడిచాను.

    ఇటు వైపుకి రాగానే మొత్తం దృశ్యమే మారిపోతుంది.  మా యింటికి దక్షిణం వైపున అందమైన భవంతి వుంటే ఉత్తరం వైపు ఒక గవర్నమెంట్ స్కూల్ వుంది.

    ఈ బాల్కనీ ప్రక్క యింటి వాళ్ళ అందమైన తోట కనబడేలా దక్షిణం వైపుకు లేకుండా యిటు ఉత్తరం వైపుకి ఉండడం చూసి ఈ యింటికి వచ్చిన మొదటి రోజున కొంచెం బాధ పడ్డాను నేను. 

    కానీ స్కూల్ పిల్లల సందడి అలవాటయ్యాక ఇపుడు ఇదే బాగుందనిపిస్తోంది.

    కాఫీ త్రాగుతూ స్కూల్ వైపు చూశాను. ఒక్కొక్కరుగా వస్తున్నారు పిల్లలు. సంతోష్… వాడే అందరికన్నా ముందొస్తాడు రోజూ. రాగానే ఒక చీపురు పట్టుకుని ఎడాపెడా స్కూల్ ముందు వూడ్చేస్తాడు.

    స్కూల్ బ్యాగ్ ఓ ప్రక్కన పెట్టుకుని, తనతో పాటు వచ్చిన చెల్లెలిని మరోప్రక్కన కూర్చోపెట్టి, జారిపోయే పాంటుని ఒక చేత్తో పైకి లాక్కుంటూ ... మరో చేత్తో చెత్తతో పాటూ అరంగుళం మేర మట్టిని కూడా చిమ్మి పారేసే ఆ పిల్లాడ్ని చూడటం కూడా నాకు రోజూ ఎదురయే అనుభవమే.

    బాల్కనీ లో కూర్చుని చిరునవ్వుతో వాడినే గమనించసాగాను నేను. వాడి చురుకుదనమూ.. పనిలో శ్రద్ధా.. మధ్య మధ్యలో చెల్లెలి మీద పెత్తనం.. అన్నీ ముద్దొస్తున్నాయి.

    చదువు కూడా పర్లేదు. బాగానే చదువుతాడు. "జ్ఞానేంద్రియాలంటే ఏంటివిరా!" అని వాళ్ళ సార్ అడిగితే టకటకా చెప్పేస్తాడు. ఒక రామారావుకో కృష్ణారావుకో వచ్చే జీతాన్ని మూడు రకాలుగా ఖర్చుపెట్టాక ఇంకెంత మిగులుతుందో చెప్పమంటే కొంచెం ఆలస్యంగానయినా మొత్తానికి చెప్తాడు.

    పదింటికల్లా పనంతా పూర్తి చేసుకుని ఓ పుస్తకం పట్టుకుని ఈ బాల్కనీలో కూర్చుంటే .. వాళ్ళు చదివే తెలుగు పాఠాలు.. చేసే లెక్కలూ .. అన్నీ వినిపిస్తూంటాయి నాకు.

    వాళ్ళో ప్రక్కన చదువుకుంటూంటే మరో ప్రక్కన వాళ్ళ కోసం భోజనం తయారవుతుంది. వంట చేసే ఆవిడ బియ్యం కడిగి పెట్టడం.. కూర తరుక్కోవడం.. సాంబారో, పప్పో వండడం.. అన్నీ ఓ వైపు గమనిస్తూనే పుస్తకాలు చదువుకుంటాను నేను. 

    అన్నాలు పెట్టే టైం కి పిల్లలందరూ పళ్ళాలు కడుక్కుని వరుసలో నిలబడతారు. సంతోష్ చెల్లెలు మరీ చిన్నది. అది మెట్లు దిగి మట్టిలో ఆడుతూ వుంటుంది. వాడే రెండు పళ్ళాలూ కడిగి…. అన్నం, పప్పూ పెట్టించుకుని,  చెల్లెల్ని ఓ పళ్ళెం ముందు కూర్చోబెట్టి…. తను ప్రక్కనే కూర్చుంటాడు.

    నిన్న మధ్యాహ్నం.. అలాగే పళ్ళెం కడుగుతున్నాడు వాడు. చేతిలోని పుస్తకం పక్కన పెట్టి  రెయిలింగ్ మీద చేతులానించి నిల్చుని అటువైపే చూస్తున్నాను నేను. 

    అంతలో రోడ్డుకి అటువైపు నుంచి ఇద్దరాడవాళ్ళు నడిచి వస్తూ కనిపించారు. వాళ్ళలో పూల చీరావిడ .. నాకు పరిచయమున్న మనిషే. రెండు వీధులవతల వుంటారు. స్కూల్ ముందు నుంచి వెళ్తూ సంతోష్ ని చూసి టక్కున ఆగిపోయిందావిడ.

    "ఏరా! మీ అమ్మ రావడం లేదేమిరా!” అంది.

    వాడు పళ్ళెం తో పాటూ ఆవిడ దగ్గరకొచ్చి "జొరం"  అన్నాడు. సంతోష్ వాళ్ళ అమ్మ ఆవిడ యింట్లో పని చేస్తూంది కాబోలు అనుకున్నాను నేను.

    "ఆహా!" అంది ఆవిడ వెక్కిరింతగా. "నాలుగు రోజులనుంచీ జ్వరమేనేమిట్రా దొంగవెధవా!" అని వాడిని కసిరి "ఒకసారొచ్చి చెప్పన్నా పోలేదు. ఎవర్నైనా పంపించనూ లేదు." అంది ప్రక్కనున్నావిడతో. 

    అలా అంటూనే.. ఒకసారి సంతోష్ నీ, వాళ్లకి పెడుతున్న అన్నాన్నీ మార్చి మార్చి చూసింది. ఆ తర్వాత 
"మీరింతేరా! ఎంత చేసినా మీ బ్రతుకులింతే. మీ దొంగ బుద్ధులూ, అబద్ధాలూ మారవు." అని ఛీత్కరించి వెళ్ళి పోయింది.

    ఆ ఛీత్కారం వాడికి అర్ధమయిందో లేదో కానీ,  నాకు మాత్రం మనసంతా చేదుగా అయిపోయింది.  చాలారోజులుగా వాడిని గమనిస్తున్నానేమో వాడంటే ఒకరకమైన వాత్సల్యం నాకు. 

    "అయ్యో! ఎందుకలా అంటున్నారు! వాడి గురించి మీకేం తెలుసని వాడివి దొంగ బుద్ధులంటున్నారు!" వెళ్ళి పోతున్న ఆవిడని చూస్తూ నేను మనసులోనే గొంతు చించుకున్నాను.

    నిన్నటి నుంచీ ఆ విషయమే మనసుని తొలుస్తోంది.

    అటు వైపు శరణ్యా వాళ్ల అమ్మ శైలజా అంతే. ఆ యింట్లో పని చేసే వాళ్ళ మీద ఏ మాత్రం ఆదరణ చూపదు. ఎప్పుడూ కనీసం ముగ్గురు పనివాళ్ళుంటారు ఆ యింట్లో.  సత్తెమ్మ పర్మనెంటు. మిగతా యిద్దరూ మారుతుంటారు.

    శైలజ అసలు ఏ పనీ చేయదు. టి.వి. ఆన్ చేయడానికి రిమోట్ వుంటే, ఆ రిమోట్ ఆన్ చేయడానికి మరో మనిషి కావాలావిడకి.

    ఎవరినైనా పనిలో పెట్టుకొనేటపుడు ఇంత వివరంగా పనులన్నిటి లిస్టూ చెప్పదు కాబట్టి,  ఎంత పని వుంటుందో అంచనా లేకుండా పనిలో చేరిన వాళ్ళు.. ఆ తర్వాత హడలిపోతారు. ఎంతకూ తెమలని చిన్నా చితకా పనులతో రోజంతా ఇక్కడే గడపలేక, నాల్రోజులకే పని మానేసి పారిపోతుంటారు.

    సత్తెమ్మ మాత్రం మానదు. ఆ యింటితో ఆమెకి వున్న అనుబంధం అటువంటిదేమో! 

    శైలజ అత్తగారు చెప్తుంది. శైలజా వాళ్ళ ఆయనకీ, ఆడపడుచుకీ అయిదారేళ్ళున్నపుడు పనిలో చేరిందట సత్తెమ్మ. పిల్లలకి నీళ్ళు పోయడం,   తలలు దువ్వడం లాంటి పనులన్నీ చేసేదిట. ఇపుడు ఆ పనులన్నీ  శైలజ కూతురు శరణ్యకి చేస్తోంది. 

    పనంతా పూర్తయింది. ఆలోచనలే తెమలలేదు. పుస్తకం మీదికి మనసు పోలేదు. సత్తెమ్మ భుజం మీది స్కూల్ బ్యాగ్ బరువునీ.. సంతోష్ కి పట్టిందో లేదో అర్ధం కాని అవమానపు బాధనీ నా మనసు మోస్తూండటం వల్ల కాబోలు…. అశాంతిగా వుంది.

    పేపర్ తిరగేశాను కాసేపు. ఏ పేజీలో ఏ వార్త చూసినా అన్నింటి సారాంశం ఒకటే.  ఒక వర్గం మరో వర్గం పై చూపే అసహనం. 'మీరింతే' అంటే 'మీరింతే' అన్న ఘోష. 

    టి.వి... ఇంటర్నెట్.. బ్లాగులూ.. ఎక్కడ చూసినా ఇదే ధోరణి. ప్రభుత్వమూ.. ప్రతిపక్షమూ.., ఆస్తికులూ.. నాస్తికులూ..,  అగ్రవర్ణాలూ.. అణగారిన వర్గాలూ.. అందరూ.. మీరింతే అంటే మీరంతే అని దెప్పిపొడుచుకోవడమే. ఏదీ మనశ్శాంతినివ్వలేదు.

    బాల్కనీలోకి వచ్చి చూస్తే ఎటు చూసినా ఆడవాళ్ళే జట్లు జట్లుగా నడుస్తూ కనిపించారు. కూరలూ, సరుకులూ తెచ్చుకుంటూన్న వాళ్ళూ.. పిల్లల కోసం స్కూల్ కి అన్నం పట్టుకెళ్తున్న వాళ్ళూ.. మధ్యాహ్నం వరకే స్కూల్ వుండే చిన్నపిల్లల్ని ఇళ్ళకి తెచ్చుకుంటూన్న వాళ్ళూ.. 

    అవసరమూ, అలవాటూ లేకపోయినా నేనూ ఒక సంచీ తీసుకుని ఇంటికి తాళం పెట్టి బయట పడ్డాను. మెల్లగా రైతు బజార్ వైపు అడుగులేయసాగాను. ఆలోచనలు మాత్రం తెగలేదు. 

    "మీరింతేరా!" ఆమాటే చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినబడుతోంది. ఎంత తేలిగ్గా అనేసిందావిడ!

    సంతోష్ వాళ్ళ అమ్మ చెప్పింది అబద్ధమే కావచ్చు. అయితే మాత్రం వాడినలా కసురుకోవాలా! మీరింతేరా! అని తీర్మానించాలా! 

    ఎందుకో ఆ 'మీరింతే' అన్న మాట .. అన్ని చోట్లా తరచుగా వినిపిస్తూన్న 'ఇదింతే' అన్న తీర్మానం నాకు మింగుడు పడడం లేదు. 

    ఒక మంచి సిద్ధాంతాన్నో, ఆచారాన్నో 'ఇదింతే' అని ఒప్పుకోలేని మనం.. పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్నీ తరచి తరచి ప్రశ్నించే మనం.. చాలా విషయాలని మూఢ నమ్మకాలుగా, మూఢాచారాలుగా కొట్టి పారేసే మనం.. కొన్ని భావాలను మాత్రం అతి జాగ్రత్తగా పట్టుకుంటున్నాం. అణువణువునా నిలబెట్టుకుంటున్నాం. ఎందుకని!

    ఈ ప్రశ్నే నన్ను వేధిస్తోంది. ప్రతి వర్గమూ కొన్నిటిని సత్యాలని నమ్ముతుంది. మరి కొన్నిటిని అసంబద్ధాలంటూ నిరసిస్తుంది. అవతలివైపు వున్న చిన్న లోపాన్ని కూడా భూతద్దంలో చూస్తుంది. ఆలోపాన్ని గమనించలేని గురివిందగింజ తత్వాన్ని ఎద్దేవా చేస్తుంది. 

    కానీ తన సిద్ధాంతాన్ని మాత్రం తనూ అంతే గుడ్డిగా నమ్ముతుంది. వీళ్ళకి వీళ్ళు చూసేదే సత్యం. వాళ్ళకి వాళ్ళు నమ్మేదే సత్యం.

    ఏదో ఒక విషయాన్ని నమ్మడమే మనందరికీ యిష్టమయినపుడు.. దానికి అందరమూ సిద్ధమయినపుడు.. అది అందరికీ అంతగా అలవాటయిన విషయమయినపుడు.. అందరమూ ఒకటే విషయాన్ని ఎందుకు నమ్మలేం! అసహనమూ, ఘర్షణా లేకుండా ఎందుకు వుండలేం!

    నా పిచ్చి ఆలోచనకి నాకే నవ్వొచ్చింది.

    ప్రక్క యింటి గేట్ దాటుతూంటే శైలజ గొంతు వినిపించింది. “"నీకీ మధ్య బద్ధకం బాగా పెరిగిపోయిందిలే!”
అప్రయత్నంగా తలత్రిప్పి అటువైపు చూసిన నేను .. ఆమాట తను సత్తెమ్మని వుద్దేశించి అనడం చూసి .. అలవాటయిన విషయమే అయినా మళ్ళీ ఆశ్చర్యపోయాను. 

    నేను నాలుగడుగులు వేసేసరికి వెనుక నుంచి సత్తెమ్మ గొంతు వినబడింది. తనుకూడా ఏవో సరుకులు తెచ్చేందుకు బయల్దేరినట్లుంది.

    "ఏందమ్మా! కూరల కోసం వెళ్తున్నావా!" అంటూ పలకరించింది.

    'ఏమైంది సత్తెమ్మా!' అని అడగాలనిపించినా మర్యాదగా వుండదని వూరుకున్నాను.

    కానీ నా మొహం లోకి చూసిన సత్తెమ్మ ఆ ప్రశ్నని చదివేసినట్లుంది. "అమ్మకి భయం" అంది నవ్వుతూ. "మా అబ్బాయి వుజ్జోగంలో చేరి పైసలు పంపిస్తున్నాడు కదా! నేను పని మానేస్తానేమోనని శైలజమ్మకి భయం!" 

    ఆ విశ్లేషణకి నేను నివ్వెరపోయాను.   "నువ్వింతే. నువు పని దొంగవి.  నీకు బద్ధకం. కాసేపు ఏమారితే నువు పనంతా ఎగ్గొట్టేస్తావు!" అని శైలజ సత్తెమ్మని సతాయించడం చాలాసార్లు విన్నాను నేను.

    కాని ఆ సతాయింపు వెనుక వున్నది భయం అన్న సత్తెమ్మ మాటలు కొత్త గా వున్నాయి. 
నిజమే. భయం వున్నచోట విచక్షణ నశిస్తుందేమో! ఏది చేయకూడదో .. ఏది చేస్తే సరిగ్గా మనం భయపడ్డ విషయం జరుగుతుందో సరిగ్గా అదే చేయడం జరుగుతుందేమో!  

    వయసుతో ముడతలు పడ్డ సత్తెమ్మ మొహం చూస్తే నా చిక్కుముడులన్నీ ఆమె మాటలతో విప్పుకోగలననిపించింది. తన వ్యాఖ్యకి వివరణ అడగాలనిపించింది.  కానీ అడగడానికి సంకోచం. 

    "ఏందమ్మా!  అంత గనం ఆలోచిస్తున్నావు !" అంది సత్తెమ్మ. 

    ఆ ప్రశ్నని ఆసరా చేసుకుని " అది కాదు సత్తెమ్మా. నువు ఎపుడూ ఏదో ఓ పని చేస్తూనే వుంటావు కదా! నీకు బద్ధకమేమిటి!?" అన్నాను.

    అంతటితో ఆగకుండా "ఆవిడసలు ఎపుడూ ఏ పనీ చేయదు కదా!" అని కూడా అన్నాను. శైలజ పట్ల అగౌరవం ధ్వనించకుండానూ …. ఆ రెండు విభిన్న విషయాలకీ పొత్తు ఎలా కుదిరిందన్న  సందేహం మాత్రమే నా ప్రశ్నలోవినబడేలాగానూ .... వీలయినంత జాగ్రత్త పడుతూ.

    సత్తెమ్మ నవ్వింది. "అంతే కదమ్మా. దూరం నుంచి చూసే నీబోటమ్మలు ఆమె ఏ పనీ చేసుకోలేదు కదా! చేసేవాళ్ళని ఎందుకు సతాయిస్తుందా అనుకుంటారు. కానీ ఆమె చేసుకోలేదు కాబట్టే కదమ్మా చేసేవాళ్ళలో తప్పులు కనబడేది. ఆమె కూడా పని చేయడం మొదలు పెడితే పనిలో కష్టం ఆమెకే తెలిసొచ్చుద్ది కదా!”  అంది.

    నేను నిలువు గుడ్లేసుకుని సత్తెమ్మ  వ్యాఖ్యానం విన్నాను.  ఎంత బాగా చెప్పింది!

    ఇప్పటివరకూ…. 'ఇది ఇలా వున్నపుడు అది అలా ఎలా వుంటుంది!' అని ఆలోచించడం మాత్రమే తెలిసిన నాకు.. 'ఇది ఇలా వుంది కాబట్టే అది అలా వుంటుంది’ అన్న సత్తెమ్మ మాటలు కొత్త కోణాన్ని చూపించాయి.
అవును. ఏవి రెండు విభిన్న సత్యాలని మనం భావిస్తామో అవి నిజానికి రెండు కావు. ఒకటే. లోపం మన ఆలోచనదే. నిజానికి రెండు సత్యాలు లేవు. రెండు సిద్ధాంతాలకీ ఘర్షణ లేదు.  ఒకే సత్యాన్ని తర్కం రెండుగా భ్రమింప చేస్తోంది. 

    'అదంతే. అది అలాగే వుంటుంది.' అనే మాట సత్తెమ్మ కూడా అంటోంది. కానీ యిది మిగతా వాళ్ళందరూ అంటున్న 'ఇదింతే' లా లేదు.

    నాకు రెండింటికీ తేడా అర్ధమవుతోంది. 

    అక్కడ స్పందన, తర్కమూ మాత్రమే వున్నాయి. ఇక్కడ నిర్వికారంగా ఒక విషయాన్ని గమనించిన అనుభవమూ ... అందులో నుంచి వచ్చిన అవగాహనా వున్నాయి. శైలజలోని 'భయమూ'.. సంతోష్ ని కసురుకున్న పూల చీరావిడలోని 'శోకమూ' సత్తెమ్మలో లేవు!

    నాకర్ధమయింది. అవతలివారిని ఒప్పుకోలేకపోవడానికి కారణం వారి సత్యం విభిన్నమవడం కాదు.  మనల్ని భయమో, శోకమో క్రమ్ముకోవడం.  

    ఏ విషయాన్నయినా 'ఇదింతే' అంటూ తీర్మానించడానికీ, నిరసించడానికీ కాస్తంత అహంకారం చాలు. కానీ 'ఇదింతే' అని అంగీకరించడానికీ, ఆచరించడానికీ బోలెడంత సంస్కారం కావాలి. 

    సత్తెమ్మ వెనుక నడుస్తున్న నాకు మనుషులని ముంచెత్తుతున్న మాయకి కారణం తెలిసినట్లయింది. మానవులందరూ ఒప్పుకోగల సత్యానికి దారి లీలగా గోచరించింది. 

(ఆకాశవాణిలో 3 ఆగస్టు 2009వ తేదీన ప్రసారితం) 

Comments