సౌజన్యం - రేగులపాటి కిషన్‌రావు

    అతని తల్లిదండ్రులు కూలీపనిచేసి తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంటులో చనిపోయిండ్రు. ఇప్పుడు రవీందర్ ఒంటరి వాడు. ఆ బస్తీలో సంతోష్‌నగర్లో నిర్మాణంలో వున్న అపార్టుమెంట్స్ దగ్గర ఒక ఖాళీ ప్లాటులో రవీందర్ వాళ్ళు వేసుకున్న గుడారం.
 
    అందులో బిందె, రెండు కుండలు, ఒక సత్తు బకెట్టు, మూడు పళ్ళాలు, మూడు గ్లాసులు, అయిదారు బగోనలు, ప్లేట్లు, ఒక కుక్కి మంచం నేలమీద ఉన్నాయి. తల్లి చీరలు, జాకెట్లు, తండ్రి దోతులు, అంగీలు, బనీన్లు, పంచెలు ఇవి తాడుతో కట్టిన దండెంపైన ఉన్నాయి. ఒక పక్కకు సంచిలో మూడు కిలోల బియ్యం, కడుముంతలో తినగా మిగిలిన చింతకాయ తొక్కు, ఓ తట్టలో ఎండు మిరపకాయలు, అవికంకెడు, వారం రోజులకు సరిపడా చింతపండు, ప్లాస్టిక్ డబ్బాలో రెండు చారల మిరప్పొడి, చిన్న సీసాలో నూనె, ఒక కిరసనాయిల్ సీసా, దానికి దగ్గరలోనే చిన్న సీసాతో తయారుచేసిన దీపం బుడ్డి.
 
    రవీందర్‌కు రెండు నిక్కర్లు, ఒక చినిగిన ప్యాంటు, రెండు అంగీలు, రెండు బనీన్లు, ఒక పాతబడిన తువ్వాల, అప్పుడప్పుడు తయారు చేసిన కొన్ని మట్టిబొమ్మలు ఇవీ అతని మొత్తం ఆస్తి వివరాలు.
 
    బంధువులు ఎక్కడో దూర ప్రదేశాల్లో కూలి చేసుకుంటూ ఊర్లు మారుతూ ఉంటుంటరు. ఇప్పుడు వాళ్ళు ఏ ఉళ్ళో కూలీ పని చేసుకుంటున్నారో, ఎట్లా బ్రతుకుతున్నారో రవీందర్‌కు తెలియనే తెలియదు.
 
    ఇతని గుడారం పది అడుగుల దూరంలో మరో రెండు గుడారాలున్నాయి. ఆ గుడారాలలోని వాళ్ళే ఇతనికి తెలిసిన ఆప్తులు, మిత్రులు. అయినా పేదరికంలో ఎవరికిని ఎవరు పట్టించుకొంటారు.
 
    రవీందర్‌కు ఇప్పుడు 12 సంవత్సరాలు దాటినయి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు మొన్నమొన్నటి వరకు కూలీపనికి వాళ్ళతో కలిసి వెళ్ళేవాడు. వాళ్ళు గుత్తపట్టిన పనులలో అతడు కూడా తన లేత రెక్కలతో పనిచేసే వాడు. తల్లిదండ్రుల మరణంతో రెక్కలు తెగిన పక్షి అయ్యిండు.
 
    ఓ రోజు పక్కనున్న గుడారపు మైసయ్య వాళ్ళతొ కలిసి ఇటుకల తయారీ కూలి పనికోసం వెళ్ళిండు. అక్కడ పని దొరకలేదు. మరోచోట ప్రయత్నం చేసినా ఎవ్వరూ పని ఇవ్వలేదు. అతడు నిరాశ చెందిండు. అయినా స్వంత గుడారానికి వెళ్ళకుండా మైసయ్య దంపతులు పనిచేస్తున్న ఇటుకల బట్టీవద్దకు వచ్చిండు.

    ఇటుకల కోసం మట్టి తయారు చేస్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి " కొంచెం మట్టి తీసుకోవచ్చా" అని అడిగిండు. మట్టి కలుపుతున్న కూలీ ఇతని వైపు చూసి "ఎందుకు?" అని అడిగాడు.

    "ఇక్కడ కూర్చుని బొమ్మలు తయారు చేసుకుంటా" అన్నాడు. అతడు ఓ మట్టి ముద్దను ఇతని వద్ద పడేసి పోయిండు.

    రవీందర్ ఆ మట్టితో చాలా చక్కగా కనిపించేటట్టు ఏనుగు బొమ్మను తయారు చేసిండు. తర్వాత గుర్రం బొమ్మను తయారు చేయసాగిండు. ఇటుకల కోసం మట్టి అందిస్తున్న ఆడవాళ్ళు, తట్టలలో మట్టివేసి ఆడవాళ్ళకు అందిస్తున్న మగవాళ్ళు ఇతడు చేసిన ఏనుగు బొమ్మను చూసి ఆశ్చర్యపడసాగిండ్రు.
 
    "ఆ పిల్లవాడు ఎన్నోరకాల బొమ్మలు తయారు జేస్తడు. వాడు తయారు జేసిన రకరకాల బొమ్మలు వాని గుడారంలో వున్నాయి. వాని గుడారం మా గుడారం పక్కనే ఉంది. తల్లిదండ్రులు చనిపోయిండ్రు పాపం" అని చెప్పింది మైసయ్య భార్య.
 
    "ఇప్పుడు మరో బొమ్మను ఏదైనా తయారుజేస్తవా? మట్టి ఇమ్మంటవా?" అడిగిండు మగకూలీ.
అతడు చేస్తనన్నట్టు తలవూపిండు. ఇతడు కొంత మట్టిని ముద్దగా తయారు చేసి తెచ్చి పిల్లవాని ముందు పడేసిండు. పిల్లవాడు బొమ్మ తయారుచేయడం ప్రారంభించాడు. అందరూ గుమిగూడి చూస్తున్నారు.

      "ఏమిటక్కడ చోద్యం చూస్తున్నారా?" పర్యవేక్షకుడు అరచినట్టుగా అన్నాడు. గుంపు చెదిరిపోయింది. పర్యవేక్షకుడు ఏనుగు బొమ్మను రెండు చేతులతో ఎత్తిపట్టుకుని,మన్ను కలుపుతూ తట్టలకు ఎత్తుతున్న మగ కూలీలవైపు విసిరికొట్టాడు. ఆ ఏనుగు బొమ్మ మగ కూలీల ముందు మట్టిలో దిగబడింది. తర్వాత మట్టిలో మట్టిగా కలిసిపోయింది.
 
    "నువ్వు పనికి రావద్దని చెప్పితిగదరా అప్పుడే. మళ్ళీ ఇక్కడకు దాపురించావేమిట? అయితే పనికి రావద్దని చెప్పినందుకు అలిగి పని చెడగొట్టడానికి వచ్చినవన్నమాట. పో ఇక్కడి నుండి పోతావా, వీపు మీద రెండు అంటించమంటావా?" అని కసిరిండు.
 
    రవీందర్ బిక్కమొగం వేసుకొని తన గుడారం వద్దకు తిరిగి వచ్చిండు. డబ్బున్న వాళ్ళు దయాదాక్షిణ్యాలు లేని వారని బాధపడ్డాడు. ఆ కూలీలందరు తన ఏనుగును చూసి మెచ్చుకున్నారు. ఆశ్చర్యపోయి చూసిండ్రు. కాని అతడేమిటి కనీసం మెచ్చుకోకపోయినా ఈసడించుకున్నాడు. చిన్న యెత్తు జాలికూడా చూపకుండా ఏనుగును మట్టిపాలు చేసిండు. అంత మంచి ఏనుగును ఆ మట్టిలో కలపడానికి అతనికి చేతులెలా వచ్చినయో! ముందు ముందు ఎలా బ్రతికేది? ఉన్న తిండి పదార్థాలు ఓ వారానికి సరిపోతాయేమో! తర్వాత ఏం చేసేది?
 
    బొమ్మలు తయారు చేస్తే రంగు వేస్తే ఊరులో తిరుగుతూ అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా కొనకపోతారా. ఎలాగో బ్రతకకపోతానా... ధైర్యం తెచ్చుకున్నాడు. బిక్షమెత్తుకోవడం అతనికి నచ్చదు. చాలా మంది బిక్షగాళ్ళవైపు హీనంగా చూస్తారు. కొందరైతే చడామడా తిట్టిపొస్తరు... తనను ఎవరైనా హీనంగా చూసినా... తిట్టినా... తను సహించగలడా?
 
    కొందరు బిక్షగాళ్ళవైపు జాలి చూపులు విసురుతారు... కాని దానం చేయరు... ఎవరో దానగుణం గలవాళ్ళు చిల్లర డబ్బులు పడేస్తరు. ఎంత కష్టం వచ్చినా బిచ్చగానిలా మారకూడదనుకున్నాడు. ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలనుకున్నాడు... మరోసారి ధైర్యం తెచ్చుకున్నాడు.
 
    మరుసటి రోజు రోడ్లవెంబడి తిరుగుతూ వెళ్తుండగా ఒకచోట బొమ్మలతయారీ కేంద్రం కనిపించింది. అక్కడ రంగులువేసి ప్రదర్శనకు పెట్టిన బొమ్మలు చాలా కనిపించినయి. అన్నింటిని ఆసక్తిగా చుసిండు. యజమాని వద్దకు వెళ్ళి తన విషయం చెప్పి పనికోసం అడిగిండు.
 
    "ఏమి పనిచేస్తావు నువ్వు?"
 
    "మీరు చెప్పిన పని చేస్తా. బొమ్మలు చేస్తా. రంగులు వేస్తా... ఇంకా నీళ్ళు తీసుకువస్తా... మీరు ఎంతసేపు పనిచెయ్యమంటే అంతసేపు చేస్తా. మీరు పని ఇస్తే చాలు" అతనివైపు ఆశగా చూసిండు.
 
    పని ఇవ్వడానికి యజమాని ఒప్పుకున్నాడు. "నీ పనిని చూసి జీతం నిర్ణయిస్తా" అని కూడా చెప్పిండు. మూడు రోజుల తర్వాత వచ్చేనెల మొదటిరోజున రమ్మన్నాడు.
 
    రవీందర్ ఆనెల మొదటి తేదీనాడు పొద్దుగాల్లనె వండుకొని తిని నీళ్ళసీసా పట్టుకొని బొమ్మల తయారీ కేంద్రం వద్దకు వెళ్ళిండు. అక్కడ ఏమీ పని జరుగుతున్న దాఖలాలు కనిపించలేదు. పనివాళ్ళెవరూ లేరు. బొమ్మలు ఎక్కడో లోపనలనే ఉన్నాయి. ప్రదరశనకు పెట్టలేదు. ఒక ముసలాయన మాత్రం దగ్గుకుంటూ మంచంలో పడుకొని వున్నాడు.
 
    రవీందర్ లోపల వున్న ఆ మంచంవద్దకు పోయి "ఏం తాతా! ఇక్కడి యజమాని ఎక్కడికి వెళ్ళిండు" అని అడిగిండు.
 
    "ఆయన నిన్నటి నుండి ఒకటే కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇంతకుముందే ఆటోరిక్షాలో దవాఖానాకు తీసుకుపోయిండ్రు" అని చెప్పిండా ముసలాయన.
 
    "ఇంతకూ నీకు ఏంకావాలి" అని అడిగిండు.
 
    "ఏం లేదు తాతా! నేను వంటరివాణ్ణి. పనికోసం నాలుగురోజుల ముందు ఈ యజమాని వద్దకు వచ్చిన. నెల ఫస్టు తారీఖునాడు రమ్మన్నాడు. ఈ రోజు మొదటి తారీఖని తెలుసుకొని వచ్చిన."
 
    "ఈ యజమానికి కడుపు ఆపరేషన్ చెయ్యాల్నట. ఆయన బాగుపడటానికి కొన్ని వారాలు పడుతుంది. తర్వాత వచ్చి కలువు" అన్నాడు ముసలాయన.
 
    రవీందర్ విచారపడుతూ ఆలోచిస్తూ మళ్ళీ గుడారం వద్దకు వచ్చిండు. లోపలవున్న కుక్కిమంచం బయటకు తెచ్చుకొని వాల్చుకొని పడుకున్నాడు. పక్కనే ఉన్న వేపచెట్టు కొమ్మలు కదులుతున్నయి. ఓ కొమ్మకు పిచ్చుక గూడు వుంది. ఆ గూడు కూడా గాలికి కదులుతూనే ఉన్నది. అయినా గూడు కట్టుతున్న పిచ్చుక మాత్రం పట్టుదలతో గూడు అల్లుతూనే వుంది. మరో కొమ్మకు సాలె పురుగు నివాసం కోసం వలయాకారంలో గూడు తయారు చేస్తున్నది. పైన ఉన్న మరో కొమ్మకు తేనెటీగలు ఎక్కడికెక్కడికో పోయి తేనె సేకరించి తెచ్చి తొట్టెలో భద్రపరుస్తున్నాయి.
 
    ఆ పిచ్చుక, ఈ సాలెపురుగు, ఆ ఎగిరే తేనెటీగలు తనకు ఏదో హితబోధ చేస్తున్నట్టే అనిపించింది రవీందర్‌కు. మంచం నుండి లేచిండు. దూరంగా ఉన్న జువ్వి చెట్టుకింద చీమల పుట్ట కనిపించింది. అక్కడికి వెళ్ళిండు. జువ్వి చెట్టుకొమ్మ ఒకటి విరిచిండు. రెమ్మలు ఆకులు తీసేసిండు. ఆ కట్టెతో పుట్టను తవ్విండు. కొంత దూరంలో ఎవరో పారేసిన పాతసంచి కనిపించింది. అతడు ఆ సంచి తెచ్చి అందులో మట్టి నింపి గుడారం వద్దకు మోసుకొని వచ్చిండు. మట్టిపెళ్ళలు రాయితో పొడిచేసిండు. బకెట్లో వున్న నీళ్ళతో ఆ పొడి మట్టిని తడిపిండు. ఆ తడి మట్టిని కుండీలా తయారు చేసి గుంటలో నీరు పోసిండు.
    మరుసటిరోజు వంట చేసుకొని ఇంత తిని పని ప్రారంభించిండు. ఆ మట్టితో ఎద్దు, కోతి, పంది, కుక్క, గుర్రము, ఒంటె, జింక, ఏనుగు బొమ్మలు చేసిండు. నీడలో ఆరబెట్టిండు. మళ్ళీ పుట్టమన్ను తెచ్చి నానబోసిండు. మరసటి రోజు పావురం, కాకి, గద్ద, మనిషి, ఆడమనిషి, కుందేలు, పిచ్చుక, వినాయకుడు, శంకరుడు మొదలగు బొమ్మలు తయారుచేసిండు.
 
    మరో నాలుగు రోజులు గడిచిపోయినయి. గుడారం నిండా బొమ్మలే. రంగులు వేయకుండా అమ్మితే ధర రాదని రవీందర్‌కు తెలుసు. రంగులువేస్తే అందంగా ఉంటాయి. బొమ్మలు, కొనేవాళ్ళు ఇష్టపడి ఎక్కువ ధరపెట్టి కొనడానికి కూడా వెనుకాడరని అతనికి అర్థమయింది. కాని చేతిలో డబ్బేది? డబ్బులు లేకుండా రంగులు ఉద్దెర ఎవరు ఇస్తారు. బాగా ఆలోచించిండు. బిందె తాకట్టు పెడితే కోమటాయన రంగులు ఇస్తాడా? ఏమో అంత దూరం వెళ్ళి అతడు ఇవ్వకపోతే నిరాశే మిగులుతుంది. ఎలా? మళ్ళీ ఆలోచించిండు.

    అపార్టుమెంట్సు ముందు దాని కాంట్రాక్టర్ పనివాళ్ళతో ఏదో మాట్లాడుతూ కనిపించిండు. ఆ కాంట్రాక్టర్ బాబును డబ్బు అడిగితే ఇస్తాడా?...అడగంది అమ్మయినా అన్నం పెట్టదు కదా! అడిగితే పోయేదేమి లేదు కదా! రవీందర్ కాంట్రాకర్ వద్దకు వచ్చిండు.

    "బాబుగారూ! నాకో చిన్నసాయం చేస్తారా?"

    "సహాయమా! నువ్వు నాకు తెలియదు కదా! ఎవరు నువ్వు?"

    "నేను ఒక నిరుపేదను బాబుగారు. ఇంత చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నవాణ్ణి. నాకు తిండి పెట్టేవాళ్ళు లేరు. పనికోసం వెళితే నాకు పని కూడా ఇవ్వడం లేదు. నాకు బొమ్మలు తయారు చేయడం వచ్చు. మట్టితో కొన్ని రకాల బొమ్మలు తయారు చేసిన. వాటికి రంగులకోసం డబ్బుకావాలి. ఆ బొమ్మలు అమ్మగానే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను బాబుగారు."

    "ఎక్కడ ఉంటావు నువ్వు" ప్రశ్నించాడు కాంట్రాక్టర్.

    "అదిగో ఆ వేపచెట్టు దగ్గర ఉన్న గుడారంలో."

    "నువ్వు తయారు చేసిన బొమ్మలు చూపిస్తావా?"

    రవీందర్ ముఖంలో మురిపెం కనిపించింది. "రండి బాబుగారూ! రండి" అన్నాడు. తన గుడారం దగ్గరకు వచ్చిన కాంట్రాక్టర్ బాబుకు బొమ్మలన్నీ చూపించిండు.

    కాంట్రాక్టర్ దయానిధి ఆ అబ్బాయిని అభినందిచినట్టు చూసి "బొమ్మలు బాగున్నాయి. నీకు ఏయే రంగులు కావాలో చెప్పు. నేనే తెప్పించి ఇస్తా సరేనా!" అన్నాడు.

    రవీందర్ "మీ ఇష్టం మీ దయ" అని రంగుల పేర్లు, అవరసరమైన బ్రష్‌లు, మిగతా సామాగ్రి పేర్లు చెప్పిండు. దయానిధి రవీందర్ చెప్పినవన్నీ కాగితంమీద రాసుకొని "సాయంత్రం ఆ అపార్టుమెంట్స్ వద్దకు వచ్చి నన్ను కలువు" అని చెప్పి దయానిధి వెళ్ళిపోయిండు.

    దయానిధి పేరుకు తగినట్టు దయగలవాడు. కలవారి నుండి రాబట్టగలిగినంత డబ్బు రాబట్టనూ గలడు. నిరుపేదలకు ఉచిత సహాయం చేసి ఆదుకోనూ గలడు. అది తండ్రి తాతల నుండి వంశములో వస్తున్న గుణం. ఇంకా ఈలోకంలో దయగలవాళ్ళు కొందరైనా ఉండడం వల్లనే సమాజంలో సౌజన్యం కొంతవరకైనా నిలుస్తున్నది.

    రవీందర్ సాయంత్రం వెళ్ళేసరికి దయానిధి అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రవీందర్ కనిపించగానే "రా బాబూ! రంగులు తెప్పించిన ఇదిగో" అని అట్టపెట్టె అతనికి అందించిండు.

    రవీందర్ సంతోషంతో తబ్బిబ్బయిండు. చేతులు జోడించి నమస్కరించి ఆ రంగుల పెట్టె తీసుకున్నాడు. గుడారం వద్దకు వచ్చి ఆ పెట్టెను విప్పి చూసిండు. రకరకాల రంగులు, రకరకాల బ్రష్‌లు, ప్లాస్టిక్ గిన్నెలు. తాను చెప్పిన రంగులు బ్రష్‌లే కాకుండా అదనంగా మరి కొన్ని రంగులు, బ్రష్‌లు ఉండడంతో దయానిధి అదనపు వరాలిచ్చే దేవుడిలా అనిపించిండు రవీందర్‌కు.

    ప్లాస్టిక్ గిన్నెలో రంగులు కలిపి బ్రష్‌లతో రంగులు వేసిండు. రంగులు ఎండిన తరువాత ఒక క్రమ పద్ధతిలో గుడారంలో భద్రపరచిండు. ఒక అందమైన భంగిమలో తయారుచేసిన గుర్రం బొమ్మను పట్టుకొని అపార్టుమెంట్స్ వద్దకు వెళ్ళిండు. ఆ బొమ్మను దయానిధి చేతుల్లో పెట్టి అతనికి పాదాభివందనం చేసిండు. పక్కనే మరో కుర్చీలో కూర్చుని తెలుగు చందమామ పత్రిక చదువుతున్న దయానిధి కుమారుడు సూర్యం రవీందర్‌ను చూసి "ఎవరు నాన్నా ఇతడు?" అని అడిగాడు.   

    దయానిధి రవీందర్‌ను లేవనెత్తి దగ్గరకు తీసుకొని సూర్యంతో చెప్పిండు "ఇతడు రవీందర్. ఈ గుర్రాన్ని ఇతడే తయారు చేసిండు బాగుంది కదూ!"

    "బాగుండడమేమిటి నాన్నా! అద్భుతంగా ఉంది. ఇది కదలకపోయినా పరిగెత్తుతున్న గుర్రం వలె అనుభూతి కలిగిస్తూ ఉంది. ఎంత చక్కగా తయారు చేసిండు. సిమెంటు, ఇసుక, నార మొదలగు వస్తువులతో తయారు చేస్తే ఎక్కువకాలం మన్నుతాయి కదా నాన్నా!"

    "నిజమే. ఆ ఏర్పాట్లు కూడా మనం చేద్దాం" అన్నాడు దయానిధి.

    సూర్యం రవీందర్‌ను అభినందిస్తున్నట్టు చూస్తూ అన్నాడు "నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ బొమ్మల విద్య."

    "ఇక్కడ అక్కడ కనిపించే పక్షులను, జంతువులను  ఇలా అన్నింటినీ చూసి నేర్చుకున్నవే. అంతేకాని నాకు ఎవ్వరూ నేర్పినవాళ్ళు లేరు బాబు. కూలి పని చేసే తల్లిదండ్రులు చనిపోయిండ్రు. నేను ఒంటైర్వాణ్ణి. ఈ దయగల బాబుగారు నేను అడిగిన వెంటనే రంగులు, బ్రష్‌లు, గిన్నెలు తెప్పించి ఇచ్చిండు. ఏమీ ఇచ్చుకోలేని పేదవాణ్ణి. ఈ గుర్రాన్ని మీ ఇంట్లో పెట్టుకోవాలని వేడుకుంటున్నాను" అంటూ ఇద్దరికి మరోసారి చేతులెత్తి నమస్కరించాడు.

    "చదువుకున్నావా ఏమైనా" అడిగిండు సూర్యం.

    "లేదు బాబుగారు. చదువుకోవాలని ఎన్నో నేర్చుకోవాలని నాకు ఆశ ఉంది. ముందు నాకు బ్రతుకు దెరువు కావాలి. ఖాళీ సమయంలో మీలాంటి దయగల బాబులు నేర్పుతానంటే చదువుకూడా నేర్చుకుంటా."

    "సూర్యం నువ్వు పాఠశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం వేళ ఈ అబ్బాయికి చదువు నేర్పడానికి వీలవుతుందా?" అన్నాడు దయానిధి.

    "నా హోమ్‌వర్క్ పూర్తికాగానే ఇతనికి చదువు నేర్పుతా. ఇప్పుడు ఇతనికి మన ఇల్లు చూపిస్తా" అని రవీందర్‌ను తనతో రమ్మన్నాడు. అక్కడికి తూర్పుదిక్కున ఉన్న మరో రోడ్డు పక్కన వాళ్ళ ఇల్లు ఉంది. మూడంతస్తుల మేడ. గ్రౌండుఫ్లోర్‌లో ముందు భాగాన పది షాపులున్నాయి. మధ్యలో పెద్దగేటు. గ్రౌండుఫ్లోర్‌లోనే వాళ్ళ నివాసం. పై రెండు అంతస్తులలో మూడేసి పోర్షన్లు అద్దెకు ఇస్తున్నారు. ఇంటి వెనుక దాదాపు పది గుంటల భూమి ఉంది. ఇంటి వైపు రకరకాల పూలమొక్కలు, వెనుకవైపు జామ,నిమ్మ, సపోట, దానిమ్మ చెట్లు ప్రహరీ గోడ దగ్గరలో చుట్టూ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్ల మధ్య భాగములో ఒక రేకుల షెడ్డు ఉంది. అందులో చాలా వస్తువులు స్టోరు చేస్తారు. కొన్ని పాత దిన  పత్రికలు, వార, మాస పత్రికలు, పాఠ్య పుస్తకాలు కూడా వాటితోపాటుగా ఉన్నాయి. గోడ దగ్గర నాలుగు కుర్చీలు, ఒక టేబులు విద్యుత్తు సౌకర్యం, ఫ్యాను వగైరా సౌకర్యాలు కూడా ఉన్నాయి.

    సూర్యం అక్కడ ఉన్న చెట్ల పేర్లు వాటి ఉపయోగాలు, స్టోరు రూములో ఉన్న వస్తువుల పేర్లు అన్ని చెప్పిండు. చీకటి పడుతుండడంతో లైటు వేసి తాను చిన్ననాడు ఉపయోగించిన పలకమీద అక్షరాలు రాసి వాటి ఉచ్చారణ చెప్పిండు. బాలశిక్ష మొదలగు ప్రాథమిక విద్య సంబంధిత పుస్తకాలు, చందమామ, బాలమిత్ర, బుజ్జాయి మొదలగు పత్రికలు చూపించి అన్నాడు..."నీకు అక్షరాలు నేర్పాక ఈ పుస్తకాలలో ఉన్న పదాలు వాక్యాలు చెప్తా. పదాలు వాక్యాలు శ్రద్ధగా నేర్చుకుంటే పాఠ్య పుస్తకాలు ఇదిగో ఈ కథల పుస్తకాలు చదువుకోవచ్చు. నీకు చదువు అబ్బితే ఏ పని నేర్చుకోవాలన్నా అది సులభమవుతుంది."

    "మీరు నేర్పుతానంటే రోజూ వస్తా" అన్నాడు రవీందర్.
    "తప్పకుండా రా. నాకు నీలాంటి వాళ్ళకు నేర్పాలన్నా, స్నేహం చేయాలన్నా చాలా ఇష్టం. నేను మా అమ్మా నాన్నలకు ఒక్కడినే కొడుకుని. నీకు మా అమ్మను పరిచయం చేస్తా. నాతో రా" అన్నాడు సూర్యం. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. రవీందర్ ఆశ్చర్యపోతూ హాలంతా చూసిండు. అతని కుతూహలం గమనించి సూర్యం అక్కడవున్న వస్తువుల పేర్లు ఉపయోగాలు చెప్పాడు. 
 
    "ఈ అబ్బాయి ఎవరు బాబు" అంటూ వచ్చింది సూర్యం తల్లి శారదమ్మ. ఆమెను చూడగానే రవీందర్ చేతులెత్తి దండం పెట్టిండు.
 
    "అమ్మా ఇతడు చాలా పేదవాడు. బొమ్మలు చక్కగా తయారు చేస్తాడు. నాన్నకు ఇంతకు ముందే గుర్రం బొమ్మను ఇచ్చిండు"
 
    "నువ్వు ఈ అబ్బాయితో మాట్లాడుతూ వుండు. నేను ఇప్పుడే వస్తా" అని చెప్పి ఆమె కిచన్ రూములో వెళ్ళి రెండు ప్లేట్లలో గారెలు, నువ్వుల ముద్దలు తెచ్చి వాళ్ళకు ఇచ్చి తినమంది.
 
    రవీందర్‌కు ఇదంతా కలలా అనిపించింది. ఇంత మంచివాళ్ళు కూడా ఈ లోకంలో వున్నారా. తక్షణమే అతనికి వెంటనే ఇటుకల తయారీ కాంట్రాక్టర్ జ్ఞప్తికి వచ్చిండు. ఒకటి మిత బాధా కలిగించిన అనుభవమైతే మరొకటి అమితానందం కలిగిస్తున్న అద్భుత అనుభవం.
 
    "అమ్మగారూ! నాకు ఇదంతా కలలా తోస్తున్నది. పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి పనిచేసిన నాడు కూలి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, కొందరు జాలితో పాత బట్టలు ఇచ్చిన వాళ్ళున్నారు. కొందరైతే కూలి డబ్బులు కూడా కొంత ఇచ్చి కొంత ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. కాని నన్ను మీలాగ ఇంత దయతో చూసిన వాళ్ళు లేరు" అన్నాడు.
 
    ఉన్నవాళ్ళకు సహాయం చేస్తే చేసినప్పుడు మాటవరసకు కృతజ్ఞతలు చెప్తారు. తర్వాత ఆ సహకారాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తారు. నిరుపేద నర్సమ్మకు, పేద బాలయ్యకు, కుంటికాలు కొమరయ్యకు, కొండయ్య, వీరయ్య, బుచ్చయ్య, మల్లయ్య, జగన్నాథం మొదలగు వాళ్ళకు చేసిన సహాయాన్ని వాళ్ళు ఇప్పటికీ మరిచి పోలేదు. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కృతజ్ఞతా పుర్వకంగా ప్రవర్తిస్తారు.
 
    వాళ్ళు అప్పుడప్పుడు కూరగాయలు, పండ్లు తెచ్చి ఇచ్చి మీ సహాయం వల్లనే మా వ్యవసాయం ఇంత అభివృద్ధి చెందింది. ఈ కూరగాయలు మా తోటలోనివే. ఈ పండ్లు మా చెట్టువే అంటూ తెచ్చి ఇవ్వడం జ్ఞప్తికి వచ్చింది శారదమ్మకు. ఈ పిల్లవాడికి సహాయం చేసి వృద్ధిలోకి తేవాలని అనుకుంది ధృఢ నిశ్చయంతో.
 
    శారద సూర్యంను చూస్తూ అంది.
 
    "నువ్వు తొడగడం మానేసిన పాంట్లు షర్టులు ఉన్నాయి కదా! తెచ్చి ఇతనికి ఇవ్వు" అంది.
 
    సూర్యం 2ప్యాంట్లు, 2షర్టులు ఒక కవరులో పెట్టి తెచ్చి ఇస్తూ "ఇదిగో వీటిని తొడుక్కో" అన్నాడు.
 
    "అమ్మగారూ! మీరు దయగలవారు. వీటిని నాకు ఇస్తున్నారు.  కాని మీకు నేనేమి ఇవ్వగలను. చేతులెత్తి దండం పెట్టడం తప్ప" అంటూ దండం పెట్టి "మళ్ళీ రేపు వచ్చి కలుస్తా అమ్మగారు, చిన్నబాబుగారూ" అంటూ ఆ ఇంట్లో నుండి బయటకు నడిచిండు.  
 
* * *
 
    "అమ్మా! రవీందర్ ఈ ఎనిమిది నెలల్లోనే ఎన్నో రకాల కొత్త బొమ్మలు చేస్తూనే, ఆ బొమ్మలు అమ్ముకుంటూనే మిగిలిన సమయములో అక్షరాలు, రెండక్షరాల పదాలు, మూడు, నాలుగు, అయిదు, ఆరు ఇలా ఎన్నో అక్షరాల పదాలు ఒక్క నెలలోనే నేర్చుకున్నాడు. తర్వాత రెండు నెలలో మొదటి తరగతిలోని పాఠాలన్నీ నేర్చుకున్నాడు. మొదటి తరగతిలోని పాఠాలన్నీ నేర్చుకోవడానికి నాకు మూడు నెలలు పట్టింది. మా తరగతిలోని కొందరికి సంవత్సరం దాటినా ఆ చదువు ఒంటబట్టలేదు. రవీందర్ నాలుగునెలల్లో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బాలభారతి దాదాపు డజన్ పుస్తకాలు చదివిండు"
 
    "కొందరు ప్రతిభావంతులు ఇలాగే ఉంటారురా. అతికొద్ది కాలంలోనే వృద్ధిలోకి వస్తరు. మొన్న టి.వి.లో బాల మేధావిని పరిచయం చేసిండ్రు కదా. పత్రికలలో బాల మేధావులు చేసిన గొప్ప పనులు వివరిస్తూ పరిచయ వ్యాసాలు రాస్తున్నారు కదా!
 
    విశ్వనాథ సత్యనారాయణ ఒక్క నెలలోనే వేయి పేజీల నవల రాసిండని, అబ్రహాం లింకన్ వీధి దీపాల కింద చదువుకొని అమెరికా ప్రెసిడెంటు అయ్యిండని, మామూలు కుటుంబములో పుట్టిన గాంధీ అహింసా విధానంతోనే దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడంలో ప్రముఖపాత్ర వహించిన విషయం చదవడంలేదా. అందరూ అనగా వినడంలేదా.
 
    సరే వీళ్ళు పెరిగిన తర్వాత గొప్ప పనులు సాధించినా ఆ శక్తి వాళ్ళలో బాల్యం నుండే ఉన్నదని నేనంటున్నాను. ఇదే సమయంలో నాకు మరో విషయం జ్ఞప్తికి వస్తున్నది. ఎక్కడో యూరప్ ఖండంలో పుట్టిన మదర్ థెరిసా అనాథలకు, వికలాంగులకు సేవ చేయాడానికి మనదేశములో కలకత్తా నగరమును ఎంచుకొని, ఎందరినో, ఆదరిస్తూ దేశ ప్రజలందరి మెప్పు పొందలేదా. అలాగే ఈ రవీందర్ కూడా పైకి వస్తాడేమో! రావాలె. మన సహాయం పొంది పైకి రావడం కూడా సంతోషమే కదా! పైగా పిల్లవాడు చాలా మంచివాడు. వినయశీలి. నిజాయితీపరుడు. ఒక్క వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఉండడం కూడా విశేషమే."

    ఇంతలో దయానిధి అక్కడకు వచ్చిండు.

    "ఏమిటో రవీందర్ విషయమేనా మీరు మాట్లాడుకునేది" అన్నాడు.

    "అవును"

    "పిల్లవాడికి మనం ఏదైనా అవసరమైన సహాయం చేస్తూనే ఉండాలండీ"

    "అవును. అందుకే అతనితో మన ముందు రూములోనే వచ్చే నెల షాపు పెట్టించాలనుకుంటున్నా"

    "ఏ రూమూ ఖాళీగా లేదుకదండి"

    "ఖాదర్ పాషా కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు కదా! అక్కడికే ఈ షాపు మార్చుకుంటానని ఇల్లు, షాపు ఖాళీ చేసి వెళ్ళిపోతానని ఈరోజు మధ్యాహ్నమే చెప్పిండు"

    "రవీందర్ బొమ్మలు చేస్తున్నాడు కదండి"

    "బొమ్మల పరిశ్రమ, బొమ్మల వ్యాపారం ఎదుగూ బొదుగూ లేని పనులు. ఆ కళ గొప్పదే అనుకో కాని అభివృద్ధి అంతంతమాత్రమే. అదీ వ్యాపారం అయితే వృద్ధిలోకి వస్తాడని నా విశ్వాసం. అందుకే అతనికి కొంత బ్యాంకు లోను ఇప్పిస్తానని చెప్పిన. జనరల్ స్టోర్ పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన. ఈలోగా ఉన్న బొమ్మలు అమ్ముకోవడానికి తోపుడు బండి కూడా ఇప్పించిన."
 
* * *
 
    పది సంవత్సరాలు కాలగర్భములో కలిసిపోయినయి. ప్రకృతిలోనే కాక సమాహ్జంలో కూడా ఎన్నో మార్పులు. రవీందర్ వ్యాపారం మూడు పువ్వులు పదహారు కాయలుగా వర్ధిల్లుతున్నది. బ్యాంకులోను పూర్తిగా చెల్లించడమే కాకుండా నాలుగు లక్షలకు పైగా డబ్బుకూడా సంపాదించిండు.
 
    రవీందర్‌కు యుక్తవయస్సు. సూర్యం బాబు హైదరాబాద్‌లో ఏదో కంపెనీలో యాభైవేల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యం పెళ్లి నిశ్చయం అయింది. శివరాత్రి తర్వాత పెళ్ళి. ఇదే సందరభములో రవీందర్ పెళ్ళి కూడా చేసేస్తే అతనికి ఖర్చులు కలసి వస్తాయని దయానిధి భావించిండు. అదే విషయం భార్య శారదకు చెప్పిండు. కొంచెం సేపు మౌనం వహించిన అతడు తిరిగి ఇలా చెప్పిండు. "రవీందర్ సాధించిన అభివృద్ధి వేలమంది దృష్టికి వచ్చింది. అతని భవిష్యత్తులో సమాజంలో మంచి గౌరవస్థానం లభిస్తుంది."
 
    "పెళ్ళి చేయడం మంచి విషయమే కాని అతనికి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కావాలె కదా!"
 
    "ఎలగందల నర్సవ్వ తన కూతురుకు వివాహం చేస్తానని, అబ్బాయి ఉంటే చూడండని మొన్ననే చెప్పింది. ప్రయత్నిద్దాం. రవీందర్‌కు ఆ అమ్మాయి నచ్చితే, ఆ అమ్మాయికి రవీందర్ నచ్చితే నేననుకుంటున్నది సఫలమౌతుంది."
 
    "మంచి ఆలోచన" అంది శారద.
 
    "సూర్యం మధ్యాహ్నం షాపు మూసేశాక రవీందర్‌ను ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు" అన్నాడు అప్పుడే అటువైపు వస్తున్న సూర్యంతో.
 
    "అలాగే నాన్నగారు" అంటూ అతడు బయటకు వెళ్ళిండు. అతడు నిన్ననే హైదరాబాద్ నుండి ఇక్కడకు వచ్చిండు. ప్రతినెల జీతం రాగానే ఇక్కడకు వచ్చి తల్లికో, తండ్రికో డబ్బు ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కరించి నన్ను ఆశీర్వదించండి అంటాడు.
 
    దయానిధి మొదటి నెల జీతం డబ్బులు తెచ్చి ఇచ్చినప్పుడే అన్నాడు."మాకెందుకురా డబ్బు నువ్వే అక్కడ ఏదైనా బ్యాంకులో వేసుకోకపోయావా?"
 
    "ఇది మీ రుణం తీర్చుకోవడం కాదు నాన్నగారు. ఇది నాకు సంతృప్తి కలిగించే విషయం. దీనిని మీరు కాదనకండి" అన్నాడు.
 
    దయానిధి చెప్పినట్టు నర్సవ్వ తన కూతురుని తీసుకొని మధ్యాహ్నం వేళకు దయానిధి ఇంటికి వచ్చింది. పెళ్ళిచూపులు జరిగినయి. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చిండ్రు. సూర్యం పెళ్ళినాడే రవీందర్ పెళ్ళి నిశ్చయం చేసిండు పురోహితుడు.
 
* * *
 
    పదిహేను సంవత్సరాల తర్వాత...
 
    దయానిధి ఆరోగ్యం క్షీణించసాగింది. ఆసుపత్రిలో డాక్టర్ పరీక్ష చేసి రెండు కిడ్నీలు చెడిపోయాయని ఎవరైనా కిడ్నీ ఇస్తే తప్ప బ్రతికే అవకాశం లేదని చెప్పిండు.
 
    దయానిధి భార్య, కొడుకు, కోడలు తమ కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాని వాళ్ళ కిడ్నీలు మ్యాచ్ కాలేదు. అక్కడే వున్న రవీందర్ తన కిడ్నీ సరిపోతే ఇస్తానని ముందుకు వచ్చిండు. రవీందర్ భార్య కళావతి కూడా తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. డాక్టర్ టెస్టు చేసి రవీందర్ కిడ్నీ మ్యాచ్ అవుతుందని... రేపే కిడ్నీ తీసి కిడ్నీ అమర్చుతానని చెప్పిండు. ఈలోగా ఈ మందులు వాడండి అని చెప్పి రాసిన ప్రిస్క్రిప్షన్ సూర్యం చేతికి అందించిండు.
 
    రవీందర్ హాస్పిటల్ హాలులో తిరుగుతుండగా అదే హాలులో అంతకు ముందే కిడ్నీలు చెడిపోయి చికిత్స పొందుతున్న ఇటుకల తయారీ కాంట్రాక్టర్ కనకరాజు కనిపించిండు. ఒక కిడ్నీకి లక్ష రూపాయలు ఇవ్వడానికి కనకరాజు సిద్ధంగా ఉన్నట్టు అతని బావమరిది అక్కడ కనిపించిన వాళ్ళందరితో చెపుతున్నాడూ. ఆ కనకరాజు బావమరిది రవీందర్ దగ్గరకు వచ్చి అన్న్నాడు"నువ్వు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్నాను. ఒక కిడ్నీ ఇస్తే లక్షరూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇస్తావా"
 
    "లక్ష కాదు రెండు లక్షలు ఇచ్చినా నా కిడ్నీని మీ కనకరాజుకు ఇవ్వను. నా కిడ్నీ దయామయుడైన  దయానిధి గారికే, అతడు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉచితంగా ఇచ్చుకుంటాను" అన్నాడు. తర్వాత అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయిండు.
 
* * *
 
    దయానిధి ఆరోగ్యవంతుడై ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిండు. ఇంట్లో ముందు హాలులో బెడ్‌మీద పడుకున్నాడు. 
 
    శారద, సూర్యం, అతని భార్య రమాదేవి కొడుకు కిరణ్ కుర్చీలలో కూర్చున్నారు. రవీందర్ కళావతి వాళ్ళ కూతురు నిక్షిప్త నిలబడివున్నారు. అది గమనించిన శారద అంది.
 
    "అదేమిటి రవీ నువ్వూ, నీ భార్య మాకు పరాయి వళ్ళలాగ అక్కడే నిలబడిపోయారేమిటి. ఇలా వచ్చి నా దగ్గర ఉన్న ఈ కుర్చీలలో కూర్చోండి. నువ్వు నాకు మరో కుమారుడివిరా రవీ!" ఆప్యాయంగా పిలిచింది.
 
    రవీందర్, కళావతి, నిక్షిప్త ముగ్గురు వచ్చి శారదమ్మ చెప్పినట్టు కుర్చీలలో కూర్చున్నారు. 
 
    శారద రవీందర్‌వైపు ఆప్యాయంగా చూస్తూ ప్రేమ నిండిన కంఠంతో అంది..."రవీ! నువ్వు నా దేవుడి ప్రాణాలను కాపాడిన దేవుడివిరా. చిన్నవాడివి కాబట్టి నీకు దండం పెట్టవద్దు కాని..."
 
    "అమ్మగారూ! మీరు, బాబుగారు నా జీవితాన్ని తీర్చిదిద్దిన దేవుళ్ళు. చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయిన దురదృష్టవంతుడినే... ఆనాడు బాధపడ్డమాట వాస్తవమే. కాని మీ సహాయసహకారు అందిన పిదప నాకు అన్ని సమకూరినయి. బాధలన్నీ తొలగిపోయినయి. బాబుగారు ధనసహాయం చేసి సమాజంలో నాకో అంతస్థును కల్పించిన అమృతమూతి. ప్రేమానురాగాలు పంచి ఇస్తున్న మాతృమూర్తి మీరు. సూర్యం బాబుగారు నాకు చదువు నేర్పిన జ్ఞానదాత. మీరంతా నిండు నూరేళ్ళు బ్రతకాలని ఆ కనిపించని దేవుణ్ణి కోరుకుంటున్నాను"
 
    అందరివైపు ప్రేమగా చూస్తూ ఇంతమంది తన ఆరోగ్యం గురించి తహతహపడుతున్నందుకు సంతృప్తి పడుతున్న తరుణంలో దయానిధి ఇంటి ముందు ఆడ, మగ, పిల్లాపాపలతో పాతిక మందికి పైగా అతని శ్రేయోభిలాషులు గుంపులు గుంపులుగా వచ్చారు.
 
    "సూర్యం! వాళ్ళను లోపలికి రమ్మను. శారదా! వాళ్ళు కూర్చుండడానికి అక్కడ చాపలు పరువు" అన్నాడు దయానిధి.
 
(పత్రిక మాసపత్రిక అక్టోబరు 2009 సంచికలో ప్రచురితం)
Comments